Petitioner argument
-
CJI DY Chandrachud: ఇది కాఫీ షాప్ కాదు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కాస్తంత మర్యాద తగ్గించి మాట్లాడిన పిటిషనర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ‘ఎస్’ అనడానికి బదులుగా ‘యా’ అని సమాధానమిచ్చిన పిటిషనర్‌పై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘‘యా. యా. యా’ అని అనకండి. ‘ఎస్’ అని మాట్లాడండి. యా అంటూ పిచ్చాపాటీగా మాట్లాడటానికి ఇది కాఫీ షాప్ కాదు. సుప్రీంకోర్టు. ‘యా’ అని పలికే వ్యక్తులంటే నాకు కొంచెం పడదు. మీ నుంచి ఇలాంటి మాటలను కోర్టు అనుమతించబోదు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ వెంటనే తన భాషను సరిదిద్దుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనను చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయడాన్ని పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్‌ను సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గొగోయ్‌పై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు నేరుగా అప్పీళ్లను అనుమతించే ఆర్టికల్ 32 కింద ఈ అప్పీల్ చేయొచ్చా? ఈ అప్పీల్‌ను ఆ ఆర్టికల్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే ప్రశ్నలను కోర్టు లేవనెత్తింది. న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్‌ను ఎలా దాఖలు చేశారు?’’ అని సీజేఐ ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ స్పందిస్తూ.. ‘‘యా. యా. అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. క్యూరేటివ్ దాఖలు చేయమని నాకు సూచించారు’’ అంటూ యథాలాపంగా సాధారణ భాషలో మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి. ఒక న్యాయమూర్తిపై ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి అంతర్గత విచారణ కోరలేరు. ఎందుకంటే గతంలోనే ఇదే విషయంలో మీరు కేసు ఓడిపోయారు’’ అని సీజేఐ అన్నారు. అప్పుడు పిటిషనర్ స్పందిస్తూ, ‘‘కానీ జస్టిస్ గొగోయ్ నేను సవాలు చేసిన ప్రకటనను బట్టి నా పిటిషన్‌ను తిరస్కరించారు. నా తప్పేమీ లేదు. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ధర్మాసనం ముందు నా రివ్యూ పిటిషన్‌ను పరిశీలించాలని నాటి సీజేఐ ఠాకూర్‌ను కోరా. కానీ నా అభ్యర్థనను తోసిపుచ్చారు’’ అంటూ కేసు నేపథ్యాన్ని వివరించారు. సీజేఐ, పిటిషనర్ కొద్దిసేపు మరాఠీలో మాట్లాడుకున్నారు. తర్వాత ‘‘జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించండి. అప్పుడు ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుంది’’ అని సీజేఐ సూచించారు. -
ఫిర్యాదుల్ని పరిశీలించరా?
సాక్షి, చెన్నై: ఫిర్యాదు దారులు ఇచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించే సమయం కూడా లేదా..? అని పోలీసులకు హైకోర్టు చురకలు అంటించింది. సెంబరంబాక్కం నీటి విడుదలపై వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి ప్రాథమిక విచారణతో నివేదిక సమర్పణకు ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో పెను ప్రళయాన్ని చెన్నై, కడలూరు, తిరువళ్లూరు, కాంచీపురం వాసులు చవి చూసిన విషయం తెలిసిందే. అయితే, సెంబరంబాక్కం నీటిని ముందస్తు హెచ్చరిక లేకుండా విడుదల చేయడం, పెద్ద మొతాదులో నీటి విడుదల ఏక కాలంలో జరగడం వెరసి చెన్నైను ముంచేసిందన్నది జగమెరిగిన సత్యం. ఈ వ్యవహారంపై న్యాయ విచారణకు ప్రతిపక్షాలు పట్టుబడుతూ వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం వివరణతో దాటవేత దోరణి సాగించింది. ఈ పరిస్థితుల్లో వెస్ట్ మాంబళంకు చెందిన ఆర్ముగం అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సెంబరంబాక్కం నీటి విడుదల కారణంగానే చెన్నై నీట మునిగిందని, సర్వం కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారని, ఆ నీటి ప్రళయంతో ఇళ్లలోని వస్తువులన్నీ సర్వనాశనం అయ్యాయని తన పిటిషన్లో వివరించారు. సెంబరంబాక్కం నీటి విడుదల మీద ముందస్తు హెచ్చరికలు చేయక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు సర్వత్రా పరిగణించి ఉన్నారన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్లో చెన్నై పోలీసుల్ని తాను ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. సెంబరంబాక్కం నీటి విడుదల మీద ముందస్తు ప్రకటన చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించానని, అయితే, ఇంత వరకు వారిలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి మాలా లలిత కుమారి పరిగణలోకి తీసుకున్నారు. శుక్రవారం విచారణ సమయంలో పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూనే, పోలీసులకు చురకలు అంటించారు. ఫిర్యాదులు వస్తే ప్రాథమిక విచారణకు కూడా చేయరా..? అని ప్రశ్నించారు. పిటిషనర్ ఫిర్యాదును పరిశీలించి విచారణ చేపట్టాలని, ఆయన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలతో కూడిన ప్రాథమిక నివేదికను ఈనెల పన్నెండో తేదిన కోర్టు ముందు ఉంచాలని ఆదేశించి, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.