కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అరంగేట్రంలోనే అదరగొట్టేసింది. రికార్డు మెజార్టీతో విజయాన్ని సాధించి తాను నానమ్మ, ఐరన్ లేడీ, మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత ఇందిరాగాంధీ వారసురాలినని ఢంకా బజాయించింది. అంతేకాదు తన తండ్రి, దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. సోదరుడు రాహుల్ గాంధీ, సోనియాలకు ‘బంగారుతల్లి’ గా నిలిచింది.
ముఖ్యంగా బీజేపీతో అలుపెరుగని పోరు సలుపుతున్న రాహుల్ గాంధీకి కొండంత అండగా పార్లమెంటులో అడుగు పెట్టబోతోంది. రూపు రేఖలు, హావభావాలే కాదు, రాజకీయాల్లోనూ నానమ్మను మరిపించనుందన్న నిపుణుల అంచనాలను నిజం చేసేందుకు రివ్వున దూసుకుపోనుంది.
ప్రచార జోరు,విమర్శనాస్త్రాలు వాగ్బాణాలు
వయనాడ్ ఉపఎన్నికల ప్రచారంలో చాలా ఆత్మవిశ్వాసంతో దూసుకుపోయారు ప్రియాంక. అచ్చం నానమ్మ ఇందిరలాగానే అట్టడుగు ప్రజలతో సంభాషిస్తూ, వారితో మమేకమైపోయారు. అందుకే వయనాడ్ ప్రజలు ఆమెకు దిగ్విజయాన్ని అందించారు. అయితే అపూర్వ విజయం అంత తేలిగ్గా రాలేదు. ఎన్నో అవమానాల్ని, అవహేళనల్ని ఎదుర్కొన్నారు. అటు కుటుంబం, పిల్లలు బాధ్యతలను మోస్తూనే, పార్టీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. అతిక్లిష్టమైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆశాదీపంలా వెలుగులు పంచారు. పార్టీకార్యకర్తలకు చుక్కానిలా నిలిచారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ తోపాటు, పార్టీ దిగ్గజాలకు అండగా నిలిచారు. భారత్ జోడోయాత్ర , వివిధ రాష్ట్రాల, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పాత్ర కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది.
My dearest sisters and brothers of Wayanad,
I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024
గళం వినిపించేందుకు సిద్ధం!
ఈ ఘన విజయంపై ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా వయనాడ్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై పై ఉంచిన నమ్మకానికి ఉప్పొంగి పోతున్నాను అంటూ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో వయనాడ్ గళం వినిపించేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘‘నా తల్లి, భర్త, పిల్లలు అందించిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతలూ సరిపోవు. రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారిచూపి, నా వెన్నంటి నిలిచినందుకు థ్యాంక్యూ’’ అని ప్రియాంక సంతోషం ప్రకటించారు. అంతేకాదు స్థానిక భాషలో ట్వీట్ చేసి కేరళీయుల మనసుల్లో మరో మెట్టు ఎక్కేసింది ప్రియాంక.
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉపఎన్నికలో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ వాద్రా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇదే స్థానంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ గెలుపొందారు. ఇక్కడ రాహుల్ రాజీనామాతో ప్రియాంక గాంధీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజా విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉత్తరాదిన రాహుల్ దక్షిణాదిన ప్రియాంక కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తారా..చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment