‘యా’ అంటూ బదులిచ్చిన పిటిషనర్‌పై సీజేఐ ఆగ్రహం
‘ఎస్’ అని వ్యాఖ్యానించాలని సూచన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కాస్తంత మర్యాద తగ్గించి మాట్లాడిన పిటిషనర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ‘ఎస్’ అనడానికి బదులుగా ‘యా’ అని సమాధానమిచ్చిన పిటిషనర్‌పై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘‘యా. యా. యా’ అని అనకండి. ‘ఎస్’ అని మాట్లాడండి. యా అంటూ పిచ్చాపాటీగా మాట్లాడటానికి ఇది కాఫీ షాప్ కాదు. సుప్రీంకోర్టు.
‘యా’ అని పలికే వ్యక్తులంటే నాకు కొంచెం పడదు. మీ నుంచి ఇలాంటి మాటలను కోర్టు అనుమతించబోదు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ వెంటనే తన భాషను సరిదిద్దుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనను చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయడాన్ని పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్‌ను సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గొగోయ్‌పై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే.
‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు నేరుగా అప్పీళ్లను అనుమతించే ఆర్టికల్ 32 కింద ఈ అప్పీల్ చేయొచ్చా? ఈ అప్పీల్‌ను ఆ ఆర్టికల్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే ప్రశ్నలను కోర్టు లేవనెత్తింది. న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్‌ను ఎలా దాఖలు చేశారు?’’ అని సీజేఐ ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ స్పందిస్తూ.. ‘‘యా. యా. అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. క్యూరేటివ్ దాఖలు చేయమని నాకు సూచించారు’’ అంటూ యథాలాపంగా సాధారణ భాషలో మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి.
ఒక న్యాయమూర్తిపై ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి అంతర్గత విచారణ కోరలేరు. ఎందుకంటే గతంలోనే ఇదే విషయంలో మీరు కేసు ఓడిపోయారు’’ అని సీజేఐ అన్నారు. అప్పుడు పిటిషనర్ స్పందిస్తూ, ‘‘కానీ జస్టిస్ గొగోయ్ నేను సవాలు చేసిన ప్రకటనను బట్టి నా పిటిషన్‌ను తిరస్కరించారు. నా తప్పేమీ లేదు. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ధర్మాసనం ముందు నా రివ్యూ పిటిషన్‌ను పరిశీలించాలని నాటి సీజేఐ ఠాకూర్‌ను కోరా. కానీ నా అభ్యర్థనను తోసిపుచ్చారు’’ అంటూ కేసు నేపథ్యాన్ని వివరించారు. సీజేఐ, పిటిషనర్ కొద్దిసేపు మరాఠీలో మాట్లాడుకున్నారు. తర్వాత ‘‘జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించండి. అప్పుడు ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుంది’’ అని సీజేఐ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment