Courtesy
-
CJI DY Chandrachud: ఇది కాఫీ షాప్ కాదు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కాస్తంత మర్యాద తగ్గించి మాట్లాడిన పిటిషనర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ‘ఎస్’ అనడానికి బదులుగా ‘యా’ అని సమాధానమిచ్చిన పిటిషనర్‌పై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘‘యా. యా. యా’ అని అనకండి. ‘ఎస్’ అని మాట్లాడండి. యా అంటూ పిచ్చాపాటీగా మాట్లాడటానికి ఇది కాఫీ షాప్ కాదు. సుప్రీంకోర్టు. ‘యా’ అని పలికే వ్యక్తులంటే నాకు కొంచెం పడదు. మీ నుంచి ఇలాంటి మాటలను కోర్టు అనుమతించబోదు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ వెంటనే తన భాషను సరిదిద్దుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనను చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయడాన్ని పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్‌ను సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గొగోయ్‌పై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు నేరుగా అప్పీళ్లను అనుమతించే ఆర్టికల్ 32 కింద ఈ అప్పీల్ చేయొచ్చా? ఈ అప్పీల్‌ను ఆ ఆర్టికల్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే ప్రశ్నలను కోర్టు లేవనెత్తింది. న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్‌ను ఎలా దాఖలు చేశారు?’’ అని సీజేఐ ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ స్పందిస్తూ.. ‘‘యా. యా. అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. క్యూరేటివ్ దాఖలు చేయమని నాకు సూచించారు’’ అంటూ యథాలాపంగా సాధారణ భాషలో మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి. ఒక న్యాయమూర్తిపై ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి అంతర్గత విచారణ కోరలేరు. ఎందుకంటే గతంలోనే ఇదే విషయంలో మీరు కేసు ఓడిపోయారు’’ అని సీజేఐ అన్నారు. అప్పుడు పిటిషనర్ స్పందిస్తూ, ‘‘కానీ జస్టిస్ గొగోయ్ నేను సవాలు చేసిన ప్రకటనను బట్టి నా పిటిషన్‌ను తిరస్కరించారు. నా తప్పేమీ లేదు. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ధర్మాసనం ముందు నా రివ్యూ పిటిషన్‌ను పరిశీలించాలని నాటి సీజేఐ ఠాకూర్‌ను కోరా. కానీ నా అభ్యర్థనను తోసిపుచ్చారు’’ అంటూ కేసు నేపథ్యాన్ని వివరించారు. సీజేఐ, పిటిషనర్ కొద్దిసేపు మరాఠీలో మాట్లాడుకున్నారు. తర్వాత ‘‘జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించండి. అప్పుడు ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుంది’’ అని సీజేఐ సూచించారు. -
గౌరవ మర్యాదలు
మర్యాద అనే మాటకి హద్దు, చెలియలికట్ట అనే అర్థాలున్నాయి. వ్యవహారంలో గౌరవమర్యాదలని కలిపి జంటపదాలుగా వాడుతాము. ఇతరుల చేత చెప్పించుకోకుండా తన హద్దుల్లో తాను ఉండటం మర్యాద. చెలియలికట్ట అంటే సముద్రానికి ఒడ్డు. నదులు, చెరువులు మొదలైన వాటికి ఒక ఒడ్డు ఉంటుంది. అవి కొన్ని సార్లు ఒడ్డుని తెగ కొట్టి విజృంభించటం చూస్తాం. కాని, సముద్రానికి ఎవరు ఒక ఒడ్డుని తయారు చేయలేదు. ‘ఈ గీత దాటవద్దు’ అని ఎవరూ కట్టడి చేయలేదు. అయినా ఎటువంటి సమయంలోనూ చెలియలికట్టని దాటి సముద్రుడు భూభాగంలో ప్రవేశించటం చూడం మనం. మనిషి విషయం కూడా అంతే! కొన్ని రకాలైన రీతి, రివాజులని, తీరు తెన్నులని ప్రవర్తనా నియమావళిని నేర్పే పద్ధతులు అనేకం ఉన్నాయి. చిన్నతనంలో ఇంట్లో పెద్దలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? మొదలైన విషయాలని కొన్ని మాటలతోనూ, కొన్ని చేతలతోనూ నేర్పిస్తారు. కొన్ని చదువుకోటం వల్ల తెలుస్తాయి. కొన్ని ఎవరూ చెప్పరు. చెప్పాలని కూడా తెలియదు. ప్రతివ్యక్తి తనంతట తానుగా తెలుసుకుని అమలు చేయవలసి ఉంటాయి. ఎదుటి వారికి ఆ విషయం చెప్పటానికి ఇబ్బందిగా ఉంటుంది. అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా ధర్మబద్ధంగా ఉండే ప్రవర్తనని మర్యాద అనవచ్చునేమో! ఎవరి చేతా చెప్పించుకోకుండా తన పరిమితుల్లో తాను ఉండటం మర్యాద. సముద్రం గట్టు లేకపోయినా తన హద్దు తాను దాటనట్టు. ఉదాహరణకి – ఒక గదిలోకి ప్రవేశించాం అనుకోండి. ముందు వెళ్ళిన వారు లోపలికి వెళ్ళాలి. వెనక నున్న వారు అప్పుడే కదా లోపలికి అడుగు పెట్టటానికి వీలు కలిగేది. అదే కాస్త పదవో, అధికారమో ఉన్న వాళ్ళు అయితే, కదలమని చెప్పలేరు. బహుళ అంతస్థుల భవనాల్లో లిఫ్ట్ దగ్గర తరచూ ఎదుర్కొనే సమస్య ఇది. చెపితే,‘‘మాకు తెలియదా? మీరు చెప్పాలా? జరుగుతాం లెండి. అంత తొందర ఎందుకు?’’ అని పెద్ద బోధ చేస్తారు. నిజానికి చెప్పించుకున్నామే, అని సిగ్గుపడాలి. ముందు లోపలికి వెళ్ళిన వారు వెనక ఉన్న వారికి అవకాశం కలిగించాలనే నియమం ఎక్కడా రాసి లేదు. అయినా పాటించాలని తెలుసు కనకనే నీది తప్పు అనలేక ఎదురు దాడికి దిగటం. ఎవరైనా నిద్రపోతూ ఉంటే గట్టిగా పాటలో, టీవీనో పెట్టుకోవటం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు కనక నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనటం మూర్ఖత్వం అవుతుందా? కాదా? నలుగురి మధ్యలో ఉన్నప్పుడు చికాకు కలిగించే చేష్టలు, శబ్దాలు చేయటం, జుగుప్సావహంగా ప్రవర్తించటం ఆమోదయోగ్యం కాదు కదా! వెకిలి చేష్టలు ఎప్పుడైనా, ఎక్కడైనా అమర్యాదగా పరిగణించ బడతాయి. సభల్లో, సమావేశాలలో కొన్ని పాటించవలసిన పద్ధతులు నిర్దేశించ బడతాయి. కొన్ని పేర్కొనక పోయినా అమలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో కూడా అంతే! ఉదాహరణకి పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు మధ్యలో కలిగించుకో కూడదు. అసలు ఆ ప్రాంతంలో ఉండకూడదు. ఒక వేళ ఉండటం తటస్థిస్తే, పేరు పెట్టి పిలిచి మాట్లాడమంటే తప్ప నోరు విప్పకూడదు. రామాయణంలో రాముడు బాలకాండ మొత్తం మీద మాట్లాడిన మాటలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మర్యాదాపురుషోత్తముడు కదా! సభల్లో కూడా ఇదే పాటించ వలసిన నియమం. మర్యాద ప్రవర్తన వల్ల లభిస్తుంది. అడిగితే రాదు. కనుకనే మర్యాద గౌరవంతో జత కలిసి ఉంటుంది. సున్నితమైన విషయాలు ప్రస్తావించక పోవటం ఒక మర్యాద. ఏ విషయం ప్రస్తావిస్తే బాధ కలుగుతుందో దానిని తనంత తాను ఎత్తక పోవటం మర్యాదస్తుల లక్షణం. మర్యాద ఇచ్చి పుచ్చుకోవలసినది. వస్త్రధారణ, మాటతీరు, నడతలలో మర్యాద వ్యక్తమౌతుంది. మర్యాదస్తులకి మాత్రమే సమాజంలో గౌరవం లభిస్తుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!
గౌరిబిదనూరు: పోలీసులను చూస్తే నేరగాళ్లకు హడల్. కానీ ఎలుకలకు కాదు. నగరంలోని రూరల్ పోలీసు స్టేషను మాదనహళ్ళి చెరువులో ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కాగా ఎలు కలు, పందికొక్కుల బెడద ఎక్కువగా వుంది. స్టేషనులో రికార్డులను అవి పాడు చేయడంతో విసుగు చెందిన పోలీసులు పిల్లిని తెచ్చి పెట్టారు. స్టేషనుకు పిల్లి వచ్చిన తరువాత ఎలుకల బాధ కొంతవరకు తక్కువగా ఉందని పోలీసులు చెప్పారు. ఏమైతేనేమి పిల్లికి స్టేషనులో రాచమర్యాదలు దక్కుతున్నాయి. ముగ్గురు దొంగల అరెస్టు మైసూరు: ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి మూడు బైకులతో పాటు రూ.15 లక్షల విలువ చేసే బంగారు నగలను సీజ్ చేశారు. నగర క్రైమ్, ట్రాఫిక్ డిసిపి గీతా ప్రసన్న ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు చైన్ స్నాచర్లు, ఇళ్లలో చోరీచేసేవారిపై నిఘా వేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మైసూరులో ఇటీవలికాలంలో స్నాచింగ్‌లు, దొంగతనాలు పెరిగిపోవడం తెలిసిందే. (చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...) -
నిజమైన ఇంద్రజాలం
మర్యాద పలకరింపు కూడా లేకుండా– ‘ఏమిటి నీ గొప్ప? మామూలు బోధనలే కదా నువ్వు చేసేది! మరి నేను అలా కాదే! ఎన్నో అద్భుతాలు చేయగలను’ అన్నాడు గర్వంగా. ఒక పట్టణంలో రెండు ఆశ్రమాలుండేవి. ఇద్దరు గురువులు ఉండేవారు. మొదటి ఆశ్రమంలో గురువు బోధనలు చక్కగా ఉండేవి. ప్రేమ, కరుణ, శాంతం గురించి ఎక్కువగా చెబుతుండేవాడు. దాంతో వినడానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఎంతోమంది జనం వచ్చేవారు. రెండో గురువు గొప్ప శక్తులను సంపాదించడం మీద తన దృష్టి సారించేవాడు. అలా ఎన్నో అద్భుతాలను ఆయన చేయగలిగేవాడు. అయితే, రెండో గురువు దగ్గర ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ మొదటి గురువుకే ఎక్కువ ఆదరణ ఉండేది. ఇది రెండో గురువుకు తీవ్రమైన అసూయ కలిగించేది. దాంతో ఒకరోజు నేరుగా మొదటి గురువు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆయన చుట్టూ శ్రోతలు కూర్చునివున్నారు. మర్యాద పలకరింపు కూడా లేకుండా– ‘ఏమిటి నీ గొప్ప? మామూలు బోధనలే కదా నువ్వు చేసేది! మరి నేను అలా కాదే! ఎన్నో అద్భుతాలు చేయగలను’ అన్నాడు గర్వంగా.‘ఏమిటా అద్భుతాలు?’ కుతూహలంగా అడిగాడు మొదటి గురువు.‘నేను మన ఊళ్లోని చెరువు ఈ ఒడ్డున బ్రష్ పట్టుకుని నిల్చుంటాను. అవతలి ఒడ్డున నా సహాయకుడు కాన్వాస్ పట్టుకుని నిలుచుంటాడు. నేను ఇక్కడ గీస్తే అక్కడ బొమ్మ రూపుకడుతుంది తెలుసా?’ అన్నాడు.‘ఓహో, నిజంగా బాగుంది. అయితే, నేను అంత ఇంద్రజాలం ప్రదర్శించలేనుగానీ నేను పడుకోగానే మాత్రం వెంటనే నిద్ర పడుతుంది’ నవ్వుతూ బదులిచ్చాడు మొదటి గురువు. -
కోతి నా ఆదర్శం
ఒక ఊళ్లో (పేరెందుకు లెండి) ఒక జూ వుంది. చిన్న జూ. ఒక పులి, రెండు మొసళ్లూ, మూడు పాములూ, ఒక జీబ్రా, ఒక ఆస్ట్రిచ్, ఒక కోతి ఉన్నాయక్కడ. ఇవి గాక పక్షులు, చేపలు, కప్పలు వగైరా ఎలాగూ ఉంటాయి గదా. యుద్ధం ప్రారంభమయ్యాక, ఫాసిస్టులు వేసిన బాంబుల్లో ఒకటి సరిగ్గా జూ మీద పడింది. అంటే జంతువులకు ప్రళయం వచ్చినట్టే. మూడు పాములు, ఆస్ట్రిచ్ మంటల్లో కాలిపోయాయి. మిగతా జంతువులకేం కాలేదు. అన్నింటికన్నా ఎక్కువ భయపడింది కోతి. దానికోసం కట్టిన ఇనుప చువ్వల పంజరం బోల్తా పడింది. ఒకవైపు విరిగింది. కోతి జూ దాటి రోడ్డెక్కింది. అది మనిషి కాదు. ఏ పని చెయ్యాలన్నా ఆజ్ఞలూ, అనుమతులు దానికక్కర్లేదు. చెట్టు మీదికి ఎగిరి, అటు నుంచి గోడ మీదికి దూకి పరిగెత్తింది. బాంబులింకా పడుతున్నట్టుగా, యింకా దూరం పారిపోవాలని ప్రయత్నం.ఊరంతా కలియ తిరిగింది. వీధి వీధిని పరిశీలించి చూసింది. జనావాసాలు క్షేమంగా కనిపించనట్టుంది. పొలిమేరలను చేరుకుంది. మనిషి కాదు గదా కోతి. ఎందుకు, ఏమిటని ప్రశ్నిస్తే జవాబులు చెప్పలేదు.పరిగెత్తితే ఎవరైనా అలసిపోతారు. కోతి గూడా. చెట్టె క్కింది. ఆకలిగా ఉందేమో, ఓ ఈగను మింగింది. ఆ తర్వాత మరో రెండు పురుగుల్ని చప్పరించింది. కొమ్మ మీద ఆదమరచి నిద్రపోయింది.అప్పుడు, ఓ మిలటరీ వాహనం అటుగా వచ్చింది. డ్రైవర్ కోతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. చెట్టెక్కి దాన్ని పట్టుకుని, ట్రక్కులో వేసుకున్నాడు. ‘‘పాపం, ఒంటరి కోతి. ఆకలికి మాడి చస్తుంది. నా మిత్రుడికి బహుమానంగా ఇస్తాను. కనీసం తిండి పెట్టి పోషిస్తాడు. అలాగైనా దీని యిక్కట్లు తీరుతాయి’’ అనుకున్నాడు.‘‘నా ముద్దుల కోతి, నువ్విక్కడే కూర్చోవమ్మా. ఇప్పుడే వస్తాను’’ అంటూ అయిదు నిమిషాలు అలా వెళ్లాడో లేదో కోతి ట్రక్కులోంచి దూకి పరిగెత్తింది. మళ్లీ వీధుల్లో, ఇళ్ల కప్పుల మీద, చెట్ట మీద. చూసేవాళ్లకిదంతా వింతగానే ఉంది. పట్టుకోవడానికీ ప్రయత్నించారు. కానీ అది అంత సులభంగా దొరుకుతుందా? జనం కోతిని యిబ్బంది పెట్టారు. కోతి జనాన్ని ఇబ్బంది పెట్టింది. మరి కాసేపటికి ఆకలేసింది. హోటల్కెళ్లాలి. కనీసం ఒక కో–ఆపరేటివ్ స్టోర్స్ కన్నా. కానీ డబ్బుల్లేవు. ఇంక డిస్కౌంట్లు, రేషన్ కూపన్లు తలచుకుని ఏం ప్రయోజనం.ఎదురుగా పెద్ద క్యూ కనిపించింది. కూరగాయలు పంచుతున్నారు. క్యారట్లు, దోసకాయలు, కోతులకు క్యూలో నిల్చునే ఓపిక ఉంటుందా? తోసుకోవడం, కుమ్ముకోవడం కూడా వీలుపడదు. చెంగున కౌంటర్మీదికెగిరి కూర్చుంది. ‘‘క్యారట్లు కిలో ఎంత?’’ అని అడగలేదు. పౌర బాధ్యతలు దానికి తెలియవు. కావలసినవి నోట కరచుకుని తుర్రుమంది. డబ్బులూ, మర్యాదా తర్వాత. అన్నింటినీ మించిన అవసరం ఆకలి. జనం అరిచారు. గోల పెట్టారు. కూరగాయలు తూస్తున్న పిల్ల మూర్చపోయింది. క్రమశిక్షణా రాహిత్యం అనర్థదాయకం. అందరూ ఇలాగే ఎగబడి ఎవరికి తోచింది వాళ్లు తీసుకుపోతామంటే ఇంక స్టోర్సు, రేషన్ కూపన్లు ఎందుకు?ఇలాంటి తుంటరి వెధవల్ని శిక్షించాలి. అందరూ కలిసి వెంటబడ్డారు. నోటిలో క్యారట్ పెట్టుకుని కొత్త విన్యాసాలు చేసింది కోతి. ఆకలేసినంత మాత్రాన దొరికింది నోట కరచుకోవడం నేరమని తెలియదు. అయినా కోతులకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని అందరికీ తెలుసు.వెంటపడటం పిల్లలకు సరదా.పెద్దవాళ్లకు కోపం.పోలీసు మనిషి కూడా డ్యూటీగా విజిలూదుతూ కాసేపు పరిగెత్తాడు.మనుషులు సరిపోలేదని ఓ కుక్క కూడా మొరుగుతూ వెంట పడింది. పట్టుబడితే ఇలాంటి క్షుద్ర జీవులను చీల్చెయ్యాలని అందరికీ సరదా.కోతి పరుగు లంకించుకొంది. ‘‘జూ విడిచి రావడమే పెద్ద పొరబాటు’’ అనుకుంటున్నదేమో! ‘‘నగరం నా నివాసం కాదు. జూలోని ఇనుప చువ్వల పంజరమే నా ఇల్లు. అక్కడే నా స్వేచ్ఛ. నా సుఖం’’ అనీ అనుకున్నదేమో.కోతి పశ్చాత్తాప పడినంత మాత్రాన కుక్క దాన్ని క్షమించవలసిన పనిలేదు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్న దొంగకోతి కంచె దూకింది. కుక్క పంజా విసిరింది. నోటిలోని క్యారెట్‌తో కుక్క ముట్టె మీద టపీమని కొట్టింది కోతి. కుక్కకు దిమ్మ తిరిగింది. ఇది దోపిడి దొంగ లాగుంది. వెంట ఆయుధాలు కూడా తెచ్చుకుంది. కుయ్యో మొర్రోమంటూ తోకను కాళ్ల మధ్యన దోపుకుని కూలబడింది కుక్క.‘‘మహా ప్రభువులకు విన్నవించుకుంటున్నాను. ఇళ్లకు కాపలాకాయడం నా డ్యూటీ. కోతుల్ని వెంటాడటం కాదు. అదనపు బాధ్యతలు నెత్తిమీద వేసుకుంటే ఇలాగే ముట్టె బొప్పి కడుతుంది.’’ అనుకున్నది కాబోలు.గోడమీద తిరుగుతున్న కోతికి ఆలేషా కనిపించాడు. కుర్రాడు. కట్టెలు కొడుతున్నాడు. కోతిని చూసి గొడ్డలి కింద పడేశాడు. చిన్నారి కోతి. ముద్దొస్తోంది.షర్టు విప్పి, ఒడుపుగా మీదికి విసరి పట్టుకున్నాడు. ఒక కోతిని పెంచుకోవాలని ఎన్నాళ్లుగానో అనుకున్నాడు. ఇన్నాళ్లకు కోరిక తీరింది. ఇంటికి తెచ్చి, తిండి పెట్టాడు. తాగడానికీ టీ ఇచ్చాడు. కోతికి ఇదంతా బాగానే ఉంది. కానీ కాస్త ఇబ్బంది లేకపోలేదు. ఆలేషా అమ్మమ్మకు కోతిని ఇంట్లో పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఒకసారి కొట్టబోయింది కూడాను. కోతి పెద్ద నేరమేమీ చెయ్యలేదు. మధ్యాహ్నం ఎవరూ చూడకుండా తినాలని ముసలావిడ దాచుకున్న మిఠాయిని గుటుక్కుమనిపించింది.మనుషుల మర్యాదలతో కోతులకేం సంబంధం? ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్లు ప్రవర్తిస్తారు. ముసలావిడ దుఃఖించింది. ఈ పాడు కోతికి తన మిఠాయి ముక్క కావలసి వచ్చిందా? కన్నీళ్ల పర్యంతమై ఒక ప్రకటన జారీ చేసింది.‘‘ఇది మనుషులుండే యిల్లు. కోతుల రాణి వాసం కాదు. దీని మొహం చూస్తే రాత్రికి నిద్ర పట్టదు. ఇంట్లో యిదైనా ఉండాలి. నేనైనా ఉండాలి. దీన్ని వెంటనే జూకు తీసికెళ్లకపోతే నేనే అక్కడకి పోతాను. కోతులు యిళ్లల్లో. మనుషులు జూలో. ఏం రోజులు వచ్చాయిరా బాబూ!’’.ఆలేషాకు అమ్మమ్మంటే ఇష్టం.‘‘నువ్వు జూకి వెళ్లొద్దు. ఈ కోతి ఇకమీద నీ వస్తువులేవీ ముట్టదు. దీనికి మనుషుల పద్ధతులన్నీ నేర్పిస్తాను. నువ్వే చూస్తావుగా. కొద్దిరోజుల్లో ఇది స్పూన్‌తో తింటుంది. గ్లాసులోంచి టీ తాగుతుంది. ఇక గెంతడమంటావా? జాతి లక్షణమది. నీ మీదికి దూకినా నీవు భయపడవద్దు అమ్మమ్మా. దానికి నువ్వంటే ఇష్టం. ఆఫ్రికా అడవుల్లో వూడలు పట్టుకుని వూగిన కోతి. కొన్ని అలవాట్లు మార్చుకోలేదు.’’తెల్లారి స్కూలుకు పోతూ ఆలేషా అమ్మమ్మకు కోతికి జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పాడు.‘‘ముసలిదైతే మాత్రం కోతి బాగోగులు కూడా తనే చూడాలా? వాడికి తనంటే అంత చులకనా? ఇదెక్కడికన్నా పోతే పీడా విరగడవుతుంది.’’ అనుకుని వాలు కుర్చీలో నిద్రపోయింది ముసలావిడ.కోతి కిటికిలోంచి దూకి వీధిలో పడింది. ఇల్లు విడిచి రావాలని దాని ఉద్దేశం కాకపోవచ్చు. కాస్త షికారుకెళ్లాలని కోరిక కావచ్చు. లేదా మరో కొట్లో మరేవైనా రుచికరమైన వస్తువులు దొరుకుతాయేమోనని ఆశ కావచ్చు. – డబ్బుల్లేవనుకోండి. అది వేరే సంగతి. సరిగ్గా ఆ సమయంలో ఓ వృద్ధుడు అటుగా నడుస్తున్నాడు. చేతిలో సబ్బు, టవల్, పబ్లిక్ బాత్రూంలో స్నానం చెయ్యడానికి పోతున్నాడు. చేతిలో చిన్న బుట్ట.కోతిని చూసి తన కళ్లను నమ్మలేకపోయాడు. కోతి విధుల్లోకి రావడమేమిటి? కాస్త మందు కొట్టి ఉన్నాడు. అంతా తన ఊహకాబోలు అనుకున్నాడు. పరికించి చూశాడు. నిజంగా కోతే. దీన్ని పట్టుకుని మార్కెట్లో అమ్మితే కనీసం వంద రూబుళ్లు వస్తాయి. అప్పుడు కడుపు నిండా బీరు తాగవచ్చు. ఎలా మాట్లాడి దాన్ని బుట్టలో వేసుకోవాలో అర్థం కాలేదు. తనకు కోతి భాష రాదు. జంతువుల్లో కల్లా తెలివైనది కోతి. జేబులోంచి చక్కర బిళ్ల తీసి చూపించాడు. కోతి ‘‘థ్యాంక్స్’’ అనాలనుకుంది. కానీ దానికి మాటలు రావుగా. తింటుంటే మాత్రం తియ్యగా ఉంది. మొత్తంమీద అలాగ బుట్టలో పడింది కోతి. ఆ వృద్ధుడు తనను మోసుకెడుతుంటే గర్వించింది కూడాను.మంచిధర వస్తుంది.స్నానాల గది నీటి పొగతో వేడిగా ఉంది. కోతికి ఆఫ్రికా జ్ఞాపకం వచ్చింది. పుట్టింటికి వచ్చినట్టనిపించింది. అంతలోనే సబ్బు నురగ మింగింది. ఛ, అదేం రుచి. అసహ్యమేసింది. తల విదిలించింది. ఈసారి సబ్బుతో కళ్లలో మంట మొదలైంది. అసలే కోతి. పిచ్చెక్కింది. వృద్ధుడి వేలు కొరికి బైట పడింది.సబ్బు నురగతో తెల్లటి బంతిలాగున్న కోతిని వీధిలో ఎవరూ గుర్తు పట్టలేదు. అసహనంతో అటూ ఇటూ గెంతింది.బాత్రూం ముందర స్నానాలకు టికెట్లు అమ్మే కౌంటర్ ఉంది. అక్కడో లావుపాటి పిల్ల కూర్చుంది. కోతిని చూసి బాంబనుకుంది. ‘‘హెల్ప్, హెల్ప్’’ అని కేకలేస్తూ పరిగెత్తింది.ఈ అరుపులూ, పెడబొబ్బలూ కోతికర్థం కాలేదు. ఒంటికి సబ్బు, కళ్లలో మంట. అందరి కన్నా వెనుక తనకు మిఠాయి పెట్టిన ముసలాడు.ఇదే అదనుగా కుక్క(అదే కుక్క) కూడా వెంట పడింది. అయితే ఒకసారి గర్వ భంగమైంది గనుక కుక్క తన జాగ్రత్తలో తానున్నది. దూరం నుంచే మొరిగి భయపెట్టింది.‘‘కోతి కన్నా నా ముట్టె నాకు ముఖ్యం’’ అనుకుంది.మన ఆలేషా అప్పుడే స్కూలు నుంచి తిరిగి వచ్చాడు. కోతి ఇంట్లో లేదు. ఏడుపొచ్చింది. అంత అపురూపమైన కోతి మళ్లీ తనకు దొరికేనా!దిగాలుగా వీధుల వెంట నడిచాడు. జనం హడావిడిగా అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఫాసిస్టులు బాంబులు వేస్తున్నారా? కోతి కోసం పరుగులు తీస్తున్నారా అని ఆ కుర్రాడికి చాలా సేపటిదాకా అర్థం కాలేదు. మొత్తం మీద కోతి కనిపించింది. పరిగెత్తి దాన్ని తీసుకుని ముద్దాడాడు. జనం ఆలేషా చుట్టూ మూగారు.వృద్ధుడు వచ్చి కోతి తనదన్నాడు.‘‘ఇదిగో సాక్ష్యం. నా వేలు కొరికింది కూడాను. డబ్బులు చాలా అవసరం. రేపు దీన్ని మార్కెట్లో అమ్మాలి.’’‘‘ఇది నా కోతి. పొమ్మన్నా పోదు. నేనంటేనే దానికిష్టం’’ అన్నాడు ఆలేషా.‘‘మీద్దరిదీ కాదు. ఇది నాది. ట్రక్కులో తీసుకొచ్చింది నేనే.’’‘‘అయితే ప్రస్తుతం నేను యుద్ధానికి పోతున్నాను. ఎవరు ప్రేమగా పెంచుకుంటానంటే వాళ్లకిస్తాను’’ అన్నాడు డ్రైవర్. ఈ ముసలోడు. దయలేనివాడు. కుర్రాడిదే నిజమైన ప్రేమ’’ అనుకుంది కోతి.జనం చప్పట్లు కొట్టారు.ఆలేషా, కోతి ఇంటికి చేరారు.వృద్ధుడు వేలి గాయం చప్పరిస్తూ బాత్రూం వైపు నడిచాడు.ఇప్పటికీ మన కోతి ఆలేషా దగ్గిరే ఉంటోంది.మొన్న ఆ వూరికి వెళ్లినప్పుడు చూడటానికెళ్లాను. కోతి ఇప్పుడెక్కడికీ పారిపోదు. వినయం విధేయతా నేర్చుకుంది. జేబురుమాలుతో ముక్కు తుడుచుకుంటుంది. ఆలేషా అమ్మమ్మక్కూడా ఇప్పుడదంటే కోపం లేదు. దాన్ని మళ్లీ జూకు పంపించే ఉద్దేశం లేదు.కోతి టేబుల్ మీద కూర్చుని కాస్త టెక్కుగా నా వైపు చూసింది.. టికెట్లమ్మేవాడు తన వల్లే ప్రేక్షకులంతా సినిమా చూడగలుగుతున్నారని గర్వించినట్టు. స్పూన్‌తో భోజనం చేస్తోంది.‘‘విద్యాబుద్ధులు చెప్పించాను. మర్యాదా, మన్ననా అలవాటు చేశాను. ఇలాంటి కోతిని చూసి పిల్లలూ, పెద్దలూ కూడా నేర్చుకోవాల్సిందెంతో ఉంది’’ అన్నాడు ఆలేషా. రష్యన్ మూలం : మిహాయిల్ జోష్చెంకో అనువాదం: ముక్తవరం పార్థసారథి -
ప్లీజ్ స్టాప్
నలుగురిలో పీకుడు.. గీకుడు.. గోకుడు ఇంగ్లిష్‌లో ‘ఎటికెట్’ అంటారు. తెలుగులో ‘సంస్కారంతో కూడిన పద్ధతి కలిగిన మర్యాద’ అని అర్థం కావచ్చు. మాట్లాడేటప్పుడు ముఖం చూస్తూ మాట్లాడాలి. ముఖం మీద పడి కాదు.దురద పుడితే మనం ఇబ్బంది పడాలి. అదేపనిగా గోక్కుంటూ ఉంటే ఎదుటివారు కాదు. మర్యాదస్తులం అని మనల్ని మనం అనుకోవచ్చు. కాని ఇతరులు మనల్ని మర్యాదస్తులని అనుకోవాలి. ఇది చదివి నవ్వితే నవ్వారు. మీ తుంపర్లతో పేపర్‌ను తడపకండి. మిగిలిన వాళ్లు చదివి నవ్వుకుంటారు. దశకంఠనాదం మానండి రాత్రి పూట మీరు టీ షర్ట్ పైజామా వేసుకుని పడుకుంటారని మీకు మాత్రం తెలిస్తే చాలు. తెల్లారి లేచాక వాటి మీదే కారిడార్లలో తిరక్కండి. ముఖ్యంగా జుట్టు దువ్వకుండా బ్రష్ చేసుకోకుండా నిద్ర ముఖంతోటే పిల్లలను స్కూల్‌బస్ ఎక్కించడానికి ప్రయత్నించకండి. ఇది మీకు ఇంపుగా ఉన్నా చాలామందికి కంపుగా ఉంటుంది. మరికొందరు బాత్రూమ్లో బ్రష్ చేశాక గొంతు శుభ్రం చేసుకోడానికి పెద్దగా క్యాకరించడం మొదలుపెడతారు. మన క్యాకరింపు మనకు మాత్రమే వినపడితే చాలు. బెజవాడలో మీరు క్యాకరిస్తున్న విషయం కర్నూలు వాళ్లకు తెలియాల్సిన పని లేదు. ఎల్లో పెయింట్ మానండి మీకు చట్నీ ఇష్టం అన్న విషయం మీకు మాత్రమే తెలియనివ్వండి. స్నేహితులతో, పరిచయస్తులతో బ్రేక్‌ఫాస్ట్‌కు కూచున్నప్పుడు రెండు మూడు గరిటెల చట్నీ కుమ్మరించుకుని అది చాలదన్నట్టు వేళ్లన్నిటికీ పెయింట్‌లా పూసుకోకండి. స్పూన్ వాడటం మంచిదే. కాదంటే ఇడ్లీ తుంచడానికైనా పూరీ తుంచడానికైనా మునివేళ్లు చాలు. పిసికి పిసికి మీ గుప్పిటబలం చూపకండి. మరొకటి- తిన్నది తృప్తి కలిగించిందని మీకు తెలిస్తే చాలు. బ్రేవ్‌మని బస్సు హారన్‌ని కంగారు పెట్టకండి. అలాంటి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే కాస్త పక్కకువెళ్లి చేయండి. మీ పెర్ఫ్యూమ్ మీకే ముద్దు ప్రతి శరీరానికి ఒక పరిమళం ఉంటుంది. అది మీకు మాత్రమే పరిమళం కావచ్చు. ఆ సెంట్‌ను మీరే ఉంచుకోండి. కాని నలుగురిలోకి వచ్చేటప్పుడు మీ బట్టల నుంచి, శరీరం నుంచి మంచి వాసన రాకపోయినా అసలు ఏ వాసనా రాకుండా చూసుకోండి. కాలుష్యం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక రోజు వేసుకున్న బట్టలు ఒకరోజుకే అని గ్రహించండి. వ్యక్తిగత శుభ్రత, బాహు మూలాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా మీకు తెలియని శుభ్ర సంస్కారం ఇస్తుంది. పాటించండి. భూమ్యాకాశాలు వద్దు వాన కురిసేటప్పుడు ఆకాశం వైపు చూడండి. రోడ్డు బాగలేనప్పుడు కింద చూస్తూ నడవండి. అంతే తప్ప ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆకాశం వైపో నేలవైపో చూడకండి. ముఖం వైపు చూస్తూ మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నారో వారితోనే మాట్లాడండి. మీరు సురేష్‌తో మాట్లాడుతుంటే గీత, అనిత, రాధిక, కాస్త దూరంగా ఉన్న మల్లేశ్, ప్రభాకర్... ఇంతమందికి వినపడాల్సిన పని లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఎదుటివారు చెప్పేది కూడా వినండి. నోరు ఒక్కటే. చెవులు రెండు. గమనించండి. అలాగే మీద పడిపోతూ మాట్లాకండి. దూరంగా నిలబడీ మాట్లాడకండి. ఎంతదూరంలో ఉంటే మర్యాదో అంతదూరంలో ఉండి మాట్లాడండి. మరొకటి- ఎదుటివాళ్లు స్నానం చేసే ఉంటారు. మీ నోటి తుంపర్లతో తిరిగి స్నానం చేయించకండి. పిన్ నంబర్ అడక్కండి పాతరోజుల్లో అంటే మనవాళ్లు చనువు భరించేవారు. ఇప్పుడు విసుక్కుంటున్నారు. కనుక ఎదుటివారిని మరీ కబళించుకుని తినేయకండి. మీ ఆయన బాగ చూసుకుంటున్నాడా, మీ ఆవిడతో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా పిల్లలు పుట్టలేదా, అయ్యో... ఒక్కడితోనే ఆపేశారా, అంత లావైపోయారు ఎందుకు, ఇంత సన్నగా ఉన్నారు ఏంటి... మీ అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చేసిందట నిజమేనా... మీ డెబిట్ కార్డ్ పిన్ నంబర్ ఎంత... ఇవన్నీ కూపీ లాక్కండి. ఎదుటివారు భరిస్తున్నారు కదా అని పీక్కుని తినకండి. అప్పుడు సమాధానం చెప్పినా ఆ తర్వాత మీరు ఈ వీధిలో వస్తుంటే వారు ఆ వీధిలో నుంచి తప్పుకుంటారు. బందిపోటు ముఠా అనుకోనివ్వకండి మనం ఎవరి ఇంటికైనా వెళుతూ ఉంటే వారు మనల్ని బందిపోటు ముఠా అనుకునే విధంగా ఉండకండి. మీ పిల్లలు ఆ ఇంటికి వెళ్లగానే కప్‌బోర్డులు లాగేసి, ఫ్లవర్‌వాజులు పగులగొట్టి, బిస్కెట్ ప్యాకెట్లు చింపి రేపర్లు నేలన పడేసి, సోఫాలు తొక్కి, టీవి మీద బంతి విసిరి... ఇన్ని ట్విన్‌టవర్ దాడులు చేసే విధంగా ఉండకుండా తర్ఫీదు ఇవ్వండి. మీరు కూడా సోఫాలో పద్ధతిగా కూచోండి. కాళ్లెత్తి టీపాయ్ మీద పెట్టకండి. కాస్త విశ్రాంతి తీసుకుంటానని వారి బెడ్రూముల్లోని మంచాల మీద నడుం వాల్చకండి. పూలు తుంచేయడం, కాయలు తెంచేయడం వంటి చేష్టలు వద్దు. భోజనం బాగలేకపోయినా బాగుందనే చెప్పండి. భాగుంటే మరిన్ని పోలికలు తెచ్చి చిన్నబుచ్చకండి. జాలిమ్ దుష్మన్ కాకండి దురదను అదుపు చేసుకోండి. ఎదుటివారి ముందు ఒళ్లు గీరుకుంటూ ఉండటం మర్యాద కాదని గ్రహించండి. తల గీరుకోవడం, నడుము గీరుకోవడం, ముక్కు గీరుకోవడం పోస్ట్‌పోన్ చేసి ఏకాంతంలో చేయండి. ఎదుటివారి ముందు పళ్లు కుట్టుకోకండి. ముక్కులో వేలు పెట్టి రుద్దుకోకండి. పళ్లలో చిక్కుకున్న పదార్థాల వేటకు చూపుడు వేలు బొటనవేలుతో బయలుదేరకండి. ముఖ్యంగా ఈ పనులన్నీ చేసి ఏదైనా ఆఫర్ చేయడమో, షేక్ హ్యాండ్‌కు చేయి సాచడమో అస్సలు చేయకండి. ఎదుటివారి ముందు తల దువ్వుకోవడం కూడా అంత మర్యాదకాదు. దువ్వి మనకు చుండ్రు ఉందన్న సంగతి వారికి చాటింపు చేయకండి. ఎడమ చేత్తో ఏదీ ఇవ్వకండి. ఎడమ చేత్తో ఏదీ తీసుకోకండి. సతీ సెన్సిబుల్‌గా ఉండండి ఎదుటివారు నాస్తికులు కావచ్చు. ఎందుకు అని అడక్కండి. ఆస్తికులు కావచ్చు. మరీ ఇంతగానా అని అభ్యంతర పెట్టకండి. మాంగల్యాలను మట్ట్టెలను వెతకడం, ఇష్టంలేకపోయినా బొట్టు పెట్టడం, పాపిటలో సిందూరం రుద్దడం చేయకండి. ప్రసాదాలు తినమని బలవంత పెట్టకండి. ఫలానా విధంగా లేకపోతే అరిష్టం అని భయపెట్టకండి. అలాగే ఎదుటివారి నమ్మకాలని మూఢవిశ్వాసాలుగా గేలి చేయకండి. గమనించండి. కొందరిని చూస్తే మనకు స్నేహం చేయబుద్ధవుతుంది. అంటే వారు తగిన మర్యాదలు పాటిస్తూ మనల్ని సౌకర్యంగా ఉంచుతున్నారని అర్థం. మనం కూడా ఎదుటివారి దృష్టిలో అలాగే ఉండాలని గ్రహించండి. ఎంతో మర్యాదగా ఇదంతా చదివినందుకు కృతజ్ఞతలు చెప్పనివ్వండి. థ్యాంక్యూ. - శశి వెన్నిరాడై -
ఏది ఉత్తమ ధర్మం?
బౌద్ధవాణి శ్రావస్తి నగరంలో వజ్రాలకు సాన పెట్టే పనివాడు ఒకడు ఉండేవాడు. వాని పేరు నికషుడు. ఒకనాడు నికషుడు ఒక బౌద్ధభిక్షువుని భిక్ష కోసం తన ఇంటికి పిలుచుకు వచ్చాడు. మర్యాదలు చేసి కూర్చోబెట్టాడు. అప్పుడు రాజభటులు వచ్చి ఒక ఎర్రని వజ్రాన్ని ఇచ్చి సాన పెట్టమని చెప్పి వెళ్లిపోయారు. నికషుడు ఆ వజ్రాన్ని ఒక పళ్లెంలో ఉంచి, దానిని చిన్న ముక్కాలిపీట మీద ఉంచి లోనికి వెళ్లాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న నికషుని పెంపుడు కోడిపుంజు దాని రంగు చూసి ఒక్క ఉదుటున నోట కరుచుకుని మింగేసింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నికషునికి ఆ వజ్రాన్ని ఆ భిక్షువే కాజేశాడని అనిపించింది. ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా భిక్షువు మాట్లాడకపోవడంతో కోపం ముంచుకొచ్చి, ‘‘భిక్ష కోసం నేను నిన్ను పనిమాలా పిలుచుకొస్తే ఇలాంటి దొంగతనానికి పాల్పడతావా?’’అంటూ మూలనున్న కర్ర తీసుకుని భిక్షువుని కొట్టడం మొదలుపెట్టాడు. అయినా ఆ భిక్షువు మాట్లాడలేదు. విషయం తనకు తెలిసినా ‘కోడిపుంజు మింగిందనీ’’ చెప్పలేదు. దెబ్బలు భరిస్తూనే ఉన్నాడు. చివరికి నికషుని చేతిలోని కర్రకూడా సగానికి విరిగిపోయింది. ‘‘చూడు, ఎంతకొట్టినా నోరు మెదపడం లేదు. ఇది కాదు. ఇంకో కర్ర తెస్తాను’’ అంటూ తన చేతిలోని కర్రను గట్టిగా నేలకు విసిరికొట్టి, గది మూలకు మరో కర్రకోసం వెళ్లాడు. ఈలోగా నేలకేసి కొట్టిన కర్రముక్క పైకి ఎగిరి ఆ పుంజుకు తగిలి అది గిలగిలా తన్నుకుని చనిపోయింది. రెండో కర్ర తీసుకువచ్చిన నికషునితో అప్పుడు అసలు విషయం చెప్పాడు ఆ భిక్షువు. ‘‘ఇంతసేపూ ఎందుకు నోరు మెదపలేదు?’’ అని అడిగాడు నికషుడు. తన వల్ల ఒక మూగజీవి ప్రాణం పోవడం ఇష్టం లేక చెప్పలేదని అన్నాడు భిక్షువు. ఆ మాటకు వెంటనే భిక్షువు కాళ్ల మీద పడి, క్షమించమని వేడుకున్నాడు నికషుడు. బుద్ధ భగవానుడు ఈ విషయం చెప్పి ‘‘జీవకారుణ్యానికన్నా ఉత్తమ ధర్మం మరొకటి లేదు’’ అని తన శిష్యులతో అన్నాడు. - బొర్రా గోవర్ధన్ -
కట్న దాహానికి గర్భిణి బలి
గొంతు నులిమి చంపేసిన భర్త ఉప్పల్: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం నిండుచూలాలు అని కూడా చూడకుండా గొంతునులిమి భార్యను హత్య చేశాడు. రామంతాపూర్‌లోని వెంకటరెడ్డినగర్‌లో శుక్రవారం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...ప్రకాశంజిల్లా గిద్దలూరు సమీపంలోని రెవెల్లి గ్రామానికి చెందిన సౌజన్య(21)తో అదే జిల్లా రాచర్ల మండలం అనుముల గ్రామానికి చెందిన వేమురెడ్డి జయరాంరె డ్డి (25)తో ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. సౌజన్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి. జయరాంరెడ్డి మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతను గత కొంతకాలంగా అదనపు కట్నం, స్థలం కోసం తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం కూడా వీరి మధ్య గోడవ జరిగింది. ఎప్పటిలాకే శుక్రవారం ఉదయాన్నే జయరాంరెడ్డి విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం అవుతున్నా సౌజన్య ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా సౌజన్య మంచంపై పడి ఉంది. చేయిపట్టుకొని లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చి వైద్యుడిని పిలిపించి పరీక్ష చేయించగా.. ఉదయమే ఆమె మృతి చెందినట్టు నిర్థారించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఉప్పల్ సీఐ బాలకృష్ణారెడ్డి, ఎస్ఐ లింగం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి మెడపై గాట్లు ఉన్నాయి. దీని బట్టి భర్తే ఆమెను గొంతు నులిమి చెప్పి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. భర్త జయరాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే సౌజన్య హత్యకు దారి తీసిన కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.