సాక్షి, న్యూఢ్లిలీ : కాంగ్రెస్ పార్టీలో ఓ శకం ముగిసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మూడు తరాల నాయకులకు నమ్మకమైన వ్యక్తిగా సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ మృతిచెందారు. నిజ జీవితంలో, రాజకీయాల్లోనూ అజాతశత్రుగా కీర్తిగఢించి ప్రణబ్ కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవచేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా యావత్ దేశానికీ తీరనిలోటుగా పలువురు వర్ణిస్తున్నారు. ఇటీవల బ్రెయిన్ క్లాట్ కోసం సర్జరీ చేయించుకున్న ప్రణబ్ ముఖర్జీకు ఆపరేషన్ సమయంలో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో దాదాపు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచారు.
నాలుగు తరాలను ముందుండి నడిపించారు..
1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్‌లో జన్మించిన ప్రణబ్‌ముఖర్జీ ఎమ్‌ఏ, న్యాయవాద విద్యలనూ పట్టా అందుకున్నారు. అనంతరం కొంతకాలంపాటు లెక్చరర్‌గా పనిచేశారు. తొలినుంచి సామాజిక దృక్పథం కలిగిన ప్రణబ్.. పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి1969 కోల్‌కత్తాలోని మిడ్నాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించించారు. వెంటనే ప్రణబ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తన అక్కున చేర్చుకుంది. అనంతరం 34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఎంపికై నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా పేరుబడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా 1975, 1981, 1993, 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఇందిరా గాంధీ మరణం అనంతరం రాజీవ్‌కు అండగా నిలబడి.. కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. పీవీ నరసింహారావు హాయంలో 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులైయ్యారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంలో కీలకపాత్ర పోషించారు. ఇందిరా గాంధీ, రాజీవ్, సోనియా, రాహుల్ నాయకత్వంలోనూ కాంగ్రెస్‌కు అండగా నిలిచి.. నాలుగు తరాలను ముందుండి నడిపించారు.
ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి హాజరు..
2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీయే ప్రభుత్వంలో 2004 నుంచి 2012 వరకు కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు సమర్థవంతగా నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ను గుర్తింపబడ్డారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. బీజేపీ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత అవార్డును ప్రకటించడం గమనార్హం. 2012 జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2018లో ఆరెస్సెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరైన తొలి మాజీ రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలో కొన్ని వర్గాల నుంచి విమర్శలతో పాటు.. అజాతశత్రుగా కూడా పేర్కొనబడ్డారు.
కాంగ్రెస్ కుటిల రాజకీయం..
1984లో అప్పటి ప్రధాని ఇందిరా హత్య తర్వాత తానే నిజమైన వారసుడిగా భావించిన ప్రణబ్ డిమాండ్‌ను తోసిపుచ్చి రాజీవ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అనుకున్న పదవి దక్కకపోవడంతో 1984లో కాంగ్రెస్‌కు ప్రణబ్ గుడ్‌బై చెప్పారు. రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పేరుతో 1984లో ప్రణబ్ సొంత పార్టీ స్థాపించారు.1989లో రాజీవ్‌గాంధీ ఆయన్ని బుజ్జగించి తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారు.1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రధాని అయ్యేందుకు ప్రణబ్ ప్రయత్నాలూ చేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని కాదనుకుని పీవీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాల ఫలించకపోతే ప్రణబ్ ఎప్పుడో దేశ ప్రధాని అయ్యేవారిని ఆయన సహచరులు చెబుతుంటారు. ఆరు దశాబ్ధాల పాటు రాజకీయల్లో కొనసాగిన దాదా.. పార్లమెంటు వ్యవహారాల్లో ఆయన్ని మించిన వారు లేదనే విధంగా మెలిగారు.
తెలంగాణ బిల్లుపై సంతకం..
ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుభందం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ సంతకం పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునః విభజన బిల్లుపై సంతకం చేశారు. ఆయన జారీచేసిన ప్రత్యేక గెజిట్ ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారు.
ఆసియా అత్యుత్తమ ఆర్థిక మంత్రి
మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’ పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment