Sacrament
-
SC: మాజీ భర్త కష్టాల్లో భాగం పంచుకుంటారా?
వివాహ వ్యవస్థపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు. చట్టాలు భర్తలను బెదిరించి ఆస్తి గుంజుకోవడానికి కాదని మరోమారు స్పష్టం చేసింది.చట్టాలు మహిళల సంక్షేమం కోసమే.. భర్తలను శిక్షించడానికి, బెదిరించడానికి కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వైవాహిక వ్యవస్థలో హింస, భరణం అంశాలపై దేశవ్యాప్త చర్చ నడుస్తున్న వేళ.. మరోమారు కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.వివాహ వ్యవస్థను..హిందువులు పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారు. అదేం కమర్షియల్ వెంక్చర్ లాంటిది ఏం కాదని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.ప్రభుత్వాలు కఠినమైన చట్ట నిబంధనలను రూపొందించింది మహిళల సంక్షేమం కోసమే. అంతేకాని భర్తలను వేధించి, బెదిరించి, శిక్షించి, ఆస్తిని దండుకోవడానికి కాదు. భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులకు గురిచేశారని, అత్యాచారం చేశారనే ఆరోపణలన్నింటినీ ఒక ప్యాకేజీగా చేసి.. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారు. భార్య తరఫున గట్టిగా బేరసారాలు చేసేందుకు భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయటం కూడా పరిపాటిగా మారింది అని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ డిమాండ్లలో అత్యధికంగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం ప్రస్తావించింది.గృహ హింస ఫిర్యాదులతో రంగంలోకి దిగే పోలీసులు కూడా భర్త తరఫు బంధువుల్లో వృద్ధులను, అనారోగ్యంతో ఉన్నవారిని సైతం అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారని, ఈ ఘటలన్నీ ఒకే చైన్ సిస్టమ్ మాదిరిగా ఉంటాయని పేర్కొంది.విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది... తీవ్ర మనస్పర్థలతో విడివిడిగా నివసిస్తోన్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భార్యకు శాశ్వత భరణం నెలలోగా చెల్లించాలన్న కింది కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఆ భర్త పై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడం గమనార్హం.తన భర్తకు రూ.5వేల కోట్ల ఆస్తులున్నాయని, అతని తొలి భార్యకు రూ500 కోట్లను భరణంగా ఇచ్చారు కనుక తనకూ అదే స్థాయిలో చెల్లించాలన్న పిటిషనర్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన రూ.12 కోట్ల భరణాన్ని ఖరారు చేసింది. -
నైన్‌వేద్యాలు
మంచి పెంచు స్వామీ.సంపద ఇవ్వు స్వామీ.సంతోషం పంచు స్వామీ.సోదరభావం నేర్పించు స్వామీ.దానాన్ని బోధించు స్వామీ.సంస్కారం అలవర్చు స్వామీ.దయను కలిగించు స్వామీ.స్వస్థత చేకూర్చు స్వామీ.శాంతిని ప్రసాదించు స్వామీ.తొమ్మిది నైవేద్యాలు స్వీకరించి నవ జీవనాన్ని దయ చేయి తండ్రీ. పాల తాలికలు కావలసినవి: పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; సగ్గు బియ్యం – 50 గ్రా.; బియ్యం – పావు కేజీ; జీడి పప్పు – 50 గ్రా.; నెయ్యి – 6 టీ స్పూన్లు; ఉప్పు – చిటికెడు తయారీ ∙ముందురోజు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు శుభ్రంగా ఒంపేసి, పొడి వస్త్రం మీద బియ్యం ఆరబోసి, బియ్యంలోని తడి పోయిన తరవాత, మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఈ పిండికి బెల్లం పొడి, వేడి పాలు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙ కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని సన్నగా పొడవుగా తాలికలుగా ఒత్తి పక్కన ఉంచాలి ∙ఒక మందపాటి గిన్నెలో లీటరు పాలకు కప్పుడు నీళ్లు జత చేసి, సగ్గుబియ్యం కూడా వేసి స్టౌ మీద ఉంచి, సగ్గు బియ్యం ఉడికేవరకు మరిగించాక, తయారుచేసి ఉంచుకున్న తాలికలను పాలలో వేసి జాగ్రత్తగా కలపాలి ∙ చివరగా బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలి ∙చల్లగా అందించాలి. పప్పు ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పెసర పప్పు – ఒక కప్పు (నానబెట్టి, నీరు ఒంపేయాలి); బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి కలుపుతుండాలి ∙పిండి గట్టిపడ్డాక బాణలి దింపేసి, పిండి కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙నానబెట్టి ఉంచుకున్న పెసర పప్పును వేసి కలపాలి ∙బెల్లం పొడి జత చేసి మరోమారు కలిపి, తగినన్ని నీళ్లు జత చేయాలి ∙పెసర పప్పు బాగా ఉడికిన తరవాత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న చిన్ని చిన్ని ఉండ్రాళ్లను ఇందులో వేసి కలిపి దింపేయాలి ∙అంతే పప్పు ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే. ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; సెనగ పప్పు/పెసర పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద మందపాటి ఇత్తడి గిన్నె కాని బాణలి కాని ఉంచి వేడి చేయాలి ∙వేడెక్కిన తరవాత టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేయించాలి ∙శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసి బాగా వేయించాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి ∙సెనగపప్పు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యపు రవ్వ వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙మంట బాగా తగ్గించి, మూత పెట్టాలి ∙ మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బాగా ఉడుకుపడుతుండగా టేబుల్ స్పూను నెయ్యి వేసి కలపాలి ∙ పూర్తిగా ఉడికిన తరవాత గిన్నె/బాణలి దింపేసి ఉడికిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.చల్లారాక కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గుండ్రంగా ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఫ్రైడ్ మోదక్ కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని ఫిల్లింగ్ కోసం: బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు. పైభాగం తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ: ∙ఫిల్లింగ్ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి. మోదకాల తయారీ: ∙గోధుమపిండి మి్రÔ¶ మాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్నిపక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙ బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. చాకొలేట్ మోదక్ కావలసినవి: పచ్చి కోవా – ఒక కప్పు (సన్నగా తురమాలి); చాకొలేట్ చిప్స్ – అర కప్పు; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి – కొద్దిగా గార్నిషింగ్ కోసం: పిస్తా పప్పుల తరుగు – రెండు టీ స్పూన్లు; గులాబీ రేకలు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడి చేసి, మంట బాగా తగ్గించి పచ్చి కోవా తురుము వేసి, ఆపకుండా కలుపుతుండాలి ∙కోవా కరగడం మొదలైన తరవాత, పంచదార పొడి వేసి బాగా కలిపాక, చాకొలేట్ చిప్స్ వేసి వెంటనే కలిపేయాలి ∙చాకొలేట్ చిప్స్ కరిగి, మిశ్రమం చిక్కబడుతుండగా ఏలకుల పొడి వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిశ్రమం మరీ గట్టిపడకుండా చూసుకోవాలి ∙ఉడుకుతున్న మిశ్రమం అంచులను విడవగానే, ఒక పాత్రలోకి తీసుకుని, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙మోదక్ మౌల్డ్స్ తీసుకుని ఒక్కో ఉండను అందులో ఉంచి జాగ్రత్తగా మూత తీసి మోదకాలను, నెయ్యి పూసిన ప్లేట్లో ఉంచాలి ∙గులాబీ రేకలు, పిస్తా తరుగు తో అందంగా అలంకరించి, వినాయకుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా సేవించాలి (ఇష్టపడేవారు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా కూడా తినొచ్చు. వీటిని త్వరగా తినేయాలి, లేదంటే చాకొలేట్ కరిగిపోయే అవకాశం ఉంటుంది) డ్రైఫ్రూట్స్ మోదక్ కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – పావు టీ స్పూను మోదక్ ఫిల్లింగ్ కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కోవా – 100 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; బాదం పప్పులు – పావు కప్పు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; చిరోంజీ – ఒక టేబుల్ స్పూను; ఖర్జూరాల తరుగు – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – పావు కప్పు. తయారీ: ∙ఒక పాత్రను స్టౌ మీద ఉంచి వేడయ్యాక నీళ్లు పోసి మరిగించాలి ∙పావు టీ స్పూను ఉప్పు వేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరుగుతుండగా మంట తగ్గించి, బియ్యప్పిండి వేస్తూ కలపాలి ∙కొద్దిగా ఉడికించి వెంటనే దింపేయాలి ∙ఉడికిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙పిండి బాగా చల్లారాక చేతితో బాగా కలిపి మూత పెట్టి పావు గంట సేపు పక్కన ఉంచాలి. డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ తయారీ: డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙తరిగి ఉంచుకున్న బాదం పప్పులు, జీడి పప్పు పలుకులు, పిస్తా, ఖర్జూరం, చిరోంజీ, కిస్మిస్లను వేసి రెండు నిమిషాల పాటు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙గసగసాలు వేసి చిటపటలాడేవరకు వేయించి డ్రైఫ్రూట్స్‌తో పాటు పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కోవా వేసి బాగా కలపాలి ∙కోవా కరుగుతున్న సమయంలో పావు కప్పు పంచదార వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం ఉడుకుపట్టగానే, పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, గసగసాలు వేసి కలిపి దింపేసి, మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి. మోదకాల తయారీ: ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఒత్తాలి ∙డ్రైఫ్రూట్స్ మిశ్రమం కొద్దిగా తీసుకుని అందులో ఉంచి, అన్నివైపులా మూసేయాలి (మౌల్డ్స్‌లో చేసుకుంటే చూడటానికి బాగుంటాయి) ∙అన్నీ తయారుచేసుకున్నాక ఇడ్లీ స్టాండులో ఉంచి, స్టౌ మీద పెట్టి ఆవిరి మీద ఉడికించి దింపేయాలి. కొబ్బరి ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – రుచికి తగినంత; నూనె – ఒక టీ స్పూను; పంచదార – 3 టేబుల్ స్పూన్లు; పాలు – 3 కప్పులు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకులు – 2 (పొడి చేయాలి); కిస్మిస్ – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద మందపాటి పాత్ర పెట్టి వేడి చేయాలి ∙నీళ్లు పోసి మరిగించాక, ఉప్పు జత చే సి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి మరోమారు కలపాలి ∙నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి మంట తగ్గించి, పిండి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙పిండి ఉడికి బాగా గట్టిపడ్డాక దింపి, చల్లారనివ్వాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద మరో బాణలి పెట్టి, వేడయ్యాక పాలు పోసి మరిగించాలి ∙పంచదార, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్న ఉండ్రాళ్లను పాలలో వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ∙కొద్దిగా పాలలో టేబుల్ స్పూను బియ్యప్పిండి వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేయాలి ∙జీడి పప్పులు వేసి మరోమారు కలియబెట్టాలి ∙కొద్దిగా ఉడుకుçపట్టాక కొబ్బరి తురుము వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి. ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీస్పూను; జీడి పప్పు – కొద్దిగా; సార పలుకులు – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, సార పలుకులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు మరిగిన వెంటనే టీ స్పూను పంచదార వేసి కలపాలి ∙బియ్యప్పిండి (కొద్దిగా పిండి పక్కన ఉంచుకోవాలి) వేసి కలపాలి ∙పిండి ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ, పిండి గట్టి పడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙వేరే బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙ఒక కప్పు పంచదార వేసి కరిగించాలి ∙కొద్దిగా ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల వలన సువాసన వస్తుంది ∙పాలు మరిగి చిక్కబడేవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్నచిన్న ఉండ్రాళ్లను మరుగుతున్న పాలలో వేయాలి ∙పక్కన ఉంచుకున్న బియ్యప్పిండిని కొద్దిగా చన్నీళ్లలో వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేసి మరోమారు కలియబెట్టాలి ∙చివరగా... వేయించి ఉంచుకున్న జీడి పప్పులు, సార పలుకులను వేసి బాగా కలిపి దింపేయాలి ∙వినాయకుడికి నివేదన చేసి సేవించాలి. పూర్ణం కుడుములు కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేయాలి ∙బాణలిలో బెల్లం, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించాలి ∙పాకం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి ∙పొడి చేసి ఉంచుకున్న సెనగపప్పును వేసి కలియబెట్టాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం దగ్గరపడేవరకు ఆపకుండా కలిపి దింపేయాలి ∙చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.వేరొక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిగా నెయ్యి జత చేసి కలపాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి బాగా కలిపి ఉడికించాలి ∙ఉడికిన పిండిని ఒక పళ్లెంలోకి తీసి, చేతితో మెదుపుతూ ఉండలా చేయాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకోవాలి ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా తీసుకుని చేతితో ఒత్తాలి ∙సెనగ పప్పు + బెల్లం ఉండను మధ్యలో ఉంచి బియ్యప్పిండితో మూసేసి నున్నగా చేసి పక్కన ఉంచాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ స్టాండ్‌లో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ∙ఉడికిన తరవాత దింపేసి, బయటకు తీసి, చల్లారాక తినాలి. -
గృహస్థు అతిథి పూజలో తరించాలి
మీ ఇంట పెళ్ళి జరగబోతున్నది. శుభలేఖ వేస్తారు. అందులో ‘మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ’ అని రాస్తారు. అయ్యా! మంగళములను అపేక్షించి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీవంటి పెద్దల పాద స్పర్శచేత మా మంటపం పునీతమవుతుందన్న భావనతో ‘మదర్పిత చందనతాంబూలాది సత్కారాలు గ్రహించి మమ్మానందింప చేయ ప్రార్థన’ అని కూడా రాస్తారు. చందనతాంబూలాది... అన్న తరువాత మళ్ళీ విందు అనీ, ఇంకోటి అని రాయడం ఎందుకు? చందనం అంటే... దేవతార్చన, పిదప భోజనం... తరువాత లేచి వెళ్ళబోయేముందు చందనం రాసుకుని లేస్తారు. కాబట్టి పెద్దలయిన అతిథులొచ్చారంటే గౌరవసూచకంగా ఓ తాంబూలం చేతిలో పెడతారు. తాంబూలమంటే మళ్ళీ రు.1116/–లా ? రు.116/–లా అని అడక్కండి. తమలపాకులు, రెండు అరటిపళ్ళు, రెండు వక్కలు చాలు. తాంబూలమిచ్చారంటే గౌరవమిచ్చారని గుర్తు. విరాటపర్వంలో–బృహన్నలరూపంలో అర్జునుడు వస్తే ఆయన తేజస్సును చూసి విరాట్‌రాజు–‘చూస్తే బృహన్నల. కానీ గొప్ప క్షత్రియుడిలా ఉన్నాడు. ఈయన సామాన్యుడు కాడు.’ అని ఉత్తరని పిలిచి తాంబూలం ఇవ్వమంటాడు. అది గౌరవ చిహ్నం. ఇక పెళ్ళిమంటపంలో వధూవరులిద్దరూ ఒకళ్ల కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకున్న ఘడియే సుముహూర్తం. ‘‘అయ్యా! మీరందరూ ఇది శుభముహూర్తం’’ అనండి అని అడుగుతారు. అప్పుడు అతిథులందరూ లేచి ‘ఇది శుభముహూర్తమే’ అని ముందుకొస్తారు. నడుం విరగని బియ్యానికి పసుపురాసి మీ చేతిలో పెడితే మీరు అతిథి దేవుళ్ళు కనుక మీరు చేసిన భగవదారాధన వలన మీరు స్మరించి మీ శక్తితో ఆ అక్షతలను వధూవరుల మూర్ధన్య స్థానమందువేస్తే వారికి అభ్యున్నతి కలిగి దీర్ఘాయుష్మంతులవుతారు. ‘మీరలా చేయడంవల్ల మా వంశం నిలబడుతుంది. అందుకని మీరు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయాలి కనుక చందనం ఇస్తాను. అంటే భోజనం పెట్టి తాంబూలం ఇస్తాను. కనుక మీరు దయతో రావలసింది’ అని ప్రేమతో పిలిచారని అర్థం. తీరా వారు వచ్చిన తరువాత పెళ్ళికి పిలిచిన పెద్దలు అతిథులను వారి మానాన వారిని వదిలేసి వీడియో బృందం సేవల్లో మైమరిచిపోతుంటే, వధూవరులు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూసుకోకుండా మెడతెగిన కోడిపెట్టల్లా వీడియో కెమెరాలకేసి చూస్తుంటే, కర్ణుడు కవచకుండలాలను వదలకుండా వెంటేసుకుని తిరిగినట్లు.. వచ్చిన అతిథులు కూడా పాదరక్షలతోపాటూ మంటపం ఎక్కి క్యూలైన్లలో తరించి పోతుంటారు. చుట్టూ కమ్ముకున్న వీడియోగ్రాఫర్ల మధ్యనుంచి పెళ్ళితంతు చూడలేక, భోజనాల దగ్గర కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని నిలబడలేక, కూర్చోలేక, తినలేక, తినకుండా ఉండలేక, గొంతుపట్టుకుంటే నీళ్ళు తాగలేక ఇటూ అటూ తిరిగే అతిథులది దిక్కుమాలిన స్థితి. అది ఈ జాతి సంస్కారం కానే కాదు. ఈ జాతి లక్షణం కూడా కాదు. ఎక్కడినుంచో ఎవడో దిగుమతి చేసేశాడు. అంటువ్యాధిలా వ్యాపించిపోయింది. ప్రేమగా అతిథులను పలకరిస్తూ కూర్చోబెట్టి వడ్డించి పెట్టడం ఈ జాతి ధర్మం. అంతే తప్ప పెళ్ళికి పిలిచి, ఆశీర్వచనానికి పిలిచి చందనతాంబూలాలిస్తాం రమ్మనమని పిలిచి– అతిథిని పట్టించుకోకపోతే ఎలా? అన్నం ఎక్కడా దొరకదని అతిథి అక్కడికి రాలేదు కదా! నువ్వే పిలిచావు. అతిథిని పిలిచి నిర్లక్ష్యం చేయకూడదు. అలా చూసుకోలేనప్పుడు పిలవకూడదు. కనుక గృహస్థు అనేవాడు ఇంట్లో అయినా, శుభకార్యంలో అయినా సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం అయిన అతిథి పూజలో తరించాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వివాహం... సంస్కారం
ఆత్మీయం మన ప్రాచీన ఋషులు వివాహ సంస్కారాన్ని పరమపవిత్రంగా, ఉత్కృష్టమైనదిగా మలచి, దానిని మహోన్నతమైన ఆశయాలతో నింపి దాంపత్య జీవితం ఆవశ్యకతను ఉద్బోధించారు. వివాహ సంస్కారం దంపతుల శరీరాలనేగాక ఆత్మ, మనస్సు, ప్రాణం... అన్నింటినీ ఏకం చేస్తుంది. ఇదే వివాహ సంస్కారంలోని విశేషం, ఉద్దేశం. ఆదర్శమైన గృహస్థ«ధర్మంతో మోక్షాన్ని పొందడమే వివాహంలోని అంతిమలక్ష్యం. సత్సంతానాన్ని కని, పితృరుణ విముక్తుడు కావడం కూడా వివాహ ఆదర్శాలలో ఒకటి. వివాహ సంస్కారం వధూవరులను విచ్చలవిడితనం నుంచి వేరుచేస్తుంది. ధర్మార్థకామాలను సన్మార్గంలో అనుసరించేలా ప్రేరేపిస్తుంది. ఆలుమగలలో పరస్పర ప్రేమను కలిగించి, గృహస్థ జీవితాన్ని ఆనందమయం చేస్తూ, సంతానాన్ని కలిగించి ఆధ్యాత్మికోన్నతికి కారణమౌతుంది. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి బలం ఏర్పడుతుంది. గుర్తింపు, గౌరవమర్యాదలు లభిస్తాయి. అందువల్ల సహజీవన సంస్కృతికన్నా వివాహ సంప్రదాయానికే పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిని గౌరవించడం మన సంస్కారం. -
ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ
లీగల్ స్టోరీస్ ప్రేమ ఒక బంధమే. కానీ అది కూడా ఒక విపరీత బంధానికి దారితీయవచ్చు. ఒక కొమ్మకు పుట్టిన పిల్లలు వరసలు తెలియక ప్రేమలో పడితే?! సంప్రదాయం వద్దంటోంది. సంస్కారం కాదంటోంది. మరి చట్టం ఏమంటుంది? ‘‘ఆనందా... గుడ్ న్యూస్ డియర్’’ శ్రీరామ్ వాయిస్‌లో ఆనందం.‘‘మీవాళ్లు ఒప్పుకున్నారా?’’ ఇవతల ఆనంద గొంతులో ఆత్రుత.‘‘ఊ.... ఒప్పుకున్నారు..’’ ఆ స్వరంలో ధీమా.‘‘హూ..’’ ఓ భరోసాతో నిట్టూర్చింది ఆనంద.‘‘నిన్ను ఎల్లుండి కలుస్తామన్నారు అమ్మానాన్న..’’ చెప్పాడు. ‘‘అవునా... అయితే తాతయ్యతో చెప్పేస్తాను ఈ రోజే’’. ‘‘చెప్పేయ్.. కాని హడావిడి పడకు.. పెద్దాయన్ని హడావిడి పెట్టకు. జస్ట్ నిన్ను చూసి పెద్దాయనతో మాట్లాడి వెళతారు అంతే.. ఓకేనా?’’ అన్నాడు శ్రీరామ్.‘‘ఒకే బాస్..’’ ఆనందలో సంతోషం.‘బై మరి..’ అంటున్న శ్రీరామ్‌కి ‘బై’ అంటూ ఆన్సర్ చేసింది. ఇద్దరి ఫోన్లు డిస్కనెక్ట్ అయ్యాయి.ఆనందకి ఆనందం మామూలుగా లేదు. ఎక్కడా కాలు నిలవడం లేదు. శ్రీరామ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు. అంటే త్వరలోనే శ్రీరామ్‌కి భార్య కాబోతుంది. ఆ ఊహ ఆమె కళ్లల్లో ఓ మెరుపుని తెచ్చింది. మదిలో జ్ఞాపకాలను తట్టిలేపింది. ‘ప్రొఫైల్స్’.. కలిపాయి ఇద్దరినీ ఆనంద కృష్ణ... ఫేస్బుక్లో ఓ మ్యూచువల్ ఫ్రెండ్ పోస్ట్‌కి కామెంట్ పెట్టింది. ఆమె సోషల్ కాన్షస్కి ముగ్ధుడయ్యాడు శ్రీరామ్. ఆ పేరును క్లిక్ చేసి ఆమె పేజీని ఓపెన్ చేశాడు. ప్రతి పోస్ట్‌లో కనిపించిన ఆమె ఆలోచన, అభిరుచి, అవగాహన ఆయనను ఆనందకు కట్టిపడేశాయి. ఆమె ప్రొఫైల్ పిక్ ఆయనను ఫిదా చేసింది.బ్యూటీ విత్ బ్రెయిన్! మురిసిపోయాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నాలుగు రోజులకు గానీ రెస్పాన్స్ రాలేదు ఆనంద నుంచి... యాక్సెప్ట్ చేస్తూ! ముందు హలో.. హాయ్ అంటూ పలకరింపు పర్వం. అతి కొద్ది రోజుల్లోనే వీళ్ల ప్రేమతో ఇన్‌బాక్స్ సిగ్గు పడడం మొదలెట్టింది. శ్రీరాం ఓ యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్. ఆనంద ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. మంచి క్లాసికల్ డాన్సర్. ఆయన సోషల్ సర్వీస్‌లో మేటి. ఆయన స్లమ్స్‌లో సర్వీస్ ఇచ్చే చోట ఆ పిల్లలకు స్వచ్ఛందంగా డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది. దాంతో శ్రీరామ్‌కి ఆనంద మీద మరింత ప్రేమ పెరిగింది. గౌరవమూ ఇనుమడించింది. తను జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుందని ఆశపడ్డాడు. ఆ ఆశను ఆమె ముందు ఎక్స్‌ప్రెస్ చేశాడు. శ్రీరామ్ తనకన్నా మూడేళ్లు చిన్నవాడు. ఆ సంశయాన్నే వెలిబుచ్చింది ఆనంద. అదసలు మ్యాటరే కాదన్నాడు. రెండు రోజులు ఆలోచించుకునే టైమ్ అడిగింది. మూడో రోజు ‘ఎస్’ అని చెప్పింది. పెళ్లిచూపులకు ఏర్పాట్లు శ్రీరామ్ ఆనందానికి అవధుల్లేవ్ ఆరోజు. ఆనందను తలచుకొని గర్వంగా ఫీలయ్యాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే. ఆలోచనలు సరే... అలవాట్లూ ఒకటే! ఆ విషయంలో చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడు శ్రీరామ్. మొత్తానికి తనతో పెళ్లికి ఆనంద ఒప్పేసుకుంది. ఆనందకు అమ్మానాన్న లేరు. తాతే ఆమెను పెంచాడు. ఆయన ఆమెకు ఓ స్నేహితుడు. అన్నీ షేర్ చేసుకుంటుంది. శ్రీరామ్ విషయమూ చెప్పింది. చూస్తాను అన్నాడు. ఇంటికి తీసుకెళ్లింది. పిల్లాడు నచ్చాడు పెద్దాయనకు. ఆయన తల్లిదండ్రులకు విషయం చెప్పి వారిని ఇంటికి తీసుకురమ్మన్నాడు. శ్రీరామ్ ఉండేది ముంబైలో. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటారు. కిందటి వారం హైదరాబాద్ వెళ్లినప్పడు చెప్పాడు. వివరాలు అన్నీ విని.. ‘వీలు చూసుకొని వస్తాం’ అన్నారు. తర్వాత అతడి పేరెంట్స్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది వస్తున్నట్టుగా. వెంటనే ఆనందకు చెప్పాడు.జ్ఞాపకాల్లోంచి వాస్తవంలోకి వచ్చింది ఆనంద. శ్రీరామ్ చెప్పిన శుభవార్తను తాతయ్యకు అందించింది. శ్రీరామ్ కుటుంబాన్ని రిసీవ్ చేసుకునే ఏర్పాట్లలో పడిపోయారు తాతా మనవరాలు ఆ క్షణం నుంచే...! ఊహించని పరిణామం శ్రీరామ్ చెప్పిన ఎల్లుండి రానేవచ్చింది. ఇల్లంతా నీట్‌గా సర్దింది. సర్దినవాటిని వందసార్లు సరిచూసుకుంది. మనవరాలి ఆరాటం చూసి తాతయ్య ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఈలోపు కాలింగ్ బెల్ మోగనే మోగింది. ఆత్రంగా వెళ్లి తలుపు తీసింది ఆనంద. ఎదురుగా చిలిపిగా నవ్వుతూ శ్రీరామ్... అతని వెనకాలే మొహాల మీద చిరునవ్వులతో ఆయన తల్లిదండ్రులు ‘రండి రండి...’ అంటూ అంతే ఆత్రంగా లోనికి ఆహ్వానించింది. హాల్లో సోఫా చూపిస్తూ కూర్చోండి అంది. ఆనంద తాతయ్య వచ్చి త్రీ సీటర్ సోఫాకు ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్‌లో కూర్చున్నాడు. అక్కడే నిలబడ్డ ఆనందను చూస్తూ వాళ్లకు కాస్త మంచినీళ్లు తెచ్చివ్వమ్మా అంటూ మనవరాలిని పురమాయించాడు. వచ్చిన వాళ్లను పరిచయం చేసుకుందామని ఇటు తిరిగాడు. శ్రీరామ్ తల్లిని చూడగానే ఒక్కక్షణం ఆగిపోయాడు ఎందుకో ఆ పెద్దాయన! ఆయనను చూసిన శ్రీరామ్ తల్లిలో కూడా ఇంచుమించు అదే భావం. అమ్మా... నువ్వు శోభ కదూ... అన్నాడు అనుమానం నివృత్తి చేసుకుందామని. అర్థమైపోయింది... శోభకు విషయం మొత్తం అర్థమైపోయింది. మామయ్యా... మీరు... ఆనంద... అంటూ ఆగిపోయింది. కాళ్లు చేతులు చల్లబడ్డాయి. మెదడు మొద్దు బారిపోయింది. అడుగు ముందుకు పడడం లేదు. పాలిపోయిన మొహంతో కొడుకును, భర్తను చూసింది. శ్రీరామ్ తల్లి వైపు, తండ్రి వైపు అయోమయంగా చూశాడు. భార్య స్థితి అర్థమైన శ్రీరామ్ తండ్రి... కొడుకును బయటకు తీసుకెళ్లాడు. నాటి కూతురే.. నేటి కోడలు! ‘‘శ్రీరామ్... నాతో పెళ్లికి ముందే మీ అమ్మకు పెళ్లయింది. ఓ కూతురు కూడా. ట్రైన్ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. అప్పటికి వాళ్లకు యేడాదిన్నర బిడ్డ. ఆ షాక్‌తో మీ అమ్మ సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఆర్నెల్లు పిచ్చిదానిలాగే ఉంది. ఇక్కడ ఉంచితే లాభంలేదు ఎప్పటికీ కోలుకోదని వాళ్ల మేనమామ అమెరికా తీసుకెళ్లాడు. ఆ బిడ్డను శోభ వాళ్ల అత్తగారు, మామగారే ఉంచేసుకున్నారు. మీ అమ్మమ్మ వాళ్లు అడిగినా ఇవ్వలేదు. కొడుకు జ్ఞాపకంగా ఉంటుందని తమ దగ్గరే పెట్టుకున్నారు. శోభ యూఎస్‌లోనే ఉండిపోయింది. నయం అయ్యాక కూతురి కోసం చాలానే తాపత్రయ పడింది. కాని పెద్దవాళ్లు సర్ది చెప్పి అక్కడే యూఎస్‌లో వాళ్ల మేనమామ ద్వారా ఉద్యోగం ఇప్పించారు. ఆ కంపెనీలోనే నేనూ జాబ్ చేసేవాడిని. అలా ఇద్దరం లవ్ లో పడ్డాం. పెళ్లి ప్రస్తావన తెచ్చాను. అప్పుడు చెప్పింది మీ అమ్మ.. తనకు అంతకు ముందే పెళ్లయిన విషయం, ఓ కూతురూ ఉన్న సంగతి. అయినా నాకేం అభ్యంతరం లేదన్నాను. పెళ్లి చేసుకున్నాను. తర్వాత నేను, మీ అమ్మ ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని తెచ్చేసుకోవాలని చాలా ప్రయత్నించాం. ఆ పాప నానమ్మ, తాతయ్యను కలిశాం. వాళ్లు ససేమీరా అన్నారు. చేసేదేం లేక అమెరికా తిరిగి వెళ్లిపోయాం. యేడాదికి నువ్వు పుట్టావ్. లైఫ్ బిజీలో పడిపోయాం. అదిరా వివరం. అందుకే ఈ పెళ్లి కుదరదు’’ అని చెప్పాడు శ్రీరాం తండ్రి. హతాశుడయ్యాడు శ్రీరాం. ఉన్న చోటనే కూలబడిపోయాడు. చట్టం ఏం చెబుతోందంటే... హిందూవివాహ చట్టం 1955, సెక్షన్ 5 పెళ్లికి కొన్ని షరతులు విధిస్తోంది. పెళ్లి సమయానికి వధూవరుల్లో ఎవరికైనా అంతకుముందే పెళ్లయి ఉండి, ఆ భాగస్వామి బతికున్నా, విడాకులు ఇవ్వకపోయినా ఆ పెళ్లి చెల్లదు. ఆచార వ్యవహారాలు అనుమతించినప్పడు తప్ప నిషేధించిన బంధుత్వం ఉండకూడదు, సపిండులు కాకూడదు. పై షరతులకు విరుద్ధంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. వీటినే వాయిడ్ మ్యారేజెస్ అంటారు. సెక్షన్ 11 ప్రకారం ఇలాంటి పెళ్లిళ్లను రద్దు చేయొచ్చు. వేరువేరు తండ్రుల ద్వారా ఒకే తల్లికి పుట్టిన పిల్లల సంబంధాన్ని ఏకోదర రక్తసంబంధం అంటారు. పైన కేస్‌లోని శ్రీరామ్, ఆనందల బంధం దీని కిందికే వస్తుంది. కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. సంపూర్ణ రక్త సంబంధం అంటే... ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య, అసంపూర్ణ రక్త సంబంధం... అంటే ఒకే భర్తకు వేరువేరు మహిళల ద్వారా పుట్టిన పిల్లల మధ్య, ఏకోదర రక్తసంబంధం ఉన్న పిల్లల మధ్య వివాహాలు నిషిద్ధం. – ఇ. పార్వతి,అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
ప్లీజ్ స్టాప్
నలుగురిలో పీకుడు.. గీకుడు.. గోకుడు ఇంగ్లిష్‌లో ‘ఎటికెట్’ అంటారు. తెలుగులో ‘సంస్కారంతో కూడిన పద్ధతి కలిగిన మర్యాద’ అని అర్థం కావచ్చు. మాట్లాడేటప్పుడు ముఖం చూస్తూ మాట్లాడాలి. ముఖం మీద పడి కాదు.దురద పుడితే మనం ఇబ్బంది పడాలి. అదేపనిగా గోక్కుంటూ ఉంటే ఎదుటివారు కాదు. మర్యాదస్తులం అని మనల్ని మనం అనుకోవచ్చు. కాని ఇతరులు మనల్ని మర్యాదస్తులని అనుకోవాలి. ఇది చదివి నవ్వితే నవ్వారు. మీ తుంపర్లతో పేపర్‌ను తడపకండి. మిగిలిన వాళ్లు చదివి నవ్వుకుంటారు. దశకంఠనాదం మానండి రాత్రి పూట మీరు టీ షర్ట్ పైజామా వేసుకుని పడుకుంటారని మీకు మాత్రం తెలిస్తే చాలు. తెల్లారి లేచాక వాటి మీదే కారిడార్లలో తిరక్కండి. ముఖ్యంగా జుట్టు దువ్వకుండా బ్రష్ చేసుకోకుండా నిద్ర ముఖంతోటే పిల్లలను స్కూల్‌బస్ ఎక్కించడానికి ప్రయత్నించకండి. ఇది మీకు ఇంపుగా ఉన్నా చాలామందికి కంపుగా ఉంటుంది. మరికొందరు బాత్రూమ్లో బ్రష్ చేశాక గొంతు శుభ్రం చేసుకోడానికి పెద్దగా క్యాకరించడం మొదలుపెడతారు. మన క్యాకరింపు మనకు మాత్రమే వినపడితే చాలు. బెజవాడలో మీరు క్యాకరిస్తున్న విషయం కర్నూలు వాళ్లకు తెలియాల్సిన పని లేదు. ఎల్లో పెయింట్ మానండి మీకు చట్నీ ఇష్టం అన్న విషయం మీకు మాత్రమే తెలియనివ్వండి. స్నేహితులతో, పరిచయస్తులతో బ్రేక్‌ఫాస్ట్‌కు కూచున్నప్పుడు రెండు మూడు గరిటెల చట్నీ కుమ్మరించుకుని అది చాలదన్నట్టు వేళ్లన్నిటికీ పెయింట్‌లా పూసుకోకండి. స్పూన్ వాడటం మంచిదే. కాదంటే ఇడ్లీ తుంచడానికైనా పూరీ తుంచడానికైనా మునివేళ్లు చాలు. పిసికి పిసికి మీ గుప్పిటబలం చూపకండి. మరొకటి- తిన్నది తృప్తి కలిగించిందని మీకు తెలిస్తే చాలు. బ్రేవ్‌మని బస్సు హారన్‌ని కంగారు పెట్టకండి. అలాంటి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే కాస్త పక్కకువెళ్లి చేయండి. మీ పెర్ఫ్యూమ్ మీకే ముద్దు ప్రతి శరీరానికి ఒక పరిమళం ఉంటుంది. అది మీకు మాత్రమే పరిమళం కావచ్చు. ఆ సెంట్‌ను మీరే ఉంచుకోండి. కాని నలుగురిలోకి వచ్చేటప్పుడు మీ బట్టల నుంచి, శరీరం నుంచి మంచి వాసన రాకపోయినా అసలు ఏ వాసనా రాకుండా చూసుకోండి. కాలుష్యం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక రోజు వేసుకున్న బట్టలు ఒకరోజుకే అని గ్రహించండి. వ్యక్తిగత శుభ్రత, బాహు మూలాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా మీకు తెలియని శుభ్ర సంస్కారం ఇస్తుంది. పాటించండి. భూమ్యాకాశాలు వద్దు వాన కురిసేటప్పుడు ఆకాశం వైపు చూడండి. రోడ్డు బాగలేనప్పుడు కింద చూస్తూ నడవండి. అంతే తప్ప ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆకాశం వైపో నేలవైపో చూడకండి. ముఖం వైపు చూస్తూ మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నారో వారితోనే మాట్లాడండి. మీరు సురేష్‌తో మాట్లాడుతుంటే గీత, అనిత, రాధిక, కాస్త దూరంగా ఉన్న మల్లేశ్, ప్రభాకర్... ఇంతమందికి వినపడాల్సిన పని లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఎదుటివారు చెప్పేది కూడా వినండి. నోరు ఒక్కటే. చెవులు రెండు. గమనించండి. అలాగే మీద పడిపోతూ మాట్లాకండి. దూరంగా నిలబడీ మాట్లాడకండి. ఎంతదూరంలో ఉంటే మర్యాదో అంతదూరంలో ఉండి మాట్లాడండి. మరొకటి- ఎదుటివాళ్లు స్నానం చేసే ఉంటారు. మీ నోటి తుంపర్లతో తిరిగి స్నానం చేయించకండి. పిన్ నంబర్ అడక్కండి పాతరోజుల్లో అంటే మనవాళ్లు చనువు భరించేవారు. ఇప్పుడు విసుక్కుంటున్నారు. కనుక ఎదుటివారిని మరీ కబళించుకుని తినేయకండి. మీ ఆయన బాగ చూసుకుంటున్నాడా, మీ ఆవిడతో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా పిల్లలు పుట్టలేదా, అయ్యో... ఒక్కడితోనే ఆపేశారా, అంత లావైపోయారు ఎందుకు, ఇంత సన్నగా ఉన్నారు ఏంటి... మీ అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చేసిందట నిజమేనా... మీ డెబిట్ కార్డ్ పిన్ నంబర్ ఎంత... ఇవన్నీ కూపీ లాక్కండి. ఎదుటివారు భరిస్తున్నారు కదా అని పీక్కుని తినకండి. అప్పుడు సమాధానం చెప్పినా ఆ తర్వాత మీరు ఈ వీధిలో వస్తుంటే వారు ఆ వీధిలో నుంచి తప్పుకుంటారు. బందిపోటు ముఠా అనుకోనివ్వకండి మనం ఎవరి ఇంటికైనా వెళుతూ ఉంటే వారు మనల్ని బందిపోటు ముఠా అనుకునే విధంగా ఉండకండి. మీ పిల్లలు ఆ ఇంటికి వెళ్లగానే కప్‌బోర్డులు లాగేసి, ఫ్లవర్‌వాజులు పగులగొట్టి, బిస్కెట్ ప్యాకెట్లు చింపి రేపర్లు నేలన పడేసి, సోఫాలు తొక్కి, టీవి మీద బంతి విసిరి... ఇన్ని ట్విన్‌టవర్ దాడులు చేసే విధంగా ఉండకుండా తర్ఫీదు ఇవ్వండి. మీరు కూడా సోఫాలో పద్ధతిగా కూచోండి. కాళ్లెత్తి టీపాయ్ మీద పెట్టకండి. కాస్త విశ్రాంతి తీసుకుంటానని వారి బెడ్రూముల్లోని మంచాల మీద నడుం వాల్చకండి. పూలు తుంచేయడం, కాయలు తెంచేయడం వంటి చేష్టలు వద్దు. భోజనం బాగలేకపోయినా బాగుందనే చెప్పండి. భాగుంటే మరిన్ని పోలికలు తెచ్చి చిన్నబుచ్చకండి. జాలిమ్ దుష్మన్ కాకండి దురదను అదుపు చేసుకోండి. ఎదుటివారి ముందు ఒళ్లు గీరుకుంటూ ఉండటం మర్యాద కాదని గ్రహించండి. తల గీరుకోవడం, నడుము గీరుకోవడం, ముక్కు గీరుకోవడం పోస్ట్‌పోన్ చేసి ఏకాంతంలో చేయండి. ఎదుటివారి ముందు పళ్లు కుట్టుకోకండి. ముక్కులో వేలు పెట్టి రుద్దుకోకండి. పళ్లలో చిక్కుకున్న పదార్థాల వేటకు చూపుడు వేలు బొటనవేలుతో బయలుదేరకండి. ముఖ్యంగా ఈ పనులన్నీ చేసి ఏదైనా ఆఫర్ చేయడమో, షేక్ హ్యాండ్‌కు చేయి సాచడమో అస్సలు చేయకండి. ఎదుటివారి ముందు తల దువ్వుకోవడం కూడా అంత మర్యాదకాదు. దువ్వి మనకు చుండ్రు ఉందన్న సంగతి వారికి చాటింపు చేయకండి. ఎడమ చేత్తో ఏదీ ఇవ్వకండి. ఎడమ చేత్తో ఏదీ తీసుకోకండి. సతీ సెన్సిబుల్‌గా ఉండండి ఎదుటివారు నాస్తికులు కావచ్చు. ఎందుకు అని అడక్కండి. ఆస్తికులు కావచ్చు. మరీ ఇంతగానా అని అభ్యంతర పెట్టకండి. మాంగల్యాలను మట్ట్టెలను వెతకడం, ఇష్టంలేకపోయినా బొట్టు పెట్టడం, పాపిటలో సిందూరం రుద్దడం చేయకండి. ప్రసాదాలు తినమని బలవంత పెట్టకండి. ఫలానా విధంగా లేకపోతే అరిష్టం అని భయపెట్టకండి. అలాగే ఎదుటివారి నమ్మకాలని మూఢవిశ్వాసాలుగా గేలి చేయకండి. గమనించండి. కొందరిని చూస్తే మనకు స్నేహం చేయబుద్ధవుతుంది. అంటే వారు తగిన మర్యాదలు పాటిస్తూ మనల్ని సౌకర్యంగా ఉంచుతున్నారని అర్థం. మనం కూడా ఎదుటివారి దృష్టిలో అలాగే ఉండాలని గ్రహించండి. ఎంతో మర్యాదగా ఇదంతా చదివినందుకు కృతజ్ఞతలు చెప్పనివ్వండి. థ్యాంక్యూ. - శశి వెన్నిరాడై -
సంస్కారం వారసత్వం
జీవన కాలమ్ ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్‌మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా? ప్రపంచ ప్రఖ్యాత శ్రీలంక క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ని ఒక పాత్రికేయుడు అడిగాడు, ‘‘ఆటలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పెంకిగా ప్రవర్తించడం మీద మీ అభి ప్రాయమేమిటి?’’ అని. సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం కారణం’ అన్నది మురళీధరన్ సమాధానం. ఈయన ఈతరం ఆటగాడు. బొత్తిగా కిందటి శతాబ్దపు దిక్కుమాలిన కారణం చెప్పాడేమిటి! మరో కారణం- తన కంటే సీనియర్స్ (పెద్దలు) అతన్ని సరిదిద్దకపోవడం. ఇదీ ఆశ్చర్యకరమైన సమాధానమే. నేను విజయవాడలో ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓసారి నీలంరాజు వేంకటశేషయ్య గారింట్లో విందుకి వెళ్లాను. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు, కాటూరి, రావూరి వెంకటసత్యనారాయణరావు గారూ- ఇలాంటి పెద్దలు ఉన్నారు. మాలాంటి కుర్రాళ్లం ఉన్నాం. మమ్మల్నందరినీ పేరు పేరునా పలకరించారు పింగళి. ‘పేరు?’ మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ‘ఎవర బ్బాయి తమరు!’ ‘ఫలానా పురాణం వెంకయ్యగారి కొడుకుని’ ‘అంటే రామయ్య మీకేమవుతారయ్యా?’ ‘తాతగారండి!’ వెంటనే ఆయన కళ్లలో మెరుపు. ‘నువ్వు మా రామయ్య మనవడివిరా!’ ఆనందం. అందరినీ ఇలా పేరుపేరునా పలకరించి, ‘ఏమండీ!’ అని ప్రారంభించి, ‘ఏమోయ్!’ దాకా ప్రయాణించి, ‘నువ్వుట్రా!’ అని ఆత్మీయంగా గుండెలకు హత్తుకునే దాకా ప్రశ్నలు సాగేవి. నేను చదువుకున్న చదువు, సాధించిన విజయాలూ కాదు, తెచ్చుకున్న వారసత్వం నా బ్యాంకు ఎకౌంట్. మరి నా ప్రతిభ? నా పరపతి? - నా ముందు తరానికి. ఆ కాలంలో కొత్త మనిషిని చూస్తే అడిగే మొదటి ప్రశ్న, ‘ఎవరబ్బాయివి బాబూ!’ అని. నా పరపతి నా తల్లిదండ్రులు నాకిచ్చిన వైభవం. దాదాపు 66 ఏళ్ల కిందట- మా పెత్తండ్రి కొడుకు- నాకు అన్నయ్య- పెళ్లి సంబంధం చూడడానికి మా అమ్మ, పిన్నితో వెళ్లాను. నాకప్పుడు పదేళ్లు. పెళ్లి కూతురుని కూర్చోపెట్టారు. పక్కనే ఎవరో అమ్మలక్కలు, తల్లి వగైరాలున్నారు. మా అమ్మ, పిన్ని పెళ్లికూతురుని చూశారు. తర్వాత ప్రశ్న, ‘తల్లి ఎవరు?’ ఆవిడ చిరునవ్వు నవ్వింది. ‘మీకెంత మంది పిల్లలు?’ పురుళ్లు ఎక్కడ పోసుకున్నారు? ఆరోగ్యం బాగుందా? చక్కెర, రక్తపోటు ఏమైనా ఉన్నాయా? మీ నాన్నగారేం చేసేవారు? - ఇవీ ప్రశ్నలు. ఇదేమిటి? ఎదురుగా పెళ్లి కూతురు కూర్చుంటే ముసలా విడతో పలకరింతలేమిటి? అని నాకు విచికిత్స. కాని పలకరించాల్సింది ఆవిడనే అని పాతికేళ్ల తర్వాత తెలిసివచ్చింది. వయసు గడిచి, పిల్లలు పుట్టాక- ఈ అమ్మాయి అక్షరాలా తల్లి రూపునీ, ఆరోగ్యాన్నీ, స్వభా వాన్నీ పుణికి పుచ్చుకుంటుంది. ఆవిడకి రక్తపోటు ఉందా? కీళ్ల నొప్పులు ఉన్నాయా? పురుళ్లు అయ్యాక ఒళ్లు వచ్చిందా? అక్షరాలా యథాతథంగా పిల్లకీ ఉంటుంది. అది జెనిటిక్ వారసత్వం. ఇది ఒక పార్శ్వం. వాళ్ల నాన్నగారు, ఆమె పుట్టింటినుంచి తెచ్చిన వారస త్వం. సామాజిక వారసత్వం. ఇవి ఎదురుగా కూర్చున్న పిల్లకి భవిష్యత్తులో పెట్టుబడులు. ఇది శాస్త్రీయమైన పరిణామం. హిరణ్యకశిపుడుకి ప్రహ్లాదుడు పుట్టడం, లీలావతి గర్భంతో ఉన్నప్పుడు చేసుకున్న పుణ్యం. అది మినహాయింపు. తర్వాత పెళ్లి జరిగింది. ఇద్దరూ 54 ఏళ్లు కాపురం చేశారు. మా అన్నయ్య వెళ్లిపోయాడు. ఇప్పటికీ 85 ఏళ్ల వదినెగారు పిల్లలతో, మనుమలతో, మునిమ నుమలతో నిక్షేపంగా ఉంది. పార్కుల్లో ప్రేమించి, ప్రేమ తమ హక్కని భావించి, ఆఫీసులలో కలసి పనిచేయడానికి ప్రేమని గుర్తు పెట్టుకున్న నేటి తరం యువత చాలా సందర్భా లలో పప్పులో కాలేయడం- సంవత్సరం తిరగకుండానే విడిపోవడం మనం చూస్తున్నాం. పెళ్లిలో ఇది ఒక పార్శ్వం. అమ్మాయి అందం, స్వభావం, దృక్పథం - ఇవన్నీ ఇద్దరూ ఒకటైతే మార్చుకోవచ్చు. కానీ సంప్రదా యం - అనుభవంతో రంగరించిన, తరతరాలు అందిం చిన వారసత్వానికి ప్రత్యామ్నాయం లేదు. దగ్గరతోవ లేదు. అదే క్రిస్ గేల్కీ, ముత్తయ్య మురళీధరన్కీ తేడా. ఆ విలువలే ఇవాళ ఏ కాస్తో వివాహ వ్యవస్థకి గొడుగు పడుతున్నాయి. ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్‌మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా? ఆస్తుల్ని దోచుకుంటున్న నాయకులా? మతాన్నీ, కులాన్నీ పణంగా పెట్టి రాజకీయ పబ్బాన్ని గడుపుకొంటున్న అవకాశవాదులా? ఇవాళ యువతరంలోని ‘అవ్యవస్థ’కి పెద్ద లోపం- భ్రష్టుపట్టిన పెద్దల వారసత్వం. ఇంతకీ ముత్తయ్య మురళీధరన్ చేసిన అపకారం నా కాలమ్‌కి పెట్టుబడి. - గొల్లపూడి మారుతీరావు -
చదువూ సంస్కారమూ...
మీరు విద్యార్థులు. విద్యను ఆర్జించేవారు. విద్యలో విద్ అంటే తెలుసుకొనుట. ఇది రెండు రకాలు. ఏది తెలుసుకోవడం వల్ల జీవితంలో సమస్త భోగాలు కలుగుతాయో, చాలా గొప్ప కీర్తి కలుగుతుందో, దేనివల్ల సమస్త సౌకర్యాలు జీవితంలో మనకు సమకూరుతాయో దానిని లౌకిక విద్య అంటారు. మరొకటి ఉంది. ఏది తెలుసుకొనడం వలన ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదో దానిని బ్రహ్మవిద్య అంటారు. లౌకిక విద్యాభ్యాసం వల్ల మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రభుత్వంలో కానీ, సమాజంలో కానీ సమున్నత స్థానం పొంది బాగా డబ్బు సంపాదించుకోగలుగుతారు,అలాగే కీర్తి ప్రతిష్ఠలు కూడా. కానీ రెండవది దాని కొరకు గాదు. అది దేని కొరకు అంటే... ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కొరకు. ఇప్పుడు మీరు లౌకిక విద్యయందున్నారు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఇది బ్రహ్మవిద్యకు దారితీయవచ్చు. విద్ అంటే చదువుకొనుట, తెలుసుకొనుట అని చెప్పుకున్నాం కదా ! దీనికి పక్కన మరొక మాట ఉంటుంది-సంస్కారం. చదువూ సంస్కారం ఉండాలండీ అంటూంటారు కదా! ఇక్కడ చదువు అంటే తెలుసుకొనుట, అది కూడా నిరంతర ప్రయత్నంగా. విద్యార్థి దశలో ఏం చేయాలో శాస్త్రం కచ్చితంగా చెప్పింది. విద్యాసముపార్జన తప్ప వేరొక్కటి కూడదు అన్నది. విద్యార్థి దశ అంతా చదువుకొనుటకే, తెలుసుకొనుటకే తప్ప మరిదేనికీ కాదు, చివరకు సేవకు కూడా కాదు. తెలుసుకోవలసినవన్నీ బాగా తెలుసుకున్న నాడు, ఉద్యోగంలోకి వచ్చిన రోజున, అంతకుముందు విద్యార్థి దశలో సేవ ఎలా చేయాలని తెలుసుకున్నారో అప్పుడు అలా చేయాలి. విద్యార్థి దశలో మాత్రం విద్యాసముపార్జనం తప్ప మరే కార్యక్రమం చేపట్టినా అది దోషభూయిష్ఠమే, శరాఘాతమే. సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డివిద్య అన్నారు. చదువు ప్రయోజనం నెరవేరడం కోసం, సంస్కారం ఏర్పడడం కోసం గురువుకీ శిష్యుడికీ మధ్య ఒక సంబంధం ఉంటుంది. శాస్త్రం గురువును వినీతుడు అంటుంది. అంటే వినయం నేర్పువాడు - అని. మరి శిష్యుడు... విధేయుడు. అంటే వినయం నేర్చుకొనువాడు. వినయం లేని ఏ చదువు మీరు చదివినా అది సమాజానికి భారమే. సంస్కారం దేని వలన ఏర్పడుతుంది? కేవలం వినడం వలన మాత్రమే ఏర్పడుతుంది. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషి మాత్రమే యోగ్యుడని పరమేశ్వరుడు ఆ శక్తి ఇచ్చాడు. ఇది దేనికి ? సంస్కారం ఏర్పరుచుకోవడానికి. వినడం అనేది సంస్కారమంతటికీ పునాది. నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రపోయేంతవరకు మనం అనేక రకాల మాటలు వింటూంటాం. విద్యార్థి దశలో వినే మాటలన్నీ ఒకే కోవలోకి వస్తాయి. కానీ తర్వాత మీకు జీవితంలో నాలుగు రకాల మాటలు వినిపిస్తాయి. తస్మాత్ ! జాగ్రత్త. పరాకుగా ఉండకండి. ఈ నాలుగు రకాల్లో మొదటిది పొగడ్త. రెండవది తెగడ్త. మూడవది స్వత్కార్యసాధన కొరకు ప్రయత్నం, నాలుగవది అభ్యుదయ హేతువు. ఈ నాలుగు మాటల పట్ల ఎవడు పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడో వాడు సంస్కారవంతుడిగా నిలబడగలడు. మొదటిది పొగడ్త. మిమ్మల్ని కొందరు అదేపనిగా పొగుడుతుంటారు. మీలో ఉన్న లోపాలు వారికి తెలియక కాదు. పొగడ్తలు వినడం, అన్నీ సబబేననుకోవడం ఎటువంటిదంటే... ఊబిలో దిగుతున్నవాడు ఎంత చక్కగా, ఎంత హాయిగా దిగుతున్నాను అనుకోవడం వంటిదే. అలా అనుకున్నవాడు ఏం చేస్తాడు... చివరికి ఊపిరి విడిచి పెట్టేస్తాడు. అలాగే అదేపనిగా పొగిడేవాడిని దగ్గరగా ఉంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే... బుద్ధి వినాశన హేతువు. అదేపనిగా వినడానికి అలవాటుపడితే మీ సంస్కారంలో దోషం వస్తుంది. అలా వారు పొగడనినాడు వారిని మీరు ఇష్టపడరు, అలా పొగిడినవారికే ఉపకారం చేస్తారు. అన్నం లేకుండా ఉండగలరు కానీ పొగడ్తలు వినకుండా గడపలేరు. అది ఒక వ్యసనంగా మారిపోతుంది. కేవలం పొగడ్తకు లొంగడం అనేది అత్యంత ప్రమాద హేతువు. అదేపనిగా పొగిడేవాడికి మీరు అంతేవాసిత్వం (శిష్యరికం) ఇచ్చారనుకోండి, అది తిరోగమనానికి దారితీస్తుంది, మీ స్వభావాన్ని పాడుచేసి వివేచనతో ఆలోచించగల మీ నైపుణ్యాన్ని ఇది భ్రష్టు పట్టిస్తుంది. అలాగని లోకంలో పొగడ్త వినకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు మీరు చాలా మంచిపని చేస్తున్నారు అని ఎవరయినా అంటే వినొద్దని శాస్త్రం చెప్పలేదు. వినాలి, కానీ దాని మూలాన్ని విరిచేయాలి. కోటేశ్వరరావుగారు చెప్పే విషయాలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది వింటూంటారని నిర్వాహకులు అంటారు. అది నిజమేనని నేను దానిని స్వీకరిస్తే అది నాకూ, వారికీ కూడా ఇబ్బందే. శంకరభగవత్పాదులవారి మాటలు నాకు ఒంటబట్టి చెప్పడంవల్ల నాకు ఈ కీర్తి కలుగుతున్నది, సమాజంలో నాకింత గౌరవం కలుగుతున్నది. ఈ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ శంకరులవారికి దక్కాలి, నాకు కాదు. కాబట్టి నేను ఎప్పుడూ శంకరుని పాదాలు విడవకుందును గాక అని నేనన్నాననుకోండి. ఇప్పుడు పొగడ్త వల్ల నాకు ప్రమాదమేమీ ఉండదు. నీవు లోపల మానసికంగా ఎదిగి ఉంటే ఏ పొగడ్త కూడా నిన్ను ఏమీ చేయలేదు. తెలిసీ తెలియకుండా పనసపండు కోశారనుకోండి, ఆ మరకలు ఏం పెట్టి కడిగినా పోవు. అదే ముందుగా చేతికి నూనె రాసుకుని కోశారనుకోండి. ఎంత జిగురున్నా, మీకది ఒక్క పిసరంత కూడా అంటదు. విరుగుడు తెలిసి నిలబడితే మీకు సంస్కారబలం ఏర్పడుతుంది. సంస్కారబలానికి ప్రధానహేతువేది? అసలు వినకుండా ఉండడం కాదు, వినడం కూడా అవసరం. అందుకే పూర్వం రాజుల దగ్గర వంది, మాగధి అనే వారు ఉండేవారు. రాజు నిద్రలేచి వచ్చిన క్షణం నుంచీ పొగుడుతుంటారు. అలా పొగడడానికే రాజు జీతం ఇచ్చి మరీ వారిని పెట్టుకునేవాడు. వీరు ఏం చేస్తారంటే రాజుయొక్క పూర్వికులు చేసిన మంచి పనులను పొగుడుతూ, రాజు చేసే పొరబాట్లను స్తోత్ర రూపంలో చెపుతూ ఆయన్ని అప్రమత్తం చేస్తారు. ఎవడో పాడుబడిన బావిలో పడి చనిపోయాడని తెలిసి వెంటనే దానిని పూడ్చివేయమని రాజు ఆజ్ఞ జారీచేస్తాడు. వెంటనే వంది ‘‘ఓరాజా! ఈ నూతిని మీ తాతగారు తవ్వించారు. రాజ్యంలో ఉన్న క్షామం పోవాలని, కొన్ని లక్షలమంది బాగుపడాలని ఆయన ఈపని చేశారు, అంతేకానీ మనుషులు చచ్చిపోవడానికి ఈ ఏర్పాటు చేయలేదు’’ అంటుంటే, మాగధి అందుకుని ‘‘మహారాజా ! మీరు చేయబోయే ఈ పని ఇప్పుడు మంచిదిగా కనిపించినా మున్ముందు అలా ఉండకపోవచ్చు. మీరు ఇప్పటిదాకా చాలా మంచి పనులు చేసి కీర్తి గడించారు. ఇప్పుడు దానికి ప్రమాదం వాటిల్లుతుంది’’ అని స్తోత్రరూపకంగా చెపుతాడు. వెంటనే రాజు ‘‘ఔను, మా తాత మంచిపని చేశాడు’’ అని ఆ బావిని బాగుచేయించమని పురమాయిస్తాడు. ‘రాజా! ఆ నూతిని పూడ్చేయకండి’ అని మీరే నేరుగా అన్నారనుకోండి, మిమ్మల్ని పూడ్చేస్తారు. పొగడ్త హితవాక్కుగా ఉండడానికి రాజు ఈ ఏర్పాటు చేసుకుంటాడు. పొగడ్త ఎప్పుడూ ఎలా వినాలో తెలుసా ! వంశ ప్రతిష్ఠ వినాలి. మా తాత ఎటువంటివాడు, మా తండ్రి ఎటువంటివాడు, మా గురువు ఎటువంటివాడు, జగద్గురువులు ఎటువంటివారు, మన సనాతన ధర్మంలో వచ్చిన మహర్షులు ఎటువంటివారు, పీఠ వైభవం ఎటువంటిది.. ఇవి తెలుసుకున్ననాడు మీకు తెలియకుండానే ఒక వారసత్వ వైభవం మీకు తెలిసివస్తుంది, ఆ మర్యాదను నిలబెట్టవలసిన బాధ్యత గుర్తుకు వస్తుంది. పొగడ్త లేకుండా జీవితాన్ని గడపలేం. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. పాము కరిచిందనుకోండి. వ్యక్తి చనిపోతాడు. అదే పాములోని విషాన్ని వైద్యుడు సంస్కరించి ఓషధి రూపంలో ఇచ్చాడనుకోండి. అనారోగ్యం తగ్గిపోతుంది. అదీ... సంస్కరించుట. అక్కడ వచ్చింది చదువు పక్కన సంస్కారం అన్నమాట. చదువుకుంటూనే ఉండు, తెలుసుకుంటూనే ఉండు, ఎందుకు... నీ అంతట నీవు సమాజంలో నిలబడవలసిన రోజు వచ్చిన నాడు, ఏది ఎక్కడవరకు ఉంచాలో ఏది దగ్గరకు తీసుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అన్నింటినీ కౌగిలించుకోవడం అలవాటయిపోతే ఒళ్లు కాలిపోతుంది. అదీ సంస్కారబలం అన్నమాటకు అర్థం. రెండవది తెగడ్త. అంటే నిరసించుట. అవతలివాడియందు ఆ లోపం ఉన్నదా, అలా విమర్శించడానికి అవకాశం ఉన్నదా... తెలిసి విమర్శించు. మీయందు దోషమున్నది, దానిని నేను విమర్శించాననుకోండి, తెగిడాననుకోండి, అది హితవాక్కవుతుంది. ఉదాహరణకు - మీకు అన్నం కూడా మానేసి చదువుకునే అలవాటు ఉన్నదనుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి అది తప్పు. మీరెంత చదువుకున్నా, ఇలా చదువుకుంటే ఎందుకూ పనికిరారు. మీరు వేళపట్టున ఆహారం తీసుకోవడం, స్వల్ప వ్యాయామం చేయడం, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడం కూడా అవసరం. అప్పుడు మీరు చదువుకున్న చదువు మీకు ఒంటపడుతుంది అని నేనన్నాననుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తెగిడాను అనరు. మిమ్మల్ని సంస్కరించాను అంటారు. అసూయాజనితమయితే తెగడ్త అనే మాట వస్తుంది. సంస్కృతంలో నాకన్నా బాగా చదువుకున్న వ్యక్తి వచ్చి నాముందు నిలబడ్డాడనుకోండి. నేను వారి మాటలు విని ఆ తర్వాత పక్కకు వెళ్ళి ‘ప్చ్! ఆయనలా మాట్లాడేంటండీ, అన్నీ తప్పులండీ’ అన్నాననుకోండి. అది అసూయా జనితం. నాకు లోపల తెలుసు, ఆయన నా కన్నా మహాపండితుడు. కానీ నేనది అంగీకరించడానికి నా గర్వం నాకు అడ్డొస్తోంది. ఆయన మహా విద్వాంసుడండీ, అటువంటి వారి దర్శనం కలగడం ఈ వేళ నా అదృష్టం అని అనగలిగాననుకోండి. అప్పుడు నేను సంస్కారవంతుడనయి ఉన్నానంటారు. అందువల్ల చదువు ఒక్కటే చాలదు. దానికి సంస్కారం కూడినప్పుడే విలువనిస్తుంది. ఈ సంస్కారం ఇచ్చేది కూడా విద్యే. విద్య మనకిచ్చే గొప్ప విలువల్లో సంస్కారం ఒకటి. సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడున్నదీ అంటే... ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కోసమే అలా మాట్లాడారని అనుకోవడం నీ సంస్కారం. అలాకాక, పెద్దల వాక్కులో కాఠిన్యం చూడడం అలవాటయితే అది సంస్కార రాహిత్యం అవుతుంది. అలాగాక వారు ఎందుకోసం అలా మాట్లాడారా అని ఆలోచించి, దానిలోని మంచిని గ్రహించడం, ఆచరించడం మీ సంస్కారానికి నిదర్శనం. సంస్కారం... సంయత్ కరము అంటే బాగుగా చేయుట అని. మీరు ఏయే చదువులు చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్లబోతున్నారో అది సమాజాన్ని పాడు చేసేదిగా ఉండకుండా జాగ్రత్తపడడం. ఒకడికి బలం ఉందనుకోండి. ఆ బలంతో బలహీనుడిని రక్షించవచ్చు, వాడిని హింసించి వాడికి నష్టం కలిగించనూ వచ్చు. ఒకడి దగ్గర చదువు ఉందనుకోండి. దానితో మరొకడిని వృద్ధిలోకి తీసుకురావచ్చు, అదే చదువుతో పదిమందిని మోసం కూడా చేయవచ్చు. కాబట్టి సంస్కారాన్ని చదువు పక్కన ఎందుకు ఉంచారంటే... నీకు దేనివల్ల ప్రకాశం కలుగుతుందో, దేనివల్ల లోకభాగ్యాలను పొందబోతున్నావో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలోని అభ్యుదయానికి అడ్డంకి కాకుండా ఉండడానికి. దీనికి అవసరమయిన మర్యాదలను నేర్పడానికే సంస్కారమని పేరు. -
పరువు హత్య
సాంకేతికంగా మనిషి శిఖరాలకు చేరుకుంటున్నా... సంస్కారంలో మాత్రం పాతాళంలోకి కూరుకుపోతున్నాడు. మార్పు కోసం ఎన్ని కాగడాలు వెలిగించినా... చీకటి ఇంకా మహిళలను వేటాడుతూనే ఉంది. కడుపులో బిడ్డ ఉండగానే చంపి పాతరేశారు..పరువు ముందు మానవత్వం సమాధి అయిపోయింది.. ప్రతిష్ఠ కోసం కన్నవారే కసాయిలయ్యారు.. అలాంటి తల్లిదండ్రులు మారాలా? వాళ్లను అలా తయారుచేసిన సమాజం మారాలా? పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం! పోయిందనుకున్న పరువుకి అర్థంలేదని చెప్పలేమా?! నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంభాలపల్లి గ్రామపంచాయితీ పరిధిలో.. విసిరేసినట్టున్న తండా. చుట్టూ కొండల నడుమ ఒదిగిన గువ్వల గుట్ట. రమావత్ చిన్ని, రమావత్ హర్యా ఆ తండాలోని ఓ జంట. వాళ్లకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. నిరుపేద గిరిజన కుటుంబం. కూతురు పేరు శారద. తొలి చూలు. చదువు చెప్పించలేదు. గొర్రెలు, మేకలు కాయడానికి అడవికి వెళ్ళొస్తుండేది. ఈ క్రమంలోనే ఆ తండాకు చెందిన ఓ వ్యక్తి శారదకు పరిచయమయ్యాడు. ఆ పరిచయ ఫలితం.. అమ్మాయి గర్భవతి అవడం. అమ్మాయిలో వస్తున్న మార్పులు తల్లిదండ్రుల్లో అనుమానం రేకెత్తించాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని అనిపించినా భయంతో మిన్నకుండి పోయారు. ఉన్నట్టుండి ఒకరోజు కడుపు నొప్పి అంటూ పిల్ల మెలికలు తిరిగి పోతుంటే గువ్వల గుట్టకు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ల భయాన్ని, అనుమానాన్ని డాక్టర్ నిర్ధారించింది కూతురు గర్భిణీ అని చెప్పి. ఊహించిందే అయినా అబద్ధమేమో అని ఏ మూలో ఉన్న ఆశ ఆవిరై ఆ దంపతులను కుప్పకూలేలా చేసింది. ఆ పరిస్థితికి కారణమైన వాడిని పట్టుకోవాలన్న యోచన కన్నా కూతురు తప్పు చేసింది అన్న భావనే వాళ్ల మెదళ్లలో నిండింది. కడుపులోని పిండాన్ని తీసేయమన్నారు. ‘ఈ టైమ్‌లో కుదరదు’ అంది డాక్టర్. ఏం చేయాలో... ఏం మాట్లాడాలో తెలియక తిరుగు ముఖం పట్టారు. కాని ఊళ్ళోకెళ్తే తండావాసుల ముందు తలెత్తుకోలేమనే చింత వాళ్లను అడుగు ముందుకు వేయనీయలేదు. మార్గమధ్యంలో గుట్టల వద్ద కూతుర్ని నిలదీశారు. జరిగిన విషయాన్ని కూతురు పూసగుచ్చినట్టు చెప్పింది. గుండెలవిసేలా ఏడ్చారు. ఆ ఏడుపు క్రమంగా భరించలేని కోపం.. అవమానంగా మారింది. తలమీదున్న తమ పరువు తండా ముందు కూలిపోయి కనిపించింది. కంపించారు... కన్న బిడ్డ అన్న మమకారం .. గర్భంతో ఉందన్న మానవ త్వం వీళ్లను విడిచి వెళ్లిపోయాయి. బిడ్డ గొంతు నులిమి చంపేశారు. ఊరి సరిహద్దులోనే.. గొయ్యి తీసి పూడ్చేశారు. ఆ నోటా... ఈ నోటా ... శారద కనిపించకపోవడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. విషయం ఆ నోట ఈ నోట బంధువులకు సమాచారం చేరింది. తల్లిదండ్రులను ప్రశ్నించారు. నిజం చెప్పక తప్పలేదు ఆ తల్లిదండ్రులకు. కులాచారం ప్రకారం గర్భిణీని పూడ్చిపెట్టడం తప్పన్నారు. ఆ చావు తండా తండాకే అరిష్టమన్నారు. గుట్టుచప్పుడు కాకుండా తండావాసులంతా ఏకమై పూడ్చిన శారద శవాన్ని బయటకు తీశారు. శారద పొట్ట కోసి లోపలున్న శిశువును వేరు చేశారు. ఆ పక్కనే మరో గొయ్యి తీసి ఆ శిశువును పాతిపెట్టారు. ఆనోటా... ఈ నోటా విషయం బయటకు పొక్కింది. దీంతో అధికారులు, పోలీసులు తండా ప్రవేశం చేశారు. మీడియా కథనాలు రాసింది. తల్లిదండ్రులపై కేసు నమోదైంది. కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతున్నారు. ఓ పదిరోజులు పెద్ద హడావిడే జరిగింది. ఈ వారంపదిరోజుల్లో ఈ కేసు కోర్టులో హియరింగుకు రాబోతోంది. ఈ సంచలనం రేపిన హడావుడికి ఆ తండాలోని ఫాల్స్ప్రెస్టీజ్ భావన చచ్చిపోయి.. గొప్ప మార్పే చోటుచేసుకుంది అనుకునేరు. మూఢాచారాలు, శిశు విక్రయాలు, భ్రూణహత్యలు వంటివి దైనందిన చర్యలో భాగంగా జరిగిపోతూనే ఉన్నాయి. - కొంగరి మధు, సాక్షి, దేవరకొండ కేసు నడుస్తూనే ఉంది 2011లో జరిగిన ఈ సంఘటనలో తల్లిదండ్రుల మీద కేసు నమోదయింది. కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ వారంలో ఈ కేసు జిల్లా కోర్టుకు బదిలీ చేసే అవకాశముంది. అప్పుడప్పుడు ఈ కేసుపై ఉన్నతాధికారులు కూడా వాకబు చేస్తుంటారు. - ప్రసాద్, కానిస్టేబుల్ ఇన్నేళ్ళయినా ఆ సంఘటన కళ్ళముందే కనిపిస్తుంది ఈ సంఘటన సమాచారం అందడంతోనే అధికారులు నన్ను హుటాహుటీన అక్కడికి పంపారు. నా కళ్ళ ముందే శవాలను బయటకు తీశారు. వందల మంది గుమికూడారు. ఏడ్పులు, పెడబొబ్బలు, మరికొందరైతే గుండెబిగబట్టుకుని నిలబడ్డారు. వైద్యులు శిశువుకు సంబంధించిన అవయవాలను డీఎన్ఏ టెస్ట్ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఆ రోజు నాకింకా గుర్తు... ఆ శవాల దగ్గర నన్నే కాపలాగా ఉండమన్నారు. - నూనె శ్రీను, వీఆర్వో అవేర్నెస్సే పరిష్కారం జనరల్‌గా అధికారం కోసం కులం, మతం వంటివాటిని అడ్డంపెట్టుకుంటారు. వీటిని భావోద్వేగాలతో ముడిపెట్టి ప్రజలను రెచ్చగొడుతుంటారు. అయితే ఇవి చిన్న సమూహాలు లేదా కమ్యూనిటీలకు చేరినప్పుడు కుల పోట్లాటలు, పరువు హత్యలు వంటివి జరుగుతుంటాయి. ఈ అజ్ఞానానికి ఎక్కువ, తక్కువ, పేద, ధనిక బేధాల్లేవ్. వీటికి పరిష్కారం ప్రజల్లో చైతన్యం రావడమే. - ఫణి ప్రశాంత్, సైకాలజిస్ట్ -
తెలుగు కథలో తాజాశ్వాస ప్రాతినిధ్య 2013
ఈ సంకలనం కోసం వస్తువును మాత్రమే పరిగణించకుండా కథను ‘మొత్తం కథ’గా చూడటం వల్ల కూడా మంచి కథలు దొరికాయనిపిస్తోంది. తెలుగు కథకు ఒక సంస్కారం ఉంది. అది గురజాడ నుంచి అందిన సంస్కారం. శ్రీపాద నుంచి, చలం నుంచి, చాసో నుంచి, కొ.కు, రావిశాస్త్రి, మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ... ఇంకా ఎందరెందరి నుంచో అందిన సంస్కారం. ఆ సంస్కారం- ప్రశ్నించడం కావచ్చు. ఘర్షణ పడటం కావచ్చు. తిరుగుబాటు చేయడం కావచ్చు. సరిదిద్దడం కావచ్చు. తప్పుని తప్పు అని, ఒప్పుని ఒప్పు అని చెప్పడం కావచ్చు. బాధితుల వైపు, పీడితుల వైపు, అల్పవర్గాల వైపు, ఆడవాళ్ల వైపు, అధికుల పడగ మీద కాలు పెట్టి అణచ ప్రయత్నించే వీరుల వైపు నిలబడటం కావచ్చు. నియంతల గండభేరుండాల ప్రేవులను పదునైన పాళీతో బయల్పడేలా చేయడానికి చూపే తెగువ కావచ్చు. తెలుగు కథకు ఒక సంస్కారం ఉంది. ఒక తరం వెళ్లింది మరో తరం వచ్చింది ఆ రోజులు ఇప్పుడెక్కడివి అనే వీలు లేకుండా ఆ సంస్కారం చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది. ఆ కాగడాను ఎప్పటికప్పుడు ఉత్సాహంగా అందుకునే కథకులు వస్తూనే ఉన్నారు. అందుకు మరో తార్కాణం ‘ప్రాతినిధ్య - 2013’. పసునూరి రవీందర్, పి.వి.సునీల్ కుమార్, అల్లం వంశీ, కిన్నెర, ఉణుదుర్తి సుధాకర్, బెడదకోట సుజాత, దీపిక ఉప్పులూరి, వనజ తాతినేని, చింతకింది శ్రీనివాసరావు... ఎవరు వీరంతా? కొత్త కథకులు. తెలుగు కథావరణంలో ప్రవేశించిన తాజా కథకులు. తమ ఉనికి కోసం కథను వాడుకుంటున్న కథకులు కాదు. కథ వెలుగు కోసం తమ సృజనకు రాపిడి పెట్టడానికి వచ్చిన కథకులు. వినోదమా వీరి లక్ష్యం? కాదు. ప్రశ్నించడం. నిలదీయడం. తలపడటం. అవసరమైతే బుజ్జగించి చెప్తాం వింటే వినండి. లేకుంటే అక్షరాలను మండిస్తాం భస్మమయ్యి అడ్డు తొలగండి అని పంతం పట్టినట్టు కనిపిస్తున్న కథకులు. వస్తువును ఎంచుకోవడం, కుదురుగా చెప్పడం, దృక్పథాన్ని వెల్లడి చేయడం, పాఠకుణ్ణి నిద్ర లేపి వెలుగులోకి నడిపించడం... ఎవ్వరూ మానలేదు. ఈ కొత్త కథకులు ఈ పనిని ఇంత బాగా ఎలా చేయగలిగారు? బహుశా ఇది తెలుగు కథ అందించిన సంస్కారం. ఆ బాట ఏర్పరిచిన సంస్కారం. కులం- అవును నాది ఈ కులమే! మతం- అవునయ్యా నీది ఈ మతమే! వర్తమానం- ఇది ఆరోగ్యకరమైన సంఘం ప్రదర్శిస్తున్న వర్తమానం కాదు, మరబొమ్మలుగా మారిన మనుషుల విషాద విధ్వంసం! భాష- చూడు బాబూ తెలుగు కూడా భాషే. ఇంగ్లిష్ మాత్రమే కాదమ్మా! కుటుంబం- రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతే కొమ్మలొచ్చిన చెట్లనే ఆసరా చేసుకోక తప్పదు. విప్లవం- ఏం.. ట్రిగ్గర్ నొక్కే వేళ్లు తెగిపడవలసిందేనా? వాటికి ఒక బుగ్గను తాకే అదృష్టం లేనట్టేనా? ఉగ్రవాదం- మిత్రమా... దాని రంగు ఆకుపచ్చ కాదు. చరిత్ర- రాళ్లెత్తిన కూలిలెవ్వరు? ఆహారం- ఏది నీచం? ఏది నీచు? ప్రవాసం- నిర్బంధ కొత్త బానిసత్వం... పదానికి ఒక కథ రాశారు. పరిపరి విధాలుగా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంకలనంలో రెండు ప్రేమ కథలున్నాయి. చిత్రంగా రెంటి మధ్యా సామ్యముంది. రెండూ విఫల ప్రేమకథలే. అనామక వీరుల జీవిత కథలే. రెంటినీ రచయితలు అద్భుతంగా నడిపారు. ఒకరు: ఉణుదుర్తి సుధాకర్. కథ పేరు వార్తాహరులు. స్వాతంత్య్రపోరాటంలో బ్రిటిష్‌వారు కొత్తగా టెలిగ్రాఫ్ యంత్రాలు పట్టుకొచ్చి ఉద్యమాన్ని అణిచివేసే ఎత్తుగడ పన్నుతున్న కాలంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు బ్రిటిష్ అధికారి దగ్గర పనివాళ్లుగా చేరి ఆ సంగతి తెలుసుకొని ఆ టెలిగ్రాఫ్ యంత్రాలను ధ్వంసం చేద్దామనుకుంటారు. ఎంతో భవిష్యత్తు, ఆయుష్షు, జీవితం ఉన్న ప్రేమికులు వాళ్లు. కాని దేశం ముందు వాటికి ఏం విలువ? ప్రయత్నించారు. విఫలమయ్యారు. ఆ తర్వాత ఏమయ్యారో? ఎవరికి తెలుసు. వారి త్యాగం? ఎవరికి తెలుసు. వారిద్దరూ హిందూ ముస్లింలు. ఈ సమష్టి శక్తిని చీల్చడానికి బ్రిటిష్‌వారు చేసిన పన్నాగంలో ఇంకా కునారిల్లడం లేదు మనం? ఇలాంటిదే మరో కథ. పేరు: మార్తా ప్రేమ కథ. రచయిత: విమల. విప్లవోద్యమంలో వారిరువురూ ప్రేమికులు. దంపతులు. అడవిని ఇల్లుగా చేసుకున్నవారు. ప్రజల్ని బంధువులుగా మార్చుకున్నవాళ్లు. కాని అలా అనుకుంటే ఇంకేమైనా ఉందా? స్టేట్‌కు భయం వేస్తుంది. నీ స్వార్థం నువ్వు చూసుకోవాలి. అంతే తప్ప నిస్వార్థంగా పని చేయాలనుకుంటే ప్రతిఘటించాలనుకుంటే ఏమవుతుందో తెలుసా? అతడు జైలు పాలయ్యాడు. ఆమె ఏకాకిగా బయట మిగిలిపోయింది. ఇలా ఎందరో ఎవరికి తెలుసు. జనం మీద సముద్రమంత ప్రేమ పెట్టుకున్నవారు తమ ప్రేమల్ని ఎలా బలిపెట్టారో ఎవరికి తెలుసు. కనిపించని కానలలోన వికసించిన పువ్వుల అందం- ఆ అందాన్ని చూపిన కథలు ఇవి. కులాన్ని చర్చించిన కథలు మూడు ఉన్నాయి. మీసాలోడు- పసునూరి రవీందర్, మీరెట్ల వెజ్జులు?- జూపాక సుభద్ర, దమయంతి- దీపికా ఉప్పులూరి. మొదటి కథలో పెళ్లి పంక్తిలో దళితుడికి అవమానం జరుగుతుంది. రెండవ కథలో ఆఫీసులో డైనింగ్ టేబుల్ వద్ద. దళితుడు మొదటి పంక్తిలో కూచుని తినేంత యోగ్యుడు ఇవాళ్టికీ కాని పరిస్థితి ఊళ్లలో. లే.. లే.. అని లేపేయడమే. ఏం తప్పు చేశాడని? ఈ వివక్ష నగరాల్లో ఇంకోలా సాగుతుంది. మీరూ మాతో సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారా... అయితే ఆహారం దగ్గర పైచేయి సాధిస్తాం అని శాకాహారాన్ని ఒక విలువగా ముందుకు తేవడం. అది సాకుగా తీసుకొని హింసించడం. శాకాహారం ఒక మంచి అలవాటు కావచ్చు. కాని విలువ మాత్రం కాదు. ముఖ్యంగా దాని ఆధారంగా ఎదుటి మనిషిని తక్కువ చేయదగ్గ విలువ ఎంత మాత్రం కాదు. అందుకే మూడో కథలో ముఖ్యపాత్ర ఇలా అంటుంది- అమ్మమ్మా... అంటరానిది అని ఆ పిల్లతో నన్ను చిన్నప్పుడు ఆడుకోనివ్వలేదు. శరీరం తాకితే కడిగావు. కాని ఆ పిల్ల నా మనసును తాకిందే... ఏం చేస్తావ్? మెలకువలోకి తీసుకురావడం ఇది. కొత్త సంస్కారాల త్రోవ. మతం ముఖ్యం. ఇప్పుడు మరీ ముఖ్యం. దానిని చర్చించిన కథలు మూడు ఉన్నాయి. అమ్మ బొమ్మ- వేంపల్లె షరీఫ్, సాహిల్ వస్తాడు- అఫ్సర్, సంస్కారం- వనజ తాతినేని. మూడూ సున్నితమైన కథలు. సున్నితమైన అంశాన్ని చాలా కన్విన్సింగ్‌గా ఓర్పుగా చెప్పే కథలు. ఈ దేశంలో పాఠ్యాంశాలకు మతం ఉంది. అది మెజారిటీలదైతే కనుక మైనారిటీలను అభద్రతలో నెట్టేస్తుంది. ఈ దేశంలో ‘అపవాదు నిర్మాణం’ ఉంది. అది మెజారిటీలు నిర్మించేదైతే గనక మైనారిటీలకు మృత్యుపాశం అవుతుంది. ఈ దేశంలో స్వేచ్ఛగా మతం ఎంచుకోవడంలో పురుషుల పెత్తనం ఉంది. అది మెజారిటీలదైతే గనుక మైనారిటీలకు పెనుగులాటగా మారుతుంది. ముగ్గురూ బాగా రాశారు. వనజ తాతినేని ఇంకా బాగా. ఈ సంకలనంలో ఉన్న మరో మంచి కథ సుజాత బెడదకోట రాసిన ‘అమ్మ- నాన్న- అమెరికా’. కాన్పులకీ, పెంపకాలకీ అమెరికాకు వెళ్లే అమ్మమ్మల, నాయనమ్మల అవస్థను చాలా చక్కగా- కొడుకులూ కోడళ్లూ సెన్సిటైజ్ అయ్యే స్థాయిలో- చెప్పిన కథ ఇది. ఈ కథ చదివినవారు వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను తమ అవసరాల కోసం అమెరికాకు పిలిచి హింసించడం ఆపేస్తారు. ఇక పి.వి.సునీల్ కుమార్, అల్లం వంశీ, ఎ.వి.రమణ ప్రసాద్‌ల కథలు, ఆ కథల్లోని ‘ఈజ్’ చూస్తే పాఠకులకు ఇక వీళ్లతో దిగులు లేదు అనే నిశ్చింత కలుగుతుంది. ముసునూరు ప్రమీలతో కలిసి ఈ సంకలనానికి సంపాదకత్వం వహించిన డా.సామాన్య స్వయంగా రచయిత. అయితే సంపాదకురాలిగా కూడా ఆమెకు తాను ఏ కథలను ఎంచుకుంటున్నదో ఎందుకు ఎంచుకుంటున్నదో స్పష్టత ఉందనిపిస్తుంది ఈ సంకలనం చూస్తే. వస్తువును మాత్రమే పరిగణించకుండా కథను ‘మొత్తం కథ’గా చూడటం వల్ల కూడా మంచి కథలు దొరికాయనిపిస్తోంది. ప్రయాణం మొదలయ్యింది. ఇక ఈ సంపాదకులుగాని, రచయితలుగాని చేయవలసిన గమనం చాలానే ఉంది. ఇరువురూ నిరాశ పరచరనీ మధ్యలోనే తప్పిపోరని ఆశిద్దాం. - నెటిజన్ కిశోర్ -
న్యాయకోవిదుని హృదయ స్పందన నీవు మాకు ఆదర్శం
మనిషికి ఏం కావాలి? తిండీ బట్టా గూడు. అవి బతకడానికి. కాని జీవించడానికి? సంస్కారం కావాలి. అది తన వరకు సరిపోతుంది. మరి నలుగురి కోసం? అందుకు స్పందన కావాలి. అనాదిగా సాహిత్య సారస్వతాలు చేస్తున్న పని అదే. మనిషికి సంస్కారం ఇవ్వడం. స్పందన నొసగడం. కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా వర్గం ఏదైనా అట్టడుగున చూస్తే ప్రతి మనిషికీ కావలసినవి ఇవే- స్పందనా సంస్కారాలు. వాటిని కోరే, ఆశించే, అందుకోసం కాసింత కదలికను తీసుకువచ్చే, అందుకై పరితపించే ఏ సాహిత్యమైనా కచ్చితంగా మంచి సాహిత్యమే. న్యాయకోవిదులైన జస్టిస్ చంద్రకుమార్ వృత్తిరీత్యానే కాదు ప్రవృత్తి రీత్యా కూడా సమాజంలోని మంచి చెడులను, న్యాయాన్యాయాలను, హెచ్చుతగ్గులను, పీడనా దుర్మార్గాలను, అందుకు హేతువులను దర్శించే చక్షువు కలిగినవారు. తన చేతిలోని కలం న్యాయం పలికే తీర్పును రాయడానికే కాదు, ధర్మం చెప్పే కవిత్వాన్ని రచించడానికి కూడా ఉందని ఆయన గ్రహించారు. అందుకే గేయరచనతో మొదలైన ఆయన ప్రస్థానం మంచి కవిత్వాన్ని రాసే దిశగా కొనసాగుతోంది. క్షమ, కరుణ, నిస్వార్థత, రుజుమార్గం, పరోపకారం వెరసి మానవతా విలువలు ఆయన మౌలిక కవితా వస్తువులు. ‘పుట్టేటప్పుడు గిట్టేటప్పుడు నలుగురి సహకారం కావాలి కనీసం అందుకైనా నిస్వార్థంగా నలుగురికీ తోడ్పడాలి’ అంటారాయన. అలా పని చేసే మనిషి ఎవరనేది ఆయనకు నిమిత్తం లేదు. నిజానికి సమాజానికి కూడా అలాంటి నిమిత్తం ఉండాల్సిన పని లేదు. ‘సత్యం ఎవరు చెప్పినా సమ్మతమే మాకు సంఘ శ్రేయస్సు ఎవరు కోరినా అదే శాస్త్రం మాకు కారణ్యం ఎక్కడున్నా అదే ఆదర్శం మాకు మానవత్వమెక్కడున్నా అదే మతం మాకు’ అంటారాయన. అలాంటి సమాజం కావాలంటే సంకుచితాలు వదిలేయాలి. ద్వేషాన్ని రగిలించే పని మానుకోవాలి. ప్రతి మనిషీ తన మనిషే అనుకోగలగాలి. అందుకు చంద్రకుమార్ చాలా ఉన్నతంగా చెట్టును తన ఆదర్శంగా తీసుకుంటారు. ప్రతి మనిషీ ఒక అడవి వృక్షం వలే మారగలిగితే అంతకు మించి కావలసింది ఏమైనా ఉందా? ‘బతికినన్నాళ్లు నీడ కోరితే చల్లని నీడ గూడు కోరితే వెచ్చని గూడు పండు కోరితే పండు కలప కోరితే కలప - కాదనక ఇచ్చేవు. బతికినా చచ్చినా ఎవ్వరినీ ఏమీ అడగకుండా ఏది కావాలంటే అది ఇచ్చే అడవిలోని వృక్షమా ఆదర్శం నీవు మాకు’ ‘ఇచ్చుటలో ఉన్న హాయి’ అని గతంలో ఒక కవి అన్నట్టు చంద్రకుమార్ కూడా ‘ఇవ్వడంలోని సంతోషాన్ని’ తెలుసుకోమంటారు. అయితే ఈ ఆదర్శాలను బుజ్జగించి చెప్పడం మాత్రమే కాదు తనకు నచ్చనివాటి మీద నిరసన ప్రదర్శించటం, తిరుగుబాటు ప్రదర్శించడం కూడా చూస్తాం. ఈ కవిలో కృత్రిమ భేషజాలను ఇష్టపడని ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లె స్వభావం ఉంది. అందుకు సూటూ బూటుల మీద ఆయన రాసిన ‘నీకర్థం కాదు’ కవిత తార్కాణం. ‘నా మెడలోని టై ఉరితాడులా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అంటారాయన. ఇలాంటి పల్లీయ స్వభావంతో నిరాడంబర జీవితంతో ప్రకృతిలా (మదర్ థెరిసాలా) ఇవ్వడమే తెలిసిన గుణంతో జీవించే సమాజం కోసం జస్టిస్ చంద్రకుమార్ చేసిన అక్షర ఆకాంక్ష ‘నీవు మాకు ఆదర్శం’. నీవు మాకు ఆదర్శం- జస్టిస్ బి. చంద్రకుమార్ కవిత్వం వెల: రూ.60; ప్రతులకు- 8501901270, 8332874874 -
మన కథల వారణాసి
కథలెందుకు రాస్తారు? వాళ్లూ వీళ్లూ సరే. మన దగ్గర ఎవరున్నారు? ప్రపంచస్థాయి రచయితలు ఎవరున్నారు? ప్రేమ్‌చంద్! అవును. మన పుణ్యక్షేత్రం. మన పాఠ్యగ్రంథం. కథల వారణాసి. సిసలైన అర్థంలో నిజమైన భారతీయ కథకుడు. ప్రేమ్‌చంద్ అన్నీ చూశాడు. ఈ దేశంలో నూటికి తొంభై శాతం ఉన్న బీదా బిక్కి జనాల మధ్యతరగతి మనుషుల సమస్త తలపోతలనీ తలకెత్తుకున్నాడు. వాటన్నింటినీ రాశాడు. గురజాడ ప్రేమ్‌చంద్... ఇద్దరికీ సామ్యముంది. ఇద్దరూ దాదాపు ఒకేసారి కథల్లోకి దిగారు. కథల పరమార్థం గ్రహించారు. గురజాడ మౌఢ్యం నుంచి పరివర్తన ఆశిస్తే ప్రేమ్‌చంద్ సంస్కారాల నుంచి పరివర్తన ఆశించాడు. గురజాడ తన తొలి కథ రాయడానికి సరిగ్గా మూడేళ్ల ముందే ప్రేమ్‌చంద్ తన విశ్వవిఖ్యాత కథ ‘నమక్ కా దరోగా (1907) రాశాడు. ఏమిటా కథ? ఒక నిజాయితీపరుడైన యువకుడు. సాల్ట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుంది. బ్రిటిష్ కాలం. నల్ల బజారులో ఉప్పు బంగారంలా అమ్ముడుపోతున్న కాలం. రేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ఉప్పు పెద్దవాళ్ల చేతుల్లోకి పోకుండా చూడటమే సాల్ట్ ఇన్స్పెక్టర్ పని. ఉద్యోగంలో చేరి ఎన్నోరోజులు గడవవు. ఆ రాత్రి అతడికి పరీక్షా సమయం ఎదురయ్యింది. ఊరి పొలిమేరల్లో వరుసగా వెళుతున్న ఎడ్లబండ్లలో ఉప్పుమూటలు. ఒకటి కాదు రెండు కాదు... లెక్కలేనన్ని మూటలు. అన్నీ కూడా ఆ ఊరి కామందువి. గుట్టు చప్పుడు కాకుండా పట్నం పోతున్నాయి. పొలిమేర దాటితే ఇక నరుడి కంటికి దొరకనట్టే. కొత్త కుర్రవాడు ఉత్సాహవంతుడు నిజాయితీపరుడు సాల్ట్ ఇన్స్పెక్టర్... పట్టేసుకున్నాడు. గుర్రం మీద వెంబడించి బెబ్బులిలా గాండ్రించి బండ్లన్నీ నిలువరించాడు. ఎంత పెద్ద ఉత్పాతం ఇది. ఉప్పు పోతే పోయింది కాని దీని హక్కుదారుడు ఫలానా కామందు అని చుట్టుపక్కల పరగణాలన్నింటికీ తెలిసిపోతే? పరువేంగాను? కామందు వచ్చాడు. పక్కకు తీసుకెళ్లాడు. ఎంతకావాలో అడుగు అన్నాడు. చిల్లర పైసల ఉద్యోగి సాల్ట్ ఇన్స్పెక్టర్. వేలైనా సరే. లక్షలైనా సరే. పరువు ముఖ్యం. కాని కుర్రవాడు లొంగలేదు. అరెస్ట్ చేశాడు. అయితే పెద్దవాళ్లకెప్పుడూ పది దారులు. కోర్టులో కేసు నిలవలేదు. పైగా అంత పెద్దమనిషిని ఇబ్బంది పెట్టినందుకు ఉల్టా ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఊడింది. నిజాయితీకి దొరికిన ప్రతిఫలం. కుర్రవాడు ఏం పట్టించుకోలేదు. తన ధర్మం తాను నిర్వర్తించాడు. ఒకరి ముందు తాను ఎలా ఉంటే తనకేమిటి? తన ఆత్మ ముందు తాను వజ్రం! మరో రెండు రోజులు గడిచాయి. ఇన్స్పెక్టర్ ఇంటి ముందు కామందు బండి ఆగింది. లోపలి నుంచి కామందు దిగాడు. తనకు మేనేజర్‌గా పని చేయమని అర్థించాడు. పెద్ద జీతం. పెద్ద దర్జా. బోలెడంత మర్యాద. వజ్రంలాంటి మనిషివి నువ్వు... నాకు కావాలి అన్నాడు. అంతేకాదు. ఇక మీదట దొంగ వ్యాపారాలన్నీ బంద్ చేసి అతడితో ముందుకు నడవడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకు? ఏమీ లేని ఆ కుర్రవాడే అంత నిజాయితీగా ఉంటే అన్నీ ఉన్న తాను ఎంత నిజాయితీగా ఉండాలి? జాతికి కావాల్సిన సంస్కారం అది. పరివర్తన. ప్రేమ్చంద్ది కాయస్త్ల కులం. వీళ్లను ఉత్తరాదిన శ్రీవాస్తవ్లని కూడా అంటారు. వీళ్ల మూలపురుషుడు చిత్రగుప్తుడు. కమ్మరివృత్తి ఒక కులంగా మారినట్టుగా, కుమ్మరివృత్తి ఒక కులంగా వూరినట్టుగా వ్రాయసగాళ్లు ఒక కులంగా మారి కాయస్త్లయ్యారని అంటారు. అయితే ప్రేమ్‌చంద్‌కు రాయడం ఈ వ్రాయసకులం వల్ల ఏర్పడలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి చనిపోతే, మారుతల్లి వేధిస్తుంటే, ఏం చేయాలో తోచక తన ఊరు వారణాసిలో ఎక్కడ పుస్తకాలు దొరికితే అక్కడికల్లా వెళ్లి ఆ అక్షరాల్లో పడ్డాడు. చదివి చదివి కలం చేత పట్టాడు. చిత్రగుప్తుడు వలే అన్ని పాపాలనూ చూసి వాటిని కథలు చేశాడు. ఒకటీ రెండూ అని ఏం చెప్తాం. అన్ని కథలదీ ఒకటే రుచి. కన్నీటి ఉప్పదనం. అతడి ఒక కథ సవాసేర్ ఘెవూ. అంటే సేరుంపావు గోధుమలు. ఏమిటా కథ? ఒక కల్లాకపటం ఎరగని రైతు. హాయిగా బతుకుతుంటాడు. ఒకసారి ఒక సాధువు కాశీకి వెళుతూ ఆ రాత్రికి ఆ రైతు ఇంట బస చేస్తానని అంటాడు. రైతు సంతోషంగా ఒప్పుకుంటాడు. ఇంట్లో జొన్నపిండి ఉంది. కాని సాధువుకు గోధుమ రొట్టెలు చేసి పెడితే మర్యాద కదా అంటుంది భార్య. గోధుమలు లేవు. ఏమిటి దారి? రైతు ఆ ఊరి పురోహితుడి దగ్గరకు వెళ్లి అప్పుగా అని చెప్పి సేరుంపావు గోధుమలు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోతాడు. ప్రతి సంవత్సరం పంట పండాక ఊళ్లో అన్ని కులాల వారికి మేర ఇచ్చినట్టే పురోహితుడికి కూడా ఇస్తున్నాను కదా అన్ని సేర్ల గోధుమలు ఉచితంగా పట్టుకెళుతున్న పురోహితుడికి నా బాకీ చెల్లేసినట్టే కదా అనుకుంటాడు. కాని అతడి లెక్క తప్పు. ఐదేళ్ల పాటు పురోహితుడు ఒక్కమాటా మాట్లాడడు. రైతు కనిపించినా అసలా ప్రస్తావనే ఎత్తడు. ఐదేళ్ల తర్వాత చల్లగా లెక్క తీస్తాడు. ఆనాడు రైతు తీసుకున్న సేరుంపావు గోధుమల ధరను రొక్కంలోకి మార్చి దానికి వడ్డీ వేసి మారువడ్డీ వేసి చక్రవడ్డీ వేసి బండెడు అప్పు తేలుస్తాడు. నీ ఇష్టం. తీర్చకపోతే పైలోకాల్లో దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటాడు. పైలోకాలు ఎలా ఉంటాయో రైతుకేం తెలుసు? దేవుడు సమాధానం కోరితే ఏం చెప్పాలో అంతకన్నా ఏం తెలుసు? అవన్నీ తెలిసింది పురోహితులకే. అయ్యా పురోహితులుగారూ... తమరు చేసింది మోసం. రేపు మీరైనా దేవుడికి సమాధానం చెప్పాలి కదా అనంటే పురోహితుడు లెక్క చేయడు. తాను దైవానికి భయపడను అంటాడు. అలా భయపడాల్సిన పని నోరులేని జనాలదే. ఇక చేసేదేముంది? బంగారం లాంటి రైతు. ఆ అప్పు తీర్చలేక- కేవలం సేరుంపావు గోధుమల అప్పు తీర్చలేక- డబ్బులు చెల్లించీ చెల్లించీ చివరకు పొలాన్ని పోగొట్టుకొని ఆఖరుకు ఆ పురోహితుడి పొలంలోనే వెట్టికి చేరుతాడు. ఈ కథలో రైతు ప్రాణాలతో అయినా మిగిలాడు. మరో కథలో అది కూడా లేదు. ప్రేమ్‌చంద్ రాసిన అతి బీభత్సమైన కథ- సద్గతి. ఒక మాదిగవాడు. జ్వరం నుంచి బయటపడి ఆ పూటే లేస్తాడు. కానీ కూతురి నిశ్చితార్థానికి ఆ రోజే పురోహితుణ్ణి ఇంటికి పిలుచుకుని రావాలి. పురోహితుడొచ్చి ముహూర్తం పెట్టకపోతే ఏ ఇంట ఏ పని జరుగుతుందని? మాదిగవాడు పురోహితుడి ఇంటికి బయలు దేరి- పెద్దవాళ్ల దగ్గరకు ఉత్తచేతులతో పోకూడదు కనుక ఆ నీరసంలోనే గడ్డి కోసి మోపు కట్టి తీసుకెళతాడు. మాదిగవాణ్ణి ముట్టుకోకూడదుగాని అతడు కష్టించి కోసిన గడ్డికి ఏం మైల? పురోహితుడు తీసుకుంటాడు. కాని ఇంటికి మాత్రం రాడు. కాస్త ఆ పని చెయ్ అంటాడు. చేస్తాడు. కాస్త ఈ పని చెయ్ అంటాడు. చేస్తాడు. పెరడంతా ఊడ్చు అంటాడు. ఊడుస్తాడు. ఒక పెద్ద చెట్టు మొద్దు పెరట్లో పడేసి కట్టెలు కొట్టు అంటాడు. పాపం మాదిగవాడు. జ్వరం ఇంకా పోలేదు. కడుపులో పచ్చి మంచినీరు కూడా పడలేదు. కాని తప్పదు. కూతురి నిశ్చితార్థం కోసం, తాను పెట్టుకోలేని ముహూర్తం కోసం ఆ చాకిరి తప్పదు. ఓపిక తెచ్చుకుంటాడు. కాని మొద్దు వాడి గొడ్డలికి లొంగదు. చేతుల్లో బలం చాలదు. ఆకలి. శోష. ఎండిపోతున్న నోరు. నడుమ పురోహితుడి భార్య వచ్చి వాణ్ణి చీదరగా చూసి ఇంట్లో ఒకటి రెండు రొట్టెలు ఉన్నా పెట్టదు. ఏం తల్లీ... రెండు రొట్టె ముక్కలు పెడితే ఏం పోయే... మాదిగవాడు ఏడుస్తాడు. మళ్లీ శక్తి తెచ్చుకొని మొద్దు ఎందుకు లొంగదో చూద్దాం అని... గొడ్డలి విసురుతూ విసురుతూ.. కింద పడిపోయి... గుడ్లు తేలేసి... ఊళ్లో పెద్దగోల అవుతుంది. మాదిగపల్లె ఆడవాళ్లంతా వచ్చి బ్రాహ్మణుడి ఇంట అడుగుపెట్టకూడదు కనుక బయటి నుంచే ఏడ్చి శాపనార్థాలు పెట్టి పోతారు. ఆ కోపంతో శవం తీయడానికి ఎవరూ రారు. వాన మొదలవుతుంది. శవం అలాగే పడి ఉంటుంది. ఇక ఈ మాదిగవాడికి సద్గతి ఏది? పురోహితుడు ఆలోచిస్తాడు. కాసేపటికి ఒక కర్రతో వాడి కాలు ఎత్తి, దానికి తాడుతో ఉచ్చు వేసి దానిని ఏ మాత్రం అంటుకోకుండా లాక్కుంటూ వెళ్లి దూరాన పశువులు చస్తే పారేసే దిబ్బ మీద పారేసి వస్తాడు. మరుసటి రోజు తెల్లారుతుంది. పురోహితుడు యథావిధిగా లేచి ఇల్లంతా సంప్రోక్షణ చేసి నీళ్లు చిలకరించి తన దైనందిన జీవితంలో పడతాడు. కథ ముగుస్తుంది. ఏం కథ ఇది! సద్గతి ఎవరికయ్యా రావాల్సింది? ఈ కులాల వ్యవస్థకి కాదా. ఈ అంటరానితనానికి కాదా. ఈ దోపిడీ ముఠాలకు కాదా. ఈ నీతిమాలిన మనుషులకు కాదా. ఈ కనికరం లేని ఆచారాలకు కాదా. ఇన్నాళ్లు గడిచాయి. పరిస్థితిలో ఏ మార్పూ లేదు. సంస్కారాన్ని ఆశించాల్సి ఉంది. పని కొనసాగించాల్సి ఉంది. అదిగో- ప్రేమ్‌చంద్ మొదలెట్టిన ఆ పనిని కొనసాగించడానికి- నిబద్ధతతో స్వీకరించడానికి- చాలామంది- నిజంగానే చాలామంది -కథలు రాస్తుంటారు. - ఖదీర్ -
చట్టం చేయలేనిది సంస్కారం చేస్తుంది: జస్టిస్ నర్సింహారెడ్డి
హైదరాబాద్: స్త్రీలను గౌరవించే చోట సిరిసంపదలు తుల తూగుతాయని, మహిళలు, చిన్నారుల పట్ల బాధ్యతను పెంపొందించుకున్నప్పుడు మహోన్నత సమాజం ఆవిష్కృతమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి అన్నారు. చట్టం చేయలేని పనులు సందర్భాల్లో సంస్కారం చేస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. బుధవారం నారాయణగూడ కేశవ మెమోరియల్ విద్యాసంస్థలకు చెందిన ప్రకాశం హాలులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్(ట్రస్టు) తదితర సంస్థల ఆధ్వర్యంలో ‘‘స్త్రీలు, చిన్న పిల్లలపై సమాజం బాధ్యత’’ అంశంపై జరిగిన సదస్సులో ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణితో కలిసి జస్టిస్ నర్సిం హారెడ్డి పాల్గొని ప్రసంగించారు. న్యాయం జరిగేందుకు అవకాశం ఉన్నా కొన్ని సాంకేతిక అంశాల వల్ల కోర్టులకు వెళ్లలేని బాధితుల వద్దకు వెళ్లి న్యాయం అందించేందుకు లీగల్ సర్వీస్ అథారిటీ కృషి చేస్తోందని ఆయన వివరించారు.