Yaddanapudi Sulochana Rani
-
ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు. అంతర్జాతీయ మహిళా వత్సరం! అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది. ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది. స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్! మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే! అక్కినేని మానసిక సంఘర్షణ... అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు. అక్కడ తొలి షూటింగ్... ఇదే! అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్‌లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్‌కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’. ఆ కథ ఎన్నో చేతులు మారి... జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్‌గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు. 1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్‌గా నిర్మించారు. ఆ పాటలు... ఆ వ్యూహాలు! ‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్‌తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్‌తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్. ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్‌లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు. కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక! ‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం ‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది. అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్‌కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఆ జంట... సూపర్ హిట్! అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్‌తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్‌బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి. అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ). ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్‌గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం. అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు! ‘‘నాకు నటించడానికి హైదరాబాద్‌లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు. ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు. ∙అన్నపూర్ణా స్టూడియోస్ తొలి నవలే... సెన్సేషన్ యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు. ఆమె నవలా హీరో చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే! – రెంటాల జయదేవ -
నా పేరు ప్రతిష్టలు వాళ్లు చూడలేదు!
కథ పేరు, నా పేరు మళ్ళీ మళ్ళీ చూసుకుని ముద్దుపెట్టుకున్నాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదు.. తర్వాత తీసుకెళ్ళి నా పుస్తకాల అరలో పుస్తకాల మధ్య ఉన్న సరస్వతీదేవి ఫొటో దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను. ఆ ఫొటో మా అమ్మ పూజ పీఠం దగ్గర అన్ని దేవుళ్ళతో కలిసి ఉండేది. నేను 6వ తరగతి చదివేటప్పుడు తీసుకొచ్చి నా పుస్తకాల దగ్గర పెట్టుకున్నాను. రోజూ దొడ్లో విరబూసిన గరుడవర్ధనం, వాటి మధ్య ఎర్రటి కాశీరత్నం పూలు కలిపి దండ అందంగా గుచ్చి ఫొటోకి వేసు కునేదాన్ని. కథ పడిందన్న ఆనందంతో నా పాదాలు గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. నాకు ఇంగ్లీష్ వ్రాయటం, చదవటం బాగా వచ్చు! నాన్న నన్ను చూసి ముచ్చట పడేవారు! లైబ్రరీ నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చి చదు వుకోమని ప్రోత్సహించేవారు.. నాన్న, అన్నయ్యలు నన్ను గారాబంగా చూడటంవల్ల ఇంట్లో కుటుంబసభ్యులు అందరు అభిమానంగా చూసే వారు.. ఇప్పుడు ఈ ఆంధ్రపత్రికలో ఈ కథ పడటంతో ఇంట్లో నాకు మరీ ప్రత్యేకత వచ్చింది. నా విలువ బాగా పెరిగి పోయింది. నేను కుటుంబసభ్యుల మధ్య స్టార్‌ని అయిపోయాను. ఈ ఉత్సాహంలో ఇంకో కథ వ్రాయాలని ఆలోచించసాగాను. మా రంగం అక్కయ్య ‘‘నాకు నువ్వేమీ అప్పు తీర్చ క్కర్లేదు. నన్ను గుర్తుపెట్టుకో’’ అంది. అసలు కథ వ్రాయటమే అపురూపం. అది ప్రచురణ అవ్వడం ఇంకో అదృష్టం. దానికి తోడు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉన్న నన్ను వెతుక్కుంటూ 15 రూపాయలు మనీ ఆర్డర్ రావటం ఇంకా అద్భుతం, ఇలా నా జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరిగిపోయింది... ఆ రోజు మధ్యాహ్నం నాన్న భోజనం చేసి నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోతుంటే ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉండాల్సిందే. చిన్న చప్పుడు చేయకూడదు. మాటలు కూడా మేము రహస్యంగా మాటా డుకునేవాళ్ళం. నేను కూడా పడుకున్నాను. ఇంతలో వాకిట్లోంచి బిగ్గరగా ‘‘ఈ ఇంట్లో యద్దనపూడి సులోచనారాణి ఎవరండీ?’’ అని పోస్ట్‌మ్యాన్ అరవటం వినిపించింది. ఎవ్వరం పట్టించుకోలేదు. అతను మళ్ళీ బిగ్గ రగా కేక పెట్టాడు. అందరూ లేచారు. సత్యం సడెన్‌గా నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. ‘‘పిన్నీ నువ్వే నువ్వే! తొందరగా రా!!’’ అని నా చేయిపట్టి లాగాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది. అది నా పేరే! రెండేళ్ళ క్రింద పెళ్ళైంది కాబట్టి నా ఇంటి పేరు ముందు యద్దనపూడి అని వచ్చింది. వరండాలో ఉన్న పోస్ట్‌మ్యాన్ దగ్గరికి పరిగెత్తాము. సత్యం : ‘‘ఇదిగో మా పిన్ని!’’ పోస్ట్‌మ్యాన్ నమ్మలేదు.. ‘‘ఈ అమ్మాయిగారా?’’ అన్నాడు. ‘‘అవును నేనే. నాకేదైనా ఉత్తరం ఉందా?’’ అని అడిగాను. ‘‘అమ్మాయిగారూ, మీకు మనీఆర్డర్ ఉందండి!’’ అన్నాడు. సత్యం, నేను అయోమయంగా మొహాలు చూస్కున్నాం.. ‘‘ఎక్కడిది, ఎంత డబ్బు?’’ వాడు ఆత్రంగా అడిగాడు.. ‘‘ఆంధ్రపత్రిక నుంచి.. 15 రూపాయలు అమ్మాయిగారూ!’’ అన్నాడు పోస్ట్‌మ్యాన్. ‘‘ఇదిగోండి, ఇక్కడ సంతకం పెట్టండి!’’ అని ఫారం ఇచ్చాడు. వేలుతో చూపించాడు.. ‘‘యద్దనపూడి సులోచనారాణి’’ అని చేసిన నా తొలి సంతకం అది! ఇంతలో అందరూ అక్కడికి వచ్చారు! ఆ డబ్బు తీస్కుంటుంటే నా కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలు అయినాయి. అది ఆనందమో, ఆశ్చ ర్యమో, లేక మరో అద్భుతమో లేక ఈ మూడూ కలిసిన భావమో నాకు ఏమీ తెలియటం లేదు. ఇంతలో నాన్న వచ్చారు. ‘‘ఏంటి గొడవ?’’ ‘‘పిన్ని వ్రాసిన కథకి మనీఆర్డర్ వచ్చింది’’ అని అన్నాడు సత్యం. ‘‘15 రూపాయలు!’’ అన్నాడు రాముడు. ‘‘అమ్మాయిగారూ మీ కథకు 15 రూపాయలు తెచ్చాను. నాకు కాఫీ తాగటానికి ఇవ్వాలి’’ అన్నాడు పోస్ట్‌మ్యాన్. నాన్నకి నేనిచ్చిన నా మొదటి సంపాదన పంచెలు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం నాన్న పోయారు. నేను రచయిత్రిగా ఎదిగిన తర్వాత వేలు, లక్షలు సంపాదించాను. కానీ నా తల్లిదండ్రులు నా పేరు ప్రతిష్ఠలు చూడలేదు. వారికి నేనేమీ ఇవ్వలేకపోయాను. ఈ బాధ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. నాన్న జేబులోంచి తీసి చిల్లర అతని చేతిలో పెట్టారు. నేను నాన్న చేతికి 15 రూపాయలు ఇచ్చేసాను.. నాన్న డబ్బు తీసుకోలేదు. నన్ను దగ్గరికి తీసుకున్నారు. ‘‘నువ్వు ఏదైనా కొనుక్కో’’ అంటూ ప్రేమతో తలమీద నిమిరారు. ఇంతలో కరణం గారూ! అంటూ రైతులు వస్తే నాన్న వెళ్ళిపోయారు. మా రంగం అక్కయ్య ‘‘నాకు నువ్వేమీ అప్పు తీర్చ క్కర్లేదు. నన్ను గుర్తుపెట్టుకో’’ అంది. అసలు కథ వ్రాయటమే అపురూపం. అది ప్రచు రణ అవ్వడం ఇంకో అదృష్టం. దానికి తోడు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉన్న నన్ను వెతుక్కుంటూ 15 రూపాయలు మనీఆర్డర్ రావటం ఇంకా అద్భుతం, ఇలా నా జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరిగిపోయి, ఇంట్లో వారంతా నన్ను అదృష్టవంతురాలని మెచ్చుకునేలా చేసినాయి. మర్నాడు నేను రాముడు, సత్యంతో కలిసి కమలత్తయ్య మొగుడు రాజు మావయ్య దగ్గరికి వెళ్ళి, నాన్నకి 15 రూపాయలతో జరీపంచెలు తెమ్మని చెప్పాను. ఎవ్వరికీ చెప్పొద్దన్నాను. మామయ్య పంచెలు తెచ్చారు. నేను నాన్నకి అవిచ్చి ఒంగి కాళ్ళకి నమస్కారం చేసాను. ‘‘నాకెందుకమ్మా?’’ అన్నారు. నాన్న అవి కట్టుకుని పొలం వెళుతూ కమలత్తయ్య దగ్గరికి వెళ్ళి, ‘‘పాప తన సంపాదనతో ఈ జరీ పంచెలు కొనిం’’దని మురి పెంగా చెప్పారని అత్తయ్య మర్నాడు వచ్చి నాకు చెప్పింది. నాకు సంతోషం వచ్చేసింది. ఆ తర్వాత నేను వేలు, లక్షలు సంపాదించాను. నాన్నకి నేనిచ్చిన నా మొదటి సంపాదన పంచెలు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం నాన్న పోయారు. నేను రచయిత్రిగా ఎదిగిన తర్వాత వేలు, లక్షలు సంపాదించాను. కానీ నా తల్లిదండ్రులు నా పేరు ప్రతిష్ఠలు చూడలేదు. వారికి నేనేమీ ఇవ్వలేకపోయాను. ఈ బాధ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. – యద్దనపూడి సులోచనారాణి (సమాప్తం) తెలుగు నవలా రారాణి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గురించి కాసేపు మాట్లాడుకుందాం... వేదిక : ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్ సమయం : నేటి సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయితలు, కవులు, అభిమానులు పాల్గొంటారు. -
అర్ధరూపాయి అప్పు
ఈ కథ వ్రాసి, అర్ధరూపాయి అప్పుచేసి చాలా తప్పు చేసానని క్రుంగిపోయాను. నా నెత్తిమీద అర్ధరూపాయి అప్పు కొండంత బరువుగా కూర్చుని నన్ను పాతాళంలోకి క్రుంగదీయసాగింది. మా చిన్నబామ్మ పండగలకి పిల్లలందరికి అణాలు పెట్టేది.. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. కాశీ వెళ్ళింది. కథ వ్రాయటం అయిపోయింది.. కాని పోస్ట్ చేయటమే సమస్య ఐపోయింది.. ఎలా పంపాలో తెలియదు. నాకు అక్క కొడుకులు ఉన్నారు.. ఒకడు సత్యం, ఒకడు రాముడు, ఒకడు శర్మ.. నాకన్నా 6 సంవత్సరాలు చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా మా స్కూల్లో చదువుతారు.. మా ఇంట్లో నేను ఆఖరి సంతానం.. వాళ్ళు తమ్ముళ్ళలా ఉండేవాళ్ళు.. సత్యం.. రాముడు.. ఖుద్దూస్ మాస్టార్ దగ్గరికి వెళ్ళి పిన్ని కథ వ్రాసింది, ఎవరికి పంపాలి.. ఎలా పంపాలి అని అడిగి వచ్చారు.. (ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా జరిగింది..) ఆయన కాగితం మీద ఆంధ్రపత్రిక అడ్రెస్ వ్రాసి.. కవర్ మీద ఎలా వ్రాయాలో చెప్పి, తిరిగి రావటానికి ఫ్రం అడ్రెస్ వ్రాయాలని చెప్పారు... కథ పేజీలు ట్యాగ్‌తో కట్టి, కవర్లో పెట్టి మాస్టార్ చెప్పినట్టు అడ్రెస్ వ్రాసాను.. నా అక్షరాలు చాలా అందంగా ఉంటాయని మాస్టార్ గారు ఎప్పుడూ మెచ్చు కునేవారు.. కవరు బరువుగా ఉంది! సత్యం, రాముడు పోస్టాఫీసుకి వెళ్ళి తూయించి నీరసంగా తిరిగి వచ్చారు.. చాలా ఖరీదు! అర్ధరూపాయి!! అంతకుముందు కానీలు, చిల్లుకానీలు, అర్ధణా, అణా, బేడలు, పావ లాలు, అర్ధరూపాయి ఉండేవి.. అర్ధరూపాయి నా దగ్గర లేదు! మా నాన్నని అడిగితే వెంటనే ఇస్తారు! కానీ నాకు అస్సలు ఇష్టం లేదు! కథ తిరిగివస్తే, నాన్న కష్టార్జితంలో అర్ధరూపాయి వృథా అయిపోతుంది.. పైన డాబా మీదకి వెళ్ళే మెట్ల మీద నేను, సత్యం, రాముడు కూర్చుని ఈ కవరు పంపటం ఎలాగ అని గుడగుడలాడే వాళ్ళం.. మా మూడో అక్క కూతురు సుగుణ ఎప్పుడూ మా ముగ్గురిమీదా ఒక కన్నేసి ఉంచేది.. మేము దానిని కలుపుకోకుండా ఏదో చేసేస్తున్నామని దాని అనుమానం! ఒకసారి వాళ్ళమ్మ జయ అక్కయ్య వచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నారు మీరు? అంటూ గద్దించేది.. మేం ముగ్గురం మాట్లాడేవాళ్ళం కాదు.. చివరికి సత్యం ఒక సలహా చెప్పాడు.. మా రెండో అక్కయ్య పేరు రంగమ్మ. ఆవిడకి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత, రెండు కళ్ళూ పోయాయి.. ఆవిడ భయంకరమైన పుస్తకాల పురుగు! ఆవిడ రాత్రివేళ ఆంధ్రపత్రికలో సీరియల్స్ (రెండు మహానగరాలు, హకల్ బెరి ఫిన్, లైబ్రరీ నుంచి శరత్ బాబు నవలలు) తెప్పించుకుని నా చేత చదివించుకునేది! నాది చాలా జాలి గుండె.. ఆవిడ కోసం శ్రమ పడి, చదివేదాన్ని.. సత్యం రంగమ్మ అక్కయ్యని అప్పు అడుగుదామని సలహా ఇచ్చాడు.. మొదట నేను అప్పంటే ఒప్పుకోలేదు! భయపడ్డాను.. అప్పంటే చెడ్డ భయం..! మా నాన్న వారం రోజుల క్రితం చిన్నన్నయ్య బుట్టల సుబ్బమ్మ దగ్గర అర్ధణా అప్పు పెట్టి బటానీలు తిన్నాడని తెలిసి, అన్నయ్యని చితకబాదాడు.. ఆ దృశ్యం చూసి పిల్లలం భయపడి దొడ్లో పాకలోకి పారిపోయి దాక్కున్నాం.. నాన్నకి అప్పంటే ఆగ్రహం! మా బాబాయిలు పేకాట ఆడి అప్పులు చేసి.. పొలాలు పోగొట్టుకొని పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోయారు. డబ్బు ఖర్చు విషయంలో నాన్న నిర్దాక్షిణ్యంగా ఉండేవాడు! ఒక పక్క అప్పంటే భయం. నేను అప్పు చేసానని తెలిస్తే ఇంకేమన్నా ఉందా..? నాన్నకి నేనంటే గారాబం. స్కూల్లో చదువుల్లో, ఆటల్లో ఫస్ట్ వస్తానని చాలా సంతోషం.. ఇంటికి వచ్చిన రైతులకి స్కూల్లో ఫస్ట్ వస్తానని అపురూపంగా చెప్పేవారు.. అది గుర్తువచ్చి అప్పంటే మరీ భయం వేసింది.. ఇలా వెధవ పని చేసి ఆ ప్రేమను పోగొట్టుకోలేను.. కథ పంపాలని ఆశ! ఆరాటం! కానీ అప్పు చేయటం కుదరదు. ఎలా? రాముడు తొందర పెడుతున్నాడు.. (సరే అని ధైర్యం చేసాను.) సత్యం – రాముడు ఒక రోజు రంగమ్మక్కయ్య దగ్గరికి వెళ్ళి.. అర్ధ రూపాయి అడిగారు.. ఆవిడ వెంటనే అనుమానభూతంలా చూసి ఎందుకు అంది.. ‘‘జీడీలు కొనుక్కొని తినాలని ఉంది..!’’ అన్నాడు సత్యం. తాతయ్యని అడగండి అనేసింది..! ‘‘నువ్వు ఇస్తావా లేదా?’’ అన్నాడు రాముడు.. నేను అక్కడనుండి వెళ్ళిపోతుంటే సత్యం చేయిపట్టి ఆపాడు.. ‘‘నీకు పిన్ని పుస్తకాలు చదువుతుంది కదా..! నువ్వు ఇయ్య కపోతే ఇక నుంచి నీకు చదవదు మరి!’’ అని బెదిరించాడు.. అక్కయ్య ఆలోచించి జాకెట్లోంచి గుడ్డసంచి తీసి... అందులోనుంచి చిల్లర తడిమి అర్ధరూపాయి బిళ్ళ తీసి పట్టుకుంది.. వెంటనే ఇవ్వలేదు.. నేను నిరుత్సాహపడ్డాను.. ఆవిడ అంది.. ‘‘ఇదిగో! వెంటనే తీర్చాలి.. అంతేకాదు.. పగలు, రాత్రి పుస్తకాలు చదవాలి’’ అంది..! ‘‘అట్లా అయి తేనే ఇస్తా’’ అంది.. సత్యం నా వైపు చూసాడు.. నేను అక్కర్లేదు అన్న ట్లుగా అడ్డంగా తలూపాను. ఆవిడకి కళ్ళు కనిపించేవి కావు కదా! అట్లాగే! సరే! అని సత్యం, రాముడు అంటూ, నా వైపు చూసి ‘ఉత్తుత్తినే’ అన్నట్లు నాలుక బయట పెట్టి పెదవులపై అటూ ఇటూ ఊపారు..! ఆవిడ అర్ధరూపాయి ఇచ్చింది.. వెంటనే నా కథ ఆగమేఘాల మీద పోస్ట్‌కి పోయింది.. చిన్న రసీదు తెచ్చి ‘‘దాచుకో’’ అన్నాడు సత్యం.. నాకు ఆశ్చర్యం వేసింది!! కథ వెళ్ళిపోయింది. నా దగ్గర లేదు. కథకి గుర్తు చిన్న రసీదు ముక్క మాత్రమే!! రోజులు గడిచాయి. మా అక్క నన్ను కథలు చదవమని రాక్షసిలా పిలుస్తోంది. అప్పట్లో లాంతరు దీపాలు. రాత్రి 10 గంటలు అయితే గాని లాంతరు దొరకదు. మా అక్క పగలు కుక్కి మంచంలో హాయిగా నిద్రపోయి, రాత్రి చదవ మని వేధించేది. అలానే చదివేదాన్ని. నేను ఆవిడకి అర్ధ రూపాయి కోసం బానిస అయిపోయాను! నా స్వేచ్ఛ అంతా పోయింది!! ఈ కథ వ్రాసి, అర్ధరూపాయి అప్పుచేసి చాలా తప్పు చేసానని క్రుంగిపోయాను. నా నెత్తిమీద అర్ధరూపాయి అప్పు కొండంత బరు వుగా కూర్చుని నన్ను పాతాళంలోకి క్రుంగదీయసాగింది. మా చిన్న బామ్మ పండగలకి పిల్లలందరికి అణాలు పెట్టేది.. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. కాశీ వెళ్ళింది. చాలాసార్లు మా నాన్న దగ్గరికి వెళ్ళి తలెత్తకుండా నాన్నా! నేను చాలా తప్పు చేసాను! అర్ధరూపాయి అప్పు చేశాను! నన్ను క్షమించు..! అని చెప్పాలని ఎంతగానో అనిపించేది. కానీ ధైర్యం చాలేది కాదు! ఇలా మథనపడుతున్నాను..! క్రుంగిపోతున్నాను.. మా నాన్న ఒకసారి నన్ను చూసి ‘‘ఏమైంది..? ఒంట్లో బాగాలేదా?’’ అని అడిగితే అదిరిపడ్డాను. నాన్నకి తెలిసిపోతుందని.. మెల్లగా అక్కడినుంచి వెళ్ళిపోయాను. ఒకరోజు గుడికి వెళ్ళి వచ్చాను.. రాముడు, సత్యం పరిగెత్తుకొని ఒచ్చారు.. ‘‘పిన్నీ! నీ కథ పడింది..!! ఇదిగో’’ అంటూ పత్రిక చూపిం చారు. ‘‘నిజంగానా?’’ అన్నాను. ముగ్గురం పందిరి కింద వరండాలో క్రింద కూర్చుని నేల మీద పెట్టి చూస్తున్నాం. నిజంగా నిజం! ‘‘చిత్రనళినీయం – యద్దనపూడి సులోచ నారాణి’’ అని ఉంది. ముగ్గురం ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని కౌగిలించుకున్నాం.. నా మనసు షాక్‌లోకి వెళ్ళిపోయింది. అంతలో నాన్న వచ్చారు.. సత్యం చెప్పాడు. ‘‘తాతయ్యా! పిన్ని కథ వ్రాసింది!! పత్రికలో పడింది!’’.. ‘‘కథా?! పత్రికా?!’’ అన్నారు.. ఆశ్చర్యంగా. నాన్న పట్టుకుని చూసారు. ‘‘ఏది ఆంధ్రపత్రిక? చదివి వినిపించండి!’’ అత్తయ్య సీరియల్స్ కోసం అరుస్తోంది. నాకు భయం వేసింది. పరువు గల కుటుంబం. ఆడపిల్లని. కరణం గారి అమ్మాయిని. నా పేరు ఇలా దేశం మీద పడినట్టు చేసానేమిటి? అని భయపడ్డాను. కానీ నాన్న ఏమీ అనలేదు. పైనుంచి ఇంటికి వచ్చే రైతులకి ‘‘మా అమ్మాయి కథ వ్రాసింది. పత్రికలో పడింది!’’ అంటూ చూపించారు. హమ్మయ్య! అనుకున్నాను. ఈ వార్త తెలిసి, ఇంట్లో కుటుంబ సభ్యులంతా ‘‘ఏదీ? ఏదీ?’’ అంటూ ఆంధ్రపత్రికని ఒకరి చేతుల్లోంచి ఒకరు లాక్కుంటుంటే, అది వాళ్ళ చేతుల్లో ఎక్కడ చిరిగిపోతుందోనని నా ప్రాణం గిలగిలలాడి పోయింది. చివరికి అతికష్టం మీద దొరకపుచ్చుకుని నేను చదువుకునే గదిలోకి పరిగెత్తాను. – యద్దనపూడి సులోచనారాణి ‘పోస్ట్‌మ్యాన్ పిలుపుతో కలకలం’ రేపటి సంచికలో... -
చిత్రనళినీయం.. కథ వెనక కథ
ప్రియాతి ప్రియమైన పాఠకులారా!! ఈ రోజు ఈ ఉత్తరం మీకు వ్రాస్తుంటే నా మనసు చెప్పలేనంత ఉద్విగ్నభరితంగా ఉంది. 60 సంవత్సరాల సుదీర్ఘమైన నా రచనాప్రయాణంలో నేను 1957లో వ్రాసిన ‘చిత్రనళినీయం’అనే ఈ కథ నా తొలి అడుగు! దాదాపు 60 సంవత్సరాల అలుపెరుగని, నిరుత్సాహం ఎరుగని, విసుగు ఎరుగని, సుదీర్ఘ ప్రయాణం ఇది. నేను పుట్టి పెరిగినది ‘కాజ’అనే చిన్న గ్రామం. చాలా అందమైన పల్లెటూరు. ప్రకృతి మధ్య ఒదిగి పడుకున్న అమాయకపు పసిపాప లాంటి అందమైన ఊరు. ఎటు చూసినా పచ్చదనం! పంట కాలవలు. వరిచేలు. ఉదయం అవగానే చెట్ల మీద గుంపులుగా వాలే రామచిలుకలు, కావ్–కావ్ మని కాకుల గోలలు! వేణుగోపాల స్వామి ఆలయంలో జేగంటల ధ్వనులు.. ఇటు పక్క శివాలయంలో శివనామ స్మరణలు! దొడ్లో ఒక పక్క బావిలోంచి బకెట్టుతో నీళ్ళు తోడుతున్న చప్పుడు..! ఇటు పక్క కట్టెలపొయ్యి మీద కాగులో కాగుతున్న వేడి నీళ్ళు. పొయ్యిలోంచి కట్టెలు, పిడకల వాసన. కొద్ది దూరంలో ఆవు పేడ వాసన. గుమ్మం పక్కన విరగబూసి సువాసనలు వెదజల్లుతున్న సన్నజాజి చెట్టు. దానికి కొద్దిదూరంలో తులసి వనంలా పచ్చటి తులసి మొక్కలు.. తెల్లవారేసరికి ఒకటో రెండో పళ్ళు రాల్చే విరగ గాసిన బాదం చెట్టు. ఇంట్లో కరెంటు లేదు. కిరసనాయిలు లాంతర్ల ముందు కూర్చుని అప్పుడప్పుడు పుస్తకాలు చదివేదాన్ని. ఊరిలో అన్నిటికంటే నాకు ప్రియాతి ప్రియమైనది ‘మా ఊరి చెరువు’. దాన్ని చూస్తే సంతోషంతో పులకరింతలు వచ్చేవి.. ఎందుకంటే అది ఒక అందమైన, అద్భుతమైన దృశ్యం! ఆ చెరువులో తెలుపు, ఎరుపు కలువ పూలు!! కొన్ని మొగ్గలుగా ఉండేవి. కొన్ని విచ్చుకుని విరబూసి ఉండేవి. కార్తీకమాసంలో, చలిలో అమ్మా అత్తయ్యలు, చెరువుకి స్నానానికి వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళేదాన్ని. అమ్మ ఒక పాత చీరలో నన్ను కాగితంలో పొట్లం చుట్టినట్టు చుట్టి చలిబారిన పడకుండా చూసేది. చెరువు మెట్ల మీద కూర్చుని అమ్మా అత్తయ్యలు అరటి దొప్పల్లో దీపాలు పెట్టి చెరువులోకి వదిలేస్తుంటే, అవి మెల్లగా నీటిలో ప్రయాణం చేస్తుంటే ఆ చీకటి రాత్రి, చెరువు – దీపాలు , నాకు చాలా ఆనందంగా, చూడముచ్చటైన దృశ్యంగా ఉండేది. తెల్లవారి అమ్మా అత్తయ్యలు చెరువు గట్టున ఉన్న రామాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే నేను చెరువుని వదలలేని దానిలా అక్కడే కూర్చునే దాన్ని.. చెరువు చుట్టూ పాకలు! పైకప్పులోంచి వలయాకారంగా బయటికి వస్తున్న వంట పొయ్యిల పొగలు. మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. పోస్ట్ అంతా పంట కాలవలో, పడవలో బందరు వెళ్ళాలి. అలా నేను వ్రాసిన నా మొట్టమొదటి కథ ‘చిత్ర నళినీయం’ పంట కాలవలో, పడవలో ప్రయాణం చేసి బందరు వెళ్ళి, అక్కడ నుంచి రైలులో మద్రాసు వెళ్ళింది. ఆ పచ్చటి పొలాలు, పంట కాలవల్లో ఆకాశం పైనుందా, క్రింద కాలవలో ఉందా అన్నట్టూ ప్రతిబింబించే దృశ్యాలు.. పడవని తాడుతో లాగుతూ ఒడ్డున నడిచే పల్లెకారులు, నీళ్ళలో వెళుతున్న పడవ శబ్దం. ఇదంతా గుర్తుకువస్తే ‘సత్యజిత్ రే’ సినిమాలో ఒక దృశ్యంలా అనిపిస్తుంది. అప్పటికే నా వివాహం కావడం వల్ల నా పేరు యద్దనపూడి సులోచనారాణి అని పెట్టుకున్నాను. అలాంటి పల్లెటూరిని వదిలి ఈ హైదరాబాదు వచ్చాను. కాలగమనంలో ఇన్నాళ్ళ నా సాహితీచరిత్ర సాగుతోంది. ఇంకెన్ని పుటలు ఉన్నాయో నాకే తెలి యదు. కాలగమనంలో మార్పు చూడండి.. ఆ నాడు పంట కాలవలో, పడవలో వెళ్ళే నా కథ, ఇప్పుడు నా కలం నుంచి తెల్ల కాగితం మీద వచ్చిన అక్షరాలని ‘అని’ నిమిషంలో కంప్యూటర్లో పెట్టడం జరుగుతోంది.. 1957 లో ప్రచురితం అయిన నా ఈ కథని మీ ముందు ఉంచుతుంటే, నా హృదయం ఊహించలేనంత ఉద్విగ్నంగా, ఆనందంగా ఉంది. ఈ క్షణం, 60 సంవత్సరాలు గల గతం, ఇప్పటి ఈ రోజు వర్తమానం రెండూ కలిసిపోయిన అద్భుత క్షణాలుగా అనిపిస్తున్నాయి.. కథ ముందు.. నేను రచయిత్రిగా ఎలా మారానో, నేను రాసిన మొట్టమొదటి కథ వెనక జరిగిన కథ ఇది : ‘చిత్రనళినీయం’ కథ పోస్ట్ చేయటానికి వెనక చిన్న కథ వుంది. నేను ఆ కథ రాయటానికి (ఇది నేను ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయిన తర్వాత సెలవల్లో వ్రాసాను). అంత క్రితం 8వ క్లాసు చదువుతుండగా స్కూల్లో మేగ్జీన్ కోసం ఖుద్దూస్ మాస్టార్ గారు నన్ను ఒక కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అన్నాను. అంత క్రితం నేను ‘గోమాత’ మీద ఒక వ్యాసం వ్రాసి, క్లాస్‌లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. నేను అది బాగా వ్రాసానని, క్లాస్‌లో మిగతా పిల్లలతో నాకు అభినందనగా చప్పట్లు కొట్టించి, వారితో కలిసి ఆయన కూడా కొట్టారు! నా మనసు పరవశించి పోయింది. ఖుద్దూస్ మాస్టార్ ముస్లిం అయినా తెలుగు బాగా మాట్లాడేవారు, వ్రాసేవారు. చక్కగా కథలు చెప్పి నీతి బోధించేవారు. ఆయనంటే నాకు బాగా ఇష్టం. నిజానికి ‘గోమాత’ వ్యాసం వ్రాయటానికి నేను యేమీ కష్టపడలేదు. మా దొడ్లో ఒక ఆవు ఉండేది. అమ్మ దాన్ని ‘లక్ష్మి’ అని పిలిచేది. దాని ముఖానికి పసుపు రాసి, బొట్టు పెట్టి, దండం పెడుతూ దాని చుట్టూ ప్రదక్షిణం చేసేది. అది మూత్రం పోస్తే దాని తోక మీద పట్టి, తన తల మీద చల్లుకుని, నా తల మీద చల్లేది. లక్ష్మికి ఒక దూడ ఉండేది. అది దొడ్లో చెంగున గంతులేస్తుంటే మేం పిల్లలంతా దానితో ఆడేవాళ్ళం. నేను దాన్ని పట్టుకుని, మా అమ్మలా దాని మెడ మీద నిమిరేదాన్ని! అది నా దగ్గరికి వచ్చేసేది. మా బాబాయి ఒకరు ఆవు వల్ల ఉపయోగాలు చెప్పారు. ఇదంతా కలిపి ఒక వ్యాసం వ్రాసాను. మూత్రం శుద్ధి చేయటానికి పనికొస్తుందని, పాలు ఆరోగ్యానికి మంచిదని మా బాబాయి చెప్పినట్టే వ్యాసంలో వ్రాసాను. ఇది వ్రాసిన తర్వాత ఖుద్దూస్ మాస్టార్ స్కూల్ నుంచి వచ్చే వ్రాత పత్రికకి కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అని అంటే... నువ్వు వ్రాయగలవని ప్రోత్సహించారు. ఆయన పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది గుర్తుకువచ్చి, శరీరం సంతోషంతో పులకరించేది. ఆ ఉత్సాహంతోనే స్కూల్ వ్రాత పత్రికకి ఒక కథ వ్రాసాను. దాని పేరు ‘మనోఛాయలు’ (ఇద్దరు స్కూల్లో చదివే స్నేహితురాళ్ల మధ్య చిన్న మనఃస్పర్థలు వచ్చి, మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఆనందంగా ఒకరి భుజం మీద మరొకరు చేతులేస్కొని, స్నేహంగా స్కూల్‌కి వెళ్ళటం! ) అది నా 14వ సంవత్సరంలో వ్రాసిన కథ! అది కూడా ఖుద్దూస్ మాస్టార్ మరీ మరీ వ్రాయమని అడిగితే వ్రాసినదే! నేను పెద్ద రచయిత్రిని అయిన తర్వాత, ఎవరో ఒకరు వ్రాయండి అని అడిగితే రాసిన నవలలే ఎక్కువ.. 1) సెక్రటరీ – రమణా – బాపు, జ్యోతి రాఘవయ్య గారు. 2) జీవన తరంగాలు – నార్ల వెంకటేశ్వరరావు గారు 3) మీనా – చక్రపాణి గారు 4) ఆరాధన – ఎమెస్కో ఎం.ఎన్. రావు గారు ఈ విధంగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు అయిపోయినాయి. వేసవి సెలవుల తర్వాత నవంబర్‌లో అమ్మ పోయింది. మనసులో భయం! ఒంటరితనం! దిగులు.. దుఃఖం! అప్పటికే పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది. నాన్న ఎస్.ఎస్.ఎల్.సి. అయి, ఇంటర్ అయిన తర్వాత కాపురానికి పంపిస్తామని పెళ్ళికి ముందే షరతు పెట్టారు. ఇంటినిండా అక్కయ్యలు, ఒదినలు, పిల్లలు.. అయినా ఒంటరితనం. ఖుద్దూస్ మాస్టార్ ఒకసారి నాన్నని చూడటానికి వచ్చి.. నన్ను కథలు వ్రాయమని గట్టిగా చెప్పారు... కథలు వ్రాస్తే నా బాధలు పోతాయని చెప్పారు... అప్పుడు ‘చిత్రనళినీయం’ వ్రాసాను.. – యద్దనపూడి సులోచనారాణి రహస్యంగా పోస్టయిన కథ... మంగళవారం (29.05.2018) సంచికలో... -
నవ నవలారాణి
కాళిదాసు తన మేఘ సందేశంలో వర్ణించిన యక్ష రాజధాని అలకాపురిలో ఆనందబాష్పాలు తప్ప వేరే కన్నీళ్లు లేవు. విరహతాపం తప్ప వేరే బాధలు లేవు. ప్రణయ కలహం వల్ల తప్ప వేరే వియోగం లేదు. ఇంత అందమైన ప్రపంచంలోకి రెండు తరాల పాఠకుల్ని తీసుకెళ్లి, సేదతీర్చిన ఘనత యద్దనపూడి సులోచనారాణిదే! స్కూల్ ఫైనల్లో ఉండగానే తొలి కథ ’చిత్ర నళినీయం’ రాశారు. ఆమె ప్రస్థానం ఆంధ్ర వారపత్రికలో ఆరంభమైంది. మొదట్లో వరసగా ఏడెనిమిది కథలు రాశారు. ఆనాటి పత్రిక సంపాదకుడు నండూరి రామ్మోహనరావు ఆమెలోని ప్రతిభని గుర్తించి బాగా ప్రోత్సహించారు. సులోచనారాణి పెళ్లాడి, పుట్టిల్లు కాజ వదిలి హైదరాబాద్ కాపరానికి వచ్చారు. రచనలపై మమకారం మరింత పెంచుకున్నారు. 1963 జనవరిలో బాపు రమణలు విజయవాడ కేంద్రంగా జ్యోతి మంత్లీ ప్రారంభించారు. ప్రారంభ సంచికలో హేమాహేమీల రచనలతోపాటు సులోచనారాణి కథ జ్యోతి కథ కనిపిస్తుంది. జ్యోతి మంత్లీని నండూరి ఎడిట్ చేసేవారు. తర్వాత 1964లో సెక్రటరీని కొంచెం పెద్దకథగా రాసి పంపారు యద్దనపూడి. దాన్ని నవలగా పెంచి పంపమని నండూరి సెక్రటరీని వెనక్కి పంపారు. నవల చేసి పంపారు. ఇక తర్వాత కథ అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో జ్యోతి మంత్లీ వెల అరవై పైసలుండేది. సెక్రటరీ సీరియల్ ఉత్కంఠ తట్టుకోలేని పాఠకులు కొందరు, ప్రెస్ దగ్గర దొంగ బేరాలాడి ఆ ఒక్కఫారమ్నీ పావలా ఇచ్చి ముందుగా కొనుక్కు వెళ్లేవారట! మొదటి మెట్టులోనే సులోచనారాణికి అంతటి పేరొచ్చింది. చాలా దీక్షగా ప్రొఫెషనలిజమ్‌తో నవలా వ్యాసంగాన్ని ఆమె కొనసాగించారు. ఏకకాలంలో మూడు నాలుగు ధారావాహికలు కొనసాగించిన సందర్భాలున్నాయి. ఆవిడ ఇంగ్లిష్ పల్ప్‌తో రాస్తారంటూ ఆక్షేపించిన వారున్నారు. ఏదైనా కావచ్చు చదివించే గుణం కదా ముఖ్యం. ఆమె నవలల్లో అడుగు పెడితే విమానం లాంటి కార్లు, అందమైన డ్రాయింగ్ రూమ్‌లు, ఆరడుగుల శేఖర్, సరిజోడు జయంతి లేదంటే ఇంకో ఇంతి – కాసేపటికి కలల్లోకి జారుకుంటాం. 1960 దశకంలో మధ్యతరగతి అమ్మాయిలు చాలా ఇష్టపడటానికి కారణం వాతావరణంలో ఉండే రిచ్‌నెస్. దానికి సస్పెన్స్ తోడయ్యేది. పాతికేళ్ల పాటు ఎడిటర్లు, పబ్లిషర్లు, చిత్ర నిర్మాతలు సులోచనారాణి రాతల కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. రీడర్స్ తగ్గి వ్యూయర్స్ పెరిగాక, వీక్షకుల్ని సైతం విపరీతంగా ఆమె ఆకట్టుకున్నారు. సుమారు పది మెగా టీవీ సీరియల్స్‌కి మూలకథ సులోచనారాణిదే. సెక్రటరీ నుంచి చాలా సినిమాలు ఆమె నవలల పేరుతోనే వచ్చాయ్. ప్రతి ఏటా వేసవిలో కుమార్తె వద్దకు వెళ్లి కొద్ది నెలలు గడపడం అలవాటు. అలాగే వెళ్లిన సులోచనారాణి, యుఎస్ క్యుపర్టినో సిటీలో స్వీయ కథ ముగించి ఫుల్స్టాప్ పెట్టేశారు. తెలుగు జాతి ఆమెకు రుణపడి ఉంటుంది. అక్షర నివాళి. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రాతి హృదయం
ప్రేమ ప్రేమ అమ్మ పాల వంటిది అది ఒక చైతన్యధార! దానికి మతం, కులం, ఇజం అనేవి ఏవీ లేవు, ఈ మానవాళికి అది ఒక అమృతధార స్త్రీ ఒక ప్రేమ దాసి! ఆమె పుట్టినప్పటి నుంచి తల్లిలో, తండ్రిలో, అక్కచెల్లెళ్ళలో, అన్నదమ్ముల్లో, ఇరుగుపొరుగులో, పెళ్ళి అయిన తరవాత భర్తలో, పిల్లల్లో, అత్తమామల్లో, దేవుడిలో, ప్రేమను వెతుక్కుంటూ వుంటుంది.. యుగయుగాలనుంచి, ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా ఆమె కోరుకున్న ప్రేమ తనకి లభించినట్టు చెప్పలేక పోతూంది... దీనికి కారణం ఏమిటి? మనుషులా? కాలమా? రాతి హృదయం నేను హైదరాబాదులో దుర్గం చెరువు దగ్గర ఉన్న ఒక పెద్ద బండ రాయిని. నా వయసు నాకే తెలీదు. సృష్టిలో విస్ఫోటం జరిగి ఈ భూమి ఏర్పడినప్పుడు ఏర్పడిన శిలాకుటుంబం మాది. మా వయసు వేల సంవత్సరాలు. మొదట్లో గరుకుగా, మోటుగా ఉన్న మా కుటుంబం, ఈ ప్రకృతి మమ్మల్ని అదే పనిగా తోమటంతో ఇలా నున్నగా, నిగనిగలాడుతూ, అప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి ఒచ్చిన సొగసైన అమ్మాయి ముఖంలా మెరుస్తున్నాం అనేవారు మా పెద్దవాళ్ళు. మాది కఠినకాయం. చెరువు చుట్టూ చిన్నా–పెద్దా, తాత–ముత్తాతలైన పెద్ద పెద్ద రాళ్ళతో మా కుటుంబం ఉండేది. హైదరాబాదుకి వయసు వచ్చి, మమ్మల్ని నమిలి మింగేయసాగింది. మా పూర్వీకులు చాలా మంది నశించిపోయారు. నాది భారీకాయం. ఎండ వచ్చినా, వెన్నెల వచ్చినా, నా నీడ 300 గజాలు పైగా వ్యాపిస్తుంది. ఈ ప్రపంచంలోకల్లా, నాకు చాలా ఇష్టమైనది నా నీడ. నా నీడలో, పగలు మేకలు, కుక్కలు వచ్చి పడుకుని సేదతీరుతాయి, అప్పుడప్పుడు మేకలు ప్రసవించడం కూడా జరుగుతుంది. మేకలు కాసే పిల్లవాడు, నన్ను ఆనుకొని కూర్చొని పిల్లనగ్రోవి వాయిస్తుంటే, నాకు పరవశం కలుగుతుంది. ఇంతకంటే నాకు కనువిందైన దృశ్యాలు ఎన్నో! సాయంత్రం వేళ, వెన్నెల రాత్రులలో, ప్రేమికులైన యువతీయువకులు వచ్చి నా నీడ క్రింద కూర్చొని, అరమరికలు లేకుండా సరసాలు ఆడుకుంటూ, ముద్దుముద్దుగా ప్రవర్తిస్తుంటే నాకు చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉండేది. నిజం చెప్పొద్దూ? ఒక్కోసారి వారి చేష్టలు చూడలేక, కళ్ళు మూసుకునేదాన్ని. కొంతమంది వాళ్ళ తీపి గుర్తుగా నా భారీకాయంలో కొంతభాగంలో వాళ్ళ ప్రేమికులని నిలబెట్టి ఫోటోలను తీసుకునేవారు, నా మీద వారి గుర్తుగా పిచ్చి పిచ్చి రాతలు రాసేవారు. నేను ఇవన్నీ వర్ణించి వర్ణించి చెప్తుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నిట్టూర్చేది. ‘‘రాతి మిత్రమా! నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. నా సంగతి చూడు. ఒకప్పుడు వాన నీళ్ళతో కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండేదాన్ని ఇప్పుడు మనుషుల, పశువుల మలమూత్రాలు నాలోనే ఒంపేస్తున్నారు. వ్యాఖ్..! ఒక్కరూ నన్ను ప్రేమగా చూడటం లేదు. ఏం చెప్పను? జన్మ ఎత్తగానే సరిపోతుందా? మంచిగా బ్రతుకు వెళ్ళదీసే మహా అదృష్టం కూడా ఉండాలి.’’ నేను గర్వంగా ఫీల్ అయ్యాను, నేనెంత బలశాలినో గుర్తుచేసుకొని చెరువుని చిన్న చూపు చూసాను. రోజులు గడుస్తున్నాయి, నాకు చాలా ఉత్సాహం పెరిగిపోయింది. ఒకసారి చెరువుతో అన్నాను.. ‘మనమిద్దరం ప్రేమించుకుందామా! పెళ్లి చేసుకుందామా?’ చెరువు నా మాటలకి సిగ్గుపడుతూ ‘‘అంత అదృష్టమా?’’అంటుంది అనుకున్నాను. కానీ బ్రహ్మరాక్షసిలా విరుచుకుపడింది. ఆవేశంతో ఊగిపోయింది. ‘‘బండ వెధవా! ఇన్నాళ్లు ఇరుగు పొరుగుగా ఉన్నామని అరమరికలు లేకుండా మాట్లాడాను. దుర్మార్గుడా! నీ కుటుంబం నాశనం అవుతుంది. దున్నపోతా! నీ మంచితనం అంతా నటనన్నమాట! నీచుడా! నీ తల నిలువునా పగిలిపోనూ! నీదేం జాతి, నాదేం జాతి? కాస్త రంధ్రం దొరికితే మైళ్ళ దూరం పరిగెత్తిపోయే జాతి నాది. కూర్చున్నచోటి నుండి కదలలేని వెధవ్వి నువ్వు! ఖబడ్దార్! కన్నెత్తి చూసావో?’’ అని దులపరించింది. ఆమె అరుపులకి, నా మీదకి విరుచుకుపడిపోతున్న దురుసుతనానికి బిత్తరపోయాను. నా తల మీద విందు చేసుకుంటున్న కాకులు ఆమె అరుపులకి కావ్! కావ్! అని అరుస్తూ ఎగిరిపోయాయి. నేను తల దించుకున్నాను. సిగ్గుపడ్డాను. కొంతమందికి కొన్ని అర్హతలు ఉండవు. అంతే! భగవంతుడు కొంతమంది జీవితాలు శూన్యం చేసి, ఎదురుగా అందమైన ప్రపంచం, చైతన్యం, చూపించి ఏడిపిస్తాడు. నా హృదయం క్రుంగిపోయింది. మనకి ఇష్టం కదా అని, ఎదుటివారి మనసు తెలుసుకోకుండా మాట్లాడితే, అవి ప్రేమవాక్యాలు కాదు, పిచ్చి ప్రేలాపనలు అవుతాయని తెలుసుకున్నాను. ప్రేమ ఒక రోజు నా ఖర్మ కాలింది. ఎవరో డైనమైట్ పెట్టి... ఒకటి కాదు!! రెండు కాదు!! 20 డైనమైట్లు పెట్టి నన్ను నిలువునా పేల్చేసారు. నా శరీరం పేలిపోయింది. సగం శరీరం తునాతునకలైంది. మిగతా సగం శరీరం ఆపిల్ పండుని సగానికి కోసినట్టు, మొండి శరీరం సగం ముక్కగా ఉండి పోయింది. ముష్కరులు అయిన ఈ దుష్టమానవ మూక ఇలా వచ్చి మా వంశం అంతా నాశనం చేసింది.. ఉన్నవాళ్ళలో అర్ధశరీరంతో ఉన్న నేనే పెద్ద దిక్కుని. నా వంశం అంతా కూలిన బురుజులా ఉన్నాయి. వాళ్ళను చితకపొడిచి క్రేన్లతో బుట్టలతో ఎత్తి పడేసి, బర్రున శబ్దం చేస్తూ ట్రక్కులు తీసుకుపోతుంటే నేను వల.. వల.. ఏడ్చాను. ఎంత గొప్ప కుటుంబం నాది! వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం చేస్తున్నాం.. ఈ ముష్కరులైన మానవులు మా మీద పడి మా వునికినే నాశనం చేస్తున్నారు.. మా జాతిని కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇంత చరిత్ర చూసిన పెద్ద మనిషిని కదా! సగర్వంగా చెప్పుకొని చూపించుకునేది పోయి, నన్ను సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నేను కాలానికే గుర్తుని. ఇలా అయితే హైదరాబాదు బాల్డ్ హెడ్ అవుతుంది.. ముష్కరమానవులకి దేని మీదా ప్రేమ లేదు! ప్రాచీనమైన వాళ్ళ భాషనే నాశనం చేసుకుంటున్నారు.. సాంస్కృతిక వారసత్వం అయిన అన్ని కట్టడాలనీ మింగేస్తున్నారు.. ఆధునికత అనే భ్రమశాలి గుండులో పడ్డ ఈగలా మతిపోయినట్టు ఉన్నారు. ఇలా అయితే ఏముంటుంది చరిత్ర? ఏడుపొస్తోంది నాకు. నా శరీరం చూడండి. బలశాలిలా, సూర్యకాంతిలో, చంద్రకాంతిలో నిగనిగ లాడుతూ ప్రేమికులు, మేకలు, కుక్కలు, పిల్లనగ్రోవి వాయించేవాడు నీడ కోసం నా దగ్గరికి రావటం నాకు ఎంత సంతోషమో.. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోతుంటే రెట్టింపు బాధ వేస్తోంది. ఇప్పుడు నా దగ్గరికి ఎవ్వరూ రారు. నేనెప్పుడు ఎవరి మీద పడిపోతానో అని వారికి భయం! ఈ బాధ నేను వెళ్ళబోసుకుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నన్ను చూసి ముసిముసి నవ్వు నవ్వింది.. నా బాధ ఇంకా రెట్టింపు అయింది.. ఓ ముష్కరమానవుడా! మేము ప్రకృతి ప్రసాదించిన జీవితంతో ప్రశాంతంగా.. అమాయకంగా.. మా బతుకులు మేము బతుకుతున్నాం.. మమ్మల్ని మీరు ఇలా మూకుమ్మడిగా మా కుటుంబాలని నామరూపం లేకుండా ఎందుకు నాశనం చేస్తున్నారు? ‘‘అడుగో! అడుగో! వస్తున్నాడు! వచ్చేస్తున్నాడు డైనమైట్ల రాక్షసుడు! వాడి చేతిలో బ్యాగ్ చూసాను.. నా గుండె ఝల్లు మంది. నాకు తెలుసు! నాకు ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి. నేను ఏడుస్తున్నాను..! బిగ్గరగా ఏడుస్తున్నాను..! దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాను.. నా ఏడుపు మీ చెవులకి వినిపిస్తోందా? వినిపిస్తోందా? వినిపిస్తోందా? మా ఊరి గురించి కొన్ని వాక్యాలు... అందరూ మా ఊరి గురించి అడుగుతున్నారు.. మా ఊరు అప్పట్లా లేదు. చాలా మారిపోయింది. మట్టి రోడ్లు పోయి. కంకర రోడ్లు వచ్చాయి. కాలవలో పడవలు పోయి. రోడ్ల మీదికి బస్సులు వచ్చాయి.. ఇంటింటికి కారు.. ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్. నా చిన్నప్పుడు సాయంత్రం అవగానే.. పంచాయితీ నౌకరు ఒచ్చి. ప్రతి వీథిలో ఉన్న దీపస్తంభాలని నిచ్చెనతో ఎక్కి, అందులో దీపం వెలిగించేవాడు. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉండేది నాకు. ఇప్పుడు ఊరంతా. ఇళ్ళంతా కరెంటు లైట్లు. ఏసీలూ, షవర్లూ వచ్చాయి. గుడి పడగొట్టేసి చాలా అందమైన పెద్ద గుడి కట్టారు. లైబ్రరీ పడగొట్టేస్తున్నారు. పొద్దున లేవగానే సన్నటి శబ్దాలు చేసే పిచుకలు ఎప్పుడో అంతరించిపోయాయి. కాకుల గోల తగ్గింది. ఒకటో అరో రామచిలుకలు ఎగురుతున్నాయి. గడ్డి. మట్టి. వాసన పోయింది. చెరువు మెట్లు పాడుబడ్డాయి. చెరువు కళ లేకుండా పోయింది. ఊరిని నూతనతరానికి యౌవనవంతం చేయాలని ప్రజలు చాలా కృషి చేస్తున్నారు. మరికొన్ని మ్యూజింగ్స్ రేపటి సంచికలో... -
ప్రియనేస్తమా!
జీవితంలో అన్నీ అనుభవించాను, మనసు సకల సౌఖ్యాలూ అనుభవించి, పరిపూర్ణమైన విందు భోజనం తిని సంతృప్తిగా, వెనక్కు వాలి, కూర్చున్నట్టుగా ఉంది. ఈ రకమైన జీవితం ఇక చాలు అనుకున్నాను, అన్నీ వదిలి, అందరికీ సెలవు చెప్పి నాకిష్టమైన వానప్రస్థాశ్రమానికి వచ్చేసాను. అక్కడ నా అందమైన కథల పూలతోట నా కోసం ఎదురు చూస్తోంది. ఒక్క క్షణం కళ్ళు తడితో బరువెక్కినాయి. ఇన్నాళ్ళూ నాకు తోడుగా ఉన్న నా ప్రియమైన కథల ప్రపంచం నా కంటే ముందు అక్కడికి వచ్చినట్టుంది. వయోభారంతో తడబడుతున్న అడుగులతో ఆ తోటలోకి వచ్చాను. ఎన్నెన్నో రకరకాల, రంగురంగుల కథల పువ్వులు నా కళ్ళకి కని పించాయి. వాటిని చూడగానే చెప్పలేని ఆనందం! నా మనసుకి పారవశ్యం! ఘుమ ఘుమ సువాసనలు వెదజల్లుతున్న పున్నాగపూల చెట్టు క్రింద ఉన్న ఒక రాయి మీద కూర్చోబోయి, తూలిపడిపోబోయాను. ఇంతలో, ఎవరో నా బుజాలు పట్టి, నేను పడకుండా ఆపి, నన్ను జాగ్రత్తగా రాయి మీద కూర్చోబెట్టారు. నా చేతిని పట్టుకున్న అతని చేతిని చూసాను. ‘‘వృద్ధాప్యానికి యౌవనం ఆసరా ఇచ్చినట్టుగా ఉంది.’’ ‘‘తల్లిదండ్రులు – పిల్లలు’’ఇదేగా అనుబంధం..! తలెత్తి చూసాను, నా ఎదురుగా, దార్ఢ్యవంతుడు, స్ఫురద్రూపి, అయిన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ‘‘అతని కళ్ళలో అపారమైన అనుభవం కనిపిస్తోంది.’’ అతను నిత్యయౌవనుడిలా ఉన్నాడు. ‘‘ఎవరు నువ్వు?’’ – అడిగాను. ‘‘మీ ప్రియమిత్రుడిని!’’– అన్నాడు. ‘‘నేను నిన్ను ఎప్పుడూ చూడలేదే?’’– అన్నాను. ‘‘మీరు నాకు బాగా తెలుసు’’ – అన్నాడు. నేను అతన్ని పరీక్షగా చూస్తూ, ‘‘నేను అన్నీ అనుభవించి, అన్నీ వదులుకుని వానప్రస్థాశ్రమానికి వచ్చాను. ఇక్కడ, నీకేం పని?’’ అని సూటిగా అడిగాను. అతను పక్కనున్న రంగురంగుల పువ్వులబుట్ట తీసుకుని, నా ముందు పట్టుకున్నాడు. పువ్వులు కళకళలాడిపోతున్నాయి, నా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా, చిరునవ్వుతో, నన్ను పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అతను నాతో అన్నాడు, ‘‘మీరు ఇక్కడికి వచ్చేసారు! కథల పూలదండలు గుచ్చి ఆ దేవుడికి అర్పించటమే మీ వృత్తి. వయోభారంతో, మీరు సూదిలో దారం సరిగ్గా ఎక్కించలేరు కదా! సహాయం చేయడానికి భగవంతుడు నన్ను పంపించాడు.’’ నేను అతన్నే చూస్తున్నాను! నా కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లినాయి. అతన్ని అడిగాను, ‘‘నీకు ఇల్లు–వాకిలి, పిల్ల–పాప, ఉద్యోగం–సద్యోగం ఏమీ లేవా?’’ అతను దారం ఎక్కించిన సూది నా చేతికి ఇచ్చాడు. నేనది అందుకోబోయి చేయి తడబడి సూది చురుక్కున వేలికి గుచ్చుకుని, రక్తం వచ్చింది. అతను ప్రేమతో ఆ రక్తాన్ని తుడుస్తూ సూది అందిస్తూ, చిరునవ్వుతో ‘‘అన్నీ ఉన్నాయి, పెద్ద కుటుంబం నాది’’ అన్నాడు.. ‘‘అలాగా బాబూ! చాలా సంతోషం. ఈ రోజుల్లో పెద్ద కుటుంబం బాధ్యతని తీసుకునే యువకులే తక్కువ! నువ్వు వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి.’’ అన్నాను.. ‘‘మీ ఆశీస్సులు నాకు ఆనందం’’అని బుట్టలో ఉన్న రెండు రంగురంగుల కథల పూలు అందించాడు. నేను తలవంచి గుచ్చుతూ, ‘‘నీ పేరేమిటి నాయనా?’’ అని అడిగాను.. ‘‘కాలం’’ అని జవాబు వచ్చింది. నేను ఆశ్చర్యంగా తలెత్తి చూసాను! అతను అక్కడ లేడు. ఒక్క క్షణం ఆలోచించాను, చిన్నగా తలపంకించాను, అవును! అతనికి ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో బాధ్యతలు! ఎంతమందినో చూడాలి! పెద్ద కర్తవ్యమే! నాకు చాలా ఆనందంగా ఉంది, నేను ఒంటరిని కాను, అతను తప్పక నా దగ్గరికి మళ్ళీ వస్తాడు... ప్రియనేస్తమా!! నీ రాక కోసం వేచి చూస్తూ, ఈ కథల దండలు గుచ్చుతూ, నా శేష జీవితం గడుపుతాను, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని కాదు! నాకు నువ్వు ఉన్నావని తెలిసిన తర్వాత, నేను చాలా.. చాలా.. చాలా ఆనందంగా ఉన్నాను! నిశ్చింతగా ఉన్నాను.. నాకు ఆఖరిక్షణం వచ్చి కళ్ళు మూతలు పడుతున్నప్పుడు.. నువ్వు వచ్చి చేతులు చాచి నన్ను అక్కున చేర్చుకుని, సుఖమరణానికి నన్ను జాగ్రత్తగా అప్పగిస్తావు! నీ మీద నాకు నమ్మకముంది.. గులాబి – జీవితం సూర్యోదయంలా ఒక మొగ్గ పువ్వుగా వికసించింది, దాని రెక్కలు సుతి మెత్తగా ఉన్నాయి. దాని వర్ణం గులాబి రంగు. తనకి తానే గులాబి అని పేరు పెట్టుకుంది. చుట్టూవున్న ఈ ప్రపంచాన్ని చూసి అబ్బురపడిపోయింది. ఇదంతా తన ఆనందం కోసమే దేవుడు సృష్టించి ఇచ్చాడని సంబరపడింది. చిరుగాలికి ఊగుతూ ఆత్మానందంతో నాట్యం చేస్తోంది. ఇంతలో ఒక తుమ్మెద వచ్చి దాని మీద వాలింది. పువ్వుని కదలనీయకుండా గుచ్చి పట్టుకుంది. చక్కలిగింతలు పెట్టి నవ్వించింది. తుమ్మెద ఎగిరిపోయింది, పువ్వు నీరసించింది, అయినా ఆ తేనెటీగ తనకి కావాలని ఆశించింది. చుట్టూ వెతికింది. తేనెటీగ ఇంకో పువ్వు మీద వాలి ఆ పువ్వుని నవ్విస్తోంది. గులాబి డీలా పడింది. సాయంత్రం అయింది. గులాబి పూర్తిగా వడిలి పోయింది. అస్తమిస్తున్న సూర్యుడికి చేతులెత్తి మొక్కి ప్రార్థన చేసింది. ‘‘దేవుడా! రేపటికి నువ్వు వచ్చే సమయానికి నేను మళ్ళీ కళకళలాడుతూ ఉండేట్టు చేయి.’’ మర్నాడు మళ్ళీ సూర్యుడు ఉదయించాడు. గులాబి వడిలి పోయింది. రెక్కలు నేలరాలి పోయాయి. తోటమాలి వచ్చి వాటిని ఊడ్చి తీసుకెళ్ళి చెత్తలో పడేసాడు. జీవితంలో ఎంతో కావాలని ఉంటుంది, అంతా మనకు దొరకదు. ఈ గులాబి కథ సమాప్తి అయింది. కథలో నీతి : ఇందులో గులాబి మనిషి! తేనెటీగ మృత్యువు! కాలం తోటమాలి! ఇన్నాళ్ళూ నాకు తోడుగా ఉన్న నా ప్రియమైన కథల ప్రపంచం నా కంటే ముందు అక్కడికి వచ్చినట్టుంది. వయోభారంతో తడబడుతున్న అడుగులతో ఆ తోటలోకి వచ్చాను. ఎన్నెన్నో రకరకాల, రంగురంగుల కథల పువ్వులు నా కళ్ళకి కనిపించాయి. వాటిని చూడగానే చెప్పలేని ఆనందం! నా మనసుకి పారవశ్యం! ఘుమ ఘుమ సువాసనలు వెదజల్లుతున్న పున్నాగపూల చెట్టు క్రింద ఉన్న ఒక రాయి మీద కూర్చోబోయి, తూలిపడిపోబోయాను. దాని వర్ణం గులాబి రంగు. తనకి తానే గులాబి అని పేరు పెట్టుకుంది. చుట్టూవున్న ఈ ప్రపంచాన్ని చూసి అబ్బురపడిపోయింది. ఇదంతా తన ఆనందం కోసమే దేవుడు సృష్టించి ఇచ్చాడని సంబరపడింది. చిరుగాలికి ఊగుతూ ఆత్మానందంతో నాట్యం చేస్తోంది. ఇంతలో ఒక తుమ్మెద వచ్చి దాని మీద వాలింది. పువ్వుని కదలనీయకుండా గుచ్చి పట్టుకుంది. చక్కలి గింతలు పెట్టి నవ్వించింది. తుమ్మెద ఎగిరిపోయింది, పువ్వు నీరసించింది, అయినా ఆ తేనెటీగ తనకి కావాలని ఆశించింది. చుట్టూ వెతికింది. తేనెటీగ ఇంకో పువ్వు మీద వాలి ఆ పువ్వుని నవ్విస్తోంది. గులాబి డీలా పడింది. రేపటి సంచికలో... ప్రేమ... మా ఊరి గురించి కొన్ని వాక్యాలు -
‘యద్దనపూడి’ స్త్రీపాత్రలు..ఆత్మాభిమానానికి ప్రతీకలు
వివేక్‌నగర్ : తెలుగు నవలా సాహిత్యంలో యద్దనపూడి సులోచనారాణిది ఒక శకమని, 1960 నుంచి 80 వరకు రచయిత్రుల స్వర్ణయుగమైతే అందులో ప్రధాన పాత్ర సులోచనారాణి దేనని వక్తలు అన్నారు. ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి సంస్మరణ సభ మంగళవారం సాయంత్రం కళా సుబ్బారావు కళావేదికలో జరిగింది. ఆమె రాసిన ప్రతి నవలా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని రాసిందేనన్నారు. నవలలోని ప్రతి స్త్రీ పాత్ర ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రచయిత్రి డా.వాసా ప్రభావతి çమాట్లాడుతూ సులోచన రచన సున్నితమైన, అందమైన భాషతోపాటు వర్ణనలు నాటి యువతను ఊహాలోకాల్లోకి తీసుకెళ్ళేవన్నారు. రచయిత్రి డా.ముక్తేవి భారతి మాట్లాడుతూ అప్పట్లో సెక్రటరి నవల సంచలనం సృష్టించిదని, సినిమాగా గొప్ప విజయం సాధించిదన్నారు. ఎన్నో నవలలు సినిమా లుగా , టీవీ సీరియల్స్‌గా ప్రజాదరణ పొం దాయన్నారు. సభలో రచయిత్రులు స్వాతి శ్రీపాద, శైలజామిత్ర, కళా జనార్దనమూర్తి. యం.కెరాము, డా.కె.వి.కృష్ణకుమారి, డా. శాస్త్రి, తెన్నేటి సుధాదేవి పాల్గొన్నారు. -
సీల్డ్ కవర్లో....
యద్దనపూడి సులోచనారాణి గారి ‘సెక్రటరీ’ నవల యాభై సంవత్సరాల పండగని తెలుగు పాఠకలోకం జరుపుకుంటున్న సందర్భం అది. అనేక టీవీ చానళ్లు ఆవిడ ఇంటర్వూ్యలను ప్రసారం చేశాయి. ఆ సందర్భంలో ఓ ఇంటర్వ్యూ చివరలో యాంకర్ అడిగారు, ‘‘మేడమ్! మీరు ఎన్నో కథలు, నవలలు రాసారు. వాటి గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ ముగింపుగా మీరో చిన్న కథ చెప్తారా!’’ అని. దానికి సమాధానంగా శ్రీమతి సులోచనారాణి చెప్పిన కథ ఇది : ఒక రచయిత్రి ఉంటుంది. ఎన్నో కథలు, నవలలు రాసింది, రాస్తూ ఉంటుంది. ఆమె తర్వాతి కథ ఎప్పుడు వస్తుందా అని పాఠకులు ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు. ఆమెకు డెబ్భయి ఏళ్లు వచ్చేశాయి. రాస్తూనే ఉంటుంది. అప్పుడేదో చానల్‌వాళ్లు ఇంటర్వూ్య చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు రాయబోయే కథ ఏమిటి అని అడుగుతారు. చెప్తాను. నా పబ్లిషర్ ఎమెస్కో విజయకుమార్ ఉన్నారు కదా! నా చివరి నవల రాసి ఆయనకు ఇచ్చేస్తాను. ఆయన దాన్ని నేను చనిపోయిన తర్వాత ప్రచురిస్తారు. అప్పుడు మీరందరూ చదువుకుందురుగాని; అని చెప్తుందావిడ; నేనేననుకోండి. అయితే ఆవిడ ఆ తర్వాత రెండేళ్లు, మూడేళ్లయినా చనిపోదు, ఇంకా రాస్తూనే ఉంటుంది. ఆమె రాసే కథలు, నవలల్ని మంజుల (మంజులానాయుడు, దర్శక నిర్మాత) సీరియల్స్ తీస్తూనే ఉంటుంది. ఆమె చివరి కథ ఏమిటో అన్న ఆసక్తి జనాన్ని చంపేస్తూ ఉంటుంది. ఈమె చచ్చిపోతేగానీ అది బయటికి రాదాయె. ఆమె ఏమి రాసిందోననే కుతూహలం రోజురోజుకి తట్టుకోలేని స్థాయికి పెరిగిపోయింది. ఇది తట్టుకోలేని ఓ పిచ్చి అభిమాని ఆమెను పొడిచి చంపేస్తాడు. పత్రికల్లో, చానళ్లలో ఆమెకు నివాళులర్పిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, అభిమానులు ఏడుస్తూ ఉంటారు. కన్నీళ్లతో ఎమెస్కో విజయకుమార్ చొక్కా తడిసిపోయి ఉంటుంది. ఇంతలో ఆ అభిమాని వస్తాడు. విజయకుమార్ గారు ఆ కథ బయట పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు విజయకుమార్ తన బీరువా తెరిచి కాగితాల బొత్తుల్లోంచి ఒక కవరు బయటికి తీస్తాడు. కెమెరాలన్నీ దాని మీద ఫోకస్ చేసి ఉంటాయి. అంతా ఉత్సుకతతో చూస్తుంటారు. ఏముంది ఆ కవరులో..... ఏముందనుకుంటూ. విజయకుమార్ కవరు తెరుస్తాడు. అందులో ఒక తెల్లకాగితం ఉంటుంది. ‘నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని మరచిపోతున్నాను, మీరు నన్ను మరచిపోండి!’ అని మాత్రమే ఉంటుందందులో.... ఇలా నేను చేస్తానని కాదు. ఏదో సరదాగా చెప్పాను. నేను వెళ్లిపోయినప్పుడు మీరేమీ చేయవద్దు. సెక్రటరీ చదవండి అంతే. నన్ను మరచిపోతారు అంటూ ఆ ఇంటర్వ్యూని ముగించారావిడ. ఆవిడ మరణవార్త చిరంజీవి శైలు (శైలజ) భర్త రవి నాకు తెలియజేసినప్పుడు ఎందుకో నా మనస్సు మొత్తం ఓ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. నా గుండె ఉనికి గురించి నేనే వెతుక్కున్నాను. నా సంస్థకు వెన్నెముక ఆవిడ. వెన్నెముక లేని మానవశరీరం నిలబడుతుందా అని ఓ భయం, నిటారుగా నించున్న నానుంచి నా వెన్నెముకను తొలగించినట్లు ఓ అనుభూతి. మర్నాడు ఉదయం మీడియాకు ఆ విషయం తెలియజేయటం, ఆ తరువాత హడావిడి కొంచెం తేరుకున్నాక నాకు ఓ విషయం గుర్తొచ్చింది. సులోచనారాణిగారు అమెరికా వెళుతూ నాకో కవరు పంపించారు. దాన్ని మా ఆఫీసులో కుర్రాడు అనిరుధ్ తీసుకువచ్చాడు. అది వచ్చిన రోజు నుండి నేనో వారం రోజులు హైదరాబాద్‌లో లేను. నా భాగస్వామి కుమారుడి వివాహం హడావిడిలో ఫోన్లో అనిరుధ్‌ని అడిగితే మేడమ్ కొన్ని కథలు పంపారు ప్రచురణ కోసం అని చెప్పాడు. ఆవిడ వచ్చాక ప్రచురిద్దాం. చాలాకాలం తరువాత వస్తున్న పుస్తకం కదా మంచి రిలీజ్ ఫంక్షన్ పెట్టొచ్చు అని ఎడిటర్ గారికి చెప్పాను. ఆ కవరుని బీరువాలో దాచమని చెప్పాను. ఈ రోజు ఉదయం (22–5–18) ఆ కవరులో ఏముందా అని తెరిచి చూశాను. పైన ఆవిడ కథలో చెప్పినట్లుగానే నా కన్నీళ్లతో చొక్కా తడిసిపోతోంది. అవి అన్నీ కథలు కాదు. ఆవిడ ఆలోచనలు, అనుభూతులూను. పాఠకులతో పంచుకోవడం కోసం రాసినవి. ప్రియనేస్తమా! అనే పేరున తయారైన ఆ సంపుటిని ఆవిడ నన్ను ఆశీర్వదిస్తూ నాకు, నా అర్ధాంగికి అంకితం ఇచ్చారు. కృతజ్ఞతతో ఆవిడ పాదాలను ముద్దాడాలనిపించింది. ఆవిడ నా ప్రియమైన పాఠకులారా! అని ప్రారంభించి రాసిన ముందుమాటను మీ ముందుంచుతున్నాను.- ఎమెస్కో విజయకుమార్ నా ప్రియమైన పాఠకులారా! నేను నవలలు, కథలు వ్రాయకుండా ఎందుకిలా వ్రాస్తున్నానా.. అని మీరు అనుకోవచ్చు! నా 16వ సంవత్సరంలోనే నేను ‘చిత్రనళినీయం’ అనే కథ వ్రాసినప్పుడు, నా మనసులో ఏ కోర్కెలూ లేవు! కథ వ్రాయటంలోనే నాకు పరిపూర్ణమైన ఆనందం. ఆ ఆనందం కోసమే మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ.. 60 సంవత్సరాల పాటు వ్రాసాను.. ఆనందం పొందుతూనే ఉన్నాను. అదొక చైతన్య జలపాతం! 16 సంవత్సరాల్లో కథలు వ్రాసినçప్పుడు నాకు ఎలాంటి ఆనందం, ఉత్సాహం ఉన్నాయో, ఇప్పుడూ అంతే ఉన్నాయి.. నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని నవలలు, ఇన్ని కథలు వ్రాసినా, నా మనసు కాస్తంత కూడా అలిసిపోలేదు! ఆ జలపాతం సన్నగిల్లలేదు! అదే ఉద్వేగం! అదే చైతన్యం.. 16 సంవత్సరాల వయసులో కంటే 76 సంవత్సరాల ఈ వయసులో నా మనసుకి చాలా పరిపూర్ణత వచ్చింది.. వేల మంది పాఠకులతో నేను కలిసిపోయి, వారి జీవితంలోని సంఘటనలకి స్పందించినçప్పుడు, అవి నా మస్తిష్కంలో ఉన్న భాండాగారంలో నిక్షిప్తం అయి ఉన్నాయి.. వంద సంవత్సరాలు వ్రాయగల కథల వస్తు సామగ్రి నా దగ్గర ఉంది..! కానీ నా శరీరం వయోభారంతో అలిసిపోయింది. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకూ మీకు ఏదో ఒకటి వ్రాసి ఇస్తూనే ఉంటాను. నన్ను చాలామంది ‘‘మృత్యువు’’ గురించి ఎందుకు మాట్లాడతారు అని అడుగుతారు. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికీ ఈ ఆలోచన వస్తుంది. ఇది మన ముందున్న యథార్థం! ఒక నగ్నసత్యం! ఈ నగ్నసత్యం లోకి మనం నిర్వికారంగా, హుందాగా, ఆనందంగా నడిచి వెళ్ళాలి! నేను లెక్కచూసుకున్నాను.. అయిన వారంతా... అమ్మా–నాన్నా, అక్కయ్యలు–బావలు, అన్నయ్యలు–ఒదినలు, పిన్నులు–పినతండ్రులు, మేనత్తలు– మేనమామలు. ఎందెందరో బంధుజనం.. అందరూ పోయారు. నా వృత్తిలో ముఖ్యమైన శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ రామానాయుడు గారు, శ్రీ మధుసూదనరావు గారు, శ్రీ ఎల్వీ ప్రసాద్ గారు, ఇంకా పత్రికాధిపతులు, పబ్లిషర్స్, కొంతమంది ప్రియమైన పాఠకులు, అందరూ వెళ్ళిపోయారు.. నేను వెళ్ళిపోవాల్సిన సమయం వస్తోందని నాకు బాగా తెలుసు! నాకు ఎప్పుడు ఏది అనిపిస్తుందో అది మీ ముందు పెడుతున్నాను. నా ఆలోచనలు పంచుకునే నా ప్రియనేస్తాలు మీరు! ఇప్పుడు నేనేదైనా వ్రాసిస్తే అది మీలో ఉన్న ఆ భగవంతుడికి అక్షరార్చనగా భావిస్తాను! ఈ వయసులో ఇంత ప్రశాంతంగా నేను మీకోసం ఈ భావపుష్పాలని మాలగా అల్లడం నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నది. సెలవా మరి! యద్దనపూడి సులోచనారాణి రేపటి సంచికలో... ప్రియనేస్తమా! గులాబీ జీవితం -
నవలా రాణి ఇక లేరు
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ/ కాజ (కూచిపూడి): సాహితీ సుమం నేలరాలింది. 2 దశాబ్దాల పాటు ఆధునిక తెలుగు నవలా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి, తన రచనలతో నవలా ప్రేమికులను ఉర్రూతలూగించిన సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తె వద్ద ఉన్న ఆమె శుక్రవారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఆమె భర్త యద్దనపూడి నరసింహారావు కొంతకాలం క్రితమే చనిపోయారు. కూతురు శైలజ, అల్లుడు రవి, మనవడు హర్ష కాలిఫోర్నియాలో ఉంటున్నారు. పంజగుట్టలో నివాసం ఉంటున్న సులోచనారాణి గత ఫిబ్రవరి 12వ తేదీన కుమార్తె వద్దకు వెళ్లారు. రెండు, మూడురోజుల్లో హైదరాబాద్ రానున్నట్లు ఈ నెల 16వ తేదీన పనిమనిషి రత్నమ్మకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఆ తరువాత రెండురోజులకే శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కాలిఫోర్నియాలోనే ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు. ఆమె మృతి వార్త తెలిసి సాహితీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు యద్దనపూడి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఆణిముత్యం సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో నెమలికంటి వెంకట చలపతిరావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. కాజ హైస్కూల్లోనే ఎస్ఎల్సీ వరకు చదివారు. అనంతరం జుజ్జూరు గ్రామానికి చెందిన యద్దన పూడి నరసింహారావుతో వివాహమై హైదరాబాద్ తరలివెళ్లారు. అనంతర కాలంలో నవలా రచయిత్రిగా ఎదిగారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు దాదాపు 80 నవలలు రాసి తెలుగు సాహితీలోకంలో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె మృతితో స్వగ్రామం కాజలో విషాదం నెలకొంది. స్వర్ణోత్సవం జరుపుకున్న సెక్రెటరీ 1966లో ఆమె రాసిన సెక్రటరీ నవల ఓ మధుర కావ్యంలా నిలిచి 2016లో స్వర్ణోత్సవం జరుపు కుంది. ఇప్పటిదాకా 100కు పైగా ముద్రణలు పొంది లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. జీవితంలో ప్రతి అబ్బాయి రాజశేఖరంలా, ప్రతి అమ్మాయి ఆత్మాభిమానం కలిగిన ఒక జయంతిలా ఉండాలను కొనేవిధంగా ఎంతో గొప్పగా ఆ నవలను యద్ధనపూడి చిత్రీకరించారు. ఈ నవల సినిమాగా కూడా వెలువడి ప్రేక్షకులను కట్టిపడేసింది. మరో నవల ‘మీనా’ పత్రికలో ధారావాహికగా వచ్చింది. ఆ నవలకు పేరును పాఠకులే నిర్ణయించారు. 1973లో విజయ నిర్మల దర్శకత్వం వహించడమే కాకుండా తానే హీరోయిన్గా నటించి తీసిన ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించింది. లక్షలుగా మారిన అక్షరాలు తెలుగు నవలా సాహిత్యాన్ని శాసిం చిన యద్దనపూడి అక్షరం.. లక్షలై పబ్లిషర్స్, సినీ నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. సినీ నటులు అక్కినేని, వాణిశ్రీ, శోభన్‌బాబులు అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడింది. ఆమె రచించిన నవలలన్నీ దాదాపు విజయవాడలోనే ముద్రితమయ్యాయి. నవభారత్, నవోదయ, అరుణా పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో సంస్థలు వాటిని ప్రచురించాయి. 2015 సంవత్సరంలో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో తుళ్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి చేతుల మీదుగా హంస పురస్కారం అందుకున్నారు. మహిళల ఆత్మాభిమానానికి ప్రతిబింబం యద్ధనపూడి సాహితీ ప్రస్థానం చిత్ర నళినీయం అనే కథతో ప్రారంభమైంది. ఆమె తొలిరచనలు ముక్కామల నాగభూషణం సారథ్యంలో నడిచిన ప్రగతి అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. పక్కా పల్లెటూరిలో పుట్టిన ఓ సగటు అమ్మాయి...తను రాసిన తొలి కథకు ఆంధ్రపత్రిక నుంచి 15 రూపాయలు పారితోషికం వస్తే మురిసిపోయిన పదహారేళ్ల పడుచుపిల్ల... తదనంతర కాలంలో కోట్లాదిమంది తెలుగు ప్రజల అభిమాన రచయిత్రిగా ఎదిగింది. ఆమె నవలా నాయికలు ఆత్మాభిమానం కల మధ్యతరగతి మహిళలు. ఒక పరిపూర్ణమైన, స్వతంత్ర వ్యక్తిత్వం గల మహిళలను ఆమె ఆవిష్కరించారు. వారి మనస్తత్వాన్ని, ఆలోచనలు, ఆకాంక్షలను, వారిలోని సంఘర్షణను తన నవలల్లో సమున్నతంగా తీర్చిదిద్దారు. పత్రికల్లో నవలలు సీరియళ్లుగా వెలువడుతున్న రోజుల్లో మహిళలంతా ఒక చోట గుంపుగా చేరి ఆ వారం సీరియల్‌ను ఒకరు చదువుతుంటే మిగతావాళ్లు చుట్టూ చేరి వినేవారంటే అతిశయోక్తి కాదు. ప్రతిభావంతమైన శైలి, మధ్యతరగతి జీవితాన్ని, కుటుంబ సంబంధాలను ప్రతిబింబించే కథనాలు మహిళలనే కాదు.. యావత్ తెలుగు సాహితీలోకాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 1970 నుంచి 1990 వరకు సులోచనారాణి సాహిత్యం బాగా ప్రభావితం చేసింది. సెక్రటరీ, మీనా, జీవన తరంగాలు, అమ్మానాన్న, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విజేత, ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ,జై జవాన్, కాంచనగంగ, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, ప్రేమ పీఠం, బహుమతి, మౌన పోరాటం, మౌనభాష్యం, శ్వేత గులాబి తదితర మరెన్నో నవలలు తెలుగు పాఠకులు మరిచిపోలేని జీవన దృశ్యాలు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం యద్దనపూడి సులోచనారాణి మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతివృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకతను, సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, యద్దనపూడి సులోచనారాణి ఆకస్మిక మృతి బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. యద్దనపూడి మృతికి వైఎస్ జగన్ సంతాపం యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. యద్దనపూడి తెలుగు పాఠక లోకాన్ని, నవలా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేశారని జగన్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. తీరని లోటు: ఎమెస్కో విజయ్ కుమార్ మానవ సంబంధాలను, మానవ వైరుధ్యాలను సున్నితంగా చిత్రించిన గొప్ప రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. ఆమె మరణం తెలుగు సాహితీ లోకానికి, ప్రత్యేకించి ఎమెస్కోకు తీరని లోటు. ఆమె గొప్ప కరుణామయి: వంశీ రామరాజు వంశీ సంస్థతో యద్దనపూడి సులోచనరాణిది విడదీయరాని అనుబంధం. ఆమె గొప్ప కరుణామయి. అనాథలకు, వృద్ధులకు ఎంతో సాయం చేసేవారు. ప్రముఖుల సంతాపం యద్దనపూడి మృతి పట్ల తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ రచయిత్రి వాసా ప్రభావతి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
సహృదయ సామ్రాజ్ఞి!
దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు తెలుగు పాఠక లోకాన్నేలిన హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూశారు. తన చుట్టూ ఉన్న... తనకు తెలిసిన మధ్య తరగతి కుటుంబాల్లోని జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఆ జీవితాల్లో మనుషుల మధ్య ఏర్పడే అనుబంధాలనూ... ఆ అనుబంధాల్లోని సున్నితత్వాన్ని, వారి ఆశలనూ, ఆకాంక్షలనూ, కలల్ని అద్భుతంగా చిత్రించిన ప్రతిభాశాలి ఆమె. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని వయసులో ఆమె రాసిన తొలి కథ ‘చిత్ర నళినీయం’ ‘ఆంధ్రపత్రిక’ వీక్లీలో అచ్చయినప్పుడు ఇంట్లో వాళ్లూ, ఊళ్లోవాళ్లూ సులోచనారాణిని చూసి గర్వపడ్డారట. ‘సెక్రటరీ’తో మొదలుపెట్టి సులోచనా రాణి రాసిన దాదాపు 70 నవలలు తెలుగు సమాజంలోని ఆడపిల్లలకు అలాంటి గర్వాన్నే కలిగించాయి. ఎందుకంటే ఆ నవలల్లోని ఆడపిల్లలు భయంగా, బేలగా ఉండరు. తమకేదో అన్యాయం జరిగిందని శోకిస్తూ కూర్చోరు. వారు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనేవారే కావొచ్చుగానీ... ఉన్నతమైన వ్యక్తిత్వంతో, నిండైన ఆత్మాభిమానంతో మెలగుతారు. ఆ ఆత్మాభిమానాన్ని లేదా ఆత్మ గౌరవాన్నీ దెబ్బతీయడానికి జరిగే చిన్న ప్రయత్నాన్నయినా నిలదీసే మనస్తత్వంవారిది. ఆ ఆడపిల్లలు మాటకారులు. స్వతంత్రంగా ఆలోచిస్తారు. సొంతంగా ఎదగాలని చూస్తారు. తెలివి తేటల్ని ప్రదర్శిస్తారు. ఎవరి దయాదాక్షిణ్యాలకూ ఎదురుచూడరు. అలాగని వారు చలం రచనల్లోని స్త్రీల మాదిరి సమాజం, కుటుంబం విధించిన కట్టుబాట్లను ప్రశ్నించే రకం కాదు. వాటిని ఛేదించేంత సాహసం చేయరు. బహుశా సులోచనా రాణి నవలల్లోని ఈ లక్షణాలే లక్షలాదిమంది మధ్య తరగతి మహిళలను, యువతులను ఆమె రచనలవైపు ఆకర్షించేలా చేశాయి. ఆమె నవలల్లోని కథా నాయకులూ అంతే. వారు పురుషాధిక్యతను ప్రదర్శించరు. ఆడవాళ్లను అణిచేయాలనే మనస్తత్వంతో ఉండరు. వారిని తక్కువ చేసి మాట్లాడరు. ఆడపిల్లల వ్యక్తిత్వాలను గౌరవించడం, వారితో ప్రేమగా మెలగడం... పొరబాటున మనసు కష్టపెట్టానని అనిపించినా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా క్షమించమని కోరడం ఆ కథానాయకుల వ్యక్తిత్వం. మనలాంటి అసమ సమాజంలో, కుటుంబాల్లో ఇలాంటి లక్షణాలున్నవారు దుర్భిణి వేసి గాలించినా కనబడరన్న విమర్శల్లో అవాస్తవమేమీ లేదు. కానీ స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి సంబంధాలుండాలని... అచ్చం ఇలాగే సమాజం ఉంటే ఎంతో బాగుంటుందని ప్రగాఢంగా కోరుకునే మధ్యతరగతి మహిళల, యువతుల ఆకాంక్షలకు సులోచనారాణి అద్దం పట్టారు. అందుకే వారికి ఆమె అంతగా చేరువయ్యారు. ఆమె నవలల్లోని పాత్రలు ఎదుటివారితో సంఘర్షించవు. అంతస్సంఘర్షణకు లోనవుతాయి. ఆ క్రమంలో తమను తాము తీర్చిదిద్దుకుంటాయి. ఎదుటివారిలో మార్పు తెస్తాయి. ఆమె నవలలు సీరియల్‌గా వస్తున్న కాలంలో మధ్యతరగతి కుటుంబాల మహిళలు, యువతులు మరుసటి వారం గురించి ఆత్రంగా ఎదురు చూసేవారట. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయంలో రకరకాలుగా చర్చించుకునేవారట. కుటుంబమే సర్వస్వంగా భావిస్తూ పొద్దు పొడిచింది మొదలు పొద్దు గడిచేవరకూ దానికోసమే అంకి తమవుతూ...తీరిక చిక్కితే పురాణగాథలు, పిచ్చాపాటీలతో కాలక్షేపం చేసే మహిళలంతా సులోచనారాణి రచనలతో ఇటు మళ్లారని చెబుతారు. దశాబ్దాలపాటు కొన్ని తరాలపై ఒక రచయిత ఇంతగా ప్రభావాన్ని చూపగలగటం ఎంతో అరుదైన విషయం. సులోచనారాణి ఆ ఘనత దక్కించుకున్నారు. ఆ కాలంలో యద్దనపూడితో పాటు అనేకమంది మహిళలు తెలుగు నవలను సుసంపన్నం చేశారు. ఇల్లిందల సరస్వతీ దేవి, డాక్టర్ పి. శ్రీదేవి, మాలతీ చందూర్, తెన్నేటి హేమలత, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, కోడూరి కౌసల్యాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, సి. ఆనం దారామం వంటి అనేకులు నవలా రంగంలో అప్పట్లో సుప్రసిద్ధులు. వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదంటే చాలామంది పురుష రచయితలు సైతం మహిళల పేరుతో రాయకతప్పని స్థితి ఏర్పడింది. మహిళా రచయితల్లో ఇతరుల కంటే ఎక్కువగా యద్దనపూడి రచనలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించాయి. అప్పటివరకూ కథల కోసం బెంగాలీ అనువాద సాహి త్యంవైపు, బెంగాలీ చిత్రాలవైపూ చూసే అలవాటున్న చిత్రపరిశ్రమను... కొత్త దృక్పథంతో, కొత్త ఆలోచనలతో మధ్య తరగతి జీవితాలను ప్రతిభావంతంగా, ఆకర్షణీయంగా చిత్రిస్తున్న యద్దనపూడి రచనలు సహజంగానే ఆకట్టుకున్నాయి. డాక్టర్ పి. శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ రూపుదిద్దుకుంటుండగా అనుకోకుండా ఆ రచయిత్రి కన్నుమూసినప్పుడు ఆ లోటును పూడ్చడం కోసం యాదృచ్ఛికంగా యద్దనపూడి సినీ రంగంవైపు వచ్చారు. ఆ తర్వాత ఆమె రచించిన ‘మీనా’, ‘సెక్రటరీ’, ‘జీవనతరంగాలు’, ‘చండీప్రియ’, ‘ఆత్మీయులు’ వంటి సుప్రసిద్ధ నవలలెన్నో చలనచిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే యద్దనపూడి పాఠకులు ఆ చలనచిత్రాలతో ఏనాడూ పూర్తిగా సంతృప్తిపడిన దాఖలాలు లేవు. వెండితెరపై సమ్మోహనపరిచే దృశ్య కావ్యాలకన్నా ఆమె రచనల్లోని నాటకీయత, సంభాషణలే వారిని బాగా ఆకట్టుకునేవి. నవలారంగం నుంచి సినీ మాధ్యమానికీ...అక్కడి నుంచి టెలివిజన్ రంగానికీ వచ్చి అన్నిచోట్లా సమానంగా మన్ననలు పొందిన ఏకైక రచయిత్రి బహుశా యద్దనపూడే కావొచ్చు. దాదాపు నూటయేభై ఏళ్లక్రితం పుట్టిన తెలుగు నవల ఎన్నో పోకడలకు పోయింది. ఈ క్రమంలో వచ్చిన పాపులర్ నవలా ప్రపంచంలో యద్దనపూడి సులోచనారాణి తనదైన ముద్ర వేసి అగ్రగామిగా నిలిచారు. స్త్రీ, పురుష సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుని...తన రచ నల ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించిన సులో చనారాణి రాగలకాలంలో సైతం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. -
ఒక రాణి
అనగనగా ఒక రాణిఅనగనగా ఒక నవలఅనగనగా ఒక రాజ్యం.సులోచన.. నవలా రాణి నవలా రాజ్యంలో రాణించిన రాణినవలా ప్రియుల హృదయాలను ఏలిన రాణిఒకే ఒక రాణి. యద్దనపూడి సులోచనా రాణి! కథ ఎలా చెప్పాలో తెలిసిన రచయిత్రి తెలుగు సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు పాపులర్ రచయితలంటే కించిత్ అసహనం, చాలా అవహేళన. కనక వారి రాతల్లో యద్దనపూడి సులోచనారాణికి స్థానం ఉండకపోవచ్చు. సదసద్వివేచన చేయగల కొందరు విమర్శకులు, సజీవమైన పాత్రలను సృష్టించినందుకు, తెలివైన, స్వయం నిర్ణాయక శక్తిగల స్త్రీపాత్రలను సృష్టించినందుకు, పురుషులలో పుణ్యపురుషులను చిత్రించినందుకూ, ఒక నవలలో కథ ఎలా చెప్పాలో చూపించినందుకు, తెలుగుభాషను ఎంత సొగసుగా వాడవచ్చో నేర్పినందుకు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. మహిళా పాఠకులను పెంచిన రచయిత్రిగా, ఎన్నిసార్లు ప్రచురింపబడ్డా క్షణాల్లో అమ్ముడుపోయే నవలల రచయిత్రిగా ప్రచురణకర్తలు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా తమకు తరాల తరబడి ఆనందాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగించడంతో పాటు, తమలాంటి వ్యక్తులు ఎలా ఉండవచ్చో చూపినందుకు పాఠకులు ఆమెను కలకాలం గుర్తుంచుకుంటారు. సులోచనారాణి నవలల్లో ఆమె చుట్టూ ఉన్న సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాలుంటాయి. వాటిలోంచి, మట్టిలో మాణిక్యాల్లా నాయికా నాయకులు స్వంత వ్యక్తిత్వంతో ప్రకాశిస్తూంటారు. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండేందుకు కొంత స్నేహం, కొంత అవగాహన, కొంత ప్రేమ, కొంత గౌరవం ఉంటే చాలని నిరూపించే పాత్రలివి. అది కూడా మన జీవితాల్లో లేనందువల్లనేమో అవి స్వాప్నిక పాత్రల్లా, ఆమె కథలు భావకవుల కోవలో ఆకాశంలో విహరించేవిగా చాలామందికి తోచాయి. ఆమె పూర్తిగా నేలవిడిచి సాము ఎప్పుడూ చెయ్యలేదు. ఆ మాటకొస్తే అడవి బాపిరాజు, కోడూరి కౌసల్యాదేవి వంటి వారి నవలలతో పోల్చినపుడు వాస్తవికతకు ఆమె పాత్రలు ఎంత సన్నిహితంగా ఉంటాయో అర్థమవుతుంది. రచనా విధానానికి వస్తే, అందులో ఆమెతో పోటీ పడగలవాళ్లు అతి తక్కువ. కథనంలోనూ, సంభాషణలోనూ, ఉత్కంఠ రేకెత్తించడంలోనూ, కథను ముగించడంలోనూ ఆమెది అసాధారణ ప్రతిభ. ఆమె నవలలు సీరియల్స్‌గా వస్తున్నప్పుడు ఎక్కడ పూర్తవుతాయో అని వ్యాపార దృష్టితో సంపాదకులు, రచనాసక్తి దృష్టితో పాఠకులు బెంగపెట్టుకునేవారు. అంత పఠనీయత ఉన్న రచన ఆమెది. ఇక వ్యక్తిగా సులోచనారాణికి నేనెరిగిన ఏ సాహితీవేత్తా సాటిరారు (నాకు చాలామంది సాహితీవేత్తలు వ్యక్తిగతంగా కూడా తెలుసు). తనొక గొప్ప రచయిత్రిననీ, ఆంధ్ర పాఠకుల హృదయరాణిననీ ఆమెకు స్పృహ ఉన్నట్టే అనిపించేది కాదు. తోటి రచయితల గురించి ఒక్క పరుష వాక్కూ ఆమె పెదవులపై ఏనాడూ కదలలేదు. తన అభిమానుల పట్ల చులకన గానీ, విసుగు గానీ ఏనాడూ కనిపించలేదు. రెండు గంటలు సంభాషణ జరిపినా తన రచనల గురించి, తనకున్న కీర్తి ప్రతిష్టల గురించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడకపోవడం నాకు అనుభవం. మనం ప్రస్తావిస్తే తప్ప తన గురించి తాను చెప్పుకునే అలవాటు లేదు. అప్పుడు కూడా చాలా తక్కువ విషయాలే చెప్పేవారు. ఈనాటి రచయితలు ఆమెను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మంచి రచయితకు ఆత్మస్తుతి, పరనింద అవసరం లేదనీ, ప్రతి వాక్యం ముందూ ఎవరేమనుకుంటారో భయపడాల్సిన దుస్థితి లేదనీ, రాసిన ప్రతి అక్షరానికీ తక్షణ స్పందనలూ, మెప్పుదలలూ, అవార్డులూ ఆశించనవసరం లేదనీ, తమకొక ముఠా ఏర్పరచుకుని వాళ్ల కోసమే రాయాల్సిన పని లేదనీ... ఇవన్నీ ఆమెను చూసి నేర్చుకోవచ్చు. తన అనంతరం కూడా మనం చదువుకుందుకు, దాచుకుందుకు, మళ్లీ మళ్లీ చదువుకుని ఆనందించేందుకు కావలసినన్ని నవలలు మనకు వదిలి, ఎప్పుడూ ప్రశాంతతను కోరుకునే ఆ మనసు ఈనాడు శాశ్వత ప్రశాంతిలోకి జారిపోయి విశ్రమిస్తున్నందుకు ఒక రకంగా ఆనందిస్తూ, మా ఇద్దరి మధ్యా ఎన్ని రకాల వ్యత్యాసాలున్నా, గత పదిహేనేళ్లుగా నాకు ఎంతో ఆప్తురాలిగా ఉంటూ వచ్చిన సులోచనారాణి గారిని వదలలేకపోతున్నందుకు దు:ఖిస్తూ... - మృణాళిని గంట చదువు రేపటికి ప్రేరణ సాహిత్యాన్ని పాఠకులకు అత్యంత చేరువగా తీసుకెళ్ళిన సాహితీ దిగ్గజం యద్దనపూడి సులోచనారాణి. ఆనాటికీ, ఈనాటికీ ఏనాటికీ యావత్ ఆంధ్రుల అభిమాన రచయిత్రి కేవలం ఆమే అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ప్రసార మాధ్యమాలేవీ లేని ఆ రోజుల్లో పుస్తకాలు మాత్రమే కాలక్షేపం అవటంతో... ఆనాటి మహిళలు ఎందరో తమ రోజువారీ ఇరవై నాలుగ్గంటల సమయంలో వారికి దొరికే ఒక్కగంట ఖాళీ సమయంలో యద్దనపూడి సీరియల్ చదువుకోవటానికి మిగతా ఇరవైమూడు గంటలూ ఎంత కష్టమైన ఇంటిపనినైనా ఎంతో ఇష్టంగా చేసుకునేవారంటే పాఠకుల హృదయాల్లోకి ఎంతగా వీరి రచనలు చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. నిజమే, ఒక రాజశేఖరంలో తన కలల రాకుమారుణ్ణి చూసుకునేది ఆనాటి మధ్యతరగతి స్త్రీ. ఒక జయంతిలో తనను చూసుకుని పెద్ద పడవ లాంటి కారులో రాజశేఖరం పక్కన కూర్చుని ఏ టీ ఎస్టేటుల్లోనో విహరించేది. చిన్నిచిన్ని కలహాలూ, కలతలూ తాత్కాలికమనీ, ఆలుమగల మధ్య అనురాగాన్ని నింపేవి, మరింతగా పెంచేవీ ఆ చిరుకలహాలేననీ మధ్యతరగతి ప్రజానీకం మనసుల్లో బలంగా నాటుకుపోయే రీతిలో తన రచనా వ్యాసంగం సాగించి కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఒక రచయిత్రిగా తన వంతు పాత్ర పోషించారు యద్దనపూడి. రచనల్లో వారి చిత్తశుద్ధి, నిజ జీవితంలో ఆవిడ నిరాడంబరత్వం ఎందరికో ఆదర్శం. సన్మానాలూ, సత్కారాలంటే ఇష్టపడని సులోచనారాణి ఇటీవలి కాలంలో ఇంటర్వ్యూలకు కూడా పెద్దగా సుముఖత చూపక పోవటానికి కారణం ‘చాలు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను. ఎన్నో అవార్డులు, అభినందనలు, సత్కారాలూ పొంది నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇక చాలు, ఆశకు అంతేముంది’ అన్నమాటలు ‘ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం కాదు. ఎక్కడ ఆపాలో తెలియటం ముఖ్యం’ అన్న పెద్దల మాటను నిజం చేస్తాయి. మధ్య తరగతి జీవితాల్లోని అనేక అంశాలను ఆమె తమ రచనల్లో ప్రస్తావించేవారు. తను చూసిన, స్వయంగా పరిశీలించిన అనేక జీవితాలు ఆమె కథావస్తువులు. మధ్యతరగతి ఆడవాళ్ల మనస్తత్వ చిత్రణ, వారి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, చిలిపితనం, కోపం, అభిజాత్యం... భార్యాభర్తల మధ్య ప్రేమలూ, అలకలూ, కుటుంబాల్లో వచ్చే ఇబ్బందులూ ఇవన్నీ వస్తువులే వారి సాహిత్యంలో.‘ఒక్క కథో కవితో రాసి ఏ అవార్డ్ వస్తుందా? అని వీధిలో నిలబడి ఎదురుచూడవద్దు. పుస్తకాలతో పాటు వ్యక్తుల్ని, వ్యక్తుల జీవితాలను చదువు. సమాజాన్ని నువ్వెప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావో అప్పుడే నీనుండి ఒక మంచి రచన జీవం పోసుకుంటుంది’ అని చెప్పేవారు. ఒక మామూలు పల్లెటూరిలో పుట్టిన నేను వారి రచనలకు ప్రభావితమై జీవితంలో ఒక్కసారన్నా సులోచనారాణిని దూరంనుండైనా చూడగలనా అనుకునేదాన్ని. కలవాలంటే ఏం చెయ్యాలో తెలియలేదు. నాకు నేనే ఆలోచించుకుని రచనలు చెయ్యటం ఒక్కటే మార్గం, అది కూడా కుటుంబ, సమాజ సంబంధ బాంధవ్యాలను పెంపొందించే రచనలు చెయ్యాలనే సంకల్పంతో కలంపట్టిన ఏకలవ్య శిష్యురాలను యద్దనపూడి గారికి నేను. అలా కొంతవరకూ రచనలు చేసి హైదరాబాద్ వచ్చాకా లేఖిని సాహితీ సంస్థలో చేరటం ద్వారా ఆ సంస్థకు గౌరవాధ్యక్షురాలైన ఆమెను అతి సమీపంగా చూసినప్పటి మధుర క్షణాలను మరువలేను. నా మొదటి కథల సంపుటి ‘జీవనశిల్పం’కు ముందుమాట రాయమని అభ్యర్థిస్తే ‘రాయకూడదనే అనుకున్నాను. కానీ నీ కథలంటే ఉన్న ఇష్టంకొద్దీ ముందుమాట రాస్తా’నన్నారు. ‘‘నీ ‘ప్రభవించిన చైతన్యం’ నాకు నచ్చింది. మా అమ్మపేరుతో ప్రతిఏటా నేను ఇచ్చే అవార్డును నీకు ప్రకటిస్తున్నాను’’ అన్నారు. పల్లెలో పుట్టి, వారిని చూడటమే ధ్యేయంగా ప్రణాళిక వేసుకుని రచనలు ప్రారంభించి ఆ సాహిత్య వంతెన ద్వారా ఆమెని చూడగలిగిన నాకు ఇంతకంటే పెద్ద అవార్డ్ ఏముంటుంది? అది నా అదృష్టంగా భావించాను. ప్రేమికులు తమ ఆలోచనలను పంచుకునే ఒక అద్భుత వేదికగా నౌబత్ పహాడ్‌ను, ట్యాంక్‌బండ్‌ను తన రచనల్లో చూపిస్తూ పాఠకులను ఆయా ప్రాంతాల్లో విహరింపచేశారు కళ్లకు కట్టినట్లుండే తమవర్ణనలతో. ఎన్నో సమావేశాలకు వారిని నా కారులో తీసుకెళ్లే సందర్భంగా ‘నీ డ్రైవింగ్ నాకిష్టం. మళ్ళీ చాలా రోజుల తర్వాత వెన్నెల రాత్రులందు హుస్సేన్ సాగర్ని చూడాలనీ, నౌబత్ పహాడ్ ఎక్కి కబుర్లు చెప్పుకోవాలనీ ఉంది. నన్ను తీసుకెళ్లవూ’ అన్న వారి కోరిక కార్యరూపం దాల్చకముందే వారు స్వర్గస్తులవటం దైవ నిర్ణయం. - కన్నెగంటి అనసూయ పాఠకాదరణ పొందిన యద్దనపూడి నవలలు ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, బహుమతి, బందీ, బంగారు కలలు, చీకట్లో చిరుదీపం, దాంపత్యవనం, హృదయగానం, జాహ్నవి, జలపాతం, జీవన సత్యాలు, జీవన సౌరభం, జీవన తరంగాలు, జీవనగీతం, జ్యోతి, కలల కౌగిలి, కీర్తి కిరీటాలు, కృష్ణలోహిత, మధురస్వప్నం, మనోభిరామం, మౌనభాష్యం, మౌన తరంగాలు, మీనా, మోహిత, మౌనపోరాటం, నీరాజనం, నిశాంత, ఒంటరి నక్షత్రం, పార్థు, ప్రేమదీపిక, ప్రేమలేఖలు, ప్రేమపీఠం, ప్రేమ సింహాసనం, ప్రియసఖి, రాధాకృష్ణ, రుతువులు నవ్వాయి, సహజీవనం, సంసార రథం, సౌగంధి, సెక్రటరీ, సీతాపతి, స్నేహమయి, సుకుమారి, శ్వేత గులాబీ. ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు ∙మీరెక్కువగా ఏం పుస్తకాలు చదివేవారు? యద్దనపూడి: చిన్నప్పుడు మా ఊర్లో మంచి గ్రంథాలయం ఉండేది. అందులో ఫేమస్ ఇంగ్లీష్ నవలల అనువాదాలు, శరత్, టాగూర్ పుస్తకాలు చదివాను. నా ఫస్ట్ కథ పబ్లిష్ అయింది 1956లో. నాకు ఇష్టమైన రచయితలు ఒక్కరంటూ లేరు. వాళ్లలో బెస్ట్ తీసుకుంటుంటాను. ఆస్కార్ వైల్డ్ ‘యాన్ ఐడియల్ హజ్బెండ్’లోని పంచ్ లైన్స్ ఇష్టం. బాపిరాజు ‘నారాయణరావు’, ‘గోన గన్నారెడ్డి’ ఇష్టం. శరత్ రచనల్లోని డెలికసీ ఇష్టం. కానీ ఆ మగాళ్లు అసలు నచ్చరు. దేవదాసు నవలను రాసిన విధానం ఇష్టం. కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, ప్రియురాలిని కాపాడలేని వాడివి తాగి చచ్చిపోతే ఎవడికి అట. ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు. మీ రచనల ద్వారా మీ అభిమానులకు చాలా రకాల ఆలోచనలు, భావాలు పంచారు. మీ జీవిత తాత్వికత ఏంటి? లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నేనుగా బతికాను. నాకు మనుషులు కావాలి. కార్లు, బంగ్లాలు అవసరం లేదు. సింపుల్‌గా ఉండాలి. చెత్తబుట్ట, చనిపోయిన మనిషి ఒకటే. నువ్వూ ఏదో ఒకరోజు చెత్తబుట్ట అవుతావు. సుఖాలు అనుభవించు, తప్పులేదు. ఇతరులను ఇబ్బంది పెట్టకు. ఈ క్రమంలో జీవితాన్ని కోల్పోవద్దు. (యద్దనపూడి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లోంచి)యద్దనపూడి నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు రూపొందాయి. అందులో కొన్ని... జై జవాన్, మీనా (అఆ), జీవన తరంగాలు, సెక్రటరీ, విజేత, అగ్నిపూలు, గిరిజా కల్యాణం, రాధా కృష్ణ, ఆత్మగౌరవం, బంగారు కలలు, ప్రేమలేఖలు, చండీప్రియ. నా కలలను మేల్కొలిపారు నేను చదువుకునే రోజుల్లో ‘విజేత’ నవల నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఆమె పుస్తకాలే నాలో ఒక కారు, ఇల్లు కొనుక్కోవాలనే కలలను మేల్కొల్పాయి. ఇప్పుడే కాదు, నేను చాలా ఇంటర్వ్యూల్లో చెబుతున్నాను. హీరో అంటే ఇలా ఉండాలి, వ్యక్తిత్వం అంటే ఇదీ అనే విషయాలు ఆమె వల్లే తెలిశాయి. సాహిత్యంలో విశ్వనాథ అటువైపైతే, సులోచనారాణి ఇటువైపు. ఆయనది నారీకేళపాకం, ఈమెది ద్రాక్షపాకం. ఆయనది అర్థం చేసుకోవడం కష్టం. ఈమెది సులువుగా జీర్ణమౌతుంది. నాకు ఇద్దరూ ఇష్టమే. ఇంటికెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నా నేను ఆమె అభిమానిని. సెక్రటరీ నవల ఎన్నిసార్లు చదివానో చెప్పలేను. 1970ల్లో నవల కాపీ తీసుకుని ఎర్రమంజిల్ కాలనీలో వున్న ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ‘మల్లాది వెంకట కృష్ణమూర్తికి, అభినందనలతో’ అని రాసి సంతకం పెట్టారు. చందమామ, అపరాధ పరిశోధన లాంటి మేగజైన్స్‌కు నేను అప్పటికే రాస్తున్నప్పటికీ ఆమె నన్ను గుర్తుపట్టలేదు. ఆమె మనుషుల ఉద్వేగాలను తన నవలల్లో ఎక్కువగా వ్యక్తీకరించారు. కాలంతోపాటు ఉద్వేగాలు మారవు. వ్యక్తుల స్పందనలు మారవు. అందుకే ఆమె పుస్తకాలు ఇప్పటికీ సజీవంగా ఉంటాయి. సాధారణంగా తెలుగు పాఠకులు పిసినారులు. అరువు తెచ్చుకుని చదువుతారు తప్ప పుస్తకాలు కొనరు. అట్లాంటిది ఆ పిసినారితనాన్ని ఆమె జయించేలా చేసింది. పుస్తకాలు కొనేలా చేసింది. అట్టలు చిరిగిపోతేనో, చివరి పుటలు ఊడిపోతేనో కూడా మళ్లీ కొత్త కాపీ కొనేవాళ్లు. ఆమె వాక్యాలు సుతిమెత్తగా ఉంటాయి. ఆహ్లాదమైన చక్కటి శైలి. ఆవిడ కూడా అంతే మర్యాద, మన్ననతో ప్రవర్తించేవారు. వాళ్ల కూతురు శైలజ పెళ్లికి పిలిస్తే వెళ్లాను కూడా. ఆమెలో వ్యాపారదక్షత కూడా ఎక్కువే. పబ్లిషర్స్ దగ్గరగానీ, నిర్మాతల దగ్గరగానీ ఈమెదే పైచేయిగా ఉండేది. ఎంతిస్తే అంత తీసుకోవడం ఆమెకు తెలియదు. తన రెమ్యూనరేషన్ ఎంతో కచ్చితంగా చెప్పేవారు. 1980ల్లో ఆమె కొంతకాలం ‘కోకిల’ అని ఒక టేప్ మేగజైన్ నడిపారు. రచయితలు వాళ్ల రచనల్ని చదివితే, వాటిని రికార్డు చేసేవారు. క్యాసెట్ ఒక గంట నిడివి ఉండేది. దాన్ని చందాదారులకు పంపేవారు. ఆ రోజుల్లో అదొక విప్లవాత్మకమైన ఆలోచన. – మల్లాది వెంకట కృష్ణమూర్తి ఆమె యాక్చువల్ ఫెమినిస్ట్ సులోచనారాణి నవలలు చదవడం మొదలుపెట్టింది టెన్త్ తర్వాత! ఆవిడ బెస్ట్ అంతా 60–80ల మధ్యే వెలువడింది. 18–20 యేళ్లపాటు నవలా లోకాన్ని లిటరల్లీ ఏలారు. మనుషుల జీవితంలో పెద్ద తేడాలేముంటాయి? పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు ఇంటికి రావడం, మాట్లాడడం; మనకీ, మనకు కావలసిన వ్యక్తికీ గొడవ జరగడం... తర్వాత అది సాల్వ్ అయ్యే పరిస్థితి రావడం – పెంకుటింట్లో, పాకల్లో, బంగళాల్లో ఎక్కడైనా ఇదేగా డ్రామా! ఆ రోజువారీ హ్యాపెనింగ్స్ రాసేవారు. నేల విడిచి సాము చేయలేదు. ఫాల్స్ ప్రెస్టీజ్ లేదు. సూడో ఇంటలెక్చువల్ అంతకన్నా కాదు. లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ – ఆమె రచనల్లో అంతర్గతంగా ఉండే అంశం. కమ్యూనికేషన్ సాధనాలు ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా మనుషుల మధ్య ఇప్పటికీ అదే పెద్ద సమస్య. ఆవిడ గేమ్ అంతా దానిమీదే ఉండేది. ఆమె నవలల్లో బేసిక్‌గా 1960ల నాటి మధ్యతరగతి ఆడవాళ్ల తాలూకు అనుమానాలు, భయాలు, మగాళ్లను నమ్మాలా వద్దా అన్నదాని మధ్య ఊగిసలాట, అందులోంచి ఎలా బయటికి రావాలి అనేవి ఉంటాయి. ఆడవాళ్లు మగాడి దగ్గర్నుంచి ఒక అండర్స్టాండింగ్ కోరుకునేవారు. మగాడు ఎంత డబ్బున్నవాడైనా భార్యలు వంటింట్లోనే మగ్గిపోయేవారు. పదేళ్లక్రితమే పెళ్లయినా అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేకపోయేవారు. అప్పుడప్పుడే ఇలాంటి అన్యాయం పట్ల ఆడాళ్లు వాయిస్ రెయిజ్ చేయడం మొదలైంది. ఆ అంశాలు ఆవిడ నవలల్లో కనిపించేవి. ఆవిడ సూడో ఫెమినిస్ట్ కాదు – యాక్చువల్ ఫెమినిస్ట్. ఆవిడ నార్మల్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. పెద్దగా చదువుకోలేదు. చక్కగా ఇంట్లో కూర్చుని కథలు రాసి అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పటివాళ్లతో పోలిస్తే నాకు ఆవిడే ఎక్కువ సక్సెస్‌ఫుల్‌గా అనిపిస్తారు. (సాక్షి ‘ఫన్డే’ ఇంటర్వ్యూలోంచి) -
యద్దనపూడి మృతిపట్ల జగన్, కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. సులోచనారాణి తెలుగు పాఠకలోకాన్ని, నవలా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సులోచనారాణి మృతిపట్ల కేసీఆర్ సంతాపం సాహిత్య ప్రపంచంలో సులోచనారాణిది సుస్థిర స్థానం ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయని ఆయన అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి సులోచనారాణి చేసిన రచనలు ఉపయోగపడ్డాయన్నారు. ఆమె కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. -
నవలా రచయిత్రి సులోచనారాణి కన్నుమూత
-
యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత
కాలిఫోర్నియా : ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలోని కుపర్టినోలో గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె నివాసంలో ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిసులోచనారాణి కుమార్తె శైలజ ధ్రువీకరించారు. సులోచనారాణి అంత్యక్రియలు కాలిఫోర్నియాలోనే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘ సులోచనారాణి మృతి విషయాన్ని ఆమె కుమార్తె శైలజ గతరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు.ఆమె నవలలు ఎక్కువ శాతం మేమే పబ్లిష్ చేశాం. సులోచనారాణి మృతి తెలుగు పాఠకలోకానికి తీరనిలోటు. స్త్రీల ఆత్మాభిమానం గురించి ఆమె తన రచనల్లో చాలా బాగా ఎలివేట్ చేసేవారు. సులోచనారాణి రాసిన ‘సెక్రటరీ’ నవల ఇప్పటికీ ఆదరణ పొందటం అందుకు నిదర్శనం.’ అని తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేశారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, వారి ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. వర్ణనల విషయానికి వస్తే వీరి నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. ఇవి ఎక్కువ ప్రచారం పొందడానికి కారణం- మెజారిటీ ప్రజల జీవన విధానాలను, అనుభూతులను పొందుపరచడమే. వీరి నవలా పాత్రలు విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాయి. కొద్ది సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. అందుకేనేమో బహుశా సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం - అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి, ఆశ - నిరాశ... ఇలాంటి సహజాతాల మధ్య వీరు సృష్టించే పాత్రలు తలమునకలవు తుంటాయి. చదివే పాఠకులకు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుంటాయి. యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది. సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. వీరి రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్లో వచ్చిన రాధ మధు సీరియల్ కథ వీరిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ వీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు. -
'సెక్రటరీ 'నవల స్వర్ణోత్సవం
-
సులోచనారాణితో ఇంటర్వ్యూ
-
మాలతీచందూర్ పురస్కారం అందుకున్న యద్దనపూడి
-
సగటు మహిళే నా నాయిక
‘కల్పనా సాహిత్యం- రచయిత్రుల కృషి’ సదస్సులో ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సాక్షి, హైదరాబాద్: నాకు ఏ పుస్తకాలూ, కవులూ ప్రేరణ కాదు. సగటు మహిళ త్యాగం, శ్రమ, ఆమె జీవితమే నా రచనలకు ప్రేరణ. నా కథలు, నవలల్లో నాయిక ఆమే’’ అని సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తెలిపారు. ‘సెక్రటరీ’, ‘మీనా’, ‘జీవన తరంగాలు’ లాంటి ప్రసిద్ధ నవలల ద్వారా కొన్ని తరాలను ఉర్రూతలూపిన యద్దనపూడి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సాహితీ ప్రియుల ముందుకు వచ్చి తన మనసులోని మాటలను పంచుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ‘కల్పనా సాహిత్యం - రచయిత్రుల కృషి’ అనే అంశంపై వర్సిటీలోని మహిళా అధ్యయన కేంద్రం, రచయిత్రులే సభ్యులుగా నడుస్తున్న మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ‘లేఖిని’ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో యద్దనపూడి ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘అప్పట్లో కొంతమంది వంటింటి సాహిత్యం అంటూ స్త్రీల రచనల్ని చిన్నచూపు చూసేవారు. ఆ మాటలకు భిన్నంగా పాఠకులు ఈ రచనలను బాగా ఆదరించారు. అది నాపట్ల, నా రచనలపట్ల ప్రేమానుబంధంగా పరిణమించింది. నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టాను. కథలు రాయడం మొదలుపెట్టాక ఆ ఇల్లే నాకు విస్తృత సమాజంగా అనిపించేది. నేను చదివింది పదే అయినా చూసిన విషయాలు, నా చుట్టూ ఉన్న మనుషుల జీవితాలతోనే మమేకమయ్యాను. అవే నేను రాశాను. నా కలానికి సగటు గృహిణే పెద్ద బలం. నేను, నా పాఠకులు, నా ప్రచురణకర్తలు.. ఇదొక త్రివేణీ సంగమం’’ అని యద్దనపూడి తన రచనా జీవితాన్ని ఆవిష్కరించారు. స్త్రీల రచనలే సమాజానికి మేలు చేశాయి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ‘‘ఈనాడు కవిత్వంకన్నా ఎక్కువ మేలు చేస్తున్నది కథలే. స్త్రీల రచనలు ‘వంటింటి కథలు’ కాదు. అవి ఇంటింటి కథలు’’ అని వ్యాఖ్యానించారు. రచయిత్రుల రచనలు ప్రారంభమై వందేళ్లు గడచినా వాటిపై తగినంత చర్చ జరగడం లేదనీ, అందుకే నిరుడు తెలంగాణ రచయిత్రుల సదస్సు చేసినట్లే, ఈసారి ఈ ప్రయత్నం చేస్తున్నామని మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు, రచయిత్రి సి.మృణాళిని తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. సాహితీవేత్త ఆచార్య సుమతీ నరేంద్ర కీలకోపన్యాసం చేస్తూ పత్రికల్లో వచ్చే యద్దనపూడి తదితరుల రచనలను ముందుగా చదవడం కోసం ఆ రోజుల్లో పాఠకుల్లో నెలకొన్న పోటీ వాతావరణాన్ని గుర్తుచేశారు. స్త్రీల రచనలపై వచ్చిన విమర్శల్ని తిప్పి కొడుతూ, ‘‘స్త్రీల రచనలు అమ్మల మనోభావాలనూ, ఉద్యోగినుల సమస్యలనూ, బాల వితంతువుల సమస్యలనూ, ఇష్టంలేని భర్తతో కాపురం చేస్తున్న స్త్రీల వేదనలనూ ప్రతిబింబించాయి. సెక్స్, క్రైమ్, మూఢనమ్మకాలే ప్రధానాంశాలుగా రాసిన నవలలకన్నా ఇవే మెరుగైనవి, సమాజానికి మేలు చేసినవి’’ అని సుమతీ నరేంద్ర విశ్లేషించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ, స్త్రీల సాహిత్య ఆవిర్భావం నుంచి 1960ల దాకా సాగిన కృషిని సమీక్షించారు. ‘లేఖిని’ అధ్యక్షురాలు, రచయిత్రి వాసా ప్రభావతి మాట్లాడుతూ ‘‘తెలుగు సమాజాన్ని ఉన్నత స్థాయికి తెచ్చింది రచయిత్రులే’’ అన్నారు. ఈ సదస్సు ద్వారా 1960ల మొదలు ఇప్పటివరకు వచ్చిన స్త్రీల సాహిత్యంపై సింహావలోకనం జరుపుతున్నట్లు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన కథా రచయిత ఏఎన్ జగన్నాథ శర్మ మాట్లాడుతూ తన రచనా నేపథ్యానికి బీజం వేసింది మహిళలు, మహిళల సాహిత్యమేనన్నారు. రచయిత్రుల సందడి ప్రముఖ రచయిత్రులు డి.కామేశ్వరి, పొత్తూరి విజయలక్ష్మి, డి.శారదా అశోకవర్ధన్, ముక్తేవి భారతి, శాంతకుమారి, కె.బి. లక్ష్మి, సోమరాజు సుశీల తదితరులతోపాటు రచయితలు శ్రీపతి, వేదగిరి రాంబాబు, సుధామ, సుద్దాల అశోక్‌తేజ హాజరవడంతో సభా ప్రాంగణం సాహితీ పరిమళాలు వెదజల్లింది. రామలక్ష్మీ ఆరుద్ర, రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, నాయని కృష్ణకుమారి, ఆనందారామం తదితర 15 మంది ప్రముఖ రచయిత్రుల రచనలను విశ్లేషిస్తూ మరో 15 మంది రచయిత్రులు పత్రాలను సమర్పించడం ఈ సదస్సును సాధారణ సమావేశాలకన్నా భిన్నంగా నిలిపింది. -
నాయుడు గారు ఆ కథలో వేలుపెట్టనన్నారు!
ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మరణించారంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. సినిమా రంగంలో దుక్కిపాటి మధుసూదనరావు గారి తరువాత మళ్ళీ రామానాయుడు గారికి ‘నవలా చిత్రాల నిర్మాత’గా చాలా పేరుండేది. పాఠకాదరణ పొందిన నవలలను వెండితెరకెక్కించడానికి రామానాయుడు గారు ఎప్పుడూ ముందుండేవారు. అలా నవలల నుంచి ఆయన సినిమాలుగా తీసినవి చాలానే ఉన్నాయి. అప్పటి ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన మొదలు ఇప్పటి బలభద్రపాత్రుని రమణి లాంటి ఎంతోమంది రచనలు ఆయన ద్వారా వెండితెరకెక్కాయి. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ప్రేమనగర్’ లాంటి పెద్ద కమర్షియల్ హిట్ సైతం నవలే కదా! ఇక, నా నవలల్ని కూడా ఆయన చలనచిత్రాలుగా నిర్మించారు. అందులో ప్రధానంగా అందరికీ గుర్తుండిపోయేవి - ‘జీవనతరంగాలు’, ‘సెక్రటరీ’, ‘అగ్నిపూలు’. సినిమాకు పనికొచ్చే మంచి కథల కోసం వెతికే స్వభావం వల్ల నాయుడు గారికి నవలల మీద, నవలా రచయితల మీద చాలా మర్యాద ఉండేది. నవలలు ఆయన బాగా చదివేవారు. నవలను సినిమాకు ఎంచుకొనేటప్పుడు ఆ కథల గురించి బాగా చర్చించేవారు. మరికొంతమందికి కూడా ఆ నవలలు ఇచ్చి, చదివించేవారు. ఫలానా నవల సినిమాకు ఒదుగుతుందా, లేదా అని జాగ్రత్తగా జడ్జి చేసేవారు. అన్ని చర్చలు చేసి, సదరు నవలను సినిమాకు ఎంచుకున్న తరువాత తెరపైన ఆ నవలకు పూర్తి న్యాయం చేసేవారు. అవసరమైతేనే సినిమాకు తగ్గట్లుగా కథలో కొద్ది మార్పులు చేసేవారు. నా ‘అగ్నిపూలు’కు అలానే కొన్ని మార్పులు చేశారు. అయితే, అప్పటికే ఆ నవలను చదివి, ఆ పాత్రలతో అనుబంధం పెంచుకున్న మహిళా ప్రేక్షకులను సినిమాతోనూ ఒప్పించి, మెప్పించారు. ఆయన తీసిన నా నవలా చిత్రాల్లో నా వరకు నాకు బాగా నచ్చినది - ‘జీవనతరంగాలు’ (1973). అప్పట్లో సీరియల్‌కు అలాంటి పేరు పెట్టడం చర్చనీయాంశమైంది. కానీ, నేను ఆ పేరు మీద పట్టుబట్టాను. తరువాత సినిమాగా తీస్తున్నప్పుడు నాయుడు గారు సాధారణంగా సినిమాలకు పెట్టే పేర్లకు భిన్నంగా ‘జీవన తరంగాలు’ అనే టైటిలే ఉంచారు. ఆ నవలను సినిమాగా తీస్తున్నప్పుడు ఆయన కథలో సినిమా కోసం మార్పులేమీ చేయలేదు. ‘అద్భుతమైన నవల. ఆ కథలో వేలు పెట్టను’ అని చెప్పారు. అలాగే చేశారు. పైగా, ‘జీవన తరంగాలు’ అనే పేరుకు తగ్గట్లే కథలో సందర్భోచితంగా ఒక పాట రాయించి పెట్టారు. ఆత్రేయ గారు రాసిన ‘ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో...’ అనే పాట అప్పుడూ, ఇప్పుడూ ‘ఎవర్గ్రీన్’గా నిలిచిపోవడం విశేషం. ఆయన చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. ఏదైనా నవల బాగుందంటే ఆ రచయితతో మాట్లాడి, నిజాయతీగా డబ్బులు చెల్లించి హక్కులు తీసుకొనేవారు. అప్పట్లో నవలలు రాసేవారందరూ తమ నవలల హక్కులను రామానాయుడు గారు తీసుకుంటే బాగుండేదని ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. పాఠకులు ఆదరించిన కథలను సినిమాగా తీయడం వల్ల ప్రేక్షకులను మెప్పించడం సులభమవుతుందని ఆయన నమ్మకం. నా నవల ‘అభిశాపం’ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ నవల హక్కులు కూడా తీసుకున్నారు. ఆ నవలను సినిమాగా తీయాలనుకుంటున్నట్లు ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా! కానీ, ఎందుకనో ఆయన కోరిక నెరవేరలేదు. అలాంటి అభిరుచి గల నిర్మాత ఇప్పుడు భౌతికంగా కనుమరుగవడం నవలాప్రియులకు కూడా బాధాకరం. ఏమైనా, మంచి సినిమాలు అందించిన వ్యక్తిగా, మరీ ముఖ్యంగా నవలా చిత్రాల నిర్మాతగా తెలుగు సినీ రంగంలో ఆయనకు సుస్థిరమైన స్థానం ఉంది. ఆ రకంగా స్త్రీ ప్రేక్షక హృదయాలలో ఆయనకూ, ఆయన నవలా చిత్రాలకూ ప్రత్యేకమైన గుర్తింపు మిగిలింది.సంభాషణ: రెంటాల జయదేవ -
గోవిందరాజు సీతాదేవి మృతికి బాబు విచారం
హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి గోవిందరాజు సీతాదేవి మృతి పట్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. గోవిందరాజు సీతాదేవి నిన్న ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాశారు. సుందర స్వప్నం, ఆలయం, పూలవాన, దేవుడు బ్రతికాడు తదితర నవలలు ప్రముఖమైనవి. సీతాదేవి ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణికి సొంత చెల్లెలు. ఆమెకు కుమారులు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు -
రచయిత్రి గోవిందరాజు సీతాదేవి మృతి
హైదరాబాద్: రచయిత్రి గోవిందరాజు సీతాదేవి(82) గురువారం ఉదయం సోమాజిగూడలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఆమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాశా రు. సుందర స్వప్నం, ఆలయం, పూలవాన, దేవుడు బ్రతికాడు తదితర నవలలు ప్రముఖమైనవి. ఆమె రాసిన తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్న సీతాదేవికి భర్త గోవిందరాజు సుబ్బారావు, కుమారులు రామకృష్ట, గోపాలకృష్ట, రమణ, శశిధర్ కుమార్తె సుభద్రాదేవి ఉన్నారు. రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి సీతాదేవికి సొంత చెల్లెలు. -
తెలుగు నవలల్లో అనాబ్‌షాహీ సెక్రటరీ...
కొన్ని కథల్ని మనుషులు మొదలు పెడతారు. కొన్ని కథల్ని మెషీన్లు మొదలుపెడతాయి. కొన్ని కథల్ని మెషీన్లను ఉపయోగించే మనుషులు మొదలుపెడతారు. చాలాకాలం క్రితం సెక్రటరీ అనేది మగవాళ్ల పని. 1880లో టైప్మెషీన్ కనిపెట్టాక అది ఆడవాళ్ల పని అయ్యింది. టైప్ తెలిసిన ఆడవాళ్లు, ఆఫీసు వ్యవహారాలను ‘సీక్రెట్’గా ఉంచుతూ నమ్మకంగా పని చేసే ఆడవాళ్లు - ‘సెక్రటరీలు’. ఇరవయ్యవ శతాబ్దపు మొదలులో మొదలయ్యి 1950లకు ఉద్ధృతమైన ఈ పని చేసిన మేలూ మగవారి జీవితంలో తెచ్చిన మార్పూ అంతా ఇంతా కాదు. పుట్టించిన కథలూ అన్నీ ఇన్నీ కావు. సెక్రటరీలు చాలా మంది జీవితాలను వెలిగించారు. చాలామంది జీవితాలను ఆర్పేశారు. సుభాస్ చంద్రబోస్ తన సెక్రటరీనే పెళ్లి చేసుకున్నాడు. దోస్తవ్ స్కీ అదే పని చేశాడు. మన శ్రీశ్రీ కూడా డబ్బింగ్ సినిమాల పనికి తనకు సహాయకురాలిగా చేరిన సరోజను వివాహం చేసుకున్నారు. కొంతమంది దీనికి రివర్స్‌గా వెళ్లి ఇరకాటంలో పడ్డారు. భార్యలతో దెబ్బలు తిన్నారు. క్లింటన్లాంటివాడు లెవన్స్కీతో చాలాదూరం వెళ్లి చాలా లోతులో పడ్డాడు. ‘సెక్రటరీ’ నవలలోని రాజశేఖరం కూడా జయంతిని సెక్రటరీగా పెట్టుకున్నాక అంత సుఖంగా ఏమీ లేడు. రాజశేఖరంకు ఒక సమస్య ఉంది. అతడి తల్లిదండ్రులు పారిపోయి హైదరాబాద్ వచ్చినవారు. అందువల్ల బంధువులంటూ ఎవరూ లేరు. ఒక్క కొడుకు- రాజశేఖరం పుడితే అతణ్ణే సర్వస్వం అనుకొని ఎవర్నీ కలవనిచ్చేది కాదు తల్లి. కలివిడిగా ఉండటం, మనసులో ఉన్నది చెప్పడం రాజశేఖరంకు చేతగాదు. ‘నన్ను నన్నుగా ప్రేమించుటకు’ అన్నట్టుగా తన అందం, ఆస్తి, వైభవం చూసి కాకుండా తన హృదయాన్ని చూసి ప్రేమించే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే జయంతికి కూడా ఒక సమస్య ఉంది. ఆమెను ఆమె బామ్మ పెంచింది. బామ్మల పెంపకంలో ఆడపిల్లలు ఎలా పెరుగుతారో అలానే పెరిగింది. తెలిసీ తెలియనితనం, చాదస్తం, అనుమానం.... మగవాళ్లంటే లోపల ‘జడత్వం’ ఉండి పైకి నిక్కచ్చిగా ఉన్నట్టుగా కనపడుతూ వారిని దూరం పెడుతూ విలువల వంకతో అసహ్యించుకుంటూ ఉండే స్వభావమా జయంతిది అన్నట్టుగా ఉంటుంది. ‘నాకు ఉద్యోగం వచ్చింది వనితా విహార్‌లో. అక్కడంతా ఆడవాళ్లే ఉంటారు తెలుసా?’ అని ఎంతో సంతోషంగా చెప్తుంది బామ్మతో. అదే జయంతి ‘మీరంటే నాకు అసహ్యం’ అని అనేక సార్లు చెప్తుంది రాజశేఖరంతో. ఎందుకు అసహ్యం? ఏమో. తెలియదు. వీరిద్దరూ కలవాలి. అందుకొక సుదీర్ఘ ప్రయాణం అవసరం. ఆ ప్రయాణమే పాఠకులను ఉత్కంఠకు గురిచేసి లక్షలాది మందిని గోళ్లు కొరుక్కునేలా చేసి ఈ నవలను ఇప్పటికి 86 సార్లు రీ ప్రింట్కు తెచ్చింది. ఊహించండి. ఒక అమ్మాయి. నెలకు నూట యాభై రూపాయల జీతం వస్తే చాలు అనే మధ్యతరగతి పిల్ల. అతడు? ఈ మధ్యనే ఆరు లక్షల ఆదాయాన్ని చూసిన వ్యాపారవేత్త. పైగా ఎప్పుడూ చుట్టూ ఆడవాళ్లు. రేఖారాణి అనీ, మిసెస్ వర్మ అనీ, మిసెస్ కరుణాకరం... ప్రమీల.... ఏదో ఒక గాసిప్. ఇలాంటి వ్యక్తి దగ్గర పని అంటే సింహం బోనులో ఉన్నట్టే. ఆ సింహం తన రాజసంతో, దర్పంతో, ఠీవితో ఆకర్షిస్తూనే ఉంటుంది. కాని ఏ క్షణం నోట కరుచుకుంటుందోనని భయం. జయంతి ఈ రెండు భావాల మధ్యా నలిగిపోతూ తప్పుల మీద తప్పులు చేస్తుంటుంది. రాజశేఖరంను ఒక్కసారి కూడా అర్థం చేసుకోదు. అభిమానంతో చీర కొనిస్తే దానిని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. ఒక మంచి పార్టీలో అందరి సమక్షాన ఆమెను తన కాబోయే భార్యగా ప్రకటిద్దామనుకుని- కాసింత మంచి చీర కట్టుకోరాదూ అని రాజశేఖరం సూచిస్తే అది తన పేదరికం మీద, ఆత్మాభిమానం మీద కొట్టిన దెబ్బగా భావించి గింజుకుంటుంది. ఏదో కారణాన ఎవరో ఒక స్త్రీ అతని భుజం మీద తల వాల్చి ఓదార్పు చెందుతుంటే అది చూసి ఇతడు దుర్మార్గుడే అనే శాశ్వత నిర్ణయానికి వచ్చేస్తుంది. నిజానికి జయంతి నెలకు నూటయాభై రూపాయల స్థితి ఉన్న మనుషులతోనే కొంచెం సౌకర్యంగా ఉండగలదు. శివరామ్లాంటి మామూలు ఉద్యోగి సమక్షంలో ఆమెకు కొంచెం ఊపిరి ఆడుతుంటుంది. కాని ఆ సంగతి అతడికి చెప్పదు. పైగా రాజశేఖరం ఈర్ష్య పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా గ్రహించకుండా తన స్థాయి మగవాళ్లతో చనువుగా మాట్లాడుతుంటుంది. వద్దని వారిస్తే, అది ప్రేమ అని గ్రహించక- ఏమిటి ఇతని అధికారం అని మరింత అసహ్యించుకుంటూ ఉంటుంది. ఈ అసహ్యం, ఇబ్బంది పెరిగి పెరిగి బెంగళూరు పారిపోతుంది. అక్కడ ఎవరెవరి దగ్గరో ఉంటూ దారీ తెన్నూ సొంత అభిప్రాయాలూ లేకుండా బతుకుతూ చివరకు తాను ఇన్నాళ్లూ కోల్పోయిన పెన్నిధి ఏమిటో గ్రహించి రాజశేఖరం దగ్గరకు తిరిగి వస్తుంది. నవల ముగింపువాక్యం - ఆమె అతణ్ణి గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుంది- కాదు. అతడి శిరస్సును తన హృదయానికి హత్తుకుంది - కాదు. భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకుంది. అంతే. ఇలా భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకునే జయంతితో భవిష్యత్తులో రాజశేఖరం ఎలా జీవించినా ఆమె అంత వరకూ వచ్చినందుకు పాఠకులకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఎక్కడలేని ఉత్కంఠ తీరి సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఇవ్వడంలోనే ఈ నవల విజయం అంతా ఉంది. 1960లలో- అంటే ఈ నవలా కాలానికి దేశంలో రెండు ఉన్నాయి. ఒకటి- స్వాతంత్య్రం వచ్చి ఆడపిల్లలు కొద్దోగొప్పో బయటకు వచ్చి, చదువుకొని, ఉద్యోగాలకు ప్రయత్నించడం. రెండు- ఆర్థికంగా ఇంకా కుదురుకోనందు వల్ల సమస్యలు పెరిగి పెళ్లిళ్లు, కార్యాలు వంటివి అసంభవంగా మారడం. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఎంచుకునేవాడు, లేదా తాము ఎంచుకునేవాడు ఒక రాజశేఖరంలా ఉండాలని ఏ ఆడపిల్లయినా కోరుకోవడంలో వింత లేదు. వాస్తవలోకంలో ఆ పని జరిగినా జరగకపోయినా కనీసం ఊహాలోకంలో అయినా ఆ పని జరిగేలా చేసి- లక్షలాదిమందికి తెలియని ఆనందం ఇచ్చిన నవల- సెక్రటరీ. అంతే కాదు, ఒక తరాన్ని తీవ్ర ప్రభావంలో ముంచెత్తి తమకు కాబోయే భర్తలను రాజశేఖరంతో పోల్చి చూసి నిరాశ చెందేంత వరకూ వెర్రెత్తించిన నవల ఇది. సెక్రటరీలో సాహిత్యం లేకపోవచ్చు. ఇది సాహిత్య నవలల సరసన చేరకపోవచ్చు. కాని తన సులభమైన శైలి వల్ల, సరళమైన కథనం వల్ల, రాజు - పేద అనే రెండు బలమైన వర్గాల ప్రాతినిధ్య పాత్రల వల్ల ఆకర్షించి, వానాకాలం చదువులు చదివిన ఆడవాళ్లను కూడా పఠితులను చేసి, వారి చేత చదివించేలా చేసి, తెలుగునాట కొత్త పాఠకులను తయారు చేసిన నవల ఇది. ఆ పాఠకుల్లో కొందరైనా మంచి సాహిత్యం వైపు ప్రయాణించకుండా ఉంటారా? అదీ- సెక్రటరీ కాంట్రిబ్యూషన్. యద్దనపూడి సులోచనారాణి ఏ ముహూర్తాన సెక్రటరీ ఫార్ములాను కనిపెట్టారోగాని ఇది సీరియల్‌గా వస్తుండగా పే చేసింది. నవలగా పే చేసింది. సినిమాగా పే చేసింది. నిన్న మొన్న దీని ఆధారంగా ‘రాధ- మధు’ సీరియల్ తీస్తే ఘన విజయం సాధించి మరీ పే చేసింది. అంటే ఇందులో మనుషులకు ఇష్టమైనదేదో ఉంది. ఉంటుంది. ఇవాళ సెక్రటరీలు లేరు. పోయారు. ఆ స్థానంలో పీఏలు వచ్చారు. సెక్రటరీ అనేది పైస్థాయి మాటై కూచుంది. అలాగే ఈ నవలలో కనిపించే అనాబ్‌షాహీ ద్రాక్ష తోటలు కూడా హైదరాబాద్‌లో లేవు. పోయాయి. వాటి స్థానంలో గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. ఆ మాటకొస్తే తెలుగులో నవలలైనా ఏం మిగిలాయని? అవీ పోతున్నట్టే. పోనివ్వండి. ఏవి ఎటు గతించినా సెక్రటరీకి మాత్రం గతింపు లేదు. ఎందుకంటే అందులోని అనాయాస రుచి అలాంటిది. అది జో కొట్టే కలల ప్రపంచమూ అలాంటిదే. నవల: సెక్రటరీ రచయిత: యద్దనపూడి సులోచనారాణి తొలి ముద్రణ: 1965 (1964లో జ్యోతి మాసపత్రికలో ధారావాహికం) ఒక కాలపు మధ్యతరగతి ఆడపిల్లల ఆలోచనలని, ఆశలని, ఆత్మాభిమానాలని, అయోమయాలని అందిపుచ్చుకొని ఊహాలోకాల్లో విహరింపజేసి విస్తృత పాఠకాదరణ పొందిన నవల. తెలుగు పాప్యులర్ ఫిక్షన్లో మైలురాయి. తెల్లగా, పొడుగ్గా, హుందాగా ఉండే ‘రాజశేఖరం’ అనే పాత్రను నవలా నాయకులకు మోడల్‌గా చేసిన నవల ఇది. లెక్కలేనన్ని పునర్ము ద్రణలు పొందింది.మార్కెట్లో లభ్యం. వెల: రూ.100