ఆ లేఖల్లో ఏముంది? | BJP demands Sonia Gandhi and Rahul Gandhi return papers to PMML | Sakshi
Sakshi News home page

ఆ లేఖల్లో ఏముంది?

Published Tue, Dec 17 2024 3:44 AM | Last Updated on Tue, Dec 17 2024 3:44 AM

BJP demands Sonia Gandhi and Rahul Gandhi return papers to PMML

నెహ్రూ లేఖలపై రాజకీయ రగడ 

పీఎం మ్యూజియం నుంచి సోనియా చెంతకు 

2008లో యూపీఏ హయాంలో ఉదంతం 

తిరిగివ్వాలని కోరిన మ్యూజియం వర్గాలు 

వాటిలో ఎడ్వినా–నెహ్రూ రాసుకున్న లేఖలు 

మరోసారి తెరపైకి వారిద్దరి సాన్నిహిత్యం 

వ్యక్తిగత ఆస్తి కాదు, తిరిగివ్వాల్సిందే: బీజేపీ 

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. 

చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్‌)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్‌ తాజాగా సోనియాను కోరింది. 

కనీసం జిరాక్సులో, పీడీఎఫ్‌లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు.

 ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్‌ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్‌గాం«దీకి పీఎంఎంల్‌ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్‌ కాద్రీ డిసెంబర్‌ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్‌స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్‌ అలీ, బాబూ జగ్జీవన్‌రాం, జేబీ పంత్‌ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్‌ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్‌లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 

దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ డిమాండ్‌ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్‌సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు.

 దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్‌లోని లేఖల డిజిటైజేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు.              

‘గాఢమైన’ బంధం 
నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్‌ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. 

మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్‌జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్‌ భారత్‌ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement