ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీకి ఉన్న క్లీన్ ఇమేజ్.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని అన్నారు. లోకమాన్య తిలక్ అవార్డ్ అందుకోవడానికి ప్రధాని మోదీ మహారాష్ట్రకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన పవార్.. ప్రధాని మోదీని కొనియాడారు. దేశంలోనే గాక అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు.
ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం ప్రతి రోజూ 18 గంటలపాటు పనిచేస్తున్నారు. దివాళీ సందర్భంగా దేశమంతా ఇంట్లో పండగ చేసుకుంటే ఆయన మాత్రం సరిహద్దుల్లో సైన్యంతో దివాళీ జరుపుకుంటారని అజిత్ పవార్ అన్నారు. గత తొమ్మిదేళ్లుగా చూస్తున్నాం.. ప్రధాని మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఇంకెవరికీ లేవు అంటూ అజిత్ పవార్ మోదీని కొనియాడారు. ఇందిరా గాంధీకి అప్పట్లో ఇదే విధమైన గౌరవం దక్కింది. మళ్లీ రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరుంది. అదే విధమైన గౌరవాన్ని ప్రధాని మోదీ పొందుతున్నారని అజిత్ అన్నారు.
ఇటీవలే ఎన్సీపీని చీల్చి అధికార బీజేపీ పార్టీలో చేరిన అజిత్ పవార్.. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. నిజాన్ని మాట్లాడటంలో ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అభివృద్ధే ప్రధానమని తెలిపిన అయన.. ప్రతిపక్షంలో ఉంటే సాధించలేమని అన్నారు. అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటే ధర్నాలు, ఆందోళనలు మాత్రమే చేయగలం.. అభివృద్ధి కాదంటూ అజిత్ పవార్ మాట్లాడారు.
'మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రజలందరూ స్వాగతం పలికారు. నేను, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ కాన్వాయ్‌లోనే ఉన్నాం. ఎవరు కూడా నల్ల జెండాలను చూపించలేదు. రోడ్డుకు ఇరువైపులా నిలపడి మోదీకి స్వాగతం పలికారు. దేశంలో రక్షణ పరంగా మంచి వాతావరణం ఉండాలని ఏ ప్రధానియైనా కోరుకుంటారు. మణిపూర్ అంశాన్ని ఎవరు కూడా మద్దతివ్వరు. ప్రధాని ఆ సమస్యను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తోంది. మణిపూర్ అంశాన్ని అందరం ఖండిస్తున్నాం.' అని అజిత్ పవార్ అన్నారు.
ఇదీ చదవండి: గణేషుడి గుడిలో అలా ప్రధాని మోదీ.. బీఆర్‌ఎస్ నేతపై బీజేపీ శ్రేణుల మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment