ఉప ఎన్నికలో నన్ను గెలిపించండి.. మీ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరుస్తా
వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ప్రజా పోరాటాలు తనకు కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం పోరాటం సాగించానని, అదే తన జీవితానికి కేంద్ర బిందువు అని వెల్లడించారు.
ఈ మేరకు వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ప్రియాంక శనివారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ వారికి ప్రతినిధిగా వ్యవహరించారని తెలియజేశారు. వయనాడ్ ప్రజలతో కలిసి పనిచేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని వయనాడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు.
ప్రజా సేవకురాలిగా తన ప్రయాణానికి వయనాడ్ ప్రజలే మార్గదర్శకులు, గురువులు అని ప్రియాంక స్పష్టంచేశారు. తన సోదరుడు రాహుల్ గాం«దీపై చూపిన ప్రేమానురాగాలే తనపైనా చూపించాలని కోరారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, అరుదైన వనరులను బహుమతిగా పొందిన వయనాడ్‌కు ప్రజాప్రతినిధి కావడం తన అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment