సందర్భం
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచు కోట బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానా లతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ‘కర్ణుని చావుకు సవా లక్ష కారణాలు’ ఉండొచ్చేమోగానీ, కేజ్రీవాల్ ఓటమికి వేళ్ల మీద లెక్క బెట్టదగ్గ కారణాలే ఉన్నాయి.
కేజ్రీవాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే 1999లో ‘పరివర్తన్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, ఢిల్లీ ప్రజలకు పన్నులతో పాటు ఇతర సామాజిక విషయాల మీద అవగాహన కల్పించే వారు. సమచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని వెలికి తీశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో ‘రామన్ మెగసెసే అవార్డు’ లభించడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.
2011లో ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ వద్ద అవినీతికి వ్యతిరేకంగా ‘జన్ లోక్ పాల్’ బిల్లును తీసుకురావాలని అన్నా హజా రేతో కలిసి దీక్ష చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ‘జీవితంలో నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఏ పదవీ చేపట్టను. యాక్టివిస్టుగానే ఉంటా’ అని ప్రకటించు కున్న కేజ్రీవాల్, అనూహ్యంగా 2013లో రాజకీయా ల్లోకి అడుగుపెట్టారు. మొత్తానికి ఢిల్లీ ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అయితే గడిచిన ఐదేళ్లలో ఆప్ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. దాని పర్యవసా నమే 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.
సామాన్యుల సీఎంనని, ప్రభుత్వ బంగ్లా తీసు కోనని చెప్పి... ఖరీదైన శీష్ మహల్ నిర్మించుకోవడాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు. ఈ అంశాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా ‘కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ కాదు, కాఫీ ఆద్మీ’ అని ప్రచారం చేసింది. అవినీతికి వ్యతి రేకంగా వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ, దీనికి విరుద్ధంగా ఆయనతో పాటు ఆయన మంత్రులు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో విశ్వసనీ యత కోల్పోయారు.
అవినీతి ఆరోపణలు వస్తే నాయకులు రాజీనామా చేయాలని చెప్పిన కేజ్రీవాల్, తాను జైల్లో ఉన్నా రాజీనామా చేయలేదు. సిసోడి యాని అరెస్టు చేయగానే, రాజీనామా చేయించిన కేజ్రీవాల్, తను జైల్లో ఉండి కూడా చాలాకాలం కుర్చీని వదల్లేదు. దీంతో అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అవినీతి పార్టీగా మారిందని బీజేపీ ప్రచారం చేసి జనాన్ని తనవైపు తిప్పుకుంది. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక రాజీనామా చేసి, కీలుబొమ్మ లాంటి ఆతిశీని సీఎం చేయడం ఒక నాటకంలా ప్రజలు భావించారు.
కేజ్రీ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కుర్చీలో కూర్చొని మీడియాతో మాట్లాడేవారు. అదే కుర్చీని ‘కేజ్రీవాల్ పట్ల తనకున్న గౌరవం’ పేరుతో ఖాళీగా వదిలేసి ఆతిశి మరో కుర్చీలో కూర్చోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆప్ నేతలు ఒకవైపు కేసుల్లో ఇరుక్కోవడం, మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆప్ అంతకుముందు ఐదేళ్లలో చేసినట్టుగా ఈసారి పరిపాలించలేక పోయింది. 2020 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి.
ఎన్నికల ముందు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని చేసిన కీలక ప్రకటన... మధ్యతరగతిని బీజేపీ వైపు తిప్పింది. ఇది ఉద్యోగులు అధికంగా ఉండే న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీ వాల్ ఓటమికి కూడా కారణమైంది. 2015, 2020 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఢిల్లీలో తనకు ఎదురేలేదని భావించిన కేజ్రీవాల్ అతి విశ్వాసంతో దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించు కోవడానికి ప్రయత్నాలు చేశారు.
పంజాబ్ విజయంతో ఈ అతివిశ్వాసం మరింత మితిమీరింది. గోవా, గుజరాత్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చి, కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీతో కలవ నని చెప్పిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల సమయంలో మాటమార్చి ‘ఇండియా’ కూటమితో కలిశారు.
ఆరు నెలలు తిరగకుండానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్‌తో తెగదెంపులు చేసుకోవడంతో రెండు పార్టీలు ఎవ రికి వారే పోటీ చేశారు. ఢిల్లీలో ఈసారి దాదాపు 6 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్, చాలా చోట్ల ఓట్లను చీల్చి ఆప్ విజయవకాశాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా ముస్లిం, ఎస్సీ ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడటంతో బీజేపీకి కలిసొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓట మితో పాటు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడంతో ‘ఆయనకు క్రేజ్ తగ్గిందా’ అనే చర్చలు ప్రారంభ మయ్యాయి. కేజ్రీవాల్‌కు మళ్లీ క్రేజ్ పెరగడంతోపాటు ఆప్‌కు ఆదరణ పెరగాలంటే ఆయన గతంలోవలే ఢిల్లీ లోని కాలనీలు, గల్లీలు, మొహల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయితే, మరో ఐదేళ్లలో ఆయనకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి.
జి. మురళీ కృష్ణ
వ్యాసకర్త సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment