Novels
-
మహిత.. తానొెక సూక్ష్మ లిఖిత!
అన్నం మహిత... చిన్నప్పుడు పెన్సిల్‌తో బొమ్మలు వేసింది. ఇప్పుడు పెన్సిల్ మీద గ్రంథాలు చెక్కుతోంది. మహనీయుల జీవిత చరిత్రలను పెన్సిల్ మీద రాస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాసిన జీవిత చరిత్రలు, మహాగ్రంథాల జాబితా ఆమె వయసుకంటే పెద్దదిగా ఉంది. ఆంధ్రప్రదేశ్, బాపట్ల జల్లా, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన మహిత... తాను సాధన చేస్తున్న మైక్రో ఆర్ట్ గురించి ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్న వివరాలివి..‘‘చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరినప్పుడు కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఆ ఖాళీ టైమ్‌లో బియ్యం మీద వినాయకుడు, జాతీయ పతకాలను చెక్కాను. ఆ తర్వాత మినుములు, పెసలు, బొబ్బర్లు మీద బొమ్మలు చెక్కాను. వాటిని చూసి మా నాన్న మహాభారతం ట్రై చెయ్యి, నీ సాధనకు గుర్తింపు వస్తుందన్నారు. సంస్కృత భాషలో మహాభారతంలోని 700 శ్లోకాలను 810 పెన్సిళ్ల మీద చెక్కాను. మొత్తం అక్షరాలు 67, 230, పదాల్లో చె΄్పాలంటే 7,238.కళను సాధన చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే... ఒకటి పూర్తయిన తర్వాత మరొకటి చేయాలనిపిస్తుంది. మహాభారతం తర్వాత వాసవీ కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర, పుట్టపర్తి సాయిబాబా చరిత్ర, అనేకమంది ప్రముఖుల జీవితచరిత్రలను పెన్సిల్ ముక్కు మీద రాశాను. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అమరజీవి ΄÷ట్టి శ్రీరాములు, నెల్సన్మండేలా, ప్రధాని నరేంద్రమోదీ, స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్సార్, అంబేద్కర్, కరుణానిధి, కేసీఆర్, నరేంద్రమోదీ, ఎంఎస్రెడ్డితో΄ాటు ఏఎన్ఆర్ ఇంకా అనేక మంది సినీ ప్రముఖుల జీవితచరిత్రలను చెక్కాను. మన జాతీయగీతాన్ని ΄ాస్తా మీద చెక్కాను.కర్ణాటక రాష్ట్ర అవతరణ చరిత్రను కూడా రాశాను. నా కళకు గుర్తింపుగా చీరాల రోటరీ క్లబ్‌తో మొదలు ఉత్తరప్రదేశ్ ఆర్ట్ కాంపిటీషన్ వరకు అనేక పురస్కారాలందుకున్నాను. ఈ కళాసాధనను కొనసాగిస్తాను’’ అన్నారు అన్నం మహిత. సూక్ష్మ కళ ఆసక్తి కొద్దీ సాధన చేసే వాళ్లతోనే మనుగడ సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి శిక్షణ అవకాశం లభిస్తే ఎక్కువ మంది కళాకారులు తయారవుతారని ఈ సందర్భంగా మహిత తన అభిలాషను వ్యక్తం చేశారు. – వంగూరి సురేశ్‌కుమార్, సాక్షి, బాపట్ల జిల్లా -
జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్
నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్న పిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ ఆండర్స్ ఓల్సన్ గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు. ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (10 లక్షల డాలర్లు) లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించిందంటే తనని తాను నమ్మలేకపోయానంటూ జాన్ ఫోసే తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ‘‘నోబెల్ కమిటీ ఫోన్ చేసి చెప్పగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మళ్లీ నన్ను నేనే నిలవరించుకున్నారు. గత పదేళ్లుగా నోబెల్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు విపరీతమైన ఆనందాన్ని ఇస్తోంది. కాస్త కూడా భయం వేస్తోంది. ’’ అని నార్వే మీడియాకు చెప్పారు. నార్వేలో అత్యంత ప్రతిభావంతుడైన నాటక రచయితగా గుర్తింపు పొందిన ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రచించారు. అయితే నాటక రచయితగానే ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. మాటల్లో తమ బాధల్ని చెప్పుకోలేని ఎన్నో వర్గాలకు ఆయన తన రచనలతో ఒక గళంగా మారి సామాజిక పరిస్థితుల్ని అద్దంలో చూపించారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ ఘటనలే కథా వస్తువు నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఘటనలే జాన్ ఫోసే రచనలకు ఆధారం. అలాంటి ఘటనల్ని సరళమైన భాషలో,, శక్తిమంతమైన భావ ప్రకటనతో రచనలు చేసి సామాన్యుల మనసుల్ని కూడా దోచుకున్నారు. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను , సామాజిక పరిస్థితుల్ని చిన్నారులకి కూడా అర్థమయ్యేలా రచనలు చేసి సమాజంలో వివిధ వర్గాలపై ఎంతో ప్రభావాన్ని చూపించారు. నార్వేలో 1959లో క్రిస్టియన్ మతాచారాల్ని గట్టిగా ఆచరించే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆయన తన కుటుంబంపైన, మతంపైనా తిరుగుబాటు ప్రకటించారు. తాను నాస్తికుడినని ప్రకటించారు. చిన్నప్పట్నుంచి తిరుగుబాటు ధోరణి కలిగిన జాన్ ఫోసే రచనల్లో, నాటకాల్లో అది వ్యక్తమయ్యేది. 1983లో ఆయన రాసిన మొదటి నవల రెడ్, బ్లాక్‌లో ఆత్మహత్యల అంశాన్ని స్పృశించారు. అప్పట్నుంచి ఆయన వెనక్కి చూసుకోలేదు. నవలైనా, నాటకమైనా, పద్యాలైనా, గద్యాలైనా ఆ రచనల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. 40 భాషల్లో పుస్తకాల అనువాదం ఫోసే చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 భాషల్లోకి అనువాదమ య్యాయి. 2015లో ది డైలీ టెలిగ్రాఫ్ రూపొందించిన భూమ్మీద ఉన్న లివింగ్ జీనియస్లలో టాప్ 100 జాబితాలో ఫోసే 83వ స్థానంలో నిలిచారు. 2022లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు కోసం ఆయన రాసిన ‘‘ఏ న్యూ నేమ్ :సెప్టాలజీ Vఐ– Vఐఐ’’ షార్ట్ లిస్ట్‌లో నిలిచింది. జాన్ ఫోసేకు మూడు పెళ్లిళ్లయ్యాయి. ఆరుగురు పిల్లలకు తండ్రి. 64 ఏళ్ల వయసున్న జాన్ ఫోసే ఆస్ట్రియాలోని తన రెండో భార్యతో కలిసి ఉంటున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు దేవుడ్ని నమ్మని జాన్ ఫోసే ప్రస్తుతం కాథలిజంలోకి మారి దానినే అనుసరిస్తున్నారు. ఫోసే చేసిన రచనల్లో బోట్‌హౌస్, మెలాంకలి, సెప్టాలజీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఫోసే రచించిన నాటకాలను వేలాది ప్రొడక్షన్ హౌస్‌లు వివిధ దేశాల్లో ప్రదర్శించాయి. ఇంగ్లిష్ భాషలోకి అనువదించిన ఫోసే సెప్టాలజీ సిరీస్‌లో ది అదర్ నేమ్, ఐ ఈజ్ అనదర్, ఏ న్యూనేమ్ ఆయనకు చాలా గుర్తింపు తీసుకువచ్చాయి. భాషకు పట్టాభిషేకం జాన్ ఫోసే రచనలు నార్వేజియన్ భాషలో రాస్తారు. నార్వేలో 10% మంది మాత్రమే ఈ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. నార్వేలో ఉన్న రెండు అధికారిక భాషల్లో ఇదొకటి. గ్రామీణ ప్రాంత ప్రజలు మాట్లాడే మాండలికంలో ఉండే ఈ భాష 19వ శతాబ్దంలో డానిస్కు ప్రత్యామ్నాయంగా పుట్టింది. స్వచ్ఛమైన సెలయేరులాంటి భాషలో ప్రజలు రోజువారీ ఎదుర్కొనే సమస్యలకి తన రచనల్లో కొత్త కోణంలో పరిష్కారం మార్గం చూపించడంతో ఆయన పుస్తకాలు అపరిమితమైన ఆదరణ పొందాయి. అందుకే ఈ పురస్కారం తనకే కాకుండా, తన భాషకి కూడా పట్టాభిషేకం జరిగినట్టుగా ఉందని ఫోసే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుస్తక మర్యాద
ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఆ పుస్తకాన్ని అపురూపంగా చూడటం వేరు. చాలామంది పుస్తకాలను అమర్యాదగా చదువుతారు. అంతే సమానంగా వాటిపట్ల అజాగ్రత్తగా ఉంటారు. పుస్తకాలను వాటి మర్యాదకు తగినట్టుగా గౌరవించడం కూడా ఒక సంస్కృతి! పుస్తకం పేజీలు తీయడం కూడా కొందరు సుతారంగా తీస్తారు; పేజీలు నలగకుండా దాన్నొక పువ్వులా హ్యాండిల్ చేస్తారు. కొందరు నీటుగా బుక్ మార్క్స్ సిద్ధం చేసుకుంటారు. కొందరు చదవడం ఆపిన చోట పేజీ కొసను చిన్నగా మడుచుకుంటారు. ఇక కొందరి పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి ఒక బీభత్సం జరిగివుంటుంది. అలాగని పుస్తకం చదువుతూ రాసుకునే నోట్సు దీనికి భిన్నం. అది పుస్తకంతో ఎవరికి వారు చేసుకునే వ్యక్తిగత సంభాషణ. కొందరు కేవలం అండర్లైన్ చేసుకుంటారు. కొందరు పుస్తకం చివర నచ్చిన పేజీ తాలూకు నంబర్ వేసుకుని దానికి సంబంధించిన వ్యాఖ్యో, పొడి మాటో రాసుకుంటారు. ఇలాంటివారికి పుస్తకంలో చివర వచ్చే తెల్ల కాగితాలు చాలా ఉపయుక్తం. పఠనానుభవాన్ని పెంపు చేసుకునేది ఏదైనా పుస్తకాన్ని గౌరవించేదే. అయితే, పుస్తకాన్ని గౌరవిస్తున్నారని చూడగానే ఇట్టే తెలియజేసే అతి ముఖ్యమైన భౌతిక రూప చర్య– దాన్ని బైండు చేయడం. ఈ బైండు చేయించడంలో, స్వయంగా తామే చేసుకోవడంలో కూడా ఎవరి అభిరుచి వారిది. అలాగే పుస్తకం తరహాను బట్టి కూడా ఇది మారొచ్చు. అలాగే బైండింగుకు వాడే మెటీరియల్, అది చేసే పద్ధతులు కూడా చాలా రకాలు. ఏమైనా బైండింగు కూడా దానికదే ఒక కళ. అది కొందరికి బతుకుదెరువు అనేది కూడా ఒక వాస్తవమే. కానీ ప్రపంచంలో గొప్ప బైండింగు కళాకారుల పనితనాన్ని తెలియజేసే పుస్తకాలు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనకు ఉన్నాయి. పుస్తకం లోపల వ్యక్తమయ్యే భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలంటే ఆ బైండరు కూడా మంచి కళాకారుడు అయివుండాలి. ఫ్యోదర్ దోస్తోవ్స్కీ నవల ‘ద పొసెస్డ్’లో జరిగే ఈ ఆసక్తికర సంభాషణ పుస్తకాల పట్ల ప్రపంచం ఇంకా ఎక్కడుందో తెలియజేస్తుంది. ఈ నవలకే వాటి అనువాదకులను బట్టి ‘డెమన్ ్స’, ‘డెవిల్స్’ అని మరో రెండు పేర్లున్నాయి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, వాస్తవాల చేదును గ్రహించి, బండి బాడుగ కూడా ఇవ్వలేని స్థితిలో చివరకు తానే వదిలేసిన భర్త దగ్గరకు మళ్లీ చేరుతుంది మేరీ. బతకడానికి ఏదైనా మార్గం గురించి ఆలోచిస్తూ, ‘పోనీ పుస్తకాల బైండింగు చేస్తాను’ అంటుంది. అప్పుడు ఆమె భర్త, నవలలో అన్నివిధాలా సంయమనం కలిగిన మనిషి, ‘ఆదర్శాల్లోని’ నిగ్గును తేల్చుకున్న ఇవాన్ షతోవ్ ఆమె భ్రమలు తొలిగేలా ఇలా చెబుతాడు: ‘‘పుస్తకాలను చదవడం, వాటిని బౌండు చేయించడం అనేవి అభివృద్ధికి సంబంధించిన రెండు పూర్తి భిన్న దశలు. మొదట, జనాలు నెమ్మదిగా చదవడానికి అలవాటు పడతారు. దీనికి సహజంగానే శతాబ్దాలు పడుతుంది; కానీ వాళ్లు తమ పుస్తకాలను కాపాడుకోరు. వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. పుస్తకాలను బైండు చేయించడం అనేది పుస్తకాల పట్ల గౌరవానికి సంకేతం; అది ప్రజలు పుస్తకాలను చదవడానికి ఇష్టపడటమే కాదు, వాళ్లు దాన్ని ఒక ప్రధాన వృత్తిగా భావిస్తున్నారని సూచిస్తుంది. రష్యాలో ఎక్కడా అలాంటి దశకు చేరుకోలేదు. యూరప్‌లో కొంతకాలంగా తమ పుస్తకాలను బైండింగ్ చేయిస్తున్నారు.’’ 1871–72 కాలంలో రాసిన ఈ నవలలో, సాహిత్యం అత్యంత ఉచ్చస్థితిని అందుకొందనుకునే రష్యా సైతం ఒక దేశంగా చదివే సంస్కతిలో వెనుకబడి ఉందన్నట్టుగా రాశారు దోస్తోవ్స్కీ. ఇంక మిగతా దేశాల పరిస్థితి? ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలు అక్కడి కళలు, వాటి పట్ల జనాల వైఖరి మాత్రమే. దీనికి కూడా ఈ నవలలో దోస్తోవ్స్కీ ద్వారా సమాధానం దొరుకుతుంది. అప్పటి కాలానికి తనను తాను అభ్యుదయ రచయితగా భావించుకొనే పీటర్ వెర్కోవెన్ స్కీ ఇలా ఆవేశపడతాడు: ‘‘బానిసల (సెర్ఫులు) దాస్య విమోచన కంటే కూడా షేక్స్పియర్, రఫేల్ అధికోన్నతులని నేను ఘోషిస్తున్నాను; జాతీయత కంటే అధికోన్నతులు, సామ్యవాదం కంటే అధికోన్నతులు, యువతరం కంటే అధికోన్నతులు, రసాయన శాస్త్రం కంటే అధికోన్నతులు, దాదాపు మానవాళి మొత్తం కంటే అధికోన్నతులు; ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సమస్త మానవాళి సాధించిన ఫలం. నిజమైన ఫలం. బహుశా ఇంకెప్పటికీ సాధ్యం కానంతటి అత్యున్నత ఫలం!’’ అలాంటి ఒక కళోన్నత స్థితి లేని సమాజంలో తాను జీవించడానికి కూడా సమ్మతించకపోవచ్చునంటాడు వెర్కోవెన్ స్కీ. ఇది ఆర్ట్ అనేదానికి అత్యున్నత స్థానం ఇచ్చే సాంస్కృతిక కులీనుల అతిశయోక్తిలా కనబడొచ్చు. కానీ కళ అనేదాన్ని మినహాయిస్తే మన జీవితాల్లో మిగిలేది ఏమిటి? మహాశూన్యం. గాఢాంధకారం. అందుకే తమ జీవితాల్లో ఏదో మేరకు కళను సజీవంగా నిలుపుకొన్నవాళ్లు అదృష్టవంతులు. అది తమకు నచ్చిన సీరియళ్లను ఒక పుస్తకంగా కుట్టుకోవడం, తమకు నచ్చిన పుస్తకాలను బైండు చేయించుకోవడం కూడా కావొచ్చు. ఏ రూపంలో ఉన్న అతివాదాన్నయినా దాని మూలాలను, అది పాతుకుపోవడానికి దారితీసే పరిస్థితులను, ఒకప్పుడు తమ వర్గంవాడే అయినా కేవలం ఇప్పుడు ఆ వాదంలోంచి బయటపడ్డాడన్న కారణంగా చంపడానికీ వెనుకాడని మూక మనస్తత్వాన్ని–– ఒక శక్తిమంతమైన సూక్ష్మదర్శినిలో చూసినట్టుగా చిత్రించిన నవల ‘పొసెస్డ్’. విషాదాంతంగా ముగిసే ఈ సామాజిక, రాజకీయ వ్యాఖ్యాన నవల కూడా బైండు చేసుకుని దాచుకోవాల్సిన పుస్తకం. అదే అనితర సాధ్యుడైన దోస్తోవ్స్కీ లాంటి రచయితకు ఇవ్వగలిగే సముచిత మర్యాద! -
భావి ఫలం
పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్లాండ్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ కేటీ పేటర్సన్. ఈమె వయసు 41 ఏళ్లు. ఈ భవిష్యత్ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్ అట్వుడ్ (కెనడా) తన ‘స్క్రిబ్లర్ మూన్ ’ సమర్పించారు. 2015కు డేవిడ్ మిషెల్ (ఇంగ్లండ్) తన ‘ఫ్రమ్ మి ఫ్లోస్ వాట్ యు కాల్ టైమ్’ను ఇచ్చారు. 2016కు షివోన్ (ఐస్లాండ్), 2017కు ఏలిఫ్ షాఫక్ (టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్ కాంగ్ (దక్షిణ కొరియా), 2019కి కార్ల్ ఊవ్ నాస్‌గార్డ్ (నార్వే), 2020కి ఓసియన్ వువాంగ్ (వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు. విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్ హర్ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్ షలన్ స్కీ (జర్మనీ) ఈ జూన్ లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్‌మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్–ఎడిషన్ గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరెట్ అట్వుడ్ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్ ట్రాన్స్ ట్రోమార్ (స్వీడన్ ), ఉంబెర్టో ఎకో (ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరెట్ అట్వుడ్. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్ ఆఫ్ ఇస్తాంబుల్’, ‘ద ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్ షఫాక్. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో! ‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికి వుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్ ఓవ్ నాస్‌గార్డ్. ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ! -
యాకమ్మ ఒక గొప్ప వెలుగు
తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. ఎం.ఏ సంస్కృతం చేసింది. ఆ సమయంలో కథలు చదివి తన బతుకు గోస కూడా కథలుగా రాయాలనుకుంది. రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించింది. ‘చదువుకుంటే ఏమవుతుందో నన్ను చూసైనా నా జాతి ఆడపిల్లలు తెలుసుకోవాలని నా తపన’ అంటున్న యాకమ్మ పరిచయం. ‘దళిత ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం ప్రయత్నించి పదవులు పొంది దళితుల కోసం, పేదల కోసం పని చేయాలి’ అంటారు యాకమ్మ. ఆమె ‘కెరటం’ అనే దళిత నవల రాశారు. అందులోని మల్లమ్మ అనే దళిత మహిళ పాత్ర అలాగే ప్రస్థానం సాగిస్తుంది. కష్టపడి చదువుకుని, ఉద్యోగం పొంది, ఆ తర్వాత సవాళ్లను ఎదుర్కొని సర్పంచ్ అయ్యి, ఆ తర్వాత ఎం.ఎల్.ఏ. అవుతుంది. ‘ప్రజలు’ ఎప్పుడూ ప్రజలుగానే ఉండిపోవడం ఏ కొద్దిమంది మాత్రమే ఎం.ఎల్.ఏనో ఎం.పినో అవ్వాలనుకోవడం ఎందుకు అని యాకమ్మ ప్రశ్న. యాకమ్మది వరంగల్ జిల్లా మహబూబాబాద్. అక్కడికి దగ్గరగా ఉన్న అన్నారంలోని యాకూబ్ షా వలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టిందని తల్లిదండ్రులు యాకమ్మ అని పేరు పెట్టారు. ఇంటికి పెద్ద కూతురు యాకమ్మ. ఇంకో చెల్లి. తండ్రి మాదిగ కులవృత్తిని నిరాకరించి దొర దగ్గర జీతానికి పోయేవాడు. తల్లి కూలి పని చేసేది. ఇద్దరూ కూడా తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమలాంటి జీవితం కాకుండా మంచి జీవితం చూడాలని అనుకునేవారు. ముఖ్యంగా తల్లి అబ్బమ్మ తన కూతుళ్లను బాగా చదివించాలనుకునేది. యాకమ్మ కూడా అందుకు తగ్గట్టే చదువును ఇష్టపడేది. అక్కడ పదోతరగతి దాటితే పెళ్లి చేయడం ఆనవాయితీ. యాకమ్మ ఇంటర్‌కు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. యాకమ్మ తల్లిదండ్రులను, భర్తను అడిగింది ఒక్కటే– పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వమని. మంచినీళ్లు తాగి పెళ్లయ్యాక అత్తగారింట యాకమ్మకు చదువు వీలయ్యేది కాదు. భర్త వీరాస్వామి డ్రైవర్‌గా పని చేసేవాడు. అతని తోబుట్టువుల రాకపోకలు ఉండేవి. సంపాదన చాలక తినడానికి కూడా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు జతల బట్టలతోనే కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది యాకమ్మ. లంచ్బెల్లో స్నేహితురాళ్లు లంచ్ చేస్తుంటే దూరంగా చెట్టు కింద కూచుని మంచినీళ్లు తాగి మళ్లీ తరగతులకు వచ్చేది. ఆకలి ఉన్నా చదువు ఆపలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా చదువు ఆపలేదు. తెలుగులో పీహెచ్డీ యాకమ్మ కాకతీయ యూనివర్సిటీలో పి.జి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. చేసింది. తెలుగు పండిట్‌గా ఉద్యోగం రావడంతో పిల్లలకు పాఠాలు చెప్పాలంటే సంస్కృతం కూడా తెలిసి ఉండాలని సంస్కృతంలో పి.జి. చేసింది. ఆ సమయంలోనే తన గైడ్ బన్న ఐలయ్య ద్వారా సాహిత్యం తెలిసింది. కథలు చదివే కొద్దీ తన జీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి ఎందుకు రాయకూడదు అనిపించింది. కాని ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ప్రయత్నించి రాసింది. ‘కథలు రాస్తున్నాను’ అని వారికీ వీరికీ చెప్తే ‘ఈమె కూడా పెద్ద రచయితనా? ఈమెకు ఏం రాయవచ్చు’ అని హేళన చేశారు. కానీ వాళ్లే ఆ తర్వాత ఆమె రచనలను అంగీకరించారు. యాకమ్మ కుమార్తె ఎం.బి.బి.ఎస్ చేస్తోంది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. భర్త అనారోగ్యం వల్ల పని తగ్గించుకున్నాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటూనే కథను విడవకుండా సాధన చేస్తోంది యాకమ్మ. చదువుకుంటే జీవితాలు మారతాయని తనను చూసి తెలుసుకోండి అని అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు ఆమె మాటల ద్వారానో కథల ద్వారానో చెప్తూనే ఉంటుంది. ‘ఆడపిల్లలు చదువుకోవాలి. సమాజాన్ని మార్చాలి. పెళ్లి పేరుతోనో డబ్బులేదనో వారిని చదువుకు దూరం చేయొద్దు’ అంటుంది యాకమ్మ. ఆమె చీకట్లను తరిమికొట్టడానికి విద్యను, సాహిత్యాన్ని ఉపయోగిస్తోంది. యాకమ్మ ఒక గొప్ప వెలుగు. రెండు సంపుటాలు యాకమ్మ 2018 నుంచి రాయడం మొదలుపెట్టింది. కథ వెంట కథ రాసింది. ‘మమతల మల్లెలు’, ‘రక్షణ’ అనే రెండు సంపుటాలు వెలువరించింది. ఆ తర్వాత దళిత నవల ‘కెరటం’ రాసింది. తన జీవితం నుంచి తాను చూసిన జీవితాల నుంచి కథలను వెతికింది. వెతలు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో వరుసపెట్టి కథలు రాసి ‘దుఃఖ నది’ అనే సంకలనం తెచ్చింది. వెక్కిరించిన వాళ్లు, వివక్ష చూపిన వారు మెల్లగా సర్దుకున్నారు. వరంగల్ జిల్లా మొత్తం ఇప్పుడు యాకమ్మ అంటే ‘కథలు రాసే యాకమ్మేనా’ అని గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ఇదీ యాకమ్మ ఘనత. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
12 ఏండ్ల 295 రోజులకే రికార్డుల ‘సిరీస్’
సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్ పజిల్స్‌తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్‌ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్ హుస్సేన్ అల్‌హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది. ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్ అయ్యేనాటికి అల్‌హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్ ద ఫ్యూచర్ వరల్డ్’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్‌హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్ టు అన్నోన్’ రాస్తోంది. -
నవల్స్ పేరుతో నయ వంచన.. వాళ్లే టార్గెట్
సాక్షి,హిమాయత్‌నగర్: ప్రముఖ నవలలను సాఫ్ట్ కాపీల్లో తయారు చేయాలంటూ పేపర్, టీవీ, సోషల్ మీడియా ద్వారా యాడ్స్ ఇచ్చి నయా వంచనకు తెరతీశారు యూఎస్‌కు చెందిన ‘డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ’ నిర్వాహకులు. ఒక్కో పేజీకి రూ.5 చొప్పున ఇస్తామని గృహిణులను టార్గెట్ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు. చేసిన పనికి సరైన రీతిలో లాభాలు, వేతనాలు ఇవ్వకపోవడంతో మనదేశంలో ఈ కంపెనీని నిర్వహిస్తున్న ఢిల్లీకి చెందిన అమిత్‌శర్మపై బాధితులు బుధవారం సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భుపాల్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు స్రవంతి, కిషోర్, శ్రీనివాసరావు, సునీల్‌సింగ్, వికాస్, మనోజ్, వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..కొన్ని నెలల క్రితం యూఎస్‌కు చెందిన ‘డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీ నిర్వాహకులు వర్క్‌ఫ్రం హోం పేరుతో ప్రకటనలు ఇచ్చారు. పలు ప్రముఖ నవల్స్‌ను ఇచ్చి వాటిలో ఉన్న ఒక్కో పేజీని పీడీఎఫ్‌గా మార్చి కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఒక్కో పేజీకి రూ.5 కమీషన్ ఇచ్చేందుకు బాధితులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను రూ.లక్ష డిపాజిట్ చేస్తే తమ కంపెనీ నుంచి ఒక స్కానర్ ఇస్తామన్నారు.దీంతో పలువురు మహిళలు డిపాజిట్ చేశారు. దీంతో వారికి వారు చేసిచ్చిన పనికి సంబంధించి వేతనం, లాభాలు సైతం ఓ మూడు నెలల పాటు ఇవ్వడం జరిగింది. జూన్ నెలలో టూ పాయింట్ ఓ(2.0) పేరుతో అమిత్‌శర్మ మరో స్కీంను ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.5.50 లక్షలు డిపాజిట్ చెల్లించాలని చెప్పడంతో ప్రస్తుతం వీరికింద చేస్తున్న వారు ఆసక్తి కనబరిచారు. వీరు కట్టడమే కాకుండా తమ బంధువులు, స్నేహితులను కూడా ఈ స్కీంలో చేర్పించారు. నెల గడిచినా చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోవడంతో బాధితులు అమీర్‌పేట, బంజారాహిల్స్‌లోని కార్యాలయాల వద్దకు వెళ్లి నిలదీశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది తమకేమీ తెలిదనడంతో అమిత్‌శర్మకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆగ్రహించిన బాధితులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భుపాల్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు. -
పాపులర్ నవలలు.. వాటి ఆధారంగా వచ్చిన సినిమాలు
Top 10 Telugu Classic Movies Based On Novels: సాధారణంగా మనం చాలా సినిమాలను వాటి ట్రైలర్స్, టీజర్స్, ప్రమోషన్స్ నచ్చిన తర్వాత చూస్తాం. ఆ మూవీస్ కొంచెం ఆసక్తికరంగా ఉంటే వాటి గురించి పరిశోధిస్తాం. అవి రీమెక్ చేశారా? డబ్బింగ్ మూవీస్ ఆ? హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ కొట్టారా? లేదా ఏవైనా పుస్తకాలు, నవలల నుంచి స్ఫూర్తి పొంది తీశారా? అని. ఇలా ఏదో ఒక విధంగా తీసిని చిత్రాలంటే కొంచెం ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి సైతం మనం మొగ్గుచూపుతాం. అలాగే రీమెక్ చిత్రాలైతే ఒరిజనల్ అండ్ రీమెక్ సినిమాలతో పోల్చడం వంటి విషయాలు మనకు ఒకరకమైన కిక్‌ను కూడా ఇస్తుంది. కాపీ సినిమాలు అయితే ఇంతకుముందు అలా మరే సినిమాలు వచ్చాయో తెలుసుకోవాలనే కుతుహలం ఏర్పడుతుంది. ఇలానే పాపులర్ అయిన కొన్ని నవలల నుంచి తీసుకున్న తెలుగు క్లాసిక్ సినిమాలు మీకోసం. 1. అభిలాష- యండమూరి వీరేంద్రనాథ్ (అభిలాష) 2. చంటబ్బాయి- మల్లాది వెంకటకృష్ణ మూర్తి (చంటబ్బాయి) 3. మీనా- యుద్దనపూడి సులోచనరాణి (మీనా) 4. సెక్రటరీ- యుద్దనపూడి సులోచనరాణి (సెక్రటరీ) 5. ప్రేమ్ నగర్- కోడూరి కౌసల్య దేవి 6. కాష్మోరా- యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం) 7. అహా నా పెళ్లంటా- ఆది విష్ణు (సత్యం గారిల్లు) 8. డాక్టర్ చక్రవర్తి- కోడూరి కౌసల్య దేవి (చక్రభ్రమణం) 9. కన్యాశుల్కం- గురజాడ అప్పారావు 10. సితార- వంశీ (మహల్లో కోకిల) -
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్‌కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్‌ప్లేస్‌లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్. కరోనా సమయంలో వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం. ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు! ‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్‌లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది. దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్‌ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది. -
ఒకడు విశ్వనాథ
ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. ఎందరు పూర్వాంధ్ర మహా కవులు చరిత్రలో ఉన్నా, ఒకడు నాచన సోమన అని ఆయనే అన్నట్లుగా, ఆధునిక యుగంలో ‘ఒకడు విశ్వనాథ’. కవిసార్వ భౌముడు అనగానే శ్రీనాథుడు, కవిసమ్రాట్ అనగానే విశ్వనాథుడు తెలుగువారికి గుర్తుకు వచ్చి తీరుతారు. కావ్యాలు, నాటకాలు, శత కాలు, నవలలు, కథలు, పీఠికలు, వ్యాసాలు, గీతాలు, చరిత్రలు, విమర్శలు ఇలా... పుంఖానుపుంఖాలుగా రాసిన ఆధునిక యుగ కవి ఒక్క విశ్వనాథ సత్యనారా యణ తప్ప ఇంకొకరు లేరు. ఎన్ని రచనలు చేపట్టారో, అంతకు మించిన ప్రసంగాలు చేశారు. ఇంతటి కీర్తి ఇంకొకరికి అలభ్యమనే చెప్పాలి. సెప్టెంబర్ 10వ తేదీకి విశ్వనాథ జన్మించి 125 ఏళ్ళు పూర్తయ్యాయి. భౌతికంగా లోకాన్ని వీడి నాలుగు దశాబ్దాలు దాటినా, సాహిత్య లోకం అతన్ని వీడలేదు. వీడజాలదు. విశ్వనాథ ఎంచుకున్న మార్గం సంప్రదాయం. ఎదిగిన విధానం నిత్యనూతనం. తను ముట్టని సాహిత్య ప్రక్రియ లేదు. పట్టిందల్లా బంగారం చేశాడు. ‘ప్రతిభా నవనవోన్మేషశాలిని’ అన్నట్లుగా, ప్రతి ప్రక్రియలోనూ, ప్రతి దశలోనూ అతని ప్రతిభ ప్రభవించింది, విశ్వనాథ శారద వికసించింది. విశ్వనాథ సృజియించిన శారద సకలార్ధదాయిని. విశ్వనాథ వెంటాడని కవి ఆనాడు లేడు. విశ్వనాథ చాలాకాలం నన్ను వెంటాడాడని మహాకవి శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నాడు. విశ్వనాథను ‘కవికుల గురువు’ అని అభివర్ణించాడు. కవికులగురువు అనేది కాళిదాసుకు పర్యాయపదం. శ్రీశ్రీ దృష్టిలో విశ్వ నాథ ఆధునిక యుగంలో అంతటి గురుస్థానీయుడు. విశ్వనాథలోని సాహిత్య ప్రతిభను విశ్లేషిస్తే రెండు గుణాలు శక్తిమంతమైనవిగా కనిపిస్తాయి. ఒకటి కల్పన, రెండు వర్ణన. వేయిపడగలు వంటి నవల రాసినా, శ్రీరామాయణ కల్పవృక్షం వంటి మహాపద్యకావ్యం రాసినా ఆ కల్పనా ప్రతిభ, ఆ ధిషణా ప్రవీణత అక్షర మక్షరంలో దర్శనమవుతాయి. చిక్కని కవిత్వం కిన్నెర సాని పాటల్లో ముచ్చటగా మూటగట్టుకుంది. ఋతువుల వర్ణనలో ప్రకృతి, పల్లెదనం పాఠకుడి కన్నుల ముందు నాట్యం చేస్తాయి. ఏకవీర, తెరచిరాజు వంటి నవలలు, హాహా హూహూ, మ్రోయు తుమ్మెద వంటి రచనలు, ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషం వంటి పద్య కావ్యాలు, నేపాల, కాశ్మీర రాజవంశ చరిత్రలు, పురాణవైరి గ్రంథ మాల మొదలైన అనేక చారిత్రక నవలలు, నర్తనశాల, వేనరాజు వంటి నాటకాలు, విశ్వేశ్వర శతకం వంటి శతకములు, గుప్తపాశుపతము వంటి సంస్కృత నాట కాలు, అల్లసాని అల్లిక జిగిబిగి, నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి వంటి విమర్శనా వ్యాసాలు, పీఠికలు కుప్పలుతెప్పలుగా రాశారు. ఇవన్నీ ఒప్పులకుప్పలే. విశ్వనాథలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడు చాలా ఎక్కువ. కొన్ని రచనలు స్వయంగా రాసినవి ఉన్నాయి. కొన్ని తను చెబుతూవుంటే వేరేవాళ్లు రాసినవి ఉన్నాయి. అది కథ, పద్యకావ్యం, సాంఘిక నవల, పాట, పీఠిక, వ్యాసం ఏదైనా కావచ్చు... ఉన్నపళంగా మొదలుపెట్టే శక్తి అచ్చంగా విశ్వనాథ ఐశ్వర్యం. దీన్ని మహితమైన ఆశుకవిత్వ ప్రతిభగా చెప్పవచ్చు. సంప్రదాయం, భారతీయత మధ్యనే తిరుగు తున్నప్పటికీ ఇంగ్లిష్ సాహిత్యాన్ని బాగా చదివేవాడు. విజయవాడ లీలా మహల్లో వచ్చే ప్రతి ఇంగ్లిష్ సినిమాను చూసేవాడు. ఇంగ్లిష్ సంస్కృతిని ద్వేషించాడు కానీ, భాషను ఎప్పుడూ ద్వేషించలేదు. రామాయణ కల్ప వృక్షం, వేయిపడగలు రెండూ కవిసమ్రాట్ నిర్మించిన మహా సారస్వత సౌధాలు. ఎంత కృషి చేశాడో, అంతటి కీర్తి కూడా పొందిన భాగ్యశాలి. తెలుగుసాహిత్య లోకా నికి మొదటి జ్ఞానపీఠ పురస్కారం ఆయనే సంపాయించి పెట్టాడు. పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి అత్యున్న తమైన గౌరవాలు పొందాడు. డి.లిట్ కైవసం చేసుకు న్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందు కున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవి కూడా విశ్వనా థను వరించింది. శిష్య సంపద చాలా ఎక్కువ. శత్రు గణం కూడా ఎక్కువే. ఇంతటి కృషి చేసిన సాహిత్య మూర్తి ప్రపంచ సాహిత్య చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటారు. విశ్వనాథ అసామాన్యుడు. తెలుగువాళ్ళ ‘గోల్డునిబ్బు’. వ్యాసకర్త: మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్, మొబైల్ : 93931 02305 -
బాల్యం ఎదుర్కొనే విషాదం
నవల: ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవెనింగ్ రచన: మరీక్ లూకస్ రైన్వెల్డ్ మూలం ప్రచురణ: 2018 డచ్ నుంచి ఇంగ్లిష్: మిషెల్ హచిసన్ ఇరవై ఆరేళ్ల వయసులో మరీక్ లూకస్ రైన్వెల్డ్ రాసిన ఈ డచ్ నవల (2018) నెదర్లాండ్స్‌లో బెస్ట్ సెల్లర్. మిషెల్ హచిసన్ ఇంగ్లిష్ అనువాదం ‘ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవెనింగ్’ యు.కె.లో ఫేబర్ ప్రచురణ సంస్థ ద్వారా ఈ సంవత్సరం విడుదలై బుకర్ ఇంటర్నేషనల్–2020 అవార్డుకి షార్ట్‌లిస్ట్ అయింది. యాస్ అనే పదేళ్ల అమ్మాయి ఈ నవలకి కథకురాలు. ఈ శతాబ్దపు ప్రారంభం కథాకాలం. నెదర్లాండ్స్‌లోని ఒక పల్లెటూళ్లో నివసించే ఆ వ్యవసాయ కుటుంబానికి దైవభక్తి, మత విశ్వాసాలు మెండు. తను పెంచుకుంటున్న కుందేలుని క్రిస్మస్కి తండ్రి చంపేస్తాడేమోనని యాస్కి అనుమానం. క్రిస్మస్ ఇంకో రెండుమూడు రోజులున్నప్పుడు, యాస్ సోదరుడు మాథియాస్ స్కేటింగ్‌కి వెళ్తుంటే తనూ వస్తానంటుంది. ఇంకోసారి వద్దువులే అని వెళ్లిపోతాడు. దేవుడు నా కుందేలుకి బదులుగా వీణ్ణి తీసుకెళ్లొచ్చుగా అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఆరోజు జరిగిన ప్రమాదంలో మాథియాస్ మరణిస్తాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘోరానికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. తల్లయితే, తినడం పూర్తిగా మానేస్తుంది; తండ్రి ఈ దుఃఖం నుంచి తప్పించుకోవడానికి తన ఆవులు, వాటి పోషణ వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోతాడు. జరిగిన విషాదానికి లోలోపలే కుమిలిపోతున్న పిల్లలు – యాస్, చెల్లెలు హానా, తమ్ముడు ఓబ – వాళ్ల వాళ్ల దుఃఖాలకి ఉపశమనాలని వాళ్లే వెతుక్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు సఖ్యంగా లేకపోవడం వాళ్లకి అదనపు ఆందోళన. పర్యవేక్షణ కరువైన పిల్లలు, రకరకాల పరిష్కార మార్గాలలో పడతారు. యాస్ ఫాంటసీలలో కూరుకుపోగా, హానా ఇవన్నీ వదిలేసి ఇంకో ప్రపంచానికి వెళ్దామంటుంది. ఓబ హింసనీ, క్రూరత్వాన్నీ ఆశ్రయిస్తాడు. వీళ్లందరిలోనూ సామాన్యాంశం లైంగిక భావనలు. చాలాసార్లు వీళ్లు ఇన్సెస్ట్యువస్గా ప్రవర్తించడం కూడా కలవరపరుస్తుంది. వంటిమీది కోటును విప్పకుండా వేసుకుని తిరుగుతుండే యాస్కి అదనంగా మలబద్ధకం ఒక భౌతికమైన సింప్టమ్‌గా స్థిరపడుతుంది. కూతుర్ని కూడా ఒక పశువులాగా చూసే తండ్రీ, ద్రోహచింతనతో తిరుగుతూండే వెటర్నరీ డాక్టర్ మరికొన్ని వికృతాంశాలు. ఇది అందరూ చదివి ఆస్వాదించగలిగిన నవల అయితే కాదు. జుగుప్సని కలిగించే భాగాలు ఎక్కువగా ఉండటం వలన, పాత్రల దుఃఖం పట్ల పాఠకుడి సహానుభూతి చెదిరిపోతుంది. నవలకీ, పాఠకుడికీ మధ్యనున్న ఆ సన్నని దారం తెగిపోగానే నవల భారవంతం అవుతుంది. కథనంలో చోటుచేసుకున్న అలాంటి సవివరణాత్మక భాగాలు బహుశా అన్ని సంస్కృతుల్లోనూ సమానమైన ఆదరణ పొందలేకపోవచ్చు. కథన బాధ్యతని పది పన్నెండేళ్ల అమ్మాయికి అప్పచెప్పినప్పుడు, అది తూకం తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. యాస్ కథనస్వరం వయసుకి మించిన స్థాయితో ఆమె మానసిక ఆరోగ్యాన్ని శంకించేలా ఉంటుంది. పాత్ర వయసు, కథన స్థాయిల వల్ల కథనం అసలు నమ్మదగినదేనా అన్న అనుమానం వస్తుంది. ఈ నవల ప్రారంభంలో జరిగిన కీలకమైన సన్నివేశం తర్వాత, నవలలో ‘ప్లాట్’ అంటూ పెద్దగా లేకపోగా, మిగిలిన నవలంతా చిన్నచిన్న ప్రహసనాల కూర్పులాగా సాగుతుంది. పాఠకుడు నవలతో బాటుగా ప్రయాణించలేకపోవడానికి ఇది మరో అవరోధం. దుఃఖాన్ని వ్యక్తీకరించే పద్ధతి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందని అంగీకరించవచ్చు. కొన్ని సందర్భాలలో అవి వికృతరూపాలని తీసుకుంటాయనీ, ఆ దుఃఖం ఒక వ్యాధిలాగా రోగలక్షణాలని కలగజేస్తుందనీ కూడా నమ్మవచ్చు. మరొకరితో – ముఖ్యంగా తల్లిదండ్రులతో – పంచుకోలేని దుఃఖం, సమసిపోవడం కష్టమని కూడా అంగీకరించవచ్చు. అందువల్లనే కథకురాలు నవలలో చెప్పిన ముగింపుకి చేరుకుని ఉండవచ్చు. ఇవన్నీ పాఠకుడి అనుభవంలోకి సున్నితంగా తీసుకురావలసిన బాధ్యతని తీసుకోవాల్సిన కథనం– అసంబంధిత సంఘటనల సమాహారంగా మొనాటనస్‌గా సాగితే, పాఠకుడి ఉద్వేగాల ప్రయాణం ప్రమాదభరితమవుతుంది. జుగుప్సని కలిగించే అంశాలని దారుణమనిపించేటంత పచ్చిగానూ, వికారమనిపించేటంత గ్రాఫిక్గానూ అందించడాన్ని అంగీకరించలేని పాఠకుల విషయంలో ఆ ప్రమాదం రెట్టింపవుతుంది. ఈ నవల అలాంటి ప్రమాదపు అంచుల దాకా వెళ్లింది. అంతిమంగా ఈ నవల అవార్డుని గెలుచుకుంటే అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ ఉండదు గానీ, అభినందించదగినది కూడా ఏమీ ఉండదు! - ఎ.వి. రమణమూర్తి -
ప్రేమికులు మెచ్చే నవలలు
ప్రేమకు సంబంధించిన పుస్తకాలు, సినిమాలు ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ప్రేమలో పడిన వారే కాకుండా మిగిలిన వారు కూడా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాటిల్లో ఉండే మాధుర్యాన్ని ఆశ్వాదిస్తూ ఉంటారు. సినిమా చూసిన అనుభూతి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఒక కథ చదివితే అందులో పాత్రలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే నవలలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్‌లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
కడుపులో కందిరీగలున్న స్త్రీలు
‘నన్ను నేను చంపుకున్న ఆ సోమవారం స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉన్నది. నా మరణం చుట్టుపక్కల వారి దృష్టిలో నన్ను ‘కేరళా వర్జీనియా వుల్ఫ్’ను చేసింది. మార్కోస్ మాత్రం నా పేరెత్తలేదు. అర్ధరాత్రి శ్మశానానికి వచ్చి, నా కుడిచేతి చూపుడి వేలి ఎముకను తీసుకెళ్ళాడు. ఆ నా ఆత్మను, నేనతనికి బహూకరించిన వెల్వెట్ పెన్ను డబ్బాలో ఉంచి, కర్ర బీరువా రహస్యపు అరలో పెట్టాడు. నా భౌతిక భాగం, లోకంలో ఉన్నంతవరకూ తప్పించుకోలేను. సంవత్సరాలు గడిచాయి. బీరువా మరేదో చోటుకి తరలించబడింది. నా పేరు శ్రీలక్ష్మి, రచయిత్రిని.’ ఇది అనితా నాయర్ రాసిన ‘ఈటింగ్ వాస్ప్స్’ నవల. కేరళలోని నీలా నది పక్కనుండే ఊర్లో చనిపోయిన శ్రీలక్ష్మి 30ల్లో ఉన్న ఉపాధ్యాయురాలు, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. ‘ఒకసారి కందిరీగను మింగి, దాని పోట్లను తట్టుకున్నాను. కానీ, మరణించిన తరువాత మరిచిపోబడిన ఎముకగా మాత్రమే మిగిలాను’ అంటుంది. 52 ఏళ్ళ తరువాత, ఒక హోటెల్లో ప్రాచీనకాలపు బీరువాలో దాక్కున్న పిల్ల మేఘ, దాన్లో ఉన్న సున్నంతో నిలవబెట్టబడిన ఆ వేలి ఎముకను చేతిలోకి తీసుకుంటుంది. ‘దయ్యాలు, రచయితలు ఒకేలా ఉంటారు. మీరు మాకు చెప్పకపోయినా గానీ, మీ ఆలోచనలను మేము వినగలం. నేను దయ్యాన్నీ, రచయిత్రినీ కూడా’ అంటూ, తనను ఆ తరువాత తాకిన మిగతా తొమ్మండుగురు స్త్రీల కథలనూ పసిగడుతుంది శ్రీలక్ష్మి. అలా అణచివేతనూ, మనోభావాల గాయాలనూ మోస్తున్న– భిన్నమైన నేపథ్యాలకు, మతం, కులం, వయస్సుకు చెందిన స్త్రీల జీవితాలు బయటపడతాయి. అందరూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నవారే. తమ ఆశలను వెళ్ళబుచ్చినందుకు సమాజపు ఎగతాళి అనుభవించినవారే. అలా, ఒకరితో మరొకరికి ఏ సంబంధం లేని ఊర్వశి, నజ్మా, ఇతర స్త్రీల జీవితాలు పాఠకులకు పరిచయం అవుతాయి. నజ్మా ఏసిడ్ దాడి బాధితురాలు. ఊర్వశి పాత్రికేయురాలు. పెళ్ళయి, పెద్ద పిల్లలున్న స్త్రీ. డేటింగ్ అప్లికేషన్ వాడి, ఒక వ్యక్తిని కలుసుకుని అతనికి కావలసినది కేవలం భౌతిక సంబంధం మాత్రమే అని గుర్తించి దూరం తొలిగిపోతుంది. అతను వెంటాడుతాడు. వీరందరూ దృఢమైన స్త్రీల్లా కనిపించినా, ఎవరి బలహీనతలు వారికుంటాయి. అయితే, పరిస్థితులకు తలవంచరు. దీన్లో ప్రాధాన్యత ఉండేది శ్రీలక్ష్మి, ఊర్వశి కథలకే. మిగతా స్త్రీలకి ఒక అధ్యాయమో తక్కువో కేటాయించబడతాయి. మిగతావారు కొన్ని అధ్యాయాల్లో సహాయక పాత్రలు పోషిస్తారు. ‘ఇది ఇచ్ఛలూ, వాటి పర్యవసానాల పుస్తకం’ అంటారు నాయర్. ‘ఇచ్ఛ భౌతికమైనదే కానవసరం లేదు. పరిస్థితులని తప్పించుకునే ఆశ అయిండొచ్చు. తమ గుర్తింపు కోసమైన అన్వేషణ అవ్వొచ్చు. తమని సమాజం పట్టించుకోవాలన్న కోరిక కావొచ్చు. స్త్రీలకు ఇచ్ఛలు ఉండకూడదని పవిత్ర గ్రంథాలు చెప్తాయి. నా కథలో స్త్రీలు అలాంటివారు కారు. వారు తమ చర్యల పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధపడినవారు’ అంటారు. నవల్లో ఉండే అనేకమైన పాత్రల, ఉపకథలవల్ల కొంత అయోమయం కలిగించినా, సారం మాత్రం స్పష్టంగా ఉంటుంది. చివర్న, కథనం కథకురాలి మీదకి మళ్ళి, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అన్న అంశానికి తిరిగి వస్తుంది. మిగతా ఏ పాత్రకీ ముగింపునివ్వరు రచయిత్రి. ‘మీ టూ’ ఆందోళన ఊపందుకుంటున్న కాలపు నేపథ్యంతో వచ్చిన ఈ పుస్తకాన్ని, ‘కాంటెక్స్’ 2018లో ప్రచురించింది.1960లో కేరళ సాహిత్య పురస్కారం పొంది, 35 ఏళ్ళ వయస్సులో ఆత్మహత్య చేసుకున్న ప్రసిద్ధ మలయాళ రచయిత్రి/కవయిత్రి రాజలక్ష్మిని శ్రీలక్ష్మి పాత్రకు ఆధారంగా తీసుకున్నారు అనితా నాయర్. అనిత కూడా రచయిత్రీ, కవయిత్రీ. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో పుట్టారు. 2012లో కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్నారు. -కృష్ణ వేణి -
ఖాళీ చేసిన మూల
స్టేషన్లోకి ట్రెయిన్ వచ్చి చాలా సేపయింది. కుడిచేత్తో టిక్కెట్టూ, ఎడం చేత్తో తోలుసంచీ పట్టుకుని పరిగెత్తేడు రాజు ప్లాట్ఫారం వైపు. పచ్చకోటు తొడుక్కొని ముందు పోతూన్న ఒకణ్ణి తోసేయబోతూంటే, ‘‘ఎందుకలా గాభరా పడతావయ్యా! ఎక్కడానికి టైముందిలే’’ అని కసిరేడు టికెట్ కలెక్టరు. టికెట్ కలెక్టరు ఆపినందుకూ కసిరినందుకూ కించపడలేదు రాజు. ‘‘ఆహా! ఇంకా టైముందండీ?’’ అని నిట్టూర్చి ప్రశ్నించేడు. ‘‘ఓ! చచ్చినంత’’ అన్నాడు టీసీ టికెట్ పంచ్ చేస్తూ. పచ్చకోటు తొడుక్కున్నవాడు ప్లాట్ఫారంలోకి ముందుగా పోయేడు. ఆ వెనకే రాజు కూడా వెళ్లేడు. మేనల్లుడి పెళ్లికి వెళ్లకపోతే బావుండదని బయల్దేరేడు. బండి తప్పిపోయిందని అక్కయ్య నమ్మదు, బావకి కోపం వస్తుంది. పెళ్లిళ్ల రోజులవడం చేత జనం కిటకిటలాడుతున్నారు. చివరిదాకా నడిచి ‘‘అదృష్టం బావుంది’’ అనుకున్నాడు. ఆఖరి కంపార్ట్‌మెంటు ఖాళీగా వుంది. కిటికీలోంచి లోనికి చూస్తే వెనకవైపు కిటికీ దగ్గర కార్నర్ సీట్లో ఎవరూ ఉన్నట్టు లేదు. మరీ అదృష్టం! సంతోషిస్తూ లోనికి ఎక్కబోయేడు రాజు. అతనికంటే ఒక్కడుగు ముందయేడు పచ్చకోటువాడు. తిన్నగా పోయి కిటికీ పక్క మూల సీట్లో కూర్చున్నాడు. అతణ్ణి మనసులో తిట్టుకొంటూ గత్యంతరం లేక అతనికి ఎదుట సీట్లో కూర్చున్నాడు రాజు. కొంచెం సర్దుకొని, టిక్కెట్టు పర్సులో భద్రంగా పెట్టి, సంచీ వారకి పెట్టి, చెప్పులు కిందకి విడిచి, మఠం వేసుక్కూర్చుని కంపార్ట్‌మెంటంతా కలయజూసేడు. పదిమందికంటె ఎక్కువ లేరు. అంత తక్కువ మంది ఉన్నప్పటికీ తనకి కార్నర్ సీటు దొరకనందుకు పచ్చకోటువాణ్ణి చూస్తే ఒళ్లు మండుకొచ్చింది. పచ్చకోటు చెప్పలేనంతగా మాసింది. అతను తొడుక్కున్న షర్టు తెల్లగా పువ్వులా ఉంది. కట్టుకున్న మాసీ మాయని పంచ అక్కడక్కడ చిరిగింది. నెత్తిమీద పెట్టుకున్న నల్లటి మరాఠీ టోపీ కింద జుత్తు బాగా పండినట్టు కనిపిస్తోంది. వయసు నలభైకి మించకపోవచ్చు. ముక్కు ఎత్తుగా ఉండడం చేతా, కళ్లు లోతుకు పోవడం చేతా, మనిషి గెద్దలా ఉన్నాడు. అతను ఎవ్వరివైపూ చూడ్డం లేదు. కిటికీలో ఎడం చెయ్యి ఆన్చుకొని, కాల్తున్న సిగరెట్టు కుడిచేత్తో పట్టుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ‘‘వీడి పిండాకూడుగాని పచ్చరంగు కోటు తొడుక్కోడం ఏమిటి?’’ అని రాజు అనుకొంటూండగా ట్రెయిన్ కదలింది. రాజు న్యూస్ పేపర్ తీసేముందు చుట్ట ముట్టించేడు. పేపర్లో నచ్చిన వార్తలేవీ కనిపించడం లేదు. మలయా పరిస్థితి గురించి, కొరియా యుద్ధం గురించి చేటభారతం రాసేరు. వెధవ గోల! థూ! ఉమ్ముకోవడానికి కిటికీ దగ్గరికి పోవాలి. అక్కడే కూర్చుంటే ఎంత బావుండేది! పేపరు మడత పెట్టేశాడు. చేసేదిలేక అటూ ఇటూ చూస్తున్నాడు. ఏదో స్టేషను దగ్గరవుతూన్నట్టుంది. కళ్లు మూసుకొని కిటికీవార పడుకున్నా బావుండేది. ‘‘మీరెక్కడండీ దిగుతారూ?’’ అని పచ్చకోటువాణ్ణి ప్రశ్నించేడు. అతను జవాబు చెప్పలేదు. ప్రశ్న విన్నట్టుగానే లేదు. లోతుకుపోయిన కళ్లతో లోతుల్లోకి చూసుకొంటున్నాడు. జవాబు చెప్పడేం? ‘‘ఏమండోయ్, మిమ్మల్నే’’ గట్టిగా అరిచేడు రాజు. సుఖంగా నిద్ర పోదామని సిద్ధమయ్యేసరికి పక్కనున్నవాళ్లు అల్లరిచేస్తే ఎంత కోపంగా ఉంటుందో అలావుంది పచ్చకోటువాడి ముఖం. ‘‘ఎక్కడకో అక్కడికి వెళ్తాను’’ అని విసురుగా తలమీద టోపీ తీసి బల్లమీద పడేశాడు. ఏమిటీ? వీడి పొగరూ? టోపీ తీసేయడంతో అతని ఎండిన పీచు జుత్తు గాలికి చెదురుతోంది. చెవులు పెద్దవిగా కనిపిస్తున్నాయి. గెడ్డం బాగా మాసింది. రాజు కంటికి అతను వికృతంగా కనిపించేడు. మర్యాదా లేదు మప్పితం లేదు. జవాబివ్వలేదేం సరిగ్గా! రోజల్లా నా ఎదట దిష్టిపిడతలా కూర్చుంటాడు కాబోలు. వీడెక్కడికి వెళ్తే నాకేం? వల్లకాట్లోకి పోతాడు. కాని, పెట్టేబేడా తెచ్చుకోలేదే వీడు! వాటం చూస్తే టిక్కెట్ కొన్నవాళ్లా లేడు. టికెట్ కలెక్టర్ వస్తే దింపించి పారేయవచ్చు. ఒక స్టేషనప్పుడే దాటిపోయింది. టీసీ ఇంకా రాడేం? పూర్వం ఇలాగే ఉండేదా? అడుగడుక్కీ వచ్చి చెక్ చేసేవారు. ఛా! డబ్బిచ్చి వచ్చినవాడు బాధపడ్డం! కాణీ ఇవ్వకుండా వచ్చినవాడు సుఖపడ్డం! పచ్చకోటువాడు దగ్గడం ప్రారంభించేడు, బాధగా, కఫంగా, అసహ్యంగా. దగ్గి దగ్గి కిటికీలోంచి పైకి ఉమ్మి కోటుచేత్తో మూతి తుడుచుకొని ‘‘హమ్మయ్యా’’ అని ఆయాసం తీర్చుకున్నాడు. వీడికి క్షయ రోగం ఉన్నట్టుంది. జబ్బులున్నవాళ్లని ట్రెయిన్లోకి ఎందుకు రానిస్తారో! ఈ వెధవ ఈ క్షణంలో చస్తే నేనయితే విచారించను. భూభారం ఎంత తగ్గినా తగ్గడమే! మరో స్టేషన్ వచ్చింది. ట్రెయినాగింది. ఇద్దరు బికార్లు దిగిపోయేరు. ఈ బికారి కూడా దిగిపోతే బావుణ్ణు అని రాజు అనుకొంటూ ఉండగానే పచ్చకోటువాడు ఏదో నిశ్చయానికి వచ్చినట్టుగా గభాల్న లేచి కంపార్ట్మెంట్లోంచి వెనక గుమ్మంలోంచి వెనకవైపుకి దిగిపోయేడు. నిజంగా పోయినట్టేనా? టోపీ వదిలేసేడే? మళ్లీ వస్తుంది కాబోలు శనిదేవత. టీసీ వస్తాడని భయపడ్డాడో ఏమో? వెనక్కి తిరిగి చూస్తే ప్లాట్ఫారం కనిపిస్తోంది. బండీ కదుల్తే బావుండుననుకొంటూ లేచి ఎదట కిటికీలోంచి పైకి చూసేడు. ఇడుగో పచ్చకోటువాడు! ఇక్కడే నిల్చున్నాడు. బండి కదల భయం, మళ్లీ ఎక్కిపోతాడు. అతన్ని చూస్తూ అలాగే నిల్చుండిపోయేడు రాజు, కిటికీ దగ్గర. చలికాలపు ఎండలో పచ్చకోటువాడు ప్రశాంతంగా గంభీరంగా నిల్చున్నాడు. అతని కళ్లలో వెలుగు కనిపిస్తోంది. అతన్లో ఏదో తేజస్సు ప్రజ్వరిల్లుతున్నట్టుగా ఉంది. జగత్తునంతా తృణీకరించి చూస్తున్నట్టుగా ఉన్నాడు. అబ్బో! వీడికి ఇంత డాబు ఎక్కణ్ణించి వచ్చింది? అని రాజు అనుకొంటూ ఉండగానే ఇంజన్ గర్జించింది. గాడీ కదిలింది. పచ్చకోటువాడు బండీ ఎక్కడానికి తొందరపడలేదు. నిల్చున్నచోటు నుంచి కదల్లేదు. వీడు ఇక్కడే ఉండిపోతాడు కాబోలు. బతికేను. ట్రెయిన్ పదిగజాలు నడిచింది. పాతిక గజాలు దాటింది. అంతే! కాని అదేమిటి? అదేమిటి? పచ్చకోటువాణ్ణి చూస్తూన్న రాజు ఒక్క కేక వేసేడు. ఎవరో చెయిన్ లాగారు. ఎంతో అయిష్టతతో బండి ఆగింది. రాజుకి ముఖం తిరిగింది. మూర్ఛ వచ్చేట్టయింది. పచ్చకోటువాడి మెడ రైలు పట్టాపైన. ట్రెయిన్ చక్రాల కింద. అవతల తల; ఇవతల మొండెం; ఇందాట్టా ప్రాణం; ఇప్పుడిప్పుడే మరణం! ఒక్కసారిగా, ఒకేసారిగా, ‘‘అయ్యయ్యో, అయో అయో, ఎంత పనెంత పని చేసేడు, ఎలా ఎలా ఎలా చేసేడు, శంకరా హరహరా, ఈశ్వరా సర్వేశ్వరా.’’ బండీలో ఉన్న జనం అంతా వెనకవైపుకే దిగుతున్నారు. గోలగోల, ఒకటే గోల. పోలీసులు, టీసీలు, ప్రయాణీకులు, కేకలు. చేత్తో సంచీ పట్టుకొని, బండి దిగి అటువైపుకి తొందరగా గాభరాగా నడిచేడు రాజు. ‘‘అబ్బ! ఒక్క సెకెండే చూసేను. కాని నాకీ జన్మలో నిద్రపట్టదు’’ అని ఎటూ వెళ్లక మధ్య నిల్చున్న పెద్దమనిషి ఎవరితోనో అంటున్నాడు. అందర్నీ అటువైపునుంచి తోసుకువస్తూన్న కూలిమనిషిలా కనిపించే అడమనిషి వెక్కివెక్కి ఏడుస్తూ వస్తోంది. ‘‘ఏమవుతాడమ్మా? నీ కతనేమవుతాడు?’’ అని పదిమంది ప్రశ్నించేరామెని. ‘‘ఏమవుతాడు బాబూ! మీ కేమవుతాడో నాకూ అదే అవుతాడు. నిండు ప్రాణం పోతే ఏడుపురాదూ’’ అన్నదామె కళ్లు తుడుచుకొంటూ. చుట్టూ చేరినవాళ్ల మధ్య సందుల్లోంచి చనిపోయినవాడి అరిపాదాలు మాత్రం కనిపిస్తున్నాయి. ‘‘ఇహ నే చూడలేను భగవంతుడా’’ అనుకొన్న రాజు, వెనక్కి తన కంపార్ట్‌మెంటు వైపుకి మళ్లేడు. ఎదట కార్నర్ సీట్లో నామాలు పెట్టుకున్న వృద్ధుడెవరో కూర్చున్నాడు. రాజు కూర్చున్నాక, టోపీ చూపిస్తూ ‘‘ఎవరో కాని టోపీ మర్చిపోయి దిగిపోయినట్టుందండీ’’ అన్నాడు రాజుతో. ‘‘ఇందాట్లా చచ్చిపోయిన వాడిదండీ ఆ టోపీ!’’ ‘‘ఇక్కడేనా ఏమిటి వాడు కూర్చున్నాడు?’’ అని టోపీకి కొంచెం ఎడంగా జరిగేడు నామాలవాడు. కొంతసేపు తటపటాయించి, ఏదో పనున్నట్టుగా లేచి గేటువైపు వెళ్లి అక్కడ బల్లమీద కూర్చున్నాడు. చావంటే ఎంత భయం! ట్రెయినింకా కదల్లేదు. ఇంకా ఆలస్యం అవుతుంది కాబోలని ఎవరో విసుక్కుంటున్నారు. కిటికీలోంచి పైకి చూస్తున్నాడు రాజు. ఆకాశం చెప్పలేనంత నీలంగా ఉంది. దూరంగా మామిడితోటలకీ తాటితోపుకీ వెనక కనపడీ కనపడక దాగుంది ఏదో వూరు. తెల్లటి చుక్కల్లా బాతులు ఈదే చెరువు నీటిలో దూరంగా అచలంగా నిల్చున్న నీలి కొండలూ, ఎండలో వెండి ముద్దల్లా కనిపించే తెల్లమబ్బులూ కదిలిపోతున్నాయి. చెరువుకి పక్కగా ఉన్న తాటాకుల ఇంటిముందు విరియపూసిన గన్నేరు చెట్టు బరువుగా కొమ్మలు వంచుకొంది. బాగా ఎదిగిన అమ్మాయెవరో కొమ్మల్ని వంచి నీలంగా ఉన్న చీరచెంగులోకి కెంపుల్లాంటి పువ్వుల్ని కోసి పడేసుకొంటోంది. దూరం నుంచి చూస్తూంటే అంతా ప్రశాంతంగా హాయిగా కనిపిస్తోంది. అవన్నీ అదంతా చూస్తోన్న రాజెందుకోగానీ వికల మనస్కుడయ్యేడు. ఈ నీలపు కొండలూ, నీలి ఆకాశం, ఈ శీతాకాలపు ఎండా, బాతులు ఈదే చెరువూ, పువ్వులు కోసే జవ్వనీ, ఏవీ ఏదీ ఎవర్నీ కూడా చూడలేదే పచ్చకోటువాడు! ఈ జీవితంలో ఎట్టి బాధల్ని భరించలేక, ఎన్నెన్ని బాధలు చూడలేక చూడకుండా పోయేడు పచ్చకోటువాడు? అని రాజు ఆలోచిస్తూ ఉండగా ఇంజన్ పెనుబొబ్బ పెట్టింది. రెయిల్ కదిలింది. ఎండలో మిలమిల్లాడుతూ పరిగెడుతూన్న టెలిగ్రాఫ్ తీగల వైపూ, స్తంభాల వైపూ చూడక చూస్తోన్న రాజుకి గుండెల్లో ఎంతో బరువుగా, మనసులో ఎంతో దిగులుగా ఎందుకుందో అర్థం కాలేదు. రావిశాస్త్రి సుప్రసిద్ధ రచయిత రావిశాస్త్రి (1922–93) కథ ‘కార్నర్ సీట్’కు సంక్షిప్త రూపం ఇది. 1953లో ‘కాంతా కాంత’ కలంపేరుతో అచ్చయింది. సౌజన్యం: కథానిలయం. అల్పజీవి, రాజు మహిషి, రత్తాలు రాంబాబు, ఆరు సారా కథలు, రుక్కులు రావిశాస్త్రి రచనల్లో కొన్ని. -
పక్కింటి ఎండమావి
న్యూ మార్కెట్లో ఉష కొన్న సామానులన్నీ ఆరు పేకెట్లయ్యాయి. కాస్మటిక్స్ పాకెట్స్ రెండు, చీరల దుకాణంలో తయారైన పాకెట్లు మూడు, ఆపిల్స్ మూడు కిలోలు కట్టిన పెద్ద కాగితపు సంచీ ఒకటి అన్నీ మోసేసరికి చేతులు నొప్పులు పెడుతున్నాయి రామనాథానికి. ‘ఈమె ఖర్చు మనిషి’ అనుకున్నాడు మనస్సులో, బయటికి అంటే కలిగే పరిణామాలను గురించి తెలుసును కనక. ఇప్పుడు ఆమె షాపింగ్ పూర్తి కాబోతోంది. ఇంతసేపూ ఈ భారం వహించి చిట్టచివర ఆమెకు తన పొరపాటు తెలియజెయ్యడంలో మంచి ఏమీ కనిపించలేదతనికి. ‘‘బరువుగా ఉన్నాయా?’’ అంది గ్రీటింగ్ కార్డుల షాపు వైపు దారి తీస్తూ. ‘‘అబ్బే! లేదు’’ అన్నాడు రామనాథం. ఆమె చిరునవ్వుతో అతన్ని మరోసారి ధన్యుణ్ని చేసి న్యూ ఇయర్ కార్డ్స్ చూడటంలో నిమగ్నం అయింది. రెండేళ్ల నించి ఎన్నోసార్లు చూసినా, తనకి ఎప్పటికీ తనివి తీరదు. ఆమె వయస్సుతోపాటు, చిరునవ్వూ, సౌందర్యమూ ఉత్కర్ష పొందుతున్నాయి. మరో పది నిమిషాల తరువాత ఆమె ‘‘సారీ! పోదాం పదండి’’ అనడంతో స్వప్నలోకాల నుంచి న్యూ మార్కెట్ దుకాణాల మధ్యకి వచ్చి బయటికి నడిచాడు రామనాథం. కారు వెనకసీట్లో సామానులు చక్కగా సర్దిపెట్టి నిలబడ్డాడు. స్టార్టు చేసి, ‘‘నాతో వస్తారా?’’ అంది. ‘‘థాంక్స్. నేను రాను, కొంచెం పని ఉంది’’ అని ఆమె వైపు చూసి నవ్వి, తలుపు జాగ్రత్తగా వేశాడు. కారు తలుపులు బాదడం అంటే ఆమెకి కోపం. ఆమె విలాసంగా వెళ్లిపోయింది. ఆ వైపే చూస్తూ నిలబడ్డ రామనాథానికి భుజం మీద పడ్డ చెయ్యి మళ్లీ తెలివి తెప్పించింది. ‘‘నేనోయ్! రమణమూర్తిని... జ్ఞాపకం లేదూ?’’ ‘‘నువ్వు... మీరు... రమణమూర్తి?’’ నత్తిలాగా అన్నాడు. ‘‘ఇద్దరం మీ ఎలమంచిలి బడిలో అయిదోఫారం చదువుకున్నాం...’’ ‘‘ఓ మీరు...’’ రమణమూర్తి నవ్వాడు. ‘‘మీరేమిటోయ్! కలియక కలియక ఈ మహానగరంలో చిన్ననాటి స్నేహితుడివి కలిశావు. ఏం చేస్తున్నావ్?’’ తేరిపార చూశాడు రామనాథం. తెల్లటి పంట్లాం, టెరిలిన్ బుష్ షర్టు. ఆరడుగుల ఎత్తు. పాతరోజులు జ్ఞాపకం వచ్చాయి. రమణమూర్తి స్కూల్లో పేరుమోసిన రౌడీగా ఉండేవాడు. ఆటల్లో ఫస్టూ, చదువులో లాస్టూను. ‘‘ఇక్కడే ఒక ఫర్మ్‌లో ఉంటున్నాను, ఏషియాటిక్ ట్రేడ్స్‌లో.’’ ‘‘ఉండటం ఎక్కడ?’’ ‘‘భవానీపూర్‌లో. నువ్వు?’’ రమణమూర్తి నవ్వాడు. ఎందుకో అర్థం కాలేదు రామనాథానికి. ‘‘నేను... మెకంజీ కంపెనీలో పని చేస్తున్నాను, తెలుసుగా? ఫెయిర్లీ ప్లేసులో.’’ అతనెందుకు నవ్వాడో ఈసారి అర్థం అయింది రామనాథానికి. ఇక్కడ ఉన్న పెద్ద కంపెనీల్లో అది ముఖ్యమైనది. ఈ మొద్దబ్బాయికి అంత మంచి కంపెనీలో ఉద్యోగం! అతని పక్కన తన అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు సిగ్గు కలగజేస్తోంది. ‘‘వెరీ గుడ్!’’ అన్నాడు రామనాథం చివరికి. మళ్లీ నవ్వాడు రమణమూర్తి. రామనాథానికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది, స్కూల్లో తనను తరచు హేళన చేస్తూ ఉండేవాడు ఇతను. ఒకసారి ఫుట్‌బాల్ ఆడటానికి వెడితే తాను కొంచెం పరాకుగా ఉన్నప్పుడు తన వీపుకి గురి చేసి బంతి గట్టిగా తన్నాడు. బోర్లాపడి లేస్తుంటే రమణమూర్తి సరీగా ఇలాగే నవ్వాడు. అదీకాక రమణమూర్తి దగ్గర ఖర్చులకు డబ్బులుండేవి. తన దగ్గర ఉండేవి కావు. ‘‘పద, కాఫీ తాగుదాం!’’ అన్నాడు రమణమూర్తి. అప్రయత్నంగా జేబులో చెయ్యి పెట్టుకున్నాడు రామనాథం. గుండె జల్లుమంది. బట్టల దుకాణంలో ఇచ్చిన చిల్లర అరవై రూపాయలు జేబులో ఉన్నాయి. ఆమెకి అవసరం వస్తే? ఆమె తిన్నగా ఇంటికి వెళ్లి ఉంటే పరవాలేదు కానీ, మరేమైనా కొనదలుచుకుంటే? మరుక్షణంలో అతనికి సంతోషం కలిగింది. సామాన్యంగా అయిదారు రూపాయలకన్నా తన దగ్గర ఉంచుకునే అలవాటు లేదతనికి. కానీ, ఈ వేళ రమణమూర్తి దగ్గర పరాభవం జరగకూడదు. ‘‘పద!’’ ‘‘కారు తీసుకువెడదాం!’’ అన్నాడు రమణమూర్తి గడియారం చూస్తూ. రామనాథం ఎదురుగా ఉన్న టవర్ క్లాక్ చూశాడు. ఏడు దాటుతోంది. ఆమె తనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ... ‘‘ఏం గడియారం చూసి అలాగ అయ్యావు? భార్యగారు దెబ్బలాడతారా?’’ అన్నాడు లైట్‌హౌస్ సినిమా వైపు దారి తీస్తూ రమణమూర్తి. ‘‘అబ్బే, అలాంటిది కాదు!’’ అన్నాడు. ‘‘ఆవిణ్ని చూసి అలాగే అనుకున్నాను. అద్భుతమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావోయ్!’’ అన్నాడు. తెల్లబోయి చూసి, ‘‘నువ్వెప్పుడు చూశావు?’’ అన్నాడు రామనాథం. ‘‘ఇందాకా నువ్వు సాగనంపుతూంటే చూశాను.’’ వెయ్యి తలపులు ఒక్కసారిగా వచ్చాయి రామనాథం మనస్సులో. కానీ, ఉషను తలుచుకోగానే ముఖంలో విచిత్రమైన కాంతి వచ్చింది. రమణమూర్తి లైట్ హౌస్‌కు ఎదురుగా పార్క్ చేసిన పెద్ద ఫోర్డ్ కారు తలుపు తీసి ‘‘కూర్చో!’’ అని అతన్ని ఆహ్వానించాడు. ‘‘ఎంత బాగుంది నీ కారు!’’ అన్నాడు అప్రయత్నంగా రామనాథం. ‘‘కస్టమ్ మోడల్. ఎక్కడికి వెడదాము?’’ ‘‘ట్రింకాస్కి పద!’’ ‘‘అంతకన్న క్వాలిటీయే బాగుంటుంది’’ ‘‘రెండూ అక్కడేగా. క్వాలిటీయే సరి.’’ ఎంతో మృదువుగా కారు అయిదు నిమిషాల్లో పార్క్ స్ట్రీట్ చేరుకుంది. విచిత్రంగా ఉంది రామనాథం పరిస్థితి. ముందర అతనికి రమణమూర్తి ఉషను చూసి పొందిన ఆశ్చర్యం ఎంతో సంతృప్తిని కలగజేసింది. కానీ అతని కారు చూశాక ఆ సంతృప్తి తగ్గిపోయింది. బీచ్ సాండ్విచ్, పకోడా, ఐస్‌క్రీమ్స్, కాఫీ ఆర్డరు చేశాడు రమణమూర్తి. ‘‘అదృష్టవంతుడివి రామనాథం. నిన్ను ఎప్పుడు తలుచుకున్నా నీ సౌమ్యత, మంచితనం జ్ఞాపకం వస్తాయి. అప్పుడే అనుకునేవాణ్ని నువ్వు పైకి వస్తావని’’ అన్నాడు పకోడా తింటూ రమణమూర్తి. ‘‘నీకన్నానా?’’ ‘‘నాది ఏముందిలే, బాధ లేకుండా గడిచిపోవడం తప్ప’’ ‘మస్తుగా ఉన్నవాళ్లందరికీ ఇదే రోగం’ అనుకుని, ‘‘నువ్వు పెళ్లి చేసుకోలేదా?’’ అన్నాడు రామనాథం. ‘‘అనేక సమస్యల వల్ల...’’ ‘‘పెళ్లి చేసుకుంటే అవే తీరుతాయి’’ ‘‘నీలాగా అందరికీ అదృష్టం కలిసిరావద్దూ!’’ సంభాషణ ఉష మీదకి నడవడం ఇష్టం లేదు రామనాథానికి. ‘‘నీ కారు గొప్పగా ఉంది రమణమూర్తీ’’ అన్నాడు. ‘‘ప్చ్’’ అన్నాడు రమణమూర్తి. నలభై రెండు రూపాయల ఎనభై ఆరు పైసలు బిల్లు వచ్చింది. రమణమూర్తి బిల్లు తీసుకోబోయాడు. పీకపోయినా అతన్ని బిల్ తీసుకోనివ్వదలచుకోలేదు రామనాథం. ఐదు పది రూపాయల నోట్లు పడేసి బయటికి నడిచాడు. ‘‘సిగరెట్ కావాలా?’’ అర పాకెట్ తీసుకుని అతని కొకటి ఇచ్చి తానొకటి తీసుకున్నాడు రామనాథం. ‘‘పద, నిన్ను డ్రాప్ చేసి వస్తాను’’ అన్నాడు రమణమూర్తి. కొంచెం గాభరా పడ్డాడు రామనాథం. ‘‘ఎందుకూ? నేను నడిచి వెళ్లిపోతాను. ఈ మహాపట్టణంలో నడవటం అంటే నాకు సరదా’’ రమణమూర్తి బలవంతం చెయ్యలేదు. కారు స్టార్టు చేసుకుని, రామనాథానికి సలామ్ చెప్పి విసురుగా వెళ్లిపోయాడు. రమణమూర్తి సలామ్ రామనాథాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఉషను గురించి చెప్పిన మాటలూ సంతోషపెట్టాయి. పార్క్ స్ట్రీట్‌లో నుంచి చౌరంగీ రోడ్‌కి వచ్చేసరికి అతని సంతోషం కొంచెం తగ్గింది. ఈ సాయంత్రం ఏభై ఎనిమిది రూపాయలు ఖర్చయింది. ప్రతీ పైసాకీ పూర్తి తృప్తి రాలేదని కాదు. కానీ... ఉదయం వెడుతూంటే... ‘‘బాబుని బడిలో వెయ్యాలి’’ అంది కాంతం. బడిలో వెయ్యడానికి బట్టలు కావాలి; పుస్తకాలు కొనాలి; ఆ డబ్బులుంటే నీకు ఒక్క మందైనా కొందును అనుకున్నాడు రామనాథం. తన దగ్గర ఎప్పుడూ ఉండదు డబ్బు. శేuŠ‡జీ ధర్మమా అని ఇంటర్ ఫెయిల్ అయినా ఆరువందలు దొరుకుతున్నాయి. ఈ కలకత్తాలో చావకుండా బతుక్కు వస్తున్నాడు. ఏభై ఎనిమిది రూపాయలు! ఎంత అవివేకం! రేపు పట్టుకువెళ్లి పూర్తి సొమ్ము ఇవ్వకపోతే ఉషాదేవి ఏమంటుంది? తనకంత గర్వం దేన్ని చూసుకుని? ఐశ్వర్యంలో తులతూగుతున్న రమణమూర్తితో తనకు పోటీ ఏమిటి? పి.జి.హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా కుంగిపోయాడు. తన బ్రతుక్కి నాలుగు రూపాయల సిగరెట్లేమిటి? జేబులో ఉన్న సిగరెట్ పాకెట్ కాలవలోకి విసిరాడు. రేపు ఏం సమాధానం చెబుతావు? ఈ ఉద్యోగం ఊడితే ఏం చేస్తావు? అతనికి రమణమూర్తి మీద కోపం వచ్చింది. బయటికిరాని ఏడుపుతో ఇంటికి చేరాడు రామనాథం. ‘ఉషాదేవిని బ్రతిమిలాడాలి శేఠ్జీతో చెప్పవద్దని’ అనుకున్నాడు ఇంట్లో కాలు పెడుతూ. ∙∙ రమణమూర్తి గడియారం చూసుకున్నాడు. ఎనిమిదిన్నర కావస్తోంది. ఇంక సినిమా అయిపోతుంది. కాలుస్తున్న బీడీ పారేసి, సీటు కింద నుంచి ఖాకీకోటు తీసి తొడుక్కుని, అద్దంలో ముఖం చూసుకుని నిట్టూర్చాడు. ‘మేమ్ సాహెబ్ ఇంక వచ్చేస్తుంది! సినిమా వదిలేశారు’ ఇచ్ఛాపురపు జగన్నాథరావు (1931–2017) ‘ఎదురు అద్దాలు’ సంక్షిప్త రూపం ఇది. 1999లో ప్రచురితం. జగన్నాథరావు కథలు 13 సంపుటాలుగా వెలువడినాయి. ఎదురు అద్దాలు ఒక సంపుటం పేరు కూడా. వానజల్లు, చేదు కూడా ఒక రుచే లాంటివి ఇతర సంపుటాలు. -
పెత్తనం పోయి కర్ర మిగిలింది
అబ్బూరి ఛాయాదేవి అబ్బూరి రామకృష్ణారావు కోడలు, వరద రాజేశ్వరరావు సహచరి అని అందరికీ తెలిసిందే. సన్నని లోగొంతుకతో, ఆగి ఆగి మాట్లాడే ఛాయాదేవి మాటల్లో మందుపూసిన కత్తివాదర లాంటి చమత్కారాలు తొంగిచూసేవి. భర్త చనిపోయాక, ఆయన వాడిన చేతికర్ర, వొంకీ పేముబెత్తాన్ని ఛాయాదేవి కూడా ఉపయోగించారు. ఒకసారి ఇంటికి వచ్చినవారు ‘ఈ చేతికర్ర వరద గారిది అనుకుంటాను’ అన్నారట. ‘అవునండీ! పెత్తనం పోయింది, కర్ర మాత్రం మిగిలింది’ అన్నారట ఛాయాదేవి. ఇంట్లో వుండే పాత వస్తువులతో కళాకృతులు చేయటం ఛాయాదేవి హాబీ. ఒకరోజు ఆమె నిర్జీవంగా అనిపించిన చేతికర్రకు తన చీరల్లోని ఒక రంగులపూల డిజైను వున్న అంచును కత్తిరించి కర్రకు పైనుండి కిందిదాకా అలంకరించారు. ఇంటికి వచ్చినవారు ఎవరో ‘ఏమిటీ, చేతికర్రకు చీర చుట్టారు’ అని అడిగారట. అప్పుడామె తన సహజ ధోరణిలో ‘ఈ కర్ర నిన్నటిదాకా మగకర్ర. నేటి నుండి స్త్రీవాది’ అన్నారు. ఒకరోజు పెళ్లినాటి మాటలు చర్చకు వచ్చి, ‘నన్ను చౌకబారుగా కొట్టేశావు’ అన్నారట వరద. ‘అవును, మీరుండేది చౌకబారులో కదా’ అని చురక అంటించారట ఛాయాదేవి. సేకరణ: శిఖామణి -
ఎత్తయిన సిగ్గరి
ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉండేవాడు రిచర్డ్ బ్రాటిగన్ (1935–1984). ఈ అమెరికా రచయిత రాసే అక్షరాలు మాత్రం చీమల్లా ఉండేవి. ఈ వైరుధ్యం ఆయన జీవితమంతా కొనసాగింది. డబ్బులున్నప్పుడు విలాసంగా బతికాడు, లేనప్పుడు బిచ్చగాడిలా ఉండటానికీ సిద్ధపడ్డాడు. తన ఎత్తుకు నప్పని సిగ్గరి కూడా. ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, ఓ వెయిట్రెస్ సంతానం రిచర్డ్. ఇంకా రిచర్డ్ కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రెవరో తెలియకుండానే పెరిగాడు. తర్వాత కూడా తల్లి ఒక స్థిరమైన బంధంలో కుదురుకోలేదు. దీనికి తోడు పేదరికం. ఈ బాల్య జీవితపు నిరాదరణ బ్రాటిగన్ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసేవాడు. వ్యక్తిగత సంరక్షణ మీద దృష్టి ఉండకపోయేది. జైల్లో పడితేనైనా కడుపు నిండా తినొచ్చన్న ఆలోచనతో ఓసారి పోలీస్ స్టేషన్ కిటికీ మీదికి రాయి విసిరాడు. పోలీసులు పట్టుకుని, తీవ్రమైన వ్యాకులత, మనోవైకల్యంతో బాధ పడుతున్న అతడికి వైద్యం చేయించారు. గొప్పవాడిలా కనబడాలని మార్క్ ట్వెయిన్లా మీసాలు పెంచుకున్న బ్రాటిగన్లో నిజంగానే చిన్నతనం నుంచే గొప్పతనం ఉంది. పన్నెండేళ్లప్పుడే కవిత్వం రాయడం ప్రారంభించాడు. వీధుల్లో, పొయెట్రీ క్లబ్బుల్లో తన కవిత్వం చదివేవాడు. వామపక్ష భావజాలంతో నడిచే వీధి నాటకాల సంఘం ‘ద డిగ్గర్స్’ కోసం రాసేవాడు. అప్పుడు రాసిన ‘ట్రాట్ ఫిషింగ్ ఇన్ అమెరికా’(1967) లక్షల కాపీలు అమ్ముడుపోయింది. 1960, 70ల నాటి అమెరికా ప్రభుత్వ వ్యతిరేక దశకు ఈ నవల అద్దం పట్టింది. రాత్రుళ్లు రాసి పగలు పడుకునే బ్రాటిగన్ కథల సంపుటితో పాటు ‘ఎ కాన్ఫెడెరేట్ జనరల్ ఫ్రమ్ బిగ్ సుర్’, ‘ఇన్ వాటర్మెలన్ షుగర్’, ‘సో ద విండ్ వోంట్ బ్లో ఇట్ ఆల్ అవే’ లాంటి నవలలు వెలువరించాడు. జపాన్‌లో కూడా విపరీతమైన పేరు వచ్చింది. అయితే, ఉద్యమం వెనుకబాట పట్టిన తర్వాత బ్రాటిగన్ ఆదరణ కోల్పోయాడు. మద్యపానానికి బానిస కావడం, నిరంతర వ్యాకులత ఆయన్ని కూడా తల్లిలాగే ఏ ఒక్క వైవాహిక బంధంలోనూ, మొత్తంగా జీవితంలోనూ సౌకర్యంగా ఇమిడిపోనివ్వలేదు. దానికోసం ఆయన ప్రయత్నించినట్టు కూడా కనబడదు. నడకను తప్ప వ్యాయామాన్ని ఇష్టపడేవాడు కాదు. అద్దంలో చూసుకోవడమంటే పిచ్చి. అప్పులు చెల్లించడంలో సోమరి. ఒక దశలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బ్రాటిగన్ తన 49 ఏళ్ల వయసులో రివాల్వర్‌తో తలలోకి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం కుళ్లిన కొద్ది రోజుల తర్వాతగానీ ఆయన చనిపోయిన వార్త ప్రపంచానికి తెలియలేదు. ఆయన వదిలివెళ్లిన ఆత్మకథాత్మక, వ్యంగ్యపూరిత అక్షరాల గంధం మాత్రం తర్వాత చాలామంది రచయితల కలాలకు సోకింది. -
నటించాల్సిన దుఃఖానికి ప్రతిఫలం
‘ఇదంతా, అతి సమర్థురాలైన ఇసాబెల్లా ఫోన్‌తో మొదలయింది. క్రిస్టఫర్ ఎక్కడున్నాడని అడిగింది. మేము విడిపోయి ఆర్నెల్లయిందనీ, ఆమె కొడుకుతో నేను మాట్లాడి నెల దాటిందనీ చెప్పలేని ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నన్ను నెట్టింది’ అన్న మాటలతో ప్రారంభం అయ్యే ‘ఎ సెపరేషన్’ నవలలో– ప్రధాన పాత్రా, కథకురాలూ అయిన ముప్పైల్లో ఉన్న ‘ఫారినర్’ స్త్రీకి పేరుండదు. లండన్‌లో ఉంటుంది. క్రిస్టఫర్ ధనిక కుటుంబంలో పుట్టినవాడు. అప్పటికే ఒక పుస్తకం రాసి పేరు తెచ్చుకున్నవాడు. గ్రీస్ దేశపు అంత్యక్రియల్లో– సంతాపం వెల్లడిస్తూ ఏడ్చే వృత్తి వారి గురించి పరిశోధించడానికి వెళ్ళాడని ఇసాబెల్లా తనతో చెప్పినప్పుడు, ‘ఇప్పటివరకూ ఒక పెంపుడు కుక్కనూ కోల్పోని మనిషికి దీనిమీదున్న ఆసక్తి వింతైనదే’ అనుకుంటుంది. కథకురాలు అనువాదకురాలు. ఆ పనిలో ఉండే ‘స్తబ్దత’ ఆమెకు నప్పుతుంది. ఐదేళ్ళ వైవాహిక జీవితం తరువాత, క్రిస్టఫర్‌కు ఉండే దాంపత్య ద్రోహపు అలవాటుతో విసిగిపోయిన ‘నేను’తో తాము విడిగా ఉన్నామని ఎవరికీ చెప్పొద్దంటాడు అతను. ‘మా పెళ్ళి– క్రిస్టఫర్‌కు తెలిసిన, నాకు తెలియని విషయాలతో ఏర్పడినది. ..నమ్మకద్రోహం అన్నది ఒక భాగస్వామిని తెలుసుకునే పరిస్థితిలో పెట్టి, మరొకరిని చీకట్లో ఉంచుతుంది... కోడలిగా ఇది నా ఆఖరి బాధ్యత’ అనుకున్న ఆమె గెరిలిమెనిస్ అన్న గ్రీస్ కుగ్రామంలో క్రిస్టఫర్ ఉండిన నిర్జనమైన హోటల్‌కు వెళ్తుంది. అతను గదిలో ఉండడు. మరీయా అన్న రెసెప్షనిస్ట్, టాక్సీ డ్రైవర్ స్టీఫానోకూ తను క్రిస్టఫర్ భార్యనని పరిచయం చేసుకున్నప్పుడు మరీయా ఈర‡్ష్య పడుతుందని గమనిస్తుంది. క్రిస్టఫర్ తనతో పడుకున్నాడని ఒకానొక సందర్భంలో మరీయాయే ఒప్పుకున్నప్పుడు, ‘క్రిస్టఫర్‌లాంటి మనిషికి ఎప్పుడూ ‘తర్వాతి స్త్రీ’ ఉండనే ఉంటుంది’ అనుకుంటుంది. అనాసక్తిగా హోటల్లో గడుపుతూ – వైవాహిక సంబంధాలలో ఉండే జఠిలతా, వివాహ విచ్ఛిన్నతకుండే అనిర్ధారిత ఎల్లల గురించి విశ్లేషించుకుంటున్నప్పుడు, క్రిస్టఫర్ గురించి తనకేమీ తెలియదని గుర్తిస్తుంది. క్రిస్టఫర్ గదికి వెళ్ళినప్పుడు, అతని లాప్టాప్లో అశ్లీల చిత్రాలు కనబడతాయి. అక్కడి నివాసులతో మాట్లాడ్డానికి ఎంత మర్యాద, గోప్యత అవసరమో అర్థం కాదామెకు. ఆ ఊరి శోకించే స్త్రీ వద్దకు వెళ్తుంది. ఆమె తమ ఆచారాన్ని ప్రదర్శించినప్పుడు ‘యీమె స్వర సామర్థ్యానికీ, అభినయానికీ కాక మరొకరి స్థానాన తాను బాధను అనుభవిస్తున్న కారణంగానే యీమెకి డబ్బు ముడుతుంది’ అని అనుకుంటుంది. మరుసటి రోజు– క్రిస్టఫర్ శరీరం కందకంలో పడుందని, గుర్తు పట్టడానికి పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆమెకు చెప్తారు. ఎవరో అతని పర్స్ దొంగిలించి అతని తలమీద కొట్టడంతో అతను చనిపోతాడు. ‘గ్రీస్‌లో యీ పోలీస్ స్టేషన్ ద్వారం వద్ద నేను అదృశ్యమయ్యాను’ అనుకుంటూ, అత్తమామలకి వార్త చెప్పగానే వారొచ్చి మృతదేహాన్ని లండన్ తెస్తారు. కొన్ని నెలల తరువాత ఆమెకు క్రిస్టఫర్ భార్యగా ముప్పై లక్షల బ్రిటిష్ పౌండ్లు సంక్రమిస్తాయి. తమ దాంపత్య నటనని నిలబెట్టడానికి ఆ డబ్బు తీసుకుంటుంది. ‘భార్య, భర్త, పెళ్ళి అన్న మాటలు కేవలం అస్థిర వాస్తవాలను దాచిపెట్టేవి’ అనుకుంటుంది. రచయిత్రి కేటీ కిటమురా క్లిష్టమైన భాషలో రాసిన ఈ పుస్తకంలో పెద్ద కథాంకం అంటూ ఉండదు. అంతర్గత ఏకభాషణతోనే సాగుతుంది. ఆలోచనలు, భావసూచనలు, చేష్టలను పట్టిపట్టి చూస్తుంది కథకురాలు. వచనం వాడిగా ఉంటుంది. వాక్యాలు లయబద్ధంగా ఉండటం వల్ల శైలి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. నవలంతటా– క్రిస్టఫర్ ఒక జ్ఞాపకమే అయినప్పటికీ, వివరాలన్నీ అతని చుట్టూనే తిరుగుతాయి. ఉన్న కొద్దిపాటి డైలాగుల్లోనూ కొటేషన్ మార్క్స్ ఉండక, అవీ భూతకాలంలో ఉన్న కథనంలో కలిసిపోతాయి. నవలను పెంగ్విన్ రాండమ్ హౌస్ 2017లో ప్రచురించింది. రచయిత్రి జపనీస్ సంతతికి చెందినవారు. అమెరికా, కాలిఫోర్నియాలో పుట్టి పెరిగారు. పత్రికలకు రాస్తుంటారు. కళా విమర్శకురాలు. ప్రస్తుతం, ‘ద లండన్ కన్సార్టియం’లో హానరరీ రీసెర్చ్ ఫెలోగా చేస్తున్నారు. భారత సంతతి బ్రిటిష్ రచయిత హరి కుంజ్రును పెళ్లి చేసుకున్నారు. కృష్ణ వేణి -
గ్రేట్ రైటర్ (విలియం స్టాన్లీ మెర్విన్)
ప్రధానంగా కవి అయిన విలియం స్టాన్లీ మెర్విన్ (1927–2019) ఒకవైపు విస్తృతంగా రాస్తూనే, మరోవైపు ఇతర భాషల కవిత్వాన్ని అంతే సీరియస్‌గా అమెరికా పాఠకులకు పరిచయం చేశాడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో 50కి పైగా పుస్తకాలు వెలువరించాడు. ఐదేళ్ల వయసులోనే వాళ్ల నాన్న కోసం తోచిన పాటలు కట్టేవాడు. ఒకరోజు వీధిలో ఎవరో చెట్టును కొట్టడం చూసి దాని చేతులు నరికేస్తున్నారన్నంతగా బాధపడి, ఆవేశంతో వాళ్ల మీదికి పోయాడు. తర్వాత రెడ్ ఇండియన్ల జీవితం, వాళ్ల ప్రకృతి ప్రేమ, ఆయన ఆసక్తికర అంశాలుగా మారాయి. సంపాదకుడిగా పనిచేశాడు. కాంక్రీటు నగరాల్లో బతకలేనని హవాయిలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేశాడు. చెట్లు పెంచాడు. బౌద్ధ తత్వం, పర్యావరణ ప్రియత్వం ఆయనను పట్టించే మాటలు. అనువాదాల్లోకి దిగటానికి కారణం చెప్తూ– రాయడం మొదలుపెట్టినప్పుడు భావం నీదే కానీ భాష నీదై ఉండదు. ఎప్పుడైతే అనువాదానికి కూర్చుంటామో ప్రతీ పదం మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది, సరైన మాటలు వాడటమంటే ఏమిటో తెలుస్తుంది, అన్నాడు. ఒక దశలో కవిత్వం ప్రధానంగా మౌఖిక సంప్రదాయంలోనిదన్న అభిప్రాయానికి వచ్చాడు. విరామ చిహ్నాలు పేజీల మీద పదాల్ని కొట్టే మేకుల్లాగా కనబడటం మొదలైంది. పదాల్ని తేలికగా వదిలెయ్యడం కోసం పంక్చువేషన్‌ను వదిలేశాడు. ద లైస్, ద క్యారియర్స్ ఆఫ్ లాడర్స్, ద రెయిన్ ఇన్ ద ట్రీస్, తొంభై ఏళ్ల వయసులో ఈ మార్చి 15న మెర్విన్ మరణించాడు. -
వెలిసిపోయిన రంగుల స్వప్నాలు
యేండ్రియా హిరాటా తొలి నవల, ‘ద రెయిన్బో ట్రూప్స్’–బహాసా ఇండోనేసియాలో రాసినది. 1970ల నేపథ్యం. కథకుడు–కుర్రాడైన ఇకాల్. ఇకాల్– బెలిటన్ ద్వీపంలో ఉన్న ‘ఆవేశమెత్తిన మేక ఒక్క తోపు తోస్తే పడిపోయే’ ‘ముహమ్మదీయా ఎలిమెంటరీ స్కూల్’లో చేరతాడు. ధనిక ద్వీపమది. అక్కడి బీద విద్యార్థులకు చదువందించే ఆశయంతో– జూనియర్ హైస్కూల్ పాస్ అయిన, 15 ఏళ్ళ ఇబూ మూ(ఇబూ ముస్లీమా) ఆ పేద బడి ప్రారంభిస్తుంది. దాని ప్రిన్సిపాల్ హాఫన్. ఆ ప్రాంతంలోజాతీయ గనుల తవ్వకపు కంపెనీ అధికారమే చెల్లుతుంది. పాఠశాల మూతపడకుండా ఉండాలంటే, పదిమంది విద్యార్థులైనా ఉండాలన్నది ప్రభుత్వ నియమం. సరిగ్గా పదే మందున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందోమోనని ఉపాధ్యాయులిద్దరూ బెంగటిల్లుతుంటారు. పిల్లలకు–అబూ మూ, ‘రెయిన్బో ట్రూప్స్’ అన్న పేరు పెడుతుంది. వారికి జీవితంపై ఆశ కలిగిస్తుంది. తన జీవిక కోసమూ, స్కూల్ ఖర్చుల కోసమూ రాత్రిళ్ళు కుట్టుపని చేస్తుంది. విద్యార్థుల్లోఒకడైన లింగ్టంగ్, మొసళ్ళుండే చిత్తడి నేలను తప్పించుకుంటూ, రానూ పోనూ రోజూ 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడు. గణితంలో దిట్ట. ఈ పేద పిల్లలు– ఆడంబరమైన పీఎన్ స్కూలు విద్యార్థులను స్థానిక పోటీల్లో ఓడిస్తూ పోతారు. రెండు పాఠశాలలకీ మధ్యనుండే తేడా, ఊరి సామాజిక అసమానతను కనబరుస్తుంది. చాక్‌పీసుల కోసం దుకాణానికి వెళ్ళిన ఇకాల్ అక్కడ ‘ఎ లింగ్’ అనే చైనీస్ అమ్మాయి ‘నెలవంక చంద్రుని ఆకారంలో ఉన్న వేళ్ళ గోళ్ళని’ చూసి ఆకర్షితుడవుతాడు. అయితే, ఆమె తల్లిదండ్రులు ఆమెను ‘మంచి చదువు’ కోసం జకార్తా పంపిన తరువాత, ‘480 గంటల 37 నిమిషాల 12 సెకన్ల పిమ్మట, నా నష్టం గురించి దుఃఖించడం మానాను. నామీద నేను సానుభూతి కురిపించుకోవడం ఆపేశాను’ అంటాడు. అయితే, అప్పటి ఇకాల్ వయస్సు గురించిన స్పష్టత ఉండదు. హాఫన్ మరణిస్తాడు. ‘మనం చదువు కొనసాగించాలి. మనకింక అన్యాయం జరగదు’ అంటుండే లింగ్టంగ్– దురదృష్టవశాత్తూ జాలరైన తండ్రి చనిపోవడంతో, చదువాపేసి, కుటుంబ బాధ్యత తలకెత్తుకోవాల్సి వస్తుంది. పిల్లలందరి తండ్రులూ చితకాముతకా పనులు చేసేవారే. ఉపాధ్యాయులూ, విద్యార్థులూ– బడి నిలపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, పరిస్థితులు వారి అదుపులో ఉండవు. పిల్లలు తమకున్న వనరులని ఉపయోగించుకోవడంలో ఏ అవకాశమూ వదలరు కానీ వారి ప్రా«థమిక అవసరాలే వారి చదువు మానిపించేస్తాయి. ‘12 ఏళ్ళ పిమ్మటి’కి (చివరి 40 పేజీల వద్దకు) చేరిన తరువాత, విధివాదాన్ని సమర్థిస్తారు రచయిత హిరాటా. ‘రోజువారీ జీవితాల్లో మమ్మల్ని ఊపిరాడకుండా చేసిన ఆర్థిక ఇబ్బందులని తట్టుకున్నాం... విద్యావ్యవస్థకి అతి క్రూరమైన, దృఢమైన, అదృశ్య శత్రువు– భౌతికవాదం. అదే మమ్మల్ని అణచివేసి, మోకాళ్ళమీద కుదేసింది’ అంటాడు ఎదిగిన ఇకాల్. ఆ పదిమందిలో– పైకొచ్చినది అతనొక్కడే. విద్యార్థి వేతనంతో చదువుకొని పారిస్‌లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ‘ఎంత సాధ్యమైతే అంత తీసుకోకుండా, ఎంత వీలయితే అంత ఇవ్వడం నేర్చుకున్నాం. ఆ మనస్తత్వం వల్ల పేదరికం అనుభవిస్తూ కూడా, కృతజ్ఞతగా ఉండటం అలవాటయింది’ అంటాడు. కాలక్రమం లేని నవల్లో– ఎప్పుడు, ఎన్నేళ్ళు గడిచిపోయాయో సులభంగా అర్థం కాదు. సంభాషణా శైలిలో ఉన్న వచనం సరళమైనది. ఇది నవలనిపించదు. కొన్ని సంఘటనలు, పిట్టకథలు, సూక్తులు కలిపి అల్లినట్టనిపిస్తుంది. యేంజీ కిల్బనె ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ రచయిత స్వీయచరిత్రను, హార్పర్ కాలిన్స్ 2013లో ప్రచురించింది. హిరాటా దీన్ని ‘ఇబూ మూ’కే అంకితం ఇచ్చారు. ఈ నవల ఆధారంగా, ఇండోనేసియాలో ఇదే పేరుతో వచ్చిన సినిమా బాగా ఆదరణ పొందింది. కృష్ణ వేణి -
ఎమిలీ జోలా (గ్రేట్ రైటర్)
రచయిత కూడా ఒక శాస్త్రవేత్తలాగా సమాజంలోని పాత్రలను ఆద్యంతమూ పరిశీలించాలనే నేచురలిస్టు వాద రచయిత ఎమిలీ జోలా (1840–1902). ఎంతోమంది రచయితలను ప్రభావితం చేసిన 19వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయిత. ఇటాలియన్ తండ్రికీ, ఫ్రెంచ్ తల్లికీ జన్మించాడు. ఏడేళ్లప్పుడు తండ్రి చనిపోయాడు. చాలీచాలని డబ్బుతో తల్లి పోషించింది. ఒక్కోసారి వాలిన పిచ్చుకలను పట్టుకుని తిని బతికారంటారు. పాత్రికేయుడిగా మారకముందు గుమస్తాగా కూడా జోలా పనిచేశాడు. చిన్నతనం నుంచే రచన మీద ఆసక్తి ఉన్న జోలాకు పేరు వస్తున్నకొద్దీ డబ్బు ఒక సమస్య కాకుండా పోయింది. వారసత్వం, పరిణామం ఒక కుటుంబంలోని ఒక్కో సభ్యుడిని ఎలా ప్రభావితం చేస్తాయో చిత్రించే ఆయన 20 సంపుటాల నవల, ‘లెస్ రౌగాన్ – మక్వార్ట్’. 1870లో ప్రారంభించి సుమారు ఏడాదికొకటి చొప్పున 1893 వరకు పూర్తి చేశాడు. తలచుకోవడానికే భయమేసే బృహత్తర ప్రయత్నం. ఇందులోని జెర్మినల్, ఎర్త్, ద కిల్, నానా భాగాలు విడిగానూ ప్రసిద్ధం. ‘డ్రెయ్ఫస్ ఎఫైర్’ పేరుతో పన్నెండేళ్లపాటు కొనసాగిన చరిత్రాత్మక కేసులో యూదు సైనికుడు డ్రెయ్ఫస్ వైపు నిలిచాడు జోలా. ఫ్రెంచ్ సమాజాన్ని రెండుగా చీల్చిన ఈ చర్య ఆయనను ఎందరికో శత్రువుగా చేసింది. అయినప్పటికీ ఫ్రాన్సులో యూదులపట్ల వ్యతిరేకత పోవడానికి క్రమంగా కారణమయ్యాడు. 1902లో ఇంట్లోనే విషవాయువు బారిన పడి ప్రమాదవశాత్తూ జోలా మరణించాడు. ఈ వాయువు లీక్ అవడానికి జోలా వ్యతిరేకులే కారణమని నమ్మినవాళ్లూ ఉన్నారు. -
ప్రేమతో సంపూర్ణం
‘నీ స్పర్శతో నేను ఈదగలను.’ అన్నయ్య ఉనికిని తల్లి గర్భం నుంచే ఊహించుకోగలిగిన కథకురాలి మాటలివి. తల్లికి మత పిచ్చి. తండ్రి వారిని వదిలిపోయి, ఆ తరువాత చనిపోతాడు. అన్న– మెదడు కణితిని చిన్నతనంలోనే తీసెయ్యడంతో బుర్ర సరిగ్గా పని చేయనివాడు. ఆ ఆపరేషన్ వల్ల చూపు, మాట, నడక మారి– నెత్తిమీద మచ్చ మిగుల్తుంది. ఇది ఎమియర్ మక్‌బ్రైడ్ రాసిన ‘ఎ గర్ల్ ఈజ్ ఎ హాఫ్ ఫార్మ్డ్ థింగ్’ నవల. యీ ఐరిష్ పుస్తకంలో, ఏ పాత్రకీ పేరుండదు. చైతన్య స్రవంతి శైలిలో సాగుతుంది. ఆమె బాల్యం అస్తవ్యస్తంగా గడుస్తుంది. తల్లి కొడుకు పట్ల పక్షపాతం చూపించినప్పటికీ అది కథకురాలికి సమస్యగా మారదు. స్కూల్లో అన్నను ‘ఈ గొంతుకి మొద్దు నాలిక నచ్చుతుందా?’ అంటూ హేళన చేయడాన్ని చూసినప్పుడు, తనే బాధని అనుభవిస్తుంది. ఆమెకు 13 ఏళ్ళున్నప్పుడు, దూరపు బంధువైన ‘అంకుల్’ ఆమెను మానభంగం చేస్తాడు. ఆ నేరం గురించి మాట్లాడ్డానికి బదులు ఆమె దాన్ని సమర్థించేందుకు ప్రయత్నిస్తుంది. తన యీ కొత్త స్త్రీతనపు విశ్వాసాన్ని ఉపయోగించుకుంటూ, అన్నను హేళన చేసిన కుర్రాళ్ళతో కూడుతూ, తన తడాఖా చూపించుకుంటున్నానని భావిస్తుంది. ‘శాంతిగా నా పడవలోకి జారుకుంటూ, పాపాన్ని ఆహ్వానిస్తున్న దాన్ని’ అనుకుంటుంది. ఇల్లు విడిచిపెట్టి కాలేజీలో చేరిన తరువాత, కొంతకాలం సామాన్యమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంది. అన్న తిరిగి క్యాన్సర్ బారిన పడినప్పుడు– దిశా రహితంగా అనామకులతో సహవాసం కలిపించుకుంటూ, ‘ప్రతీ ప్రశ్నకూ సమాధానం మైథునం’ అనే స్థితికి చేరుతుంది. తనని కొట్టి, హింసించే సంగమ చర్యలు ఆమెకి ఓదార్పు కలిగించడం ప్రారంభిస్తాయి. తన్ని తాను అసహ్యించుకోవడం వల్ల తనను అభిమానించే వాళ్ళంటే దూరం పారిపోతుంది. స్నేహాలను, ఓదార్పును, నవ్వును తిరస్కరిస్తుంది. కానీ ప్రేమను కాదు. కాకపోతే ఆమెకది దొరకదు. ఆమెకు 18 ఏళ్ళుండగా తాత చనిపోయినప్పుడు, ఇంటికి వస్తుంది. అన్న చనిపోయిన తరువాత ఆమె మామూలుగా అయిపోతుంది. అయితే, అంకుల్ ఆమెను వేధించడం మానడు. ‘మంచివాడైన నీ అన్న ఇప్పుడు లేడు. ఇలా అనడాన్ని దేవుడు క్షమిస్తాడనుకుంటూనే చెప్తున్నాను, విను. ఆ శవపేటికలో ఉన్నది నీవే అయి ఉండాలనుకుంటున్నాను. నా కొడుకు కాదు’ అని తల్లి చెప్పినప్పుడు, నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది. కథకురాలి స్వీయ విధ్వంసక ప్రవర్తనని కనపరిచే యీ అంతులేని దుఃఖపు కథని పాఠకులు తట్టుకునేలా చేసేది– అన్న పట్ల బేషరతుగా కొనసాగే ఆమె ప్రేమే. సంపర్కం, ఆ ప్రవర్తనల క్లిష్ట లోకం గురించి పూర్తిగా అర్థం అవని ఒక పిల్ల మానభంగానికి గురయినప్పుడు– ఆ సంఘటన ఇంకా సగమే రూపొందిన ఆ అమ్మాయి మీద ఎంత భయంకరమైన ప్రభావం చూపుతుందో చెప్తుంది నవల. ఏకభాషణతోనే సాగే పుస్తకంలో విరామ చిహ్నాలు కనబడవు. పాత్రలు ఏ కాలానివో అన్న వివరాలుండవు. ఆమెకు ఐదేళ్ళున్నప్పుడు మాట్లాడిన సగంసగం వాక్యాలు, ఆమెకు 18 ఏళ్ళు వచ్చినప్పుడూ అలాగే ఉంటాయి. ఆ ఖాళీలను పాఠకులు తమ ఇష్ట ప్రకారం పూరించుకోవచ్చు. అయితే, కొన్ని పేజీలు దాటిన తరువాత ఆ భాష ఇంక తికమక పెట్టదు. సాంప్రదాయ విరుద్ధమైన యీ నవలను తొమ్మిదేళ్ళు ఎవరూ ప్రచురించే ధైర్యం చేయలేకపోయారు. ఆఖరికి, గాలీ బెగ్గర్ ప్రెస్, 2013లో వెయ్యి కాపీలు ప్రచురించిన తరువాత– గెలుచుకున్న అవార్డులు ఎన్నో, ప్రచురించడానికి ముందుకు వచ్చిన పబ్లిషింగ్ హౌసులూ అన్నే. కృష్ణ వేణి -
కాలం గీసిన చివరి చిత్రం
1987. న్యూయార్క్. ‘తను చనిపోతున్నాడని ఫిన్ మామయ్యకి తెలుసు. అందుకే అక్క గ్రెటాదీ, నాదీ చిత్రం గీస్తున్నాడు,’ అంటుంది 14 ఏళ్ళ జూన్. సిగ్గరి అయిన జూన్ మేనమామతో మనసు విప్పి మాట్లాడగలుగుతుంది. ఫిన్ పేరున్న చిత్రకారుడు. అక్కచెల్లెళ్ళిద్దరూ ఆదివారాలు మేనమామతో గడపటానికి తల్లి డానీతోపాటు, అతని మన్హటన్ ఇంటికి వెళ్తుంటారు. పిల్లలకు వారి చిత్రం బçహూకరిద్దామనుకుంటున్నానని ఫిన్ అక్క డానీకి చెప్తాడు. నిజానికి, అది పిల్లలిద్దరితో గడిపే అవకాశం కలిపించుకోడానికి మాత్రమే. తోడేలు తల కూడా ఉన్న ఆ చిత్రానికి ‘టెల్ ద వుల్వ్స్ ఐ ఆమ్ హోమ్’ అన్న పేరు పెడతాడు ఫిన్. మామయ్యకున్న జబ్బేమిటో ఎవరూ పిల్లలకు చెప్పరు. ‘అమ్మ– మామయ్య వంటింట్లో రంగురంగుల రష్యన్ టీ సెట్టులో టీ కలుపుతూ, గంటలు వెచ్చిస్తుంది. ఆ సెట్ తనకిష్టమైన వాళ్ళకోసమేనని ఫిన్ చెప్పాడు,’ అంటుంది జూన్. ఫిన్ చనిపోతాడు. అంత్యక్రియలప్పుడు, అక్కడే తచ్చాడుతున్న టాబీని చూపిస్తూ, ‘అదిగో, అతనే ఫిన్‌కు జబ్బు అంటించిన వాడు,’ అని తల్లి చీదరిస్తూ పిల్లలకు చెప్తుంది. అంతకాలమూ డానీ పెట్టిన షరతువల్లే ఫిన్, టాబీ ఉనికిని పిల్లలనుండి దాచి పెట్టి ఉంటాడు. అతను ఫిన్ ప్రేమికుడని అప్పుడు జూన్‌కు తెలుస్తుంది. ఒక రోజు ప్యాకెట్లో జూన్‌కు ఫిన్ టీ సెట్ వస్తుంది. దానితో పాటు తనని కలుసుకోమంటూ టాబీ రాసిన చీటీ ఉంటుంది. టాబీతో కలిసి ఊరంతా తిరుగుతున్నప్పుడు, ఫిన్ లేని లోటు అనుభవిస్తున్నది తనొక్కతే కాదని జూన్ గ్రహిస్తుంది. అప్పటికే చెల్లెలికీ, ఫిన్కూ మధ్యనున్న అన్యోన్యత సహించలేని 16 ఏళ్ళ గ్రెటా– తాగుడు అలవరచుకుంటుంది. జూన్‌కి టాబీ ఒక పుస్తకం ఇస్తాడు. దాన్లో, ‘టాబీకి ఎవరూ లేరు. అతనూ చనిపోబోతున్నాడు. నాకోసమని, అతన్ని జాగ్రత్తగా చూసుకో,’ అని ఫిన్ గతంలో రాసిన ఉత్తరం పెట్టుంటుంది. ఇంతలో మీడియాకి చిత్రం గురించి తెలుస్తుంది. దాని వెల ఎంతో తెలిసిన తల్లి, చిత్రాన్ని బ్యాంక్ లాకర్లో పెట్టి, తాళాలు కూతుళ్ళకి ఇస్తుంది. జూన్ చిత్రాన్ని చూడ్డానికి వెళ్ళిన ప్రతిసారీ, తన చొక్కా మీద నల్ల బొత్తాలూ, గ్రెటా చేతి వెనుక కపాలం వంటి కూడికలు కనిపిస్తాయి. అది అక్క పనేనని అర్థం చేసుకున్న జూన్, తనూ చిత్రంలోని తమ జుట్టుమీద బంగారం రంగు చారలని వేస్తుంది. తన స్కూల్ పక్కనున్న అడివంటే జూన్‌కు ఇష్టం. అక్కడుండే తోడేళ్ళ అరుపుల కోసం ఎదురు చూస్తూ సంతోషంగా అడివంతా తిరుగుతుంటుంది. ‘తోడేళ్ళు చెడ్డవి కావు. ఆకలి గొన్నవీ, స్వార్థపూరితమైనవి అంతే’ అనుకుంటుంది. ఒకసారి అక్కడే తాగి పడిపోయిన గ్రెటాని టాబీ ఇంటికి చేరుస్తాడు. ‘అక్కా, నేనూ ఎలా వేరయ్యామో అర్థం అయింది నాకు. ఇన్నేళ్ళ ఆప్తమిత్రులం. తన్ని నేనే విడిచిపెట్టానని ఎందుకు గుర్తించలేకపోయాను!’ అనుకున్న జూన్, గ్రెటాతో రాజీ పడుతుంది. టాబీని జూన్ తనింటికి తీసుకొస్తుంది. తల్లి అతన్ని క్షమాపణ అడుగుతుంది. అదే రాత్రి టాబీ మరణిస్తాడు. డానీ, గ్రెటా– జూన్ జీవితంలో టాబీకున్న స్థానాన్ని అంగీకరిస్తారు. హెచ్ఐవీ ఒక కళంకం, ఎయిడ్స్ అంటువ్యాధి– అనుకునే కాలపు నేపథ్యం ఉన్న పుస్తకం ఇది. అదే మంకుతనంతో కూడిన అజ్ఞానం డానీలోనూ కనిపిస్తుంది. సమలైంగికత గురించి నోరెత్తడానికి కూడా భయం వేసే ఆ కాలం గురించి సవివరంగా రాసిన కెరోల్ రఫికా బ్రంట్ తొలి నవలను రాండమ్ హౌస్ 2012లో ప్రచురించింది. కృష్ణ వేణి -
ఉరితీతకు నాలుగు రోజుల ముందు...
అమెరికా– టెక్సస్‌లో ఉన్న చిన్న ఊరు స్లోన్. నల్ల ఫుట్‌బాల్ ఆటగాడైన డూంట్ మీద, స్కూల్ ఛీర్ లీడర్ అయిన తెల్లమ్మాయి నిక్కీని మానభంగం చేసి, హత్య చేసిన నేరం మోపబడి ఉరిశిక్ష పడుతుంది. నిజానికి, అతనికి ఆ హత్యతో ఏ సంబంధం ఉండదు. కాకపోతే, జ్యూరీ సభ్యులందరూ తెల్లవారే కావడం వల్ల డూంట్ జాత్యహంకారానికి బలై, తొమ్మిదేళ్ళ శిక్ష పూర్తి చేస్తుండగా నవల మొదలవుతుంది. 1998లో నిక్కీని అపహరించి, బలాత్కరించి, గొంతు నులిమి – ఆరుగంటల దూరాన ఉన్న మిజోరీలో శరీరాన్ని పాతి పెట్టినది ట్రావిస్. పోలీసులు డూంట్‌ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తూ ఊరుకుంటాడు. వర్తమానంలో డూంట్ ఉరిశిక్షకి నాలుగు రోజులే మిగులుతాయి. బ్లాక్ అమెరికన్లు డూంట్ మీదున్న తప్పు దోషనిర్ధారణని వ్యతిరేకిస్తూ, సమ్మె చేస్తారు. డూంట్ లాయరైన రాబీ దానికి నాయకత్వం వహిస్తాడు. ట్రావిస్ లైంగిక దాడుల రికార్డ్ చిన్నదేమీ కాదు. మరో నేరం చేసి, పూచీకత్తు మీద వదిలి పెట్టబడతాడు. శస్త్రచికిత్స లేని మెదడు కణితితో బాధపడుతూ, తన పాత నేరాన్ని వొప్పుకుందామని నిర్ణయించుకుంటాడు. ఊర్లో జాతి ఉద్రిక్తత నెలకొన్నప్పుడు, తను నిక్కీని ఎక్కడ పాతి పెట్టాడో ట్రావిస్ చెప్తాడు. డీఎన్ఏ శాంపిల్స్ బట్టి – బలాత్కారం, హత్యా నిర్థారించబడినప్పటికీ – తన అరెస్ట్ తాకీదుకి ముందే, ట్రావిస్ పారిపోతాడు. డూంట్ ఉరి ఎవరూ ఆపలేకపోతారు. పాస్టర్ అయిన ష్రౌడర్– రేపిస్టూ, హంతకుడూ అయిన ట్రావిస్‌కు హామీ ఇచ్చి, జైలుబారిన పడకుండా రక్షించినందుకు పశ్చాత్తాపపడి, జరిమానా చెల్లిస్తాడు. తన పదవికి రాజీనామా చేస్తాడు. ఈ పుస్తకంలో అతి వ్యాకులపరిచేవి డూంట్ గత జ్ఞాపకాలూ, తన పేరుకంటిన కళంకాన్ని దూరం చేసుకునే అతని ప్రయత్నాలూ. తన స్వస్థచిత్తతను కాపాడుకోడానికి జైల్లో బైబిల్ చదువుతూ, తన ఫుట్‌బాల్ ఆటని గుర్తు చేసుకుంటుంటాడు. భూమ్మీద తన ఆఖరి దినాన తనకు తాను నచ్చజెప్పుకుంటాడు: ‘రోజులు లెక్కపెట్టుకుంటూ సంవత్సరాలు గడిచిపోవడం చూస్తావు. నీవు మరణిస్తేనే నయం అని నమ్ముతూ, నిన్ను నీవు సమర్థించుకుంటావు. మరణాన్ని తేరిచూస్తూ, అవతల నీకోసం వేచి ఉన్నదేదైనా కానీ– అది మాట్లాడ్డానికి ఎవరూ లేని యీ ఆరు బై పది పంజరంలో, ముసలివాడివవుతూ గడపడం కన్నా నయమే అయి ఉంటుందనుకుంటావు. ఎలాగూ సగం మరణించే ఉన్నావు కనుక మిగతా సగాన్నీ చంపెయ్యమని మృత్యువు మొహం మీదే చెప్పడమే మంచిది అనుకుంటావు.’ ‘ద కన్ఫెషన్’ పుస్తకం, రచయిత జాన్ గ్రిషమ్ నమ్మకాల ఆధారమే. ఏదీ ఉపదేశించే ప్రయత్నం చేయనప్పటికీ, రచయిత ఒక ఎదురులేని ప్రశ్న మాత్రం వేస్తారు: ‘ఒక అమాయకుడిని దోషిగా నిర్ణయించి, ఉరిశిక్ష వేసిన సందర్భంలో, స్వతంత్రంగా తిరిగే దోషులకి ఏమీ అవదా?’. మరణశిక్షకి గ్రిషమ్ వ్యతిరేకి అని మొదటినుండీ తెలుస్తూనే ఉంటుంది. వర్తమానం నుండి గతానికి, ఒక పాత్రనుండి మరొక పాత్రకు వెళ్ళే పుస్తకం, మొదలయినంత వేగంగానే ముగుస్తుంది కూడా. పూర్తి పుస్తకం కేంద్రీకరించేది కేవలం ఉరిశిక్ష ఎంత ఘోరమైనదోనన్న విషయం పైనే. నవల్లో–చట్టపరమైన సాంకేతికతల వివరాలూ, జైళ్ళల్లో జరిగే వాస్తవమైన సంఘటనలూ, సామాజిక సమస్యల అనేకమైన వివరాలూ ఉంటాయి. కథనం– తనకి తెలియకుండానే కేసులోకి లాగబడిన పాస్టర్ దృష్టికోణంతో ఉంటుంది. ‘మరణశిక్ష హంతకులకు ఒక పీడకల. ఒక అమాయకుడికి అది మానసిక హింస. దాన్ని తట్టుకునే ధైర్యం మనుష్యులకి ఉండదు’ అని గ్రిషమ్ చెప్పే ఈ నవలని డబల్ డే 2010లో ప్రచురించింది. కృష్ణ వేణి -
కోరుకున్నది సాధించిన తర్వాత?
జనవరి 1995. ఇరవై ఏళ్ళు దాటిన ఫ్రేణీకి బ్రోడ్వేలో నటి అవాలన్న కోరిక. అందుకోసమని న్యూయార్క్ వచ్చి రెండున్నరేళ్ళు గడుస్తాయి. నటనలో రాణించడానికి, తనకు తానే విధించుకున్న మూడేళ్ళ గడువులో ఇంక ఆరు నెలలే మిగిలి ఉంటాయి. సుప్రసిద్ధ నటి మెరిల్ స్ట్రీప్ స్థానంలో తన్ని తాను చూసుకుంటుంది ఫ్రేణీ. దువ్వెనకి లొంగని ఉంగరాల జుత్తు ఆమెది. త్వరత్వరగా మాట్లాడే స్వభావం. హాస్యం ఇష్టపడుతుంది. ‘ముఖ్యమైన పని’ మాత్రమే చేయాలనుకున్న ఫ్రేణీకి అప్పటివరకూ దొరికిన పాత్రలు– గిన్నెలు తోమే సబ్బుల ప్రకటనల వంటివి మాత్రమే. బ్రోక్లిన్లో ఉన్న అపార్టుమెంటును స్నేహితులైన జేన్, డాన్‌తో పంచుకుంటుంది. ఖర్చులు గడవడానికి క్లబ్బులో వెయిట్రెస్‌గా పని చేస్తుంది. ఆత్మ విశ్వాసం తక్కువయి, ‘నేను అందంగానే ఉన్నానా? అని స్నేహితులను అడుగుతుంటుంది. ఇంటికి వెనక్కొచ్చేయమని పోరే తండ్రి ‘అప్పుడప్పుడూ, నీకు మంచి కూడా జరుగుతుందని కూడా ఊహించుకోమ్మా’ అని ఫోన్లో సలహాలు ఇస్తుంటాడు. ‘నటుల పని నటించడం. పెర్ఫ్యూములు అమ్మడం, వంటల పుస్తకాలు రాయడం కాదు’ అన్న నిర్ధారణకు వచ్చిన ఫ్రేణీ– తన లక్ష్యం సాధించలేకపోయిన పరిస్థితిలో– సొంత ఊరికి తిరిగెళ్ళి, తండ్రిలా టీచర్ అయి, షికాగోలో ‘లా’ చదువుతున్న బోయ్‌ఫ్రెండును పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కాలం పరిగెడుతుండగా, తాజా తీర్మానాలు మొదలవుతాయి: ‘సూర్యుడితో పాటు లేవాలి. వద్దు. అవసరం లేదు. 8 కల్లా లేస్తే చాలు. సిగరెట్లు మానాలి. ఛీజ్ పఫ్స్ తినడం ఆపేయాలి. పర్సులూ, గొడుగులూ పోగొట్టుకోకూడదు.’ ‘నాకు అనవసరం అయినవారి ఆమోదం కోసం ఎదురు చూడకుండా నేనింకా శ్రమపడాలి’ అనుకుంటూ, అనేకమైన ఏక్టింగ్ క్లాసులకి వెళ్తూ, ఆడిషన్స్ కోసం ప్రయాస పడుతుంటుంది. ఏజెంటుకి ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడు. ఆఖరుకి అర్ధ నగ్నంగా నటించే ఒక పాత్ర దొరికినప్పుడు, డబ్బు ఎక్కువ ముడుతున్నప్పటికీ, అది ‘‘తను కోరుకున్న ‘నిజమైన’ సినిమాయే కానీ దిగంబరత్వం తనకి సరిపడదు’’ అని గుర్తించి, దాన్ని నిరాకరిస్తుంది. హఠాత్తుగా లాస్ ఏంజెలెస్‌లో ఉన్న పెద్ద ఏజెన్సీ వొకటి, ఆమెకి ప్రధాన పాత్రను ఇస్తుంది. అప్పుడే, నటుడైన జేమ్సుతో సంబంధమూ మొదలవుతుంది. పరిస్థితులు చక్కబడి, తోటివారి గౌరవం పొందుతున్నప్పుడు, ‘దేనికోసం ఇంత శ్రమపడ్డాను! నాకు నిజంగా అవసరం అయినది ఇదేనా?’ అన్న సందేహాలు మొదలవుతాయి ఫ్రేణీకి. అక్కడితో కథ మందగించి, ఫ్రేణీ భవిష్యత్తు ఏమవుతుందో అన్నది పాఠకుల ఊహకే వదిలి పెడతారు టీవీ షోల నటి అయిన రచయిత్రి లౌరెన్ గ్రాయమ్. ఫ్రేణీ పాత్రను ఇష్టపడకుండా ఉండలేము. నవల్లో చాలా పేజీలు ఆమె ఆలోచనలు ఆక్రమించినవే. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే ఆడపిల్లలు ఎదుర్కునే అవమానాల వర్ణనలు తమాషాగా ఉన్నప్పటికీ, ప్రామాణికమైనవిగా అనిపిస్తాయి. ‘సమ్‌డే, సమ్‌డే, మేబి’ ఆశల, కలల కథ. యువత దేన్నయినా పిచ్చిగా, గాఢంగా కోరుకోవడం, తమను తాము అర్థం చేసుకోవడం గురించినది. మనం కోరుకున్నదే మనకి శ్రేయస్కరం అయి ఉండకపోవచ్చు అన్న గుర్తింపు చుట్టూ తిరిగే ఈ కథ, నటనా రంగంలోకి ప్రవేశించేవారు పడే సంఘర్షణను చిత్రిస్తుంది. నటులనూ, సినీ పరిశ్రమనీ కూడా ఎగతాళి చేసే ఇందులో పుష్కలమైన హాస్యం ఉంటుంది. సృజనాత్మక రంగాల్లో పైకి వద్దామనుకునేవారు– కలకూ, వాస్తవానికీ మధ్యనున్న రేఖ చెరిగిపోయి, వారు రంగాన్ని సరైన సమయాన వదలకుండా దాన్నే పట్టుకు వేళ్ళాడుతూ– తమకున్న శక్తినీ, వనరులనూ వెచ్చించేస్తారంటారు రచయిత్రి. గ్రాహమ్ రాసిన యీ తొలి నవలని బాలెంటైన్ బుక్స్ 2013లో ప్రచురించింది. కృష్ణ వేణి -
కన్నీళ్లు పెట్టించే ముస్లిం బతుకు వెతలు
ముస్లిం కథకులు తమ లోపల సుళ్ళు తిరుగుతున్న అనేక ఆలోచనల్ని పంచుకుంటూ మిగతా సమాజంతో చేస్తున్న వొక సంభాషణ ‘కథామినార్’. ముస్లిం జీవితాల్ని పట్టిపీడిస్తున్న అవిద్యనీ పేదరికాన్నీ అనైక్యతనీ అన్నిటికీ మించి అభద్రతనీ సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇరవై ముగ్గురు రచయితలు వినిపిస్తున్న బాధా తప్త స్వరాలివి. ముస్లింల పట్ల మెజారిటీ సమాజానికి వున్న అపోహలను తొలగించి సెన్సిటైజ్ చేయడం, సొంత మతం లోపలి అభివృద్ధి నిరోధక భావజాలాన్ని తిరస్కరించడం, మతోన్మాదుల నిజస్వరూపాల్ని బహిర్గతం చేసి దేశస్థుల మధ్య వెల్లివిరియాల్సిన మానవీయ బంధాల్ని నిర్మించడం, ప్రజాస్వామ్య లౌకిక భావజాలాన్ని బోధించడం యీ కథలకు వస్తువు. అందుకు నేపథ్యంగా గత పదిహేనేళ్ళుగా భారతీయ సమాజంలో చోటుచేసుకున్న అనేక రాజకీయ ఘటనలు, పాలకుల పాలసీలు ముస్లిం జీవితంపై చూపిన ప్రభావాల్ని రచయితలు వొడుపుగా పట్టుకున్నారు. ముంబాయి తాజ్‌పై వుగ్ర దాడి దగ్గర్నుంచీ స్థానికంగా మక్కామసీదు గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ళ దరిమిలా ముస్లిం సమాజంపై అమలయిన స్టేట్ స్పాన్సర్డ్ వయోలెన్స్, దాని కారణంగా యేర్పడ్డ అభద్రత కథల్లో చర్చకు వచ్చింది. బతుకు బండి నడపడానికి చిన్నా చితకా వృత్తిపనుల్లో తలమునకలై వున్నవాళ్ళూ తోపుడు బండ్లపై పూలూ పండ్లూ అమ్ముకొనేవాళ్ళూ మసీదుల దగ్గర చెప్పుల స్టాండ్ పెట్టుకునేవాళ్ళూ పొట్టకూటి కోసం అడ్డాలమీది కూలీలు హోటల్ సర్వర్లు మోటర్ మెకానిక్కులు ... యీ కథల్ని నడుపుతారు. అప్పో సప్పో చేసి పండగ రోజున యింటిల్లి్లపాదికీ బట్టలు కుట్టించి తాను మాత్రం పాతబట్టలే ధరించే సత్తార్లు(శశిశ్రీ), కుటుంబ పోషణకోసం యింట్లో బయటా పని చేసి గంధపు చెక్కల్లా అరిగిపోయే అమ్మలూ (అక్కంపేట ఇబ్రహీం), మతోన్మాద తోడేళ్ళ మూకుమ్మడి దాడుల్లో బలయ్యే బుజ్జిమేక పిల్లలూ(డానీ), ఆధిక్యభావనతో మతం పేర్న అవమానించేవాళ్ళలో మానవత్వానికి పురుడుపోసే బూబవ్వలూ (జి బాషా), పేదరికంలో తల్లిదండ్రుల ద్వారానే అరబ్బులకు అమ్ముడుపోయే చిన్నారి తబస్సుంలూ (రెహానా), కరువు ప్రాంతాల్లో రోజూ నీళ్లు మోసే ఘోష నుంచి తప్పించుకోడానికి గోషా జీవితాన్ని కోరుకునే చాందినీలు (షరీఫ్), సరైన ఉపాధి లేక అసాంఘిక శక్తుల చేతిలో పావుగా మారే సలీంలు(అమర్ అహ్మద్) కన్నీళ్లు పెట్టిస్తారు. రాజ్యహింస తండ్రి ప్రేమను హరిస్తే జ్వర పీడితుడైన ముస్తాక్ (ఖదీర్) మాత్రం మొత్తం ముస్లిం సమాజాన్ని జ్వరగ్రస్తం చేస్తున్న కారణాల పట్ల అప్రమత్తం చేస్తాడు. ద్వేషించే మనుషుల మధ్య ప్రేమని పంచే మిస్బా (వాహెద్) కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. గుజరాత్ గాయం తర్వాత వెలువడ్డ వతన్ (సంపా. స్కైబాబా)కి కొనసాగింపుగా వచ్చిన సమకాలీన ముస్లిం నేపథ్య కథలు (2005–2018) యివి. ఇవి కంప్లైంట్ చేయవు. ద్వేషాన్ని పెంచవు. కావడానికి స్థల కాల నిర్దిష్టతలోంచి వచ్చినవే అయినప్పటికీ స్థల కాలాలతో ప్రమేయం లేని బతుకు వెతలే. స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పెనుగులాడుతోన్న బాధిత సమూహాల వేదనే అడుగడుగునా కనిపిస్తుంది. ఎ.కె.ప్రభాకర్ -
ఎలుకలొస్తున్నాయ్! జాగ్రత్త!
నేను మర్చిపోలేనంతగా మనస్సులో నిలిచిపోయిన పుస్తకం ‘ఎలుకలొస్తున్నాయ్! జాగ్రత్త’. రచయిత ఎన్.ఆర్.నంది. కథావస్తువును ఎన్నుకోవటంలో గానీ, శైలిలో గానీ, ఇది ఎంతో ఉన్నత ప్రమాణాలతో ఉండటం చేత పాఠకులకు ఈ నవల ఆసక్తిని కలిగిస్తుంది. తెలుగు సాహితీ జగత్తులో ఇదో కొత్త ప్రయోగం అని చెప్పవచ్చు. కథ విషయానికి వస్తే... ఒక లైబ్రరీలో కాపురం ఉండే ఎలుకల జంట ఈ నవల్లోని ముఖ్య పాత్రలు. మగ ఎలుక పేరు మూషిక రాజు (హీరో). ఇది మనుషుల్లాగా మాట్లాడగలదు. లైబ్రరీలోని ఎన్నో పుస్తకాల రుచి (తిని) చూసి ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తుంది. అదే క్రమంలో తన భార్య మూషిక రాణికి లోకం పోకడ వివరిస్తుంది. మానవ సమాజంలోని కుళ్లును, అవినీతిని చూపిస్తుంది. దీని ప్రభావంతో మూషిక రాణి కూడా పుస్తకాల రుచి చూసి, రచనలు చేయటం, మనుషుల్లా మాట్లాడటం అనే దశకు ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో లైబ్రేరియన్, మూషిక రాణి రచనకు వచ్చినటువంటి పారితోషికాన్ని కొట్టేయడం, తిరిగి మూషిక రాణి తను ఆ డబ్బును కొట్టేయడం వల్ల పోలీసులు మూషిక రాణిపై దొంగతనం నేరం మోపడం, మూషిక రాణి మాట్లాడుతుంటే ప్రజలు భయపడటం, ప్రభుత్వం మాట్లాడే ఎలుకను, మూషిక రాణిని, మానవ సమాజ ఉద్ధరణ నిమిత్తం ప్రయోగం కోసం ఎన్నుకోవడం, మూషిక రాజు దీనికి ప్రతిఘటించడం, ఒక లాయరు ఈ ఎలుకల తరుపున న్యాయం కోసం కోర్టులో వాదించడం, మూషిక రాజు, ప్రభుత్వ లాయర్లతో ఎన్నో విషయాలపై మేధావుల స్థాయిలో వాదించడం ఈ నవలకే హైలైట్. చివరకు నవల ముగింపు కూడా ఆలోచింపజేస్తుంది. ఈ నవల్లోని ఎలుకలు, అణగదొక్కబడుతున్న వర్గాలకు ప్రతీక! మానవులు తమ స్వార్థం కొరకు ఏ విషయాన్నైనా తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారో రచయిత కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ నవల చదివిన తరువాత, మన స్వార్థానికి బలయ్యే ప్రతి ఒక్క జీవిపైన సానుభూతి కలుగక మానదు. మామిడి మహేంద్ర -
నా కన్నీళ్ళే నా సాహిత్యం..!
ఎస్.కె. యూనివర్సిటీ తెలుగు విభాగంలో 1983–85 మధ్య పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు. వీరిలో నాకు అత్యంత ఇష్టమైన వాళ్లలో ఒకరు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మరొకరు కొలకలూరి ఇనాక్ సార్లు. రచనా పథంలో ఇద్దరివీ రెండు వేర్వేరు దార్లు. కానీ వీరిద్దరూ సమాజ రచయితలు. అభ్యుదయ రహదార్లు. మా ఇనాక్సారు మాట్లాడుతుంటే ఆధునిక వచన కావ్యాన్ని వింటున్నట్లుగా ఉండేది. ఆయన వచనం అద్భుతం. ఆయన రాసినా, మాట్లాడినా, చదివినా ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఆయన పాఠం చెబుతున్నప్పుడు ధారాళంగా వచనాన్ని ప్రయోగించి పిల్లల్ని సమ్మోహనులుగా చేసేవారు. ‘మునివాహనుడు’ అన్న నాటకం దగ్గర్నుంచి ‘ఊరబావి’ క«థల వరకు ఆయన రచనలు జీవితం నుంచి వచ్చినవి. అట్టడుగు కులాలపై, అందునా కింది కులాలైన మాల, మాదిగల పట్ల అగ్రవర్ణ దురహంకారాలు, అంటరానితనాలు, అవమానాలు, ఆధిపత్యాలు, వెలివేతల నుంచి, వెలివాడల నుంచి నడుచుకుంటూ తెలుగు సాహిత్య విశ్వపీఠం మీదకు వచ్చారు. అట్టడుగు వర్గాల జీవితం ఎన్ని బాధలు పెడు తుందో ఆ బాధలన్నింటిని అనుభవించి కొలకలూరి ఒక క«థగా, కవి తగా, పద్యంగా, పాటగా, నాటకంగా రచనలయ్యారు. అగ్రవర్ణ ఆధిపత్యంపై కొలకలూరి ఎక్కుపెట్టిన సాహిత్య మహాస్త్రమే ‘ఊరబావి’. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా ఎంతో కాలం పనిచేశారు. తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటివి ఎన్నో అవార్డులు పొందారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత బహుజన ప్రతిఘటనకు సంబంధించిన తొలి సాహిత్య ఆనవాళ్లు ఇనాక్ సాహిత్యంలో ఉన్నాయి. అప్పటి వరకు వచ్చిన సాహిత్యంలో దళిత జీవిత చిత్రణ మాత్రమే చేశారు. ‘ఊరబావి’ కథలో దళిత ప్రతిఘటనను చెప్పిన తొలిదళిత సాహితీవేత్త ఇనాక్. ‘ఊరబావి’ క«థలన్నీ ప్రతిఘటనా ప్రతి రూపాలుగా నిలుస్తాయి. ఆ ప్రతిఘటనాస్వరాన్ని తర్వాత దళిత సాహిత్యం అందిపుచ్చుకుంది. ఇనాక్ 1954లో ‘ఉత్తరం’ అన్న దళిత కథతో రచనా రంగంలోకి ప్రవేశించారు. 1969లో ‘ఊరబావి’ క«థలు రాశారు. ‘నా కన్నీళ్లే నా సాహిత్యం’ అని చెప్పుకున్న ఇనాక్ ‘ఈ సమాజం భయం పునాదిపై నిర్మించబడింది. దీన్ని కూల్చివేసి భయంలేని సమాజాన్ని నిర్మించుకోవాలి’ అని చెబుతారు. ఇప్పటికి ఇనాక్ 96 పుస్తకాలు, 300 క«థలు రాశారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, ముస్లిం మైనార్టీలు, సమాజంలో సగభాగమైన మహిళల చుట్టూతా ఇనాక్ రచనలు నిండి ఉంటాయి. ఈయన రచనల్లో ఆధిపత్య శక్తులపై నేరుగా దాడులు చేసినట్లుగా ఉండదు. బహుజనుల విజయం కోరతాడు. వీళ్లు గెలవాలంటారు. ఇనాక్ ఏ రచనలో కూడా పీడిత వర్గాలు ఓడిపోవటం చెప్పడు. దళిత, బహుజన, గిరిజన, మైనార్టీలు ఓటమిలో కూడా తలెత్తుకొని తిరుగగలిగే ధైర్యాన్నిస్తూ సాహిత్యసృష్టి చేశారు. 64 ఏళ్ల క్రితం తొలికథ ‘ఉత్తరం’లో ఇనాక్ కన్నీళ్లతో సమాజాన్ని చూశారు. ఇపుడు ఆ కన్నీళ్లు ఆరి పోయి చూసే క్రొత్త సమాజం రాబోతుంది. ఇపుడు దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ, మహిళా సాహిత్యంలో ఒక్క ఇనాక్ లేడు. వందల మంది ఇనాక్లున్నారు. ఇది పెద్దమార్పు. ఇనాక్ ఆధునిక ఆది దళిత బహుజన ప్రతిఘటనా స్వరం. ఆయన బహుజన పక్షంవైపు స్పష్టంగా నిలబడి సాహిత్య విమర్శచేశారు. కథలు రాశారు. కవిత్వం రాశారు. తన కన్నీళ్లనే తన కావ్యాలుగా ఆవిష్కరించిన దళిత బహుజన సాహిత్యశిఖరం కొలకలూరి ఇనాక్. ఇనాక్సారూ, నువ్వు నూరేళ్లూ జీవించూ.. (కొలకలూరి ఇనాక్ 80వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో ఈ నెల 6 నుంచి 12 వరకు రోజూ సాయంత్రం 6 గంటలకు సాహితీ సప్తాహం సందర్భంగా) జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ‘ 94401 69896 -
నా పేరు ప్రతిష్టలు వాళ్లు చూడలేదు!
కథ పేరు, నా పేరు మళ్ళీ మళ్ళీ చూసుకుని ముద్దుపెట్టుకున్నాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదు.. తర్వాత తీసుకెళ్ళి నా పుస్తకాల అరలో పుస్తకాల మధ్య ఉన్న సరస్వతీదేవి ఫొటో దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను. ఆ ఫొటో మా అమ్మ పూజ పీఠం దగ్గర అన్ని దేవుళ్ళతో కలిసి ఉండేది. నేను 6వ తరగతి చదివేటప్పుడు తీసుకొచ్చి నా పుస్తకాల దగ్గర పెట్టుకున్నాను. రోజూ దొడ్లో విరబూసిన గరుడవర్ధనం, వాటి మధ్య ఎర్రటి కాశీరత్నం పూలు కలిపి దండ అందంగా గుచ్చి ఫొటోకి వేసు కునేదాన్ని. కథ పడిందన్న ఆనందంతో నా పాదాలు గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. నాకు ఇంగ్లీష్ వ్రాయటం, చదవటం బాగా వచ్చు! నాన్న నన్ను చూసి ముచ్చట పడేవారు! లైబ్రరీ నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చి చదు వుకోమని ప్రోత్సహించేవారు.. నాన్న, అన్నయ్యలు నన్ను గారాబంగా చూడటంవల్ల ఇంట్లో కుటుంబసభ్యులు అందరు అభిమానంగా చూసే వారు.. ఇప్పుడు ఈ ఆంధ్రపత్రికలో ఈ కథ పడటంతో ఇంట్లో నాకు మరీ ప్రత్యేకత వచ్చింది. నా విలువ బాగా పెరిగి పోయింది. నేను కుటుంబసభ్యుల మధ్య స్టార్‌ని అయిపోయాను. ఈ ఉత్సాహంలో ఇంకో కథ వ్రాయాలని ఆలోచించసాగాను. మా రంగం అక్కయ్య ‘‘నాకు నువ్వేమీ అప్పు తీర్చ క్కర్లేదు. నన్ను గుర్తుపెట్టుకో’’ అంది. అసలు కథ వ్రాయటమే అపురూపం. అది ప్రచురణ అవ్వడం ఇంకో అదృష్టం. దానికి తోడు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉన్న నన్ను వెతుక్కుంటూ 15 రూపాయలు మనీ ఆర్డర్ రావటం ఇంకా అద్భుతం, ఇలా నా జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరిగిపోయింది... ఆ రోజు మధ్యాహ్నం నాన్న భోజనం చేసి నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోతుంటే ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉండాల్సిందే. చిన్న చప్పుడు చేయకూడదు. మాటలు కూడా మేము రహస్యంగా మాటా డుకునేవాళ్ళం. నేను కూడా పడుకున్నాను. ఇంతలో వాకిట్లోంచి బిగ్గరగా ‘‘ఈ ఇంట్లో యద్దనపూడి సులోచనారాణి ఎవరండీ?’’ అని పోస్ట్‌మ్యాన్ అరవటం వినిపించింది. ఎవ్వరం పట్టించుకోలేదు. అతను మళ్ళీ బిగ్గ రగా కేక పెట్టాడు. అందరూ లేచారు. సత్యం సడెన్‌గా నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. ‘‘పిన్నీ నువ్వే నువ్వే! తొందరగా రా!!’’ అని నా చేయిపట్టి లాగాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది. అది నా పేరే! రెండేళ్ళ క్రింద పెళ్ళైంది కాబట్టి నా ఇంటి పేరు ముందు యద్దనపూడి అని వచ్చింది. వరండాలో ఉన్న పోస్ట్‌మ్యాన్ దగ్గరికి పరిగెత్తాము. సత్యం : ‘‘ఇదిగో మా పిన్ని!’’ పోస్ట్‌మ్యాన్ నమ్మలేదు.. ‘‘ఈ అమ్మాయిగారా?’’ అన్నాడు. ‘‘అవును నేనే. నాకేదైనా ఉత్తరం ఉందా?’’ అని అడిగాను. ‘‘అమ్మాయిగారూ, మీకు మనీఆర్డర్ ఉందండి!’’ అన్నాడు. సత్యం, నేను అయోమయంగా మొహాలు చూస్కున్నాం.. ‘‘ఎక్కడిది, ఎంత డబ్బు?’’ వాడు ఆత్రంగా అడిగాడు.. ‘‘ఆంధ్రపత్రిక నుంచి.. 15 రూపాయలు అమ్మాయిగారూ!’’ అన్నాడు పోస్ట్‌మ్యాన్. ‘‘ఇదిగోండి, ఇక్కడ సంతకం పెట్టండి!’’ అని ఫారం ఇచ్చాడు. వేలుతో చూపించాడు.. ‘‘యద్దనపూడి సులోచనారాణి’’ అని చేసిన నా తొలి సంతకం అది! ఇంతలో అందరూ అక్కడికి వచ్చారు! ఆ డబ్బు తీస్కుంటుంటే నా కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలు అయినాయి. అది ఆనందమో, ఆశ్చ ర్యమో, లేక మరో అద్భుతమో లేక ఈ మూడూ కలిసిన భావమో నాకు ఏమీ తెలియటం లేదు. ఇంతలో నాన్న వచ్చారు. ‘‘ఏంటి గొడవ?’’ ‘‘పిన్ని వ్రాసిన కథకి మనీఆర్డర్ వచ్చింది’’ అని అన్నాడు సత్యం. ‘‘15 రూపాయలు!’’ అన్నాడు రాముడు. ‘‘అమ్మాయిగారూ మీ కథకు 15 రూపాయలు తెచ్చాను. నాకు కాఫీ తాగటానికి ఇవ్వాలి’’ అన్నాడు పోస్ట్‌మ్యాన్. నాన్నకి నేనిచ్చిన నా మొదటి సంపాదన పంచెలు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం నాన్న పోయారు. నేను రచయిత్రిగా ఎదిగిన తర్వాత వేలు, లక్షలు సంపాదించాను. కానీ నా తల్లిదండ్రులు నా పేరు ప్రతిష్ఠలు చూడలేదు. వారికి నేనేమీ ఇవ్వలేకపోయాను. ఈ బాధ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. నాన్న జేబులోంచి తీసి చిల్లర అతని చేతిలో పెట్టారు. నేను నాన్న చేతికి 15 రూపాయలు ఇచ్చేసాను.. నాన్న డబ్బు తీసుకోలేదు. నన్ను దగ్గరికి తీసుకున్నారు. ‘‘నువ్వు ఏదైనా కొనుక్కో’’ అంటూ ప్రేమతో తలమీద నిమిరారు. ఇంతలో కరణం గారూ! అంటూ రైతులు వస్తే నాన్న వెళ్ళిపోయారు. మా రంగం అక్కయ్య ‘‘నాకు నువ్వేమీ అప్పు తీర్చ క్కర్లేదు. నన్ను గుర్తుపెట్టుకో’’ అంది. అసలు కథ వ్రాయటమే అపురూపం. అది ప్రచు రణ అవ్వడం ఇంకో అదృష్టం. దానికి తోడు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉన్న నన్ను వెతుక్కుంటూ 15 రూపాయలు మనీఆర్డర్ రావటం ఇంకా అద్భుతం, ఇలా నా జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరిగిపోయి, ఇంట్లో వారంతా నన్ను అదృష్టవంతురాలని మెచ్చుకునేలా చేసినాయి. మర్నాడు నేను రాముడు, సత్యంతో కలిసి కమలత్తయ్య మొగుడు రాజు మావయ్య దగ్గరికి వెళ్ళి, నాన్నకి 15 రూపాయలతో జరీపంచెలు తెమ్మని చెప్పాను. ఎవ్వరికీ చెప్పొద్దన్నాను. మామయ్య పంచెలు తెచ్చారు. నేను నాన్నకి అవిచ్చి ఒంగి కాళ్ళకి నమస్కారం చేసాను. ‘‘నాకెందుకమ్మా?’’ అన్నారు. నాన్న అవి కట్టుకుని పొలం వెళుతూ కమలత్తయ్య దగ్గరికి వెళ్ళి, ‘‘పాప తన సంపాదనతో ఈ జరీ పంచెలు కొనిం’’దని మురి పెంగా చెప్పారని అత్తయ్య మర్నాడు వచ్చి నాకు చెప్పింది. నాకు సంతోషం వచ్చేసింది. ఆ తర్వాత నేను వేలు, లక్షలు సంపాదించాను. నాన్నకి నేనిచ్చిన నా మొదటి సంపాదన పంచెలు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం నాన్న పోయారు. నేను రచయిత్రిగా ఎదిగిన తర్వాత వేలు, లక్షలు సంపాదించాను. కానీ నా తల్లిదండ్రులు నా పేరు ప్రతిష్ఠలు చూడలేదు. వారికి నేనేమీ ఇవ్వలేకపోయాను. ఈ బాధ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. – యద్దనపూడి సులోచనారాణి (సమాప్తం) తెలుగు నవలా రారాణి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గురించి కాసేపు మాట్లాడుకుందాం... వేదిక : ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్ సమయం : నేటి సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయితలు, కవులు, అభిమానులు పాల్గొంటారు. -
రాతి హృదయం
ప్రేమ ప్రేమ అమ్మ పాల వంటిది అది ఒక చైతన్యధార! దానికి మతం, కులం, ఇజం అనేవి ఏవీ లేవు, ఈ మానవాళికి అది ఒక అమృతధార స్త్రీ ఒక ప్రేమ దాసి! ఆమె పుట్టినప్పటి నుంచి తల్లిలో, తండ్రిలో, అక్కచెల్లెళ్ళలో, అన్నదమ్ముల్లో, ఇరుగుపొరుగులో, పెళ్ళి అయిన తరవాత భర్తలో, పిల్లల్లో, అత్తమామల్లో, దేవుడిలో, ప్రేమను వెతుక్కుంటూ వుంటుంది.. యుగయుగాలనుంచి, ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా ఆమె కోరుకున్న ప్రేమ తనకి లభించినట్టు చెప్పలేక పోతూంది... దీనికి కారణం ఏమిటి? మనుషులా? కాలమా? రాతి హృదయం నేను హైదరాబాదులో దుర్గం చెరువు దగ్గర ఉన్న ఒక పెద్ద బండ రాయిని. నా వయసు నాకే తెలీదు. సృష్టిలో విస్ఫోటం జరిగి ఈ భూమి ఏర్పడినప్పుడు ఏర్పడిన శిలాకుటుంబం మాది. మా వయసు వేల సంవత్సరాలు. మొదట్లో గరుకుగా, మోటుగా ఉన్న మా కుటుంబం, ఈ ప్రకృతి మమ్మల్ని అదే పనిగా తోమటంతో ఇలా నున్నగా, నిగనిగలాడుతూ, అప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి ఒచ్చిన సొగసైన అమ్మాయి ముఖంలా మెరుస్తున్నాం అనేవారు మా పెద్దవాళ్ళు. మాది కఠినకాయం. చెరువు చుట్టూ చిన్నా–పెద్దా, తాత–ముత్తాతలైన పెద్ద పెద్ద రాళ్ళతో మా కుటుంబం ఉండేది. హైదరాబాదుకి వయసు వచ్చి, మమ్మల్ని నమిలి మింగేయసాగింది. మా పూర్వీకులు చాలా మంది నశించిపోయారు. నాది భారీకాయం. ఎండ వచ్చినా, వెన్నెల వచ్చినా, నా నీడ 300 గజాలు పైగా వ్యాపిస్తుంది. ఈ ప్రపంచంలోకల్లా, నాకు చాలా ఇష్టమైనది నా నీడ. నా నీడలో, పగలు మేకలు, కుక్కలు వచ్చి పడుకుని సేదతీరుతాయి, అప్పుడప్పుడు మేకలు ప్రసవించడం కూడా జరుగుతుంది. మేకలు కాసే పిల్లవాడు, నన్ను ఆనుకొని కూర్చొని పిల్లనగ్రోవి వాయిస్తుంటే, నాకు పరవశం కలుగుతుంది. ఇంతకంటే నాకు కనువిందైన దృశ్యాలు ఎన్నో! సాయంత్రం వేళ, వెన్నెల రాత్రులలో, ప్రేమికులైన యువతీయువకులు వచ్చి నా నీడ క్రింద కూర్చొని, అరమరికలు లేకుండా సరసాలు ఆడుకుంటూ, ముద్దుముద్దుగా ప్రవర్తిస్తుంటే నాకు చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉండేది. నిజం చెప్పొద్దూ? ఒక్కోసారి వారి చేష్టలు చూడలేక, కళ్ళు మూసుకునేదాన్ని. కొంతమంది వాళ్ళ తీపి గుర్తుగా నా భారీకాయంలో కొంతభాగంలో వాళ్ళ ప్రేమికులని నిలబెట్టి ఫోటోలను తీసుకునేవారు, నా మీద వారి గుర్తుగా పిచ్చి పిచ్చి రాతలు రాసేవారు. నేను ఇవన్నీ వర్ణించి వర్ణించి చెప్తుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నిట్టూర్చేది. ‘‘రాతి మిత్రమా! నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. నా సంగతి చూడు. ఒకప్పుడు వాన నీళ్ళతో కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండేదాన్ని ఇప్పుడు మనుషుల, పశువుల మలమూత్రాలు నాలోనే ఒంపేస్తున్నారు. వ్యాఖ్..! ఒక్కరూ నన్ను ప్రేమగా చూడటం లేదు. ఏం చెప్పను? జన్మ ఎత్తగానే సరిపోతుందా? మంచిగా బ్రతుకు వెళ్ళదీసే మహా అదృష్టం కూడా ఉండాలి.’’ నేను గర్వంగా ఫీల్ అయ్యాను, నేనెంత బలశాలినో గుర్తుచేసుకొని చెరువుని చిన్న చూపు చూసాను. రోజులు గడుస్తున్నాయి, నాకు చాలా ఉత్సాహం పెరిగిపోయింది. ఒకసారి చెరువుతో అన్నాను.. ‘మనమిద్దరం ప్రేమించుకుందామా! పెళ్లి చేసుకుందామా?’ చెరువు నా మాటలకి సిగ్గుపడుతూ ‘‘అంత అదృష్టమా?’’అంటుంది అనుకున్నాను. కానీ బ్రహ్మరాక్షసిలా విరుచుకుపడింది. ఆవేశంతో ఊగిపోయింది. ‘‘బండ వెధవా! ఇన్నాళ్లు ఇరుగు పొరుగుగా ఉన్నామని అరమరికలు లేకుండా మాట్లాడాను. దుర్మార్గుడా! నీ కుటుంబం నాశనం అవుతుంది. దున్నపోతా! నీ మంచితనం అంతా నటనన్నమాట! నీచుడా! నీ తల నిలువునా పగిలిపోనూ! నీదేం జాతి, నాదేం జాతి? కాస్త రంధ్రం దొరికితే మైళ్ళ దూరం పరిగెత్తిపోయే జాతి నాది. కూర్చున్నచోటి నుండి కదలలేని వెధవ్వి నువ్వు! ఖబడ్దార్! కన్నెత్తి చూసావో?’’ అని దులపరించింది. ఆమె అరుపులకి, నా మీదకి విరుచుకుపడిపోతున్న దురుసుతనానికి బిత్తరపోయాను. నా తల మీద విందు చేసుకుంటున్న కాకులు ఆమె అరుపులకి కావ్! కావ్! అని అరుస్తూ ఎగిరిపోయాయి. నేను తల దించుకున్నాను. సిగ్గుపడ్డాను. కొంతమందికి కొన్ని అర్హతలు ఉండవు. అంతే! భగవంతుడు కొంతమంది జీవితాలు శూన్యం చేసి, ఎదురుగా అందమైన ప్రపంచం, చైతన్యం, చూపించి ఏడిపిస్తాడు. నా హృదయం క్రుంగిపోయింది. మనకి ఇష్టం కదా అని, ఎదుటివారి మనసు తెలుసుకోకుండా మాట్లాడితే, అవి ప్రేమవాక్యాలు కాదు, పిచ్చి ప్రేలాపనలు అవుతాయని తెలుసుకున్నాను. ప్రేమ ఒక రోజు నా ఖర్మ కాలింది. ఎవరో డైనమైట్ పెట్టి... ఒకటి కాదు!! రెండు కాదు!! 20 డైనమైట్లు పెట్టి నన్ను నిలువునా పేల్చేసారు. నా శరీరం పేలిపోయింది. సగం శరీరం తునాతునకలైంది. మిగతా సగం శరీరం ఆపిల్ పండుని సగానికి కోసినట్టు, మొండి శరీరం సగం ముక్కగా ఉండి పోయింది. ముష్కరులు అయిన ఈ దుష్టమానవ మూక ఇలా వచ్చి మా వంశం అంతా నాశనం చేసింది.. ఉన్నవాళ్ళలో అర్ధశరీరంతో ఉన్న నేనే పెద్ద దిక్కుని. నా వంశం అంతా కూలిన బురుజులా ఉన్నాయి. వాళ్ళను చితకపొడిచి క్రేన్లతో బుట్టలతో ఎత్తి పడేసి, బర్రున శబ్దం చేస్తూ ట్రక్కులు తీసుకుపోతుంటే నేను వల.. వల.. ఏడ్చాను. ఎంత గొప్ప కుటుంబం నాది! వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం చేస్తున్నాం.. ఈ ముష్కరులైన మానవులు మా మీద పడి మా వునికినే నాశనం చేస్తున్నారు.. మా జాతిని కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇంత చరిత్ర చూసిన పెద్ద మనిషిని కదా! సగర్వంగా చెప్పుకొని చూపించుకునేది పోయి, నన్ను సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నేను కాలానికే గుర్తుని. ఇలా అయితే హైదరాబాదు బాల్డ్ హెడ్ అవుతుంది.. ముష్కరమానవులకి దేని మీదా ప్రేమ లేదు! ప్రాచీనమైన వాళ్ళ భాషనే నాశనం చేసుకుంటున్నారు.. సాంస్కృతిక వారసత్వం అయిన అన్ని కట్టడాలనీ మింగేస్తున్నారు.. ఆధునికత అనే భ్రమశాలి గుండులో పడ్డ ఈగలా మతిపోయినట్టు ఉన్నారు. ఇలా అయితే ఏముంటుంది చరిత్ర? ఏడుపొస్తోంది నాకు. నా శరీరం చూడండి. బలశాలిలా, సూర్యకాంతిలో, చంద్రకాంతిలో నిగనిగ లాడుతూ ప్రేమికులు, మేకలు, కుక్కలు, పిల్లనగ్రోవి వాయించేవాడు నీడ కోసం నా దగ్గరికి రావటం నాకు ఎంత సంతోషమో.. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోతుంటే రెట్టింపు బాధ వేస్తోంది. ఇప్పుడు నా దగ్గరికి ఎవ్వరూ రారు. నేనెప్పుడు ఎవరి మీద పడిపోతానో అని వారికి భయం! ఈ బాధ నేను వెళ్ళబోసుకుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నన్ను చూసి ముసిముసి నవ్వు నవ్వింది.. నా బాధ ఇంకా రెట్టింపు అయింది.. ఓ ముష్కరమానవుడా! మేము ప్రకృతి ప్రసాదించిన జీవితంతో ప్రశాంతంగా.. అమాయకంగా.. మా బతుకులు మేము బతుకుతున్నాం.. మమ్మల్ని మీరు ఇలా మూకుమ్మడిగా మా కుటుంబాలని నామరూపం లేకుండా ఎందుకు నాశనం చేస్తున్నారు? ‘‘అడుగో! అడుగో! వస్తున్నాడు! వచ్చేస్తున్నాడు డైనమైట్ల రాక్షసుడు! వాడి చేతిలో బ్యాగ్ చూసాను.. నా గుండె ఝల్లు మంది. నాకు తెలుసు! నాకు ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి. నేను ఏడుస్తున్నాను..! బిగ్గరగా ఏడుస్తున్నాను..! దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాను.. నా ఏడుపు మీ చెవులకి వినిపిస్తోందా? వినిపిస్తోందా? వినిపిస్తోందా? మా ఊరి గురించి కొన్ని వాక్యాలు... అందరూ మా ఊరి గురించి అడుగుతున్నారు.. మా ఊరు అప్పట్లా లేదు. చాలా మారిపోయింది. మట్టి రోడ్లు పోయి. కంకర రోడ్లు వచ్చాయి. కాలవలో పడవలు పోయి. రోడ్ల మీదికి బస్సులు వచ్చాయి.. ఇంటింటికి కారు.. ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్. నా చిన్నప్పుడు సాయంత్రం అవగానే.. పంచాయితీ నౌకరు ఒచ్చి. ప్రతి వీథిలో ఉన్న దీపస్తంభాలని నిచ్చెనతో ఎక్కి, అందులో దీపం వెలిగించేవాడు. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉండేది నాకు. ఇప్పుడు ఊరంతా. ఇళ్ళంతా కరెంటు లైట్లు. ఏసీలూ, షవర్లూ వచ్చాయి. గుడి పడగొట్టేసి చాలా అందమైన పెద్ద గుడి కట్టారు. లైబ్రరీ పడగొట్టేస్తున్నారు. పొద్దున లేవగానే సన్నటి శబ్దాలు చేసే పిచుకలు ఎప్పుడో అంతరించిపోయాయి. కాకుల గోల తగ్గింది. ఒకటో అరో రామచిలుకలు ఎగురుతున్నాయి. గడ్డి. మట్టి. వాసన పోయింది. చెరువు మెట్లు పాడుబడ్డాయి. చెరువు కళ లేకుండా పోయింది. ఊరిని నూతనతరానికి యౌవనవంతం చేయాలని ప్రజలు చాలా కృషి చేస్తున్నారు. మరికొన్ని మ్యూజింగ్స్ రేపటి సంచికలో... -
ఒక రాణి
అనగనగా ఒక రాణిఅనగనగా ఒక నవలఅనగనగా ఒక రాజ్యం.సులోచన.. నవలా రాణి నవలా రాజ్యంలో రాణించిన రాణినవలా ప్రియుల హృదయాలను ఏలిన రాణిఒకే ఒక రాణి. యద్దనపూడి సులోచనా రాణి! కథ ఎలా చెప్పాలో తెలిసిన రచయిత్రి తెలుగు సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు పాపులర్ రచయితలంటే కించిత్ అసహనం, చాలా అవహేళన. కనక వారి రాతల్లో యద్దనపూడి సులోచనారాణికి స్థానం ఉండకపోవచ్చు. సదసద్వివేచన చేయగల కొందరు విమర్శకులు, సజీవమైన పాత్రలను సృష్టించినందుకు, తెలివైన, స్వయం నిర్ణాయక శక్తిగల స్త్రీపాత్రలను సృష్టించినందుకు, పురుషులలో పుణ్యపురుషులను చిత్రించినందుకూ, ఒక నవలలో కథ ఎలా చెప్పాలో చూపించినందుకు, తెలుగుభాషను ఎంత సొగసుగా వాడవచ్చో నేర్పినందుకు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. మహిళా పాఠకులను పెంచిన రచయిత్రిగా, ఎన్నిసార్లు ప్రచురింపబడ్డా క్షణాల్లో అమ్ముడుపోయే నవలల రచయిత్రిగా ప్రచురణకర్తలు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా తమకు తరాల తరబడి ఆనందాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగించడంతో పాటు, తమలాంటి వ్యక్తులు ఎలా ఉండవచ్చో చూపినందుకు పాఠకులు ఆమెను కలకాలం గుర్తుంచుకుంటారు. సులోచనారాణి నవలల్లో ఆమె చుట్టూ ఉన్న సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాలుంటాయి. వాటిలోంచి, మట్టిలో మాణిక్యాల్లా నాయికా నాయకులు స్వంత వ్యక్తిత్వంతో ప్రకాశిస్తూంటారు. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండేందుకు కొంత స్నేహం, కొంత అవగాహన, కొంత ప్రేమ, కొంత గౌరవం ఉంటే చాలని నిరూపించే పాత్రలివి. అది కూడా మన జీవితాల్లో లేనందువల్లనేమో అవి స్వాప్నిక పాత్రల్లా, ఆమె కథలు భావకవుల కోవలో ఆకాశంలో విహరించేవిగా చాలామందికి తోచాయి. ఆమె పూర్తిగా నేలవిడిచి సాము ఎప్పుడూ చెయ్యలేదు. ఆ మాటకొస్తే అడవి బాపిరాజు, కోడూరి కౌసల్యాదేవి వంటి వారి నవలలతో పోల్చినపుడు వాస్తవికతకు ఆమె పాత్రలు ఎంత సన్నిహితంగా ఉంటాయో అర్థమవుతుంది. రచనా విధానానికి వస్తే, అందులో ఆమెతో పోటీ పడగలవాళ్లు అతి తక్కువ. కథనంలోనూ, సంభాషణలోనూ, ఉత్కంఠ రేకెత్తించడంలోనూ, కథను ముగించడంలోనూ ఆమెది అసాధారణ ప్రతిభ. ఆమె నవలలు సీరియల్స్‌గా వస్తున్నప్పుడు ఎక్కడ పూర్తవుతాయో అని వ్యాపార దృష్టితో సంపాదకులు, రచనాసక్తి దృష్టితో పాఠకులు బెంగపెట్టుకునేవారు. అంత పఠనీయత ఉన్న రచన ఆమెది. ఇక వ్యక్తిగా సులోచనారాణికి నేనెరిగిన ఏ సాహితీవేత్తా సాటిరారు (నాకు చాలామంది సాహితీవేత్తలు వ్యక్తిగతంగా కూడా తెలుసు). తనొక గొప్ప రచయిత్రిననీ, ఆంధ్ర పాఠకుల హృదయరాణిననీ ఆమెకు స్పృహ ఉన్నట్టే అనిపించేది కాదు. తోటి రచయితల గురించి ఒక్క పరుష వాక్కూ ఆమె పెదవులపై ఏనాడూ కదలలేదు. తన అభిమానుల పట్ల చులకన గానీ, విసుగు గానీ ఏనాడూ కనిపించలేదు. రెండు గంటలు సంభాషణ జరిపినా తన రచనల గురించి, తనకున్న కీర్తి ప్రతిష్టల గురించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడకపోవడం నాకు అనుభవం. మనం ప్రస్తావిస్తే తప్ప తన గురించి తాను చెప్పుకునే అలవాటు లేదు. అప్పుడు కూడా చాలా తక్కువ విషయాలే చెప్పేవారు. ఈనాటి రచయితలు ఆమెను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మంచి రచయితకు ఆత్మస్తుతి, పరనింద అవసరం లేదనీ, ప్రతి వాక్యం ముందూ ఎవరేమనుకుంటారో భయపడాల్సిన దుస్థితి లేదనీ, రాసిన ప్రతి అక్షరానికీ తక్షణ స్పందనలూ, మెప్పుదలలూ, అవార్డులూ ఆశించనవసరం లేదనీ, తమకొక ముఠా ఏర్పరచుకుని వాళ్ల కోసమే రాయాల్సిన పని లేదనీ... ఇవన్నీ ఆమెను చూసి నేర్చుకోవచ్చు. తన అనంతరం కూడా మనం చదువుకుందుకు, దాచుకుందుకు, మళ్లీ మళ్లీ చదువుకుని ఆనందించేందుకు కావలసినన్ని నవలలు మనకు వదిలి, ఎప్పుడూ ప్రశాంతతను కోరుకునే ఆ మనసు ఈనాడు శాశ్వత ప్రశాంతిలోకి జారిపోయి విశ్రమిస్తున్నందుకు ఒక రకంగా ఆనందిస్తూ, మా ఇద్దరి మధ్యా ఎన్ని రకాల వ్యత్యాసాలున్నా, గత పదిహేనేళ్లుగా నాకు ఎంతో ఆప్తురాలిగా ఉంటూ వచ్చిన సులోచనారాణి గారిని వదలలేకపోతున్నందుకు దు:ఖిస్తూ... - మృణాళిని గంట చదువు రేపటికి ప్రేరణ సాహిత్యాన్ని పాఠకులకు అత్యంత చేరువగా తీసుకెళ్ళిన సాహితీ దిగ్గజం యద్దనపూడి సులోచనారాణి. ఆనాటికీ, ఈనాటికీ ఏనాటికీ యావత్ ఆంధ్రుల అభిమాన రచయిత్రి కేవలం ఆమే అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ప్రసార మాధ్యమాలేవీ లేని ఆ రోజుల్లో పుస్తకాలు మాత్రమే కాలక్షేపం అవటంతో... ఆనాటి మహిళలు ఎందరో తమ రోజువారీ ఇరవై నాలుగ్గంటల సమయంలో వారికి దొరికే ఒక్కగంట ఖాళీ సమయంలో యద్దనపూడి సీరియల్ చదువుకోవటానికి మిగతా ఇరవైమూడు గంటలూ ఎంత కష్టమైన ఇంటిపనినైనా ఎంతో ఇష్టంగా చేసుకునేవారంటే పాఠకుల హృదయాల్లోకి ఎంతగా వీరి రచనలు చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. నిజమే, ఒక రాజశేఖరంలో తన కలల రాకుమారుణ్ణి చూసుకునేది ఆనాటి మధ్యతరగతి స్త్రీ. ఒక జయంతిలో తనను చూసుకుని పెద్ద పడవ లాంటి కారులో రాజశేఖరం పక్కన కూర్చుని ఏ టీ ఎస్టేటుల్లోనో విహరించేది. చిన్నిచిన్ని కలహాలూ, కలతలూ తాత్కాలికమనీ, ఆలుమగల మధ్య అనురాగాన్ని నింపేవి, మరింతగా పెంచేవీ ఆ చిరుకలహాలేననీ మధ్యతరగతి ప్రజానీకం మనసుల్లో బలంగా నాటుకుపోయే రీతిలో తన రచనా వ్యాసంగం సాగించి కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఒక రచయిత్రిగా తన వంతు పాత్ర పోషించారు యద్దనపూడి. రచనల్లో వారి చిత్తశుద్ధి, నిజ జీవితంలో ఆవిడ నిరాడంబరత్వం ఎందరికో ఆదర్శం. సన్మానాలూ, సత్కారాలంటే ఇష్టపడని సులోచనారాణి ఇటీవలి కాలంలో ఇంటర్వ్యూలకు కూడా పెద్దగా సుముఖత చూపక పోవటానికి కారణం ‘చాలు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను. ఎన్నో అవార్డులు, అభినందనలు, సత్కారాలూ పొంది నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇక చాలు, ఆశకు అంతేముంది’ అన్నమాటలు ‘ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం కాదు. ఎక్కడ ఆపాలో తెలియటం ముఖ్యం’ అన్న పెద్దల మాటను నిజం చేస్తాయి. మధ్య తరగతి జీవితాల్లోని అనేక అంశాలను ఆమె తమ రచనల్లో ప్రస్తావించేవారు. తను చూసిన, స్వయంగా పరిశీలించిన అనేక జీవితాలు ఆమె కథావస్తువులు. మధ్యతరగతి ఆడవాళ్ల మనస్తత్వ చిత్రణ, వారి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, చిలిపితనం, కోపం, అభిజాత్యం... భార్యాభర్తల మధ్య ప్రేమలూ, అలకలూ, కుటుంబాల్లో వచ్చే ఇబ్బందులూ ఇవన్నీ వస్తువులే వారి సాహిత్యంలో.‘ఒక్క కథో కవితో రాసి ఏ అవార్డ్ వస్తుందా? అని వీధిలో నిలబడి ఎదురుచూడవద్దు. పుస్తకాలతో పాటు వ్యక్తుల్ని, వ్యక్తుల జీవితాలను చదువు. సమాజాన్ని నువ్వెప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావో అప్పుడే నీనుండి ఒక మంచి రచన జీవం పోసుకుంటుంది’ అని చెప్పేవారు. ఒక మామూలు పల్లెటూరిలో పుట్టిన నేను వారి రచనలకు ప్రభావితమై జీవితంలో ఒక్కసారన్నా సులోచనారాణిని దూరంనుండైనా చూడగలనా అనుకునేదాన్ని. కలవాలంటే ఏం చెయ్యాలో తెలియలేదు. నాకు నేనే ఆలోచించుకుని రచనలు చెయ్యటం ఒక్కటే మార్గం, అది కూడా కుటుంబ, సమాజ సంబంధ బాంధవ్యాలను పెంపొందించే రచనలు చెయ్యాలనే సంకల్పంతో కలంపట్టిన ఏకలవ్య శిష్యురాలను యద్దనపూడి గారికి నేను. అలా కొంతవరకూ రచనలు చేసి హైదరాబాద్ వచ్చాకా లేఖిని సాహితీ సంస్థలో చేరటం ద్వారా ఆ సంస్థకు గౌరవాధ్యక్షురాలైన ఆమెను అతి సమీపంగా చూసినప్పటి మధుర క్షణాలను మరువలేను. నా మొదటి కథల సంపుటి ‘జీవనశిల్పం’కు ముందుమాట రాయమని అభ్యర్థిస్తే ‘రాయకూడదనే అనుకున్నాను. కానీ నీ కథలంటే ఉన్న ఇష్టంకొద్దీ ముందుమాట రాస్తా’నన్నారు. ‘‘నీ ‘ప్రభవించిన చైతన్యం’ నాకు నచ్చింది. మా అమ్మపేరుతో ప్రతిఏటా నేను ఇచ్చే అవార్డును నీకు ప్రకటిస్తున్నాను’’ అన్నారు. పల్లెలో పుట్టి, వారిని చూడటమే ధ్యేయంగా ప్రణాళిక వేసుకుని రచనలు ప్రారంభించి ఆ సాహిత్య వంతెన ద్వారా ఆమెని చూడగలిగిన నాకు ఇంతకంటే పెద్ద అవార్డ్ ఏముంటుంది? అది నా అదృష్టంగా భావించాను. ప్రేమికులు తమ ఆలోచనలను పంచుకునే ఒక అద్భుత వేదికగా నౌబత్ పహాడ్‌ను, ట్యాంక్‌బండ్‌ను తన రచనల్లో చూపిస్తూ పాఠకులను ఆయా ప్రాంతాల్లో విహరింపచేశారు కళ్లకు కట్టినట్లుండే తమవర్ణనలతో. ఎన్నో సమావేశాలకు వారిని నా కారులో తీసుకెళ్లే సందర్భంగా ‘నీ డ్రైవింగ్ నాకిష్టం. మళ్ళీ చాలా రోజుల తర్వాత వెన్నెల రాత్రులందు హుస్సేన్ సాగర్ని చూడాలనీ, నౌబత్ పహాడ్ ఎక్కి కబుర్లు చెప్పుకోవాలనీ ఉంది. నన్ను తీసుకెళ్లవూ’ అన్న వారి కోరిక కార్యరూపం దాల్చకముందే వారు స్వర్గస్తులవటం దైవ నిర్ణయం. - కన్నెగంటి అనసూయ పాఠకాదరణ పొందిన యద్దనపూడి నవలలు ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, బహుమతి, బందీ, బంగారు కలలు, చీకట్లో చిరుదీపం, దాంపత్యవనం, హృదయగానం, జాహ్నవి, జలపాతం, జీవన సత్యాలు, జీవన సౌరభం, జీవన తరంగాలు, జీవనగీతం, జ్యోతి, కలల కౌగిలి, కీర్తి కిరీటాలు, కృష్ణలోహిత, మధురస్వప్నం, మనోభిరామం, మౌనభాష్యం, మౌన తరంగాలు, మీనా, మోహిత, మౌనపోరాటం, నీరాజనం, నిశాంత, ఒంటరి నక్షత్రం, పార్థు, ప్రేమదీపిక, ప్రేమలేఖలు, ప్రేమపీఠం, ప్రేమ సింహాసనం, ప్రియసఖి, రాధాకృష్ణ, రుతువులు నవ్వాయి, సహజీవనం, సంసార రథం, సౌగంధి, సెక్రటరీ, సీతాపతి, స్నేహమయి, సుకుమారి, శ్వేత గులాబీ. ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు ∙మీరెక్కువగా ఏం పుస్తకాలు చదివేవారు? యద్దనపూడి: చిన్నప్పుడు మా ఊర్లో మంచి గ్రంథాలయం ఉండేది. అందులో ఫేమస్ ఇంగ్లీష్ నవలల అనువాదాలు, శరత్, టాగూర్ పుస్తకాలు చదివాను. నా ఫస్ట్ కథ పబ్లిష్ అయింది 1956లో. నాకు ఇష్టమైన రచయితలు ఒక్కరంటూ లేరు. వాళ్లలో బెస్ట్ తీసుకుంటుంటాను. ఆస్కార్ వైల్డ్ ‘యాన్ ఐడియల్ హజ్బెండ్’లోని పంచ్ లైన్స్ ఇష్టం. బాపిరాజు ‘నారాయణరావు’, ‘గోన గన్నారెడ్డి’ ఇష్టం. శరత్ రచనల్లోని డెలికసీ ఇష్టం. కానీ ఆ మగాళ్లు అసలు నచ్చరు. దేవదాసు నవలను రాసిన విధానం ఇష్టం. కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, ప్రియురాలిని కాపాడలేని వాడివి తాగి చచ్చిపోతే ఎవడికి అట. ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు. మీ రచనల ద్వారా మీ అభిమానులకు చాలా రకాల ఆలోచనలు, భావాలు పంచారు. మీ జీవిత తాత్వికత ఏంటి? లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నేనుగా బతికాను. నాకు మనుషులు కావాలి. కార్లు, బంగ్లాలు అవసరం లేదు. సింపుల్‌గా ఉండాలి. చెత్తబుట్ట, చనిపోయిన మనిషి ఒకటే. నువ్వూ ఏదో ఒకరోజు చెత్తబుట్ట అవుతావు. సుఖాలు అనుభవించు, తప్పులేదు. ఇతరులను ఇబ్బంది పెట్టకు. ఈ క్రమంలో జీవితాన్ని కోల్పోవద్దు. (యద్దనపూడి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లోంచి)యద్దనపూడి నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు రూపొందాయి. అందులో కొన్ని... జై జవాన్, మీనా (అఆ), జీవన తరంగాలు, సెక్రటరీ, విజేత, అగ్నిపూలు, గిరిజా కల్యాణం, రాధా కృష్ణ, ఆత్మగౌరవం, బంగారు కలలు, ప్రేమలేఖలు, చండీప్రియ. నా కలలను మేల్కొలిపారు నేను చదువుకునే రోజుల్లో ‘విజేత’ నవల నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఆమె పుస్తకాలే నాలో ఒక కారు, ఇల్లు కొనుక్కోవాలనే కలలను మేల్కొల్పాయి. ఇప్పుడే కాదు, నేను చాలా ఇంటర్వ్యూల్లో చెబుతున్నాను. హీరో అంటే ఇలా ఉండాలి, వ్యక్తిత్వం అంటే ఇదీ అనే విషయాలు ఆమె వల్లే తెలిశాయి. సాహిత్యంలో విశ్వనాథ అటువైపైతే, సులోచనారాణి ఇటువైపు. ఆయనది నారీకేళపాకం, ఈమెది ద్రాక్షపాకం. ఆయనది అర్థం చేసుకోవడం కష్టం. ఈమెది సులువుగా జీర్ణమౌతుంది. నాకు ఇద్దరూ ఇష్టమే. ఇంటికెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నా నేను ఆమె అభిమానిని. సెక్రటరీ నవల ఎన్నిసార్లు చదివానో చెప్పలేను. 1970ల్లో నవల కాపీ తీసుకుని ఎర్రమంజిల్ కాలనీలో వున్న ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ‘మల్లాది వెంకట కృష్ణమూర్తికి, అభినందనలతో’ అని రాసి సంతకం పెట్టారు. చందమామ, అపరాధ పరిశోధన లాంటి మేగజైన్స్‌కు నేను అప్పటికే రాస్తున్నప్పటికీ ఆమె నన్ను గుర్తుపట్టలేదు. ఆమె మనుషుల ఉద్వేగాలను తన నవలల్లో ఎక్కువగా వ్యక్తీకరించారు. కాలంతోపాటు ఉద్వేగాలు మారవు. వ్యక్తుల స్పందనలు మారవు. అందుకే ఆమె పుస్తకాలు ఇప్పటికీ సజీవంగా ఉంటాయి. సాధారణంగా తెలుగు పాఠకులు పిసినారులు. అరువు తెచ్చుకుని చదువుతారు తప్ప పుస్తకాలు కొనరు. అట్లాంటిది ఆ పిసినారితనాన్ని ఆమె జయించేలా చేసింది. పుస్తకాలు కొనేలా చేసింది. అట్టలు చిరిగిపోతేనో, చివరి పుటలు ఊడిపోతేనో కూడా మళ్లీ కొత్త కాపీ కొనేవాళ్లు. ఆమె వాక్యాలు సుతిమెత్తగా ఉంటాయి. ఆహ్లాదమైన చక్కటి శైలి. ఆవిడ కూడా అంతే మర్యాద, మన్ననతో ప్రవర్తించేవారు. వాళ్ల కూతురు శైలజ పెళ్లికి పిలిస్తే వెళ్లాను కూడా. ఆమెలో వ్యాపారదక్షత కూడా ఎక్కువే. పబ్లిషర్స్ దగ్గరగానీ, నిర్మాతల దగ్గరగానీ ఈమెదే పైచేయిగా ఉండేది. ఎంతిస్తే అంత తీసుకోవడం ఆమెకు తెలియదు. తన రెమ్యూనరేషన్ ఎంతో కచ్చితంగా చెప్పేవారు. 1980ల్లో ఆమె కొంతకాలం ‘కోకిల’ అని ఒక టేప్ మేగజైన్ నడిపారు. రచయితలు వాళ్ల రచనల్ని చదివితే, వాటిని రికార్డు చేసేవారు. క్యాసెట్ ఒక గంట నిడివి ఉండేది. దాన్ని చందాదారులకు పంపేవారు. ఆ రోజుల్లో అదొక విప్లవాత్మకమైన ఆలోచన. – మల్లాది వెంకట కృష్ణమూర్తి ఆమె యాక్చువల్ ఫెమినిస్ట్ సులోచనారాణి నవలలు చదవడం మొదలుపెట్టింది టెన్త్ తర్వాత! ఆవిడ బెస్ట్ అంతా 60–80ల మధ్యే వెలువడింది. 18–20 యేళ్లపాటు నవలా లోకాన్ని లిటరల్లీ ఏలారు. మనుషుల జీవితంలో పెద్ద తేడాలేముంటాయి? పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు ఇంటికి రావడం, మాట్లాడడం; మనకీ, మనకు కావలసిన వ్యక్తికీ గొడవ జరగడం... తర్వాత అది సాల్వ్ అయ్యే పరిస్థితి రావడం – పెంకుటింట్లో, పాకల్లో, బంగళాల్లో ఎక్కడైనా ఇదేగా డ్రామా! ఆ రోజువారీ హ్యాపెనింగ్స్ రాసేవారు. నేల విడిచి సాము చేయలేదు. ఫాల్స్ ప్రెస్టీజ్ లేదు. సూడో ఇంటలెక్చువల్ అంతకన్నా కాదు. లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ – ఆమె రచనల్లో అంతర్గతంగా ఉండే అంశం. కమ్యూనికేషన్ సాధనాలు ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా మనుషుల మధ్య ఇప్పటికీ అదే పెద్ద సమస్య. ఆవిడ గేమ్ అంతా దానిమీదే ఉండేది. ఆమె నవలల్లో బేసిక్‌గా 1960ల నాటి మధ్యతరగతి ఆడవాళ్ల తాలూకు అనుమానాలు, భయాలు, మగాళ్లను నమ్మాలా వద్దా అన్నదాని మధ్య ఊగిసలాట, అందులోంచి ఎలా బయటికి రావాలి అనేవి ఉంటాయి. ఆడవాళ్లు మగాడి దగ్గర్నుంచి ఒక అండర్స్టాండింగ్ కోరుకునేవారు. మగాడు ఎంత డబ్బున్నవాడైనా భార్యలు వంటింట్లోనే మగ్గిపోయేవారు. పదేళ్లక్రితమే పెళ్లయినా అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేకపోయేవారు. అప్పుడప్పుడే ఇలాంటి అన్యాయం పట్ల ఆడాళ్లు వాయిస్ రెయిజ్ చేయడం మొదలైంది. ఆ అంశాలు ఆవిడ నవలల్లో కనిపించేవి. ఆవిడ సూడో ఫెమినిస్ట్ కాదు – యాక్చువల్ ఫెమినిస్ట్. ఆవిడ నార్మల్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. పెద్దగా చదువుకోలేదు. చక్కగా ఇంట్లో కూర్చుని కథలు రాసి అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పటివాళ్లతో పోలిస్తే నాకు ఆవిడే ఎక్కువ సక్సెస్‌ఫుల్‌గా అనిపిస్తారు. (సాక్షి ‘ఫన్డే’ ఇంటర్వ్యూలోంచి) -
కొత్త బంగారం
నవల– ఇద్దరు వ్యక్తులు యాదృచ్ఛికంగా కలుసుకుని చేసిన ఆకస్మిక ప్రయాణం గురించీ, ఒకమ్మాయి తనని తాను అర్థం చేసుకోవడం గురించినదీ. గేయిల్ ఫోర్మన్ రాసిన ‘జస్ట్ వన్ డే’ అమెరికన్ అమ్మాయి ఏలిసన్ హీలీ, హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తరువాత స్నేహితురాలైన మెలనీతోపాటు యూరప్ ట్రిప్‌కు వెళ్ళడంతో మొదలవుతుంది. ఒక రోజు లండన్‌లో తన టూర్ గుంపుని వదిలిపెట్టి, షేక్స్పియర్ ‘ట్వెల్థ్ నైట్’ నాటకం చూడ్డానికి వెళ్ళినప్పుడు, దేశదిమ్మరైన అందమైన డచ్ యువకుడైన విలెమ్ డు రైటర్‌ను కలుసుకుంటుంది. మామూలు రూపురేఖలున్న ఏలిసన్ను చాలా ఆకర్షణీయంగా ఉంటుందని నమ్మించి, ఆమెని ‘లూలూ’ అని పిలుస్తూ, తనతోపాటు పారిస్ రమ్మంటాడతను. ఏలిసన్ చదువులో ముందుండే పిల్ల. క్రమబద్ధమైన జీవితం గడిపే అమ్మాయికి పరాయి యువకుడితో అప్పటికప్పుడే పారిస్‌కు వెళ్ళాలనుకునే మనస్తత్వం లేనప్పటికీ, తిరిగి అమెరికా వెళ్ళి ‘ఏలిసన్’గా తన సామాన్యమైన జీవితం గడపడానికి మారుగా మెలనీని వదిలి, ట్రిప్ ఆఖరి రోజున విలెమ్తో పాటు యూరో రైలెక్కుతుంది. ఇద్దరూ కలిసి పారిస్‌లో గుర్తుంచుకోతగ్గ రోజు గడుపుతారు. అపరిచితుడైన విలెమ్తో తనకి ఏదో విశేషమైన సంబంధం ఉందనుకుంటుంది ఆ అమ్మాయి. అతను ఆమె చిరునామా, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడి– ఏవీ అడగడు, తనవీ చెప్పడు. ఉదయం నిద్ర లేవగానే విలెమ్ జాడ కూడా కనబడదామెకి. ‘మరొక అదనపు రోజు అతనితో గడిపినప్పటికీ, నా నిరాశ వాయిదా పడ్డం తప్ప ఇంకేమీ జరగదని నా మనస్సుకి తెలుసు’ అని సర్దిచెప్పుకుని, అతనితో తన సంబంధం తన భ్రమే అని అనునయించుకుని, ఆ దినపు జ్ఞాపకాలని తప్పించుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది. ఏలిసన్ కాలేజీలో చేరుతుంది కానీ విలెమ్ గురించి ఆలోచించడం మానక, అతనితో పాటు ఉన్నప్పుడు తనెంత తెగించి ప్రవర్తించిందో అన్న సంగతి కూడా మరవలేకపోతుంది. తనకి ఆసక్తి లేకపోవడంతో తన తల్లి ఎంపిక చేసిన సబ్జెక్టు మీద మనస్సు పెట్టి చదవలేకపోతుంది. ‘తన వెనక వదిలిన ఖాళీ జాగాల బట్టి, ఏదో లేకపోయినప్పుడే, అది ఉండేదని మనం గుర్తిస్తాం’ అనుకుంటూ, విలెమ్ను వెతకడానికి తిరిగి పారిస్ వెళ్తుంది. అతని జీవితానికి భాగం అయినవారిని కలుసుకున్నప్పుడు, ‘కేవలం ఒక్క రోజు’ తనతో గడిపిన వ్యక్తి, నిజ జీవితంలో ఎటువంటివాడో అర్థం చేసుకుంటుంది. చివర్న అతన్ని కలుసుకుంటుంది. నవల– ఇద్దరు వ్యక్తులు యాదృచ్ఛికంగా కలుసుకుని చేసిన ఆకస్మిక ప్రయాణం గురించీ, ఒకమ్మాయి తనని తాను అర్థం చేసుకోవడం గురించినదీ. ‘విలెమ్ ఆమెని ఎందుకు వదిలేసి వెళ్ళాడు!’ అన్న కుతూహలమే పుస్తకాన్ని చదివించేది. తన వాదనని సరిగ్గా వినిపించలేకపోయే నిస్సహాయురాలైన ‘మంచి పిల్ల’, జీవితంలో తనకి కావలిసినదేదో తెలుసుకున్న సమర్థురాలిగా మారడం గురించిన ఈ పుస్తకం, ఏలిసన్ సుఖాంతం వైపు చేసిన ప్రయాణం మీద కేంద్రీకరిస్తుంది. 2013లో విడుదలయిన నవలకి, ఆడియో పుస్తకం ఉంది. విలెమ్ దృష్టికోణంతో వచ్చినది దీనికి ఉత్తర కథ అయిన ‘జస్ట్ వన్ యియర్.’ ఈ రెండింటినీ కలిపి ఒక సినిమాగా తీశారు. కేవలం 50 పేజీలున్న– ఏలిసన్, విలెమ్ల ఆఖరి కథ అయిన ‘జస్ట్ వన్ నైట్’ నవలిక ఈ–బుక్‌గా 2014లో వచ్చింది. కృష్ణ వేణి -
రెండు ద్వేషాలు
సాయంత్రం అవుతూనే బెల్చర్ పొడుగ్గా కాళ్లు చాపి, ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అంటాడు. వెంటనే నోబెల్ గానీ బోనపార్ట్గానీ గానీ, ‘నువ్వంటే సరే, నేస్తుడా’ అని నవ్వుతూ బదులిస్తారు. ఈ నేస్తుడా అనే మాట వాళ్లిద్దరికీ బెల్చర్ వల్లే అలవాటైంది. వెంటనే అందరిలోకీ పొట్టివాడైన హాకిన్స్(వాళ్లు ఆకిన్స్ అంటారు) దీపం వెలిగిస్తాడు, కార్డ్సు బయటకు తీస్తాడు. ఇక ఆట మొదలవుతుంది. ఒక్కోసారి వీళ్లను పర్యవేక్షిస్తున్న జెరమాయా డానవన్ వీళ్లున్న ఇంటికి వస్తుంటాడు. వాళ్ల వెనకాల నిలబడి, ‘ఆకిన్స్, నువ్వేం ఆడుతున్నావో చూసుకో’ అని అరుస్తాడు. హాకిన్స్‌కు ఆడటం రాదు. కానీ డాన్స్ బాగా చేస్తాడు. బెల్చర్, హాకిన్స్ ఇంగ్లీషు సైనికులు. ఇంగ్లీషువాళ్ల కోసం (ఐరిష్) సెకెండ్ బెటాలియన్ తీవ్రంగా గాలిస్తున్నప్పుడు పట్టుబడ్డారు. ఇద్దరినీ నోబెల్, బోనపార్ట్ బాధ్యత కింద ఈ ఇంట్లో ఉంచారు. కొన్ని రోజులు గడిచేప్పటికి, వాళ్లమీద ఓ కన్ను వేసి ఉంచాలనే ఆలోచనే వీళ్లు మరిచారు. వాళ్లు ఎందుకు పారిపోతారు! వీళ్లున్న ఇల్లు ఒక ముసలావిడది. ఈమెకు నోటి కొసనే శాపనార్థాలుంటాయి. అట్లాంటిది ఈ ముసలమ్మా బెల్చర్ ఎలా అలవాడుపడ్డారో చూడటం కళ్లకు వినోదం. బెల్చర్ భారీ మనిషి. ఐదడుగుల పది అంగుళాలున్న బోనపార్ట్ కూడా పైకి చూడాల్సి ఉంటుంది. అంత భారీకాయుడు నిశ్శబ్దంగా దయ్యంలా తిరుగుతుంటాడు. అసలు మాట్లాడడు. ఎప్పుడన్నా మాట్లాడాడంటే ఆ కార్డ్సు ఆడుదామనే. ఆటంటే బాగా ఇష్టం. ముసలమ్మ ఏ బకెటో, ట్రేనో పట్టుకొస్తుంటే అతడు సాయం వెళ్తాడు. వంటచెరుకు కోసం తిప్పలు పడుతుంటే ఆమె దగ్గరి చిన్న గొడ్డలి లాక్కుని కట్టెలు కొట్టిస్తాడు. బెల్చర్కు పూర్తి విరుద్ధం హాకిన్స్. బెటాలియన్‌కు సరిపడా అతడే వాగుతాడు. ఎంత చిన్న టాపిక్గానీ ఎదుటివారిని తిట్టకుండా వదలడు. హాకిన్స్, నోబెల్ తరచూ మతం గురించి వాదులాడుకుంటారు. నోబెల్ సోదరుడు ప్రీస్ట్ అని తెలియడం దీనికి కారణం. ఎవరూ మాట్లాడ్డానికి లేకపోతే ముసలమ్మ మీద ప్రతాపం చూపిస్తాడు హాకిన్స్. ఒక సాయంత్రం వాళ్లందరూ టీ తాగారు. హాకిన్స్ దీపం వెలిగించాడు. పెట్టుబడిదారులు, స్వర్గం, పూజారులు... ఇలా మాటలు దొర్లుతున్నాయి. అప్పుడు జెరమాయా డానవన్ వచ్చాడు. అందరినీ చూసి నెమ్మదిగా బయటికి నడిచాడు. చర్చ తెగేది కాదని బోనపార్ట్ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ గ్రామం వైపు నడుస్తున్నారు. ఆగి, ‘వాళ్లకు కాపలాగా ఉండాల్సింది నువ్వు’ అన్నాడు డానవన్. ‘ఇంకెంతకాలం? వాళ్లను మనతో ఉంచుకుని ఏం ప్రయోజనం?’ అడిగాడు బోనపార్ట్. ‘వాళ్లను బందీలుగా పట్టుకున్నామని నీకు తెలుసనుకుంటున్నా.’ ఖైదీలు అనకుండా బందీలు అనడం అర్థంకాలేదు. ‘శత్రువుల దగ్గర మనవాళ్లు ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లను కాల్చేస్తామని చెబుతున్నారు. వాళ్లు మనవాళ్లని కాల్చేస్తే మనమూ వాళ్లవాళ్లను కాల్చేసి దీటైన జవాబిద్దాం’ తీవ్రంగా బదులిచ్చాడు డానవన్. ‘కాల్చేయడమా?’ అసలు అట్లాంటిదొకటి సాధ్యమనే ఆలోచనే బోనపార్ట్కు ఉదయించలేదు. ‘అంతే, కాల్చేయడమే’ స్థిరంగా బదులిచ్చాడు డానవన్. ‘కానీ నాకూ నోబెల్కూ ఈమాట ముందే చెప్పివుండాల్సింది’ పీలగా అన్నాడు బోనపార్ట్. ‘ఎందుకు చెప్పాలి?’ ‘ఎందుకంటే వాళ్లను మేము కావలి కాస్తున్నాం కాబట్టి.’ ‘మిమ్మల్ని కాపలాగా ఉంచినప్పుడు ఆ మాత్రం ఊహించలేరా?’ తప్పుపట్టాడు డానవన్. ఇప్పుడు చెబుతున్నాగదా, ఎప్పుడు చెబితే తేడా ఏముంది? అన్నాడు. ‘చాలా పెద్ద తేడా ఉంది’ గొణిగాడు బోనపార్ట్. కానీ ఆ తేడా ఏమిటో వివరించలేకపోయాడు. బోనపార్ట్ తిరిగి వెళ్లేసరికి చర్చ తీవ్రంగా నడుస్తోంది. మరణానంతర జీవితం ఏమీ ఉండదని మాట్లాడుతున్నాడు హాకిన్స్. మతగ్రంథాలను అనుసరించి కచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు నోబెల్. ‘నీకు స్వర్గం ఏమిటో తెలియదు, అదెక్కడుందో తెలియదు? అందులో ఎవరుంటారో తెలియదు, వాళ్లకు ఏమైనా రెక్కలుంటాయా’ అన్నాడు హాకిన్స్. ‘అవును, ఉంటాయి, చాలా’ చెప్పాడు నోబెల్. ‘అవి ఎక్కడ్నుంచి వస్తాయి? ఎవరు చేస్తారు? అక్కడేమైనా రెక్కల ఫ్యాక్టరీ ఉందా?’ వ్యంగ్యంగా అన్నాడు హాకిన్స్. చర్చ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. నీతో వాదించడం నా వల్ల కాదని నోబెల్ చేతులెత్తేశాడు. ఆ ఇంగ్లీషు వాళ్లిద్దరినీ వేరే గదిలోకి పంపి, తాళం పెట్టి, బోనపార్ట్, నోబెల్ పడుకున్నారు. దీపం ఆర్పేశాక డానవన్ చెప్పింది నోబెల్ చెవుల్లో వేశాడు బోనపార్ట్. నోబెల్ మౌనంగా ఉండిపోయాడు. తెల్లారి సాయంత్రం వాళ్లు టీ తాగారు. బెల్చర్ తన ధోరణిలో ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అన్నాడు. అందరూ టేబుల్ చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు. హాకిన్స్ కార్డ్స్ పంచాడు. బయట డానవన్ వస్తున్న బూట్ల చప్పుడు. నెమ్మదిగా బయటికి నడిచాడు బోనపార్ట్. ‘ఏం కావాలి?’ ‘నీ సైనిక స్నేహితులిద్దరు.’ డానవన్ ముఖం కోపంగా ఉంది. ‘మరో దారిలేదా?’ ‘శత్రువులు మనవాళ్లను నలుగురిని చంపేశారు. తెలుసా, అందులో ఒకతను పదహారేళ్ల కుర్రాడు.’ ఇంతలో నోబెల్ అక్కడికి వచ్చాడు. గేటు దగ్గరున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫీనీ కూడా కలిశాడు. ‘ఆ ఇద్దరినీ బయటికి తెండి, ఇక్కడినుంచి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పండి’ ఆదేశించాడు డానవన్. ‘నన్ను ఇందులోంచి మినహాయించండి’ ప్రాధేయపడ్డాడు నోబెల్. ‘అయితే సరే, నువ్వూ ఫీనీ షెడ్లోంచి పార, పలుగు పట్టుకెళ్లి దూరంగా గొయ్యి తియ్య’మన్నాడు డానవన్. ‘ఇరవై నిమిషాల్లో మేము వచ్చేస్తాం. ఎవరికీ తెలియకూడదు’. ఫీనీ, నోబెల్ బయటికి నడిచారు. డానవన్, బోనపార్ట్ ఇంట్లోంచి ఇంగ్లీష్ వాళ్లను బయటికి పిలుచుకొచ్చారు. నడుస్తుండగా, ‘పొద్దున మావాళ్లు నలుగురిని మీవాళ్లు కాల్చేశారు, ఇప్పుడు మీ వంతు’ చెప్పేశాడు డానవన్. హాకిన్స్ నమ్మలేదు. కావాలంటే బోనపార్ట్‌ను అడగమన్నాడు. ‘ఆ అవసరం లేదు, నేనూ బోనపార్ట్ నేస్తులం, కాదా?’ అడిగాడు హాకిన్స్. నిజమేనని బాధగా చెప్పాడు బోనపార్ట్. అయినా నమ్మలేదు హాకిన్స్. ‘నువ్వు నిజం చెప్పట్లేదు, నన్నెందుకు కాల్చేస్తారు? నోబెల్ కూడా ఇందులో ఉన్నాడా?’ అవునని తెలియగానే హాకిన్స్ నవ్వాడు. ‘హాకిన్స్, నీ చివరి కోరిక ఏమిటి?’ అడిగాడు డానవన్. ‘నోబెల్ నన్నెందుకు కాల్చేస్తాడు? నేను అతడినెందుకు కాల్చేస్తాను? మేము నేస్తులం కదా!’ దూరంగా దీపపు వెలుతురులో నోబెల్, ఫీనీ నిలబడివున్నారు. గొయ్యి సిద్ధంగా ఉంది. ‘హలో, నేస్తుడా’ నోబెల్‌ను పలకరించాడు బెల్చర్. బోనపార్ట్ గుండెలో మృత్యుబాధ వచ్చి కూర్చుంది. నోబెల్ బదులివ్వలేదు. ‘హాకిన్స్, నీ చివరి సందేశం ఏమిటి?’ అతడికి ఇలాంటివాటి మీద నమ్మకం లేదు. మరేదో మాట్లాడబోయాడు. ‘ఇక చాలిద్దాం.’ రివాల్వర్‌ను చేతిలోకి తీసుకున్నాడు డానవన్. హాకిన్స్ మెడ వెనుక గురిపెట్టాడు. బోనపార్ట్ కళ్లు మూసుకున్నాడు. బ్యాంగ్! నోబెల్ కాళ్ల దగ్గర పడిపోయాడు హాకిన్స్. బెల్చర్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్లకు కట్టుకోబోయాడు. పెద్ద తలకు ఆ చిన్న కర్చీఫ్ సరిపోలేదు. బోనపార్ట్‌ను ఇవ్వమని అడిగాడు. గంతలు కట్టుకునేముందు హాకిన్స్ కదులుతూ కనబడ్డాడు. అతడి ఎడమ మోకాలు పైకి లేవడం దీపం వెలుగులో కనబడింది. ముందు అతడిని ఇంకోసారి కాల్చేయండి, అన్నాడు బెల్చర్. శాశ్వతంగా ఆ నొప్పి నుంచి విముక్తం చేయడానికి మరొక బ్యాంగ్! బెల్చర్ నవ్వాడు. ‘రాత్రే వాడు ఈ మరణానంతర జీవితం గురించి తెగ కుతూహలపడ్డాడు.’ బోనపార్ట్ వెన్ను వణికింది. బెల్చర్, నీ చివరి ప్రార్థన చేస్తావా? ‘ఉపయోగం లేదు, నేను సిద్ధంగా ఉన్నాను’. బ్యాంగ్! రెండోసారి కాల్చే అవసరం కూడా రాలేదు. ఆ గుడ్డి వెలుతురులోనే శవాలను మోసుకెళ్లి, గోతిలో వేసి పూడ్చారు. పనిముట్లు పట్టుకుని నోబెల్, బోనపార్ట్ తిరిగి ఇంటికి వెళ్లారు. వెళ్లేసరికి ముసలమ్మ జపమాలతో కూర్చునివుంది. ‘వాళ్లను ఏం చేశారు?’ అనుమానంగా అడిగింది ముసలమ్మ. బదులు రాలేదు. మళ్లీ అడిగినా బదులు లేదు. అయ్యో! ముసలమ్మ మోకాళ్ల మీద దేవుడి ముందు కూలబడింది. -
‘అనంత’ సాహితీ ‘సింగం’
- అభ్యుదయ భావజాల రచనలకు దిక్సూచి సింగమనేని అనంతపురం కల్చరల్ : కాల్పనిక జగత్తులో ఊగిసిలాడుతున్న ‘అనంత’ సాహిత్యాన్ని గతితర్క భౌతికవాద భావజాలంతో మలుపు తిప్పిన రచయిత సింగమనేని నారాయణ. మహాకవులు గురజాడ, శ్రీశ్రీలను సింగమనేని చదివినంతగా మరొకరు అర్థం చేసుకోలేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఏకకాలంలో మనసును ఆహ్లాదపరుస్తూ, బుద్ధిని వికసింపజేస్తూ..ప్రతివారినీ ఆలోచింపచేయగల్గిన రచనా నిబద్ధత కల్గిన సింగమనేని నారాయణ 1943లో రాప్తాడు మండలం మరూరు బండపల్లి గ్రామంలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జన్మించారు. చిన్నవయసులోనే రచనా వ్యాసంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 19 ఏళ్ల వయసులో ‘ఆదర్శాలు – అనుబంధాలు’, ‘అనురాగానికి హద్దులు’, ‘ఎడారి గులాబీ’ నవలలను రచించారు. అనతికాలంలోనే కాల్పనిక రచనల వల్ల సమాజానికి ప్రయోజనం కల్గించేదేది లేదని గ్రహించిన ఆయన జూదం, అనంతం, సింగమనేని కథలు, నీకు నాకు మధ్య నిశీధి, జీవఫలం వంటి కథలను వినూత్న శైలితో రచించి రాష్ట్రస్థాయి రచయితల సరసన చేరిపోయారు. ఇక ఆయన రాసిన ‘సమయము– సందర్భము’, ‘సంభాషణం’, ‘మాతృభాషే ఎందుకు చదవాలి?’ మొదలైన వందల కొద్దీ వ్యాసాలు ఎంతో మంది యువ రచయితలకు స్పూర్తిని కల్గించాయి. వరించిన పురస్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, రాచకొండ రచనా పురస్కారం, ఉరిపండ అప్పలస్వామి పురస్కారంతో పాటు పదుల సంఖ్యలో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. ‘కళారత్న’ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుని జిల్లా కీర్తిని పెంచారు. ఆయన రచనలపై వివిధ వివిధ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయించి డాక్టరేట్లు ప్రకటించాయి. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సింగమనేని కథలు అనువాదమై పలు రాష్ట్రాలలో పాఠ్యాంశాలుగా మారాయి. రైతు జీవితానికి అండగా.. ప్రభుత్వాలు గ్రామీణ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయని, పెట్టుబడిదారుల జేబులు నింపడానికే పాలననంతా కేంద్రీకరిస్తున్నారన్న స్పృహతో సాగిన రచనలు సంచలనాలయ్యాయి. ఎటువంటి అభిప్రాయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగలడం వల్లే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లోని సాహిత్యంతో అనుబంధముంది. ప్రపంచీకరణ పేరుతో ప్రవేశపెడుతున్న విషసంస్కృతిని పరిహరిస్తూ ఆయన రాసిన అనేక రచనలు ప్రభుత్వాలకు చక్కటి పరిష్కార మార్గాలను వెతికిపెట్టాయి. రైతు లేకుంటే బతుకే లేదు ‘‘జీవితం పట్ల విలక్షణ దృక్పథం.. విస్తృత అవగాహన.. అనుమాన అనురక్తి ఎవరికైనా ఉండాలి. అవన్నీ నాలో సజీవ సహచర్యం చేయడానికి గురజాడ, శ్రీశ్రీ రచనలు ఎంతగానో తోడ్పడ్డాయి. చిన్నవయసు నుండే సమాజాన్ని సున్నితంగా గమనిస్తుండడం వల్ల అనుకుంటా రైతు లేని రాజ్యాన్ని చూడబోతున్నామన్న ఆందోళన నాకు ఎప్పుడూ కల్గుతూనే ఉంటుంది. ప్రభుత్వ విధానాలు పూర్తిగా భూస్వాములకు, పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తున్నాయి. భూమితల్లిని నమ్ముకున్న రైతులు వృత్తిని మానుకోకముందే అందరూ కళ్లు తెరవాలి. రైతు లేకుంటే బ్రతుకే లేదన్న స్పృహ అందరి ఉండాలన్నదే నా రచనల ధ్యేయం’’. - సింగమనేని నారాయణ -
క్షుద్రదేవత పీడకలకు అక్షరరూపం
కేశవరెడ్డి తన నవలల్లో సమాజం అట్టడుగు పొరలలో, దాని అంచులలో ఉన్న అణగారిన బతుకుల జీవిత చిత్రణకు అగ్రాసనం వేశారు. స్వానుభవం నుంచి వచ్చినవే ఉత్తమ రచనలనీ, అలాంటివే విశ్వసనీయంగా ఉంటాయనీ ఇటీవల వ్యాప్తిలోకి వచ్చిన భావనను కేశవరెడ్డి నవలలు పూర్వపక్షం చేశాయి. మున్నెన్నడూ తెలుగు పాఠ కలోకం చవిచూడని నవలలు రాసి, ప్రపంచ సాహిత్యం చది వినపుడు కలిగే అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చిన రచయిత డాక్టర్ కె. కేశవరెడ్డి. చిత్తూరు జిల్లా, తలుపులపల్లి అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కేశవరెడ్డి చిన్ననాడే వలసమార్గం (‘రాముడుండాడు, రాజ్యముండాది’లో బీదాబిక్కీ వలె) పట్టారు. పుదుచ్చేరిలో వైద్యశాస్త్రం చదు వుకుని, అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి చేరారు. అక్కడే విక్టోరియా మిషనరీ ఆస్పత్రిలో కుష్టు వ్యాధి నిపుణునిగా పనిచేసి, స్థిరపడ్డారు. ఒకవైపు నిత్యం కుష్టువ్యాధిగ్రస్తులకు సేవచేస్తూనే, మరోవైపు కులం అనే కుష్టువ్యాధి సోకిన తెలుగు/భారతీయ సమాజాన్ని అధ్య యనం చేశారు. ఆ సమాజంలోని వైరుధ్యాలను ఔపో శన పట్టారు. దానితో వచ్చిన ఆలోచనలను, భావాలను చిత్రికపట్టగా వచ్చినవే కేశవరెడ్డి నవలలు. వృత్తి రీత్యా కేశవరెడ్డి జీవితమంతా ఉత్తర తెలంగాణలోనే గడిచింది. అయినా, ఆయన నవలల నేపథ్యం చిత్తూరు జిల్లానే. తెలుగు నవల, కథానిక సాహిత్యం ప్రధానంగా బ్రాహ్మణీయ, విద్యాధిక, పట్టణ, పురుషాధిక్య, మధ్య తరగతి జీవితాలలోని ఈతిబాధలకు పరిమితమైన సం గతి తెలిసిందే. ఇందుకు భిన్నంగా కేశవరెడ్డి తన నవ లల్లో సమాజం అట్టడుగు పొరలలో, దాని అంచులలో ఉన్న అణగారిన బతుకుల జీవిత చిత్రణకు అగ్రాసనం వేశారు. స్వానుభవం నుంచి వచ్చినవే ఉత్తమ రచనలనీ, అలాంటివే విశ్వసనీయంగా ఉంటాయనీ ఇటీవల వ్యాప్తిలోకి వచ్చిన భావనను కేశవరెడ్డి నవలలు పూర్వపక్షం చేశాయి. ఆయన వ్యవసాయ, మధ్య తరగతి కుటుం బం నుంచి వచ్చారు. కాబట్టి అధో జగత్ సహోదరుల బతుకులలోని నీలి నీడలను స్వయంగా అనుభవించి పల వరించే అవకాశం లేదు. కానీ ఈ రచ యిత తన పంచేంద్రియాలను యాం టెన్నాలుగా మార్చుకుని ఉన్న చోట ఉంటూనే, తనకు అందనంత దూరం లో ఉన్న మాల మాదిగ, యానాది ఇత్యాది పంచముల అనుభవాలనూ, జ్ఞానాన్నీ సొంతం చేసుకోగలిగారు. దీని ఫలితంగానే ‘ఇంక్రెడి బుల్ గాడెస్’ మొదలుకొని ‘మునెమ్మ’ వరకు 8 నవలలు ఆయన కలం నుంచి జాలువారాయి. మన వ్యవస్థలో కులం పోషించే ప్రతి నాయక పాత్రను కేశవరెడ్డి ‘ఇంక్రె డిబుల్ గాడెస్’లో చిత్రించారు. ఈ నవలలన్నింటిలోను పాఠకులకు ప్రధానంగా కనిపించేది దర్శనాత్మక వాస్తవికతే. ఘర్షణ లేని వాస్తవం ఉండజాలదన్న ప్రాథమిక స్పృహ కేశవరెడ్డి సాహిత్య మంతటా విస్తరించి ఉంటుంది. ఆయన నవలా ప్రస్థా నంలో రెండు పర్యాయాలు సీక్వెల్స్ (కొనసాగింపు నవ లలు) రాయడం గమనిస్తాం. ‘ఇంక్రెడిబుల్ గాడెస్’ నవ లకు ‘స్మశానం దున్నేరు’; ‘మూగవాని పిల్లనగ్రోవి’ నవ లకు ‘చివరి గుడిసె’ అలాంటి కొనసాగింపు నవలలే. మొదటి నవలలో ఉద్భవించిన వైరుధ్యానికి రెండో నవ లలో శత్రు సంహారం ద్వారా ముగింపు పలుకుతా రాయన. మొదటి సందర్భంలో కథానాయకుని చేతిలో భూస్వామి హతమైతే, రెండో సందర్భంలో బైరాగి ఉసిగొలపడం వల్ల కుక్క భూస్వా మిని కడతేరుస్తుంది. కేశవరెడ్డి సృష్టిం చిన పాత్రలన్నీ ప్రాకృతికంగా నడుచు కున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అదే ప్రకృతి ధర్మం అన్నంత సహజంగా అవి వ్యవహరించడం విశేషం. ఆ పాత్రలను ఒక అనివార్యత, ఒక అనుల్లంఘనీయత ముందుకు తోస్తూ ఉంటాయి. చివరి నవల ‘మునెమ్మ’ లో ఇది మరింత ప్రస్ఫుటం. కథా నాయిక మునెమ్మ తన భర్తను చంపిన వారిని బొల్లెద్దుతో చంపిస్తుంది. అం టే ఆయన పాత్రలన్నీ తమ తమ కర్తవ్యాన్ని నెరవేర్చడం దగ్గర ఒక దీక్షతో, నిబద్ధతతో సాగుతూ ఉంటాయి. ఒక అమానుష, భయంకర, చీకటి కమ్మిన వాస్తవికతతో కూడిన బీభత్స వాతావరణం కేశవరెడ్డి నవలలన్నింటి లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఆయన సృష్టించిన పాత్ర లన్నీ ఒక పోరాట స్ఫూర్తితో కదలాడుతూ ఉంటాయి. ఇంతకీ ఆ పోరాట స్ఫూర్తి చుట్టూ ఉన్న పరిస్థితుల మీద తిరగబడేందుకు సంతరించుకున్నదే. ఆయన నవలలు ఇచ్చే సందేశం కూడా అదే. ఈ ఆవిష్కరణలోనే కేశవరెడ్డి కవితాత్మక న్యాయా న్ని కూడా సాధిస్తారు. హెన్రీ మిల్లర్ (సుప్రసిద్ధ అమె రికన్ నవలాకర్త) అమెరికాను ‘ఎయిర్ కండిషన్డ్ నైట్ మేర్ ’ అని అభివర్ణిస్తాడు. కేశవరెడ్డి భారతీయ సమా జాన్ని ‘క్షుద్రదేవత దుస్స్వప్నం’గా అభివర్ణించడం కూడా అలాంటిదే. (వ్యాసకర్త ప్రముఖ సాహిత్య విమర్శకులు) మొబైల్: 8790908538 -
తొలితరం రచయిత శ్రీరాగి కన్నుమూత
కర్నూలు: కర్నూలుకు చెందిన తొలితరం ప్రముఖ రచయిత శ్రీరాగి(89) సోమవారం రాత్రి 9 గంటలకు కర్నూలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో కన్నుమూశారు. శ్రీరాగి అసలు పేరు కోపల్లె పూర్ణచంద్ర సదాశివ సుబ్రహ్మణ్యేశ్వరరావు. అయితే, శ్రీరాగి అనే కలం పేరుతో ప్రసిద్ధ రచయితగా ఖ్యాతి గడించారు. ఈయన పలు తెలుగు, ఆంగ్ల నవలలు, కథానికలు రచించారు. మధ్యతరగతి జీవుల కడగండ్లను అక్షరీకరించిన శ్రీరాగి.. కథానికలతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆంగ్ల నవలలు రాసే వరకు విస్తరించారు. 1927లో జన్మించిన ఈయన ఉద్యోగ రీత్యా కర్నూలు వైద్య కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయన రచనల్లో.. విభిన్న స్వరాలు, అధికారం-అంధత్వం, బదిలీ, శుభలేఖ, సగటు ఉద్యోగి, ఆత్మావలోకనం, బ్రతుకు వరం అనే నవలలు పేరొందాయి. విభిన్న స్వరాలు నవలకు భరాగో అవార్డు లభించింది. శ్రీరామ శతకాన్ని కూడా ఈయన రచించారు. శ్రీరాగి మృతి పట్ల రచయితలు వేదగిరి రాంబాబు, కలిమి శ్రీ, కర్నూలు తెలుగు రచయితల సంఘం, సాహితీ సంస్థల నిర్వాహకులు, రచయితలు సంతాపం వ్యక్తం చేశారు. -
నేనూ నా దెయ్యాలు!
పుస్తకోత్సాహం ఎన్నో ప్రసిద్ధ నవలలు సినిమాలుగా వచ్చి హిట్ సాధించాయి. ‘సినిమాలను నవలలుగా మలిస్తే ఆ నవలలు ఎందుకు హిట్ అవ్వవు?’ అనుకున్నాడో ఏమో బాలీవుడ్ డెరైక్టర్ విక్రమ్‌భట్ తన రాబోవు చిత్రం ‘కామోషియన్’తో సహా గత చిత్రాలు ‘1920’ ‘1920-ఈవిల్ రిటర్న్స్’ చిత్రాలను నవలుగా మలుస్తున్నారు. ఈ నవలలలో గతంలో ఎవరూ చూడని ఫోటోలు, గతంలో ఎవరికీ చెప్పని విషయాలను ఇస్తున్నారు. ‘‘యువ పాఠకుల నుంచి నా పుస్తకాలకు ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాను’’ అన్నారు విక్రమ్. ‘‘ఇలా పుస్తకాలను అచ్చేయడం నాకు బొత్తిగా కొత్త’’ అంటున్నారు ఆయన. సినిమాలను నవలలుగా చదువుకోవడం కూడా ఈ తరానికి ఎంతో కొంత కొత్తే కదా! ఇది సరేగానీ, హారర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వారు, ఆ ట్రాన్స్‌లో కొన్ని చిత్ర విచిత్రమైన మానసిక భ్రమలకు గురవుతుంటారు. అలాంటి విషయాలను అడపాదడపా ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. తనకు ఎదురైన హారర్ అనుభవాలను విక్రమ్‌భట్ ఒక పుస్తకంగా రాసి ‘నేనూ నా దెయ్యాలు’ అని పేరు పెడితే... అట్టి పుస్తకం హాట్ హాట్‌గా అమ్ముడవుతుంది అనడంలో అణుమాత్రం సందేహం లేదు! -
‘నవ్వే నక్షత్రంలా అమ్మకావాలి...!’
ఆధునిక సాహిత్యం - అస్తిత్వవాద ధోరణులు స్త్రీవాద కవిత్వం అంతర్జాతీయ మహిళా దశాబ్ది (1975- 85) స్ఫూర్తితో తెలుగులో స్త్రీవాద కవిత్వం రూపుదిద్దుకుంది. ఆంగ్లంలో వర్జీనియా ఉల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ ఒన్స ఓన్’, మిల్లెట్ రాసిన ‘సెక్సువల్ పాలిటిక్స్’ వంటి గ్రంథాల ప్రభావం కూడా దీనిపై ఉంది. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అణచివేతకు గురవుతోందనీ, లైంగికత్వం, సంతానోత్పత్తి వంటివి పురుషాధిక్య సంబంధాలని స్త్రీ వాదుల ఆరోపణ. పురుషాధిక్యత నశించాలనీ, అన్ని రంగాల్లో మహిళల సమానహక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాలనీ, స్త్రీలు మూఢాచారాల ముసుగులో పడకూడదన్న ఆశయాలతో, అస్తిత్వ నిరూపణ లక్ష్యంతో స్త్రీవాద కవిత్వం ప్రారంభమైంది. తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. 1980 నుంచి వచ్చిన స్త్రీవాద కవితలను త్రిపురనేని శ్రీనివాస్ ‘గురి చూసి పాడేపాట’ పేరుతో 1990లో తొలి స్త్రీవాద కవితా సంకలనాన్ని ప్రచురించారు. 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సావిత్రి రాసిన బందిపోట్లు కవితా ఖండిక సంచలనం సృష్టించింది. తర్వాత నీలిమేఘాలు (1993) సంకలనంలో ఈ కవిత చోటు చేసుకుంది. 1993లో నీలిమేఘాలు కవితా సంకలనాన్ని శతాధిక కవయిత్రుల కవితలతో అస్మిత ప్రచురించింది. అందులో వసంతా కన్నాభిరామన్ రాసిన ‘స్త్రీగా రాయటమంటే’, ఓల్గా రచించిన ‘సంకెళ్లు తెగుతున్న సంగీతం’ వ్యాసాలు స్త్రీవాద దృక్పథాన్ని, సిద్ధాంత పరిధిని వివరించాయి. స్త్రీవాద కవితా ధోరణిపై ఎన్నో వాదాలూ, వివాదాలూ చెలరేగాయి. ఈ వివాదాలన్నింటినీ ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ఎస్. సూర్యప్రకాశ్ సంకలనకర్తగా అ.ర.సం. 1997లో ప్రచురించింది. ఎన్.గోపి, ఎండ్లూరి సుధాకర్, భగ్వాన్, ఆశారాజు వంటి కవులు కూడా స్త్రీవాద ధోరణితో కవితలు రాశారు. ఎండ్లూరి సుధాకర్ ‘షమ్మా’, శిఖామణి ‘పూల బజార్’ వంటి సంకలనాలను ప్రచురించారు. ప్రముఖ స్త్రీవాద కవితా సంపుటాలు 1. జయప్రభ: పైటను తగలెయ్యాలి, వామనుడి మూడో పాదం (1988) 2. రేవతీ దేవి: శిలాలోలిత (1980) 3. కొండేపూడి నిర్మల: సందిగ్ధ సంధ్య(1986), నడిచే గాయాలు (1990), మల్టీ నేషనల్ ముద్దు (1992) 4. పాటిబండ్ల రజని: ఎర్రజాబిళ్ల ఎరీనా, అబార్షన్ స్టేట్మెంట్ 5. మంధరపు హైమావతి: సూర్యుడు తప్పిపోయాడు 6. విమల: వంటిల్లు, సౌందర్యాత్మక హింస (కవితా ఖండికలు) 7. తూర్లపాటి రాజేశ్వరి: తాళికట్టిన మృగం 8. బి. పద్మావతి: గుక్కపట్టిన బాల్యం 9. అలిశెట్టి ప్రభాకర్: వేశ్య (కవితా ఖండిక) 10. ఆశారాజు: అద్దంలో ప్రతిబింబం స్త్రీవాద నవలలు, కథలు కోకొల్లలుగా వచ్చాయి. తొలి స్త్రీవాద నవల రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’. ‘స్వేచ్ఛ’, ‘మానవి’, ‘ఆకాశంలో సగం’ ఓల్గా ప్రసిద్ధ నవలలు. మల్లాది సుబ్బమ్మ ‘వంశాకురం’, కుప్పిలి పద్మ ‘మూడుపాయల జలపాతం’ వంటివి మరికొన్ని ప్రముఖ నవలలు. దళితవాద కవిత్వ ధోరణి అంబేద్కర్ తాత్వికత పునాదిగా, జ్యోతిబా పూలే ఆశయాలు లక్ష్యంగా 1990ల్లో దళితవాద కవితాధోరణి ఆవిర్భవించింది. తొలి రోజుల్లో హరిజన, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వారి సమస్యల చిత్రీకరణను విస్తృత పరిధిలో దళిత సాహిత్యంగా భావించారు. దళిత వర్గాలు సృష్టించిందే దళిత సాహిత్యంగా కొందరు పేర్కొన్నారు. ఈ భావన సరైంది కాదు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం అగ్రవర్ణాలవారు సృష్టించిన సాహిత్యం కూడా దళిత సాహిత్యమే అవుతుంది. అయితే దళితేతరుల సాహిత్యం కంటే దళితుల సాహిత్యం వాస్తవ రూపానికి అద్దం పడుతుంది. ‘ఆయా సమస్యలు అనుభవిస్తున్న దళితుడి అభివ్యక్తి లోనూ, ఆత్మాశ్రయరీతిలోనూ గాఢత చోటు చేసుకుంటుంది’ అనే కొండపల్లి సుదర్శన రాజు అభిప్రాయం అమోదయోగ్యంగా ఉంది. జాషువా, బోయి భీమన్న, కుసుమ ధర్మ న్న, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు వంటి వారి కవిత్వంలో దళిత ఉద్యమ స్పృహ బలంగా ఉంది. గరిమెళ్ల సత్యనారాయణ, వంగపండు, మాష్టార్జీ వంటి వాళ్లు పాటల ద్వారా దళిత చైతన్యాన్ని కలిగించారు. ‘గబ్బిలం’ జాషువా తొలి దళిత కావ్యం. ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ బోయి భీమన్న విశిష్ట దళిత కావ్యం. దళిత కవితా ఉద్యమం రూపుదిద్దుకున్న తర్వాత వి. సిమ్మన్న, కొండపల్లి సుదర్శన రాజు ఆధ్వర్యంలో తొలి దళిత కవితాసంపుటి ‘దళిత కవితా సంకలనం’ 1991లో వెలువడింది. జయధీర్ తిరుమలరావు ప్రధాన సంపాదకుడిగా దళిత గీతాలు సంకలనం 1993లో వచ్చింది. జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ సంపా దకత్వంలో ‘పదునెక్కిన పాట’ 1996లో కవితా సంకలనాన్ని ప్రచురించారు. దళిత కవులు, దళిత నాయకస్తుతి, దళిత సంఘీభావ కాంక్ష, దళితుల కర్తవ్య బోధ, మను వు నిరసన, శంబూక, ఏకలవ్యుల సంస్మరణ, దళితుల రాజ్యాధికారం, రిజర్వేషన్ల పరిరక్షణ వంటి అంశాలు కవితా వస్తువులుగా దళిత కవితలు అసంఖ్యాకంగా వస్తున్నాయి. దళిత ఉద్యమస్ఫూర్తితో నవలలు, కథలు, నాటికలు అసంఖ్యాకంగా వస్తున్నాయి. ముస్లింవాద కవితా ధోరణి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇటీవల బలంగా వస్తున్న అస్తిత్వవాద కవితా ధోరణి ఇది. హిందూ మతఛాందస వాదుల తీరును ముస్లిం కవులు జీర్ణించుకోలేకపోయారు. బాబ్రీ మసీదు విధ్వంసంతో గాయపడ్డ ముస్లింల ఉనికి కోసం, హక్కుల పరిరక్షణ కోసం ముస్లిం కవితా ధోరణి ఆవిర్భవించింది. దళిత కవితా ధోరణిలో మైనార్టీలను భాగస్వాములుగా పేర్కొన్నా.. వీరి ప్రత్యేక అస్తిత్వం కోసం స్కైబాబా సంపాదకత్వంలో తొలి ముస్లింవాద కవితా సంపుటి ‘జల్ జిలా’ 1998లో ప్రచురించారు. ఈ సంపుటిలో సమాజ ప్రగతి కాంక్షతో, వారి హక్కుల పరిరక్షణ కోసం వజీర్ రహ్మాన్, ఇస్మాయిల్, స్మైల్, దేవీప్రియ, సుగమ్ బాబు వంటివారి కవితలున్నాయి. ముస్లిం స్త్రీవాద కవిత్వాన్ని ‘షాజహానా’ బురఖా నిరసనతో ప్రారంభించారు. యన్. రజియాబేగం ‘అల్లానే అన్నాడు’, షంషాద్ బేగం ‘పర్సనల్ లా’ వంటి కవితా ఖండికలు పాఠకుల్లో ఆలోచన రేకెత్తించాయి. ముస్లింవాద నవలలు, కథాసంపుటాలు ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నాయి. ఇటీవల అస్తిత్వవాదాల్లో భాగంగా బీసీ వాద, ప్రాంతీయ వాద కవితా ధోరణుల వంటివి రూపుదిద్దుకుంటున్నాయి. అనుభూతి వాద కవితా ధోరణి అనుభూతి కవిత్వం అంటే అనుభూతికి సంబంధించిందని, అనుభూతి కోసం ప్రాధాన్యతనిచ్చే కవిత్వమని అర్థం. కవి తాను పొందిన అనుభూతిని కవిత్వంలో చక్కగా ఆవిష్కరిస్తాడు. అనుభూతి కోసం అన్వేషిస్తూ దాన్ని సాహితీ జగత్తులో సాక్షాత్కరింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అది అనుభూతి కవిత్వం అవుతుంది. కవి ఏ అనుభవంతో చెప్పాలనుకున్నాడో అదే భావన పాఠకుడికి కలిగేలా చేయడమే ఈ కవిత్వ లక్ష్యం. అనుభూతి కవిత్వాన్ని గురించి ప్రముఖ విమర్శకులు ఆర్.యస్. సుదర్శనం ‘అనుభూతి కవిగా గుర్తు పట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తర్వాత మిగిలేది ఒక సందేశం, ఒక భావనం, ఒక దృక్పథం కాకుండా కేవలం అనిర్దిష్టమైన అనుభూతి కావాలి. అది పోలికలు, పదాల అల్లిక, ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణనల్లో దేని ద్వారానైనా కావచ్చు. కానీ అందులోని నవ్యత హృదయానికి అనుభూతిగా మిగలాలి’ అని నిర్వచించారు. ఆచార్య జి.వి. సుబ్ర హ్మణ్యం, గుంటూరి శేషేంద్రశర్మ, మాదిరాజు రంగారావు, అద్దేపల్లి రామమోహనరావు వంటి వారు ఈ కవిత్వాన్ని ఒక శాఖగా గుర్తించారు. ఏ ఇజానికి కట్టుబడనని నిర్దిష్టంగా చెప్పిన ఆధునిక కవి తిలక్. ఈయన రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిని అనుభూతవాద కవిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా విమర్శకులు పేర్కొన్నారు. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం అనుభూతి వాద కవులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మాదిరాజు రంగారావు, వేగుంట మోహన ప్రసాద్, ఇస్మాయిల్, అజంతా, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటివారు అనుభూతి వాద కవులు. ప్రముఖ అనుభూతివాద కవితా సంపుటాలు ఆర్. యస్. సుదర్శనం - నిశాంతం చలం - సుధ ఇస్మాయిల్ - చెట్టు నా ఆదర్శం, మృత్యు వృక్షం, చిలుకలు వాలిన చెట్టు, రాత్రివచ్చిన రహస్యపు వాన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ - అనుభూతి గీతాలు వేగుంట మోహనప్రసాద్ - చితి-చింత, రహస్తంత్రి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ- వెలుతురు పిట్టలు. మాదిరి ప్రశ్నలు 1. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారన్నప్పుడే భయంవేసింది’ అని పేర్కొన్న కవయిత్రి? 1) ఓల్గా 2) సావిత్రి 3) జయప్రభ 4) హైమావతి 2. ‘బతకడానికి నానాచావులు చస్తున్న వాళ్లం, చావడానికి మా దగ్గరకు రాకండి’ అని పేర్కొన్న కవయిత్రి? 1) వాణీ రంగారావు 2) ఓల్గా 3) జయప్రభ 4) రాజేశ్వరి 3. ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్నవారు? 1) సత్యవతి 2) రేవతీ దేవి 3) పాటిబండ్ల రజని 4) బి. పద్మావతి 4. ‘నవ్వే నక్షత్రంలా అమ్మకావాలి, నాన్న చేత తన్నులు తినని అమ్మకావాలి’ అని కోరుకున్న కవయిత్రి? 1) సుమతి 2) రేవతీ దేవి 3) నిర్మల 4) బి. పద్మావతి 5. ‘నేనింకా నిషిద్ధ మానవుణ్నే, నాది బహి ష్కృత శ్వాస’ అని చెప్పిన కవి? 1) శిఖామణి 2) ఎండ్లూరి సుధాకర్ 3) మద్దూరి నగేష్‌బాబు 4) సుదర్శన రాజు 6. ‘కవిని నేను వర్ణచాపాన్ని విరగ్గొట్టడానికి వచ్చిన దళిత కవిని నేను’ అని ప్రకటంచినవారు? 1) కత్తి పద్మారావు 2) ఇనాక్ 3) శిఖామణి 4) సతీష్‌చందర్ 7 . ‘పంచముడంటే ఐదో వేలు లేనివాడని మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు’ అని పేర్కొన్న కవి? 1) సతీష్ చందర్ 2) మద్దూరి నగేష్ బాబు 3) సిమ్మన్న 4) సుదర్శన రాజు 8. ‘రిజర్వేషనంటే సౌకర్యమో, సదుపాయమో కాదు తండ్రీ! అదొక పచ్చబొట్టు,అదొక ప్రాథమిక హక్కు’ అన్న కవి? 1) ఏకాంబరం 2) కత్తి పద్మారావు 3) మద్దూరి నగేష్‌బాబు 4) సతీష్ చందర్ 9. ‘అంటరానివసంతం’ నవలా రచయిత? 1) ఇనాక్ 2) జి. కళ్యాణరావు 3) చల్లపల్లి స్వరూపరాణి 4) స్వర్ణలత 10. ‘పువ్వులమ్మి అమ్మి పుప్పొడిని కోల్పోయిన వాళ్లం, గిన్నెలకు మాట్లేసి మాట్లేసి సొట్టబోయిన వాళ్లం’ అని ఆవేదనతో చెప్పిన కవి? 1) ఖాదర్ 2) అఫ్సర్ 3) జావేద్ 4) సయ్యద్ గఫార్ 11. ‘ఈ దేశ పటాన్ని చుట్టచుట్టి నీ కింద పెట్టుకోవడానికి అది నీ అయ్య జాగీరు కాదు’ అని నిరసించిన కవి? 1) గఫార్ 2) అఫ్సర్ 3) దిలావర్ 4) కరీముల్లా 12. ‘నేను కసాయిబును కాదు అనివార్య హింసావృత్తిలో జీవన పరమార్థాన్ని దర్శించే ముస్లిం ధర్మవ్యాధుణ్ని’ అని చెప్పిన కవి? 1) ఇక్బాల్ చంద్ 2) అఫ్సర్ 3) దిలావర్ 4) గౌస్ మొహిద్దీన్ 13. మొదటి మైనారిటీ వాద నవల? 1) పుట్టుమచ్చ 2) వెండిమేఘం 3) నీలినీడలు 4) రేగడి విత్తులు 14. ‘అయిదు నెలలకే నాలుగు నెలల కడుపు చేసి తలాక్ ఇచ్చి వెళ్లగొడతాడని నాకేం తెలుసు, నా పర్సనల్ లాయే నాకిది చాలన్నప్పుడు ఇక దేనికి మొరపెట్టుకోవాలి’ అని సగటు ముస్లిం స్త్రీ ఆవేదనను చెప్పిన కవయిత్రి? 1) షాజహాన్ 2) రజియా సుల్తాన్ 3) షంషాద్ బేగం 4) మొహజబీన్ 15. ఈ దేశం కేలండర్ పై తారీఖులం అని ప్రకటించిన కవులు? 1) విప్లవ కవులు 2) దిగంబర కవులు 3) మైనార్టీ కవులు 4) పైగంబర కవులు 16. ‘పద్యాన్ని లోతుగా తవ్వుతున్నాడు కవి. టన్నుల కొద్దీ మన్నుకింద, టన్నుల కొద్దీ మనస్సు కింద ఇంత లోతుగా దీన్ని ఎవరు పాతేశారో తెలీదు’ అన్న కవి? 1) శ్రీకాంత శర్మ 2) శేషేంద్రశర్మ 3) ఇస్మాయిల్ 4) వై. శ్రీరాములు 17. ‘పరుగెత్తిన వాళ్ల పాదాల గుర్తులు రేపటికి బాటలు పరుస్తాయి’ అని పేర్కొన్న కవి? 1) ఇస్మాయిల్ 2) మోహన్ ప్రసాద్ 3) శ్రీకాంత శర్మ 4) రేవతీ దేవి సమాధానాలు 1) 2; 2) 2; 3) 3; 4) 4; 5) 2; 6) 3; 7) 1; 8) 3; 9) 2; 10) 4; 11) 2; 12) 3; 13) 2; 14) 3; 15) 2; 16) 3; 17) 3. -
అర్థవంతం: పేర్ల వెనక ఫ్లాష్!
ఈ నవలలు ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖమైన స్థానం సంపాదించినవి. అంతకు మించి అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచినవి! ఈ నవలల కథాంశమే కాదు ఆ కథాంశాలకూ అత్యంత అర్థవంతంగా పేర్లను పెట్టిన విషయంలో కూడా రచయితల ప్రతిభ అద్భుతమనిపిస్తుంది! ఫైవ్‌పాయింట్ సమ్ వన్: ఐఐటీల్లో ప్రతి సబ్జెక్టుకీ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) గ్రేడింగ్ ఇస్తారు. ఇందుకు స్కేల్లో 10ని ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే పదికి ఎంత సీజీపీఏ సాధిస్తారనేది ఇక్కడ లెక్క. సబ్జెక్ట్ టాపర్‌కు 10 కి పది ఇచ్చి మిగతా వాళ్లకు వారి పెర్మార్మెన్స్ను బట్టి స్కేలింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ చదివే విద్యార్థులు ఎంతలేదన్నా కనీసం ఆరుకు పైగా పాయింట్లను తెచ్చుకుంటారు. అంతకు తక్కువ వచ్చిన వాళ్లు అపరమేధావులని (వ్యంగ్యంగా) లెక్క! ఆరుకు తక్కువగా గ్రేడ్ తెచ్చుకున్న వారిని... ఉదాహరణకు 5.76 వంటి స్థాయిలో సీజీపీఏ సాధించిన వారిని ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ కింద వ్యవహరిస్తారు! 5 కు 6 కు మధ్యలో సీజీపీఏ సాధించిన వారంతా ‘ఫైవ్‌పాయింట్ సమ్ వన్’లే! ఐఐటీ స్టూడెంట్ అయిన చేతన్ భగత్ తన నవలలో హీరోల సీజీపీఏ స్థాయిని బట్టి పేరును ‘ఫైవ్‌పాయింట్ సమ్‌వన్ ’ అని పెట్టారు! మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్: పురుషులు అంగారక గ్రహ వారసులైతే, స్త్రీలు శుక్రగహ వారసులు! ఇద్దరూ కలిసి భూగ్రహం మీద సాగించే జీవితాల్లో వారి మధ్య వచ్చే వైరుధ్యాల గురించి జాన్ గ్రే రాసినదే ఈ నవల! మన సౌర కుటుంబంలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలున్నాయి. వాటిలో ఏడు గ్రహాలు ఒక తీరున ఉంటే శుక్రగ్రహం(వీనస్)మాత్రం ప్రత్యేకం! అన్ని గ్రహాలూ ఒక దిశలో పరిభ్రమిస్తుంటే వాటన్నింటికీ వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంటుంది ఈ గ్రహం! శుక్రగ్రహం మీద రిస్ట్ వాచ్ లేదా వాల్ క్లాక్ ఉంచితే అది అపసవ్య దిశలో తిరుగుతుందని శాస్త్రవేత్తలంటారు! ఏవిధంగా చూసినా ఇతర గ్రహాలతో పోల్చినప్పుడు వీనస్ ఈజ్ రివర్స్ ప్లానెట్! అచ్చం ఆడవాళ్లలాగే అనేది ఈ అమెరికన్ రచయిత ఉవాచ! ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరు’ అన్న భావాన్ని స్ఫూరించేలా వారు శుక్రగ్రహం నుంచి వచ్చారేమో అన్న అనుమానం ఈ పుస్తకం ద్వారా వ్యక్తపరిచారు. అదే ఫన్ ను తన నవల పేరుతోనే పండించారు! ఇక్కడ మరో థియరీ కూడా ఉంది. గ్రీకుల ప్రేమ దేవత పేరు ‘వీనస్’. మహిళలను ప్రేమ మూర్తులుగా భావిస్తూ వారిని వీనస్‌కు వారసులుగా భావిస్తూ ఈ పేరు పెట్టారట. జాగ్రఫీ పరంగా తీసుకుంటే.. మార్స్ చాలా హీట్. మీథేన్గ్యాస్లతో కూడు కొన్న వీనస్ చల్లదనంతో కూడిన గ్రహం. పురుషులు అగ్రెసివ్, మహిళలు కూల్ అనే భావనతో కూడా రచయిత తన నవలకు ఈ పేరు పెట్టాడ నేది మరో థియరీ. మిడ్నైట్ చిల్డ్రన్: 20వ శతాబ్దంలో భారతదేశం నుంచి వచ్చిన ఆంగ్లసాహిత్యంలో ప్రముఖమైనదిగా నిలిచిన ఈ నవలకు బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ష్ద్రీ సృజించిన వచన కావ్యమిది! దేశవిభజనతో ముడిపడిన పేరు ఇది! అవిభాజ్యభారతం ఒక అర్ధరాత్రి విభజించ బడింది. మతం అనే ఒకే ప్రాతిపదికతో ప్రజలు అటు ఇటు కదిలిపోతున్నారు. తమ మతానికి ఒక దేశాన్ని ఎంచుకుని...తమ మతం తమను అక్కడే బతకమని అదేశించినట్టుగా కదులుతున్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతావని నిట్టనిలువుగా చీలిన ఆ అర్ధరాత్రి జన్మించిన చిన్నారుల కథ ‘మిడ్నైట్ చిల్డ్రన్’! దేశ విభజనలోని అత్యంత సున్నిత కోణాన్ని తాకిన థీమ్ ఈ నవలది. పేరులోనే ఆ భావం వ్యక్తమయ్యిందేమోననిపిస్తుంది. - జీవన్‌రెడ్డి. బి