అర్ధరూపాయి అప్పు | Yaddanapudi Sulochana Rani Story Arda Rupai Appu | Sakshi
Sakshi News home page

అర్ధరూపాయి అప్పు

Published Tue, May 29 2018 1:19 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Yaddanapudi Sulochana Rani Story Arda Rupai Appu - Sakshi

ఈ కథ వ్రాసి, అర్ధరూపాయి అప్పుచేసి చాలా తప్పు చేసానని క్రుంగిపోయాను. నా నెత్తిమీద అర్ధరూపాయి అప్పు కొండంత బరువుగా కూర్చుని నన్ను పాతాళంలోకి క్రుంగదీయసాగింది. మా చిన్నబామ్మ పండగలకి పిల్లలందరికి అణాలు పెట్టేది.. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. కాశీ వెళ్ళింది.

కథ వ్రాయటం అయిపోయింది.. కాని పోస్ట్‌ చేయటమే సమస్య ఐపోయింది.. ఎలా పంపాలో తెలియదు. నాకు అక్క కొడుకులు ఉన్నారు.. ఒకడు సత్యం, ఒకడు రాముడు, ఒకడు శర్మ.. నాకన్నా 6 సంవత్సరాలు చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా మా స్కూల్లో చదువుతారు.. మా ఇంట్లో నేను ఆఖరి సంతానం.. వాళ్ళు తమ్ముళ్ళలా ఉండేవాళ్ళు.. సత్యం.. రాముడు.. ఖుద్దూస్‌ మాస్టార్‌ దగ్గరికి వెళ్ళి పిన్ని కథ వ్రాసింది, ఎవరికి పంపాలి.. ఎలా పంపాలి అని అడిగి వచ్చారు.. (ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా జరిగింది..) ఆయన కాగితం మీద ఆంధ్రపత్రిక అడ్రెస్‌ వ్రాసి.. కవర్‌ మీద ఎలా వ్రాయాలో చెప్పి, తిరిగి రావటానికి ఫ్రం అడ్రెస్‌ వ్రాయాలని చెప్పారు... కథ పేజీలు ట్యాగ్‌తో కట్టి, కవర్లో పెట్టి మాస్టార్‌ చెప్పినట్టు అడ్రెస్‌ వ్రాసాను.. నా అక్షరాలు చాలా అందంగా ఉంటాయని మాస్టార్‌ గారు ఎప్పుడూ మెచ్చు కునేవారు.. 

కవరు బరువుగా ఉంది! సత్యం, రాముడు పోస్టాఫీసుకి వెళ్ళి తూయించి నీరసంగా తిరిగి వచ్చారు.. చాలా ఖరీదు! అర్ధరూపాయి!! అంతకుముందు కానీలు, చిల్లుకానీలు, అర్ధణా, అణా, బేడలు, పావ లాలు, అర్ధరూపాయి ఉండేవి.. అర్ధరూపాయి నా దగ్గర లేదు! మా నాన్నని అడిగితే వెంటనే ఇస్తారు! కానీ నాకు అస్సలు ఇష్టం లేదు! కథ తిరిగివస్తే, నాన్న కష్టార్జితంలో అర్ధరూపాయి వృథా అయిపోతుంది.. పైన డాబా మీదకి వెళ్ళే మెట్ల మీద నేను, సత్యం, రాముడు కూర్చుని ఈ కవరు పంపటం ఎలాగ అని గుడగుడలాడే వాళ్ళం..

మా మూడో అక్క కూతురు సుగుణ ఎప్పుడూ మా ముగ్గురిమీదా ఒక కన్నేసి ఉంచేది.. మేము దానిని కలుపుకోకుండా ఏదో చేసేస్తున్నామని దాని అనుమానం! ఒకసారి వాళ్ళమ్మ జయ అక్కయ్య వచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నారు మీరు? అంటూ గద్దించేది.. మేం ముగ్గురం మాట్లాడేవాళ్ళం కాదు.. చివరికి సత్యం ఒక సలహా చెప్పాడు.. మా రెండో అక్కయ్య పేరు రంగమ్మ. ఆవిడకి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత, రెండు కళ్ళూ పోయాయి.. ఆవిడ భయంకరమైన పుస్తకాల పురుగు! ఆవిడ రాత్రివేళ ఆంధ్రపత్రికలో సీరియల్స్‌ (రెండు మహానగరాలు, హకల్‌ బెరి ఫిన్, లైబ్రరీ నుంచి శరత్‌ బాబు నవలలు) తెప్పించుకుని నా చేత చదివించుకునేది! నాది చాలా జాలి గుండె.. ఆవిడ కోసం శ్రమ పడి, చదివేదాన్ని.. సత్యం రంగమ్మ అక్కయ్యని అప్పు అడుగుదామని సలహా ఇచ్చాడు.. మొదట నేను అప్పంటే ఒప్పుకోలేదు! భయపడ్డాను.. అప్పంటే చెడ్డ భయం..!

మా నాన్న వారం రోజుల క్రితం చిన్నన్నయ్య బుట్టల సుబ్బమ్మ దగ్గర అర్ధణా అప్పు పెట్టి బటానీలు తిన్నాడని తెలిసి, అన్నయ్యని చితకబాదాడు.. ఆ దృశ్యం చూసి పిల్లలం భయపడి దొడ్లో పాకలోకి పారిపోయి దాక్కున్నాం.. నాన్నకి అప్పంటే ఆగ్రహం! మా బాబాయిలు పేకాట ఆడి అప్పులు చేసి.. పొలాలు పోగొట్టుకొని పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోయారు. డబ్బు ఖర్చు విషయంలో నాన్న నిర్దాక్షిణ్యంగా ఉండేవాడు! ఒక పక్క అప్పంటే భయం. నేను అప్పు చేసానని తెలిస్తే ఇంకేమన్నా ఉందా..? నాన్నకి నేనంటే గారాబం. స్కూల్లో చదువుల్లో, ఆటల్లో ఫస్ట్‌ వస్తానని చాలా సంతోషం.. ఇంటికి వచ్చిన రైతులకి స్కూల్లో ఫస్ట్‌ వస్తానని అపురూపంగా చెప్పేవారు.. అది గుర్తువచ్చి అప్పంటే మరీ భయం వేసింది.. ఇలా వెధవ పని చేసి ఆ ప్రేమను పోగొట్టుకోలేను.. కథ పంపాలని ఆశ! ఆరాటం! కానీ అప్పు చేయటం కుదరదు. ఎలా? రాముడు తొందర పెడుతున్నాడు.. (సరే అని ధైర్యం చేసాను.)

సత్యం – రాముడు ఒక రోజు రంగమ్మక్కయ్య దగ్గరికి వెళ్ళి.. అర్ధ రూపాయి అడిగారు.. ఆవిడ వెంటనే అనుమానభూతంలా చూసి ఎందుకు అంది.. ‘‘జీడీలు కొనుక్కొని తినాలని ఉంది..!’’ అన్నాడు సత్యం. తాతయ్యని అడగండి అనేసింది..! ‘‘నువ్వు ఇస్తావా లేదా?’’ అన్నాడు రాముడు.. నేను అక్కడనుండి వెళ్ళిపోతుంటే సత్యం చేయిపట్టి ఆపాడు.. ‘‘నీకు పిన్ని పుస్తకాలు చదువుతుంది కదా..! నువ్వు ఇయ్య కపోతే ఇక నుంచి నీకు చదవదు మరి!’’ అని బెదిరించాడు.. 

అక్కయ్య ఆలోచించి జాకెట్లోంచి గుడ్డసంచి తీసి... అందులోనుంచి చిల్లర తడిమి అర్ధరూపాయి బిళ్ళ తీసి పట్టుకుంది.. వెంటనే ఇవ్వలేదు.. నేను నిరుత్సాహపడ్డాను.. ఆవిడ అంది.. ‘‘ఇదిగో! వెంటనే తీర్చాలి.. అంతేకాదు.. పగలు, రాత్రి పుస్తకాలు చదవాలి’’ అంది..! ‘‘అట్లా అయి తేనే ఇస్తా’’ అంది.. సత్యం నా వైపు చూసాడు.. నేను అక్కర్లేదు అన్న ట్లుగా అడ్డంగా తలూపాను. ఆవిడకి కళ్ళు కనిపించేవి కావు కదా! అట్లాగే! సరే! అని సత్యం, రాముడు అంటూ, నా వైపు చూసి ‘ఉత్తుత్తినే’ అన్నట్లు నాలుక బయట పెట్టి పెదవులపై అటూ ఇటూ ఊపారు..!

ఆవిడ అర్ధరూపాయి ఇచ్చింది.. వెంటనే నా కథ ఆగమేఘాల మీద పోస్ట్‌కి పోయింది.. చిన్న రసీదు తెచ్చి ‘‘దాచుకో’’ అన్నాడు సత్యం.. 

నాకు ఆశ్చర్యం వేసింది!! కథ వెళ్ళిపోయింది. నా దగ్గర లేదు. కథకి గుర్తు చిన్న రసీదు ముక్క మాత్రమే!! రోజులు గడిచాయి. మా అక్క నన్ను కథలు చదవమని రాక్షసిలా పిలుస్తోంది. అప్పట్లో లాంతరు దీపాలు. రాత్రి 10 గంటలు అయితే గాని లాంతరు దొరకదు. మా అక్క పగలు కుక్కి మంచంలో హాయిగా నిద్రపోయి, రాత్రి చదవ మని వేధించేది. అలానే చదివేదాన్ని. నేను ఆవిడకి అర్ధ రూపాయి కోసం బానిస అయిపోయాను! నా స్వేచ్ఛ అంతా పోయింది!! 

ఈ కథ వ్రాసి, అర్ధరూపాయి అప్పుచేసి చాలా తప్పు చేసానని క్రుంగిపోయాను. నా నెత్తిమీద అర్ధరూపాయి అప్పు కొండంత బరు వుగా కూర్చుని నన్ను పాతాళంలోకి క్రుంగదీయసాగింది. మా చిన్న బామ్మ పండగలకి పిల్లలందరికి అణాలు పెట్టేది.. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. కాశీ వెళ్ళింది.

చాలాసార్లు మా నాన్న దగ్గరికి వెళ్ళి తలెత్తకుండా నాన్నా! నేను చాలా తప్పు చేసాను! అర్ధరూపాయి అప్పు చేశాను! నన్ను క్షమించు..! అని చెప్పాలని ఎంతగానో అనిపించేది. కానీ ధైర్యం చాలేది కాదు! ఇలా మథనపడుతున్నాను..! క్రుంగిపోతున్నాను.. మా నాన్న ఒకసారి నన్ను చూసి ‘‘ఏమైంది..? ఒంట్లో బాగాలేదా?’’ అని అడిగితే అదిరిపడ్డాను. నాన్నకి తెలిసిపోతుందని.. మెల్లగా అక్కడినుంచి వెళ్ళిపోయాను.
ఒకరోజు గుడికి వెళ్ళి వచ్చాను.. రాముడు, సత్యం పరిగెత్తుకొని ఒచ్చారు.. ‘‘పిన్నీ! నీ కథ పడింది..!! ఇదిగో’’ అంటూ పత్రిక చూపిం చారు. 

‘‘నిజంగానా?’’ అన్నాను.

ముగ్గురం పందిరి కింద వరండాలో క్రింద కూర్చుని నేల మీద పెట్టి చూస్తున్నాం. నిజంగా నిజం! ‘‘చిత్రనళినీయం – యద్దనపూడి సులోచ నారాణి’’ అని ఉంది. ముగ్గురం ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని కౌగిలించుకున్నాం.. నా మనసు షాక్‌లోకి వెళ్ళిపోయింది. అంతలో నాన్న వచ్చారు..

సత్యం చెప్పాడు. ‘‘తాతయ్యా! పిన్ని కథ వ్రాసింది!! పత్రికలో పడింది!’’.. 

‘‘కథా?! పత్రికా?!’’ అన్నారు.. ఆశ్చర్యంగా. నాన్న పట్టుకుని చూసారు. 
‘‘ఏది ఆంధ్రపత్రిక? చదివి వినిపించండి!’’ అత్తయ్య సీరియల్స్‌ కోసం అరుస్తోంది.

నాకు భయం వేసింది. పరువు గల కుటుంబం. ఆడపిల్లని. కరణం గారి అమ్మాయిని. నా పేరు ఇలా దేశం మీద పడినట్టు చేసానేమిటి? అని భయపడ్డాను. 

కానీ నాన్న ఏమీ అనలేదు. పైనుంచి ఇంటికి వచ్చే రైతులకి ‘‘మా అమ్మాయి కథ వ్రాసింది. పత్రికలో పడింది!’’ అంటూ చూపించారు. హమ్మయ్య! అనుకున్నాను.

ఈ వార్త తెలిసి, ఇంట్లో కుటుంబ సభ్యులంతా ‘‘ఏదీ? ఏదీ?’’ అంటూ ఆంధ్రపత్రికని ఒకరి చేతుల్లోంచి ఒకరు లాక్కుంటుంటే, అది వాళ్ళ చేతుల్లో ఎక్కడ చిరిగిపోతుందోనని నా ప్రాణం గిలగిలలాడి పోయింది. చివరికి అతికష్టం మీద దొరకపుచ్చుకుని నేను చదువుకునే గదిలోకి పరిగెత్తాను.
– యద్దనపూడి సులోచనారాణి

‘పోస్ట్‌మ్యాన్‌ పిలుపుతో కలకలం’ రేపటి సంచికలో... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement