Novelist
-
అక్షర లక్షలు
దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్ తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్ ‘ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది. ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్‌లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్ పేషెంట్’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు. అక్టోబర్ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్ ప్రై జ్ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది. ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్ ప్రైజ్ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు! బుకర్ ప్రైజ్ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్ ఫుడ్ హోల్‌సేల్ ఆపరేటర్ అయిన ‘బుకర్ గ్రూప్ లిమిటెడ్’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మ్యాన్ గ్రూప్’ ఇచ్చినందున మ్యాన్ బుకర్ ప్రైజ్ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్‡్ష శ్రీమంతుడు మైకేల్ మోరిట్జ్ ఛారిటీ సంస్థ ‘క్రాంక్‌స్టార్ట్’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి. యూఏఈకి చెందిన ‘మిలియన్స్ పొయెట్’ పోటీకి 50 లక్షల ధీరమ్స్ (సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్ కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్పీ రేటింగ్స్‌లో ఫుట్‌బాల్‌నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్ లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్‌మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది. పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ మెమోరియల్ అవార్డు’ పేరుతో స్వీడన్ లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్ జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ విజేతకు ఒక కోటి స్వీడిష్ క్రోనార్ల నగదు (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు. మళ్లీ బుకర్ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్తో పాటు గెలుచుకున్నది ఇదే. ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్ హాండ్కే. మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా? -
‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రికి బెదిరింపులు..
లండన్: బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్(57)కు పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్‌చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడన్నారు. -
Mannu Bhandari: రాలిన రజనీగంధ
స్వాతంత్య్రానంతరం వచ్చిన రచయితల తరంలో మన్నూ భండారీ(3 ఏప్రిల్ 1931 – 15 నవంబర్ 2021) ఒక అద్భుతమైన మహిళ. కథకురాలిగా, నవలా రచయిత్రిగా పురుషాధిక్య ప్రపంచంలో ఆమె తలెత్తుకు నిలబడ్డారు. అజ్మీర్(రాజస్థాన్)లో కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె స్వాతంత్య్రోద్యమపు బందులు, నిరసనలు, ఊరేగింపుల్లో పాల్గొన్నారు. వీధుల్లో అబ్బాయిలతో మార్చ్ చేస్తూ, స్లోగన్లు ఇస్తూ, రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్న ఆమె తీరును తండ్రి జీర్ణించుకోలేకపోయారు. కానీ నరాల్లో ఉద్యమావేశపు లావా ఉప్పొంగుతున్నప్పుడు ఆమెను ఎవరు ఆపగలరు? అదే కృతనిశ్చయాన్ని ఆమె తన సహ రచయిత రాజేంద్ర యాద వ్ను వివాహమాడటంలోనూ చూపారు. పై చదువులకు కోల్‌కతా వెళ్లినప్పుడు యాదవ్‌ను ఆమె కలిశారు. అదే కోల్‌కతాలో హిందీ టీచర్‌గా ఆమె కొన్నాళ్లు పనిచేశారు. చక్కటి చదువరి అయిన మన్ను తన మొదటి కథ ‘మై హార్ గయీ’(నేను ఓడిపోయాను) అలా రాసేశారు. 1957లో ‘కహానీ’ మ్యాగజైన్లో దానికి వచ్చిన స్పందన ఆమెను గాలిలో తేలి యాడించింది. ప్రతిగా మరిన్ని కథలు రాశారు. అన్నీ కూడా తను పెరిగిన అజ్మీర్‌లోని మనుషులను ఆధారం చేసుకొన్నవి. రాజేంద్ర యాదవ్ 1951 నాటికే ‘సారా ఆకాశ్’ రాసివున్నారు. హిందీ రచయితలకు సాహిత్య వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుందని వాళ్లు 1964లో ఢిల్లీకి మారిపోయారు. ఢిల్లీ యూనివర్సిటీలో మన్నూకు లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది. ఇక తర్వాతి సంవత్సరాల్లో మిరుమిట్లు గొలిపే కీర్తిశిఖరాలను ఆమె అధిరోహించారు. కథలు రాస్తూనే, నవలలకు మారి, అటుపై సినిమా రచన ల్లోనూ మునిగిపోయారు. యాభైకి పైగా ఉన్న ఆమె కథలు ముఖ్యంగా చిన్న పట్ట ణాల్లోని మధ్య, దిగువ తరగతి జీవితాలను అరుదైన సున్నితత్వంతో చిత్రిస్తాయి. సామాజిక బంధనాల్లో చిక్కుకున్న, వాటిని దాటడానికి పోరాడిన, అలసిపోయిన మహిళలు కూడా ఆమె రచనల్లో కనబడతారు. 1950ల మధ్యలో మొదలైన నవ్య కథా ఉద్యమంలో మన్నూ భండారీ కూడా భాగం. ఆమె భర్త రాజేంద్ర యాదవ్‌తో పాటు మోహన్ రాకేశ్, కమలేశ్వర్ ప్రారంభించిన ఈ ఉద్యమం స్వాతంత్య్రానంతర తరం వారి ఆందోళనలు, అనుభవాలను ఎత్తి చూపడానికి లక్ష్యించినది. ముగ్గురు కూడా అసమాన ప్రతిభావంతులు, అదే సమయంలో ఎవరి అహాలు వారికి ఉండేవి. యాదవ్‌కూ మోహన్ రాకే శ్కూ చెడినప్పుడు కూడా మోహన్‌తో మన్నూ స్నేహం కొనసాగించింది. ‘నా సొంత అస్తిత్వం నాకు ఉండదా?’ అని రాకేశ్‌ను ప్రశ్నించారు మన్నూ. అయితే ముప్ఫై ఏళ్ల సహ జీవనం తర్వాత యాదవ్‌తో ఆమె వివాహ బంధం ముగిసింది. కానీ యాదవ్ ఇచ్చిన సహకారాన్ని ఆమె ఎప్పుడూ గుర్తుంచు కున్నారు. ఇద్దరూ కలిసి ‘ఏక్ ఇంచ్ ముస్కాన్’(ఒక అంగుళం చిరునవ్వు) నవల కూడా రాశారు. అందులోని అమర్ పాత్ర భాగాలు యాదవ్ రాస్తే, అమల, రంజన కోణాల్లోవి మన్నూ రాశారు. 1970 నాటికి ఆమె నాలుగు కథాసంపుటాలు ప్రచురించారు. తల్లిదండ్రులు విడిపోదామని నిర్ణయించుకున్నప్పుడు తొమ్మిదేళ్ల పిల్లాడు బంటీ మానసి కోద్వేగపు ప్రయాణపు కోణంలో ‘ఆప్కా బంటీ’ రాశారు. అప్పటికి మన్నూకు కూడా తొమ్మిదేళ్ల పాప రచన ఉండటం కాకతాళీయం కాదు. ఈ నవల ధారావాహికగా ప్రచురితం అవుతున్నప్పడు వస్తున్న ఉత్తరాలను చూసి పోస్ట్‌మాన్... ఈ ఇంట్లోనే ఒక ఆఫీస్ తెరవకూడదా అన్నాడట. నవల మీద విప రీతమైన చర్చలు జరిగాయి. అయితే పాఠకుల స్పందన అధికంగా బంటీ మీదే కేంద్రీకృతమై... తన లక్ష్యానికీ, మాతృత్వానికీ మధ్య నలిగిపోయిన ఆధునిక స్త్రీ మీదకు ఎక్కువ ప్రసరించకపోవడం పట్ల ఆమె కొంత నొచ్చుకున్నారు కూడా. 1974లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘రజనీగంధ’ ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఆమె కథ ‘యేహీ హై సచ్’(ఇదే నిజం) ఆధారంగా తీసిన ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. అప్పటికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బాసూ ఛటర్జీ కోసం శరత్ కథ ‘స్వామి’ని తిరగరాశారు. సినిమా బాగా ఆడినప్పటికీ, క్లైమా క్స్‌లో భర్త కాళ్ల మీద భార్య పడే సీన్ పట్ల ఆమె పూర్తిగా విభేదించారు. భార్యను తన చేతుల్లోకి భర్త తీసుకోవడం ద్వారా కూడా అదే ఫలితం రాబట్టవచ్చని ఆమె వాదన. బాసూ ఛటర్జీ దూరదర్శన్ కోసం తీసిన ‘రజని’ సీరియల్ కోసం కూడా మన్నూ పని చేశారు. ఇది కూడా సంచలనం సృష్టించింది. బిహార్‌లోని బెల్చి గ్రామంలో జరిగిన దళితుల ఊచకోత ఘటనకు కదలిపోయి 1979లో పూర్తిస్థాయి రాజకీయ నవల ‘మహాభోజ్’ రాశారు. ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున అమల్ అల్లానా దర్శకత్వంలో నాటకంగా వచ్చి అరు దైన సమీక్షలు పొందింది. ఎన్ఎస్డీకి అది స్వర్ణయుగం. మనోహర్ సింగ్, సురేఖా సిక్రీ, ఉత్తర బావోకర్, రఘువీర్ యాదవ్ లాంటివాళ్లు అందులో ఉండి, నాటకంలో పాత్రధారుల య్యారు. ఇంతటి విజయాలు చూసిన తర్వాత ఎవరిలోనైనా అహం పొడసూపడం సహజం. కానీ మన్నూలో లేశమాత్రం కూడా అది కనబడేది కాదు. అన్ని స్థాయుల వాళ్లతోనూ ఆమె తన జీవితాంతం స్నేహం చేశారు. చివరి దశలో అనారోగ్యం ఆమెను తినేసింది. నవంబర్ 15వ తేదీన ఆమె మరణించారు. కానీ చెరిగి పోని ఆమె వారసత్వం మనకు మిగిలివుంది. – పూనమ్ సక్సేనా పాత్రికేయురాలు, అనువాదకురాలు -
Yamini Saraswathi: యామినీ విలాసం
కాస్త పొట్టి ఆకారం! తెల్లగా మెరిసిపోయే బిళ్లంచు ఖద్దరు ధోవతి; నాజూగ్గా కట్టుకున్న తీరు.అంతే తెల్లని జుబ్బా, రింగులు తిరిగిన ముంగురులు. ముఖానికే అందమిచ్చే కళ్ల జోడు. మనిషి అసలే అందగాడు. ఆహార్యం ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తుంటుంది. భుజాల మీద కప్పుకున్న పండిత శాలువా, అదీ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లోవే. నడక లోనూ నాజూకుతనం. మాటలో సుకుమార్యం. సౌహార్దం, కాసింత సున్నిత హాస్యం అప్పుడప్పుడూ పండిత కవి మిత్రులతోనైతే వ్యంగ్యా స్త్రాలు సంధించే నైజం. డిగ్రీలో గణితమే ప్రధానాంశమైనా, తాత్కాలిత గణిత ఉపాధ్యాయుడిగా అక్కడ క్కడే కొలువు చేసినా, ఆయన అభిమాన మంతా తెలుగు సాహిత్యం మీదే. అందుకే ప్రాచీన నవీన రచనలెన్నింటినో ఆపోశన పట్టారు. ఊరక చదివింది కాదు, వాటిలోని ప్రశస్తమైన పద్యగద్యాలు, ఆసక్తికర సన్ని వేశాలు, సంభాషణలు, పద్యాలు చలోక్తులూ వంటివెన్నింటినో పుక్కిట బట్టారు. సందర్భాలకు తగినట్టుగా వాటిని ప్రయోగించేవారు. అలాగే ఆధునిక కవులనూ, రచయితలనూ, రచనలనూ తన మనోమందిరంలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఈ ‘సాహిత్య వ్యసనం’ ఎంతగా మారిపోయిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూల సాహిత్య సభ జరిగినా తన హాజరు ఆవశ్యం ఉండేలా చూసుకునేవారు. ఆ రీతిగా ఎందరో కవులు, పండితులు, రచయితలు, రచయిత్రులతో పరిచయం పెంచుకున్నారు. ప్రాచీనులలో కవిత్రయము, శ్రీనాథ పోతనలు, ప్రబంధ కవులూ మిక్కిలి అభి మానం. పదకర్తలంటే ప్రత్యేక గౌరవం. మొదట్లో శతకం వంటి రచనలు చేసినా తర్వాత వచనరచయితగా, రూపాంతరం చెందారు. అతివ–అభిజాత్యం నవలతో మొదలైన ఆయన రచనా ప్రస్థానం స్వతంత్ర నవలలు, పలు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలలు ముద్రణ పొందడంతో యావదాంధ్రలో ఆయన పేరుపొందారు. ఆయనే యామినీ సరస్వతి. ఇది కలంపేరు. సరస్వతి ఆయన భార్యపేరు. ఆయన అసలు పేరు డీవీ సుబ్బారావు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ఫిర్కాలోని జిల్లేళ్ల గ్రామం స్వస్థలం. ఆగస్టు 3, 1941న జన్మించారు. కానీ సాహిత్య సంచారానికీ, రచనా రంగానికీ నంద్యాలనే ఆవాసం చేసు కున్నారు. నండూరు రామకృష్ణమాచార్య, గుంటూరు శేషేంద్రశర్మ, కొండవీటి వెంకట కవి, బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ సినారె వంటి ప్రముఖులెందరితోనే పరిచయం ఏర్పర్చుకుని నిత్య చర్చలు జరిపేవారు. నంద్యాల నూతన సారస్వత సంఘం కార్యదర్శిగా పని చేశారు. దాదాపు యాబై పైగా నవలలు, వంద కుపైగా కథలు రాశారు. తన రచనా వ్యాసం గంతోనే కొండవీటి వెంకటకవికి, దాసరి నారాయణరావుకు సహరచయితగా మారారు. సినీ, టీవీ రచయితగా పేరొందారు. టీవీలో విశ్వామిత్ర సీరియల్‌కి, సినిమాకు రచయితగా, తాండ్రపాపారాయుడు, విశ్వనాథనాయకుడు సినిమాలకు సహరచయితగా పనిచేశారు. సాహిత్యారాధన కోసం స్వగ్రామంలో తనకున్న ఆస్తులను కరిగించేశారు. 2004 సెప్టెంబర్ 5న ఆప్తులను, ఆత్మీయులను, హిత మిత్రులను వదిలి కీర్తిశేషులయ్యారు. రాయల సీమలో పేరెన్నికగన్న నవలా రచయితల్లో యామిని ఒకరు. కానీ రచనా రంగంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల కంటే కర్నూలు వెనుకబడినందున కాబోలు ఆయనకు రావలసినంత పేరు రాలేదనే చెప్పాలి. సాహిత్యరంగంలో ఒకరికి పేరు రావడానికీ, మరొకరికి పేరు రాకపోవడానికీ మధ్య నడిచే బోలెడు కథల బాగోతంలో చిక్కిన బడుగు రచయితల్లో యామిని కూడా ఒకరయ్యారని చెప్పడం సబబు. - దినకర్, విశ్రాంత తెలుగు పండితుల -
'ఖాకీ బతుకులు' నవలా రచయిత కన్నుమూత
తెనాలి : స్పార్టకస్ కలం పేరుతో పోలీస్ వ్యవస్థలోని మరో కోణాన్ని ‘ఖాకీ బతుకులు’ నవలగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్‌శాఖలో సంచలనం రేపిన విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ గంటినపాటి మోహనరావు(68) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి పోలీస్ క్వార్టర్స్‌లోని నివాసంలో ఆయన ప్రాణాలొదిలారు. ఆయనకు భార్య మేరీ, కుమార్తె ప్రత్యూష, కుమారుడు ప్రేమ్‌చంద్ ఉన్నారు. సాయంత్రం ఇక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు. తెనాలిలో ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 1980–83 మధ్యకాలంలో మోహనరావు ‘ఖాకీ బతుకులు’ నవల రాశారు. తనకన్నా ముందు 1940–75 మధ్య పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలతో రాసిన ఈ నవల, 1996లో పుస్తకరూపం దాల్చింది. పోలీస్ బాస్‌ల కన్నెర్ర... పాతికేళ్ల కిందట వెలువడిన ఈ నవలపై అప్పటి పోలీస్ బాస్‌లు కన్నెర్రజేశారు. ఫలితంగా ఉద్యోగాన్ని కోల్పోయారు. దీనిపై న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. కేసును అప్పగించిన న్యాయవాదులపై నమ్మకాన్ని కోల్పోయి తన కేసును తానే వాదించుకున్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించి 2011లో ఉద్యోగం వచ్చింది. అయితే అనంతరం 10 నెలలే హెడ్ కానిస్టేబుల్ హోదాలో పనిచేసి పదవీవిరమణ పొందారు. సస్పెన్షన్‌లో ఉన్న కాలాన్ని సర్వీసులో చేర్చకపోవడం, అప్పట్లో రావాల్సిన సగం వేతనాన్ని నిరాకరించటంపై మళ్లీ న్యాయస్థానం తలుపుతట్టారాయన. స్పందించిన కోర్టు మోహనరావుకు 13 ఏళ్ల పెన్షనరీ ప్రయోజనాలను కల్పించాలని తీర్పునిచ్చింది. దీనిపై 2012 చివర్లో అప్పటి జిల్లా ఎస్పీ హైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు పొందారు. 13 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండానే పింఛన్ ఇచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత పరిణామాలతో ‘ఖాకీ బతుకులు’ రెండో భాగం రాస్తానని మోహనరావు అప్పట్లో ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. -
ఎడారి కాయని జీవితం
సౌదీలో భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా (మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు అర్బాబ్. మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు నజీబ్. బెన్యామిన్ రాసిన మలయాళీ నవల ‘గోట్ డేస్’లో, కేరళ యువకుడైన నజీబ్ చిరకాల వాంఛ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం. ‘బంగారం వాచ్, గొలుసు, ఫ్రిజ్, టీవీ, వీసీఆర్, ఏసీ’లతో కూడిన జీవితం వంటి చిన్న కోరికలే అతనివి. బయటి ప్రపంచం గురించి తెలియక, ‘అమ్మకానికున్న వీసా’ తీసుకుని ఇల్లు తాకట్టు పెడతాడు. గర్భవతైన భార్యని వదిలి, 1992లో సౌదీ అరేబియా రాజధాని రియాద్ వెళ్తాడు. అక్కడ ‘తన కలల సంరక్షకుడు, తన లక్ష్యాలను నెరవేర్చే’ అర్బాబ్ (యజమాని) అతన్ని విమానం నుండి దించుకుంటాడు. నజీబ్‌ను ట్రక్కులో ఎడారికి తీసుకెళ్తాడు అర్బాబ్. భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా(మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు. నజీబ్ ‘అనవసరమైన ఆరోగ్య అవసరాలకని నీరు వృథా చేయకూడదు’. మూడు పూటలా బ్రెడ్డు, పాలే భోజనం. మేకలకి మేత వేస్తూ, పాలు పితుకుతూ, వాటిని ఇసుక దిబ్బల మీద తిప్పుతూ– అర్బాబ్ తిట్లూ, దెబ్బలూ తింటుంటాడు. మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల, స్నేహితుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు. అతని పాస్‌పోర్ట్ యజమాని దగ్గర పెట్టుకుంటాడు. జీతం ఇవ్వడు. ‘ఈ పరిస్థితి నేను కన్న కలల నుండి ఎంత దూరమో గుర్తించాను. దూరం నుండి మాత్రమే ఆకర్షణీయంగా కనిపించే పరాయి చోట్ల గురించి కలలు కనకూడదు. అవి యధార్థం అవనప్పుడు, రాజీ పడటం ఇంచుమించు అసాధ్యం’ అనుకున్న నజీబ్, అల్లా చిత్తంపైన ఉన్న విశ్వాసంతో– తన ఒంటరితనాన్నీ, పరాయీకరణనీ ఎదురుకోగలుగుతాడు. మరుసటి మూడేళ్ళల్లో ‘పేలు పట్టి, అట్టలు కట్టిన జుత్తు, పొడుగు గడ్డంతో కంపు గొడ్తున్న ఆటవికుడి’గా మారతాడు. ఒక పిల్లాడిని చూస్తూ తనకి పుట్టిన కొడుకుని తలచుకుంటుంటాడు. ఆ పిల్లవాడి అంగచ్ఛేదానికీ, మరణానికీ సాక్షి అవుతాడు. తన జాగాలో, తనకిముందు అక్కడ పని చేసిన వ్యక్తి ఎముకలు ఇసుకలో కనబడినప్పుడు గానీ తనెంత దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాడో అర్థం చేసుకోలేకపోతాడు. తప్పించుకునే అవకాశం దొరికినప్పుడు ఇక తాత్సారం చేయడు. ఎడారిలో అతని ప్రయాణం బాధాకరమైన రీతిలో వర్ణించబడుతుంది. అతనితో పాటు బయల్దేరిన ఇద్దరిలో ఒకడు మరణిస్తాడు. మరొకతను మాయం అవుతాడు. ఏ గుర్తింపు పత్రాలూ లేకుండా ఒక్కడే నాగరికతలోకి అడుగు పెడతాడు. ‘చావకుండా మిగిలి ఉండాలంటే ఇదొక్కటే నాకున్న దారి’ అనుకుంటూ, జైలు అధికారులకి లొంగిపోతాడు. అక్కడ నుండి అతన్ని ఇంటికి పంపుతుంది ప్రభుత్వం. ‘రచయితలు ఎడారులను జ్ఞానోదయ స్థలాలంటారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కలిగిస్తాయంటారు. నాకైతే, ఎడారి ఏ విధంగానూ ప్రాణం పోయలేదు. అక్కడ నేను మూడేళ్ళకి పైగానే ఉన్నాను’ అంటాడు నజీబ్. ‘ఇది నాకు నిజజీవితంలో తెలిసిన మనిషి అనుభవాల గురించిన పుస్తకం’ అంటారు రచయిత బెన్యామిన్(ఇది కలంపేరు. అసలు పేరు బెన్నీ డెనియల్). మేకల వివరాలు నిండి ఉన్న ఈ పుస్తకం– శరీరాన్నీ, మనస్సునూ కూడా తీవ్రంగా అణచివేసే, వణుకు పుట్టించే వృత్తాంతం. దేవుని మీద నమ్మకం అండగా లేకపోతే, నజీబ్ పరిస్థితి– ఓటమికీ, స్వీయ నిర్మూలనకీ దారి తీసి ఉండేది. నాలుగు భాగాలుగా ఉన్న పుస్తకం ఉత్తమ పురుష కథనం. సంభాషణా శైలితో ఉండి, డైరీలా అనిపిస్తుంది. అలంకార ప్రాయమైన భాష ఉండదు. ఈ నవలను సౌదీ అరేబియాలోనూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ నిషేధించారు. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ నవలను 2012లో పెంగ్విన్ బుక్స్ ప్రచురించింది. ‘ద మ్యాన్, ఏషియన్ లిటరరీ అవార్డ్’ కోసం లాంగ్‌లిస్ట్ అయింది. -కృష్ణ వేణి -
మాదిరెడ్డి లోకమలహరి రచనలు
తెలంగాణ సాహిత్య అకాడమి ఇటీవల రెండు పుస్తకాలు ప్రచురించింది. మాదిరెడ్డి సులోచన కథలు, లోకమలహరి నవలలు. లోకమలహరి (1910–2010) ‘శతాధిక గ్రంథకర్త’. చివర్లో సన్యాసాశ్రమం స్వీకరించి, వేదానంద సరస్వతీస్వామిగా పేరు మారాడు. లోకమలహరి 114 పేజీల పుస్తకంలో రెండు నవలలున్నాయి. జెగ్గని యిద్దె, సంఘము. వీటిని నవలికలు లేదా పెద్దకథలు అనవచ్చు. రెండూ రాసిన కాలం 1955. ‘పచ్చి పల్లెటూరు భాష’లో రాసిన జగ్గని విద్య వ్యవహారంలో జెగ్గని యిద్దె అయింది. ‘హరిజనులు కూడా చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలనేది జెగ్గని యిద్దె నవల పరమార్థం’. కథ మొదట్లోని జెగ్గడే కథ పూర్తయ్యేసరికి జగదీశ్ ఎం.ఎ., ఎల్.ఎల్.బి. అవుతాడు. గ్రామానికి తిరిగొచ్చి నిరక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేస్తాడు. ఇందులో వాడినదంతా నిజామాబాద్ గ్రామ్యభాష. ‘చేనేత జీవితాన్ని చిత్రించిన తొలి నవల’ సంఘము. జెగ్గని యిద్దె తర్వాత దీన్ని రాశాడు లోకమలహరి. ‘పద్మశాలీల దైనందిన జీవితంలోని కడగండ్లను, వాటికి ఊతమిచ్చే సమాజంలోని పెద్దమనుషుల నిజరూపాలను ‘సంఘము’ నవలలో బయటపెట్టాడు’. డాక్టర్ సరోజ వింజామర సంపాదకురాలిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో 1960, 70 దశకాలు రచయిత్రుల యుగం. కోస్తా నుంచి చెప్పుకోదగినంత మంది రచయిత్రులు ఈ కాలంలో విరివిగా రచనలు వెలువరించారు. అయితే ఉర్దూ రాజభాషగా ఉండటం వల్ల తెలుగు అక్షరాస్యత తక్కువగా ఉన్న తెలంగాణ నుంచి కూడా ఈ కాలంలో కొంతమంది రచయిత్రులు తలెత్తుకుని నిలబడటం విశేషం. ఇందులో మాదిరెడ్డి సులోచన ఒక్కరే 72 నవలలు, 100 పైగా కథలు వెలువరించడం గమనించాల్సిన విషయం. ఆమె రచనలు వెలువడిన కాలం 1965–83. మాదిరెడ్డి సులోచన రచనలు పాఠకులకు అందుబాటులో లేకుండా పోయిన తరుణంలో సంగిశెట్టి శ్రీనివాస్ ఆమె కథలను సేకరించి, 2017లో తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రీసెర్చ్ అండ్ రిఫరెల్ సెంటర్ తరఫున 20 కథలతో ఒక పుస్తకం వేశారు. ఆయన సేకరించిన మరో 32 కథలతో తెలంగాణ సాహిత్య అకాడమి ఈ పుస్తకాన్ని ప్రచురించింది. భార్యా కోపవతీ, పురుష లక్షణము, స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః, నేటి కథ, రంగప్రవేశం లాంటి కథలున్నాయిందులో. ‘మాదిరెడ్డి సులోచన కథల్లో శైలి సాఫీగా సాగుతుంది. మామూలు విషయమైనా ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా మార్చే నైపుణ్యం వుంది’ అంటారు ముందుమాటలో ముదిగంటి సుజాతారెడ్డి. -
గ్రేట్ రైటర్ : కువెంపు
తొలుత ఇంగ్లిష్‌లో రాయడం మొదలుపెట్టి, ‘బిగినర్స్ మ్యూజ్’ పేరుతో కవితల సంపుటి కూడా వెలువరించిన ‘కువెంపు’, తర్వాత మాతృభాష కన్నడంలోనే రాయాలని నిశ్చయించుకున్నారు. ‘మాతృభాషలోనే విద్యాబోధన’ నినాదంతో కర్ణాటకలో కన్నడ మాధ్యమం వేళ్లూనుకోవడానికి నడుం బిగించారు. ‘కువెంపు’ కలంపేరుతో ప్రసిద్ధుడైన ‘పద్మ విభూషణ్’ కుప్పలి వెంకటప్ప గౌడ పుట్టప్ప (1904–1994) ఇరవయ్యో శతాబ్దపు గొప్ప కన్నడ కవిగా కీర్తినొందారు. జ్ఞానపీఠ్ పురస్కారం(1967) అందుకున్న తొలి కన్నడిగుడు కూడా. ఇతిహాసం, నవల, కవిత్వం, నాటకం, విమర్శ, ఆత్మకథ, బాలసాహిత్యం, అనువాదం... దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ విస్తారంగా రాశారు. ఆధునిక రీతిలో వ్యాఖ్యానించిన కావ్యం ‘శ్రీ రామాయణ దర్శనం’ ఆయన ప్రసిద్ధ ఇతిహాసం. ‘శూద్ర తపస్వి’, ‘కానూరు హెగ్గడితి’ (ఇదే పేరుతో గిరీశ్ కర్నాడ్ దర్శకత్వంలో దీని ఆధారంగా సినిమా కూడా వచ్చింది) ఆయన ఇతర రచనలు. తన రచనలు ‘విశ్వమానవతా వాదా’నికి ప్రోద్బలం ఇస్తాయని అనేవారు. ‘జై భారత జననియ తనుజాతె/ జయహే కర్ణాటక మాతే’ పేరుతో రాసిన ఆయన గేయాన్నే కర్ణాటక రాష్ట్రగీతంగా పాడుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం ప్రవేశపెట్టిన ‘కర్ణాటక రత్న’ బిరుదును కూడా ఆయనకే తొలుత ప్రదానం చేశారు. మైసూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. మరో గొప్ప కన్నడ కథకుడు, కవి పూర్ణచంద్ర తేజస్వి (1938–2007) కువెంపు కుమారుడే. -
గ్రేట్ రైటర్: లూయిజీ పిరాండెల్లో
లూయిజీ పిరాండెల్లో (1867–1936) ఇటాలియన్ నాటకకర్త, కవి, కథకుడు, నవలారచయిత. సిసిలీ ద్వీపంలోని సంపన్నుల ఇంట్లో, రాజకీయంగా చైతన్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో కథలు, గాథలు వినడానికి అమిత ఆసక్తి చూపేవాడు. పన్నెండేళ్ల వయసుకే తొలి విషాదాంత నాటకం రాశాడు. తన నివాసస్థలం రోమ్కు మారాక, తీవ్రమైన నిరాశలో ప్రతీకారస్వరంతో పుట్టే నవ్వులాంటి భావనలో తన తొలి కవితలు రాశాడు. నాటకరంగాన్ని జయించి తీరుతానని అనుకున్న పిరాండెల్లో, అబ్సర్డ్(అసంబద్ధ) నాటకాలకు సంబంధించి ప్రథమ శ్రేణి నాటక రచయితల్లో ఒకరిగా నిలిచాడు. ప్రకృతి విపత్తులో ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నా కూడా, తనను తాను కూడగట్టుకుని, విపత్తు కారణంగా తిరిగి ఎన్నటికీ కోలుకోలేని విధంగా మెంటల్ షాక్‌కు గురై మంచం పట్టిన భార్యను చూసుకుంటూ, భాషా పాఠాలు బోధించుకుంటూ రచనావ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇటాలియన్తో పాటు, తన స్వస్థలం సిసిలీ ద్వీపంలో మాట్లాడే సిసిలియన్ భాషలో కూడా రాశాడు. 1934లో నోబెల్ పురస్కారం ఆయన్ని వరించింది. ‘వన్, నో వన్ అండ్ వన్ హండ్రెడ్ థౌజండ్’, ‘సిక్స్ క్యారెక్టర్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ యాన్ ఆథర్’, ‘ద రూల్స్ ఆఫ్ ద గేమ్’, ‘ద మాన్ విత్ ద ఫ్లవర్ ఇన్ హిజ్ మౌత్’ ఆయన రచనల్లో కొన్ని. ‘నేషనల్ ఫాసిస్ట్ పార్టీ’ స్థాపకుడు ముస్సోలిని మీది అభిమానంతో ‘నేను ఫాసిస్టును, ఎందుకంటే నేను ఇటాలియన్ను’ అని చెప్పుకున్న పిరాండెల్లో, ఫాసిస్టు నాయకులతో విభేదించి, తనను తాను తర్వాత అరాజకీయవాదిగా ప్రకటించుకున్నాడు. -
అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్
అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్ (1918–2008) రష్యన్ నవలా రచయిత, కథకుడు, చరిత్రకారుడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సోల్జెనిత్సిన్ తల్లి పెంపకంలో పెరిగాడు. సోవియట్ ప్రభుత్వాన్నీ, కమ్యూనిజాన్నీ నిశితంగా విమర్శించాడు. ప్రభుత్వ బలవంతపు కార్మిక క్యాంపుల వ్యవస్థ ‘గులాగ్’ వైపు మిగతా ప్రపంచం దృష్టిసారించేట్టు చేశాడు. సైన్యంలో పనిచేసిన సోల్జెనిత్సిన్, జర్మన్ మహిళలపై రెడ్ ఆర్మీ చేసిన దురాగతాలను ‘ప్రష్యన్ నైట్స్’ కవితలో వర్ణిస్తాడు. ‘మనమేమైనా మంచివాళ్లమా?’ అని కూడా ‘ద గులాగ్ ఆర్కిపెలగో’లో ప్రశ్నిస్తాడు. ‘బాస్’ (స్టాలిన్)ను విమర్శించడం, సోవియట్ వ్యతిరేక ప్రచారం చేయడం కారణాలతో ఆయనకు కారాగార శిక్ష పడింది. జైల్లో ఏది దొరికితే దానిమీదే రాశాడు. ఆయన కొన్ని రచనలు కృశ్చేవ్ హయాంలో మాత్రమే ప్రచురణకు నోచుకున్నాయి. కృశ్చేవ్ పదవీచ్యుతుడైన తర్వాత సోల్జెనిత్సిన్ మళ్లీ తన సృజన స్వేచ్ఛ కోల్పోయాడు. 1970లో నోబెల్ బహుమతి వరించినప్పటికీ, దేశం విడిచి వెళ్తే తిరిగి రానివ్వరేమో అన్న భయంతో స్వీకరించడానికి వెళ్లలేదు. అయినా నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం ఆయన్ని దేశం నుంచి బహిష్కరించింది. సోవియట్ రష్యా పతనం తర్వాత ఇరవయ్యేళ్లకు 1994లో మాత్రమే తిరిగి మాతృదేశంలో పాదం మోపగలిగాడు. 89వ ఏట చనిపోయేవరకు అక్కడే నివసించాడు. ‘వన్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిచ్’, ‘ఆగస్ట్ 1914’, ‘కేన్సర్ వార్డ్’ ఆయన ప్రసిద్ధ రచనలు. -
సంక్లిష్టతా యుగ ప్రతినిధి
వలస ప్రజల వ్యథలను, వలసవాద రాజకీయాలను, మతఛాందసవాదపు దుష్టపోకడలను ఎలుగెత్తి చాటిన అపురూపమైన కలం కనుమరుగైపోయింది. సామాన్యుడినే కథా వస్తువుగా స్వీకరించి నోబెల్ కిరీ టాన్ని అందుకున్న ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ (85) శనివారం లండన్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించినా, ఇంగ్లండ్‌లోనే ఎక్కువగా గడిపిన నయపాల్ జీవితం సంక్లిష్టమైన సాంస్కృతిక వైవిధ్యతల మధ్య కొట్టుమిట్టులాడింది. కొనార్డ్, చార్లెస్ డికెన్స్, టాల్‌స్టాయ్‌ల జీవితాలతో పోలిస్తే నైపాల్ సాహిత్య జీవితాన్ని వలసవాదానికి బలైన మూడో ప్రపంచ దేశాల అవ్యవస్థత పట్ల విమర్శకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. పాశ్చాత్య నాగ రికతకు బలమైన మద్దతుదారుగా నిలబడినప్పటికీ విశ్వజనీనవాదమే ఆయన తాత్వికత. అందుకే ‘వెస్టిండియన్ నవలాకారుడి’గా తన పేరును కేటలాగ్‌లో చేర్చిన ఒక ప్రచురణకర్తతో తన సంబంధాలనే తెంచుకున్నాడు నైపాల్. భారతీయ మూలాలు : వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో 1932 ఆగస్టు 17న జన్మించిన విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ మూలాలు భారతదేశంలో ఉన్నాయి. ఆయన తాత 1880లో ఇండియా నుంచి వలస వచ్చి ట్రినిడాడ్‌లోని చెరకు తోటల్లో పనిచేశారు. తండ్రి శ్రీప్రసాద్ ట్రినిడాడ్‌లో గార్డియన్ పత్రికకు విలేకరిగా పనిచేశారు. బాల్యంలో పేదరికం అనుభవించిన నైపాల్ 18 ఏళ్ల వయస్సులో లండన్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనం అందుకున్న తర్వాత మిగిలిన జీవితంలో ఎక్కువకాలం అక్కడే గడిపారు. చదువుకునే రోజుల్లోనే నవల రాయగా ప్రచురణ కాలేదని కినిసి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. కానీ 1955లో పాట్రీసియా ఆన్ హేల్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె ప్రేరణతో సాహిత్య కృషిలో కుదురుకున్నారు. 1954లో ఆక్స్ఫర్డ్ విడిచిపెట్టి ఉద్యోగ రీత్యా లండన్ చేరిన నైపాల్ అక్కడే స్థిరపడ్డారు. అనంతరం కాల్పనిక, కాల్పనికేతర సాహిత్యంలో 30కి పైగా పుస్తకాలు రచించిన లబ్దప్రతిష్టుడయ్యారు. ద హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్, ఎ బెండ్ ఇన్ ది రివర్, ది ఎనిగ్మా ఆఫ్ ఎరైవల్ లాంటి ప్రఖ్యాత రచనలు ఆయన జీవి తాన్ని మలుపుతిప్పాయి. ‘‘ఇన్ ఏ ఫ్రీ స్టేట్’’ పుస్తకానికిగాను బుకర్ ప్రైజ్‌ను అందుకున్నారు. 2001లో ప్రఖ్యాత నోబెల్ సాహితీ పురస్కారం గెలిచారు. రాయడం అంటే జీవితంలో వెనక్కు వెళ్లి తరచి చూడటమే, స్వీయ జ్ఞానానికి అది ప్రారంభం అని చెప్పుకున్న నైపాల్ తొలి నవల ది మిస్టిక్ మసాయిర్ 1957లో వెలువడి బాగా ప్రజాదరణ పొందింది. తన జీవితనేపథ్యం ఆధారంగా రాసిన ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ (1961), ఆర్థికంగా తన భార్యపై ఆధారపడవలసి వచ్చిన ఒక నడివయస్సులోని జర్నలిస్టు విముక్తి పయనం గురించి వర్ణిస్తుంది. అది తన జీవితమే. ఉద్యోగంలేని స్థితిలో భార్య నైపాల్‌ను కొంతకాలం పోషించింది. ఈ పరాధినతా భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆయన రాసిన తన జీవిత చరిత్ర సమకాలీన తరంలో అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరిగా మార్చింది. 1960లనాటికి కాల్పనికేతర సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. మనకు తెలియని కొత్త ప్రపంచానికి కాల్పనికేతర సాహిత్యమే తలుపులు తెరుస్తుందని పేర్కొన్నాడు. 1962లో వెస్టిండీస్‌కి తిరిగి వెళ్లినప్పుడు తాను రాసిన ది మిడిల్ ప్యాసేజ్ రచనలో ట్రినిడాడ్‌లోని జాతి వివక్షాపరమైన ఉద్రిక్తతలను చిత్రించాడు. వలసవాదం నుంచి విముక్తి పొందిన కరీబియన్ చిన్న దీవుల్లో పర్యాటకరంగం ముసుగులో కొత్త బానిసత్వానికి ప్రజలు అమ్ముడుపోవడం జరుగుతోందని పసిగట్టాడు. 1964లో రాసిన తొలి పర్యాటక నవల ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్’లో భారత్ గురించి రాశాడు. తన మూలాలు భారత్‌లో ఉన్నప్పటికీ తాను ఇప్పుడు భారత్‌కు చెందడం లేదని కనుగొన్నాడు. పైగా జాతీయవాదం పేరిట భారతీయులు బ్రిటిష్ వారినే అనుకరిస్తున్నారని విమర్శించాడు. తాను పుట్టిపురిగిన ప్రాంతాలకు కూడా దూర మైన నైపాల్‌ను ఆఫ్రికన్ రచయితలు చాలామంది వ్యతిరేకించారు. పాశ్చాత్య ప్రపంచం నల్లవారిపై మోపిన కాల్పనికతలవైపే నైపాల్ మొగ్గు చూపుతున్నాడని నైజీరియన్ రచయిత చినువా అచెబె పేర్కొన్నారు. అయితే విశ్వజనీన నాగరికత ఎప్పటిౖకైనా భూమిపై విల్లసిల్లుతుందన్న నమ్మకాన్ని చివరికంటా పాదుకున్న నైపాల్ మానవ సంక్లిష్టతా వైరుధ్యాల మధ్యే జీవితం గడిపాడు, ముగించాడు కూడా. -కె. రాజశేఖరరాజు -
సోమర్సెట్ మామ్ ‘జీవనపాశం’
కాకాని చక్రపాణి వృత్తిరీత్యా ఇంగ్లిష్ లెక్చరర్. ప్రవృత్తి రీత్యా తెలుగు కథకుడు, నవలా రచయిత, చేయి తిరిగిన అనువాదకుడు. ఆంగ్ల సాహిత్యాన్ని ఇష్టపడి అధ్యయనం చేసినవాడు. ఆంగ్ల సాహి త్యంలో సోమర్సెట్ మామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై చక్ర పాణి పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. అందులో భాగంగానే సోమర్సెట్ మామ్ ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ నవలను తెలుగులోకి ‘జీవనపాశం’గా అనువదించారు. చక్రపాణిగారు కన్నుమూసిన కొద్ది రోజుల తర్వాత జరిగిన సంతాపసభలో ఆయన ఇద్దరు కుమారుల సమక్షంలో జీవనపాశాన్ని ఆవిష్కరింప జేశారు. అనారోగ్యం తీవ్రంగా బాధిస్తున్నా ఆయన సాహితీ వ్యాసంగాన్ని వదలకుండా ఎలా జీవన్ము క్తులు అయ్యారో ఆ సభలో పాల్గొన్న వక్తలు తలచు కుని కంటతడి పెట్టారు. నిర్దిష ప్రాంత భాషా సంస్కృతుల సొగసు జారి పోకుండా తెలుగు చేయడంలో చక్రపాణి గారిది అందె వేసిన చేయి. పుస్తకానికి సోమర్సెట్ మామ్ రాసుకున్న ముందుమాట ఇందులో వేయి వరహాల మూటగా మనకు ముందు దర్శనమిస్తుంది. సోమర్ సెట్ మామ్ (1874–1965) 1915లో రాసిన నవల ఇది. ఇరవయ్యవ శతాబ్దపు వంద అత్యుత్తమ ఇంగ్లిష్ నవలల్లో ఒకటి. ఫిలిప్ కథా నాయకుడు. పుట్టుకతోనే కాళ్లు వంకర, అందరిలా నడవలేడు. తొమ్మిదేళ్ల వయస్సులోనే అనాథ అవుతాడు. కొంతకాలం బంధువుల దగ్గర పెరుగుతాడు. బోర్డింగ్ స్కూల్లో చేరతాడు. వైకల్యం, అతి సున్నిత మనస్తత్వం వల్ల మిగతా విద్యార్థులతో కలవలేకపోతాడు. ఆక్స్‌ఫర్డ్‌లో స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాల్సిందిగా ఒత్తిడి వస్తుంది. కానీ ఫిలిప్ మాత్రం జర్మనీలో ప్రత్యక్ష మవుతాడు. తరువాత లండన్‌లో అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా చేరిన చోట కూడా అంతగా రాణించడు. అయితే అక్కడి ఒక మేనేజర్‌తో పాటు బిజినెస్ ట్రిప్‌లో భాగంగా పారిస్‌కు వెళ్లడం ఫిలిప్‌కు ఒక మలుపు. పారిస్‌లో ఆర్ట్ క్లాసులకు కూడా వెళతాడు. అక్కడ ప్రైస్ పేద విద్యార్థిని. ఆమె ఎవరితోనూ కలవదు. ఫిలిప్ అంటే ఇష్టం పెరుగుతుంది. ఆమె ఫిలిప్‌తో పీకల్లోతు ప్రేమలో పడుతుంది. కానీ ఫిలి ప్‌కు ఇవేమీ తెలియదు. అతడికి అలాంటి భావం కల గలేదు. తరువాత శూన్యాన్ని భరించలేక ప్రైస్ ఆత్మ హత్య చేసుకుంటుంది. తను ఎప్పటికీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాలేనని నిర్ణ యించుకుంటాడు ఫిలిప్. ఇంగ్లండుకు వెనక్కు వచ్చే స్తాడు. శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా చాలా ఇబ్బందిపడి మెడికల్ స్కూల్లో చేరతాడు. స్కూల్ టీ షాపులో సర్వర్‌గా పనిచేసే అమ్మాయి మిల్డ్రెడ్ ప్రేమలో పడతాడు. ఆమెతోనే లోకం అనుకుం టాడు. ఒక శుభోదయాన నాకు ఫలానా వాడితో పెళ్లి అని మిల్డ్రెడ్ ఫిలిప్‌కు చెబుతుంది. ఫిలిప్ గుండె బద్ద లవుతుంది. మౌనంగా రోదిస్తాడు. కొంత కాలానికి నవలా రచయిత నోరా ప్రేమలో పడతాడు. చిగురించిన ప్రేమ పూలు పూయకముందే– మిల్డ్రెడ్ వెనక్కు వస్తుంది – గర్భ వతిగా. ఫిలిప్ నోరాకు దూరమై మిల్డ్రెడ్కు దగ్గర వుతాడు. ఆర్థికంగా ఆమెను ఆదుకుంటాడు. పాప పుడుతుంది. మిల్డ్రెడ్ ఈసారి మరో వ్యక్తి హారీ ప్రేమలో పడుతుంది. ఫిలిప్‌కు చెప్పకుండా అతడితో లేచిపోతుంది. ఒక ఏడాది తరువాత ఫిలిప్ మిల్డ్రె డ్‌ను వెతికి పట్టుకుంటాడు. సానుభూతితో ఆదరి స్తాడు. ఆమెకంటే ఆమె పాప ఫిలిప్‌కు బాగా దగ్గర వుతుంది. ఈసారి మిల్డ్రెడ్ చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తే ఫిలిప్ దూరం పెడతాడు. గొడవలు పెద్ద వవుతాయి. నానా రాద్దాంతం చేసి మిల్డ్రెడ్ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఫిలిప్ మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టి ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. చివరికి ఇంటి అద్దె కట్ట లేని పరిస్థితి. అథెల్నీ మంచి రచయిత. ఫిలిప్ వీధిపాలు కావడం చూడలేక ఒక డిపార్ట్మెంట్ స్టోర్‌లో చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇష్టం లేకపోయినా తప్పనిసరై చేస్తాడు ఫిలిప్. కొంత జీతం పెరుగుతుంది. అతి కష్టంమీద మెడిసిన్ కోర్సు పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లైసెన్స్డ్ డాక్టర్ అయ్యాడు. భాగస్వామ్యంలో ఆసుపత్రి పెడదామని వైద్యుడు సౌత్ ఆఫర్ ఇస్తాడు. ఫిలిప్ తిరస్కరించి తనకు సహాయం చేసిన అథెల్నీతో వాళ్ల ఊరికి వెళతాడు. ఆయన కూతురు శాలీ ఫిలిప్‌ను ప్రేమిస్తుంది. శారీ రకంగా దగ్గరవుతారు. శాలీ గర్భవతి అని తెలియ గానే పెళ్లి ప్రతిపాదన చేస్తాడు ఫిలిప్. డాక్టర్ సౌత్ ఆఫర్‌కు ఓకే చెప్పి శాలీని పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడుపుతాడు ఫిలిప్. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్న మాటతో నవల ముగుస్తుంది. ఇది చాలా పెద్ద నవల. ముందు బ్యూటీ ఫ్రమ్ ది యాషెస్ అని పేరు పెట్టాలను కున్నాడు మామ్. తర్జన భర్జన తరువాత ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అని నామకరణం చేశాడు. ప్రేమ–వైఫల్యం, వైకల్యం–మానసిక సంఘర్షణ, ఇష్టాలు–ద్వేషాలు, కష్టాలు– కన్నీళ్లు, బంధాలు– స్వేచ్ఛ, సాధించటం–రాజీలు ఇలా ఎన్నో వైరుధ్యాల మధ్య జీవనపాశం ఎలా కట్టి పడేస్తుంటుందో చెబు తుంది ఈ నవల. ప్రతులకు: జీవన పాశం : ఆఫ్ హ్యూమన్ బాండేజ్– విలియం సోమర్సెట్ మామ్, తెలుగు అనువాదం– కాకాని చక్రపాణి, సంపాదకులు– డి. చంద్రశేఖర్‌రెడ్డి, పేజీలు– 752, వెల– రూ. 400, ప్రచురణ– ఎమెస్కో. పమిడికాల్వ మధుసూదన్, మొబైల్ : 99890 90018 -
అర్ధరూపాయి అప్పు
ఈ కథ వ్రాసి, అర్ధరూపాయి అప్పుచేసి చాలా తప్పు చేసానని క్రుంగిపోయాను. నా నెత్తిమీద అర్ధరూపాయి అప్పు కొండంత బరువుగా కూర్చుని నన్ను పాతాళంలోకి క్రుంగదీయసాగింది. మా చిన్నబామ్మ పండగలకి పిల్లలందరికి అణాలు పెట్టేది.. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. కాశీ వెళ్ళింది. కథ వ్రాయటం అయిపోయింది.. కాని పోస్ట్ చేయటమే సమస్య ఐపోయింది.. ఎలా పంపాలో తెలియదు. నాకు అక్క కొడుకులు ఉన్నారు.. ఒకడు సత్యం, ఒకడు రాముడు, ఒకడు శర్మ.. నాకన్నా 6 సంవత్సరాలు చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా మా స్కూల్లో చదువుతారు.. మా ఇంట్లో నేను ఆఖరి సంతానం.. వాళ్ళు తమ్ముళ్ళలా ఉండేవాళ్ళు.. సత్యం.. రాముడు.. ఖుద్దూస్ మాస్టార్ దగ్గరికి వెళ్ళి పిన్ని కథ వ్రాసింది, ఎవరికి పంపాలి.. ఎలా పంపాలి అని అడిగి వచ్చారు.. (ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా జరిగింది..) ఆయన కాగితం మీద ఆంధ్రపత్రిక అడ్రెస్ వ్రాసి.. కవర్ మీద ఎలా వ్రాయాలో చెప్పి, తిరిగి రావటానికి ఫ్రం అడ్రెస్ వ్రాయాలని చెప్పారు... కథ పేజీలు ట్యాగ్‌తో కట్టి, కవర్లో పెట్టి మాస్టార్ చెప్పినట్టు అడ్రెస్ వ్రాసాను.. నా అక్షరాలు చాలా అందంగా ఉంటాయని మాస్టార్ గారు ఎప్పుడూ మెచ్చు కునేవారు.. కవరు బరువుగా ఉంది! సత్యం, రాముడు పోస్టాఫీసుకి వెళ్ళి తూయించి నీరసంగా తిరిగి వచ్చారు.. చాలా ఖరీదు! అర్ధరూపాయి!! అంతకుముందు కానీలు, చిల్లుకానీలు, అర్ధణా, అణా, బేడలు, పావ లాలు, అర్ధరూపాయి ఉండేవి.. అర్ధరూపాయి నా దగ్గర లేదు! మా నాన్నని అడిగితే వెంటనే ఇస్తారు! కానీ నాకు అస్సలు ఇష్టం లేదు! కథ తిరిగివస్తే, నాన్న కష్టార్జితంలో అర్ధరూపాయి వృథా అయిపోతుంది.. పైన డాబా మీదకి వెళ్ళే మెట్ల మీద నేను, సత్యం, రాముడు కూర్చుని ఈ కవరు పంపటం ఎలాగ అని గుడగుడలాడే వాళ్ళం.. మా మూడో అక్క కూతురు సుగుణ ఎప్పుడూ మా ముగ్గురిమీదా ఒక కన్నేసి ఉంచేది.. మేము దానిని కలుపుకోకుండా ఏదో చేసేస్తున్నామని దాని అనుమానం! ఒకసారి వాళ్ళమ్మ జయ అక్కయ్య వచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నారు మీరు? అంటూ గద్దించేది.. మేం ముగ్గురం మాట్లాడేవాళ్ళం కాదు.. చివరికి సత్యం ఒక సలహా చెప్పాడు.. మా రెండో అక్కయ్య పేరు రంగమ్మ. ఆవిడకి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత, రెండు కళ్ళూ పోయాయి.. ఆవిడ భయంకరమైన పుస్తకాల పురుగు! ఆవిడ రాత్రివేళ ఆంధ్రపత్రికలో సీరియల్స్ (రెండు మహానగరాలు, హకల్ బెరి ఫిన్, లైబ్రరీ నుంచి శరత్ బాబు నవలలు) తెప్పించుకుని నా చేత చదివించుకునేది! నాది చాలా జాలి గుండె.. ఆవిడ కోసం శ్రమ పడి, చదివేదాన్ని.. సత్యం రంగమ్మ అక్కయ్యని అప్పు అడుగుదామని సలహా ఇచ్చాడు.. మొదట నేను అప్పంటే ఒప్పుకోలేదు! భయపడ్డాను.. అప్పంటే చెడ్డ భయం..! మా నాన్న వారం రోజుల క్రితం చిన్నన్నయ్య బుట్టల సుబ్బమ్మ దగ్గర అర్ధణా అప్పు పెట్టి బటానీలు తిన్నాడని తెలిసి, అన్నయ్యని చితకబాదాడు.. ఆ దృశ్యం చూసి పిల్లలం భయపడి దొడ్లో పాకలోకి పారిపోయి దాక్కున్నాం.. నాన్నకి అప్పంటే ఆగ్రహం! మా బాబాయిలు పేకాట ఆడి అప్పులు చేసి.. పొలాలు పోగొట్టుకొని పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోయారు. డబ్బు ఖర్చు విషయంలో నాన్న నిర్దాక్షిణ్యంగా ఉండేవాడు! ఒక పక్క అప్పంటే భయం. నేను అప్పు చేసానని తెలిస్తే ఇంకేమన్నా ఉందా..? నాన్నకి నేనంటే గారాబం. స్కూల్లో చదువుల్లో, ఆటల్లో ఫస్ట్ వస్తానని చాలా సంతోషం.. ఇంటికి వచ్చిన రైతులకి స్కూల్లో ఫస్ట్ వస్తానని అపురూపంగా చెప్పేవారు.. అది గుర్తువచ్చి అప్పంటే మరీ భయం వేసింది.. ఇలా వెధవ పని చేసి ఆ ప్రేమను పోగొట్టుకోలేను.. కథ పంపాలని ఆశ! ఆరాటం! కానీ అప్పు చేయటం కుదరదు. ఎలా? రాముడు తొందర పెడుతున్నాడు.. (సరే అని ధైర్యం చేసాను.) సత్యం – రాముడు ఒక రోజు రంగమ్మక్కయ్య దగ్గరికి వెళ్ళి.. అర్ధ రూపాయి అడిగారు.. ఆవిడ వెంటనే అనుమానభూతంలా చూసి ఎందుకు అంది.. ‘‘జీడీలు కొనుక్కొని తినాలని ఉంది..!’’ అన్నాడు సత్యం. తాతయ్యని అడగండి అనేసింది..! ‘‘నువ్వు ఇస్తావా లేదా?’’ అన్నాడు రాముడు.. నేను అక్కడనుండి వెళ్ళిపోతుంటే సత్యం చేయిపట్టి ఆపాడు.. ‘‘నీకు పిన్ని పుస్తకాలు చదువుతుంది కదా..! నువ్వు ఇయ్య కపోతే ఇక నుంచి నీకు చదవదు మరి!’’ అని బెదిరించాడు.. అక్కయ్య ఆలోచించి జాకెట్లోంచి గుడ్డసంచి తీసి... అందులోనుంచి చిల్లర తడిమి అర్ధరూపాయి బిళ్ళ తీసి పట్టుకుంది.. వెంటనే ఇవ్వలేదు.. నేను నిరుత్సాహపడ్డాను.. ఆవిడ అంది.. ‘‘ఇదిగో! వెంటనే తీర్చాలి.. అంతేకాదు.. పగలు, రాత్రి పుస్తకాలు చదవాలి’’ అంది..! ‘‘అట్లా అయి తేనే ఇస్తా’’ అంది.. సత్యం నా వైపు చూసాడు.. నేను అక్కర్లేదు అన్న ట్లుగా అడ్డంగా తలూపాను. ఆవిడకి కళ్ళు కనిపించేవి కావు కదా! అట్లాగే! సరే! అని సత్యం, రాముడు అంటూ, నా వైపు చూసి ‘ఉత్తుత్తినే’ అన్నట్లు నాలుక బయట పెట్టి పెదవులపై అటూ ఇటూ ఊపారు..! ఆవిడ అర్ధరూపాయి ఇచ్చింది.. వెంటనే నా కథ ఆగమేఘాల మీద పోస్ట్‌కి పోయింది.. చిన్న రసీదు తెచ్చి ‘‘దాచుకో’’ అన్నాడు సత్యం.. నాకు ఆశ్చర్యం వేసింది!! కథ వెళ్ళిపోయింది. నా దగ్గర లేదు. కథకి గుర్తు చిన్న రసీదు ముక్క మాత్రమే!! రోజులు గడిచాయి. మా అక్క నన్ను కథలు చదవమని రాక్షసిలా పిలుస్తోంది. అప్పట్లో లాంతరు దీపాలు. రాత్రి 10 గంటలు అయితే గాని లాంతరు దొరకదు. మా అక్క పగలు కుక్కి మంచంలో హాయిగా నిద్రపోయి, రాత్రి చదవ మని వేధించేది. అలానే చదివేదాన్ని. నేను ఆవిడకి అర్ధ రూపాయి కోసం బానిస అయిపోయాను! నా స్వేచ్ఛ అంతా పోయింది!! ఈ కథ వ్రాసి, అర్ధరూపాయి అప్పుచేసి చాలా తప్పు చేసానని క్రుంగిపోయాను. నా నెత్తిమీద అర్ధరూపాయి అప్పు కొండంత బరు వుగా కూర్చుని నన్ను పాతాళంలోకి క్రుంగదీయసాగింది. మా చిన్న బామ్మ పండగలకి పిల్లలందరికి అణాలు పెట్టేది.. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. కాశీ వెళ్ళింది. చాలాసార్లు మా నాన్న దగ్గరికి వెళ్ళి తలెత్తకుండా నాన్నా! నేను చాలా తప్పు చేసాను! అర్ధరూపాయి అప్పు చేశాను! నన్ను క్షమించు..! అని చెప్పాలని ఎంతగానో అనిపించేది. కానీ ధైర్యం చాలేది కాదు! ఇలా మథనపడుతున్నాను..! క్రుంగిపోతున్నాను.. మా నాన్న ఒకసారి నన్ను చూసి ‘‘ఏమైంది..? ఒంట్లో బాగాలేదా?’’ అని అడిగితే అదిరిపడ్డాను. నాన్నకి తెలిసిపోతుందని.. మెల్లగా అక్కడినుంచి వెళ్ళిపోయాను. ఒకరోజు గుడికి వెళ్ళి వచ్చాను.. రాముడు, సత్యం పరిగెత్తుకొని ఒచ్చారు.. ‘‘పిన్నీ! నీ కథ పడింది..!! ఇదిగో’’ అంటూ పత్రిక చూపిం చారు. ‘‘నిజంగానా?’’ అన్నాను. ముగ్గురం పందిరి కింద వరండాలో క్రింద కూర్చుని నేల మీద పెట్టి చూస్తున్నాం. నిజంగా నిజం! ‘‘చిత్రనళినీయం – యద్దనపూడి సులోచ నారాణి’’ అని ఉంది. ముగ్గురం ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని కౌగిలించుకున్నాం.. నా మనసు షాక్‌లోకి వెళ్ళిపోయింది. అంతలో నాన్న వచ్చారు.. సత్యం చెప్పాడు. ‘‘తాతయ్యా! పిన్ని కథ వ్రాసింది!! పత్రికలో పడింది!’’.. ‘‘కథా?! పత్రికా?!’’ అన్నారు.. ఆశ్చర్యంగా. నాన్న పట్టుకుని చూసారు. ‘‘ఏది ఆంధ్రపత్రిక? చదివి వినిపించండి!’’ అత్తయ్య సీరియల్స్ కోసం అరుస్తోంది. నాకు భయం వేసింది. పరువు గల కుటుంబం. ఆడపిల్లని. కరణం గారి అమ్మాయిని. నా పేరు ఇలా దేశం మీద పడినట్టు చేసానేమిటి? అని భయపడ్డాను. కానీ నాన్న ఏమీ అనలేదు. పైనుంచి ఇంటికి వచ్చే రైతులకి ‘‘మా అమ్మాయి కథ వ్రాసింది. పత్రికలో పడింది!’’ అంటూ చూపించారు. హమ్మయ్య! అనుకున్నాను. ఈ వార్త తెలిసి, ఇంట్లో కుటుంబ సభ్యులంతా ‘‘ఏదీ? ఏదీ?’’ అంటూ ఆంధ్రపత్రికని ఒకరి చేతుల్లోంచి ఒకరు లాక్కుంటుంటే, అది వాళ్ళ చేతుల్లో ఎక్కడ చిరిగిపోతుందోనని నా ప్రాణం గిలగిలలాడి పోయింది. చివరికి అతికష్టం మీద దొరకపుచ్చుకుని నేను చదువుకునే గదిలోకి పరిగెత్తాను. – యద్దనపూడి సులోచనారాణి ‘పోస్ట్‌మ్యాన్ పిలుపుతో కలకలం’ రేపటి సంచికలో... -
చిత్రనళినీయం.. కథ వెనక కథ
ప్రియాతి ప్రియమైన పాఠకులారా!! ఈ రోజు ఈ ఉత్తరం మీకు వ్రాస్తుంటే నా మనసు చెప్పలేనంత ఉద్విగ్నభరితంగా ఉంది. 60 సంవత్సరాల సుదీర్ఘమైన నా రచనాప్రయాణంలో నేను 1957లో వ్రాసిన ‘చిత్రనళినీయం’అనే ఈ కథ నా తొలి అడుగు! దాదాపు 60 సంవత్సరాల అలుపెరుగని, నిరుత్సాహం ఎరుగని, విసుగు ఎరుగని, సుదీర్ఘ ప్రయాణం ఇది. నేను పుట్టి పెరిగినది ‘కాజ’అనే చిన్న గ్రామం. చాలా అందమైన పల్లెటూరు. ప్రకృతి మధ్య ఒదిగి పడుకున్న అమాయకపు పసిపాప లాంటి అందమైన ఊరు. ఎటు చూసినా పచ్చదనం! పంట కాలవలు. వరిచేలు. ఉదయం అవగానే చెట్ల మీద గుంపులుగా వాలే రామచిలుకలు, కావ్–కావ్ మని కాకుల గోలలు! వేణుగోపాల స్వామి ఆలయంలో జేగంటల ధ్వనులు.. ఇటు పక్క శివాలయంలో శివనామ స్మరణలు! దొడ్లో ఒక పక్క బావిలోంచి బకెట్టుతో నీళ్ళు తోడుతున్న చప్పుడు..! ఇటు పక్క కట్టెలపొయ్యి మీద కాగులో కాగుతున్న వేడి నీళ్ళు. పొయ్యిలోంచి కట్టెలు, పిడకల వాసన. కొద్ది దూరంలో ఆవు పేడ వాసన. గుమ్మం పక్కన విరగబూసి సువాసనలు వెదజల్లుతున్న సన్నజాజి చెట్టు. దానికి కొద్దిదూరంలో తులసి వనంలా పచ్చటి తులసి మొక్కలు.. తెల్లవారేసరికి ఒకటో రెండో పళ్ళు రాల్చే విరగ గాసిన బాదం చెట్టు. ఇంట్లో కరెంటు లేదు. కిరసనాయిలు లాంతర్ల ముందు కూర్చుని అప్పుడప్పుడు పుస్తకాలు చదివేదాన్ని. ఊరిలో అన్నిటికంటే నాకు ప్రియాతి ప్రియమైనది ‘మా ఊరి చెరువు’. దాన్ని చూస్తే సంతోషంతో పులకరింతలు వచ్చేవి.. ఎందుకంటే అది ఒక అందమైన, అద్భుతమైన దృశ్యం! ఆ చెరువులో తెలుపు, ఎరుపు కలువ పూలు!! కొన్ని మొగ్గలుగా ఉండేవి. కొన్ని విచ్చుకుని విరబూసి ఉండేవి. కార్తీకమాసంలో, చలిలో అమ్మా అత్తయ్యలు, చెరువుకి స్నానానికి వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళేదాన్ని. అమ్మ ఒక పాత చీరలో నన్ను కాగితంలో పొట్లం చుట్టినట్టు చుట్టి చలిబారిన పడకుండా చూసేది. చెరువు మెట్ల మీద కూర్చుని అమ్మా అత్తయ్యలు అరటి దొప్పల్లో దీపాలు పెట్టి చెరువులోకి వదిలేస్తుంటే, అవి మెల్లగా నీటిలో ప్రయాణం చేస్తుంటే ఆ చీకటి రాత్రి, చెరువు – దీపాలు , నాకు చాలా ఆనందంగా, చూడముచ్చటైన దృశ్యంగా ఉండేది. తెల్లవారి అమ్మా అత్తయ్యలు చెరువు గట్టున ఉన్న రామాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే నేను చెరువుని వదలలేని దానిలా అక్కడే కూర్చునే దాన్ని.. చెరువు చుట్టూ పాకలు! పైకప్పులోంచి వలయాకారంగా బయటికి వస్తున్న వంట పొయ్యిల పొగలు. మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. పోస్ట్ అంతా పంట కాలవలో, పడవలో బందరు వెళ్ళాలి. అలా నేను వ్రాసిన నా మొట్టమొదటి కథ ‘చిత్ర నళినీయం’ పంట కాలవలో, పడవలో ప్రయాణం చేసి బందరు వెళ్ళి, అక్కడ నుంచి రైలులో మద్రాసు వెళ్ళింది. ఆ పచ్చటి పొలాలు, పంట కాలవల్లో ఆకాశం పైనుందా, క్రింద కాలవలో ఉందా అన్నట్టూ ప్రతిబింబించే దృశ్యాలు.. పడవని తాడుతో లాగుతూ ఒడ్డున నడిచే పల్లెకారులు, నీళ్ళలో వెళుతున్న పడవ శబ్దం. ఇదంతా గుర్తుకువస్తే ‘సత్యజిత్ రే’ సినిమాలో ఒక దృశ్యంలా అనిపిస్తుంది. అప్పటికే నా వివాహం కావడం వల్ల నా పేరు యద్దనపూడి సులోచనారాణి అని పెట్టుకున్నాను. అలాంటి పల్లెటూరిని వదిలి ఈ హైదరాబాదు వచ్చాను. కాలగమనంలో ఇన్నాళ్ళ నా సాహితీచరిత్ర సాగుతోంది. ఇంకెన్ని పుటలు ఉన్నాయో నాకే తెలి యదు. కాలగమనంలో మార్పు చూడండి.. ఆ నాడు పంట కాలవలో, పడవలో వెళ్ళే నా కథ, ఇప్పుడు నా కలం నుంచి తెల్ల కాగితం మీద వచ్చిన అక్షరాలని ‘అని’ నిమిషంలో కంప్యూటర్లో పెట్టడం జరుగుతోంది.. 1957 లో ప్రచురితం అయిన నా ఈ కథని మీ ముందు ఉంచుతుంటే, నా హృదయం ఊహించలేనంత ఉద్విగ్నంగా, ఆనందంగా ఉంది. ఈ క్షణం, 60 సంవత్సరాలు గల గతం, ఇప్పటి ఈ రోజు వర్తమానం రెండూ కలిసిపోయిన అద్భుత క్షణాలుగా అనిపిస్తున్నాయి.. కథ ముందు.. నేను రచయిత్రిగా ఎలా మారానో, నేను రాసిన మొట్టమొదటి కథ వెనక జరిగిన కథ ఇది : ‘చిత్రనళినీయం’ కథ పోస్ట్ చేయటానికి వెనక చిన్న కథ వుంది. నేను ఆ కథ రాయటానికి (ఇది నేను ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయిన తర్వాత సెలవల్లో వ్రాసాను). అంత క్రితం 8వ క్లాసు చదువుతుండగా స్కూల్లో మేగ్జీన్ కోసం ఖుద్దూస్ మాస్టార్ గారు నన్ను ఒక కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అన్నాను. అంత క్రితం నేను ‘గోమాత’ మీద ఒక వ్యాసం వ్రాసి, క్లాస్‌లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. నేను అది బాగా వ్రాసానని, క్లాస్‌లో మిగతా పిల్లలతో నాకు అభినందనగా చప్పట్లు కొట్టించి, వారితో కలిసి ఆయన కూడా కొట్టారు! నా మనసు పరవశించి పోయింది. ఖుద్దూస్ మాస్టార్ ముస్లిం అయినా తెలుగు బాగా మాట్లాడేవారు, వ్రాసేవారు. చక్కగా కథలు చెప్పి నీతి బోధించేవారు. ఆయనంటే నాకు బాగా ఇష్టం. నిజానికి ‘గోమాత’ వ్యాసం వ్రాయటానికి నేను యేమీ కష్టపడలేదు. మా దొడ్లో ఒక ఆవు ఉండేది. అమ్మ దాన్ని ‘లక్ష్మి’ అని పిలిచేది. దాని ముఖానికి పసుపు రాసి, బొట్టు పెట్టి, దండం పెడుతూ దాని చుట్టూ ప్రదక్షిణం చేసేది. అది మూత్రం పోస్తే దాని తోక మీద పట్టి, తన తల మీద చల్లుకుని, నా తల మీద చల్లేది. లక్ష్మికి ఒక దూడ ఉండేది. అది దొడ్లో చెంగున గంతులేస్తుంటే మేం పిల్లలంతా దానితో ఆడేవాళ్ళం. నేను దాన్ని పట్టుకుని, మా అమ్మలా దాని మెడ మీద నిమిరేదాన్ని! అది నా దగ్గరికి వచ్చేసేది. మా బాబాయి ఒకరు ఆవు వల్ల ఉపయోగాలు చెప్పారు. ఇదంతా కలిపి ఒక వ్యాసం వ్రాసాను. మూత్రం శుద్ధి చేయటానికి పనికొస్తుందని, పాలు ఆరోగ్యానికి మంచిదని మా బాబాయి చెప్పినట్టే వ్యాసంలో వ్రాసాను. ఇది వ్రాసిన తర్వాత ఖుద్దూస్ మాస్టార్ స్కూల్ నుంచి వచ్చే వ్రాత పత్రికకి కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అని అంటే... నువ్వు వ్రాయగలవని ప్రోత్సహించారు. ఆయన పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది గుర్తుకువచ్చి, శరీరం సంతోషంతో పులకరించేది. ఆ ఉత్సాహంతోనే స్కూల్ వ్రాత పత్రికకి ఒక కథ వ్రాసాను. దాని పేరు ‘మనోఛాయలు’ (ఇద్దరు స్కూల్లో చదివే స్నేహితురాళ్ల మధ్య చిన్న మనఃస్పర్థలు వచ్చి, మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఆనందంగా ఒకరి భుజం మీద మరొకరు చేతులేస్కొని, స్నేహంగా స్కూల్‌కి వెళ్ళటం! ) అది నా 14వ సంవత్సరంలో వ్రాసిన కథ! అది కూడా ఖుద్దూస్ మాస్టార్ మరీ మరీ వ్రాయమని అడిగితే వ్రాసినదే! నేను పెద్ద రచయిత్రిని అయిన తర్వాత, ఎవరో ఒకరు వ్రాయండి అని అడిగితే రాసిన నవలలే ఎక్కువ.. 1) సెక్రటరీ – రమణా – బాపు, జ్యోతి రాఘవయ్య గారు. 2) జీవన తరంగాలు – నార్ల వెంకటేశ్వరరావు గారు 3) మీనా – చక్రపాణి గారు 4) ఆరాధన – ఎమెస్కో ఎం.ఎన్. రావు గారు ఈ విధంగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు అయిపోయినాయి. వేసవి సెలవుల తర్వాత నవంబర్‌లో అమ్మ పోయింది. మనసులో భయం! ఒంటరితనం! దిగులు.. దుఃఖం! అప్పటికే పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది. నాన్న ఎస్.ఎస్.ఎల్.సి. అయి, ఇంటర్ అయిన తర్వాత కాపురానికి పంపిస్తామని పెళ్ళికి ముందే షరతు పెట్టారు. ఇంటినిండా అక్కయ్యలు, ఒదినలు, పిల్లలు.. అయినా ఒంటరితనం. ఖుద్దూస్ మాస్టార్ ఒకసారి నాన్నని చూడటానికి వచ్చి.. నన్ను కథలు వ్రాయమని గట్టిగా చెప్పారు... కథలు వ్రాస్తే నా బాధలు పోతాయని చెప్పారు... అప్పుడు ‘చిత్రనళినీయం’ వ్రాసాను.. – యద్దనపూడి సులోచనారాణి రహస్యంగా పోస్టయిన కథ... మంగళవారం (29.05.2018) సంచికలో... -
నవ నవలారాణి
కాళిదాసు తన మేఘ సందేశంలో వర్ణించిన యక్ష రాజధాని అలకాపురిలో ఆనందబాష్పాలు తప్ప వేరే కన్నీళ్లు లేవు. విరహతాపం తప్ప వేరే బాధలు లేవు. ప్రణయ కలహం వల్ల తప్ప వేరే వియోగం లేదు. ఇంత అందమైన ప్రపంచంలోకి రెండు తరాల పాఠకుల్ని తీసుకెళ్లి, సేదతీర్చిన ఘనత యద్దనపూడి సులోచనారాణిదే! స్కూల్ ఫైనల్లో ఉండగానే తొలి కథ ’చిత్ర నళినీయం’ రాశారు. ఆమె ప్రస్థానం ఆంధ్ర వారపత్రికలో ఆరంభమైంది. మొదట్లో వరసగా ఏడెనిమిది కథలు రాశారు. ఆనాటి పత్రిక సంపాదకుడు నండూరి రామ్మోహనరావు ఆమెలోని ప్రతిభని గుర్తించి బాగా ప్రోత్సహించారు. సులోచనారాణి పెళ్లాడి, పుట్టిల్లు కాజ వదిలి హైదరాబాద్ కాపరానికి వచ్చారు. రచనలపై మమకారం మరింత పెంచుకున్నారు. 1963 జనవరిలో బాపు రమణలు విజయవాడ కేంద్రంగా జ్యోతి మంత్లీ ప్రారంభించారు. ప్రారంభ సంచికలో హేమాహేమీల రచనలతోపాటు సులోచనారాణి కథ జ్యోతి కథ కనిపిస్తుంది. జ్యోతి మంత్లీని నండూరి ఎడిట్ చేసేవారు. తర్వాత 1964లో సెక్రటరీని కొంచెం పెద్దకథగా రాసి పంపారు యద్దనపూడి. దాన్ని నవలగా పెంచి పంపమని నండూరి సెక్రటరీని వెనక్కి పంపారు. నవల చేసి పంపారు. ఇక తర్వాత కథ అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో జ్యోతి మంత్లీ వెల అరవై పైసలుండేది. సెక్రటరీ సీరియల్ ఉత్కంఠ తట్టుకోలేని పాఠకులు కొందరు, ప్రెస్ దగ్గర దొంగ బేరాలాడి ఆ ఒక్కఫారమ్నీ పావలా ఇచ్చి ముందుగా కొనుక్కు వెళ్లేవారట! మొదటి మెట్టులోనే సులోచనారాణికి అంతటి పేరొచ్చింది. చాలా దీక్షగా ప్రొఫెషనలిజమ్‌తో నవలా వ్యాసంగాన్ని ఆమె కొనసాగించారు. ఏకకాలంలో మూడు నాలుగు ధారావాహికలు కొనసాగించిన సందర్భాలున్నాయి. ఆవిడ ఇంగ్లిష్ పల్ప్‌తో రాస్తారంటూ ఆక్షేపించిన వారున్నారు. ఏదైనా కావచ్చు చదివించే గుణం కదా ముఖ్యం. ఆమె నవలల్లో అడుగు పెడితే విమానం లాంటి కార్లు, అందమైన డ్రాయింగ్ రూమ్‌లు, ఆరడుగుల శేఖర్, సరిజోడు జయంతి లేదంటే ఇంకో ఇంతి – కాసేపటికి కలల్లోకి జారుకుంటాం. 1960 దశకంలో మధ్యతరగతి అమ్మాయిలు చాలా ఇష్టపడటానికి కారణం వాతావరణంలో ఉండే రిచ్‌నెస్. దానికి సస్పెన్స్ తోడయ్యేది. పాతికేళ్ల పాటు ఎడిటర్లు, పబ్లిషర్లు, చిత్ర నిర్మాతలు సులోచనారాణి రాతల కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. రీడర్స్ తగ్గి వ్యూయర్స్ పెరిగాక, వీక్షకుల్ని సైతం విపరీతంగా ఆమె ఆకట్టుకున్నారు. సుమారు పది మెగా టీవీ సీరియల్స్‌కి మూలకథ సులోచనారాణిదే. సెక్రటరీ నుంచి చాలా సినిమాలు ఆమె నవలల పేరుతోనే వచ్చాయ్. ప్రతి ఏటా వేసవిలో కుమార్తె వద్దకు వెళ్లి కొద్ది నెలలు గడపడం అలవాటు. అలాగే వెళ్లిన సులోచనారాణి, యుఎస్ క్యుపర్టినో సిటీలో స్వీయ కథ ముగించి ఫుల్స్టాప్ పెట్టేశారు. తెలుగు జాతి ఆమెకు రుణపడి ఉంటుంది. అక్షర నివాళి. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రాజీపడని వాస్తవికవాది ఫిలిప్ రాత్
రెండో ప్రపంచ యుద్ధానంతరం సుప్రసిద్ధ అమెరికన్ వ్యంగ్య నవలా రచయితల్లో మేటి అయిన ఫిలిప్ రాత్ మంగళవారం రాత్రి న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 20వ శతాబ్దికి చెందిన అత్యంత వివాదాస్పద రచయితల్లో ఒకరిగా గుర్తింపుపొందిన ఈ పులిట్జర్ అవార్డు గ్రహీత వయస్సు 85 ఏళ్లు. ‘అమెరికన్ పేస్టోరల్’, ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ వంటి 25 నవలలు, గ్రంథాలు రాసిన ఫిలిప్ సాహిత్యంలో నోబెల్ అవార్డు దక్కని అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరు. సెక్స్, మృత్యువు, జాతుల సమ్మేళనం, విధి వంటి అంశాలపై నిర్భయంగా, సాహసోపేతంగా తాను వర్ణించిన తీరు నాటి సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికన్‌గా ప్రత్యేకించి యూదుగా, రచయితగా, మనిషిగా ఉండటం అంటే ఏమిటి అనే అన్వేషణలో భాగంగా జీవితాంతం రచనలు చేశారు. ప్రత్యేకించి అమెరికన్ యూదుల సమస్య గురించి, పురుషుల లైంగికత ఉనికిపై సాహసోపేతమైన వ్యక్తీకరణలతో 50 ఏళ్ల క్రితం అమెరికన్ సమాజానికి షాక్ కలిగించారు. ఫిలిప్ 1959లో అంటే 20 ఏళ్ల ప్రాయంలో రాసిన ‘గుడ్‌బై, కొలం బస్’ రచన తనకు నేషనల్ బుక్ అవార్డును తెచ్చిపెట్టింది. దశాబ్దం తర్వాత రాసిన ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ అమెరికన్ సమాజంలో సంచలనం కలిగించింది. కఠినతరమైన యూదు కుటుంబ పెంపకం నుంచి బయటపడటానికి అసాధారణ లైంగిక చర్యలను వాహికగా చేసుకోవడంపైనా, యువకుల లైంగికతపైనా ఈ పుస్తకంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. పురుషుల ప్రత్యేకించి యూదుల లైంగిక వాంఛల గురించి ఫిలిప్ వ్యాఖ్యానించిన తీరు తనకు పురుషాహంకారి అనే బిరుదును కూడా తెచ్చిపెట్టాయి. తదనంతర జీవితంలో ‘అమెరికన్ పేస్టోరల్’ (1997), ‘ది హ్యూమన్ స్టెయిన్’ (2000), ‘ది ఫ్లాట్ ఎగైనెస్ట్ అమెరికా’ (2004) వంటి ప్రామాణిక రచనలు రాసినా, 1969లో రాసిన ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ అతడిని అత్యంత వివాదాస్పద రచయితగా మార్చింది. ఈ నవలను అమెరికన్ బూర్జువా ఉదారవాద స్వేచ్చపై చేసిన పెనుదాడిగా విమర్శకులు పేర్కొన్నారు. దీని తర్వాత తాను రాసిన ‘సబ్బాత్స్ థియేటర్’ కూడా పాఠకులకు షాక్ కలి గించింది. పురుషుల అసాధారణ లైంగిక చర్యలపై తన వ్యక్తీకరణలను స్త్రీవాదులు దుమ్మెత్తి పోశారు కూడా. యూదుల కుటుంబ జీవితంలోని సాంప్రదాయిక ఛాందసత్వం నుంచి తన నవలల్లో విముక్తి దారి చూపించానని ఫిలిప్ సమర్థించుకున్నారు. జీవించి ఉండగానే లైబ్రరీ ఆఫ్ అమెరికాలో తన రచనలకు చోటు లభించిన మూడో అమెరికన్ రచయితగా ఫిలిప్ అరుదైన గుర్తింపు పొందారు. 1960–70లలో పులిట్జర్ ప్రైజ్, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, నేషనల్ బుక్ అవార్డ్స్, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు వంటి వలు అవార్డులు తన సొంతమయ్యాయి. 2012లో రాసిన ‘నెమిసెస్’ తన చివరి రచన. జీవితంలోని వాస్తవానికి భిన్నంగా కల్పననే ఎక్కువగా రాసుకుంటూ పోయానని, ఇక తన రచనలను మళ్లీ చదవాల్సిన అవసరం కానీ, తిరగరాయాల్సిన అవసరం కానీ లేదని ప్రకటించారు. యూదుల ఉనికి, యూదు వ్యతిరేకత, అమెరికాలో యూదుల అనుభవం వంటి కథాంశాలే ఆయన రచనలకు మూలం. కల్పన, వాస్తవం ఎల్లప్పుడు సాహిత్యంలో తమ పాత్రలను మార్చుకుంటుంటాయని, ఒకదాన్ని మరొకటి అధిగమిస్తుంటాయని అందుకే తన జీవిత చరిత్ర పుస్తకంలో వాస్తవానికి విరుద్ధ ఘటనలు కూడా రూపొందించాల్సి వచ్చిందని, తన చరిత్ర రచనల్లో కూడా కాస్త కల్పన చోటు చేసుకుందని ఇది తన జీవితంలోని వాస్తవ నాటకీయత అని ఫిలిప్ సమర్థించుకున్నారు. దీనికి అనుగుణంగానే సాహిత్యం అంటే నైతిక సౌందర్య ప్రదర్శన కానే కాదని స్పష్టం చేశారు. రచయితగా ఫిలిప్ రాత్ తీవ్రమైన వ్యంగ్యానికి, రాజీలేని వాస్తవికతకు మారుపేరు. పురుషుల లైంగికత నుంచి మొదలుకుని అన్నే ఫ్రాంక్ వరకు జీవితంలోని పలు అంశాలను సాహిత్యరూపంలోకి తీసుకొచ్చిన దిట్ట. తనను యూదు రచయితగా కాకుండా అమెరికన్ రచయితగానే చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. వలస జీవితంతో యూదులు అలవర్చుకున్న బాధాకరమైన సర్దుబాటు ధోరణిని తన రచనలు ప్రతిభావంతంగా చిత్రించాయి. మనిషి స్వేచ్చను, స్వాతంత్య్రాన్ని, 1960ల నాటి అమెరికన్ లైంగిక భావోద్వేగాలను ప్రతిభావంతంగా చిత్రించిన రచయితగా అమెరికన్ సమాజం తనను గుర్తించుకుంటుంది. -కె. రాజశేఖర రాజు -
సహృదయ సామ్రాజ్ఞి!
దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు తెలుగు పాఠక లోకాన్నేలిన హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూశారు. తన చుట్టూ ఉన్న... తనకు తెలిసిన మధ్య తరగతి కుటుంబాల్లోని జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఆ జీవితాల్లో మనుషుల మధ్య ఏర్పడే అనుబంధాలనూ... ఆ అనుబంధాల్లోని సున్నితత్వాన్ని, వారి ఆశలనూ, ఆకాంక్షలనూ, కలల్ని అద్భుతంగా చిత్రించిన ప్రతిభాశాలి ఆమె. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని వయసులో ఆమె రాసిన తొలి కథ ‘చిత్ర నళినీయం’ ‘ఆంధ్రపత్రిక’ వీక్లీలో అచ్చయినప్పుడు ఇంట్లో వాళ్లూ, ఊళ్లోవాళ్లూ సులోచనారాణిని చూసి గర్వపడ్డారట. ‘సెక్రటరీ’తో మొదలుపెట్టి సులోచనా రాణి రాసిన దాదాపు 70 నవలలు తెలుగు సమాజంలోని ఆడపిల్లలకు అలాంటి గర్వాన్నే కలిగించాయి. ఎందుకంటే ఆ నవలల్లోని ఆడపిల్లలు భయంగా, బేలగా ఉండరు. తమకేదో అన్యాయం జరిగిందని శోకిస్తూ కూర్చోరు. వారు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనేవారే కావొచ్చుగానీ... ఉన్నతమైన వ్యక్తిత్వంతో, నిండైన ఆత్మాభిమానంతో మెలగుతారు. ఆ ఆత్మాభిమానాన్ని లేదా ఆత్మ గౌరవాన్నీ దెబ్బతీయడానికి జరిగే చిన్న ప్రయత్నాన్నయినా నిలదీసే మనస్తత్వంవారిది. ఆ ఆడపిల్లలు మాటకారులు. స్వతంత్రంగా ఆలోచిస్తారు. సొంతంగా ఎదగాలని చూస్తారు. తెలివి తేటల్ని ప్రదర్శిస్తారు. ఎవరి దయాదాక్షిణ్యాలకూ ఎదురుచూడరు. అలాగని వారు చలం రచనల్లోని స్త్రీల మాదిరి సమాజం, కుటుంబం విధించిన కట్టుబాట్లను ప్రశ్నించే రకం కాదు. వాటిని ఛేదించేంత సాహసం చేయరు. బహుశా సులోచనా రాణి నవలల్లోని ఈ లక్షణాలే లక్షలాదిమంది మధ్య తరగతి మహిళలను, యువతులను ఆమె రచనలవైపు ఆకర్షించేలా చేశాయి. ఆమె నవలల్లోని కథా నాయకులూ అంతే. వారు పురుషాధిక్యతను ప్రదర్శించరు. ఆడవాళ్లను అణిచేయాలనే మనస్తత్వంతో ఉండరు. వారిని తక్కువ చేసి మాట్లాడరు. ఆడపిల్లల వ్యక్తిత్వాలను గౌరవించడం, వారితో ప్రేమగా మెలగడం... పొరబాటున మనసు కష్టపెట్టానని అనిపించినా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా క్షమించమని కోరడం ఆ కథానాయకుల వ్యక్తిత్వం. మనలాంటి అసమ సమాజంలో, కుటుంబాల్లో ఇలాంటి లక్షణాలున్నవారు దుర్భిణి వేసి గాలించినా కనబడరన్న విమర్శల్లో అవాస్తవమేమీ లేదు. కానీ స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి సంబంధాలుండాలని... అచ్చం ఇలాగే సమాజం ఉంటే ఎంతో బాగుంటుందని ప్రగాఢంగా కోరుకునే మధ్యతరగతి మహిళల, యువతుల ఆకాంక్షలకు సులోచనారాణి అద్దం పట్టారు. అందుకే వారికి ఆమె అంతగా చేరువయ్యారు. ఆమె నవలల్లోని పాత్రలు ఎదుటివారితో సంఘర్షించవు. అంతస్సంఘర్షణకు లోనవుతాయి. ఆ క్రమంలో తమను తాము తీర్చిదిద్దుకుంటాయి. ఎదుటివారిలో మార్పు తెస్తాయి. ఆమె నవలలు సీరియల్‌గా వస్తున్న కాలంలో మధ్యతరగతి కుటుంబాల మహిళలు, యువతులు మరుసటి వారం గురించి ఆత్రంగా ఎదురు చూసేవారట. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయంలో రకరకాలుగా చర్చించుకునేవారట. కుటుంబమే సర్వస్వంగా భావిస్తూ పొద్దు పొడిచింది మొదలు పొద్దు గడిచేవరకూ దానికోసమే అంకి తమవుతూ...తీరిక చిక్కితే పురాణగాథలు, పిచ్చాపాటీలతో కాలక్షేపం చేసే మహిళలంతా సులోచనారాణి రచనలతో ఇటు మళ్లారని చెబుతారు. దశాబ్దాలపాటు కొన్ని తరాలపై ఒక రచయిత ఇంతగా ప్రభావాన్ని చూపగలగటం ఎంతో అరుదైన విషయం. సులోచనారాణి ఆ ఘనత దక్కించుకున్నారు. ఆ కాలంలో యద్దనపూడితో పాటు అనేకమంది మహిళలు తెలుగు నవలను సుసంపన్నం చేశారు. ఇల్లిందల సరస్వతీ దేవి, డాక్టర్ పి. శ్రీదేవి, మాలతీ చందూర్, తెన్నేటి హేమలత, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, కోడూరి కౌసల్యాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, సి. ఆనం దారామం వంటి అనేకులు నవలా రంగంలో అప్పట్లో సుప్రసిద్ధులు. వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదంటే చాలామంది పురుష రచయితలు సైతం మహిళల పేరుతో రాయకతప్పని స్థితి ఏర్పడింది. మహిళా రచయితల్లో ఇతరుల కంటే ఎక్కువగా యద్దనపూడి రచనలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించాయి. అప్పటివరకూ కథల కోసం బెంగాలీ అనువాద సాహి త్యంవైపు, బెంగాలీ చిత్రాలవైపూ చూసే అలవాటున్న చిత్రపరిశ్రమను... కొత్త దృక్పథంతో, కొత్త ఆలోచనలతో మధ్య తరగతి జీవితాలను ప్రతిభావంతంగా, ఆకర్షణీయంగా చిత్రిస్తున్న యద్దనపూడి రచనలు సహజంగానే ఆకట్టుకున్నాయి. డాక్టర్ పి. శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ రూపుదిద్దుకుంటుండగా అనుకోకుండా ఆ రచయిత్రి కన్నుమూసినప్పుడు ఆ లోటును పూడ్చడం కోసం యాదృచ్ఛికంగా యద్దనపూడి సినీ రంగంవైపు వచ్చారు. ఆ తర్వాత ఆమె రచించిన ‘మీనా’, ‘సెక్రటరీ’, ‘జీవనతరంగాలు’, ‘చండీప్రియ’, ‘ఆత్మీయులు’ వంటి సుప్రసిద్ధ నవలలెన్నో చలనచిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే యద్దనపూడి పాఠకులు ఆ చలనచిత్రాలతో ఏనాడూ పూర్తిగా సంతృప్తిపడిన దాఖలాలు లేవు. వెండితెరపై సమ్మోహనపరిచే దృశ్య కావ్యాలకన్నా ఆమె రచనల్లోని నాటకీయత, సంభాషణలే వారిని బాగా ఆకట్టుకునేవి. నవలారంగం నుంచి సినీ మాధ్యమానికీ...అక్కడి నుంచి టెలివిజన్ రంగానికీ వచ్చి అన్నిచోట్లా సమానంగా మన్ననలు పొందిన ఏకైక రచయిత్రి బహుశా యద్దనపూడే కావొచ్చు. దాదాపు నూటయేభై ఏళ్లక్రితం పుట్టిన తెలుగు నవల ఎన్నో పోకడలకు పోయింది. ఈ క్రమంలో వచ్చిన పాపులర్ నవలా ప్రపంచంలో యద్దనపూడి సులోచనారాణి తనదైన ముద్ర వేసి అగ్రగామిగా నిలిచారు. స్త్రీ, పురుష సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుని...తన రచ నల ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించిన సులో చనారాణి రాగలకాలంలో సైతం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. -
నవలా రచయిత్రి సులోచనారాణి కన్నుమూత
-
యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత
కాలిఫోర్నియా : ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలోని కుపర్టినోలో గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె నివాసంలో ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిసులోచనారాణి కుమార్తె శైలజ ధ్రువీకరించారు. సులోచనారాణి అంత్యక్రియలు కాలిఫోర్నియాలోనే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘ సులోచనారాణి మృతి విషయాన్ని ఆమె కుమార్తె శైలజ గతరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు.ఆమె నవలలు ఎక్కువ శాతం మేమే పబ్లిష్ చేశాం. సులోచనారాణి మృతి తెలుగు పాఠకలోకానికి తీరనిలోటు. స్త్రీల ఆత్మాభిమానం గురించి ఆమె తన రచనల్లో చాలా బాగా ఎలివేట్ చేసేవారు. సులోచనారాణి రాసిన ‘సెక్రటరీ’ నవల ఇప్పటికీ ఆదరణ పొందటం అందుకు నిదర్శనం.’ అని తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేశారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, వారి ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. వర్ణనల విషయానికి వస్తే వీరి నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. ఇవి ఎక్కువ ప్రచారం పొందడానికి కారణం- మెజారిటీ ప్రజల జీవన విధానాలను, అనుభూతులను పొందుపరచడమే. వీరి నవలా పాత్రలు విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాయి. కొద్ది సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. అందుకేనేమో బహుశా సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం - అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి, ఆశ - నిరాశ... ఇలాంటి సహజాతాల మధ్య వీరు సృష్టించే పాత్రలు తలమునకలవు తుంటాయి. చదివే పాఠకులకు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుంటాయి. యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది. సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. వీరి రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్లో వచ్చిన రాధ మధు సీరియల్ కథ వీరిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ వీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు. -
రన్నింగ్ చేసే గృహిణుల కథ
జపాన్ నవలా రచయిత హరుకి మురకమి తనకున్న పరుగుల మోహం గురించి ఓ చోట ఇలా రాస్తాడు. ‘రన్నింగ్ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. ఆ సమయంలో నేను ఎవ్వరితో మాట్లాడనవసరం లేదు. ఎవరినీ విననవసరం లేదు. రన్నింగ్ నా నిత్య జీవితంలోని ఒక ముఖ్యమైన భాగం’ అంటాడు. భారతీయ గృహిణలు కూడా చాలామంది హరుకి మురకమిలా రన్నింగ్‌ని ఇష్టపడతారు. ఇదే థీమ్‌తో బెంగళూరుకు చెందిన బృందా సమర్నాథ్ అనే ఫిల్మ్‌మేకర్ ‘టైమ్‌లెస్’ అనే డాక్యుమెంటరీ తీశారు. అందుకోసం దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో రన్నింగ్‌ని తమకు ప్రియమైన వ్యాపకంగా ఏళ్లుగా కొనసాగిస్తున్న కొందరు గృహిణుల జీవితంలోని ఘటనలను కథగా మలుచుకున్నారు. ఒక గంట నిడివిగల ఈ డాక్యుమెంటరీ ఈ నెలలో జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లొచ్చింది. వచ్చే నెల జరుగుతున్న అట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్క్రీన్ అవబోతోంది. ఇందులో.. పనమ్మాయిగా ఉండి, ప్రొఫెషనల్ రన్నర్‌గా మారిన సీమా వర్మ ఎపిసోడ్ (ముంబై) ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. రన్నింగ్.. మహిళను కదలించే ధ్యానం అని చెబుతూ.. ప్రతి మహిళకూ రన్నింగ్ అవసరం అని, అది వాళ్లకు ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పే ఉద్దేశంతో బృందా ఈ డాక్యుమెంటరీని తీశారు. -
బ్రిటన్ రచయితకు సాహిత్య నోబెల్
స్టాక్‌హోం/లండన్: బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురోను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ నవలా రచయితగా అందరికీ సుపరిచితమైన ఇషిగురోను నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది. ఇషిగురో నవలల్లో అద్భుతమైన భావోద్వేగ శక్తి ఉంటుందని, కల్పిత భావనలను అత్యద్భుతంగా తన రచనల్లో ప్రతిబింబించిన రచయిత ఇషిగురో అని అకాడమీ కొనియాడింది. ఇషిగురో 8 పుస్తకాలతో పాటు పలు సినిమాలు, టీవీ కార్యక్రమాలకు స్క్రిప్ట్‌లు అందించారు. ఆయన రచించిన ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ నవలకు 1989లో మాన్ బుకర్ ప్రైజ్ లభించింది. 62 ఏళ్ల ఇషిగురో జపాన్‌లోని నాగసాకీలో జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసులో కుటుంబం మొత్తం బ్రిటన్‌కు వలస వచ్చింది. ఇషిగురో 1982లో తొలి నవల ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ను.. 1986లో ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’ను రచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాగసాకీలో పరిస్థితులపై ఈ రెండు నవలలను రాశారు. ఇక ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ద రిమైన్స్ ఆఫ్ ద డే నవల ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆంటోని హాప్కిన్స్ ప్రధాన పాత్రలో సినిమాగా తెరకెక్కింది. ఇక 2005లో ‘నెవర్ లెట్ మీ గో’అనే సైన్స్ ఫిక్షన్ నవలను, 2015లో ద బరీడ్ జెయింట్ అనే నవలను రచించారు. ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి సంబంధించి ఫేవరెట్ల జాబితాలో అసలు ఇషిగురో లేరు. ఇషిగురో పబ్లిషర్ ఫబర్ అండ్ ఫబర్ ట్వీటర్లో స్పందిస్తూ.. ఇషిగురోను నోబెల్ వరించడం తమను థ్రిల్‌కు గురిచేసిందని పేర్కొంది. ఇషిగురోకు నోబెల్ సాహిత్య పురస్కారంతో పాటు 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) అందజేయనున్నారు. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో ఇషిగురో ఈ పురస్కారాన్ని అందు కోనున్నారు. నోబెల్ సాహిత్య పురస్కారం వరించిన 114వ రచయిత ఇషిగురో కావడం గమనార్హం. వదంతి అనుకున్నా: ఇషిగురో తనకు నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చిందన్న వార్తలను తొలుత నమ్మలేదని, వాటిని వదంతులుగా భావించానని కజువో ఇషిగురో చెప్పారు. తనకు ఈ పురస్కారం రావడం నిజమని ఆ తర్వాత తెలిసిందన్నారు. ఇది తనకు అద్భుతమైన గౌరవమని బీబీసీతో ఇషిగురో చెప్పారు. అయితే ఇప్పటి వరకూ నోబెల్ కమిటీ తనను సంప్రదించలేదన్నారు. ‘‘ఇది అద్భుతమైన గౌరవం. ప్రపంచంలోని గొప్ప రచయితల అడుగుజాడల్లో నేను నడిచాను. దాని వల్లే నాకు ఈ గొప్ప పురస్కారం దక్కింది’’అని చెప్పారు. ఈ పురస్కారం తనకు మంచి చోదక శక్తిగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిరతతో కూడి ఉందని, నోబెల్ పురస్కారాలు ప్రపంచంలో సానుకూల వాతావరణం నెలకొనేందుకు ఓ శక్తిగా పనిచేస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. -
కథకుడు, నవలాకారుడు
ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక మంచికథకి కావాల్సిన ‘అనుభవం’, సంఘటన, వస్తువు వుండి తీరతాయి. వ్యక్తి సంస్కారాన్ని బట్టి, ఆ అనుభవం వత్తిడి వైశాల్యం నిర్ణీతమవుతాయి. ఆ రెంటికీ సమన్వయం కుదిరినప్పుడు ఒక కథ వూడిపడొచ్చు. గొప్పకథ కాకపోయినా ఆ కథ మంచి కథ కావచ్చు. కానీ అది రచించిన వ్యక్తిని కథకుడు అనలేము. మరి ఎవరు కథకుడు? జీవితంలో తాను తెలుసుకున్న విషయాలను కుదించి, తాను పొందిన అనుభూతిని కళగా మార్చి యితరులతో పంచుకునేటందుకు కృషి చేసేవాడు కథకుడు. కుదించడం, సంక్షిప్తం చెయ్యడం ముఖ్యం. అది లేకుంటే నవలా రచయిత అవగలడు. నవలాకారుడికి కుదించడం అవసరం లేదని కాదు. నవలకీ స్వరూపం, అంతం వుంటాయి. కథకి మల్లేనే నవలాకారుడి అభిమాన పాత్రలు ‘కాలం’, ‘స్థలం’ అనేవి. ఈ రెంటి సమన్వయం సాధించిన పరిణామంతో నిమిత్తం వున్నవాడు నవలాకారుడు. అతని జగత్తు సముద్రం అయితే కథకుడి జగత్తు అందులో ఒక కెరటం. ఎక్కడో మధ్యలో ఎప్పుడు లేస్తుంది– కదుల్తుంది– చుట్టూ వున్న మరికొన్ని తుంపరలని, పిల్ల కెరటాలని తనతో లాక్కుపోతుంది– వెళ్లినకొద్దీ ఆకృతి పెంచుకుంటుంది. దానికొక శిఖరం ఏర్పడుతుంది. మనం చూస్తూ వుండగానే తుంపరల కింద విడి, అవతారం చాలించుకుంటుంది. ఆ క్షణికమైన దృశ్యం చూసేవారిలో ఒక అనుభూతిగా నిలిచిపోతుంది. కెరటాన్ని లేవదీసేవాడు కథకుడు. (బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు మొదటి సంపుటం లోంచి; ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్) -
సులోచనారాణితో ఇంటర్వ్యూ
-
ఆడడం ఆనందం...గెలవడం బోనస్!
ఒక తరానికి ఆయన ప్రయోగాత్మక నాటక రచయిత... మరో తరానికి పాపులర్ నవలా రచయిత... అటుపైన పేరుతెచ్చుకున్న సినీస్క్రిప్ట్ రైటర్... ఇవాళ్టి తరానికి ఒక వ్యక్తిత్వ వికాస బోధకుడు, జీవన విధానపు కౌన్సెలర్... కాలానికి తగ్గట్లుగా ఆలోచననూ, అక్షరాన్నీ మలుచుకొని, ప్రతి విషయంలో పదేళ్ళు ముందుండడం యండమూరి వీరేంద్రనాథ్ ప్రత్యేకత. 1980ల నుంచి తెలుగు సాహిత్యంలో లక్షల కొద్దీ కాపీలు... కోట్ల రూపాయల అమ్మకాలు జరిగిన ‘మోస్ట్ పాపులర్ రైటర్’గా అభిమానుల ప్రశంసలూ ఆయనకే! మూడు దశాబ్దాల క్రితం సీరియల్ పాఠకులను ఊపేసిన ‘తులసిదళం’, ‘తులసి’నే దృష్టిలో పెట్టుకొని ‘క్షుద్ర సాహిత్య రచయిత’గా గిట్టనివర్గాల ఈసడింపులూ ఆయనకే! విజేతగా కీర్తించినా, విమర్శించినా - విస్మరించలేని విశిష్ట పాళీ, అక్షరాల మోళీ యండమూరిది. స్వయంకృషితో నిజజీవితంలో ‘విజయానికి అయిదు మెట్లు’ వేసుకున్న ఎవర్గ్రీన్ యండమూరి 66వ పుట్టినరోజు సందర్భంగా విజయం వైపు పయనించిన ఆయన అంతరంగంలోకి ‘సాక్షి ఫ్యామిలీ’ ప్రయాణం... మీ కోసం... ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అరవై ఆరేళ్ళు నిండిన ఈ సమయంలో ఒక్కసారిగా వెనక్కి తిరిగిచూసుకుంటే కలుగుతున్న భావాలు? (నవ్వేస్తూ...) మనిషి గెలుపు నిరంతరం. అంతే తప్ప, ఒక మజిలీలో ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడమనేది నేను నమ్మను. చాలామంది 30 - 40 ఏళ్ళకే తృప్తిపడిపోతారు. జీవించడం మానేసి, బతకడం మొదలుపెడతారు. అది తప్పు. పని చేస్తున్నకొద్దీ రాటుదేలేది ఒక్క మెదడే. ‘ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎంత తొందరగా ప్రారంభించామన్నది ముఖ్యం’ అంటా. తొందరగా ప్రారంభించడమంటే...? దాని అంతరార్థం కొద్దిగా వివరిస్తారా? జీవితంలో డబ్బు, కీర్తి, జ్ఞానం - వీటి సముపార్జన తొందరగా ప్రారంభించాలి. నా దృష్టిలో మనిషికి కావాల్సినవి షడ్గుణ ఐశ్వర్యాలు. ఆ 6 ఏమిటంటే - ఆరోగ్యం, కీర్తి, డబ్బు, జ్ఞానం, ప్రేమ, ఉత్సాహం. ఈ ఆరూ ఉంటే, జీవితం సఫలమైనట్లే. వీటి కోసం ఎంత చిన్న వయసులో ప్రయత్నం ప్రారంభిస్తే, అంత తొందరగా జీవితంలో విజయం వైపు పయనిస్తాం. మీ జీవితం గమనిస్తే, చిన్నప్పుడే మీరు ఆ ప్రయత్నం ప్రారంభించినట్లున్నారు. అవును. జీవితంలో కృషి చేయడమంటే ఏమిటో మా నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఆయనకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడే మా తాత గారు చనిపోయారు. మా నాన్న గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. అమ్మానాన్న, నలుగురు పిల్లలం చిన్న ఇంట్లో సర్దుకొన్న రోజులు నాకింకా గుర్తే. అందుకే, చిన్నప్పటి నుంచి స్వయంకృషితో పైకి వచ్చేందుకు కృషి చేశా. మీరు చాలా కష్టపడి చదువుకున్నారట! (మధ్యలోనే అందుకుంటూ...) కష్టం అనకండి... కృషి అనండి! జీవితంలో ఏ పని చేసినా, ఆ పని ఆనందంగా చేయాలి. దాన్ని ఆస్వాదించాలి. అప్పుడు కష్టం, బాధ ఉండవు. అందుకే, ‘ఆడడం ఆనందం. గెలవడం బోనస్’ అని చెబుతుంటా! చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగా. బంధువుల దగ్గర వాళ్ళ ఇళ్ళలో ఉంటూ, వేర్వేరు ఊళ్ళలో చదువుకున్నా. ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి, స్కూల్లో చదువుకుంటున్నప్పుడే చిన్న తరగతులకు ట్యూషన్లు చెప్పి, సంపాదించా. నా తొలి సంపాదనతో మా అమ్మకు చిన్న ట్రాన్సిస్టర్ కొనివ్వడం, ఆమె ఆనందం - ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో మీ జీవితం ఎలా గడవాలనుకొనేవారు? కాకినాడ పి.ఆర్. కాలేజ్‌లో బి.కామ్ చదువుతున్న రోజుల్లో నెలకు వెయ్యి సంపాదిస్తే చాలనుకున్నా. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. రచయితనయ్యాక కూడా లక్షరూపాయలు సంపాదించి, బ్యాంకులో వేస్తే వచ్చే వెయ్యి రూపాయల వడ్డీతో దర్జాగా బతికేయాలని భావించా. మా పబ్లిషర్‌కు చెబితే, ఆయన నవ్వేసి, ‘మీరు ఒకటి కాదు మూడు బిల్డింగ్లు కడతారు... చూడండి’ అన్నారు. నిర్ణీత మొత్తం సంపాదించాలని ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు. కాకపోతే, సౌకర్యంగా బతకాలని అనుకున్నా. అంతే! అసలు, తొలి రోజుల్లో మీకు రచన వైపు ఆసక్తి ఎలా కలిగింది? మా నాన్న గారు యండమూరి చక్రపాణి మంచి కవి. మూడు, నాలుగు పుస్తకాలు కూడా రాశారు. మా తాతయ్య (అమ్మ గారి నాన్న గారు) రావిపాటి సత్యనారాయణ రచయిత. మా మేనమామ వేణుగోపాలరావు కూడా రాసేవారు. ఆ జీన్స్ నాకు వచ్చినట్లున్నాయి. మేనమామ ప్రోత్సాహంతో ‘చందమామ’లో కథలు రాయడంతో నా రచనా జీవితం మొదలైంది. నవలల కన్నా ముందు నాటకాల్లో కృషి చేసిన రోజులు గుర్తుచేసుకుంటారా? సి.ఏ. చదువుతున్నప్పుడు 1969లో రాసిన ‘గులకరాళ్ళు - గులాబీముళ్ళు’ నా తొలి నాటిక. నన్ను రచయితగా తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు, నేను, నటుడు సుబ్బరాయశర్మ కలసి ఒక బృందంగా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళం. నాటకం రాయడం, వేయడం ఒక ఉద్యమంలా సాగేది. ‘మరో మొహంజొదారో’ లాంటివి మినహా, తెలుగు రంగస్థలంపై ప్రయోగాలు తక్కువైన రోజుల్లోనే మీరు రాసిన ‘కుక్క’ గురించి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. (నవ్వుతూ...) ‘కుక్క’ నాటకం ఓ సంచలనం. అలాగే, ‘రుద్రవీణ’ ఆధునిక యక్షగానం. ‘మనుషులొస్తున్నారు జాగ్రత్త’, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’ లాంటివన్నీ పేరు తెచ్చినవే. ఎగ్జిబిషనిజమ్ మీద, బ్రెహ్ట్ చెప్పిన ఏలియన్ థీరీ మీద, అలాగే అబ్సర్డ్ నాటికలు - ఇలా రకరకాల ప్రయోగాలు చేశా. అప్పట్లో రంగస్థలంపై మెలోడ్రామాగా నాటకాలు నడిచేవి. వాటికే బహుమతులూ వచ్చేవి. ఇవన్నీ చూసి ‘చీమ కుట్టిన నాటకం’ పేరుతో మెలోడ్రామా మీద పూర్తి వ్యంగ్యంగా నాటకం రాశా. అదీ చర్చ రేపింది. ‘రఘుపతి రాఘవ రాజారామ్’ నాటకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డొచ్చింది. మరి, నాటకాల్లో అంత కృషి చేసి, నవలల వైపు ఎందుకు మళ్ళారు? ‘చీమ కుట్టిన నాటకం’ రాశాక, ఇక నాకు ఎప్పటిలా మామూలు నాటకాలు రాయాలనిపించ లేదు. పైగా నేను, రచయితలు జంధ్యాల, పరుచూరి బ్రదర్స్ పరిషత్తు నాటకాల్లో పోటీలు పడుతుండేవాళ్ళం. రాజమండ్రి ‘లలిత కళానికేతన్’లో మా మధ్య గట్టిపోటీ ఉండేది. వాళ్ళిద్దరూ సినిమా రంగానికి వెళ్ళిపోయాక నవలా రచన వైపు మొగ్గా. 500 మంది చూసే నాటకం కోసం ఇంత శ్రమ పడే కన్నా, అదే శ్రమతో అంతకన్నా ఎక్కువ మందికి నవల ద్వారా చేరవచ్చనిపించింది. ‘నాటకం కన్నా నవల రాయడం కష్టమ’ని ఎవరో చేసిన విమర్శతో 1977లో ‘ఋషి’తో నవలా రచన మొదలుపెట్టా. ప్రొఫెషనల్ రైటరై, ‘తులసిదళం’తో కీర్తీ, అపకీర్తీ కూడా మూటగట్టుకున్నారు! (కొద్దిగా హెచ్చు స్వరంలో...) నా పుస్తకాన్ని పది మంది కొంటే ప్రొఫెషనల్ రైటర్ అంటారు. ఎవరూ కొనకపోతే సీరియస్ రైటర్ అంటారు. నలుగురూ కొని, చదివే పుస్తకాలు రాస్తే, వెంటనే ‘కమర్షియల్ రైటర్’ అనే ముద్ర వేసేస్తారు. చాలామంది ఆర్ట్ సినిమాల్లో చేసే వారి కన్నా అమితాబ్ మంచి నటుడు. కానీ, ఏం లాభం? అతనికి కమర్షియల్ చిత్రాల నటుడనే ముద్ర వేసేస్తాం. నా మీదే అంతే! ‘అంతర్ముఖం’ నవల యండమూరి కాకుండా, మరొకరు రాసి ఉంటే నెత్తి మీద పెట్టుకొని ఊరేగేవాళ్ళు. నేను రాశా కాబట్టి, మాట్లాడరు. నా 50 నవలల్లో ఒక్కటైన ‘తులసిదళం’ గురించే ప్రస్తావిస్తారు. ‘ఎస్! యండమూరి ఎరైవ్డ్’ అని మీకెప్పుడనిపించింది? ‘తులసిదళం’తోనా? ఆ మాట అప్పుడు, ఇప్పుడు - ఎప్పుడూ అనుకోను. వారం వారం పాఠకులు ‘తులసిదళం’ సీరియల్ కోసం ఊగిపోతున్నారనీ, అది అంత సంచలనమనీ అప్పట్లో నాకు తెలీను కూడా తెలీదు. ‘తులసిదళం’కి నాకిచ్చిన పారితోషికం రూ. 3 వేలు. ‘తులసి’కి 5 వేలు. అంతే! సీరియల్ వల్ల పత్రిక సర్క్యులేషన్ పెరుగుతోందని తెలుసు కానీ, ఇంత సంచలనం సృష్టిస్తోందని తెలియదు. తెలిస్తే పారితోషికం భారీగా అడిగి ఉండేవాణ్ణి కదా! చేతబడుల గ్రామాలు నిజంగా చూసి, రిసెర్చ్ చేసి మరీ అవి రాసినట్లున్నారు? ‘తులసిదళం’ కన్నా ముందే ‘పర్ణశాల’లో రొయ్యల వ్యాపారం గురించి, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’లో సంగీతం గురించి తెలుసుకొని రాశా. క్యాన్సర్‌పై రాసిన ‘ప్రార్థన’కూ అంతే! ఆ మాటకొస్తే, ప్రతి రచనకూ రిసెర్చ్ చేస్తా. (వ్యంగ్యంగా...) అప్పుడు అడగలేదేం ఈ ప్రశ్న. ఒక్క ‘తులసిదళం’కే అడుగుతారేం? నా కన్నా ముందు విశ్వనాథ సత్యనారాయణ ‘బాణామతి’ రాశారు. అదింత ప్రాచుర్యం పొందలేదు. నాది పాపులరయ్యేసరికి గొడవ! అసలు ‘తులసిదళం’ నవలలకు ప్రేరణేంటి? బ్యాంక్ పని మీద ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రామంలో చూసిన సంఘటనలు, అక్కడ తెలుసుకున్న విషయాలు నాలో ఆలోచన రేపాయి. అప్పటికే వచ్చిన ‘ఎగ్జార్సిస్ట్’, ‘ఓమెన్’ లాంటి హారర్ చిత్రాల ప్రేరణతో అప్పుడీ నవలలు రాశా. అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళనూ చూశా. అదంతా వట్టి బూటకమని గ్రహించా. అదే రాశా. కాకపోతే, ఆ నవలల వల్ల కొందరిలో మూఢనమ్మకాలు పెరగడం, కొంత నష్టం జరగడం నిజమే. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ అలాంటి నవలలు రాయమంటే రాస్తారా? కోట్లిస్తానన్నా సరే, రాయను. అప్పట్లోనే ‘రెండు లక్షలిస్తా.. అలాంటి నవల రాయ’మని సంపాదకుడు కందనాతి చెన్నారెడ్డి అడిగినా, నిరాకరించా. వాటికి అప్పట్లో క్రేజ్ కానీ, నా బెస్ట్ సెల్లర్స్ ‘వెన్నెల్లో ఆడపిల్ల’ లాంటివే! కానీ, ‘తులసిదళం’ ప్రేరణతో చాలా వచ్చాయి. మీ ‘వేపమండలు’ కూడా! (నవ్వుతూ...) నిజమే. ‘తులసిదళం’కి పేరడీగానే ‘వెన్నెలకంటి వసంతసేన’ లాంటి పేరుతో ‘వేపమండలు’ రాశా. కామెడీ రాయలేనన్న వారికీ, ఆ గొడవకూ నా జవాబు ఆ రచన. ఒక్క ముక్కలో, ‘తులసిదళం’ చందమామ కథ. రాకుమార్తె, రాక్షసుడు బదులు పసిపాప, మాంత్రికుడు పాత్రలు పెట్టా. మీరేమన్నా, అప్పట్లో మీపై ‘క్షుద్ర సాహిత్యకారుడ’నే ముద్ర బలంగానే పడింది. చాలామంది రచయితలకున్న ‘కంఫర్ట్ జోన్’ను బద్దలు కొట్టడంతో, అసూయతో నా మీద వేసిన ముద్ర అది. ‘తులసిదళం’ బాగా సక్సెస్ కావడంతో అందరూ దుమ్మెత్తిపోశారు. దాంతో, రకరకాల నవలలు రాసి, విమర్శకుల నోళ్ళు మూయించా. ‘అంతర్ముఖం’ లాంటివి రాసింది అందుకే! ఆ పాపులర్ నవలా శకంలో ఆఖరు యోధుడు మీరే అనుకోవచ్చా? పాపులర్ నవలా రచనా శకం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరి నవలలూ మునుపటిలా అమ్ముడవడం లేదు. అయితే, నవలా శకం యోధుల్లో ఆఖరువాణ్ణి నేను కాదు కానీ, ఆఖరు వాళ్ళలో నేనూ ఒకణ్ణి! ఒకప్పుడు కొవ్వలి లాగా నా రచనలూ తెలుగునాట కొత్త పాఠకుల్ని సృష్టించాయి. పాపులర్ సాహిత్యంతో కాకపోతే, నవలల ద్వారా వచ్చిన పాపులారిటీ కన్నా ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘పవిత్ర’ లాంటి చిత్రాల్లో నటించడం ద్వారా వచ్చింది ఎక్కువ. జనం నన్ను చూడగానే గుర్తుపట్టడం పెరిగింది. మీ నవలలు చాలా సినిమాలుగా వచ్చాయి. మీరు స్క్రిప్టులూ రాసేవారు. ఇటీవల అవి రావడం, మీరు రాయడం కూడా తగ్గిందే? రచయితకు అభిప్రాయాలు, సిద్ధాంతాలు నిర్దిష్టమై, స్పష్టమవుతున్న కొద్దీ సామాన్య పాఠకుల్ని కోల్పోతాడు. ఒకప్పటిలా ప్రేయసీ ప్రియుల కబుర్ల లాంటి స్టుపిడ్ చెత్త రాయలేడు. అందుకే, నేను నవలల నుంచి వ్యక్తిత్వ వికాస రచనల వైపు మళ్ళాను. బి.వి. పట్టాభిరావ్ు ప్రోత్సాహంతో వ్యక్తిత్వ వికాస బోధకుణ్ణయ్యా. ఇక, మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’కు మాటల రచయితగా మొదలైన నా సినిమా ప్రస్థానం మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ అవుతుంది. నిర్మాత కె.ఎస్. రామారావు లేకపోతే, సినిమాల్లో యండమూరి లేడు. మారిన కాలంలో ఇప్పటి దర్శక, నిర్మాతలు పిలవడమూ లేదు. నేను రాయడమూ లేదు. ‘అనామిక’ లాంటి వాటికి అరుదుగా పనిచేస్తున్నా. టీవీ దర్శకుడిగా అవార్డులందుకున్న మీరు సినీ దర్శకుడిగా ఫెయిలయ్యారే? సినీ దర్శకత్వానికి చాలా ఓర్పు ఉండాలి. చాలా అంశాలు లెక్కలోకి తీసుకోవాలి. నాకు పోటీదారులు ఎవరూ లేరు! - యండమూరి కానీ, టీవీలో మనకు నచ్చినట్లు తీసుకోవచ్చు. ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘తులసిదళం’, ‘ప్రియురాలు పిలిచె’, ‘భార్యా గుణవతీ శత్రుః’ నవలలకు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం ఆనందాన్నిచ్చింది. మీ నవలలకూ, మీకూ కన్నడంలో బ్రహ్మరథం పడతారని విన్నాం? నిజమే. దక్షిణాది భాషలన్నిటిలోకీ నా రచనలు వెళ్ళినా, కన్నడంలో నాకు మరీ క్రేజ్. ఇంకా చెప్పాలంటే, తెలుగులో కన్నా ఎక్కువ. ‘లోయ నుంచి శిఖరానికి’ రచన పది రోజుల క్రితమే కన్నడంలో వచ్చింది. ఈ వారం టాప్10 కన్నడ బుక్స్‌లో మొదటి స్థానంలో ఉంది. మీ నవలల్లో సిడ్నీ షెల్డన్ లాంటి వారు అంతర్లీనంగా ఎంత ఉన్నారు? జేమ్స్ హ్యాడ్లీ ఛేజ్ నాకూ, నా శైలికీ ప్రేరణ. ఆంగ్ల నవలల ప్రేరణతో రచన చేసినప్పుడు ఆ సంగతి నా నవలల ముందు పేజీలోనే చెప్పేశా. మరి, మీ వ్యక్తిత్వ బుక్స్‌లో మీ పాలెంత? కార్నెగీ వగైరాల భాగమెంత? స్టీఫెన్ కోవే ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస రచన ‘7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ ప్రేరణతో ‘విజయానికి 5 మెట్లు’ అని పేరుపెట్టా. అంతే! విజయవాడలో మీ అభిమాని జ్యోతి అనుమానాస్పద మరణం... (మధ్యలోనే అందుకుంటూ) అది ముగిసిన కథ. ఆ సంగతి తెలిసిన వాళ్ళు ముసలివాళ్ళయిపోయారు. నా ప్రమేయం లేని మరణం గురించి కొందరు చేసిన రచ్చను ఇవాళ్టికీ ప్రస్తావించడం సెన్సేషన్ కోసమే! ఇంతకీ, మీ జీవన సిద్ధాంతం ఏమిటి? ఇంకొకరికి నష్టం లేకుండా నాకు నచ్చిన విధంగా నేను బతకడం! అదే నా ఫిలాసఫీ. మనం ఏం చేసినా అందరికీ నచ్చం. కాబట్టి, ఇతరులకు నచ్చేలా బతకాలనుకోవడం వృథా. మరి, మీ రచనా సిద్ధాంతం మాటేమిటి? మొదట కమ్యూనిస్టు భావాలతో ఉండేవాణ్ణి. పోనూపోనూ అది ఒక ఊహాస్వర్గం అనిపించింది. ఆ తరువాత క్రమంలో అతి బీదరికం స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరడమనే (ర్యాగ్స్ టు రిచెస్) భావన, ఆ ఉదాహరణలు ప్రేరణనిచ్చాయి. అప్పటి నుంచి నా రచనలు దాని మీదే నడుస్తున్నాయి. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కానీ, బీదవాడిగానే మరణించడం తప్పు’ అని నేను అనేది అందుకే! డబ్బు లేకపోవడం ఒక రకంగా వరం. జీవితంలో పైకి రావడానికి కసితో పనిచేస్తాం. ‘భగవద్గీత’ను ప్రస్తావిస్తున్నారు. కానీ, ఇది మెటీరియలిస్టిక్‌గా లేదూ! నన్నడిగితే, అసలు భగవద్గీత చెప్పిందే పెద్ద మెటీరియలిజమ్. ‘భవబంధాలు తెంచుకో! చంపాల్సి వస్తే చంపెయ్! కర్తవ్యం నిర్వర్తించడం ముఖ్యం’ అనేగా భగవద్గీత చెప్పింది. అందుకే, పిల్లలకు నేనెప్పుడూ చెప్పేది - ‘చదవడమనేది ఆనందం. దాన్ని ఆస్వాదించండి. పాసవడం, ర్యాంక్ రావడం బోనస్. దానంతట అది జరుగుతుంది.’ మీ ఇల్లు, సౌండ్ ప్రూఫ్ స్టడీరూమ్, బెడ్ రూమ్ కళాత్మకంగా ఉన్నాయే! 1982లో ఈ ఇల్లు కట్టుకున్నా. ఈ డిజైనింగ్, కలర్స అంతా నా ఆలోచనే! జీవితంలో చాలా చిన్న విషయాలకు కూడా ఆనందిస్తుంటా. (పక్కనే ఉన్న పార్కులో చెట్లు చూపిస్తూ...) చెట్లంటే నాకిష్టం. ఈ పార్కులోని చెట్లు, ఈ సందులోకి వస్తుంటే రోడ్డుపై కనిపించే చెట్లు నేను నాటినవే. ఇంట్లో పక్షులు, అక్వేరియమ్‌లో చేపలు పెంచుతా. స్మార్ట్ ఫోన్ల యుగంలోనూ బేసిక్ ఫోన్ దగ్గరే ఉన్నారేం? అవసరం తీరాలి. అదే సమయంలో సౌకర్యం ఉండాలి. అంతకు మించి ఎందుకు? పెద్ద కారు, సొంత ఇల్లు, ఏసీ, అవసరాలు తీర్చేంత ఆదాయం ఉన్నాయి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నాకు... ఫోన్ మాట్లాడుకోవడానికే! దానికి ఇది చాలు కదా! అవసరాలు తీరగా మిగిలిన డబ్బుతో 2006లో కాకినాడ దగ్గర ‘సరస్వతీ విద్యాపీఠం’ పెట్టింది అందుకే! పేద స్కూళ్ళలో చదివే విద్యార్థుల్ని రప్పించి, ఆత్మవిశ్వాసం పెంచి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆనందం ఉంది. మీ జీవితంలో మీరు మర్చిపోలేని వ్యక్తులు... నా మీద ప్రభావం చూపిన మా నాన్న గారు. నాలో ఒక రచయిత ఉన్నాడని గుర్తించి, తొలి రోజుల్లోనే నా నాటికలు, రచనలు వేసిన అప్పటి పత్రికా సంపాదకుడు, ప్రతిభ ఎక్కడున్నా పసిగట్టి ప్రోత్సహించే వ్యక్తి - పురాణం సుబ్రహ్మణ్యశర్మ. నాటకాలు ప్రదర్శించే రోజుల్లో వెన్నంటి ఉండి, నన్ను తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు. కానీ, స్టార్ రచయితగా మీకు, అలాగే మరికొందరు కాలమిస్ట్‌లకు పేరు రావడానికి ‘ఆంధ్రభూమి’ వీక్లీ సంపాదకుడు సి.క.రాజు కారణమేమో? నిజమే. సి. కనకాంబరరాజు ఆ పని చేశారు. అయితే, అది నా వల్ల పత్రికకూ, పత్రిక వల్ల నాకూ పరస్పర ప్రయోజనం ఉందని చేపట్టిన పని. ఇద్దరం లాభపడ్డాం. కానీ, పురాణం గారికి అది లేదు. మంచి రచయిత ఎక్కడున్నా, ప్రతిభను ప్రోత్సహించేవారు. నా తొలి నాటిక ‘గులకరాళ్ళు- గులాబీముళ్ళు’ను ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఆయనే వేశారు. మీ తోబుట్టువుల సంగతి ... మేము నలుగురు అన్నదమ్ములం. నేను అందరి కన్నా పెద్ద. సాహిత్యాభిమానం, బెంగాలీ సాహిత్య ప్రభావంతో మా నాన్న గారు మా అందరికీ ఆ తరహా పేర్లు పెట్టారు. పెద్ద తమ్ముడు - రాజేంద్రనాథ్. ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగంలో పనిచేసి, రిటైరయ్యాడు. రెండో తమ్ముడు మణేంద్రనాథ్. బల్బుల తయారీ చేస్తుంటాడు. ఆఖరు తమ్ముడు డాక్టర్ కమలేంద్రనాథ్. కాకినాడలో ఫిజీషియన్. వాడూ కథలు రాస్తుంటాడు. ఎమోషన్స్‌ను అక్షరాల్లో పండించే మీకు బయట ఎమోషన్స్ ఉండవట! నాన్న గారంటే అమిత గౌరవం. కానీ, బయటకు ప్రదర్శించలేకపోయా. ఆయన పోయాక, ఆ బాధతో ‘అంతర్ముఖం’ రాశా. ఆయన పోయిన మంచం మీదే ఇవాళ్టికీ పడుకుంటా. స్నేహితులన్నా, బంధువులన్నా మనసులో ప్రేమ లేదని కాదు. అవసరానికి ఆదుకుంటా కానీ, ప్రేమను బాహాటంగా ప్రదర్శించడం నాకు తెలియదు. ‘ఎటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్’ అనే భగవద్గీత సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటాను. భావోద్వేగాల మీద అదుపున్న మీరు బాధపడే సందర్భాలుంటాయా? ఎందుకుండవు? ఒక పచ్చని చెట్టును ఎవరైనా కొట్టేసినా, రోడ్డు మీద చిన్నపాపకు దెబ్బ తగిలినా బాధపడతా. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అతివేగంతో వాహనాలు నడిపి, నా మిత్రుల కొడుకులు అయిదారుగురు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. నాకు బాధ అనిపించింది. పెద్దల పెంపకం సరిగ్గా లేదేమని బాధపడ్డా. మీ మనసు బాగా లేనప్పుడు ఏం చేస్తుంటారు? నిజం చెప్పాలంటే... అంతకు ముందు మాటెలా ఉన్నా, గడచిన 20 ఏళ్ళుగా నాకు వ్యక్తిగతంగా మనసు బాగా లేకపోవడమనేది లేదు. మరి, మీ ఏకైక కుమారుడి పెంపకంలో మీ పాత్ర ఏమిటి? మా అబ్బాయి ప్రణీత్ పెంపకంలో, సక్సెస్‌లో మా ఆవిడ అనుగీత పాత్ర 95 శాతం. నా పాత్ర 5 శాతం. అయితే, చిన్నప్పటి నుంచి తెలివైన ప్రశ్నలు వేయించి, వాడి ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దడంలో నా పాత్ర ఉంది. ఇంటర్ పాసవగానే, వాడు ఉద్యోగంలో చేరాడు. సంపాదించుకుంటూనే, సి.ఏ చదివి, పెద్ద చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ఇవాళ సింగపూర్‌లో స్థిరపడ్డాడు. ఇప్పుడు వాడి జీతం ఏటా 2 కోట్ల 70 లక్షలు. మీ అబ్బాయి పెళ్ళి విషయంలో కూడా మీ పాత్ర చాలా ఉందట! అవును. పిల్లలు లవ్ మ్యారేజ్, కులాంతర వివాహం అనగానే చాలామంది పెద్దలు బిగుసుకుపోతారు. అది తప్పు. మా అబ్బాయి, కోడలిది కులాంతర, రాష్ట్రాంతర వివాహం. సంప్రదాయబద్ధమైన, సామాన్య తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి సి.ఎలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్. వాళ్ళు ప్రేమించుకున్నారు. అబ్బాయి కన్నా ఆమె కొన్ని నెలలు పెద్దది. అయినా సరే, కులాలు, ఆర్థిక అంతరాలన్నీ పక్కనపెట్టి, నేనే మద్రాసు వెళ్ళి, వాళ్ళ పెద్దలతో మాట్లాడి వచ్చా. వాళ్ళదీ, మాదీ ఒకటే గోత్రం. పెళ్ళి కోసం మా కులం, గోత్రం అబద్ధమాడి, వాళ్ళ పెళ్ళి జరిపించా. నాకు ఇద్దరు మనుమళ్ళు. చిన్నప్పటి నుంచి దేనికీ భయపడకుండా తీర్చిదిద్దుతున్నారు. జీన్స్ మాత్రమే కాక పెంపకం కూడా పిల్లల్ని ఎంతో మారుస్తుంది. తొలినాళ్ళ ‘కుక్క’ నాటి వీరేన్కూ, ఇవాళ పాపులర్ ‘లోయ నుంచి శిఖరానికి’ నాటి యండమూరికీ మీరు గమనించిన తేడా? అప్పట్లో ఉండే పొగరు ఇప్పుడు తగ్గిపోయింది. గడచిన 15 ఏళ్ళుగా కోపం బాగా తగ్గింది. కాకపోతే, ఎవరో ఫోన్ చేసి, ఏదో అర్థం పర్థం లేనివి అడిగినప్పుడు మాత్రం చిరాకు వస్తుంటుంది. ఏ రంగంలోనైనా సమకాలికులతో పోటీ, ఈర్ష్య ఉంటాయి కదా... అతి చిన్న వయసులోనే అత్యధిక జీతం తీసుకొనేవాణ్ణి. నా రచనల వల్ల పాఠకుల్లో పెద్ద క్రేజ్. ఉత్తరాలు, ఆటోగ్రాఫ్‌లు సరేసరి! అవన్నీ చూసి, ఆఫీసులో అసూయపడ్డవాళ్ళున్నారు. పట్టించుకోలేదు. ఇక, రచయితగా వస్తే, నేనేప్పుడూ ఎవరినీ నాకు పోటీ అనుకోను. నాకన్నా పై స్థాయి రచయితలు - విశ్వనాథ, జాషువా లాంటి వాళ్ళున్నారు. నా కన్నా కింది స్థాయి వాళ్ళున్నారు. నాతో సమాన స్థాయి వాళ్ళు, పోటీదారులు ఎవరూ లేరు. ఒక్కమాట... ‘నీ గురించి నీ శత్రువు ఎక్కువ ఆలోచిస్తున్నాడంటే... వాణ్ణి నువ్వెప్పుడో గెలిచావు’! నవలా సాహిత్యానికి మళ్ళీ మునుపటి వైభవం వస్తుందంటారా? పాఠకులలో వచ్చిన మార్పు వల్ల ఆ రకం పుస్తకాల అమ్మకాలు తగ్గాయి. అయితే, కథ ఉంటూనే వ్యక్తిత్వ వికాసాన్ని కూడా జొప్పించేలా చేసే రచనలకు ఆదరణ ఉంటుందని నా భావన. అందుకే, అలాంటి రచనలు చేస్తున్నా. ఏదైనా మనకు మనం మార్కెట్ సృష్టించుకోవాలి. దానికి కష్టపడాలి. అంత కృషి చేసేవారు ప్రస్తుతం తక్కువ. మీకు తగినంత గుర్తింపు, అవార్డులు రాలేదని భావిస్తున్నారా? యాదృచ్ఛికంగా రచయితనైన నాకు ఎక్కువ గుర్తింపే వచ్చింది. అవార్డులు రాలేదన్న బాధ నాకు లేదు. కొన్నేళ్ళుగా మీ మనసులో సుడులు తిరుగుతున్న మీ కలల ప్రాజెక్ట్? అలాంటిదేమీ లేదు. ఏకకాలంలో మూడు, నాలుగు ప్రాజెక్ట్‌లు మనసులో ఉంటాయి. ప్రస్తుతం కథనూ, వ్యక్తిత్వ వికాసాన్నీ జొప్పించే రీతిలోనే ‘దున్నపోతులు’ అనే రచన చేయాలనుకుంటున్నా. ‘పిల్లలకు పదివేల పేర్లు’ ప్రాజెక్ట్ చేస్తున్నా. త్వరలోనే అది బయటకు రానుంది. ఇంతకీ భవిష్యత్తు మిమ్మల్నెలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు? తరువాతి తరాలు గుర్తుపెట్టుకోవడానికీ, గుర్తుపెట్టుకోకపోవడానికీ చాలా కారణాలే ఉంటాయి. శ్రీశ్రీ గురించి ఇవాళ్టికీ గుర్తుపెట్టుకుంటున్నారు. అంతకన్నా గొప్ప రచయితలున్నా, ఆయన నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉండబట్టే, ఆయన జనంలో గుర్తున్నారు. రేపు నన్నెలా, ఎంతమంది గుర్తు చేసుకుంటారన్నది ఇప్పుడు చెప్పలేం. అయితే, జనం నన్ను పాపులర్ నవలా రచయితగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటా! ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
మనిషికి బతకాలనే ఆశ ఉండాలి...
తురగా జానకీరాణి... ఒక కథకురాలు... ఒక నవలా రచయిత్రి... రేడియో ప్రయోక్త... ఒక గాయని... ఒక నర్తకి... ఒక నటి... చదువులో బంగారు పతకాలు... ఉద్యోగంలో జాతీయ అవార్డులు... బాలానందం కార్యక్రమంతో ఆకాశవాణి జీవితం ప్రారంభం... ప్రొడ్యూసర్‌గా పదవీ విరమణ... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు... అన్నిటినీ అధిగమించారు... జానకీరాణిగారు అక్టోబరు 15, బుధవారం గతించడానికి కొన్ని వారాల ముందు ‘సాక్షి’తో కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇదే ఆవిడ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ... ఆ స్పర్శ చల్లగా ఉంది... నా ఆరో ఏట ఒకసారి మహాత్మాగాంధీ మా ఊరు వచ్చారు. ఆయనను చూడటానికి జనమంతా వెళ్తుంటే నేను కూడా వాళ్లతో వెళ్లాను. ఆయన ఒక్కో అడుగు వేస్తుంటే, ప్రజలంతా ఆయన కాళ్ల దగ్గర ఉన్న ఇసుకను దోసెళ్లతో ఎత్తి నెత్తిన పెట్టుకున్నారు. నేను ఆయన మెడలో వేయడానికి తీసుకువెళ్లిన ఎర్రగులాబీల దండలో పూలన్నీ, ఆయన దగ్గర చేరే లోపే రాలిపోయాయి. ఆయన ఆ దండ తీసుకుని, నా తల మీద మృదువుగా నిమిరారు. ఆయన చేతి స్పర్శ నాకు చల్లగా అలాగే ఉండిపోయింది. ఆయనకు ‘జి’ అని రాసి ఉన్న నా చేతి ఉంగరాన్ని ఇస్తుంటే, తన చిటికెనవేలితో తీసుకుని ‘ఇది ఎందుకు?’ అన్నారు. ‘కస్తూర్బా ఫండ్’ కి అన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. బాలానందంతో ప్రారంభం...: చిన్నప్పటి నుంచే ఆకాశవాణి బాలానందం కార్యక్రమంలో పాల్గొన్నాను. అబ్బూరి వరదరాజేశ్వరరావు రచించిన ‘ఒరియా’ అనువాద నాటకం లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో పాటలు పాడాను. ‘‘నీ కంఠంలో కరుణరసం బాగా పలుకుతుంది’’ అన్నారు సినారె. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కోకిలమ్మపెళ్లి’ నాటకంలో చిలకతల్లి వేషం వేశాను. విదేశీ ప్రసారాల కోసం బాలమురళిగారు మా చేత జోలపాటలు, ఉయ్యాల పాటలు, అప్పగింతల పాటలు పాడించారు. వివాహ బంధం... నా 12వ ఏట తురగా కృష్ణమోహన్‌గారు (అప్పటికి ఆయన వయసు 18) నా వెంటపడ్డారు. ‘ఒక మనిషి ఇంకో మనిషిని అంతగా ప్రేమించగలరా’ అనుకునేంతగా ఆయన నన్ను ఇష్టపడ్డారు. అందుకే నేను ఆయన అభిమానంలో చిక్కుకుపోయాననుకుంటాను. మా మధ్య స్నేహం సుమారు పది సంవత్సరాలు నడిచింది. ఏది ఎలా ఉన్నా చదువులో మాత్రం ముందుండేదాన్ని. డిగ్రీ, పీజీలలో గోల్డ్‌మెడల్స్ సాధించాను. 1959 లో నా 22వ ఏట మా వివాహం జరిగింది. అప్పుడు ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తుండేవారు. నేను ఇంట్లో తలనొప్పితో బాధపడుతుంటే, ఆఫీసులో అందరికీ నా గురించి చెబుతూ ఆయన కూడా బాధపడేవారని ఆయన స్నేహితులు చెప్పేవారు. అంత ప్రేమగా ఉండేవారు ఆయన. కొంతకాలానికి ఆయన ఆంధ్రపత్రిక నుంచి ఆకాశవాణిలో వార్తావిభాగంలో చేరారు. నేను ‘సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో చేరి పదిహేనేళ్లు పనిచేశాను. నిజాయితీ గల ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నాను. మారిన జీవితం...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఉద్యోగం మానేశాను. మేమిద్దరం... మాకిద్దరు... అన్నచందాన ఎంతో అన్యోన్యంగా ఉంటున్న నా జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది. 1974 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు ఆ రోజు ఉదయం కాఫీ ఇచ్చిన గ్లాసు ఇంకా కిటికిలోనే ఉంది, ఇంతలో మృతదేహం వచ్చింది. ఎన్నో ఏళ్లు కుమిలికుమిలి ఏడ్చాను. కాలం నెమ్మదిగా గాయాల్ని మాన్చింది. పిల్లల్ని చూసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఏ పిల్లల కోసం నేను ఉద్యోగం మానేశానో, అదే పిల్లల కోసం మళ్లీ ఉద్యోగంలో చేరాను. ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా ... 1974లో ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా చేరి 1995లో రిటైరయ్యేవరకు అక్కడే కొనసాగాను. ఆకాశవాణి అప్పుడొక స్వర్ణయుగం. నేను పనిచేసిన 20 సంవత్సరాల కాలంలో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ప్రసారం చేసినప్పుడు, అన్ని జిల్లాల నుంచి అక్కడి బడి పరిస్థితులను వివరిస్తూ ఉత్తరాలు వచ్చేవి. వాటిని విద్యాశాఖ కార్యదర్శికి పంపేదాన్ని. ఇంకా... పిల్లల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, నవయుగం, నవలా స్రవంతి, సమత, బాలవిహార్, మహిళా సమాజం... వంటి కార్యక్రమాలు చేశాను. అనేక బాలకవిసమ్మేళనాలు నిర్వహించాను. ‘బ్రాడ్‌కాస్టర్’ అనే పదానికి బదులు ‘ప్రసారకర్త’ అనే పదాన్ని వాడటం ప్రారంభించింది నేనే. దాశరథి కృష్ణమాచారిగారు మా స్టేషన్ డెరైక్టర్‌తో ‘జానకీరాణి తెలుగుభాషకు చాలా సేవచేస్తోంది’ అంటూ నన్ను అభినందించారు. వందేమాతరం... ‘ఆనంద్‌మఠ్’ నవల రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేడియోలో సెలట్రేబ్ చేయమన్నారు. వందేమాతరం గీతంలోని ‘సుజలాం, సుఫలాం’ వాక్యాన్ని తీసుకుని డా. సి. నారాయణరెడ్డిగారితో ‘‘మంచుకొండలను దిగివచ్చింది మా గంగమ్మ... మనసే మురళిగా మలచుకొంది మా యమునమ్మ...’’ అని పాట రాయించాను. ఈ కార్యక్రమం ఆహ్వానపత్రికలో ‘దృశ్య గీతి’ అని వేస్తే, అలా ఎందుకు వేశారని అందరూ నన్ను అడిగారు. అందుకు నేను ‘అది దృశ్యం కాదు, శ్రవ్యం కాదు, చూడవలసిన గీతి కనుక అలా వేశాను’ అని చెప్పాను. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశానో నాకే గుర్తు లేదు. గుర్తున్నంతవరకు కొన్ని మాత్రమే చెప్పగలిగాను. ఇప్పుడు నా వయసు 78. అయినా నా మనసు మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంది. ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్‌కి పిలిచినా వెళ్లిపోతాను. రేడియోవాళ్లు నా గురించి నాతో మాట్లాడించి ఆరు భాగాలు టేప్ చేశారు. ‘బతకాలి బతకాలి’ అన్నదే నా ఫిలాసఫీ. జీవితం చాలా విలువైనది. మనం బతికున్నామంటే అది ఒక వరం. మనిషికి బతకాలనే ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం... అంటూ ముగించారు. - డా॥వైజయంతి తాతగారి ఆశీస్సులే కారణం... చిన్నప్పుడే నేను కథలు రాయడానికి ఒక రకంగా మా తాతయ్య చలంగారి ఆశీస్సులే కారణం. నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు తిరువణ్నామలై వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన నా కంటె 50 సంవత్సరాలు పెద్ద. ఆయన్ని నేను ఎన్నోరకాల ప్రశ్నలు వేసి వేధించాను. అన్నిటికీ ఆయన ఓరిమిగా సమాధానాలు చెప్పారు. ‘‘నువ్వు హృదయం ఉన్న పిల్లవు. నీలోంచి ఆలోచనలు పెళ్లగించుకుని వస్తేనే కథలు రాయి’’ అన్నారు. ఆయన మాటలు నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ఆయన నాకు 16 ఉత్తరాలు రాశారు. ఆయనతో పరిచయం నాకు గొప్ప అనుభవం. అంత పెద్దమనిషి చేత నేను ప్రశంసలు పొందానని నాకు గర్వంగా ఉండేది. కృష్ణార్జున సంవాదంలో కృష్ణుడు వేషం వేశారు. మొట్టమొదటి కథ 15వ ఏట కృష్ణాపత్రికలో పడింది. వెంపటి చిన సత్యం గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుని, అనేక ప్రదర్శనలిచ్చారు. నాట్యంలో డిప్లమా చేశారు. చినసత్యంగారు ఇచ్చిన గజ్జెలు ఇప్పటికీ ఆవిడ దగ్గరున్నాయి. ‘నిశ్శబ్దంలో ప్రయాణాలు’ అని మూగచెముడు వారికోసం, ‘ఆశ్రయం’ అని వయోవృద్ధుల కోసం చేసిన కార్యక్రమాలకు, పిల్లల కోసం రచించిన బాల గేయాలకు రెండుసార్లు... మొత్తం నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. 1963లో ‘అఖిలభారత రచయిత్రుల సంఘం’ ఏర్పాటుచేశారు. ఆ ప్రారంభోత్సవానికి విజయలక్ష్మీ పండిట్ వచ్చారు. -
నిర్లక్ష్యం నీడన పిళ్లై సమాధి
అన్నానగర్: మయూరం వేదనాయగంపిళ్లై తమిళ సాహిత్య తొలి నవలా రచయిత. తన రచనల ద్వారా స్త్రీ విద్య, స్త్రీల స్వేచ్ఛకు ఎంతో కృషి చేశారు. కరువు సంభవించిన సమయంలో సొంత డబ్బుతో పేద వారికి ఇతోధికంగా సాయం అందించిన దయూగుణ శీలి. సామాజిక వేత్త. అలాంటి వ్యక్తి సమాధిని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంపై రచయితలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైలాడుదురై సమీపంలోని మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేసిన వేదనాయగంపిళ్లై కొలత్తూరులో 1826 అక్టోబరు 11న జన్మించారు. ఆయన రచయితగా పేరు తెచ్చుకున్నారు. తన రచనల ద్వారా స్త్రీల స్వేచ్ఛను, స్త్రీలకు విద్యను అందించాలని పేర్కొన్నారు. ఆయన రచనల్లో నేతినూళ్, తిరువాళుర్మాలై, తిరువాళుర్ అంతాడి, దేవమాత, పెరియనాయగి, అమ్మన్పధిగం, తమిళ భాషలో తొలి నవలగా చెప్పబడుతున్న ప్రతాపమందలియారుచరితం, సుగుణంబాల్ చరిత్ర, పెన్మణం, పెణ్కల్వి, పెణ్మదిమాలై, సంగీత పర గ్రంథాలైన దేవ స్త్రోత్ర కీర్తనగళ్ తదితరాలు ఉన్నారు. వేదనాయగంపిళ్లై క్రిస్టియన్ వనితను వివాహం చేసుకోవడంతో వారి వంశస్తులు ఆయనను కులం నుంచి వెలివేశారు. దీంతో ఆయన మైలాడుదురై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తమిళ సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. పేదలకు తనకు చేతనైనంత మేరకు సహాయం అందించారు. మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేశారు. ఆ సమయంలో కరువు సంభవించడంతో తన సొంత డబ్బుతో పేదలకు సాయం అందించారు. ఆయన 1889 జూలై 21న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయూన్ని మైలాడుదురై మెయిన్ రోడ్డు నుంచి మాయవరానికి వెళ్లే దారిలోని ఆర్సీ శ్మశాన వాటికలో సమాధి చేశారు. ఆయన సమాధికి ఆనుకునే ఆయన తల్లి మరియమ్మాళ్, భార్య లాజర్ అమ్మాళ్ (వీరిద్దరూ బ్రిటీష్ వనితలు)ల సమాధులు కూడా ఉన్నాయి. పసుపు రంగు సున్నపురాయితో మరియమ్మాళ్ సమాధిని, లాజర్ సమాధిని నిర్మించారు. ఈ రెంటికి ఎదురుగా దీర్ఘ చతురస్రాకారంలో పిళ్లై సమాధి ఉంది. 1983 వరకూ ధర్మపురం మఠం వారు ఈ సమాధులను పరిరక్షించారు. అనంతరం ఎవ్వరూ వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారు. సమాధిపైన కలుపు మొక్కలు పెరిగిపోరుు అధ్వానంగా దర్శనమిస్తోంది.