కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.
రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు.
1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.
అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్‌కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్‌గా నిలిచింది. బ్యాక్‌రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్‌షూటర్‌గా, కాంగ్రెస్‌కు టాలిస్ మాన్‌గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది.
ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్‌ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది.
2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్‌లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
ప్రియాంక చదువు,కుటుంబం
1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment