బలరాజ్ సహానీ....
గ్రేట్ యాక్టర్
బలరాజ్ సహానీని మన దగ్గర కొంగర జగ్గయ్యతో పోల్చవచ్చా? ఇద్దరూ రేడియోలో అనౌన్సర్లుగా పని చేశారు. జగ్గయ్య ఆల్ ఇండియా రేడియోలో. బలరాజ్ సహాని బిబిసి లండన్‌లో. పాకిస్తాన్- రావల్పిండిలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎం.ఎ చేసిన బలరాజ్ సహాని లండన్ నుంచి దేశ విభజనకు ముందే ముంబై చేరుకున్నాడు. అక్కడే ఆయన నటుడిగా తన ప్రస్థానం మొదలెట్టాడు. ధర్తీ కా లాల్ (1946), దో భిగా జమీన్ (1953), కాబూలీవాలా (1961) వంటి సినిమాలు ఆయన ఒక గొప్ప నటుడని నిరూపించడమే కాక భారతీయ సినిమాని ప్రపంచ సినిమా రంగంలో సగౌరవంగా నిలబెట్టాయి. గొప్ప గొప్ప చలన చిత్రోత్సవాల్లో బలరాజ్ సహానీ నటించిన సినిమాలు ప్రదర్శితమై ఆయనకు పేరు తెచ్చాయి.
ఆ తర్వాత సహానికి క్యారెక్టర్ నటుడిగా మారినా వక్త్, గరం హవా వంటి మంచి సినిమాలు చేసినా ఆయన ఉండాల్సినంత బిజీగా మాత్రం ఉండలేదు. దానికి కారణం ఆయనకు ఉన్న పేరు కావచ్చు... కమ్యూనిస్టు పార్టీలో ఆయన చాలా పెద్దస్థాయి పేరున్న వ్యక్తి కావడం వల్ల కావచ్చు. సహానీ నటనతో పాటు రచననూ సాధన చేశాడని చాలామందికి తెలియదు. ముఖ్యంగా పంజాబీలో ఆయన రాసిన పుస్తకాలు ఆయనను పెద్ద రచయితను చేశాయి. చనిపోయేనాటికి (1973) సహాని వయసు 59 ఏళ్లు. మన రాజ్‌కుమార్ హిరాణి సినిమాల్లో తప్పకుండా కనిపించే పరిక్షిత్ సహాని ఈయన కొడుకే.