ఫస్ట్ ఉమెన్
బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్ శివరుద్రప్ప మనవరాలు.
బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్‌గా మారింది.
‘రోయింగ్‌ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసం’ అంటుంది అనన్య.
వరల్డ్స్ టఫెస్ట్ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్‌నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.
తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్‌లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది.
‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment