న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఫోబియాలో నిండా కూరుకుపోయారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది. అందుకే గురువారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిచ్చే క్రమంలో దాదాపు రెండు గంటల ప్రసంగంలో ఆసాంతం కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించింది. ప్రధాన సమస్య అయిన మణిపూర్ జాతుల హింసాకాండను కేవలం ప్రస్తావనతో సరిపెట్టారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ దుయ్యబట్టారు. ప్రధాని ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావన లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సహా పలు విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంట్ ఆవరణలో నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీది కుహనా జాతీయవాదమని గొగొయ్ ఆరోపించారు. వాళ్లసలు దేశ భక్తులే కారన్నారు.
‘మణిపూర్‌లో హింసాకాండను అదుపు చేయడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతోంది. విపక్ష ఇండియా కూటమి నిండు సభలో తన కళ్ల ముందే ఒక్కతాటిపై రావడం, ఇండియా, ఇండియా అంటూ నినాదాలతో హోరెత్తించడాన్ని మోదీ భరించలేకపోయారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇండియా కూటమి పోరాడుతుంది. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారంలోకి వస్తుంది‘ అని ధీమా వెలిబుచ్చారు. ‘మేం లేవనెత్తిన మూడు ప్రశ్నలకు బదులివ్వనందుకు, మణిపూర్ బీజేపీ ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు, అన్ని రకాలుగా విఫలమైన మణిపూర్ సీఎంకు క్లీన్ చిట్ ఇచ్చినందుకు, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులపై మౌనంగా ఉన్నందుకు... ఇలాంటి పలు కారణాలతో మేం వాకౌట్ చేశాం‘ అని వివరించారు.
‘రావణుడు తనను తాను మహా మేధావిని అనుకునేవాడు. కానీ అహంకారమే అతని పతనానికి కారణమైంది‘ అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, విదేశీ చట్ట సభల్లో పేరు గొప్ప ప్రసంగాలు మాని మన పార్లమెంటులో దేశ సమస్యలకు సమాధానాలు ఇచ్చేలా చేయడమే మా అవిశ్వాస తీర్మానం లక్ష్యం. రోజుల తరబడి పోరాడి మోదీని లోక్ సభకు రప్పించడంలో ఇండియా కూటమి విజయం సాధించింది. కానీ రాజ్యసభలో కూడా చర్చలో పాల్గొనాలనే ఇంగితం ఆయనలో లేకపోయింది‘ అంటూ తూర్పారబట్టారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ..‘మణిపూర్ అంశంపై మాట్లాడాలని ప్రధానిని కోరాము.
ఒక గంటా 45 నిమిషాల ప్రసంగం ముగిసినా మణిపూర్ పేరును ఆయన ప్రస్తావించనేలేదు. ఆయన మొత్తం రాజకీయాలపైనే మాట్లాడారు. అందులో కొత్తేముంది? గతంలో మాదిరిగానే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. దేశ ప్రజలకు ఆయన చెప్పేదేమిటో మనకు తెలియదా? అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రశ్నలకు ఆయన ప్రసంగంలో ఎటువంటి సమాధానాల్లేవు’అని అన్నారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ..మణిపూర్ సహా దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న మిగతా ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రధాని మోదీ మాట్లాడతారని మేమంతా ఎదురుచూశాం. ఆయన మాత్రం రాజకీయ ప్రసంగం చేశారు.
అవిశ్వాస తీర్మానం లక్ష్యం నెరవేరలేదు. ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగించాం. ఆయన స్పందించలేదు’అని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ..దేశ చరిత్రలో గొప్ప స్పిన్నర్ ఎవరనే చర్చ ముగిసింది. అది ఎవరో కాదు ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వమే. 90 నిమిషాల ప్రసంగంలో అసలు అంశం మణిపూర్‌పై ప్రసంగించలేదు. ప్రధాని సభకు వచ్చి, మణిపూర్ సమస్యపై ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం చెబుతారనే లక్ష్యంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఇది దేశ సమగ్రతకు అవమానం. అందుకే మేం వాకౌట్ చేశాం’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment