ఒక రాణి | Special story to yaddanapudi sulochana rani | Sakshi
Sakshi News home page

ఒక రాణి

Published Tue, May 22 2018 12:02 AM | Last Updated on Tue, May 22 2018 12:02 AM

Special story to yaddanapudi sulochana rani  - Sakshi

యద్దనపూడి సులోచనా రాణి

అనగనగా ఒక రాణిఅనగనగా ఒక నవలఅనగనగా ఒక రాజ్యం.సులోచన.. నవలా రాణి నవలా రాజ్యంలో రాణించిన రాణినవలా ప్రియుల హృదయాలను ఏలిన రాణిఒకే ఒక రాణి.  యద్దనపూడి సులోచనా రాణి!


కథ ఎలా చెప్పాలో తెలిసిన రచయిత్రి
తెలుగు సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు పాపులర్‌ రచయితలంటే కించిత్‌ అసహనం, చాలా అవహేళన. కనక వారి రాతల్లో యద్దనపూడి సులోచనారాణికి స్థానం ఉండకపోవచ్చు. సదసద్వివేచన చేయగల కొందరు విమర్శకులు, సజీవమైన పాత్రలను సృష్టించినందుకు, తెలివైన, స్వయం నిర్ణాయక శక్తిగల స్త్రీపాత్రలను సృష్టించినందుకు, పురుషులలో పుణ్యపురుషులను చిత్రించినందుకూ,  ఒక నవలలో కథ ఎలా చెప్పాలో చూపించినందుకు, తెలుగుభాషను ఎంత సొగసుగా వాడవచ్చో నేర్పినందుకు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. మహిళా పాఠకులను పెంచిన రచయిత్రిగా, ఎన్నిసార్లు ప్రచురింపబడ్డా క్షణాల్లో అమ్ముడుపోయే నవలల రచయిత్రిగా ప్రచురణకర్తలు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా తమకు తరాల తరబడి ఆనందాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగించడంతో పాటు, తమలాంటి వ్యక్తులు ఎలా ఉండవచ్చో చూపినందుకు పాఠకులు ఆమెను కలకాలం గుర్తుంచుకుంటారు. 

సులోచనారాణి నవలల్లో ఆమె చుట్టూ ఉన్న సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాలుంటాయి. వాటిలోంచి, మట్టిలో మాణిక్యాల్లా నాయికా నాయకులు స్వంత వ్యక్తిత్వంతో ప్రకాశిస్తూంటారు. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండేందుకు కొంత స్నేహం, కొంత అవగాహన, కొంత ప్రేమ, కొంత గౌరవం ఉంటే చాలని నిరూపించే పాత్రలివి. అది కూడా మన జీవితాల్లో లేనందువల్లనేమో అవి స్వాప్నిక పాత్రల్లా, ఆమె కథలు భావకవుల కోవలో ఆకాశంలో విహరించేవిగా చాలామందికి తోచాయి. ఆమె పూర్తిగా నేలవిడిచి సాము ఎప్పుడూ చెయ్యలేదు. ఆ మాటకొస్తే అడవి బాపిరాజు, కోడూరి కౌసల్యాదేవి వంటి వారి నవలలతో పోల్చినపుడు వాస్తవికతకు ఆమె పాత్రలు ఎంత సన్నిహితంగా ఉంటాయో అర్థమవుతుంది. రచనా విధానానికి వస్తే, అందులో ఆమెతో పోటీ పడగలవాళ్లు అతి తక్కువ. కథనంలోనూ, సంభాషణలోనూ, ఉత్కంఠ రేకెత్తించడంలోనూ, కథను ముగించడంలోనూ ఆమెది అసాధారణ ప్రతిభ. ఆమె నవలలు సీరియల్స్‌గా వస్తున్నప్పుడు ఎక్కడ పూర్తవుతాయో అని వ్యాపార దృష్టితో సంపాదకులు, రచనాసక్తి దృష్టితో పాఠకులు బెంగపెట్టుకునేవారు. అంత పఠనీయత ఉన్న రచన ఆమెది.  ఇక వ్యక్తిగా సులోచనారాణికి నేనెరిగిన ఏ సాహితీవేత్తా సాటిరారు (నాకు చాలామంది సాహితీవేత్తలు వ్యక్తిగతంగా కూడా తెలుసు). తనొక గొప్ప రచయిత్రిననీ, ఆంధ్ర పాఠకుల హృదయరాణిననీ ఆమెకు స్పృహ ఉన్నట్టే అనిపించేది కాదు. తోటి రచయితల గురించి ఒక్క పరుష వాక్కూ ఆమె పెదవులపై ఏనాడూ కదలలేదు. తన అభిమానుల పట్ల చులకన గానీ, విసుగు గానీ ఏనాడూ కనిపించలేదు. రెండు గంటలు సంభాషణ జరిపినా తన రచనల గురించి, తనకున్న కీర్తి ప్రతిష్టల గురించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడకపోవడం నాకు అనుభవం. మనం ప్రస్తావిస్తే తప్ప తన గురించి తాను చెప్పుకునే అలవాటు లేదు. అప్పుడు కూడా చాలా తక్కువ విషయాలే చెప్పేవారు. ఈనాటి రచయితలు ఆమెను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మంచి రచయితకు ఆత్మస్తుతి, పరనింద అవసరం లేదనీ, ప్రతి వాక్యం ముందూ ఎవరేమనుకుంటారో భయపడాల్సిన దుస్థితి లేదనీ, రాసిన ప్రతి అక్షరానికీ తక్షణ స్పందనలూ, మెప్పుదలలూ, అవార్డులూ ఆశించనవసరం లేదనీ, తమకొక ముఠా ఏర్పరచుకుని వాళ్ల కోసమే రాయాల్సిన పని లేదనీ... ఇవన్నీ ఆమెను చూసి నేర్చుకోవచ్చు.  తన అనంతరం కూడా మనం చదువుకుందుకు, దాచుకుందుకు, మళ్లీ మళ్లీ చదువుకుని ఆనందించేందుకు కావలసినన్ని నవలలు మనకు వదిలి, ఎప్పుడూ ప్రశాంతతను కోరుకునే  ఆ మనసు ఈనాడు శాశ్వత ప్రశాంతిలోకి జారిపోయి విశ్రమిస్తున్నందుకు ఒక రకంగా ఆనందిస్తూ, మా ఇద్దరి మధ్యా ఎన్ని రకాల వ్యత్యాసాలున్నా, గత పదిహేనేళ్లుగా నాకు ఎంతో ఆప్తురాలిగా ఉంటూ వచ్చిన సులోచనారాణి గారిని వదలలేకపోతున్నందుకు  దు:ఖిస్తూ...
- మృణాళిని 

గంట చదువు రేపటికి ప్రేరణ
సాహిత్యాన్ని పాఠకులకు అత్యంత చేరువగా తీసుకెళ్ళిన సాహితీ దిగ్గజం యద్దనపూడి సులోచనారాణి. ఆనాటికీ, ఈనాటికీ ఏనాటికీ యావత్‌ ఆంధ్రుల అభిమాన రచయిత్రి కేవలం ఆమే అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ప్రసార మాధ్యమాలేవీ లేని ఆ రోజుల్లో పుస్తకాలు మాత్రమే కాలక్షేపం అవటంతో... ఆనాటి మహిళలు ఎందరో తమ రోజువారీ ఇరవై నాలుగ్గంటల సమయంలో వారికి దొరికే ఒక్కగంట ఖాళీ సమయంలో యద్దనపూడి సీరియల్‌ చదువుకోవటానికి మిగతా ఇరవైమూడు గంటలూ ఎంత కష్టమైన ఇంటిపనినైనా ఎంతో ఇష్టంగా చేసుకునేవారంటే పాఠకుల హృదయాల్లోకి ఎంతగా వీరి రచనలు చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.  నిజమే, ఒక రాజశేఖరంలో తన కలల రాకుమారుణ్ణి చూసుకునేది ఆనాటి మధ్యతరగతి స్త్రీ. ఒక జయంతిలో తనను చూసుకుని పెద్ద పడవ లాంటి కారులో రాజశేఖరం పక్కన కూర్చుని ఏ టీ ఎస్టేటుల్లోనో విహరించేది. చిన్నిచిన్ని కలహాలూ, కలతలూ తాత్కాలికమనీ, ఆలుమగల మధ్య అనురాగాన్ని నింపేవి, మరింతగా పెంచేవీ ఆ చిరుకలహాలేననీ మధ్యతరగతి ప్రజానీకం మనసుల్లో బలంగా నాటుకుపోయే రీతిలో తన రచనా వ్యాసంగం సాగించి కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఒక రచయిత్రిగా తన వంతు పాత్ర పోషించారు యద్దనపూడి.

రచనల్లో వారి చిత్తశుద్ధి, నిజ జీవితంలో ఆవిడ నిరాడంబరత్వం ఎందరికో ఆదర్శం. సన్మానాలూ, సత్కారాలంటే ఇష్టపడని సులోచనారాణి ఇటీవలి కాలంలో ఇంటర్వ్యూలకు కూడా పెద్దగా సుముఖత చూపక పోవటానికి కారణం ‘చాలు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను. ఎన్నో అవార్డులు, అభినందనలు, సత్కారాలూ పొంది నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇక చాలు, ఆశకు అంతేముంది’ అన్నమాటలు ‘ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం కాదు. ఎక్కడ ఆపాలో తెలియటం ముఖ్యం’ అన్న పెద్దల మాటను నిజం చేస్తాయి.  మధ్య తరగతి జీవితాల్లోని అనేక అంశాలను  ఆమె తమ రచనల్లో ప్రస్తావించేవారు. తను చూసిన, స్వయంగా పరిశీలించిన అనేక జీవితాలు ఆమె కథావస్తువులు. మధ్యతరగతి ఆడవాళ్ల మనస్తత్వ చిత్రణ, వారి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, చిలిపితనం, కోపం, అభిజాత్యం... భార్యాభర్తల మధ్య ప్రేమలూ, అలకలూ, కుటుంబాల్లో వచ్చే ఇబ్బందులూ ఇవన్నీ వస్తువులే వారి సాహిత్యంలో.‘ఒక్క కథో కవితో రాసి ఏ అవార్డ్‌ వస్తుందా? అని వీధిలో నిలబడి ఎదురుచూడవద్దు. పుస్తకాలతో పాటు వ్యక్తుల్ని, వ్యక్తుల జీవితాలను చదువు. సమాజాన్ని నువ్వెప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావో అప్పుడే నీనుండి ఒక మంచి రచన జీవం పోసుకుంటుంది’ అని చెప్పేవారు. 

ఒక మామూలు పల్లెటూరిలో పుట్టిన నేను వారి రచనలకు ప్రభావితమై జీవితంలో ఒక్కసారన్నా సులోచనారాణిని దూరంనుండైనా చూడగలనా అనుకునేదాన్ని. కలవాలంటే ఏం చెయ్యాలో తెలియలేదు. నాకు నేనే ఆలోచించుకుని రచనలు చెయ్యటం ఒక్కటే మార్గం, అది కూడా కుటుంబ, సమాజ సంబంధ బాంధవ్యాలను పెంపొందించే రచనలు చెయ్యాలనే సంకల్పంతో కలంపట్టిన ఏకలవ్య శిష్యురాలను యద్దనపూడి గారికి నేను. అలా కొంతవరకూ రచనలు చేసి హైదరాబాద్‌ వచ్చాకా లేఖిని సాహితీ సంస్థలో చేరటం ద్వారా ఆ సంస్థకు గౌరవాధ్యక్షురాలైన ఆమెను అతి సమీపంగా చూసినప్పటి మధుర క్షణాలను మరువలేను. నా మొదటి కథల సంపుటి ‘జీవనశిల్పం’కు ముందుమాట రాయమని అభ్యర్థిస్తే ‘రాయకూడదనే అనుకున్నాను. కానీ నీ కథలంటే ఉన్న ఇష్టంకొద్దీ ముందుమాట రాస్తా’నన్నారు. ‘‘నీ ‘ప్రభవించిన చైతన్యం’ నాకు నచ్చింది. మా అమ్మపేరుతో ప్రతిఏటా నేను ఇచ్చే అవార్డును నీకు ప్రకటిస్తున్నాను’’ అన్నారు. పల్లెలో పుట్టి, వారిని చూడటమే ధ్యేయంగా ప్రణాళిక వేసుకుని రచనలు ప్రారంభించి ఆ సాహిత్య వంతెన ద్వారా ఆమెని చూడగలిగిన నాకు ఇంతకంటే పెద్ద అవార్డ్‌ ఏముంటుంది? అది నా అదృష్టంగా భావించాను. ప్రేమికులు తమ ఆలోచనలను పంచుకునే ఒక అద్భుత వేదికగా నౌబత్‌ పహాడ్‌ను, ట్యాంక్‌బండ్‌ను తన రచనల్లో చూపిస్తూ పాఠకులను ఆయా ప్రాంతాల్లో విహరింపచేశారు కళ్లకు కట్టినట్లుండే తమవర్ణనలతో. ఎన్నో సమావేశాలకు వారిని నా కారులో తీసుకెళ్లే సందర్భంగా ‘నీ డ్రైవింగ్‌ నాకిష్టం. మళ్ళీ చాలా రోజుల తర్వాత వెన్నెల రాత్రులందు హుస్సేన్‌ సాగర్‌ని చూడాలనీ, నౌబత్‌ పహాడ్‌ ఎక్కి కబుర్లు చెప్పుకోవాలనీ ఉంది. నన్ను తీసుకెళ్లవూ’ అన్న వారి కోరిక కార్యరూపం దాల్చకముందే వారు స్వర్గస్తులవటం దైవ నిర్ణయం.
- కన్నెగంటి అనసూయ

పాఠకాదరణ పొందిన యద్దనపూడి నవలలు
ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, బహుమతి, బందీ, బంగారు కలలు, చీకట్లో చిరుదీపం, దాంపత్యవనం, హృదయగానం, జాహ్నవి, జలపాతం, జీవన సత్యాలు, జీవన సౌరభం, జీవన తరంగాలు, జీవనగీతం, జ్యోతి, కలల కౌగిలి, కీర్తి కిరీటాలు, కృష్ణలోహిత, మధురస్వప్నం, మనోభిరామం, మౌనభాష్యం, మౌన తరంగాలు, మీనా, మోహిత, మౌనపోరాటం, నీరాజనం, నిశాంత, ఒంటరి నక్షత్రం, పార్థు, ప్రేమదీపిక, ప్రేమలేఖలు, ప్రేమపీఠం, ప్రేమ సింహాసనం, ప్రియసఖి, రాధాకృష్ణ, రుతువులు నవ్వాయి, సహజీవనం, సంసార రథం, సౌగంధి, సెక్రటరీ, సీతాపతి, స్నేహమయి, సుకుమారి, శ్వేత గులాబీ. 

ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు 
∙మీరెక్కువగా ఏం పుస్తకాలు చదివేవారు? 
యద్దనపూడి: చిన్నప్పుడు మా ఊర్లో మంచి గ్రంథాలయం ఉండేది. అందులో ఫేమస్‌ ఇంగ్లీష్‌ నవలల అనువాదాలు, శరత్, టాగూర్‌ పుస్తకాలు చదివాను. నా ఫస్ట్‌ కథ పబ్లిష్‌ అయింది 1956లో. నాకు ఇష్టమైన రచయితలు ఒక్కరంటూ లేరు. వాళ్లలో బెస్ట్‌ తీసుకుంటుంటాను. ఆస్కార్‌ వైల్డ్‌ ‘యాన్‌ ఐడియల్‌ హజ్బెండ్‌’లోని పంచ్‌ లైన్స్‌ ఇష్టం. బాపిరాజు ‘నారాయణరావు’, ‘గోన గన్నారెడ్డి’ ఇష్టం. శరత్‌ రచనల్లోని డెలికసీ ఇష్టం. కానీ ఆ మగాళ్లు అసలు నచ్చరు. దేవదాసు  నవలను రాసిన విధానం ఇష్టం. కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, ప్రియురాలిని కాపాడలేని వాడివి తాగి చచ్చిపోతే ఎవడికి అట. ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు. 
     
మీ రచనల ద్వారా మీ అభిమానులకు చాలా రకాల ఆలోచనలు, భావాలు పంచారు. మీ జీవిత తాత్వికత ఏంటి?
లైఫ్‌ అంటే నాకు చాలా ఇష్టం. నేను నేనుగా బతికాను. నాకు మనుషులు కావాలి. కార్లు, బంగ్లాలు అవసరం లేదు. సింపుల్‌గా ఉండాలి. చెత్తబుట్ట, చనిపోయిన మనిషి ఒకటే. నువ్వూ ఏదో ఒకరోజు చెత్తబుట్ట అవుతావు. సుఖాలు అనుభవించు, తప్పులేదు. ఇతరులను ఇబ్బంది పెట్టకు. ఈ క్రమంలో జీవితాన్ని కోల్పోవద్దు. (యద్దనపూడి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లోంచి)యద్దనపూడి  నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు రూపొందాయి. అందులో కొన్ని... జై జవాన్, మీనా (అఆ), జీవన తరంగాలు, సెక్రటరీ, విజేత, అగ్నిపూలు, గిరిజా కల్యాణం, రాధా కృష్ణ, ఆత్మగౌరవం, బంగారు కలలు, ప్రేమలేఖలు, చండీప్రియ.

నా కలలను మేల్కొలిపారు
నేను చదువుకునే రోజుల్లో ‘విజేత’ నవల నాకు చాలా ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చింది. ఆమె పుస్తకాలే నాలో ఒక కారు, ఇల్లు కొనుక్కోవాలనే కలలను మేల్కొల్పాయి. ఇప్పుడే కాదు, నేను చాలా ఇంటర్వ్యూల్లో చెబుతున్నాను. హీరో అంటే ఇలా ఉండాలి, వ్యక్తిత్వం అంటే ఇదీ అనే విషయాలు ఆమె వల్లే తెలిశాయి. సాహిత్యంలో విశ్వనాథ అటువైపైతే, సులోచనారాణి ఇటువైపు. ఆయనది నారీకేళపాకం, ఈమెది ద్రాక్షపాకం. ఆయనది అర్థం చేసుకోవడం కష్టం. ఈమెది సులువుగా జీర్ణమౌతుంది. నాకు ఇద్దరూ ఇష్టమే.

ఇంటికెళ్లి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా
నేను ఆమె అభిమానిని. సెక్రటరీ నవల ఎన్నిసార్లు చదివానో చెప్పలేను. 1970ల్లో నవల కాపీ తీసుకుని ఎర్రమంజిల్‌ కాలనీలో వున్న ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాను. ‘మల్లాది వెంకట కృష్ణమూర్తికి, అభినందనలతో’ అని రాసి సంతకం పెట్టారు. చందమామ, అపరాధ పరిశోధన లాంటి మేగజైన్స్‌కు నేను అప్పటికే రాస్తున్నప్పటికీ ఆమె నన్ను గుర్తుపట్టలేదు. ఆమె మనుషుల ఉద్వేగాలను తన నవలల్లో ఎక్కువగా వ్యక్తీకరించారు. కాలంతోపాటు ఉద్వేగాలు మారవు. వ్యక్తుల స్పందనలు మారవు. అందుకే ఆమె పుస్తకాలు ఇప్పటికీ సజీవంగా ఉంటాయి. సాధారణంగా తెలుగు పాఠకులు పిసినారులు. అరువు తెచ్చుకుని చదువుతారు తప్ప పుస్తకాలు కొనరు. అట్లాంటిది ఆ పిసినారితనాన్ని ఆమె జయించేలా చేసింది. పుస్తకాలు కొనేలా చేసింది. అట్టలు చిరిగిపోతేనో, చివరి పుటలు ఊడిపోతేనో కూడా మళ్లీ కొత్త కాపీ కొనేవాళ్లు. ఆమె వాక్యాలు సుతిమెత్తగా ఉంటాయి. ఆహ్లాదమైన చక్కటి శైలి. ఆవిడ కూడా అంతే మర్యాద, మన్ననతో ప్రవర్తించేవారు. వాళ్ల కూతురు శైలజ పెళ్లికి పిలిస్తే వెళ్లాను కూడా. ఆమెలో వ్యాపారదక్షత కూడా ఎక్కువే. పబ్లిషర్స్‌ దగ్గరగానీ, నిర్మాతల దగ్గరగానీ ఈమెదే పైచేయిగా ఉండేది. ఎంతిస్తే అంత తీసుకోవడం ఆమెకు తెలియదు. తన రెమ్యూనరేషన్‌ ఎంతో కచ్చితంగా చెప్పేవారు. 1980ల్లో ఆమె కొంతకాలం ‘కోకిల’ అని ఒక టేప్‌ మేగజైన్‌ నడిపారు. రచయితలు వాళ్ల రచనల్ని చదివితే, వాటిని రికార్డు చేసేవారు. క్యాసెట్‌ ఒక గంట నిడివి ఉండేది. దాన్ని చందాదారులకు పంపేవారు. ఆ రోజుల్లో అదొక విప్లవాత్మకమైన ఆలోచన.
– మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఆమె యాక్చువల్‌ ఫెమినిస్ట్‌
సులోచనారాణి నవలలు చదవడం మొదలుపెట్టింది టెన్త్‌ తర్వాత! ఆవిడ బెస్ట్‌ అంతా 60–80ల మధ్యే వెలువడింది. 18–20 యేళ్లపాటు నవలా లోకాన్ని లిటరల్లీ ఏలారు. మనుషుల జీవితంలో పెద్ద తేడాలేముంటాయి? పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు ఇంటికి రావడం, మాట్లాడడం; మనకీ, మనకు కావలసిన వ్యక్తికీ గొడవ జరగడం...  తర్వాత అది సాల్వ్‌ అయ్యే పరిస్థితి రావడం – పెంకుటింట్లో, పాకల్లో, బంగళాల్లో ఎక్కడైనా ఇదేగా డ్రామా! ఆ రోజువారీ హ్యాపెనింగ్స్‌ రాసేవారు. నేల విడిచి సాము చేయలేదు. ఫాల్స్‌ ప్రెస్టీజ్‌ లేదు. సూడో ఇంటలెక్చువల్‌ అంతకన్నా కాదు.  లాక్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ – ఆమె రచనల్లో అంతర్గతంగా ఉండే అంశం. కమ్యూనికేషన్‌ సాధనాలు ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా మనుషుల మధ్య ఇప్పటికీ అదే పెద్ద సమస్య. ఆవిడ గేమ్‌ అంతా దానిమీదే ఉండేది. ఆమె నవలల్లో బేసిక్‌గా 1960ల నాటి మధ్యతరగతి ఆడవాళ్ల తాలూకు అనుమానాలు, భయాలు, మగాళ్లను నమ్మాలా వద్దా అన్నదాని మధ్య ఊగిసలాట, అందులోంచి ఎలా బయటికి రావాలి అనేవి  ఉంటాయి. ఆడవాళ్లు మగాడి దగ్గర్నుంచి ఒక అండర్‌స్టాండింగ్‌ కోరుకునేవారు. మగాడు ఎంత డబ్బున్నవాడైనా భార్యలు వంటింట్లోనే మగ్గిపోయేవారు. పదేళ్లక్రితమే పెళ్లయినా అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేకపోయేవారు. అప్పుడప్పుడే ఇలాంటి అన్యాయం పట్ల ఆడాళ్లు వాయిస్‌ రెయిజ్‌ చేయడం మొదలైంది. ఆ అంశాలు  ఆవిడ నవలల్లో కనిపించేవి. ఆవిడ సూడో ఫెమినిస్ట్‌ కాదు – యాక్చువల్‌ ఫెమినిస్ట్‌. ఆవిడ నార్మల్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చారు. పెద్దగా చదువుకోలేదు. చక్కగా ఇంట్లో కూర్చుని కథలు రాసి అంత సక్సెస్‌ఫుల్‌ అయ్యారు. ఇప్పటివాళ్లతో పోలిస్తే నాకు ఆవిడే ఎక్కువ సక్సెస్‌ఫుల్‌గా అనిపిస్తారు.
(సాక్షి ‘ఫన్‌డే’ ఇంటర్వ్యూలోంచి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement