ప్రియాతి ప్రియమైన పాఠకులారా!!
ఈ రోజు ఈ ఉత్తరం మీకు వ్రాస్తుంటే నా మనసు చెప్పలేనంత ఉద్విగ్నభరితంగా ఉంది.
60 సంవత్సరాల సుదీర్ఘమైన నా రచనాప్రయాణంలో నేను 1957లో వ్రాసిన ‘చిత్రనళినీయం’అనే ఈ కథ నా తొలి అడుగు! దాదాపు 60 సంవత్సరాల అలుపెరుగని, నిరుత్సాహం ఎరుగని, విసుగు ఎరుగని, సుదీర్ఘ ప్రయాణం ఇది.
నేను పుట్టి పెరిగినది ‘కాజ’అనే చిన్న గ్రామం. చాలా అందమైన పల్లెటూరు. ప్రకృతి మధ్య ఒదిగి పడుకున్న అమాయకపు పసిపాప లాంటి అందమైన ఊరు. ఎటు చూసినా పచ్చదనం! పంట కాలవలు. వరిచేలు. ఉదయం అవగానే చెట్ల మీద గుంపులుగా వాలే రామచిలుకలు, కావ్–కావ్ మని కాకుల గోలలు! వేణుగోపాల స్వామి ఆలయంలో జేగంటల ధ్వనులు.. ఇటు పక్క శివాలయంలో శివనామ స్మరణలు! దొడ్లో ఒక పక్క బావిలోంచి బకెట్టుతో నీళ్ళు తోడుతున్న చప్పుడు..! ఇటు పక్క కట్టెలపొయ్యి మీద కాగులో కాగుతున్న వేడి నీళ్ళు. పొయ్యిలోంచి కట్టెలు, పిడకల వాసన. కొద్ది దూరంలో ఆవు పేడ వాసన. గుమ్మం పక్కన విరగబూసి సువాసనలు వెదజల్లుతున్న సన్నజాజి చెట్టు. దానికి కొద్దిదూరంలో తులసి వనంలా పచ్చటి తులసి మొక్కలు.. తెల్లవారేసరికి ఒకటో రెండో పళ్ళు రాల్చే విరగ గాసిన బాదం చెట్టు.
ఇంట్లో కరెంటు లేదు. కిరసనాయిలు లాంతర్ల ముందు కూర్చుని అప్పుడప్పుడు పుస్తకాలు చదివేదాన్ని. ఊరిలో అన్నిటికంటే నాకు ప్రియాతి ప్రియమైనది ‘మా ఊరి చెరువు’. దాన్ని చూస్తే సంతోషంతో పులకరింతలు వచ్చేవి.. ఎందుకంటే అది ఒక అందమైన, అద్భుతమైన దృశ్యం! ఆ చెరువులో తెలుపు, ఎరుపు కలువ పూలు!! కొన్ని మొగ్గలుగా ఉండేవి. కొన్ని విచ్చుకుని విరబూసి ఉండేవి. కార్తీకమాసంలో, చలిలో అమ్మా అత్తయ్యలు, చెరువుకి స్నానానికి వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళేదాన్ని. అమ్మ ఒక పాత చీరలో నన్ను కాగితంలో పొట్లం చుట్టినట్టు చుట్టి చలిబారిన పడకుండా చూసేది.
చెరువు మెట్ల మీద కూర్చుని అమ్మా అత్తయ్యలు అరటి దొప్పల్లో దీపాలు పెట్టి చెరువులోకి వదిలేస్తుంటే, అవి మెల్లగా నీటిలో ప్రయాణం చేస్తుంటే ఆ చీకటి రాత్రి, చెరువు – దీపాలు , నాకు చాలా ఆనందంగా, చూడముచ్చటైన దృశ్యంగా ఉండేది. తెల్లవారి అమ్మా అత్తయ్యలు చెరువు గట్టున ఉన్న రామాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే నేను చెరువుని వదలలేని దానిలా అక్కడే కూర్చునే దాన్ని.. చెరువు చుట్టూ పాకలు! పైకప్పులోంచి వలయాకారంగా బయటికి వస్తున్న వంట పొయ్యిల పొగలు.
మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. పోస్ట్ అంతా పంట కాలవలో, పడవలో బందరు వెళ్ళాలి. అలా నేను వ్రాసిన నా మొట్టమొదటి కథ ‘చిత్ర నళినీయం’ పంట కాలవలో, పడవలో ప్రయాణం చేసి బందరు వెళ్ళి, అక్కడ నుంచి రైలులో మద్రాసు వెళ్ళింది. ఆ పచ్చటి పొలాలు, పంట కాలవల్లో ఆకాశం పైనుందా, క్రింద కాలవలో ఉందా అన్నట్టూ ప్రతిబింబించే దృశ్యాలు.. పడవని తాడుతో లాగుతూ ఒడ్డున నడిచే పల్లెకారులు, నీళ్ళలో వెళుతున్న పడవ శబ్దం. ఇదంతా గుర్తుకువస్తే ‘సత్యజిత్ రే’ సినిమాలో ఒక దృశ్యంలా అనిపిస్తుంది. అప్పటికే నా వివాహం కావడం వల్ల నా పేరు యద్దనపూడి సులోచనారాణి అని పెట్టుకున్నాను.
అలాంటి పల్లెటూరిని వదిలి ఈ హైదరాబాదు వచ్చాను. కాలగమనంలో ఇన్నాళ్ళ నా సాహితీచరిత్ర సాగుతోంది. ఇంకెన్ని పుటలు ఉన్నాయో నాకే తెలి యదు.
కాలగమనంలో మార్పు చూడండి.. ఆ నాడు పంట కాలవలో, పడవలో వెళ్ళే నా కథ, ఇప్పుడు నా కలం నుంచి తెల్ల కాగితం మీద వచ్చిన అక్షరాలని ‘అని’ నిమిషంలో కంప్యూటర్లో పెట్టడం జరుగుతోంది..
1957 లో ప్రచురితం అయిన నా ఈ కథని మీ ముందు ఉంచుతుంటే, నా హృదయం ఊహించలేనంత ఉద్విగ్నంగా, ఆనందంగా ఉంది. ఈ క్షణం, 60 సంవత్సరాలు గల గతం, ఇప్పటి ఈ రోజు వర్తమానం రెండూ కలిసిపోయిన అద్భుత క్షణాలుగా అనిపిస్తున్నాయి..
కథ ముందు.. నేను రచయిత్రిగా ఎలా మారానో, నేను రాసిన మొట్టమొదటి కథ వెనక జరిగిన కథ ఇది :
‘చిత్రనళినీయం’ కథ పోస్ట్ చేయటానికి వెనక చిన్న కథ వుంది. నేను ఆ కథ రాయటానికి (ఇది నేను ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయిన తర్వాత సెలవల్లో వ్రాసాను). అంత క్రితం 8వ క్లాసు చదువుతుండగా స్కూల్లో మేగ్జీన్ కోసం ఖుద్దూస్ మాస్టార్ గారు నన్ను ఒక కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అన్నాను. అంత క్రితం నేను ‘గోమాత’ మీద ఒక వ్యాసం వ్రాసి, క్లాస్‌లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. నేను అది బాగా వ్రాసానని, క్లాస్‌లో మిగతా పిల్లలతో నాకు అభినందనగా చప్పట్లు కొట్టించి, వారితో కలిసి ఆయన కూడా కొట్టారు! నా మనసు పరవశించి పోయింది. ఖుద్దూస్ మాస్టార్ ముస్లిం అయినా తెలుగు బాగా మాట్లాడేవారు, వ్రాసేవారు. చక్కగా కథలు చెప్పి నీతి బోధించేవారు. ఆయనంటే నాకు బాగా ఇష్టం.
నిజానికి ‘గోమాత’ వ్యాసం వ్రాయటానికి నేను యేమీ కష్టపడలేదు. మా దొడ్లో ఒక ఆవు ఉండేది. అమ్మ దాన్ని ‘లక్ష్మి’ అని పిలిచేది. దాని ముఖానికి పసుపు రాసి, బొట్టు పెట్టి, దండం పెడుతూ దాని చుట్టూ ప్రదక్షిణం చేసేది. అది మూత్రం పోస్తే దాని తోక మీద పట్టి, తన తల మీద చల్లుకుని, నా తల మీద చల్లేది. లక్ష్మికి ఒక దూడ ఉండేది. అది దొడ్లో చెంగున గంతులేస్తుంటే మేం పిల్లలంతా దానితో ఆడేవాళ్ళం. నేను దాన్ని పట్టుకుని, మా అమ్మలా దాని మెడ మీద నిమిరేదాన్ని! అది నా దగ్గరికి వచ్చేసేది. మా బాబాయి ఒకరు ఆవు వల్ల ఉపయోగాలు చెప్పారు. ఇదంతా కలిపి ఒక వ్యాసం వ్రాసాను.
మూత్రం శుద్ధి చేయటానికి పనికొస్తుందని, పాలు ఆరోగ్యానికి మంచిదని మా బాబాయి చెప్పినట్టే వ్యాసంలో వ్రాసాను. ఇది వ్రాసిన తర్వాత ఖుద్దూస్ మాస్టార్ స్కూల్ నుంచి వచ్చే వ్రాత పత్రికకి కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అని అంటే... నువ్వు వ్రాయగలవని ప్రోత్సహించారు. ఆయన పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది గుర్తుకువచ్చి, శరీరం సంతోషంతో పులకరించేది. ఆ ఉత్సాహంతోనే స్కూల్ వ్రాత పత్రికకి ఒక కథ వ్రాసాను. దాని పేరు ‘మనోఛాయలు’ (ఇద్దరు స్కూల్లో చదివే స్నేహితురాళ్ల మధ్య చిన్న మనఃస్పర్థలు వచ్చి, మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఆనందంగా ఒకరి భుజం మీద మరొకరు చేతులేస్కొని, స్నేహంగా స్కూల్‌కి వెళ్ళటం! ) అది నా 14వ సంవత్సరంలో వ్రాసిన కథ! అది కూడా ఖుద్దూస్ మాస్టార్ మరీ మరీ వ్రాయమని అడిగితే వ్రాసినదే!
నేను పెద్ద రచయిత్రిని అయిన తర్వాత, ఎవరో ఒకరు వ్రాయండి అని అడిగితే రాసిన నవలలే ఎక్కువ..
1) సెక్రటరీ – రమణా – బాపు, జ్యోతి రాఘవయ్య గారు.
2) జీవన తరంగాలు – నార్ల వెంకటేశ్వరరావు గారు
3) మీనా – చక్రపాణి గారు
4) ఆరాధన – ఎమెస్కో ఎం.ఎన్. రావు గారు
ఈ విధంగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది.
ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు అయిపోయినాయి. వేసవి సెలవుల తర్వాత నవంబర్లో అమ్మ పోయింది. మనసులో భయం! ఒంటరితనం! దిగులు.. దుఃఖం! అప్పటికే పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది. నాన్న ఎస్.ఎస్.ఎల్.సి. అయి, ఇంటర్ అయిన తర్వాత కాపురానికి పంపిస్తామని పెళ్ళికి ముందే షరతు పెట్టారు. ఇంటినిండా అక్కయ్యలు, ఒదినలు, పిల్లలు.. అయినా ఒంటరితనం. ఖుద్దూస్ మాస్టార్ ఒకసారి నాన్నని చూడటానికి వచ్చి.. నన్ను కథలు వ్రాయమని గట్టిగా చెప్పారు... కథలు వ్రాస్తే నా బాధలు పోతాయని చెప్పారు... అప్పుడు ‘చిత్రనళినీయం’ వ్రాసాను.. – యద్దనపూడి సులోచనారాణి
రహస్యంగా పోస్టయిన కథ... మంగళవారం (29.05.2018) సంచికలో...
Comments
Please login to add a commentAdd a comment