English literature
-
డూ యూ వన్నా హ్యాంగవుట్?
మనం రెగ్యులర్‌గా మాట్లాడే ఇంగ్లీష్‌కు, నేటివ్ ఇంగ్లీష్‌కు ఎంతో కొంత తేడా ఉంటుంది. నేటివ్ స్పీకర్స్ రకరకాల స్లాంగ్స్ను ఉపయోగిస్తుంటారు. వాటన్నింటినీ పట్టుకోవడం కష్టం కావచ్చుగానీ బాగా ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు అనుసరించడం వల్ల కాస్త వెరైటీగా ఉంటుంది. ఉదా: వొనా (వాంట్ టు), గోనా (గోయింగ్ టు) హ్యాంగ్ ఔట్ (స్పెండ్ టైమ్ టు గెదర్) ‘డూ యూ వాంట్ టు స్పెండ్ సమ్‌టైమ్ టుగెదర్’ అనే మాటను నేటివ్ ఇంగ్లీష్‌లో ఇలా అంటారు... ‘డూ యూ వొనా హ్యాంగవుట్?’ బొమ్మ అదుర్స్ బొమ్మలు వేయడం అంటే మీకు ఇష్టమా? మీరు ఇప్పుడిప్పుడే బొమ్మలు వేయడాన్ని ప్రాక్టిస్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీకు కావాలి linea sketch ఇదొక డ్రాయింగ్ యాప్. స్కెచ్చింగ్ను దృష్టిలో పెట్టుకొని సింపుల్‌గా ఈ యాప్‌ను రూపొందించారు. బ్లెండ్ టూల్, వైబ్రెంట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఆపిల్ పెన్సిల్ లేదా మీ చేతి వేలును ఉపయోగించి స్కెచ్చింగ్ చేయవచ్చు. డ్రాయింగ్ ప్రాసెస్‌ను రికార్డ్ చేసే సౌకర్యం ఉంది. ఆ తరువాత దీన్ని తీరిగ్గా చూసుకోవచ్చు. చదవండి: రెండే రెండు నిమిషాల్లో బాద్షా సాంగ్, స్పందించిన ర్యాపర్ -
గ్రేట్ జర్నీ..పత్తి రైతుల కాగడా..
ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ – ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది. అభ్యుదయ హైదరాబాదీ ఉజ్రమ్మ హైదరాబాద్‌లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్ జహీర్ కమ్యూనిస్ట్ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కష్టం మనది... లాభం వాళ్లది ‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది. మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి ‘దస్తకార్ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను. పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్‌లు తాము అనుసరిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్ వరల్డ్ కంట్రీస్‌ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె. సెలబ్రిటీల సెలబ్రిటీ ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్ హ్యాండ్ వీవెన్ ఇండియన్ కాటన్’ అని స్టైలిష్‌గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ. – వాకా మంజులారెడ్డి -
ఐర్లాండ్ రచయిత్రికి మ్యాన్‌బుకర్
లండన్: ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాదికి ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్(56) గెలుచుకున్నారు. ఆమె రచించిన ‘మిల్క్ మ్యాన్’ నవలకు ఈ అవార్డు దక్కింది. 20వ శతాబ్దం చివరినాళ్లలో ఉత్తర ఐర్లాండ్‌లో జాత్యంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరతకాలంలో ఓ యువతి, వివాహితుడితో సంబంధం ఏర్పర్చుకున్న ఇతివృత్తంతో ఈ నవల సాగుతుంది. ఆనాటి పరిస్థితులను మిల్క్‌మ్యాన్ ఎంతో సహజంగా కళ్లకు కట్టిందని ఎంపిక కమిటీ కొనియాడింది. మ్యాన్‌బుకర్ ప్రైజ్ 49 ఏళ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా అన్నా గుర్తింపు పొందారు. లండన్‌లో మంగళవారం జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో అన్నా బర్న్స్‌కు ఈ అవార్డు కింద రూ. 50.85 లక్షల చెక్కు, ట్రోఫీ బహూకరించారు. పేర్లు లేవు.. హోదాలే: ‘మిల్క్‌మ్యాన్’ నవల.. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కట్టుబాట్లను సవాలుచేసే సాధారణ యువతి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత్రదారులకు పేర్లు ఎలాంటి పేర్లు పెట్టకుండా వారి హోదాలతోనే నవలను ముందుకు నడపడం విశేషం. ‘ఇంత వరకూ మనలో ఎవరూ ఇలాంటి నవలను చదవలేదు. పాఠకులను కట్టిపడేసే రచనాశైలితో అన్నా రూపొందించిన పాత్రధారులు సాధారణ ఆలోచనాధోరణులను సవాలుచేస్తాయి’ అని ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. అవార్డుతో అన్నా బర్న్స్ -
బలరాజ్ సహానీ....
గ్రేట్ యాక్టర్ బలరాజ్ సహానీని మన దగ్గర కొంగర జగ్గయ్యతో పోల్చవచ్చా? ఇద్దరూ రేడియోలో అనౌన్సర్లుగా పని చేశారు. జగ్గయ్య ఆల్ ఇండియా రేడియోలో. బలరాజ్ సహాని బిబిసి లండన్‌లో. పాకిస్తాన్- రావల్పిండిలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎం.ఎ చేసిన బలరాజ్ సహాని లండన్ నుంచి దేశ విభజనకు ముందే ముంబై చేరుకున్నాడు. అక్కడే ఆయన నటుడిగా తన ప్రస్థానం మొదలెట్టాడు. ధర్తీ కా లాల్ (1946), దో భిగా జమీన్ (1953), కాబూలీవాలా (1961) వంటి సినిమాలు ఆయన ఒక గొప్ప నటుడని నిరూపించడమే కాక భారతీయ సినిమాని ప్రపంచ సినిమా రంగంలో సగౌరవంగా నిలబెట్టాయి. గొప్ప గొప్ప చలన చిత్రోత్సవాల్లో బలరాజ్ సహానీ నటించిన సినిమాలు ప్రదర్శితమై ఆయనకు పేరు తెచ్చాయి. ఆ తర్వాత సహానికి క్యారెక్టర్ నటుడిగా మారినా వక్త్, గరం హవా వంటి మంచి సినిమాలు చేసినా ఆయన ఉండాల్సినంత బిజీగా మాత్రం ఉండలేదు. దానికి కారణం ఆయనకు ఉన్న పేరు కావచ్చు... కమ్యూనిస్టు పార్టీలో ఆయన చాలా పెద్దస్థాయి పేరున్న వ్యక్తి కావడం వల్ల కావచ్చు. సహానీ నటనతో పాటు రచననూ సాధన చేశాడని చాలామందికి తెలియదు. ముఖ్యంగా పంజాబీలో ఆయన రాసిన పుస్తకాలు ఆయనను పెద్ద రచయితను చేశాయి. చనిపోయేనాటికి (1973) సహాని వయసు 59 ఏళ్లు. మన రాజ్‌కుమార్ హిరాణి సినిమాల్లో తప్పకుండా కనిపించే పరిక్షిత్ సహాని ఈయన కొడుకే. -
కొత్త అమ్మాయి...సరికొత్త రచన
ఇంగ్లిష్ సాహిత్యంలో తాజా భారతీయ సంచలనం ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’. యువ పాఠకులను సమ్మోహపరచి, వారి తల్లిదండ్రుల హృదయాలలో సైతం చోటు సంపాదించుకున్న ఈ నవలలో.. చదవడానికి ఎంత ఉందో, రచయిత్రి గురించి చెప్పుకోవడానికీ అంతే ఉంది! అమెరికాలోని బ్రౌన్ యూనివ ర్శిటీ నుంచి బీయస్సీ సైకాలజీ, ‘శిశు అభివృద్ధి’ ప్రధాన అంశంగా ఎం.ఎ. చేసిన రాధికా ధరీవాల్ తొలి నవల ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’. అమ్మానాన్నల నుంచి దృఢచిత్తాన్ని, సంకల్పబలాన్ని వారసత్వంగా కాక, ఒక స్ఫూర్తిగా అందిపుచ్చుకున్న ఈ ఢిల్లీ అమ్మాయి, ప్రచురణ రంగంలో ఉన్న తండ్రి వృత్తి రీత్యా చిన్న వయసులోనే ప్రపంచంలోని భిన్న సంస్కృతులను చూడగలిగారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, హంగేరి, ఫిలిప్పీన్స్, అమెరికాలలో కొన్నాళ్లు ఉండి వచ్చారు. 1868 నాటి ‘లిటిల్ ఉమన్’ నవలలోని స్త్రీవాద భావాలు గల ప్రధాన పాత్ర జోసెఫైన్ మార్చ్‌తో తనను తను తరచు పోల్చుకునే రాధిక.. ఒక మనిషి ఉనికిని తెలిపేది వారి వ్యక్తిత్వమేనంటారు. ఇదే విషయాన్ని ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’లో అందంగా, ఆహ్లాదంగా, ఆకట్టుకునేలా చెప్పారు. ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’లో ప్రధానంగా మూడు పాత్రలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన పాత్ర ఉడుత. తర్వాతి రెండు పాత్రలు ఒక కుక్క, ఒక కాకి. కుక్కకి ‘డెస్’ అని, కాకికి ‘అజుల్ఫా’ అని పేర్లు ఉన్నాయి కానీ, రచయిత్రి ఎందుకనో ఉడతకి ‘ఉడత’ (ఇంగ్లిష్‌లో ‘స్క్విరల్’) అనే పేరును ఉంచేశారు. ఈ టీనేజ్ స్క్విరల్ ఎంతో అందమైనది, ఒద్దిక గలది. కష్టపడి పనిచేస్తుంటుంది. విధేయంగా ఉంటుంది. ఇంతకీ ఇది పనిచేసేది ఒక ముంగీస దగ్గర. ఇక పని ఏమిటంటే పెట్పోస్టింగ్. ఉత్తరాలు బట్వాడా చేయడం. బద్దకస్తుడైన ముంగీస బాసు దగ్గర స్క్విరల్.. ఒక బానిస మాదిరిగా వెట్టి చాకిరీ చేస్తుంటుంది. తన శక్తిసామర్థ్యాలు తనకు తెలియక అలా పడి ఉంటుంది. ఆ క్రమంలో జరిగిన ఒక చిన్న సంఘటన పర్యవసానంగా స్క్విరల్ తనెంత ధైర్యవంతురాలో, ఎంత గొప్ప వ్యక్తిత్వం గలదో తెలుసుకుంటుంది. రెండో పాత్ర ‘డెస్’. ఇది పగ్, బీగిల్ జాతి లక్షణాలు కలగలిసిన శునకం. దీని వయసు, స్క్విరల్ వయసు ఒకటే. దీని దృష్టి ఎప్పుడూ తిండి మీదే. రచికరమైన భోజనం అంటే పడిచస్తుంది. తిన్నంత తిని, తాగినంత తాగుతుంది. డెస్ కూడా స్క్విరల్లా అందమైనదే కానీ, అనాథ మాత్రం కాదు. ఎంతగానో ప్రేమించే కుటుంబం ఉంటుంది. ముగ్గురు అక్కలుంటారు. స్క్విరల్ పరిచయం అయీ కాగానే దానికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. మూడోది ‘అజుల్ఫా’. ఇదొక కాకి. పరిమాణంలో పెద్దది. బలమైనది. చిన్న కళ్లు, సన్న గొంతు. వయసులో స్క్విరల్, డెస్ల కన్నా పెద్ద. ఒక సంఘటనతో ఇవి మూడూ మంచి ఫ్రెండ్స్ అయిపోతాయి. ఇక కథలోకి వెళ్తే.. అనాథ అయిన స్క్విరల్కి ఓ రోజు అనూహ్యంగా పెళ్లి పిలుపు అందుతుంది! అది ఆశ్చర్యపోతుంది. వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. పెళ్లి జరుగుతున్నది సంపన్నులైన వధూవరులకు. ఆ పెళ్లిలోనే వధువు సోదరుడైన డెస్తో స్క్విరల్కి పరిచయం అవుతుంది. కొద్దిసేపట్లోనే ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. స్క్విరల్ మనసు విప్పుతుంది. తనో అనాథనని చెబుతుంది. డెస్ హృదయం కరిగిపోతుంది. స్క్విరల్ను ఓదార్చుతాడు. ఆ సందర్భంలో అనుకోకుండా.. పెళ్లయినవాళ్లు మాత్రమే తాగవలసిన ‘వెడ్డింగ్ వైన్’ను ఇవి రెండూ సేవిస్తాయి. డెస్కి ఏమీ అవదు కానీ, ఆ ప్రభావంతో స్క్విరల్కు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం అవుతుంది. చనిపోయిన తల్లి తనతో ఏదో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే పెళ్లింటిపై కాకుల గుంపు దాడి చేస్తుంది. ఆ గుంపులో మంచిదైన ‘అజుల్ఫా’ సహాయంతో స్క్విరల్, డెస్ తప్పించుకుంటాయి. ఈ క్రమంలో ఈ మూడూ కలసి అనేక సాహసాలు చేస్తుంటాయి. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటాయి. ఒక దుష్ట మార్జాలం సూచనతో కాకుల గుంపు, తేనెటీగల గుంపు తమపై దాడి చేస్తున్నాయని గ్రహించి వాటితో పోరాడుతుంటాయి. ఆ తరుణంలో స్క్విరల్కు ఓ మంత్రదండం గురించి తెలుస్తుంది. దాన్ని కనుక సంపాదిస్తే ఎవరినైనా ఇట్టే బానిసలుగా చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా ఇట్టే విముక్తి కల్పించవచ్చు. అయితే ఆ మంత్రదండాన్ని సాధించడం తేలిగ్గా జరిగే పని కాదు. సాహసాలు చెయ్యాలి, ప్రమాదపు అంచుల్లోకి వెళ్లి రావాలి. అయినా సరే స్క్విరల్ కార్యదీక్షకు పూనుకుంటుంది. చివరికి విజయం సాధిస్తుంది. తన జన్మ పరమార్థాన్ని, జన్మ రహస్యాన్ని తెలుసుకుంటుంది. ఆ ఆయుధం మరేదో కాదు, తన శక్తిని తాను తెలుసుకోవడం! రాధికా ధరీవాల్ను మంచి రచయిత్రిగా నిలబెట్టే నవల ఇది. పాత్రలను, సందర్భాలను, సన్నివేశాలను చాలా పకడ్బందీగా అక్షరబద్ధం చేశారు రాధిక. ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇండియా నుంచి వెలువడిన ఈ రచన... రచయిత్రి పడ్డ నాలుగేశ్ల శ్రమకు ఫలితం. పాఠకులకు మనోల్లాసం. నాలుగేళ్ల క్రితం ఓ రోజు.. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. నా గ్రేట్ డేన్ (కుక్కపిల్ల)ను తీసుకుని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి కారులో వెళ్తుంటే ఓ చోట సిగ్నల్ పడింది. కారును ఆపి, విండోలోంచి బయటికి చూస్తుంటే ఓ ఉడుత కనిపించింది. ఎక్కడ సంపాదించిందో ఓ బ్రెడ్డు ముక్కను కొరికి తింటోంది. ఇంతలో ఓ కాకి గబాల్న వాలి, ఉడుత చేతుల్లోంచి బ్రెడ్డు ముక్కను లాగేసుకుని తినడం మొదలు పెట్టింది. కొద్ది క్షణాల తర్వాత అక్కడికో కుక్క వచ్చి కాకిని తరిమేసి బ్రెడ్డు ముక్కను నోట కరచుకుంది. ఇదంతా చూస్తున్నప్పుడు నాకేమీ అనిపించలేదు కానీ, ఆ రాత్రి నిద్రపట్టలేదు. పట్టినా నిద్రలోకి ఉడుత, కాకి, కుక్క వచ్చేస్తున్నాయి. రోజూ ఆలస్యంగా నిద్ర లేచే దాన్ని ఆ వేళ ఉదయం ఐదు గంటలకే లేచి కూర్చున్నాను. ఏదో రాయాలనే తపన. జీవన పోరాటంలో భాగంగా ప్రాణులు ప్రవర్తించే తీరును థీమ్‌గా తీసుకుని ఆరోజే ఒక కథను అల్లుకున్నాను. పాత్రల్ని కల్పించాను. అది నవలగా రూపాంతరం చెందడానికి ఏడాదిన్నర పట్టింది. కానీ ఏదో అసంతృప్తి. తర్వాతి రెండున్నర ఏళ్లలో ముప్పైసార్లు నవలను తిరగరాశాను. అలా ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’ ఒక కొలిక్కి వచ్చింది. - రాధికా ధరీవాల్ -
చదువరి - రాయరి
సత్వం: తన పఠనాన్ని బోర్హెస్ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండుంటే బాగుండేదని తలపోశాడు. బోర్హెస్‌ను పట్టించే రెండే పదాల్ని చెప్పమంటే, తడుముకోకుండా ఎంచుకోగలిగేవి: చదవడం, రాయడం! చిన్నతనంలోనే వాళ్ల నాన్న తన గ్రంథాలయాన్ని బోర్హెస్‌కు పరిచయం చేశాడట. ‘అందులో ఏం కావలిస్తే అది చదువుకో’మన్నాడట. ‘కాని ఏదైనా విసిగిస్తే వెంటనే దాన్ని పక్కన పెట్టేయమన్నాడు. అంటే నిర్బంధ పఠనానికి వ్యతిరేకం అన్నమాట. పఠనమంటే ఆనందం కలిగించేదిగా వుండాలి.’ తన పఠనాన్ని బోర్హెస్ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండుంటే బాగుండేదని తలపోశాడు. ముప్పై ఏళ్లవరకూ తనను నిరర్థకమైన జీవిగానే భావించుకున్నాడాయన. గంభీరమైన చరిత్రగల కుటుంబంలో అర్జెంటీనాలో జన్మించిన బోర్హెస్(1899-1986) తాతలు యుద్ధాల్లో పాల్గొన్నవారు! రోజూ పొద్దునే గడ్డం గీసుకోవడానికి ఉపకరించే రెమింగ్టన్ కంపెనీయే తన తాతయ్య మరణానికి కారణమైన రైఫిళ్లను ఉత్పత్తి చేసిందన్న నిజం ఆయనకు చిత్రమైన గగుర్పాటు కలిగించేదట. సాహసాలతో నిండి సుసంపన్నంగా కనిపించే తన పూర్వీకుల జీవితంతో పోల్చుకుంటే ఆయనకు న్యూనత కలిగేదట. కార్యశూరత లేని ‘ఒక పాఠకుని జీవితం, అప్పుడప్పుడు తీవ్రంగా, ఒక పేద జీవితమని అనిపించే’దట. కాని దాన్నుంచి ఆయన బయటపడగలిగాడు. ‘ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఏ జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే’ అని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు. ‘అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదో నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ని,’ అని గర్వంగా చాటుకున్నాడు. తర్వాత ఎన్ని ముద్రణలు వెలువడినప్పటికీ, తను చదివిన ఆ పాత పుస్తకం, దాని అట్ట, అందులోని అక్షరదోషాలు, గీసుకున్న గీతలున్నదే అసలైన ‘డాన్ కిహోటి’గా భావించడం ఆయన వేలాది పఠనానుభవాల్లో ఒకటి! తన మాతృభాష స్పానిష్ సాహిత్యంతో మొదలుకొని, జర్మన్ సాహిత్యం (ఎంతో ఉన్నతమైన సాహిత్యాన్ని అందించిన జర్మన్, ఆ సాహిత్యంకంటే అందమైన భాషంటాడు!), ఫ్రెంచ్ సాహిత్యం (ఎంతో శ్రేష్టమైన సాహిత్యాన్ని అందించిన ఫ్రెంచ్, ఆయనకు వికారంగా తోచిందట!), ఆంగ్ల సాహిత్యం (ఆయన్ని షేక్స్పియర్ ముగ్ధుణ్ని చేయలేదు; ఆంగ్లాన్ని మాత్రం సొంతభాషలా ప్రేమించాడు.), ఇంకా, చరిత్ర, తత్వశాస్త్రం, గణితం, భూగోళం, మతగ్రంథాలు... ఎంత చదవాలో అంత చదివాడు; వాటి గురించి ఎంత రాయాలో అంత రాశాడు. ‘కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు, మేజిక్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు’గా నిలిచాడు. ‘ఫిక్షన్స్’ ‘ది అలెఫ్’ కథాసంకలనాలు ఆయనకు విశ్వవిఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆయన తండ్రి జార్జ్ గిలెర్మో బోర్హెస్ ఒక విఫల రచయిత! తండ్రి సాధించలేని చోట, తను కృతకృత్యుడవ్వాలన్న నైతిక ఒత్తిడి కూడా ఆయన్ని రాయడానికి పురిగొల్పింది. తొమ్మిదేళ్లప్పుడే ఆస్కార్ వైల్డ్ ‘ద హాపీ ప్రిన్స్’ను స్పానిష్లోకి అనువదించాడు; కానీ అది వాళ్ల నాన్న చేశాడనుకున్నారట. అయితే, తరువాతి రెండు దశాబ్దాలపాటు ఆయన ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, వాటిలో కొన్ని అచ్చువేసినప్పటికీ వాటన్నింటినీ తన ‘ప్రాక్టీస్’గా మాత్రమే పరిగణించాడు. ఆడంబర గుణంలోంచి జనించే ‘మేలిమి రచన’కన్నా, సాఫీగా సాగే మంచి రచనే ఉత్తమమైనదిగా పేర్కొన్నాడు. తొమ్మిదేళ్లపాటు బోర్హెస్ లైబ్రరీలో పనిచేశాడు. గొప్ప పాఠకుడికి తగిన చోటు! మరోవైపు ఆయన సాహిత్య సామ్రాజ్యాన్ని ‘రాయరి’(ప్రభువు)లా ఏలుతున్నాడు. అలాంటి రోజుల్లో ఆయన సహోద్యోగి ఒకరు, ‘జార్జ్ లూయీ బోర్హెస్’ అనే రచయిత పేరూ, ఇతడి పేరూ ఒకటేకావడం; పైగా ఇద్దరికీ ఒకే పుట్టినరోజు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! తనపక్కనుండి బుద్ధిగా పుస్తకాలు సర్దుతుండే ఈ యువకుడే అంతటి కథకుడని ఆ సహోద్యోగి ఎలా నమ్మగలడు! 55 ఏళ్ల వయసులో బోర్హెస్‌కు చూపు పోయింది. అటు ఎనిమిది లక్షల పుస్తకాల వరాన్నీ ఇచ్చి, ఇటు అంధత్వాన్నీ శాపించిన దేవుణ్ని మొదట నిందించాడు. అయితే, ఒక కళాకారునికి సంభవించే ప్రతిదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకేననీ, తనకు ప్రాప్తించే ప్రతీ వేదననీ మూసలోకి మలిచేందుకు పనికొచ్చే మన్నుగానే భావించాలనీ ఆయన చెప్పినట్టుగానే... క్రూరమైన అంధత్వాన్ని కూడా తన జీవితానికి దక్కిన బహుమతిగానే స్వీకరించాడు. డిక్టేషన్ చెబుతూ రచనలు చేశాడు; అడాల్ఫో బోయ్ కాసరస్ లాంటివారితో జతగానూ రాశాడు; విశ్వవిద్యాలయాల్లో రచన కళ గురించి ఉపన్యసించాడు; పాఠకుడిగానూ, రచయితగానూ రెండు జీవితాల్నీ సంపూర్ణంగా జీవించి నిష్ర్కమించాడు! - ఆగస్టు 24న రచయిత జార్జ్ లూయీ బోర్హెస్ జయంతి -
అర్థవంతం: పేర్ల వెనక ఫ్లాష్!
ఈ నవలలు ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖమైన స్థానం సంపాదించినవి. అంతకు మించి అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచినవి! ఈ నవలల కథాంశమే కాదు ఆ కథాంశాలకూ అత్యంత అర్థవంతంగా పేర్లను పెట్టిన విషయంలో కూడా రచయితల ప్రతిభ అద్భుతమనిపిస్తుంది! ఫైవ్‌పాయింట్ సమ్ వన్: ఐఐటీల్లో ప్రతి సబ్జెక్టుకీ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) గ్రేడింగ్ ఇస్తారు. ఇందుకు స్కేల్లో 10ని ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే పదికి ఎంత సీజీపీఏ సాధిస్తారనేది ఇక్కడ లెక్క. సబ్జెక్ట్ టాపర్‌కు 10 కి పది ఇచ్చి మిగతా వాళ్లకు వారి పెర్మార్మెన్స్ను బట్టి స్కేలింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ చదివే విద్యార్థులు ఎంతలేదన్నా కనీసం ఆరుకు పైగా పాయింట్లను తెచ్చుకుంటారు. అంతకు తక్కువ వచ్చిన వాళ్లు అపరమేధావులని (వ్యంగ్యంగా) లెక్క! ఆరుకు తక్కువగా గ్రేడ్ తెచ్చుకున్న వారిని... ఉదాహరణకు 5.76 వంటి స్థాయిలో సీజీపీఏ సాధించిన వారిని ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ కింద వ్యవహరిస్తారు! 5 కు 6 కు మధ్యలో సీజీపీఏ సాధించిన వారంతా ‘ఫైవ్‌పాయింట్ సమ్ వన్’లే! ఐఐటీ స్టూడెంట్ అయిన చేతన్ భగత్ తన నవలలో హీరోల సీజీపీఏ స్థాయిని బట్టి పేరును ‘ఫైవ్‌పాయింట్ సమ్‌వన్ ’ అని పెట్టారు! మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్: పురుషులు అంగారక గ్రహ వారసులైతే, స్త్రీలు శుక్రగహ వారసులు! ఇద్దరూ కలిసి భూగ్రహం మీద సాగించే జీవితాల్లో వారి మధ్య వచ్చే వైరుధ్యాల గురించి జాన్ గ్రే రాసినదే ఈ నవల! మన సౌర కుటుంబంలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలున్నాయి. వాటిలో ఏడు గ్రహాలు ఒక తీరున ఉంటే శుక్రగ్రహం(వీనస్)మాత్రం ప్రత్యేకం! అన్ని గ్రహాలూ ఒక దిశలో పరిభ్రమిస్తుంటే వాటన్నింటికీ వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంటుంది ఈ గ్రహం! శుక్రగ్రహం మీద రిస్ట్ వాచ్ లేదా వాల్ క్లాక్ ఉంచితే అది అపసవ్య దిశలో తిరుగుతుందని శాస్త్రవేత్తలంటారు! ఏవిధంగా చూసినా ఇతర గ్రహాలతో పోల్చినప్పుడు వీనస్ ఈజ్ రివర్స్ ప్లానెట్! అచ్చం ఆడవాళ్లలాగే అనేది ఈ అమెరికన్ రచయిత ఉవాచ! ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరు’ అన్న భావాన్ని స్ఫూరించేలా వారు శుక్రగ్రహం నుంచి వచ్చారేమో అన్న అనుమానం ఈ పుస్తకం ద్వారా వ్యక్తపరిచారు. అదే ఫన్ ను తన నవల పేరుతోనే పండించారు! ఇక్కడ మరో థియరీ కూడా ఉంది. గ్రీకుల ప్రేమ దేవత పేరు ‘వీనస్’. మహిళలను ప్రేమ మూర్తులుగా భావిస్తూ వారిని వీనస్‌కు వారసులుగా భావిస్తూ ఈ పేరు పెట్టారట. జాగ్రఫీ పరంగా తీసుకుంటే.. మార్స్ చాలా హీట్. మీథేన్గ్యాస్లతో కూడు కొన్న వీనస్ చల్లదనంతో కూడిన గ్రహం. పురుషులు అగ్రెసివ్, మహిళలు కూల్ అనే భావనతో కూడా రచయిత తన నవలకు ఈ పేరు పెట్టాడ నేది మరో థియరీ. మిడ్నైట్ చిల్డ్రన్: 20వ శతాబ్దంలో భారతదేశం నుంచి వచ్చిన ఆంగ్లసాహిత్యంలో ప్రముఖమైనదిగా నిలిచిన ఈ నవలకు బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ష్ద్రీ సృజించిన వచన కావ్యమిది! దేశవిభజనతో ముడిపడిన పేరు ఇది! అవిభాజ్యభారతం ఒక అర్ధరాత్రి విభజించ బడింది. మతం అనే ఒకే ప్రాతిపదికతో ప్రజలు అటు ఇటు కదిలిపోతున్నారు. తమ మతానికి ఒక దేశాన్ని ఎంచుకుని...తమ మతం తమను అక్కడే బతకమని అదేశించినట్టుగా కదులుతున్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతావని నిట్టనిలువుగా చీలిన ఆ అర్ధరాత్రి జన్మించిన చిన్నారుల కథ ‘మిడ్నైట్ చిల్డ్రన్’! దేశ విభజనలోని అత్యంత సున్నిత కోణాన్ని తాకిన థీమ్ ఈ నవలది. పేరులోనే ఆ భావం వ్యక్తమయ్యిందేమోననిపిస్తుంది. - జీవన్‌రెడ్డి. బి