చదువూ సంస్కారమూ... | Caduvu cover ... | Sakshi
Sakshi News home page

చదువూ సంస్కారమూ...

Published Fri, Oct 30 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

చదువూ సంస్కారమూ...

చదువూ సంస్కారమూ...

మీరు విద్యార్థులు. విద్యను ఆర్జించేవారు. విద్యలో విద్ అంటే తెలుసుకొనుట. ఇది రెండు రకాలు. ఏది తెలుసుకోవడం వల్ల జీవితంలో సమస్త భోగాలు కలుగుతాయో, చాలా గొప్ప కీర్తి కలుగుతుందో, దేనివల్ల సమస్త సౌకర్యాలు జీవితంలో మనకు సమకూరుతాయో దానిని లౌకిక విద్య అంటారు. మరొకటి ఉంది. ఏది తెలుసుకొనడం వలన ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదో దానిని బ్రహ్మవిద్య అంటారు. లౌకిక విద్యాభ్యాసం వల్ల మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రభుత్వంలో కానీ, సమాజంలో కానీ సమున్నత స్థానం పొంది బాగా డబ్బు సంపాదించుకోగలుగుతారు,అలాగే కీర్తి ప్రతిష్ఠలు కూడా. కానీ రెండవది దాని కొరకు గాదు. అది దేని కొరకు అంటే... ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కొరకు.

ఇప్పుడు మీరు లౌకిక విద్యయందున్నారు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఇది బ్రహ్మవిద్యకు దారితీయవచ్చు. విద్ అంటే చదువుకొనుట, తెలుసుకొనుట అని చెప్పుకున్నాం కదా ! దీనికి పక్కన మరొక మాట ఉంటుంది-సంస్కారం. చదువూ సంస్కారం ఉండాలండీ అంటూంటారు కదా! ఇక్కడ చదువు అంటే తెలుసుకొనుట, అది కూడా నిరంతర ప్రయత్నంగా. విద్యార్థి దశలో ఏం చేయాలో శాస్త్రం కచ్చితంగా చెప్పింది. విద్యాసముపార్జన తప్ప వేరొక్కటి కూడదు అన్నది. విద్యార్థి దశ అంతా చదువుకొనుటకే, తెలుసుకొనుటకే తప్ప మరిదేనికీ కాదు, చివరకు సేవకు కూడా కాదు. తెలుసుకోవలసినవన్నీ బాగా తెలుసుకున్న నాడు, ఉద్యోగంలోకి వచ్చిన రోజున, అంతకుముందు విద్యార్థి దశలో సేవ ఎలా చేయాలని తెలుసుకున్నారో అప్పుడు అలా చేయాలి. విద్యార్థి దశలో మాత్రం విద్యాసముపార్జనం తప్ప మరే కార్యక్రమం చేపట్టినా అది దోషభూయిష్ఠమే, శరాఘాతమే.

సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డివిద్య అన్నారు. చదువు ప్రయోజనం నెరవేరడం కోసం, సంస్కారం ఏర్పడడం కోసం గురువుకీ శిష్యుడికీ మధ్య ఒక సంబంధం ఉంటుంది. శాస్త్రం గురువును వినీతుడు అంటుంది. అంటే వినయం నేర్పువాడు - అని. మరి శిష్యుడు... విధేయుడు. అంటే వినయం నేర్చుకొనువాడు. వినయం లేని ఏ చదువు మీరు చదివినా అది సమాజానికి భారమే. సంస్కారం దేని వలన ఏర్పడుతుంది? కేవలం వినడం వలన మాత్రమే  ఏర్పడుతుంది. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషి మాత్రమే యోగ్యుడని పరమేశ్వరుడు ఆ శక్తి ఇచ్చాడు. ఇది దేనికి ? సంస్కారం ఏర్పరుచుకోవడానికి. వినడం అనేది సంస్కారమంతటికీ పునాది. నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రపోయేంతవరకు మనం అనేక రకాల మాటలు వింటూంటాం. విద్యార్థి దశలో వినే మాటలన్నీ ఒకే కోవలోకి వస్తాయి. కానీ తర్వాత మీకు జీవితంలో నాలుగు రకాల మాటలు వినిపిస్తాయి. తస్మాత్ ! జాగ్రత్త. పరాకుగా ఉండకండి.

 ఈ నాలుగు రకాల్లో మొదటిది పొగడ్త. రెండవది తెగడ్త. మూడవది స్వత్కార్యసాధన కొరకు ప్రయత్నం, నాలుగవది అభ్యుదయ హేతువు. ఈ నాలుగు మాటల పట్ల ఎవడు పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడో వాడు సంస్కారవంతుడిగా నిలబడగలడు. మొదటిది పొగడ్త. మిమ్మల్ని కొందరు అదేపనిగా పొగుడుతుంటారు. మీలో ఉన్న లోపాలు వారికి తెలియక కాదు. పొగడ్తలు వినడం, అన్నీ సబబేననుకోవడం ఎటువంటిదంటే... ఊబిలో దిగుతున్నవాడు ఎంత చక్కగా, ఎంత హాయిగా దిగుతున్నాను అనుకోవడం వంటిదే. అలా అనుకున్నవాడు ఏం చేస్తాడు... చివరికి ఊపిరి విడిచి పెట్టేస్తాడు. అలాగే అదేపనిగా పొగిడేవాడిని దగ్గరగా ఉంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే... బుద్ధి వినాశన హేతువు. అదేపనిగా వినడానికి అలవాటుపడితే మీ సంస్కారంలో దోషం వస్తుంది. అలా వారు పొగడనినాడు వారిని మీరు ఇష్టపడరు, అలా పొగిడినవారికే ఉపకారం చేస్తారు. అన్నం లేకుండా ఉండగలరు కానీ పొగడ్తలు వినకుండా గడపలేరు. అది ఒక వ్యసనంగా మారిపోతుంది. కేవలం పొగడ్తకు లొంగడం అనేది అత్యంత ప్రమాద హేతువు. అదేపనిగా పొగిడేవాడికి మీరు అంతేవాసిత్వం (శిష్యరికం) ఇచ్చారనుకోండి, అది తిరోగమనానికి దారితీస్తుంది, మీ స్వభావాన్ని పాడుచేసి వివేచనతో ఆలోచించగల మీ నైపుణ్యాన్ని ఇది భ్రష్టు పట్టిస్తుంది.

 అలాగని లోకంలో పొగడ్త వినకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు మీరు చాలా మంచిపని చేస్తున్నారు అని ఎవరయినా అంటే వినొద్దని శాస్త్రం చెప్పలేదు. వినాలి, కానీ దాని మూలాన్ని విరిచేయాలి. కోటేశ్వరరావుగారు చెప్పే విషయాలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది వింటూంటారని నిర్వాహకులు అంటారు. అది నిజమేనని నేను దానిని స్వీకరిస్తే అది నాకూ, వారికీ కూడా ఇబ్బందే. శంకరభగవత్పాదులవారి మాటలు నాకు ఒంటబట్టి చెప్పడంవల్ల నాకు ఈ కీర్తి కలుగుతున్నది, సమాజంలో నాకింత గౌరవం కలుగుతున్నది. ఈ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ శంకరులవారికి దక్కాలి, నాకు కాదు. కాబట్టి నేను ఎప్పుడూ శంకరుని పాదాలు విడవకుందును గాక అని నేనన్నాననుకోండి. ఇప్పుడు పొగడ్త వల్ల నాకు ప్రమాదమేమీ ఉండదు. నీవు లోపల మానసికంగా ఎదిగి ఉంటే ఏ పొగడ్త కూడా నిన్ను ఏమీ చేయలేదు. తెలిసీ తెలియకుండా పనసపండు కోశారనుకోండి, ఆ మరకలు ఏం పెట్టి కడిగినా పోవు. అదే ముందుగా  చేతికి నూనె రాసుకుని కోశారనుకోండి. ఎంత జిగురున్నా, మీకది ఒక్క పిసరంత కూడా అంటదు. విరుగుడు తెలిసి నిలబడితే మీకు సంస్కారబలం ఏర్పడుతుంది.

 సంస్కారబలానికి ప్రధానహేతువేది? అసలు వినకుండా ఉండడం కాదు, వినడం కూడా అవసరం. అందుకే పూర్వం రాజుల దగ్గర వంది, మాగధి అనే వారు ఉండేవారు. రాజు నిద్రలేచి వచ్చిన క్షణం నుంచీ పొగుడుతుంటారు. అలా పొగడడానికే రాజు జీతం ఇచ్చి మరీ వారిని పెట్టుకునేవాడు. వీరు ఏం చేస్తారంటే రాజుయొక్క పూర్వికులు చేసిన మంచి పనులను పొగుడుతూ, రాజు చేసే పొరబాట్లను స్తోత్ర రూపంలో చెపుతూ ఆయన్ని అప్రమత్తం చేస్తారు. ఎవడో పాడుబడిన బావిలో పడి చనిపోయాడని తెలిసి వెంటనే దానిని పూడ్చివేయమని రాజు ఆజ్ఞ జారీచేస్తాడు. వెంటనే వంది ‘‘ఓరాజా! ఈ నూతిని మీ తాతగారు తవ్వించారు. రాజ్యంలో ఉన్న క్షామం పోవాలని, కొన్ని లక్షలమంది బాగుపడాలని ఆయన ఈపని చేశారు, అంతేకానీ మనుషులు చచ్చిపోవడానికి ఈ ఏర్పాటు చేయలేదు’’ అంటుంటే, మాగధి అందుకుని ‘‘మహారాజా ! మీరు చేయబోయే ఈ పని ఇప్పుడు మంచిదిగా కనిపించినా మున్ముందు అలా ఉండకపోవచ్చు. మీరు ఇప్పటిదాకా చాలా మంచి పనులు చేసి కీర్తి గడించారు. ఇప్పుడు దానికి ప్రమాదం వాటిల్లుతుంది’’ అని స్తోత్రరూపకంగా చెపుతాడు. వెంటనే రాజు ‘‘ఔను, మా తాత మంచిపని చేశాడు’’ అని ఆ బావిని బాగుచేయించమని పురమాయిస్తాడు. ‘రాజా! ఆ నూతిని పూడ్చేయకండి’ అని మీరే నేరుగా అన్నారనుకోండి, మిమ్మల్ని పూడ్చేస్తారు. పొగడ్త హితవాక్కుగా ఉండడానికి రాజు ఈ ఏర్పాటు చేసుకుంటాడు.
 పొగడ్త ఎప్పుడూ ఎలా వినాలో తెలుసా ! వంశ ప్రతిష్ఠ వినాలి. మా తాత ఎటువంటివాడు, మా తండ్రి ఎటువంటివాడు, మా గురువు ఎటువంటివాడు, జగద్గురువులు ఎటువంటివారు, మన సనాతన ధర్మంలో వచ్చిన మహర్షులు ఎటువంటివారు, పీఠ వైభవం ఎటువంటిది.. ఇవి తెలుసుకున్ననాడు మీకు తెలియకుండానే ఒక వారసత్వ వైభవం మీకు తెలిసివస్తుంది, ఆ మర్యాదను నిలబెట్టవలసిన బాధ్యత గుర్తుకు వస్తుంది. పొగడ్త లేకుండా జీవితాన్ని గడపలేం.

ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. పాము కరిచిందనుకోండి. వ్యక్తి చనిపోతాడు. అదే పాములోని విషాన్ని వైద్యుడు సంస్కరించి ఓషధి రూపంలో ఇచ్చాడనుకోండి. అనారోగ్యం తగ్గిపోతుంది. అదీ... సంస్కరించుట. అక్కడ వచ్చింది చదువు పక్కన సంస్కారం అన్నమాట. చదువుకుంటూనే ఉండు, తెలుసుకుంటూనే ఉండు, ఎందుకు... నీ అంతట నీవు సమాజంలో నిలబడవలసిన రోజు వచ్చిన నాడు, ఏది ఎక్కడవరకు ఉంచాలో ఏది దగ్గరకు తీసుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అన్నింటినీ కౌగిలించుకోవడం అలవాటయిపోతే ఒళ్లు కాలిపోతుంది. అదీ సంస్కారబలం అన్నమాటకు అర్థం.
 రెండవది తెగడ్త. అంటే నిరసించుట. అవతలివాడియందు ఆ లోపం ఉన్నదా, అలా విమర్శించడానికి అవకాశం ఉన్నదా... తెలిసి విమర్శించు. మీయందు దోషమున్నది, దానిని నేను విమర్శించాననుకోండి, తెగిడాననుకోండి, అది హితవాక్కవుతుంది. ఉదాహరణకు - మీకు అన్నం కూడా మానేసి చదువుకునే అలవాటు ఉన్నదనుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి అది తప్పు. మీరెంత చదువుకున్నా, ఇలా చదువుకుంటే ఎందుకూ పనికిరారు. మీరు వేళపట్టున ఆహారం తీసుకోవడం, స్వల్ప వ్యాయామం చేయడం, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడం కూడా అవసరం. అప్పుడు మీరు చదువుకున్న చదువు మీకు ఒంటపడుతుంది అని నేనన్నాననుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తెగిడాను అనరు. మిమ్మల్ని సంస్కరించాను అంటారు. అసూయాజనితమయితే తెగడ్త అనే మాట వస్తుంది. సంస్కృతంలో నాకన్నా బాగా చదువుకున్న వ్యక్తి వచ్చి నాముందు నిలబడ్డాడనుకోండి. నేను వారి మాటలు విని ఆ తర్వాత పక్కకు వెళ్ళి ‘ప్చ్! ఆయనలా మాట్లాడేంటండీ, అన్నీ తప్పులండీ’ అన్నాననుకోండి.

అది అసూయా జనితం. నాకు లోపల తెలుసు, ఆయన నా కన్నా మహాపండితుడు. కానీ నేనది అంగీకరించడానికి నా గర్వం నాకు అడ్డొస్తోంది. ఆయన మహా విద్వాంసుడండీ, అటువంటి వారి దర్శనం కలగడం ఈ వేళ నా అదృష్టం అని అనగలిగాననుకోండి. అప్పుడు నేను సంస్కారవంతుడనయి ఉన్నానంటారు. అందువల్ల చదువు ఒక్కటే చాలదు. దానికి సంస్కారం కూడినప్పుడే విలువనిస్తుంది. ఈ సంస్కారం ఇచ్చేది కూడా విద్యే. విద్య మనకిచ్చే గొప్ప విలువల్లో సంస్కారం ఒకటి. సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడున్నదీ అంటే... ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కోసమే అలా మాట్లాడారని అనుకోవడం నీ సంస్కారం. అలాకాక, పెద్దల వాక్కులో కాఠిన్యం చూడడం అలవాటయితే అది సంస్కార రాహిత్యం అవుతుంది. అలాగాక వారు ఎందుకోసం అలా మాట్లాడారా అని ఆలోచించి, దానిలోని మంచిని గ్రహించడం, ఆచరించడం మీ సంస్కారానికి నిదర్శనం.
 
 సంస్కారం... సంయత్ కరము అంటే బాగుగా చేయుట అని. మీరు ఏయే చదువులు చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్లబోతున్నారో అది సమాజాన్ని పాడు చేసేదిగా ఉండకుండా జాగ్రత్తపడడం. ఒకడికి బలం ఉందనుకోండి. ఆ బలంతో బలహీనుడిని రక్షించవచ్చు, వాడిని హింసించి వాడికి నష్టం కలిగించనూ వచ్చు. ఒకడి దగ్గర చదువు ఉందనుకోండి. దానితో మరొకడిని వృద్ధిలోకి తీసుకురావచ్చు, అదే చదువుతో పదిమందిని మోసం కూడా చేయవచ్చు. కాబట్టి సంస్కారాన్ని చదువు పక్కన ఎందుకు ఉంచారంటే... నీకు దేనివల్ల ప్రకాశం కలుగుతుందో, దేనివల్ల లోకభాగ్యాలను పొందబోతున్నావో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలోని అభ్యుదయానికి అడ్డంకి కాకుండా ఉండడానికి. దీనికి అవసరమయిన మర్యాదలను నేర్పడానికే సంస్కారమని పేరు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement