Parliament Monsoon Session Updates: Rahul Gandhi No Confidence Motion Debate In Lok Sabha - Sakshi
Sakshi News home page

No Confidence Motion: పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

Published Tue, Aug 8 2023 8:59 AM | Last Updated on Tue, Aug 8 2023 9:29 PM

Parliament Sessions Rahul Gandhi No Confidence Motion Debate Updates - Sakshi

No Confidence Motion Day-1 Live Updates 

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటి(బుధవారం)కి వాయిదా.

► పార్లమెంట్‌ సాక్షిగా ఆర్టికల్‌ 370 రద్దయ్యి నాలుగేళ్లు పూర్తి కావొచ్చింది. కానీ, ఇంకా అక్కడ ఎన్నికలు జరగలేదు అని ఎంపీ తివారి అన్నారు. ఆ టైంలో కొందరు ఎన్డీయే ఎంపీలు ‘ఈ వ్యవహారం కోర్టులో ఉందని.. సభలో చర్చించొద్ద’ని తివారికి సూచించారు. వెంటనే తివారి ‘నేషనల్‌ హెరాల్డ్‌ కేసు న్యాయస్థానంలోనే ఉంది కదా!’ అని వాళ్లను ఎదురు ప్రశ్నించారు.   

► అవిశ్వాసంపై చర్చ సందర్భంగా.. కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి ప్రసంగిస్తున్నారు. 

విపక్షాలకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కౌంటర్‌..

► గతంలో ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేటలో చతికిలపడేది. కానీ, 2020లో ఏడు మెడల్స్‌ గెలిచింది. క్రీడాకరులపై మోదీ సర్కార్‌ చూపిన శ్రద్ధే అందుకు ప్రధాన కారణం అని చెప్పనక్కర్లేదు. 

► ప్రమాదాలు ఊహించని విషాదాలే.  అలాంటిది రైలు ప్రమాదంలో ఒక్క ప్రాణం పోయినా.. అది పెద్ద నష్టం కిందకే వస్తుంది. 2004-14 మధ్య 171 రైలు ప్రమాదాలు జరిగాయి. ఆ సంఖ్య 2014-23 మధ్య 71కి చేరి.. ప్రమాదాల తగ్గుముఖం తెలియజేస్తోంది. 

► అమృత్‌కాల్‌ అనేది ఎన్డీయే కోసమో బీజేపీ కోసమో కాదు.. ఇది దేశం కోసం. మా పార్టీ తరపున.. ప్రభుత్వం తరపున అందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. 2047 కల్లా.. భారత్‌ను అభివృద్ధి చెందిన కేసుగా నిలబెట్టే ప్రయత్నాలు చేద్దాం. 

► విదేశీ శక్తులు భారత్‌కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే రోజులు పోయాయి. ఇవాళ మన అంతర్గత విషయాల్లో ఏ విదేశీ శక్తి జోక్యం చేసుకోవట్లేదు.
► ఇస్రో చంద్రయాన్‌-3 లాంటి ప్రాజెక్టులతో భారత్‌ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా చాటుతోంది. అమెరికాలాంటి అగ్రరాజ్యాలు సైతం అంతరిక్ష రంగంలో భారత్‌తో పని చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. 
►ఇండియా కూటమితో ఒరిగేదిమీ లేదు. వీరంతా దేశానికి చేసిందేమీ లేదు.
► 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్షకు గురయ్యారు.
► 2014 తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది.
► స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా గౌహతిలో డీజీపీ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు పోలీసులు తప్పనిసరిగా భద్రత కల్పించాలని ప్రధానమంత్రి ఆదేశించారు.

►అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదు: బీజేడీ(బిజూ జనతా దళ్) ఎంపీ పినాకి మిశ్రా
►బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నేను మద్దతు ఇవ్వడం లేదు. 
►ఒడిశా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది. అందుకే అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం లేదు.

కేంద్ర ప్రభుత్వానికి మనసు లేదు

►మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతుంటే ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు వెళ్లారు?:  టీఎంసీ ఎంపీ  సౌగత రాయ్
► కేంద్ర ప్రభుత్వానికి మనసు లేదు.
►మోదీ ప్ర‌భుత్వం మాన‌వీయ కోణంలో వ్య‌వహ‌రించ‌డం లేదు
► పశ్చిమ బెంగాల్‌లో  ఏం జరిగినా ప్రతిసారీ అక్కడికి ఓ ప్రతినిధి బృందాన్ని పంపుతారు. కానీ మణిపూర్‌కు ఒక్క ప్రతినిధి కూడా వెళ్లలేదు.
►మణిపూర్‌లో ఎంతో మంది మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 
►మణిపూర్‌పై కనికరం లేదు కాబట్టే అక్కడికి వెళ్లడం లేదు.
►భార‌త్‌ను ప్రేమించేవారెవ‌రైనా మోదీని ద్వేషిస్తారు.

మ‌ణిపూర్ భ‌గ్గుమంటుంటే ప్ర‌ధాని మోదీ ఎక్క‌డున్నారు?

►పార్లమెంట్‌కు  వచ్చేందుకు వ‌చ్చేందుకు మోదీకి అభ్యంత‌రం ఏంటి?: డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు
►మ‌ణిపూర్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు పడిపోతే ఐరోపా, యూకే ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. అయినా మోదీ స‌ర్కార్ మౌనం దాల్చింది.
►మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌లో 163 మంది మ‌ర‌ణించినా ప్ర‌ధాని నోరుమెద‌ప‌లేదు.
► దేశంలో నెల‌కొన్న ప‌రిస్ధితిలాగే మ‌ణిపూర్‌లోనూ మెజారిటీ వ‌ర్సెస్ మైనారిటీ అన్న‌ట్టుగా ప‌రిస్ధితులు నెల‌కొన్నాయి.

మణిపూర్‌ సీఎం తక్షణమే రాజీనామా చేయాలి

►మణిపూర్‌లో 10 వేల అల్లర్లు, హత్యలు, అత్యాచార కేసులు నమోదయ్యాయి: సుప్రియా సూలే
►అయినప్పటికీ కేంద్రంలో చలనం లేదు.
►మణిపూర్‌ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

రాహుల్‌ గాంధీ ఎప్పటికీ సావర్కర్‌ కాలేరు: నిషికాంత్‌ దూబే

►మోదీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టారు. ఇంతకీ విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా?
►ఇండియా ఫుల్‌ఫామ్‌ కూడా ఆ కూటమిలోని సభ్యులకు తెలియదు.
►కూటమిలో ఏ పార్టీ ఎవరి వైపు తెలుసుకునే పరీక్ష
►ఇండియా అని పేరు పెట్టుకున్నారు.. కానీ అందరూ గొడవ పడుతున్నారు.
►లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను జైలుకు పంపింది ఎవరు?
►రాహుల్‌ మాట్లాడుతారని ఆశించాం. కానీ ఆయన రెడీగా లేరు.
►రాహుల్‌ గాంధీ సభకు వస్తే పెద్దగా సెలబ్రేట్‌ చేశారు.
►సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. స్టే మాత్రమే ఇచ్చింది
►రాహుల్‌ లేటుగా నిద్రలేచారేమో?
►నేను సావర్కర్‌ కాను.. క్షమాపణలు చెప్పనని రాహుల్‌ అంటున్నారు. 
►రాహుల్‌ గాంధీ ఎప్పటికీ సావర్కర్‌ కాలేరు.

లోక్‌సభలో అధికార, విపక్షాల ఎంపీల నినాదాలు

►నిన్న సభలో రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే విమర్శలు
►చైనా, న్యూస్‌ క్లిక్‌ విషయంలో దూబే ఘాటు వ్యాఖ్యలు
►దూబే వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ లేఖ
►దూబే వ్యాఖ్యలు తొలగించకపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీల నిరసన
►రికార్డులు మళ్లీ అపడ్‌లోడ్‌ చేశారంటూ అధిర్‌ రంజన్‌ అభ్యంతరం

లోక్‌సభలో గందరగోళం
బీజేపీ తరపున చర్చను ప్రారంభించిన నిషికాంత్‌ దూబే
►బీజేపీ ఎంపీపై విపక్షాల ఆందోళన
►నిషికాంత్‌ దూబే ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యులు
►షేమ్‌ షేమ్‌ అంటూ ఇండియా కూటమి ఎంపీల నినాదాలు
►గందరగోళం మధ్యం నిలిచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ

ప్రధాని మణిపూర్‌ ఎందుకు వెళ్లరు?

►కోక్రాఝర్‌లో హింస జరిగినప్పుడు మన్మోహన్‌ సింగ్‌ అసోం వెళ్లారు.
►2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయూ అక్కడికి వెళ్లారు. 
►ఇండియా కూటమిని తిట్టండపైనే మోదీ ఫోకస్‌
►మణిపూర్‌లో శాంతి స్థాపన మోదీ ప్రాధన్యత కాదా
►మణిపూర్‌కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లారు.
►మేము అధికారాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నాం.

సంక్షోభ సమయాల్లో మౌనమే మోదీ సమాధానమా?

►చైనా విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే.
►బాలీలో జిన్‌పనింగ్‌, మోదీ ఏం మాట్లాడుకున్నారో కేంద్రం దాచేసింది.
►చైనా గురించి మీరు మాట్లాడుతున్నారా?
►ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ మోదీ సమాధానం మౌనమే
►రెజర్ల ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే
►రైతు ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే
►అదానీ విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే
►తప్పును దేశ ప్రజల ముందు ఒప్పుకోవడం లేదు

►మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా డ్రగ్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది.
►అసోం రైఫిల్స్‌ మణిపూర్‌ పోలీసులు కొట్టుకున్నారు
►ఇదేనా నవభారతం
►ప్రభుత్వంపై నమ్మకం లేకే సుప్రీంకోర్టు కమిటీ వేసింది

అసలు మణిపూర్‌లో ఏం జరగుతోంది? 
►సంఖ్యాబలం లేదన్న విషయం మాకు తెలుసు. తప్పని పరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టాం.
►మణిపూర్‌కు రాహుల్‌, విపక్ష ఎంపీలు వెళ్లారు. ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదు. 
►మణిపూర్‌లో హింస కొత్తది కాదు, గతంలోనూ  చాలాసార్లు అల్లర్లు జరిగాయి.
►ఇప్పటి పరిస్థితికి అప్పటి పరిస్థితికి సంబంధమే లేదు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు.
►ఒక వర్గం మరో వర్గాన్ని తీవ్రంగా ద్వేషిస్తుంది.

►మణిపూర్‌ అల్లర్లపైప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదు.
►80 రోజుల తర్వాత అది కూడా 30 సెకన్లు మాత్రమే మాట్లాడారు.
►ఎంతమంది మాట్లాడినా ప్రధాని స్పందిస్తే వేరుగా ఉంటుంది.
►‍మణిపూర్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్‌ విఫలమైంది.
►అక్కడ ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. 5 వేల వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది శిబిరాల్లో ఉన్నారు. 60 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

మణిపూర్‌లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏం చేస్తోంది?
►మణిపూర్‌ సీఎంను ఎందుకు తొలగించలేదు?
►మణిపూర్‌ అంతా బాగుందని మీరు అంటున్నారు.
►ఇప్పటికీ ఇంటర్నెట్‌ లేదు, పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు.
►ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు, అయినా మోదీ మౌనం వీడలేదు.
►డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ విఫలమైందని మాట్లాడాల్సి వస్తుందని మోదీ స్పందించడం లేదా?
►మణిపూర్‌లో పోలీస్‌ స్టేషన్లోకి చొరబడి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 
►అక్కడి ప్రజలు న్యాయం కోరుతున్నారు


మణిపూర్‌ భారత్‌లో అంతర్భాగం: గౌరవ్‌ గోగోయ్‌
►మణిపూర్‌ మండుతుంటే దేశం మండుతున్నట్లే.
►మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడాలి.
►మణిపూర్‌ కోసమే అవిశ్వాసం తెచ్చాం.
►మణిపూర్‌ న్యాయం కోరుతోంది.

►లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం 12 గంటలకు  చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ  గౌరవ్‌ గొగొయ్‌ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. మొదట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది జరగకపోవడంతో సభ ప్రారంభమైన వెంటనే తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ ఎందుకు చర్చ ప్రారంభించలేదని బీజేపీ ఎంపీలు చురకలు అంటించారు.

పార్టీలకు సమయం కేటాయించిన స్పీకర్‌

►మొత్తం 16 గంటలపాటు చర్చ కొనసాగనుంది.
►బీజేపీకి 6. 41 గంటలు, కాంగ్రెస్‌కు గంటా 9 నిమిషాలు కేటాయింపు
►డీఎంకే, టీఎంసీకి  30 నిమిషాల చొప్పున సమయం కేటాయింపు
►వైఎస్సార్‌సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, బీఆర్‌ఎస్‌కు 12 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు కేటాయింపు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్‌సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడనున్నారు. దీంతో మణిపూర్‌ హింసపై కాంగ్రెస్‌ అగ్రనేత ఎలాంటి  ప్రసంగం చేస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాహుల్‌ ఏం మాట్లాడనున్నారు?
మూడు నెలలుగా హింసాకాండతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఘర్షణ ప్రాంతాలను జూన్‌లో రాహుల్‌ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్ 'సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్' అవుతారని కాంగ్రెస్‌ ధీమాతో ఉంది. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై.. సాయంత్రం 7 గంటల వరకూ ఉంటుంది. ఇలా వరుసగా మూడు రోజులపాటు చర్చ జరుగనుంది. అనంతరం చివరి రోజైనా ఆగస్టు 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చకు సమాధానమిస్తారు. అదే రోజు గురువారం ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌
ఇదిలా ఉండగా మోదీ ఇంటి పేరుపై  చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్‌ కోర్టు విధించిన  రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని సోమవారం పునరుద్దరించడంతో నాలుగు నెలల అనర్హత వేటు అనంతరం నిన్న ఆయన పార్లమెంటులో అడుగు పెట్టారు.  దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రతిపక్ష కూటమి నేతలు సంబరాలు చేసుకొని.. రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు.
చదవండి: పంచాయతీ రాజ్‌ ప్రాముఖ్యాన్ని కాంగ్రెస్‌ అర్థం చేసుకోలేదు

లోక్‌సభలో ఎవరి బలం ఎంత?
కాగా లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. లోక్‌సభలో ఎన్డీయే కూటమి  331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 301 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్‌ఎస్‌,  వైఎస్సార్‌సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్‌సభలో 64 మంది తటస్థ ఎంపీలు ఉండగా.. ఆరు అయిదు స్థానాలు ఖాళీ ఉన్నాయి.  ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది.

► లోక్‌సభలో మొత్తం సీట్లు : 543
►ఖాళీగా ఉన్న స్థానాలు: 5
► ప్రస్తుత లోక్ సభలో ఉన్న సభ్యులు: 537

ఎన్డీయే కూటమిబలం : 331 (లోక్​ సభ స్పీకర్ తో కలిపి)
►బీజేపీ – 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ – 5, ఏడీపీ – 2, రాంవిలాస్ పార్టీ – 1, అజిత్ పవార్ కూటమి – 1, ఏజేఎస్ యూ – 1, ఎన్డీపీపీ  – 1, ఎపీఎఫ్ – 1, ఎపీపీ – 1, ఎస్కేఎం – 1, ఎంఎన్ఎఫ్ – 1, స్వతంత్రులు(సుమలత, నవనీత్ కౌర్) – 2

విపక్ష ఇండియా కూటమి బలం: 143 ఎంపీలు
►కాంగ్రెస్ – 51, డీఎంకే – 24, టీఎంసీ  – 23, జేడీయూ – 16, శివసేన (ఉద్దవ్ థాక్రే)  – 6, శరద్ పవార్  – 4, ఎస్పీ  – 3, సీపీఎం – 3, సీపీఐ – 2, ఆప్  – 1, జేఎంఎం – 1, ఆర్ఎస్పీ – 1, వీసీకే – 1, కేరళ కాంగ్రెస్ (మని) – 1

తటస్థ పార్టీల బలం : 63
►వైఎస్సార్‌సీపీ-22, బీజేడీ – 12, బీఆర్‌ఎస్‌-9, ఎంఐఎం-2,  బీఎస్పీ – 9, టీడీపీ  – 3, ఎస్ఏడీ  – 2, జేడీఎస్ 1, ఆర్ఎల్పీ 1, ఏఐయూడీఎఫ్ 1, ఇండిపెండెంట్  – 1.

ఏ పార్టీకి ఎంత సమయం!
లోక్‌సభలోని పార్టీ సభ్యుల బలం ఆధారంగా.. బీజేపీకి దాదాపు 6 గంటల 41 నిమిషాలు అవిశ్వాసంపై చర్చించేందుకు సమయం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి దాదాపు గంటా 15 నిమిషాల సమయం కేటాయించారు. వైఎస్సార్‌ సీపీ. శివసేన, జనతాదళ్ -యునైటెడ్ (జేడీయూ, బిజూ జనతాదళ్ (బీజేడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) , లోక్ జనశక్తి పార్టీకి (ఎల్‌జీపీ) కలిపి మొత్తం 2 గంటల సమయం ఇచ్చారు. ఇక ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 1 గంట 10 నిమిషాల కాల పరిమితిని నిర్ణయించారు.

వీగిపోతుందని తెలిసినా..
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి.  2018లో తొలిసారి ప్రతిపక్షాలు మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. 325 ఎంపీల మద్దతుతో ఎన్డీయే కూటమి ఈ చర్చలో నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 126 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈసారి కూడా బల పరీక్షలో కేంద్రం తేలిగ్గా గెలవగలదు. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినా.. మణిపూర్ అంశంపై ప్రధాని ఇంత వరకూ మాట్లాకపోవడంతో, ఇప్పుడైనా ఎలాగైనా స్పందిస్తారని ప్రతిపక్ష కూటమి ఈ అస్త్రాన్ని ప్రయోగించింది.

కీలకంగా మూడు రోజుల చర్చలు
పార్లమెంట్‌లో మోదీ మాట్లాడాలని వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి విపక్ష పార్టీ సభ్యులు ఉభయసభలను అడ్డుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ  నేపథ్యంలో గత రెండు వారాల నుంచి పార్లమెంట్ ఏ ఒక్క రోజూ కూడా సజావుగా సాగలేదు. ప్రతి రోజూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది. అయితే జులై 26న కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్ గొగోయ్.. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. లోక్‌సభ ఒప్పుకుంది. ఆ తర్వాత చర్చకు లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ 3 రోజుల సమయం ఇచ్చింది. మరి ఈ మూడు రోజులు పార్లమెంట్‌ సమావేశాలు ఎలా సాగుతాయో వేచిచూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement