
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తమిళనాడు ప్రజలకు పంబన్ బ్రిడ్జి(Pamban Bridge) రూపంలో భారీ కానుకను అందించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఈ అద్భుత వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ దక్షిణ భారతదేశంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకే ఈ వంతెనను వ్యూహాత్మకంగా ప్రారంభిస్తున్నదనే వాదన వినిపిస్తోంది. 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన పంబన్ వంతెన రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది.
పంబన్ బ్రిడ్జి భారతదేశంలోని మొట్టమొదటి సముద్రపు వంతెన. ఓడల రాకపోకలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి గేట్లు తెరుచుకుంటాయి. నూతనంగా నిర్మించిన ఈ వంతెన మరింత ధృడంగా ఉండనుంది. ఇది తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయనుంది. అలాగే పర్యాటకరంగానికి ప్రోత్సాహాన్ని అందించనుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామేశ్వరంనకు రాకపోకలు సాగించేందుకు ఈ వంతన ఉపయోగపడనుంది. శ్రీరాముని జన్మదినోత్సవమైన రామ నవమిని దక్షిణ భారతదేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రామేశ్వరంనకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు.

రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు లంకను చేరుకునేందుకు ఇక్కడ స్వయంగా వారధి నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాగా తమిళనాడు ప్రజలలో తన హిందూత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ పంబన్ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించి, జాతికి అంకితం చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. 2026లో తమిళనాడులో ఎన్నికల జరగనున్న దృష్ట్యా బీజేపీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.

తమిళనాడు రాజకీయాలలో(Tamil Nadu politics) డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలో బలమైన పట్టు ఉన్న బీజేపీ, దక్షిణాదిలో ఇంకా గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయితే పంబన్ బ్రిడ్జి వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టి, తద్వారా తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ తమిళనాడు ప్రజలకు తెలియజెప్పాలనుకుంటోంది. తమిళనాడులో రెండవ అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆ కూటమి ఎన్నికల్లో విఫలం కావడంతో, బీజేపీకి ఏఐడిఎంకే దూరమయ్యింది. ఇప్పుడు 2026 ఎన్నికలకు ముందు బీజేపీ మరోసారి అన్నాడీఎంకేతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తోందని భోగట్టా. అయితే బీజేపీ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో కాలమే చెబుతుంది.
ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్