
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనర్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైంది. ఇటీవల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కే అన్నామళై రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్ని నాగేంద్రన్ చేపట్టడం ఇక లాంఛన ప్రాయమే. కేవలం రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పోటీలో నిలిచే అభ్యర్థుల పరంగా చూస్తే కేవలం నాగేంద్రన్ నామినేషన్ మాత్రమే వచ్చింది.
ఏమైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్పా నాగేంద్రన్ ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ గా వ్యవహరించడం ఖాయం. ఇప్పటివరకూ కేవలం నాగేంద్రన్ నామినేషన్ మాత్రమే వచ్చిన తరుణంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియలో భాగంగా నాగేంద్రన్ పేరును అధికారికంగా రేపు(శనివారం) ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు(శుక్రవారం) మందీ మార్బలంతో వచ్చి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఇప్పటివరకూ అధ్యక్షునిగా కొనసాగిన అన్నామళై కూడా రావడం విశేషం.
ఎవరీ నాగేంద్రన్..?
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నాగేంద్రన్. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఉపాధ్యక్షుడిగా సేవల అందిస్తూ వస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో కొనసాగిన నాగేంద్రన్.. 2017లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. 2001 మే 19 వ తేదీ నుంచి 2006 మే 12 వరకూ ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా కొనసాగారు.
అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు బీజేపీ గూటికి చేరారు. ఆయన బీజేపీలో చేరిన మూడేళ్ల తర్వాత అంటే 2020 జూలై 3 వ తేదీన బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
జయలలిత మరణం తర్వాత..
2016లో మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత చాలా మంది ఎఐఏడీఎంకే నేతలు.. బీజేపీలో చేరారు. వారిలో నాగేంద్రన్ కూడా ఒకరు. 2017 ఆగస్టులో కాషాయ జెండా కప్పుకున్నారు నాగేంద్రన్. ఆయనకు ఢిల్లీ అధినాయకత్వంలో మంచి గుర్తింపు ఉంది. 2021లో తిరునెల్‌వెలి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఆయనకు మద్దతుగా అమిత్ షా సైతం వచ్చి అక్కడ ప్రచారం చేశారు. సుమారు 23వేలకు పైగా ఓట్లతో డీఎంకే అభ్యర్థిపై నాగేంద్రన్ గెలిచి ఇక్కడ మూడోసారి విజయాన్ని అందుకున్నారు.
ఆయన అసలు పేరు.. నాగేందిరేన్ కాగా, రెండో పేరు నాగేంద్రన్. ప్రస్తుతం ఈ పేరుతో మరింత ప్రాచుర్యం పొందారాయన. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఆయన పేరును మాజీ అధ్యక్షుడు అన్నామళైతో పాటు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, మాజీ కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌లు బలపరిచారు.