
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ/ కాజ (కూచిపూడి): సాహితీ సుమం నేలరాలింది. 2 దశాబ్దాల పాటు ఆధునిక తెలుగు నవలా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి, తన రచనలతో నవలా ప్రేమికులను ఉర్రూతలూగించిన సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తె వద్ద ఉన్న ఆమె శుక్రవారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఆమె భర్త యద్దనపూడి నరసింహారావు కొంతకాలం క్రితమే చనిపోయారు. కూతురు శైలజ, అల్లుడు రవి, మనవడు హర్ష కాలిఫోర్నియాలో ఉంటున్నారు.
పంజగుట్టలో నివాసం ఉంటున్న సులోచనారాణి గత ఫిబ్రవరి 12వ తేదీన కుమార్తె వద్దకు వెళ్లారు. రెండు, మూడురోజుల్లో హైదరాబాద్ రానున్నట్లు ఈ నెల 16వ తేదీన పనిమనిషి రత్నమ్మకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఆ తరువాత రెండురోజులకే శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కాలిఫోర్నియాలోనే ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు. ఆమె మృతి వార్త తెలిసి సాహితీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు యద్దనపూడి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా ఆణిముత్యం
సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో నెమలికంటి వెంకట చలపతిరావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. కాజ హైస్కూల్లోనే ఎస్‌ఎల్‌సీ వరకు చదివారు. అనంతరం జుజ్జూరు గ్రామానికి చెందిన యద్దన పూడి నరసింహారావుతో వివాహమై హైదరాబాద్ తరలివెళ్లారు. అనంతర కాలంలో నవలా రచయిత్రిగా ఎదిగారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు దాదాపు 80 నవలలు రాసి తెలుగు సాహితీలోకంలో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె మృతితో స్వగ్రామం కాజలో విషాదం నెలకొంది.
స్వర్ణోత్సవం జరుపుకున్న సెక్రెటరీ
1966లో ఆమె రాసిన సెక్రటరీ నవల ఓ మధుర కావ్యంలా నిలిచి 2016లో స్వర్ణోత్సవం జరుపు కుంది. ఇప్పటిదాకా 100కు పైగా ముద్రణలు పొంది లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. జీవితంలో ప్రతి అబ్బాయి రాజశేఖరంలా, ప్రతి అమ్మాయి ఆత్మాభిమానం కలిగిన ఒక జయంతిలా ఉండాలను కొనేవిధంగా ఎంతో గొప్పగా ఆ నవలను యద్ధనపూడి చిత్రీకరించారు. ఈ నవల సినిమాగా కూడా వెలువడి ప్రేక్షకులను కట్టిపడేసింది. మరో నవల ‘మీనా’ పత్రికలో ధారావాహికగా వచ్చింది. ఆ నవలకు పేరును పాఠకులే నిర్ణయించారు. 1973లో విజయ నిర్మల దర్శకత్వం వహించడమే కాకుండా తానే హీరోయిన్‌గా నటించి తీసిన ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించింది.
లక్షలుగా మారిన అక్షరాలు
తెలుగు నవలా సాహిత్యాన్ని శాసిం చిన యద్దనపూడి అక్షరం.. లక్షలై పబ్లిషర్స్, సినీ నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. సినీ నటులు అక్కినేని, వాణిశ్రీ, శోభన్‌బాబులు అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడింది. ఆమె రచించిన నవలలన్నీ దాదాపు విజయవాడలోనే ముద్రితమయ్యాయి. నవభారత్, నవోదయ, అరుణా పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో సంస్థలు వాటిని ప్రచురించాయి. 2015 సంవత్సరంలో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో తుళ్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి చేతుల మీదుగా హంస పురస్కారం అందుకున్నారు.
మహిళల ఆత్మాభిమానానికి ప్రతిబింబం
యద్ధనపూడి సాహితీ ప్రస్థానం చిత్ర నళినీయం అనే కథతో ప్రారంభమైంది. ఆమె తొలిరచనలు ముక్కామల నాగభూషణం సారథ్యంలో నడిచిన ప్రగతి అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. పక్కా పల్లెటూరిలో పుట్టిన ఓ సగటు అమ్మాయి...తను రాసిన తొలి కథకు ఆంధ్రపత్రిక నుంచి 15 రూపాయలు పారితోషికం వస్తే మురిసిపోయిన పదహారేళ్ల పడుచుపిల్ల... తదనంతర కాలంలో కోట్లాదిమంది తెలుగు ప్రజల అభిమాన రచయిత్రిగా ఎదిగింది. ఆమె నవలా నాయికలు ఆత్మాభిమానం కల మధ్యతరగతి మహిళలు. ఒక పరిపూర్ణమైన, స్వతంత్ర వ్యక్తిత్వం గల మహిళలను ఆమె ఆవిష్కరించారు. వారి మనస్తత్వాన్ని, ఆలోచనలు, ఆకాంక్షలను, వారిలోని సంఘర్షణను తన నవలల్లో సమున్నతంగా తీర్చిదిద్దారు.
పత్రికల్లో నవలలు సీరియళ్లుగా వెలువడుతున్న రోజుల్లో మహిళలంతా ఒక చోట గుంపుగా చేరి ఆ వారం సీరియల్‌ను ఒకరు చదువుతుంటే మిగతావాళ్లు చుట్టూ చేరి వినేవారంటే అతిశయోక్తి కాదు. ప్రతిభావంతమైన శైలి, మధ్యతరగతి జీవితాన్ని, కుటుంబ సంబంధాలను ప్రతిబింబించే కథనాలు మహిళలనే కాదు.. యావత్ తెలుగు సాహితీలోకాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 1970 నుంచి 1990 వరకు సులోచనారాణి సాహిత్యం బాగా ప్రభావితం చేసింది. సెక్రటరీ, మీనా, జీవన తరంగాలు, అమ్మానాన్న, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విజేత, ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ,జై జవాన్, కాంచనగంగ, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, ప్రేమ పీఠం, బహుమతి, మౌన పోరాటం, మౌనభాష్యం, శ్వేత గులాబి తదితర మరెన్నో నవలలు తెలుగు పాఠకులు మరిచిపోలేని జీవన దృశ్యాలు.
సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం
యద్దనపూడి సులోచనారాణి మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతివృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకతను, సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, యద్దనపూడి సులోచనారాణి ఆకస్మిక మృతి బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
యద్దనపూడి మృతికి వైఎస్ జగన్ సంతాపం
యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. యద్దనపూడి తెలుగు పాఠక లోకాన్ని, నవలా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేశారని జగన్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
తీరని లోటు: ఎమెస్కో విజయ్ కుమార్
మానవ సంబంధాలను, మానవ వైరుధ్యాలను సున్నితంగా చిత్రించిన గొప్ప రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. ఆమె మరణం తెలుగు సాహితీ లోకానికి, ప్రత్యేకించి ఎమెస్కోకు తీరని లోటు.
ఆమె గొప్ప కరుణామయి: వంశీ రామరాజు
వంశీ సంస్థతో యద్దనపూడి సులోచనరాణిది విడదీయరాని అనుబంధం. ఆమె గొప్ప కరుణామయి. అనాథలకు, వృద్ధులకు ఎంతో సాయం చేసేవారు.
ప్రముఖుల సంతాపం
యద్దనపూడి మృతి పట్ల తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ రచయిత్రి వాసా ప్రభావతి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment