ప్లీజ్ స్టాప్
నలుగురిలో పీకుడు.. గీకుడు.. గోకుడు ఇంగ్లిష్‌లో ‘ఎటికెట్’ అంటారు. తెలుగులో ‘సంస్కారంతో కూడిన పద్ధతి కలిగిన మర్యాద’ అని అర్థం కావచ్చు. మాట్లాడేటప్పుడు ముఖం చూస్తూ మాట్లాడాలి. ముఖం మీద పడి కాదు.దురద పుడితే మనం ఇబ్బంది పడాలి. అదేపనిగా గోక్కుంటూ ఉంటే ఎదుటివారు కాదు. మర్యాదస్తులం అని మనల్ని మనం అనుకోవచ్చు. కాని ఇతరులు మనల్ని మర్యాదస్తులని అనుకోవాలి. ఇది చదివి నవ్వితే నవ్వారు. మీ తుంపర్లతో పేపర్‌ను తడపకండి. మిగిలిన వాళ్లు చదివి నవ్వుకుంటారు.
దశకంఠనాదం మానండి
రాత్రి పూట మీరు టీ షర్ట్ పైజామా వేసుకుని పడుకుంటారని మీకు మాత్రం తెలిస్తే చాలు. తెల్లారి లేచాక వాటి మీదే కారిడార్లలో తిరక్కండి. ముఖ్యంగా జుట్టు దువ్వకుండా బ్రష్ చేసుకోకుండా నిద్ర ముఖంతోటే పిల్లలను స్కూల్‌బస్ ఎక్కించడానికి ప్రయత్నించకండి. ఇది మీకు ఇంపుగా ఉన్నా చాలామందికి కంపుగా ఉంటుంది. మరికొందరు బాత్‌రూమ్‌లో బ్రష్ చేశాక గొంతు శుభ్రం చేసుకోడానికి పెద్దగా క్యాకరించడం మొదలుపెడతారు. మన క్యాకరింపు మనకు మాత్రమే వినపడితే చాలు. బెజవాడలో మీరు క్యాకరిస్తున్న విషయం కర్నూలు వాళ్లకు తెలియాల్సిన పని లేదు.
ఎల్లో పెయింట్ మానండి
మీకు చట్నీ ఇష్టం అన్న విషయం మీకు మాత్రమే తెలియనివ్వండి. స్నేహితులతో, పరిచయస్తులతో బ్రేక్‌ఫాస్ట్‌కు కూచున్నప్పుడు రెండు మూడు గరిటెల చట్నీ కుమ్మరించుకుని అది చాలదన్నట్టు వేళ్లన్నిటికీ పెయింట్‌లా పూసుకోకండి. స్పూన్ వాడటం మంచిదే. కాదంటే ఇడ్లీ తుంచడానికైనా పూరీ తుంచడానికైనా మునివేళ్లు చాలు. పిసికి పిసికి మీ గుప్పిటబలం చూపకండి. మరొకటి- తిన్నది తృప్తి కలిగించిందని మీకు తెలిస్తే చాలు. బ్రేవ్‌మని బస్సు హారన్‌ని కంగారు పెట్టకండి. అలాంటి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే కాస్త పక్కకువెళ్లి చేయండి.
మీ పెర్‌ఫ్యూమ్ మీకే ముద్దు
ప్రతి శరీరానికి ఒక పరిమళం ఉంటుంది. అది మీకు మాత్రమే పరిమళం కావచ్చు. ఆ సెంట్‌ను మీరే ఉంచుకోండి. కాని నలుగురిలోకి వచ్చేటప్పుడు మీ బట్టల నుంచి, శరీరం నుంచి మంచి వాసన రాకపోయినా అసలు ఏ వాసనా రాకుండా చూసుకోండి. కాలుష్యం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక రోజు వేసుకున్న బట్టలు ఒకరోజుకే అని గ్రహించండి. వ్యక్తిగత శుభ్రత, బాహు మూలాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా మీకు తెలియని శుభ్ర సంస్కారం ఇస్తుంది. పాటించండి.
భూమ్యాకాశాలు వద్దు
వాన కురిసేటప్పుడు ఆకాశం వైపు చూడండి. రోడ్డు బాగలేనప్పుడు కింద చూస్తూ నడవండి. అంతే తప్ప ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆకాశం వైపో నేలవైపో చూడకండి. ముఖం వైపు చూస్తూ మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నారో వారితోనే మాట్లాడండి. మీరు సురేష్‌తో మాట్లాడుతుంటే గీత, అనిత, రాధిక, కాస్త దూరంగా ఉన్న మల్లేశ్, ప్రభాకర్... ఇంతమందికి వినపడాల్సిన పని లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఎదుటివారు చెప్పేది కూడా వినండి. నోరు ఒక్కటే. చెవులు రెండు. గమనించండి. అలాగే మీద పడిపోతూ మాట్లాకండి. దూరంగా నిలబడీ మాట్లాడకండి. ఎంతదూరంలో ఉంటే మర్యాదో అంతదూరంలో ఉండి మాట్లాడండి. మరొకటి- ఎదుటివాళ్లు స్నానం చేసే ఉంటారు. మీ నోటి తుంపర్లతో తిరిగి స్నానం చేయించకండి.
పిన్ నంబర్ అడక్కండి
పాతరోజుల్లో అంటే మనవాళ్లు చనువు భరించేవారు. ఇప్పుడు విసుక్కుంటున్నారు. కనుక ఎదుటివారిని మరీ కబళించుకుని తినేయకండి. మీ ఆయన బాగ చూసుకుంటున్నాడా, మీ ఆవిడతో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా పిల్లలు పుట్టలేదా, అయ్యో... ఒక్కడితోనే ఆపేశారా, అంత లావైపోయారు ఎందుకు, ఇంత సన్నగా ఉన్నారు ఏంటి... మీ అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చేసిందట నిజమేనా... మీ డెబిట్ కార్డ్ పిన్ నంబర్ ఎంత... ఇవన్నీ కూపీ లాక్కండి. ఎదుటివారు భరిస్తున్నారు కదా అని పీక్కుని తినకండి. అప్పుడు సమాధానం చెప్పినా ఆ తర్వాత మీరు ఈ వీధిలో వస్తుంటే వారు ఆ వీధిలో నుంచి తప్పుకుంటారు.
బందిపోటు ముఠా అనుకోనివ్వకండి
మనం ఎవరి ఇంటికైనా వెళుతూ ఉంటే వారు మనల్ని బందిపోటు ముఠా అనుకునే విధంగా ఉండకండి. మీ పిల్లలు ఆ ఇంటికి వెళ్లగానే కప్‌బోర్డులు లాగేసి, ఫ్లవర్‌వాజులు పగులగొట్టి, బిస్కెట్ ప్యాకెట్లు చింపి రేపర్లు నేలన పడేసి, సోఫాలు తొక్కి, టీవి మీద బంతి విసిరి... ఇన్ని ట్విన్‌టవర్ దాడులు చేసే విధంగా ఉండకుండా తర్ఫీదు ఇవ్వండి. మీరు కూడా సోఫాలో పద్ధతిగా కూచోండి. కాళ్లెత్తి టీపాయ్ మీద పెట్టకండి. కాస్త విశ్రాంతి తీసుకుంటానని వారి బెడ్‌రూముల్లోని మంచాల మీద నడుం వాల్చకండి. పూలు తుంచేయడం, కాయలు తెంచేయడం వంటి చేష్టలు వద్దు. భోజనం బాగలేకపోయినా బాగుందనే చెప్పండి. భాగుంటే మరిన్ని పోలికలు తెచ్చి చిన్నబుచ్చకండి.
జాలిమ్ దుష్మన్ కాకండి
దురదను అదుపు చేసుకోండి. ఎదుటివారి ముందు ఒళ్లు గీరుకుంటూ ఉండటం మర్యాద కాదని గ్రహించండి. తల గీరుకోవడం, నడుము గీరుకోవడం, ముక్కు గీరుకోవడం పోస్ట్‌పోన్ చేసి ఏకాంతంలో చేయండి. ఎదుటివారి ముందు పళ్లు కుట్టుకోకండి. ముక్కులో వేలు పెట్టి రుద్దుకోకండి. పళ్లలో చిక్కుకున్న పదార్థాల వేటకు చూపుడు వేలు బొటనవేలుతో బయలుదేరకండి. ముఖ్యంగా ఈ పనులన్నీ చేసి ఏదైనా ఆఫర్ చేయడమో, షేక్ హ్యాండ్‌కు చేయి సాచడమో అస్సలు చేయకండి. ఎదుటివారి ముందు తల దువ్వుకోవడం కూడా అంత మర్యాదకాదు. దువ్వి మనకు చుండ్రు ఉందన్న సంగతి వారికి చాటింపు చేయకండి. ఎడమ చేత్తో ఏదీ ఇవ్వకండి. ఎడమ చేత్తో ఏదీ తీసుకోకండి.
సతీ సెన్సిబుల్‌గా ఉండండి
ఎదుటివారు నాస్తికులు కావచ్చు. ఎందుకు అని అడక్కండి. ఆస్తికులు కావచ్చు. మరీ ఇంతగానా అని అభ్యంతర పెట్టకండి. మాంగల్యాలను మట్ట్టెలను వెతకడం, ఇష్టంలేకపోయినా బొట్టు పెట్టడం, పాపిటలో సిందూరం రుద్దడం చేయకండి. ప్రసాదాలు తినమని బలవంత పెట్టకండి. ఫలానా విధంగా లేకపోతే అరిష్టం అని భయపెట్టకండి. అలాగే ఎదుటివారి నమ్మకాలని మూఢవిశ్వాసాలుగా గేలి చేయకండి. గమనించండి. కొందరిని చూస్తే మనకు స్నేహం చేయబుద్ధవుతుంది. అంటే వారు తగిన మర్యాదలు పాటిస్తూ మనల్ని సౌకర్యంగా ఉంచుతున్నారని అర్థం. మనం కూడా ఎదుటివారి దృష్టిలో అలాగే ఉండాలని గ్రహించండి. ఎంతో మర్యాదగా ఇదంతా చదివినందుకు కృతజ్ఞతలు చెప్పనివ్వండి. థ్యాంక్యూ.
- శశి వెన్నిరాడై