![BJP victory in Delhi Assembly elections: PM Modi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/bjp.jpg.webp?itok=YYH4UFRH)
ఢిల్లీ ఎన్నికల్లో విజయం చరిత్రాత్మకం
నగరంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఆప్ సర్కారు పాపాలపై దర్యాప్తు జరిపిస్తాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టికరణ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) బీజేపీ విజయం(BJP victory) సాధారణ విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. దశాబ్ద కాలం తర్వాత ఆప్‌ద(ఆపద) నుంచి ఢిల్లీ ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించిందని అన్నారు. బీజేపీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ప్రభుత్వ అవినీతి, ఆర్థిక అవకతవకలపై ‘కాగ్’ ఇచ్చిన నివేదికను బీజేపీ ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందని చెప్పారు. అన్నిరకాల అవినీతి వ్యవహారాలపై కచ్చితంగా దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. జనం సొమ్మును లూటీ చేసినవారి నుంచి తిరిగి కక్కిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఇప్పటిదాకా పాలన వెలగబెట్టినవారు పచ్చి అవినీతిపరులు అని మండిపడ్డారు. షార్ట్–కట్ రాజకీయాలు చేసేవారికి ప్రజలు షార్ట్–సర్క్యూట్‌తో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
ప్రజల రుణం తీర్చుకుంటాం
ధూర్త, మూర్ఖ రాజకీయాలు మన దేశానికి అవసరం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆప్, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఎజెండాను చోరీ చేసిందన్నారు. హిందుత్వ వేషంతో ఓట్లు రావడం లేదు కాబట్టి మిత్రపక్షాల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోందని చెప్పారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న కులగణన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘మోదీ కీ గ్యారంటీ’ పట్ల ఢిల్లీ ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని, నగరాన్ని అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని వివరించారు. యమునా నదిలో శుభ్రం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మన ప్రయత్నాలను యమున మాత తప్పకుండా ఆశీర్వదిస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ఢిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
ధూర్త, మూర్ఖ రాజకీయాలు చేసే దుష్టులు దేశ రాజకీయాలను కబ్జా చేయకుండా ఉండాలంటే లక్ష మంది యువత రాజకీయ రంగంలోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో రాకపోతే దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. దేశానికి ఇప్పుడు రాజకీయ పరివర్తన అవసరమని తెలిపారు. 21వ శతాబ్దంలో వికసిత్ భారత్‌కు నూతన జీవన శక్తి, నూతన ఆలోచనలు, నూతన ఉత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాజ్యంపై యుద్ధం చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా అర్బన్ నక్సలైట్ల కోసం రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలను బలిపెట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముందంజలో ఉందన్నారు. రాజకీయాల్లో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చి నీచ రాజకీయాలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభివృద్ధి, సుపరిపాలనతోప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో రెండు రెట్ల వేగంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇదొక చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు.
ఢిల్లీ ప్రజలకు సెల్యూట్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తంచేశారు. ప్రజాశక్తికి తిరుగులేదని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ఫలితాల అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. చరిత్రాత్మక విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఇది తమ గ్యారంటీ అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమించిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment