రాతి హృదయం | Yaddanapudi Sulochana Rani Rathi Hrudayam | Sakshi
Sakshi News home page

రాతి హృదయం

Published Fri, May 25 2018 1:32 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Yaddanapudi Sulochana Rani Rathi Hrudayam - Sakshi

ప్రేమ
ప్రేమ అమ్మ పాల వంటిది
అది ఒక చైతన్యధార!
దానికి మతం, కులం, ఇజం అనేవి ఏవీ లేవు,
ఈ మానవాళికి అది ఒక అమృతధార
స్త్రీ ఒక ప్రేమ దాసి!
ఆమె పుట్టినప్పటి నుంచి తల్లిలో,
తండ్రిలో, అక్కచెల్లెళ్ళలో, అన్నదమ్ముల్లో,
ఇరుగుపొరుగులో, పెళ్ళి అయిన తరవాత భర్తలో,
పిల్లల్లో, అత్తమామల్లో, దేవుడిలో, ప్రేమను వెతుక్కుంటూ వుంటుంది..
యుగయుగాలనుంచి, ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా ఆమె కోరుకున్న ప్రేమ తనకి లభించినట్టు చెప్పలేక పోతూంది...
దీనికి కారణం ఏమిటి? మనుషులా? కాలమా?

రాతి హృదయం

నేను హైదరాబాదులో దుర్గం చెరువు దగ్గర ఉన్న ఒక పెద్ద బండ రాయిని. నా వయసు నాకే తెలీదు. సృష్టిలో విస్ఫోటం జరిగి ఈ భూమి ఏర్పడినప్పుడు ఏర్పడిన శిలాకుటుంబం మాది. మా వయసు వేల సంవత్సరాలు. మొదట్లో గరుకుగా, మోటుగా ఉన్న మా కుటుంబం, ఈ ప్రకృతి మమ్మల్ని అదే పనిగా తోమటంతో ఇలా నున్నగా, నిగనిగలాడుతూ, అప్పుడే బ్యూటీ పార్లర్‌ నుంచి ఒచ్చిన సొగసైన అమ్మాయి ముఖంలా మెరుస్తున్నాం అనేవారు మా పెద్దవాళ్ళు. మాది కఠినకాయం. చెరువు చుట్టూ చిన్నా–పెద్దా, తాత–ముత్తాతలైన పెద్ద పెద్ద రాళ్ళతో మా కుటుంబం ఉండేది.

హైదరాబాదుకి వయసు వచ్చి, మమ్మల్ని నమిలి మింగేయసాగింది. మా పూర్వీకులు చాలా మంది నశించిపోయారు. నాది భారీకాయం. ఎండ వచ్చినా, వెన్నెల వచ్చినా, నా నీడ 300 గజాలు పైగా వ్యాపిస్తుంది.
ఈ ప్రపంచంలోకల్లా, నాకు చాలా ఇష్టమైనది నా నీడ. నా నీడలో, పగలు మేకలు, కుక్కలు వచ్చి పడుకుని సేదతీరుతాయి, అప్పుడప్పుడు మేకలు ప్రసవించడం కూడా జరుగుతుంది. మేకలు కాసే పిల్లవాడు, నన్ను ఆనుకొని కూర్చొని పిల్లనగ్రోవి వాయిస్తుంటే, నాకు పరవశం కలుగుతుంది. ఇంతకంటే నాకు కనువిందైన దృశ్యాలు ఎన్నో!

సాయంత్రం వేళ, వెన్నెల రాత్రులలో, ప్రేమికులైన యువతీయువకులు వచ్చి నా నీడ క్రింద కూర్చొని, అరమరికలు లేకుండా సరసాలు ఆడుకుంటూ, ముద్దుముద్దుగా ప్రవర్తిస్తుంటే నాకు చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉండేది. నిజం చెప్పొద్దూ? ఒక్కోసారి వారి చేష్టలు చూడలేక, కళ్ళు మూసుకునేదాన్ని. కొంతమంది వాళ్ళ తీపి గుర్తుగా నా భారీకాయంలో కొంతభాగంలో వాళ్ళ ప్రేమికులని నిలబెట్టి ఫోటోలను తీసుకునేవారు, నా మీద వారి గుర్తుగా పిచ్చి పిచ్చి రాతలు రాసేవారు. నేను ఇవన్నీ వర్ణించి వర్ణించి చెప్తుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నిట్టూర్చేది.

‘‘రాతి మిత్రమా! నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. నా సంగతి చూడు. ఒకప్పుడు వాన నీళ్ళతో కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండేదాన్ని ఇప్పుడు మనుషుల, పశువుల మలమూత్రాలు నాలోనే ఒంపేస్తున్నారు. వ్యాఖ్‌..! ఒక్కరూ నన్ను ప్రేమగా చూడటం లేదు. ఏం చెప్పను? జన్మ ఎత్తగానే సరిపోతుందా? మంచిగా బ్రతుకు వెళ్ళదీసే మహా అదృష్టం కూడా ఉండాలి.’’
నేను గర్వంగా ఫీల్‌ అయ్యాను, నేనెంత బలశాలినో గుర్తుచేసుకొని చెరువుని చిన్న చూపు చూసాను.

రోజులు గడుస్తున్నాయి, నాకు చాలా ఉత్సాహం పెరిగిపోయింది. ఒకసారి చెరువుతో అన్నాను.. ‘మనమిద్దరం ప్రేమించుకుందామా! పెళ్లి చేసుకుందామా?’

చెరువు నా మాటలకి సిగ్గుపడుతూ ‘‘అంత అదృష్టమా?’’అంటుంది అనుకున్నాను. కానీ బ్రహ్మరాక్షసిలా విరుచుకుపడింది. ఆవేశంతో ఊగిపోయింది. ‘‘బండ వెధవా! ఇన్నాళ్లు ఇరుగు పొరుగుగా ఉన్నామని అరమరికలు లేకుండా మాట్లాడాను. దుర్మార్గుడా! నీ కుటుంబం నాశనం అవుతుంది. దున్నపోతా! నీ మంచితనం అంతా నటనన్నమాట! నీచుడా! నీ తల నిలువునా పగిలిపోనూ! నీదేం జాతి, నాదేం జాతి? కాస్త రంధ్రం దొరికితే మైళ్ళ దూరం పరిగెత్తిపోయే జాతి నాది. కూర్చున్నచోటి నుండి కదలలేని వెధవ్వి నువ్వు! ఖబడ్దార్‌! కన్నెత్తి చూసావో?’’ అని దులపరించింది.

ఆమె అరుపులకి, నా మీదకి విరుచుకుపడిపోతున్న దురుసుతనానికి బిత్తరపోయాను. నా తల మీద విందు చేసుకుంటున్న కాకులు ఆమె అరుపులకి కావ్‌! కావ్‌! అని అరుస్తూ ఎగిరిపోయాయి.

నేను తల దించుకున్నాను. సిగ్గుపడ్డాను. కొంతమందికి కొన్ని అర్హతలు ఉండవు. అంతే! భగవంతుడు కొంతమంది జీవితాలు శూన్యం చేసి, ఎదురుగా అందమైన ప్రపంచం, చైతన్యం, చూపించి ఏడిపిస్తాడు. నా హృదయం క్రుంగిపోయింది. మనకి ఇష్టం కదా అని, ఎదుటివారి మనసు తెలుసుకోకుండా మాట్లాడితే, అవి ప్రేమవాక్యాలు కాదు, పిచ్చి ప్రేలాపనలు అవుతాయని తెలుసుకున్నాను.

ప్రేమ

ఒక రోజు నా ఖర్మ కాలింది. ఎవరో డైనమైట్‌ పెట్టి... ఒకటి కాదు!! రెండు కాదు!! 20 డైనమైట్లు పెట్టి నన్ను నిలువునా పేల్చేసారు. నా శరీరం పేలిపోయింది. సగం శరీరం తునాతునకలైంది. మిగతా సగం శరీరం ఆపిల్‌ పండుని సగానికి కోసినట్టు, మొండి శరీరం సగం ముక్కగా ఉండి పోయింది.

ముష్కరులు అయిన ఈ దుష్టమానవ మూక ఇలా వచ్చి మా వంశం అంతా నాశనం చేసింది.. ఉన్నవాళ్ళలో అర్ధశరీరంతో ఉన్న నేనే పెద్ద దిక్కుని. నా వంశం అంతా కూలిన బురుజులా ఉన్నాయి. వాళ్ళను చితకపొడిచి క్రేన్లతో బుట్టలతో ఎత్తి పడేసి, బర్రున శబ్దం చేస్తూ ట్రక్కులు తీసుకుపోతుంటే నేను వల.. వల.. ఏడ్చాను. ఎంత గొప్ప కుటుంబం నాది! వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం చేస్తున్నాం.. ఈ ముష్కరులైన మానవులు మా మీద పడి మా వునికినే నాశనం చేస్తున్నారు.. మా జాతిని కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇంత చరిత్ర చూసిన పెద్ద మనిషిని కదా! సగర్వంగా చెప్పుకొని చూపించుకునేది పోయి, నన్ను సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నేను కాలానికే గుర్తుని. ఇలా అయితే హైదరాబాదు బాల్డ్‌ హెడ్‌ అవుతుంది..

ముష్కరమానవులకి దేని మీదా ప్రేమ లేదు! ప్రాచీనమైన వాళ్ళ భాషనే నాశనం చేసుకుంటున్నారు.. సాంస్కృతిక వారసత్వం అయిన అన్ని కట్టడాలనీ మింగేస్తున్నారు.. ఆధునికత అనే భ్రమశాలి గుండులో పడ్డ ఈగలా మతిపోయినట్టు ఉన్నారు.

ఇలా అయితే ఏముంటుంది చరిత్ర? ఏడుపొస్తోంది నాకు. నా శరీరం చూడండి. బలశాలిలా, సూర్యకాంతిలో, చంద్రకాంతిలో నిగనిగ లాడుతూ ప్రేమికులు, మేకలు, కుక్కలు, పిల్లనగ్రోవి వాయించేవాడు నీడ కోసం నా దగ్గరికి రావటం నాకు ఎంత సంతోషమో.. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోతుంటే రెట్టింపు బాధ వేస్తోంది. ఇప్పుడు నా దగ్గరికి ఎవ్వరూ రారు. నేనెప్పుడు ఎవరి మీద పడిపోతానో అని వారికి భయం! ఈ బాధ నేను వెళ్ళబోసుకుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నన్ను చూసి ముసిముసి నవ్వు నవ్వింది.. నా బాధ ఇంకా రెట్టింపు అయింది..

ఓ ముష్కరమానవుడా! మేము ప్రకృతి ప్రసాదించిన జీవితంతో ప్రశాంతంగా.. అమాయకంగా.. మా బతుకులు మేము బతుకుతున్నాం.. మమ్మల్ని మీరు ఇలా మూకుమ్మడిగా మా కుటుంబాలని నామరూపం లేకుండా ఎందుకు నాశనం చేస్తున్నారు?

‘‘అడుగో! అడుగో! వస్తున్నాడు! వచ్చేస్తున్నాడు డైనమైట్ల రాక్షసుడు! వాడి చేతిలో బ్యాగ్‌ చూసాను.. నా గుండె ఝల్లు మంది. నాకు తెలుసు! నాకు ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి. నేను ఏడుస్తున్నాను..! బిగ్గరగా ఏడుస్తున్నాను..! దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాను.. నా ఏడుపు మీ చెవులకి వినిపిస్తోందా? వినిపిస్తోందా? వినిపిస్తోందా?

మా ఊరి గురించి కొన్ని వాక్యాలు...
అందరూ మా ఊరి గురించి అడుగుతున్నారు.. మా ఊరు అప్పట్లా లేదు. చాలా మారిపోయింది. మట్టి రోడ్లు పోయి. కంకర రోడ్లు వచ్చాయి. కాలవలో పడవలు పోయి. రోడ్ల మీదికి బస్సులు వచ్చాయి.. ఇంటింటికి కారు.. ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్‌.

నా చిన్నప్పుడు సాయంత్రం అవగానే.. పంచాయితీ నౌకరు ఒచ్చి. ప్రతి వీథిలో ఉన్న దీపస్తంభాలని నిచ్చెనతో ఎక్కి, అందులో దీపం వెలిగించేవాడు. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉండేది నాకు. ఇప్పుడు ఊరంతా. ఇళ్ళంతా కరెంటు లైట్లు. ఏసీలూ, షవర్లూ వచ్చాయి. గుడి పడగొట్టేసి చాలా అందమైన పెద్ద గుడి కట్టారు. లైబ్రరీ పడగొట్టేస్తున్నారు. 

పొద్దున లేవగానే సన్నటి శబ్దాలు చేసే పిచుకలు ఎప్పుడో అంతరించిపోయాయి. కాకుల గోల తగ్గింది. ఒకటో అరో రామచిలుకలు ఎగురుతున్నాయి. గడ్డి. మట్టి. వాసన పోయింది.

చెరువు మెట్లు పాడుబడ్డాయి. చెరువు కళ లేకుండా పోయింది. ఊరిని నూతనతరానికి యౌవనవంతం చేయాలని ప్రజలు చాలా కృషి చేస్తున్నారు. 

మరికొన్ని మ్యూజింగ్స్‌ రేపటి సంచికలో... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement