స్వయంకృతాపరాధమే.. | Kejriwal alone is to be blamed for AAP defeat in Delhi Assembly Elections | Sakshi
Sakshi News home page

స్వయంకృతాపరాధమే..

Published Sun, Feb 9 2025 5:05 AM | Last Updated on Sun, Feb 9 2025 5:05 AM

Kejriwal alone is to be blamed for AAP defeat in Delhi Assembly Elections

అవినీతి కేసులతో అప్రతిష్ట పాలైన ఆప్‌  

కేజ్రీవాల్‌తోపాటు సీనియర్‌ నేతల అరెస్టుతో ఆప్‌ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత  

సంక్షేమ పథకాలు అమలు చేసినా మౌలిక సదుపాయాలపై నిర్లక్ష్యం  

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మట్టికరిచింది. హ్యాట్రిక్‌ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పరాజయం పాలయ్యారు. సీనియర్‌ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్‌ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్‌ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్‌ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు.  

ఫలించిన బీజేపీ ప్రచారం  
మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్‌ సీనియర్‌ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్‌ సింగ్‌ అరెస్టయ్యారు. ఆప్‌ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 

తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్‌ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్‌ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్‌ మహల్‌) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్‌ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి.   

‘డబుల్‌ ఇంజన్‌’కు ఆమోదం! 
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఆప్‌ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్‌ గవర్నర్‌పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్‌ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. 

బీజేపీ ప్రచారాన్ని ఆప్‌ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్‌ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు.  

బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత  
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్‌ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్‌ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్‌ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది.  

మార్పు కోరుకున్న జనం
ఆప్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్‌పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్‌ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.

స్తంభించిన పాలన  
కేజ్రీవాల్‌ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్‌ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్‌ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. 

కేజ్రీవాల్‌ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్‌ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్‌తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్‌ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు.  

     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement