
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా కలిసి పోటీచేయడానికి నిర్ణయించాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు.
‘ఏడీఎంకే అంతర్గత వ్యవహారంలో మేం జోక్యం చేసుకోం. పొత్తు కోసం ఏడీఎంకే ఎలాంటి షరతులు విధించలేదు. వచ్చ ఎన్నికల్లో కూటమి ఘన విజయం ఖాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ రెండు పార్టీలు పొత్తు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఖాయం
ఈ పొత్తులో భాగంగా తమిళనాడు కూటమి సీఎం అభ్యర్థిగా కె పళనిస్వామి అని అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా మాట్లాడుతూ.. 1998 నుంచి ఏఐఏడీఎంకే అనేది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ.. తమిళనాడు మాజీ సీఎం జయలలితలు ఇద్దరూ కలిసే గతంలో పని చేశారు. ఎన్డీఏ భాగ్వస్వామ్యం అనేది విజయానికి సంకేతం. మా పొత్తుతో మేం మరింత పటిష్టం కానున్నాం. కచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపడతాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.
