న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ హింసపై అధికార, విపక్షాల మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించనున్నారు. మోదీ ఇంటి పేరు కేసులో శిక్ష కారణంగా నాలుగు నెలల తర్వాత పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రాహుల్.. అవిశ్వాస తీర్మానంపై చేయనున్న తొలి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు, ఎల్లుండి కూడా అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
ఈ క్రమంలో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? దాన్ని ఎలా, ఎప్పుడు ప్రవేశపెడతారు? ఇప్పటి వరకు స్వతంత్ర భారత దేశంలో ఎన్నిసార్లు ప్రతిపాదించారు? ఎవరూ నెగ్గారు? ఎవరూ ఓడిపోయారు? ఎవరిపై ఎక్కువసార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..
చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగం.. ఏం మాట్లాడనున్నారు?
గత ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు
అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రజలకు, దేశానికి జవాబుదారీగా ఉంచడానికి ఉపయోగించబడింది. ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో వాటిని పడగొట్టడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.
►దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి 2018లో నరేంద్ర మోదీ వరకు అనేకమంది నేతలు ఈ అవిశ్వాన్ని ఎదుర్కొన్నారు. మొదటిసారిగా 1963లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై విపక్ష నేత ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశ పెట్టారు. 1962లో చైనాతో జరిగిన యుద్దంలో భారత్ ఓడిపోవడంతో ఆగస్టులో నెహ్రూపై ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తర్వాత
చదవండి: ‘బిల్కిస్ బానో’ కేసులో దోషులను వదలొద్దు
►మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాసాలను ఎదుర్కొన్నారు. అయితే అన్నింట్లోనూ ఆమె విజయం సాధించారు.
► లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు (మూడు చొప్పున), మొరార్జీ దేశాయ్ (రెండు), జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ఒకొక్కసారి ఎదురుకున్నారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్‌తోపాటు 1999లో వాజ్‌పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు.
► దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. తాజాగా మోదీ ఎదుర్కొంటున్నది 28వ తీర్మానం.
►చివరి సారి 2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోగా.. 199 ఓట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం మరోసారి మోదీ ప్రతిపక్షాల నుంచి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. దీంట్లోనూ బీజేపీ సర్కార్ తప్పక విజయం సాధించే అవకాశం ఉంది.
అవిశ్వాస తీర్మానం అంటే..
అవిశ్వాస తీర్మానం అనేది కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని తెలియజేసేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే పార్లమెంటరీ సాధనం. దీనిని స్పీకర్ ఆమోదీస్తే విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అధికార పక్షం లోక్‌సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం వెంటనే పడిపోతుంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
ప్రతిపక్షాల ఆయుధం
ప్రతిపక్షాలు తరచుగా ఓ వ్యూహాత్మక సాధనంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తూ ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, వారి వైఫల్యాలను ఎత్తిచూపడానికి, వీటన్నింటినీ సభలో చర్చించడానికి ఉపయోగపడుతోంది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కూడా ఈ తీర్మానం కీలక పాత్ర పోషిస్తోంది. అదే సభలో తీర్మానం ఆమోదం పొందితే ప్రధానితో సహా మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయాలి.
లోక్‌సభ ప్రత్యేక హక్కు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం కేంద్ర కేబినెట్ సమిష్టిగా లోక్‌సభకు జవాబుదారీగా ఉంటుంది. అవిశ్వాస ప్రతిపాదనను కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ప్రవేశపెట్టగలవు. అలాగే లోక్‌సభలో మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభలో ప్రతిపాదించేందుకు అనుమతి లేదు. పార్లమెంటులో సభ్యత్వం కలిగిన ఏ పార్టీ అయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే అధికారంలో కొనసాగడానికి ప్రభుత్వం తప్పక తన మెజారిటీని నిరూపించుకోవాలి.
చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం
ఎలా ప్రవేశపెడతారు..
లోక్‌సభ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. లోక్‌సభ నియమాలు 198(1), 198(5) ప్రకారం స్పీకర్ చెప్పిన తర్వాత మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభకు తీసుకురావాల్సిన సమాచారాన్ని ఉదయం 10 గంటలలోపు సెక్రటరీ జనరల్‌కు ఆయన కార్యాలయంలో లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సభలో అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది.
తీర్మానం ఆమోదం పొందితే.. చర్చకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. దీనిపై అధికార పార్టీతో సహా, ప్రతిపక్షాలు చర్చిస్తాయి. అంతేగాక రాష్ట్రపతి సైతం తమ మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని కోరవచ్చు. ప్రభుత్వం నిరూపించుకోలేకపోతే మంత్రివర్గం రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ స్వయంగా ప్రకటిస్తారు.
మరోవైపు మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటమి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మూడు నెలలుగా మణిపూర్ హింస రుగులుతున్నా పరిస్థితులను అదుపు చేయడంలో, శాంతి భద్రతలు పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి(జూలై20) దీనిపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాల మొండిపట్టుతో సభలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment