ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలోని కుపర్టినోలో గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె నివాసంలో ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిసులోచనారాణి కుమార్తె శైలజ ధ్రువీకరించారు. సులోచనారాణి అంత్యక్రియలు కాలిఫోర్నియాలోనే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘ సులోచనారాణి మృతి విషయాన్ని ఆమె కుమార్తె శైలజ గతరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు.ఆమె నవలలు ఎక్కువ శాతం మేమే పబ్లిష్ చేశాం. సులోచనారాణి మృతి తెలుగు పాఠకలోకానికి తీరనిలోటు. స్త్రీల ఆత్మాభిమానం గురించి ఆమె తన రచనల్లో చాలా బాగా ఎలివేట్ చేసేవారు. సులోచనారాణి రాసిన ‘సెక్రటరీ’ నవల ఇప్పటికీ ఆదరణ పొందటం అందుకు నిదర్శనం.’ అని తెలిపారు.
యద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేశారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు.