అర్థవంతం: పేర్ల వెనక ఫ్లాష్!
ఈ నవలలు ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖమైన స్థానం సంపాదించినవి. అంతకు మించి అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచినవి! ఈ నవలల కథాంశమే కాదు ఆ కథాంశాలకూ అత్యంత అర్థవంతంగా పేర్లను పెట్టిన విషయంలో కూడా రచయితల ప్రతిభ అద్భుతమనిపిస్తుంది!
ఫైవ్‌పాయింట్ సమ్ వన్:
ఐఐటీల్లో ప్రతి సబ్జెక్టుకీ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) గ్రేడింగ్ ఇస్తారు. ఇందుకు స్కేల్‌లో 10ని ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే పదికి ఎంత సీజీపీఏ సాధిస్తారనేది ఇక్కడ లెక్క. సబ్జెక్ట్ టాపర్‌కు 10 కి పది ఇచ్చి మిగతా వాళ్లకు వారి పెర్మార్మెన్స్‌ను బట్టి స్కేలింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ చదివే విద్యార్థులు ఎంతలేదన్నా కనీసం ఆరుకు పైగా పాయింట్లను తెచ్చుకుంటారు. అంతకు తక్కువ వచ్చిన వాళ్లు అపరమేధావులని (వ్యంగ్యంగా) లెక్క! ఆరుకు తక్కువగా గ్రేడ్ తెచ్చుకున్న వారిని... ఉదాహరణకు 5.76 వంటి స్థాయిలో సీజీపీఏ సాధించిన వారిని ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ కింద వ్యవహరిస్తారు! 5 కు 6 కు మధ్యలో సీజీపీఏ సాధించిన వారంతా ‘ఫైవ్‌పాయింట్ సమ్ వన్’లే! ఐఐటీ స్టూడెంట్ అయిన చేతన్ భగత్ తన నవలలో హీరోల సీజీపీఏ స్థాయిని బట్టి పేరును ‘ఫైవ్‌పాయింట్ సమ్‌వన్ ’ అని పెట్టారు!
మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్:
పురుషులు అంగారక గ్రహ వారసులైతే, స్త్రీలు శుక్రగహ వారసులు! ఇద్దరూ కలిసి భూగ్రహం మీద సాగించే జీవితాల్లో వారి మధ్య వచ్చే వైరుధ్యాల గురించి జాన్ గ్రే రాసినదే ఈ నవల! మన సౌర కుటుంబంలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలున్నాయి. వాటిలో ఏడు గ్రహాలు ఒక తీరున ఉంటే శుక్రగ్రహం(వీనస్)మాత్రం ప్రత్యేకం! అన్ని గ్రహాలూ ఒక దిశలో పరిభ్రమిస్తుంటే వాటన్నింటికీ వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంటుంది ఈ గ్రహం! శుక్రగ్రహం మీద రిస్ట్ వాచ్ లేదా వాల్ క్లాక్ ఉంచితే అది అపసవ్య దిశలో తిరుగుతుందని శాస్త్రవేత్తలంటారు! ఏవిధంగా చూసినా ఇతర గ్రహాలతో పోల్చినప్పుడు వీనస్ ఈజ్ రివర్స్ ప్లానెట్! అచ్చం ఆడవాళ్లలాగే అనేది ఈ అమెరికన్ రచయిత ఉవాచ! ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరు’ అన్న భావాన్ని స్ఫూరించేలా వారు శుక్రగ్రహం నుంచి వచ్చారేమో అన్న అనుమానం ఈ పుస్తకం ద్వారా వ్యక్తపరిచారు. అదే ఫన్ ను తన నవల పేరుతోనే పండించారు!
ఇక్కడ మరో థియరీ కూడా ఉంది. గ్రీకుల ప్రేమ దేవత పేరు ‘వీనస్’. మహిళలను ప్రేమ మూర్తులుగా భావిస్తూ వారిని వీనస్‌కు వారసులుగా భావిస్తూ ఈ పేరు పెట్టారట. జాగ్రఫీ పరంగా తీసుకుంటే.. మార్స్ చాలా హీట్. మీథేన్‌గ్యాస్‌లతో కూడు కొన్న వీనస్ చల్లదనంతో కూడిన గ్రహం. పురుషులు అగ్రెసివ్, మహిళలు కూల్ అనే భావనతో కూడా రచయిత తన నవలకు ఈ పేరు పెట్టాడ నేది మరో థియరీ.
మిడ్‌నైట్ చిల్డ్రన్:
20వ శతాబ్దంలో భారతదేశం నుంచి వచ్చిన ఆంగ్లసాహిత్యంలో ప్రముఖమైనదిగా నిలిచిన ఈ నవలకు బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ష్ద్రీ సృజించిన వచన కావ్యమిది! దేశవిభజనతో ముడిపడిన పేరు ఇది! అవిభాజ్యభారతం ఒక అర్ధరాత్రి విభజించ బడింది. మతం అనే ఒకే ప్రాతిపదికతో ప్రజలు అటు ఇటు కదిలిపోతున్నారు. తమ మతానికి ఒక దేశాన్ని ఎంచుకుని...తమ మతం తమను అక్కడే బతకమని అదేశించినట్టుగా కదులుతున్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతావని నిట్టనిలువుగా చీలిన ఆ అర్ధరాత్రి జన్మించిన చిన్నారుల కథ ‘మిడ్‌నైట్ చిల్డ్రన్’! దేశ విభజనలోని అత్యంత సున్నిత కోణాన్ని తాకిన థీమ్ ఈ నవలది. పేరులోనే ఆ భావం వ్యక్తమయ్యిందేమోననిపిస్తుంది.
- జీవన్‌రెడ్డి. బి