దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు తెలుగు పాఠక లోకాన్నేలిన హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూశారు. తన చుట్టూ ఉన్న... తనకు తెలిసిన మధ్య తరగతి కుటుంబాల్లోని జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఆ జీవితాల్లో మనుషుల మధ్య ఏర్పడే అనుబంధాలనూ... ఆ అనుబంధాల్లోని సున్నితత్వాన్ని, వారి ఆశలనూ, ఆకాంక్షలనూ, కలల్ని అద్భుతంగా చిత్రించిన ప్రతిభాశాలి ఆమె. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని వయసులో ఆమె రాసిన తొలి కథ ‘చిత్ర నళినీయం’ ‘ఆంధ్రపత్రిక’ వీక్లీలో అచ్చయినప్పుడు ఇంట్లో వాళ్లూ, ఊళ్లోవాళ్లూ సులోచనారాణిని చూసి గర్వపడ్డారట. ‘సెక్రటరీ’తో మొదలుపెట్టి సులోచనా రాణి రాసిన దాదాపు 70 నవలలు తెలుగు సమాజంలోని ఆడపిల్లలకు అలాంటి గర్వాన్నే కలిగించాయి. ఎందుకంటే ఆ నవలల్లోని ఆడపిల్లలు భయంగా, బేలగా ఉండరు. తమకేదో అన్యాయం జరిగిందని శోకిస్తూ కూర్చోరు. వారు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనేవారే కావొచ్చుగానీ... ఉన్నతమైన వ్యక్తిత్వంతో, నిండైన ఆత్మాభిమానంతో మెలగుతారు.
ఆ ఆత్మాభిమానాన్ని లేదా ఆత్మ గౌరవాన్నీ దెబ్బతీయడానికి జరిగే చిన్న ప్రయత్నాన్నయినా నిలదీసే మనస్తత్వంవారిది. ఆ ఆడపిల్లలు మాటకారులు. స్వతంత్రంగా ఆలోచిస్తారు. సొంతంగా ఎదగాలని చూస్తారు. తెలివి తేటల్ని ప్రదర్శిస్తారు. ఎవరి దయాదాక్షిణ్యాలకూ ఎదురుచూడరు. అలాగని వారు చలం రచనల్లోని స్త్రీల మాదిరి సమాజం, కుటుంబం విధించిన కట్టుబాట్లను ప్రశ్నించే రకం కాదు. వాటిని ఛేదించేంత సాహసం చేయరు. బహుశా సులోచనా రాణి నవలల్లోని ఈ లక్షణాలే లక్షలాదిమంది మధ్య తరగతి మహిళలను, యువతులను ఆమె రచనలవైపు ఆకర్షించేలా చేశాయి. ఆమె నవలల్లోని కథా నాయకులూ అంతే. వారు పురుషాధిక్యతను ప్రదర్శించరు. ఆడవాళ్లను అణిచేయాలనే మనస్తత్వంతో ఉండరు. వారిని తక్కువ చేసి మాట్లాడరు. ఆడపిల్లల వ్యక్తిత్వాలను గౌరవించడం, వారితో ప్రేమగా మెలగడం... పొరబాటున మనసు కష్టపెట్టానని అనిపించినా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా క్షమించమని కోరడం ఆ కథానాయకుల వ్యక్తిత్వం.
మనలాంటి అసమ సమాజంలో, కుటుంబాల్లో ఇలాంటి లక్షణాలున్నవారు దుర్భిణి వేసి గాలించినా కనబడరన్న విమర్శల్లో అవాస్తవమేమీ లేదు. కానీ స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి సంబంధాలుండాలని... అచ్చం ఇలాగే సమాజం ఉంటే ఎంతో బాగుంటుందని ప్రగాఢంగా కోరుకునే మధ్యతరగతి మహిళల, యువతుల ఆకాంక్షలకు సులోచనారాణి అద్దం పట్టారు. అందుకే వారికి ఆమె అంతగా చేరువయ్యారు. ఆమె నవలల్లోని పాత్రలు ఎదుటివారితో సంఘర్షించవు. అంతస్సంఘర్షణకు లోనవుతాయి. ఆ క్రమంలో తమను తాము తీర్చిదిద్దుకుంటాయి. ఎదుటివారిలో మార్పు తెస్తాయి. ఆమె నవలలు సీరియల్‌గా వస్తున్న కాలంలో మధ్యతరగతి కుటుంబాల మహిళలు, యువతులు మరుసటి వారం గురించి ఆత్రంగా ఎదురు చూసేవారట. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయంలో రకరకాలుగా చర్చించుకునేవారట. కుటుంబమే సర్వస్వంగా భావిస్తూ పొద్దు పొడిచింది మొదలు పొద్దు గడిచేవరకూ దానికోసమే అంకి తమవుతూ...తీరిక చిక్కితే పురాణగాథలు, పిచ్చాపాటీలతో కాలక్షేపం చేసే మహిళలంతా సులోచనారాణి రచనలతో ఇటు మళ్లారని చెబుతారు.
దశాబ్దాలపాటు కొన్ని తరాలపై ఒక రచయిత ఇంతగా ప్రభావాన్ని చూపగలగటం ఎంతో అరుదైన విషయం. సులోచనారాణి ఆ ఘనత దక్కించుకున్నారు. ఆ కాలంలో యద్దనపూడితో పాటు అనేకమంది మహిళలు తెలుగు నవలను సుసంపన్నం చేశారు. ఇల్లిందల సరస్వతీ దేవి, డాక్టర్ పి. శ్రీదేవి, మాలతీ చందూర్, తెన్నేటి హేమలత, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, కోడూరి కౌసల్యాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, సి. ఆనం దారామం వంటి అనేకులు నవలా రంగంలో అప్పట్లో సుప్రసిద్ధులు. వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదంటే చాలామంది పురుష రచయితలు సైతం మహిళల పేరుతో రాయకతప్పని స్థితి ఏర్పడింది. మహిళా రచయితల్లో ఇతరుల కంటే ఎక్కువగా యద్దనపూడి రచనలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించాయి.
అప్పటివరకూ కథల కోసం బెంగాలీ అనువాద సాహి త్యంవైపు, బెంగాలీ చిత్రాలవైపూ చూసే అలవాటున్న చిత్రపరిశ్రమను... కొత్త దృక్పథంతో, కొత్త ఆలోచనలతో మధ్య తరగతి జీవితాలను ప్రతిభావంతంగా, ఆకర్షణీయంగా చిత్రిస్తున్న యద్దనపూడి రచనలు సహజంగానే ఆకట్టుకున్నాయి. డాక్టర్ పి. శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ రూపుదిద్దుకుంటుండగా అనుకోకుండా ఆ రచయిత్రి కన్నుమూసినప్పుడు ఆ లోటును పూడ్చడం కోసం యాదృచ్ఛికంగా యద్దనపూడి సినీ రంగంవైపు వచ్చారు. ఆ తర్వాత ఆమె రచించిన ‘మీనా’, ‘సెక్రటరీ’, ‘జీవనతరంగాలు’, ‘చండీప్రియ’, ‘ఆత్మీయులు’ వంటి సుప్రసిద్ధ నవలలెన్నో చలనచిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే యద్దనపూడి పాఠకులు ఆ చలనచిత్రాలతో ఏనాడూ పూర్తిగా సంతృప్తిపడిన దాఖలాలు లేవు. వెండితెరపై సమ్మోహనపరిచే దృశ్య కావ్యాలకన్నా ఆమె రచనల్లోని నాటకీయత, సంభాషణలే వారిని బాగా ఆకట్టుకునేవి. నవలారంగం నుంచి సినీ మాధ్యమానికీ...అక్కడి నుంచి టెలివిజన్ రంగానికీ వచ్చి అన్నిచోట్లా సమానంగా మన్ననలు పొందిన ఏకైక రచయిత్రి బహుశా యద్దనపూడే కావొచ్చు.
దాదాపు నూటయేభై ఏళ్లక్రితం పుట్టిన తెలుగు నవల ఎన్నో పోకడలకు పోయింది. ఈ క్రమంలో వచ్చిన పాపులర్ నవలా ప్రపంచంలో యద్దనపూడి సులోచనారాణి తనదైన ముద్ర వేసి అగ్రగామిగా నిలిచారు. స్త్రీ, పురుష సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుని...తన రచ నల ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించిన సులో చనారాణి రాగలకాలంలో సైతం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment