భిన్న మార్గం
బావుల్లో ఉండిపోతారు కొందరు. తెలిసిన కుంటల్లోనే మునకలేస్తారు కొందరు.
మహా అయితే చెరువు గురించి ఆలోచిస్తారు కొందరు.
కాని అతి కొందరు మాత్రమేసముద్రాన్ని జయించాలనుకుంటారు. వృత్తిరీత్యా బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివి నగరంలో ఉద్యోగం చేసినా
ఎందుకు తన వృత్తిలోనే రాణించకూడదు అని ఆలోచించింది. అంతే... తానే చేపల వేటలో దిగి ‘సీఫుడ్ అంట్రప్రెన్యూర్’గా దేశాన్ని ఆకర్షిస్తోంది.
సముద్రానికి కెరటాలతో అదిలించడం తెలుసు. వలల కొద్ధి చేపల్ని నింపి సిరులను అందించడం కూడా తెలుసు. ‘సముద్రం తల్లిలాంటిదే. మమకారం, కోపం రెండూ ఉంటాయి. భయభక్తులతో ఉంటే ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది’ అంటుంది సుభిక్ష. ఈ 23 ఏళ్ల అమ్మాయి తమిళనాడులోని తూత్తుకూడి సమీపంలో ఉన్న పెరియతలై అనే బెస్తపల్లె నుంచి ఇవాళ దేశాన్ని ఆకర్షిస్తోంది. మగవాళ్లకే పరిమితమైన చేపలు పట్టే విద్యలో ఆ అమ్మాయి రాణించడమే కాదు తన చదువును ఆ విద్యకు జత చేసి ఆదాయ మార్గాలను నిర్మిస్తోంది.
ఒడ్డు నుంచి సముద్రానికి...
మగవాళ్లు చేపలు పడతారు. వాటిని స్త్రీలు గట్టున కూచుని అమ్ముతారు. ఇదే ఆనవాయితీ. తరాలుగా ఇదే సాగుతోంది. సుభిక్ష తండ్రి కుమార్, అన్న లియాండర్ కూడా వాళ్లింట్లో సముద్రం మీద వేటకు వెళ్లి చేపలు తెస్తారు. తల్లి వాటి అమ్మకంలో సాయం చేస్తుంది. ‘నేనెందుకు చేపలు పట్టడానికి మీతో రాకూడదు?’ అని అడిగింది సుభిక్ష ఒకరోజు తండ్రిని. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది.
ప్రయివేట్ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తోంది. ఆడపిల్ల సౌకర్యంగా బతకాలంటే ఆమెలాంటి మార్గమే అందరూ సూచిస్తారు. ‘సముద్రంలో ఎంతో ఉంది. టెన్ టు ఫైవ్ జాబ్‌లో ఏముంది? నన్నొక ప్రయత్నం చేయనివ్వు నాన్నా’ అంది సుభిక్ష. అప్పటికే ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. మత్స్యకారుల జీవనాన్ని సరదాగా వీడియోల్లో చూపేది సుభిక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి సిసలైన బెస్త జీవనంలోకి దిగింది.
సముద్రంతో చెలగాటం...
‘కోరమాండల్ తీరంలో సముద్రంతో దిగడం అంటేప్రాణాలతో చెలగాటమే’ అన్నాడు సుభిక్ష తండ్రి చివరకు ఒప్పుకుంటూ. మొదటిసారి తండ్రి, అన్నతో కలిసి ఫైబర్ బోట్‌లో చేపల వేటకు సుభిక్ష వెళ్లిన అనుభవం గగుర్పాటుకు గురి చేసేదే. ‘ఆకాశంలో చుక్కలు తప్ప వేరే ఏమీ కనిపించని చీకటి. పడవను కుదురుగా ఉంచకుండా ఎత్తెత్తి వేసే సముద్రం. మేము దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు.
కాని ఆ సమయంలో చేపల వేటకు వెళ్లి వల విసరడం గొప్ప అనుభవం’ అంది సుభిక్ష. ఆ రోజు నుంచి నేటి వరకు అనేకసార్లు రాత్రి 1 గంటకు వేటకు వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి రావడం సుభిక్షకు అలవాటుగా మారింది. ‘చేపలు పట్టడానికి ఏయే వలలు వాడాలి... ఏ వల వేస్తే ఏ రకం చేపలు పడతాయనేది తెలుసుకున్నాను. ఇంకా పల్లెపల్లెకు తిరిగి చేపల వేటలో మా పూర్వికుల అనుభవం తెలుసుకుంటున్నాను’ అంటుంది సుభిక్ష. ఆమె తన వేటను మొదలెట్టాక అదంతా వీడియోలు చేసేసరికి ప్రపంచానికి తెలిసిపోయింది.
పెరిగిన వ్యాపారం
చేపలు పడితే టోకున ఎక్స్‌పోర్టర్లకు అమ్మడం లేదా లోకల్‌గా అమ్మడం లేదా ఎండబెట్టి అమ్మడం తెలిసిన సంప్రదాయ పద్ధతికి భిన్నంగా సుభిక్ష తమ చేపలను ఊరగాయలుగా, పచ్చళ్లు, ఎండు చేపలుగా మార్చి వాటిని తన లేబుల్ కింద అమ్మకానికి పెట్టింది. సోషల్ మీడియా వల్ల వాటిని దేశ విదేశాల్లో కొంటున్నారు. అలా మెల్లగా సుభిక్ష ‘సీఫుడ్ అంట్రప్రెన్యుర్’గా మారింది. తండ్రి, అన్న ఈ పరిణామాలను స్వాగతిస్తున్నారు.
ఊళ్లో అందరూ సుభిక్షను మెచ్చుకోలుతో చూస్తున్నారు. ‘చేపలంటేప్రొటీన్‌తో నిండిన రిచ్‌ఫుడ్. ప్రజలకు ఆ ఫుడ్‌ను అందించడానికి బెస్తలు ఎంత కష్టం చేస్తారో... ప్రమాదంలోకి వెళతారో లోకానికి చూపడమే నా లక్ష్యం. అలాగే మత్స్యకార స్త్రీలను మరింత ముందుకు తీసుకు వెళ్లడం కూడా’ అంటోంది సుభిక్ష. ఒకవైపు ఈ పని చేస్తూనే మరోవైపు మోడల్‌గా కూడా పని చేస్తోంది. సంప్రదాయ విద్యలని గౌరవిస్తూ ఆధునిక ధోరణులను పుణికి పుచ్చుకుంటూ ముందుకు సాగితే విజయం తథ్యం అని నిరూపించింది సుభిక్ష.
Comments
Please login to add a commentAdd a comment