telugu literature
-
దోహాలో తొమ్మిదొవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఈ నెల నవంబర్ 22,23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో తొలిసారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత మాజీ ఉప రాష్ట్రపతి “పద్మవిభూషణ్” ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ వేడుకలో స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారంతో సదస్సు ప్రారంభం అవుతుంది. ఖతార్ దేశంలో భారత రాయబారి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు.పది మధ్య ప్రాచ్య దేశాల అధ్యక్షులు, భారతదేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుంచి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాష్త్రాల మంత్రి వర్యులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు నమోదు చేసుకుని ప్రయాణానికి సంసిధ్దంగా ఉన్నారు. సదస్సు తర్వాత దోహా మహానగర సందర్శనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ సదస్సులో ప్రముఖ కథకులు, సాహితీ వేత్త ప్రొ. రామా చంద్రమౌళి (వరంగల్) గారెకి ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సదస్సులో విభిన్న అంశాల మీద నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, సినీ కవి మౌనశ్రీ మల్లిక్ మొదలైన సుమారు 35 మంది ప్రముఖ కవుల స్వీయ రచనా పఠనం, ఆ ప్రాంతంలో ఆచార్య అద్దంకి శ్రీనివాస్ గారు సంచాలకులుగా శ్రీమతి బులుసు అపర్ణ గారి తొలి మహిళా అష్టావధానం, కవి జొన్నవిత్తుల గారి శతక గ్రంధావిష్కరణతో సహా 33 నూతన గ్రంధాల ఆవిష్కరణ, కొత్తగా రూపొందించబడిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సమగ్ర వెబ్ సైట్ ఆవిష్కరణ మొదలైన అంశాలతో పాటు పుస్తక ప్రదర్శన-విక్రయశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మొదటి రోజు..అనగా నవంబర్ 22, 2024 నాడు సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల గౌరవార్ధం విందు భోజనం, ప్రముఖ గాయనీ గాయకులు Y.S రామకృష్ణ, లలిత దంపతులు (హైదరాబాద్), సుచిత్ర బాలాంత్రపు (సుచిత్ర ఆర్ట్ క్రియేషన్స్, కాకినాడ), రాంప్రసాద్ (విశాఖ) వారి సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు మొదలైన ఆసక్తికరమైన అంశాలతో వినోద కార్యక్రమం జరుగుతుంది.ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం వదాన్యుల ఆర్థిక సహకారం అర్థిస్తున్నాం. వివరాలు జత పరిచిన ప్రకటనలో చూసి స్పందించమని కోరుతున్నారు నిర్వాహకులు. ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యూ ట్యూబ్ లింక్ లో చూడవచ్చు. ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప, విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు తదితరులు. (చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన) -
కరవు పాట
దేశానికి ఎదురయ్యే నానా సమస్యల్లో కరవు ఒకటి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ వరకు ఎదిగినా, కరవు కాటకాలను పూర్తిగా రూపుమాపే స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. రాజ్యానికి వాటిల్లే అనేకానేక ఆపదల్లో దుర్భిక్షాన్ని కూడా ఒకటిగా మన ప్రాచీన సాహితీవేత్తలు గుర్తించారు. అయితే, ఇందులో మానవ ప్రమేయాన్ని మాత్రం పాపం వారు గుర్తించలేకపోయారు. ‘అమానుషోగ్నిః, అవర్షం, అతివర్షం, మారకః, దుర్భిక్షం, సస్యోపఘాతః, జంతుసర్గః, వ్యాధిః, భూత పిశాచ శాకినీ సర్ప వ్యాళ మూషక క్షోభాశ్చేత్యాపదః’ అన్నాడు సోమదేవుడు. ఈ శ్లోకం ఆయన రాసిన ‘నీతి వాక్యామృతం’లోనిది. అంటే, మనుషుల వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల వాటిల్లే అగ్నిప్రమాదాలు, వర్షాలు లేకపోవడం, అతి వర్షాలు, మహమ్మారి వ్యాధులు, దుర్భిక్షం, పంటలకు నష్టం కలగడం, అడవి జంతువుల సంఖ్య విపరీతంగా పెరగడం, రోగాలు, భూత పిశాచాదులు, పాములు, అదుపు తప్పిన ఏనుగులు, ఎలుకలు– ఇవీ రాజ్యంలో కలిగే ఆపదలు. పురాతన రాజ్యాల్లోనే కాదు, దుర్భిక్ష పరిస్థితులు వర్తమాన దేశాల్లోనూ ఉన్నాయి.పురాతన కాలంలో ఆనకట్టలు కట్టే పరిజ్ఞానం లేకపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆనకట్టలు కట్టడం నేర్చుకున్నాం. నీటిపారుదలను మెరుగుపరచుకున్నాం. అయినా ఎక్కడో ఒకచోట కరవు తాండవిస్తూ ఉండటమే విచారకరం. ముందుచూపు లేకుండా అడవులను నరికివేయడం వల్లనే ప్రపంచంలో చాలా చోట్ల కరవు కాటకాలు తలెత్తుతున్నాయి. ఒకప్పటి పచ్చని నేలలు ఇప్పుడు బీడు భూములుగా, ఎడారులుగా మారుతున్నాయి. ‘విచారకరమైన సంగతేమిటంటే, అడవిని సృష్టించడం కంటే ఎడారిని సృష్టించడం సులువు’ అన్నాడు ఇంగ్లిష్ పర్యావరణ శాస్త్రవేత్త జేమ్స్ లవ్‌లాక్. కష్టమైన పనులు చేపట్టే బదులు సులువైన పనులు చేయడమే కదా మనుషుల సహజ లక్షణం. అందుకే సునాయాసంగా ఎక్కడికక్కడ ఎడారులను సృష్టిస్తున్నారు.కరవు సాహిత్యం మనకు కరవు కాదు. దుర్భిక్ష వర్ణన తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడితో మొదలైంది. అప్పట్లో కరవు కాటకాలకు ఆలవాలమైన పలనాటి సీమలో ఆకుకూరలతో జొన్నకూడు తినలేక శ్రీనాథుడు నానా తిప్పలు పడ్డాడు. చివరకు ఉక్రోషం అణచుకోలేక ‘ఫుల్ల సరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా/డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ/పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటిలో/ మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్’ అంటూ సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికే సవాలు విసిరాడు. కేవలం పలనాడులోనే కాదు, రేనాటి సీమలో కూడా శ్రీనాథుడికి కారం కలిపిన జొన్నకూడు తినవలసిన దుర్గతి తటస్థించింది. అప్పుడు ‘గరళము మ్రింగితి ననుచుం/బురహర గర్వింపబోకు పో పో పో నీ/ బిరుదింక గానవచ్చెడి/ మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ’ అని పరమశివుడిని సవాలు చేశాడు. దుర్భిక్ష దుర్గతిని అనుభవించి పలవరించిన తొలి తెలుగు కవి శ్రీనాథుడు.ఆధునికులలో విద్వాన్ విశ్వం రాయలసీమలోని పెన్నా పరివాహక ప్రాంతంలోని పల్లెల కరవు కష్టాలకు చలించిపోయి, ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు’ అంట ‘పెన్నేటి పాట’ను హృదయ విదారకంగా రాశారు. కరవు మనిషిని నానా రకాలుగా దిగజారుస్తుంది. నేరాలకు పురిగొల్పుతుంది. ‘కరవు కాలంలో రొట్టెముక్కను దొంగిలించిన మనిషిని దొంగగా చూడరాదు’ అన్నాడు బ్రిటిష్ గీత రచయిత క్యాట్ స్టీవెన్స్. అయితే, కరవు కాలంలో మనుషుల్లో అంత ఔదార్యం మిగిలి ఉంటుందా అన్నది అనుమానమే! మొదటి ప్రపంచయుద్ధం దెబ్బకు 1914–23 కాలంలో భారత్ సహా నలబై ఐదు దేశాలు కరవు కాటకాలతో అల్లాడిపోయాయి. అప్పటి కరవుకాలంలో అమెరికా ఈ దేశాలను ఆదుకున్న తీరును, ఆనాటి కరవు తీవ్రతను వివరిస్తూ అమెరికన్ రచయిత, సామాజిక కార్యకర్త హెర్బర్ట్ హూవర్ ‘యాన్ అమెరికన్ ఎపిక్: ఫేమిన్ ఇన్ ఫార్టీ ఫైవ్ నేషన్స్’ అనే పుస్తకం రాశాడు. నేటి ప్రపంచంలో కరవు కరాళనృత్యం చేసే దేశాల్లో సోమాలియా ముందు వరుసలో ఉంటుంది. ప్రకృతి కారణాలే కాకుండా; యుద్ధాలు, సంక్షోభాలు అక్కడి కరవును మరింత కర్కశంగా మారుస్తున్నాయి. ‘ఆకలి నా అనుదిన ఆహారం/ కరవు నా ఊపిరి/ నిర్లక్ష్యమే నా సంరక్షణ/ దాతల జోలపాటకు నేను నిద్రపోతాను/ ఆ పాట ఎలా పాడాలో వితరణ సంస్థలకు తెలుసు’ అంటాడు ‘నేను సోమాలీ శిశువును’ అనే కవితలో సోమాలీ కవి అబ్ది నూర్ హజీ మహమ్మద్. నేడు కరవు, ఎడారీకరణలపై పోరాట దినం. ప్రస్తుత ప్రపంచంలో ఇరవై మూడు దేశాలు గడచిన ఆర్థిక సంవత్సరంలో కరవు ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. వీటిలో మూడు ఆఫ్రికన్ దేశాలైతే, వరుసగా నలభై ఏళ్ల నుంచి కరవుతోనే సతమతమవుతున్నాయి. కరవు కాటకాలు ఉన్నచోట అశాంతి, అలజడులు తప్పవు. మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది. ‘హింస కలుపుమొక్కలాంటిది. ఎంతటి కరవు వాటిల్లినా అది చావదు’ అన్నాడు ఆస్ట్రియన్ రచయిత సైమన్ వీసెంతాల్. నాజీల మారణకాండ నుంచి తప్పించుకుని, బతికి బట్టకట్టిన వాడాయన. కరవు కాటకాలు కనుమరుగైతే తప్ప ప్రపంచంలో శాంతి సామరస్యాలు సాధ్యంకావు. అయితే, అలాంటి రోజు ఎప్పటికైనా వస్తుందా? మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ‘నిజంగానే నిఖిలలోకం / నిండు హర్షం వహిస్తుందా?/ మానవాళికి నిజంగానే/ మంచికాలం రహిస్తుందా?’ -
సంజీవని కావాలి!
మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం. మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి. మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వే జెస్’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! -
సాహిత్య ఒడంబడికలు
59 ఏళ్ల ఆ వ్యాపారవేత్తకు నయంకాని చర్మవ్యాధి వస్తుంది. కాళ్లకు ఎప్పుడూ పట్టీలు కట్టాల్సిన పరిస్థితి. భార్య ఇష్టపడదు. అతణ్ణి తాకనివ్వదు. అసహనం కమ్ముకున్న వ్యాపారవేత్త విసిగిపోయి తన గోడౌన్ లో నివసించడం ప్రారంభిస్తాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి గురించి బెంగ. అతను తండ్రి బాగోగుల కోసం ఒక మహిళను తెచ్చి పెడతాడు. ఆ మహిళ ఆ వ్యాపారవేత్త పట్ల కారుణ్యమూర్తి అవుతుందా? మానవ స్వభావాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమేమిగా మారుతుంటాయి? తమిళ సాహిత్యంలో నిన్న మొన్న పూచిన కలం ముతురాస కుమార్ రాసిన ఇలాంటి కథలున్న సంకలనాన్ని ‘మీ భాషలోకి అనువదిస్తారా... మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) సైన్ చేస్తారా’ అని కన్నడ, మలయాళ పబ్లిషర్లతో సూటూ బూటూ వేసుకుని చర్చిస్తున్న లిటరరీ ఏజెంట్ అక్కడ కనిపించింది. ‘ఇమయం’ కలం పేరుతో పాతికేళ్లుగా రాస్తున్న స్కూల్ టీచర్ వి.అన్నామలై కిడ్నీ బాధితుల జీవితాన్ని నవలగా రాయడానికి ఏకంగా సైంటిస్ట్ అంతటి పరిశోధన చేశాడు. కిడ్నీ ఎలా పని చేస్తుంది, ఎందుకు పాడవుతుంది, పాడయ్యాక ఎలా ఎదుర్కొనాలి, ఇందులో మందుల, ఆస్పత్రుల గూడుపుఠానీ ఏమిటనేవి వివరిస్తూ ‘ఇప్పోదు ఉయిరోడు ఇరిక్కిరేన్ ’ పేరుతో నవల రాస్తే వెంటనే ‘ఐయామ్ ఎలైవ్.. ఫర్ నౌ’ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువాదమైంది. అది సరిపోతుందా? స్పానిష్, టర్కిష్, నేపాలీ, లేదంటే తెలుగు భాషల్లోకి అనువాదమైతేనే కదా తమిళ నవల గొప్పదనం తెలిసేది! ‘అనువాదం చేయించి పబ్లిష్ చేస్తారా మరి’ అని మరో లిటరరీ ఏజెంట్ అక్కడ విదేశీ పబ్లిషర్ల డెస్క్‌ల దగ్గర తిరుగాడుతూ కనిపించాడు. ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024’ పేరుతో చెన్నపట్టణంలో జనవరి 16–18 తేదీల్లో మూడురోజులు సాగిన పుస్తక ప్రదర్శన నిజానికి ‘రైట్స్ హబ్’. ఇది తమిళనాడు ప్రభుత్వ పూనికతో, తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి అనువాదం చేసి అందించడానికి హక్కుల క్రయవిక్రయాలకు నియోగించిన వేదిక. మిగిలిన భారతీయ భాషల్లో రచయితలు తాము రాసిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించుకోవడానికి పాట్లు పడాలి. కాని తమిళనాడు ప్రభుత్వం తన భాషా సాహిత్యాన్ని అనువాదం చేయించడానికి గత రెండేళ్లుగా ఈ రైట్స్ హబ్ నిర్వహించడమే కాదు అందుకు ‘తమిళనాడు ట్రాన్ ్సలేషన్ గ్రాంట్’ పేరుతో ఆర్థిక అండ కూడా అందిస్తోంది. అంటే మీరొక పబ్లిషరై ఒక తమిళ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురిస్తానంటే ఒక్కో పుస్తకానికి పేజీల సంఖ్యను బట్టి గరిష్ఠంగా రెండున్నర లక్షలు మంజూరు చేస్తుంది! రెండున్నర లక్షలు!! దానికి బదులుగా మీరు 500 కాపీలు ప్రచురిస్తే 50 కాపీలు, 1000 కాపీలు ప్రచురిస్తే 100 కాపీలు ప్రభుత్వానికి దఖలు పరచాలి. గ్రాంటు డబ్బుల్లో అనువాద ఖర్చులు, బుక్‌మేకింగ్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు బాగానే సరిపోతాయి. కాపీలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు పబ్లిషర్లవే! ‘తమిళంలో గత వందేళ్లలో గొప్ప సాహిత్యం వచ్చింది. ప్రపంచ సాహిత్యానికి ఇది ఏ మాత్రం తక్కువ కాదు. మేము ఇప్పటి వరకు రష్యన్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ నుంచి అనువాదాలు బోలెడు చేసుకున్నాం. బయట దేశాల, భారతీయ భాషల సాహిత్యం తమిళ అనువాదాల ద్వారా చదివాం. ఇప్పుడు మీ వంతు. మా సాహిత్యాన్ని చదవండి. అనువాదం చేసుకోండి. మా సాహిత్యాన్ని మీకు చేరువ కానీయండి’ అని బుక్ ఫెయిర్ అనుసంధానకర్త, రచయిత మనుష్యపుత్రన్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. గత సంవత్సరం నుంచి మొదలైన ఈ గొప్ప సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. 2023లో జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్లో దేశీయంగా, విదేశీయంగా 100కు పైగా తమిళ పుస్తకాల అనువాదాలకు ఎంఓయులు జరిగితే ఇప్పటికి 52 పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో చైనీస్, అరబిక్, మలయా, కొరియన్, కన్నడ, మలయాళ భాషల్లో వెలువడ్డ తమిళ పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు తమిళ కథారచయిత సుజాత కథలు తమిళం ద్వారా పాఠకులకు తెలుసు. ఇప్పుడు చైనీస్ ద్వారా మొత్తం చైనాకు తెలుసు. చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024లో పాల్గొన్న 40 దేశాల పబ్లిషర్లు, భారతీయ భాషల పబ్లిషర్లు ఫెయిర్ ముగిసే సమయానికి 750 ఎంఓయులు చేసుకున్నారు. ఇవన్నీ తమిళం నుంచి ఇతర భాషలకు మాత్రమే కాదు... ఇతర భాషల నుంచి తమిళ లేదా ఏ భాషలోకైనా గానీ! అయితే తమిళనాడు ప్రభుత్వ ట్రాన్ ్సలేషన్ గ్రాంట్ మాత్రం తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదమయ్యే పుస్తకాలకే! తమిళ ప్రభుత్వం ఈ ఒడంబడికల కోసం ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఇంగ్లిష్ రాని రచయితల, పబ్లిషర్ల తరఫున చర్చలు చేయడానికి 20 మంది లిటరరీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి మరీ రంగంలో దింపింది. ఎంత బాగుంది ఇది! ఏ ప్రభుత్వానికైనా తన సాహిత్య సంపద పట్ల ఉండవలసిన కనీస అనురక్తి ఇది!! మరి మన సంగతి? తెలుగు సాహిత్యం నుంచి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అనాసక్తి లేకపోవచ్చు. తమ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకునే తపన ఆ రెండు ప్రభుత్వాలకు తప్పక ఉండి ఉండొచ్చు. కాకుంటే సాహిత్య ప్రపంచం నుంచి, శాసనాధీశుల నుంచి, పాలనా వ్యవస్థలోని చదువరులైన ఐ.ఏ.ఎస్ అధికారుల నుంచి తగిన చొరవ, ఒత్తిడి కావాలంతే! ‘చలం రాసిన ‘మైదానం’ను కొరియన్ లోకి అనువదిస్తారా?’ అని ఒక లిటరరీ ఏజెంట్, ‘గుఱ -
44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీ ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాల విజేతలు వీరే... డాక్టర్ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు(ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి(ప్రాచీన సాహిత్యం), డాక్టర్ వి.వి.రామారావు (సృజనాత్మక సాహిత్యం), టి.వి. ప్రసాద్ (కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్ (అనువాద సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి(బాల సాహిత్యం), డాక్టర్ ఎ.వి.వీరభద్రాచారి(వచన కవిత), కొరుప్రోలు మాధవరావు(తెలుగు గజల్), జి.వి.కృష్ణమూర్తి(పద్యరచన), డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు(పద్యరచన), డాక్టర్ పసునూరి రవీందర్(కథ), వేముల ప్రభాకర్(నవల), ఆర్.సి.కృష్ణస్వామిరాజు (హాస్య రచన), జి.భగీరథ(జీవిత చరిత్ర), తాళ్లపల్లి మురళీధరగౌడ్(వివిధ ప్రక్రియలు), చిలువేరు రఘురాం(నాటక రచయిత), డాక్టర్ వి.వి.వెంకటరమణ(జనరంజక విజ్ఞానం), ఎస్.వి.రామారావు (పరిశోధన), అన్నవరపు బ్రహ్మయ్య(పత్రికారచన), రాళ్లపల్లి సుందర్రావు(భాష), ఘట్టమరాజు అశ్వత్థామనారాయణ(సాహిత్య విమర్శ), కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి(అవధానం), పి.వి.సాయిబాబ (లలిత సంగీతం), డాక్టర్ కె.శేషులత(శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), ఎం.డి.రజియా(జానపద కళారంగం), పస్తం కొమురమ్మ(జానపద కళలు), డాక్టర్ పొనుగోటి సరస్వతి(ఉత్తమ రచయిత్రి), శైలజామిత్ర(ఉత్తమ రచయిత్రి), నాగమణి(ఉత్తమనటి), మాలెల అంజిలయ్య(ఉత్తమ నటుడు) ప్రొఫెసర్ భాస్కర్ శివాల్కర్ (నాటక రంగంలో కృషి), పేరిణి ప్రకాశ్(పేరిణి), డాక్టర్ రుద్రవరం సుధాకర్(కూచిపూడి నృత్యం), డాక్టర్ గెల్లి నాగేశ్వరరావు(సంఘసేవ), పేరలింగం(హేతువాద ప్రచారం), బండారు విజయ(మహిళాభ్యుదయం), డాక్టర్ ముదిగంటి సుధాకర్‌రెడ్డి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం(గ్రంథాలయకర్త), ఆకృతి సుధాకర్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), శ్యామ్ (ఇంద్రజలం), నారు (కార్టూనిస్ట్), డాక్టర్ ఎ.ఎస్.ఫణీంద్ర (జ్యోతిషం), ఎజాజ్ అహ్మద్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫెసర్ ప్రీతి సంయుక్త(చిత్రలేఖనం) తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల 28, 29వ తేదీలలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.5,116 నగదు, పురస్కారపత్రంతో సత్కరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
అక్షరాల ఉత్సవం
మనుషులతో కూడిక మనిషికి ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇల్లు విడిచి బయటకు కదిలే సందర్భాలు తిరిగి ఉత్సాహంగా ఇల్లు చేరడానికి, చేయవలసిన పనిలో పునర్‌లగ్నం కావడానికి దోహదం చేస్తాయి. కదలకుండా ఉండిపోయే మనిషిని కదల్చడానికి, తోటి మనిషిని కలవడానికి, లోకం తెలుసుకోవడానికి పెద్దలు పూర్వం ఆధ్యాత్మికత పేరుతోనైనా కూడికలు ఏర్పాటుచేశారు. జాతరలు, తిరునాళ్లు, తీర్థయాత్రలు, పుష్కరాలు, కుంభమేళాలు... ఇవన్నీ మనిషిని కదిల్చి తనలాంటి మనుషులను కలిసేలా చేస్తాయి. భారతీయులు ఈ నిష్ఠను పాటించడంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. తెలుగువారు అందుకు సరిసమానం కాకుండా ఎలా ఉంటారు? మన జాతరలు కిటకిటలాడతాయి. మన పుణ్యక్షేత్రాలు కళకళలాడతాయి. అయితే సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు సంబంధించి ఈ నిష్ఠ మనలో ఏ మేరకు ఉన్నదన్నది ప్రశ్న. సాహిత్యం కోసం కదలడం, సంస్కృతికై కూడటం. సంవత్సరంలో ఒకసారి ప్రపంచంలోని గొప్ప గొప్ప తెలుగు కూచిపూడి కళాకారులందరూ విజయవాడ కూచిపూడి ఉత్సవంలో పాల్గొంటారు. ఆ ఉత్సవం చూడటానికి దేశ విదేశాల నుంచి అతిథులు వస్తారు. సంవత్సరంలో ఒకసారి ప్రపంచంలోని తెలుగు మేటి జానపద కళాకారులందరూ ఆదిలాబాద్‌లో జమ అవుతారు. వేదికలు అదరగొడతారు. చూడటానికి దేశం కదిలి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి తెలుగు నాటకరంగ దిగ్గజాలందరూ నాటకాలతో తెనాలికి పొలోమంటారు. వారం రోజుల పాటు గొప్ప గొప్ప నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ నాటక ఉత్సవం కోసం ప్రేక్షకులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. తిరుపతిలో వీనుల విందుగా శాస్త్రీయ సంగీత ఉత్సవాలు జరుగుతాయి. త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య మార్మోగుతారు. సీట్లు దొరక్క ప్రేక్షకులు అవస్థ పడతారు. వరంగల్‌లో అద్భుతమైన చిత్రకళా ఉత్సవం జరుగుతుంది. తెలుగు చిత్రకారులందరూ తరలివస్తారు. రంగులు, బ్రష్షులు పట్టుకుని చిన్నారులు చూడ పరిగెడతారు. ప్రతి ఏటా హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలోని ఉత్తమ సినిమా నిపుణులకు ఆహ్వానం పలుకుతుంది. స్పీల్బర్గ్, కామెరూన్ వంటి వారు సినిమాల గురించి మాట్లాడతారు. కొత్త తరానికి ఉత్సాహాన్ని ఇస్తారు. ఇలా జరుగుతున్నదా? ఇలా ఎందుకు జరగడం లేదు? స్వర్ణకాలం అంటే కొత్త అపార్ట్మెంట్లో చదరపు అడుగు ఆరున్నర వేలు పలకడం కాదు. కొత్త కార్లు రోడ్ల మీద కిటకిటలాడటం కాదు. ప్రజలు తమ సాంస్కృతిక అభిరుచిని సజీవంగా ఉంచుకునే కాలం. కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, నటీనటులు, వాద్యకారులు, చిత్రకారులు, హస్తకళా మాంత్రికులు తమ సృజనను ఉన్నతీకరించుకుంటూ సమాజంతో అనుసంధానం చేస్తూ పరస్పర సంలీనతతో పురోగమించే కాలం స్వర్ణకాలం. కళలకు ఆదరణ లభించిన అట్టి కాలమే చరిత్రలో నమోదయ్యింది. అలాంటి కాలం కొరకు ఏం చేయాలి? 16 ఏళ్ల క్రితం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ప్రారంభించినప్పుడు వేదికకు ఒక మూల నిలుచుని యాభై మందైనా వస్తారా అని బితుకుబితుకుమన్నా. ఇవాళ చూడండి వేలాదిగా పోటెత్తుతున్నారు అని ఆ ఫెస్టివల్ నిర్వాహకుడు సంజొయ్ కె.రాయ్ అన్నాడు. అతడు ప్రయత్నం మొదలెట్టాడు. తర్వాత ప్రజలు తోడు నిలిచారు. కనుకనే జైపూర్‌లో ఏటా జనవరిలో జరిగే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు వందల మంది రచయితలు, వేలాదిగా పాఠకులు తరలి వస్తారు. ఆ సంవత్సరంలో ఇంగ్లిష్‌లో కొత్త పుస్తకాలు రాసిన, అనువాదమైన రచయితలు మాట్లాడతారు. అంతర్జాతీయ అవార్డు రచయితలు అందరిలో ఒకరై కనిపిస్తారు. ఆలోచనల మార్పిడి జరుగుతుంది. రచయితలు ఇదంతా మన సమూహం అని ఊపిరి నింపుకొంటారు. విద్యార్థులు హాజరై ప్రశ్నలు సంధిస్తారు. సృజన ఒక తరం నుంచి మరో తరాన్ని తాకుతుంది. సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే సంస్కృతినీ, భాషనూ సెలబ్రేట్ చేసుకోవడం. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ స్ఫూర్తితో ఇవాళ దేశంలో ఎన్నో లిటరేచర్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. పర్వత ప్రాంతాల వారు డెహరాడూన్లో, పంజాబ్ వారు కసౌలీలో, కేరళ వారు కోళిక్కోడ్‌లో, బెంగాలీలు కోల్‌కతాలో, కన్నడిగులు బెంగళూరులో, తమిళులు చెన్నైలో.. ప్రతి ఏటా లిటరేచర్ ఫెస్టివల్స్ జరుపుకొంటున్నారు. ఇతర ప్రాంతాల రచయితలను ఆహ్వానిస్తున్నారు. ప్రజలు వీటికి హాజరై సృజనకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. తమ జాతి మక్కువను నిరూపించుకుంటున్నారు. మరి తెలుగులో? ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లో మొక్కుబడిగా సాగే ‘హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్’ తప్ప ఘనమైన తెలుగు లిటరేచర్ ఫెస్టివల్స్ మనకు లేవు. కన్నడ రచయితలు ఎక్కడ ఉన్నా ఏటా జాతీయ కన్నడ రచయితల ఉత్సవం పేరుతో ఏదో ఒక ఊరిలో కలుస్తారు. తెలుగు రచయితలు పక్క జిల్లా రచయితలతో కలిసే సందర్భాలు ఏర్పడవు. సాంస్కృతిక మందకొడితనం ఎందుకు మనలో మెండుగా ఉంటుందో తెలియదు. తెలుగు మహాసభలు జరగవు. భాషా ఉత్సవాలు జరగవు. మహా రచయితల శత జయంతులకు కూడా చీమ చిటుక్కుమనదు. పరిషత్ పోటీలు కొనఊపిరితో ఉంటాయి. మరో భాషలో రాసే రచయితను జీవిత కాలంలో ఒక్కసారైనా కలవకుండానే మన రచయితలు బావి బతుకులకు పరిమితమైపోతారు. ఇలా ఉంటే తెలుగు సాహిత్యస్థాయి మెరుగయ్యి ఎల్లలు దాటడం కల్ల. పెళ్లిళ్లు ఘనంగా చేయడమూ, భారీ కల్యాణ మంటపాలు కట్టడమూ జరుగుతున్న ఈ కాలంలో పన్నెండు కోట్ల మంది తెలుగువారు తమ తెలుగు సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఒక ఉత్సవం జరుపుకోలేకపోవడమే అమోఘమైన దారుణం. అత్యద్భుత విషాదం. -
సాహితీ శరత్తు
ప్రాచీన కవులు మొదలుకొని నవీన కవుల వరకు శరదృతు వర్ణన చేయని కవులు సాహితీలోకంలో అరుదు. వర్షకాలం నిష్క్రమించి, కరిమబ్బులు తొలగిన స్వచ్ఛగగనంలో రాత్రివేళ కనిపించే చంద మామ కురిపించే వెన్నెల సోనల జడిలో మనసు తడిసి మురిసిన కవులు నిలువెల్లా పులకించి పుంఖాను పుంఖాలుగా పద్యాలు రాశారు. ‘శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం/ జారు తరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో/ దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క/ ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరపూరితంబులై’– భారతంలో నన్నయ చివరి పద్యం ఇది. వెన్నెల ధగధగలతో నిండిన శారద రాత్రులు నక్షత్రాల పట్ల దొంగల య్యాయని ఈ పద్యంలో చమత్కరించాడాయన. వెన్నెల వెలుగుల్లో నక్షత్రాలు అంత స్పష్టంగా కనిపించవు కదా! కర్పూరపు పొడిలా వెన్నెల కురుస్తోందని, వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగిపోతోందంటూ శరద్రాత్రులను కళ్లకు కట్టాడాయన. శరదృతువును ‘న భూతో న భవిష్యతి’ అనే రీతిలో వర్ణించిన కవి ఆంధ్రభోజుడు కృష్ణదేవ రాయలు. ఆయన కావ్యం ‘ఆముక్త మాల్యద’లో శరదృతువును వర్ణించే పద్యాలు అనేకం ఉన్నాయి. వాటిలో మచ్చుకొకటి చూద్దాం. ‘గగనలక్ష్మి నిజోరు నక్షత్రమాలి/ కలు, వియన్నది జలముల గడుగ బిసుక/ నెఱయు కుంకుడు బండుల నుఱువులనగ/ బలపలని పాండురాంబుద పంక్తులమరె’– గగనలక్ష్మి తన ఇరవైఏడు నక్షత్రాల ముత్యాల సరాలను ఆకాశగంగలో కుంకుడురసంతో కడుగు తోందట. ఆ కుంకుడు నురుగులా ఉన్నాయట శరదాకాశంలో తేలియాడే తెలిమబ్బులు. ఇంతటి వర్ణన ప్రాచీన సంస్కృత సాహిత్యంలో సైతం ఎక్కడా కనిపించదు. రుతువర్ణనలోనూ వికటకవి తెనాలి రామకృష్ణుడి పద్ధతే వేరు! ‘పాండురంగ మాహాత్మ్యము’లో తెనాలివారి శరదృతు వర్ణనకు ఒక మచ్చుతునక– ‘కలుగకుండిన నేమి కడిమి పువ్వుల తావి/ ననిచిన మరువమెంతటికి నోప?/ దొదవకుండిన నేమి మదకేకి నటనంబు/ చాలదె యంచల సంభ్రమంబు?/ మెరవకుండిననేమి మెరుగుల పొలప మే/ తన్మాత్రములె శాలిధళధళములు?/ సుడియకుండిన నేమి సోనవానల పెల్లు/ గజదాన వృష్టికి గడమ కలదె?/ కారుకాలాన కలిగిన గౌరవంబు/ చౌకౖయె తోచె శరదృతు సౌష్ఠవమున/ నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన/ వెనుక యధికారి యవికావె విభవకళలు?’. వర్షకాలంలోని కడిమిపూల పరిమళం లేదుగాని, శరత్తులో మరువం సుగంధం ఉంది కదా! నెమళ్ల నాట్యం లేకపోతేనేం హంసల సంరంభముంది కదా? మెరుపులు మెరవకపోతేనేం శాలిధాన్యాల తళతళలున్నాయి కదా! చిరుజల్లులు కురవకపోతేనేం ఏనుగులు మదజలాలను వర్షిస్తున్నాయి కదా! వర్షాకాలంలో దొరికేవి శరత్తులో మరింత చౌకగా దొరుకుతున్నాయి. శరత్తు తన ధర్మాలతో పాటు వర్షాకాల ధర్మాలనూ చూపుతోంది. ఒక అధికారి వైదొలగాక వచ్చే అధికారికి పాత అధికారి వైభవం దక్కినట్లే, శరత్తుకు వర్షరుతు వైభవమూ దక్కిందని చమత్కరించడం తెనాలి రామకృష్ణుడికే చెల్లింది. నవీనుల్లో చూసుకుంటే, ‘ఓ సఖీ! ఓ సుహాసినీ! ఓ శరద్వి/భావరీ నర్తకీ! కవిభావనా వి/లాసినీ! నిత్యసైరంధ్రి! ఓ సమస్త/ లోక మోహినీ! ఓ స్వప్నలోకరాజ్ఞి!’ అంటూ శరదృతువును అపూర్వంగా సంబోధించారు ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి. ఆరు రుతువుల్లోనూ అత్యంత ఆహ్లాదకరమైనది శరదృతువు. వర్షాలు తగ్గుముఖం పట్టి, నిర్మలాకాశం కనిపిస్తుంది. నేల మీద చిత్తడి తగ్గుతుంది. వాతావరణం సమశీతలంగా ఉంటుంది. ఉక్కపోతా ఉండదు, వణికించే చలీ ఉండదు. పనిపాటలకు మాత్రమే కాదు, విహార విలాసాలకూ కాలం అనుకూలంగా ఉంటుంది. ‘పెరిగిన శాలిసస్యముల బెంపువహించిన భూతలంబులన్/ సరసతృణాభితృప్తమయి, స్వస్థములై తగు గోకులంబులన్/ వరకలహంస సారసరవంబులకుం బ్రతిపల్కు సీమలం/ బరగుచు నెందు జూచినను భవ్యములయ్యెను నేడు క్షేత్రముల్’– అంటూ కాళిదాసు ‘ఋతు సంహారం’లోని శరద్వర్ణనను తిరుమల కృష్ణదేశికాచార్యులు తెలుగులోకి అనువదించారు. ఇక ‘ఋతుఘోష’లో శేషేంద్ర ‘ముల్లోకములు ఏలు ముద్దుహరిణాంకుడు/ విరజాజి తీవలకు విరహిణీ జీవులకు/ తరిపి వెన్నెల పాలు త్రాగించుచున్నాడు’ అని శరత్ చంద్రుడి విలాసాన్ని వర్ణించారు. నింగీ నేలా ఆహ్లాదభరితంగా ఉండే అద్భుతమైన రుతువు ఇది. ఈ ఆహ్లాదభరితమైన రుతువు లోనే శరన్నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీ. మన సంస్కృతిలో వసంత నవరాత్రుల కంటే శరన్నవరాత్రులకే ప్రాశస్త్యం ఎక్కువ. శరన్నవరాత్రుల్లో దేశం నలుమూలలా ఘనంగా దేవీపూజలు చేస్తారు. విజయదశమి దసరా పండుగగా ఆబాల గోపాలానికీ ప్రీతిపాత్ర మైన పండుగ. ఒకప్పుడు దసరా పండుగ రోజుల్లో పిల్లల సందడి ఎక్కువగా ఉండేది. గురువుల వెంట పిల్లలు విల్లంబులు పట్టుకుని ఇంటింటికీ వెళ్లేవారు. ‘ఏదయా మీ దయా మామీద లేదు/ ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు... అయ్యవారికి చాలు ఐదు వరహాలు/ పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’ అంటూ పద్యాలు పాడేవారు. ఇంటివారు ఇచ్చే కానుకలు తీసుకుని సంతోషంగా కేరింతలు కొడుతూ వెళ్లేవారు. అదొక ముచ్చట. నాలుగైదు దశాబ్దాల కిందటి వరకు తెలుగునాట ఊరూరా సజీవంగా ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు కనుమరుగైపోయింది. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ప్రకృతి కొంత గతి తప్పుతోంది. అలాగని ప్రకృతి తన రుతుధర్మాన్ని నెరవేర్చు కోవడాన్ని మానుకోలేదు. అందుకే మనం ఇంకా శరత్తుల సౌందర్య సౌరభాలను ఎంతో కొంత ఆస్వాదించగలుగుతున్నాం. -
న్యూజీలాండ్‌లో జరగనున్న 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఆక్లాండ్ (న్యూజీలాండ్): 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆక్లాండ్ (న్యూజీలాండ్) కేంద్రంగా అంగరంగ వైభవంగా జరగనుంది. సెప్టెంబర్ 17-18, అక్టోబర్ 2, 2022 తేదీలలో నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. అంతర్జాల వేదిక ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటులు, రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొంటారు. ఆహూతుల సమక్షంలో ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదికా, రెండు ప్రసంగ వేదికలూ ప్రత్యక్షంగానూ, అంతర్జాలం కేంద్రంగా 14 ప్రసంగ వేదికలూ, ఒక పురస్కార వేదిక వెరసి... 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వీటితో పాటు జీవన సాఫల్య పురస్కారాలను కొమరవోలు సరోజ (కెనడా), ఓలేటి పార్వతీశం (ఇండియా) కు ప్రదానం చేయనున్నారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహుకులుగా వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్), వంశీ రామరాజు (ఇండియా), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు (టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా) వ్యవహరించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు
‘‘కవిత్వానికి కవి ఇవ్వాల్సిందేమిటి? బహుశః తన రక్తమాంసాలివ్వాలి. సొంత భాషనివ్వాలి. అంతిమంగా తన ప్రాణమివ్వాలి. కవితకి భావాలు, భావ చిత్రాలు, అలంకారాలు ఇవ్వటం వేరు. ఇవి బాహ్య విషయాలు మాత్రమే. కవి రక్తమాంసాల్ని హరించినప్పుడే కవిత జవజీవాలు పొందుతుంది. ఒక మహా శిల్పం రూపొందించిన తర్వాత అంతిమంగా దానికి ప్రాణరేఖ చెక్కే శిల్పిలాంటి వాడే కవి. ప్రతి గొప్ప కవిత ప్రాణమున్న వ్యక్తే’’ – పాపినేని శివశంకర్ పది కాలాలపాటు నిలబడే కవిత్వం గురించి శివశంకర్ వ్యాఖ్యానం ఇది. ఈ వాక్యాలు చెప్పడానికి శివశంకర్ గమనింపు ఏమిటి? ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? ఎన్ని అధ్యయనం చేసి ఉండాలి? నాలుగు పుస్తకాలకు సమీక్షలు రాసి ప్రముఖ విమర్శకులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య విమర్శకు ‘శివశంకర్’ ఏమి ఇచ్చాడు? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ‘సాహిత్యం– మౌలిక భావనలు’ సిద్ధాంత గ్రంథం, ద్రవాధునికతను తెలుగు సాహిత్యానికి అన్వయించడం, నిశాంత పేరు మీద అందించిన సాహిత్య తాత్విక వ్యాసాలను మనం పరిశీలించినప్పుడు... కొన్ని అన్వయాలను, కొన్ని భావనలను, ధిక్కారం నిసర్గత లాంటి సాహిత్య సారాంశాన్ని తవ్వితీసే సాధనాలను రూపొందించటానికి కృషి చేసినట్టు తెలుస్తుంది. ‘మనిషి–ప్రకృతి–సమాజం’ అనే త్రికానికి సంబంధించిన సారాంశాన్ని రచయిత అర్థం చేసుకొని, ఆవిష్కరించగలగాలి. విలువలేని సాహిత్యాన్ని తూర్పారబట్టగలగాలని అంటారు. ‘విమర్శకుడు’ అనగానే పనిగట్టుకొని లోపాలు వెతకడం కాదు. మంచిచెడుల వివేచన ఉండాలి. సంయమనం ఉండాలి. వస్తువు, శిల్పం, అభివ్యక్తి, రూపం లాంటి నాలుగు పడికట్టు మాటలతో రచనని చూడటం శివశంకర్‌కి తెలియదు. కవిత్వీకరణకు సంబంధించి ప్రాచీనులు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అనే మూడు హేతువులు అవసరం అన్నారు. ఇవాళ కవిత్వం రాస్తున్నవారికి ప్రాథమికంగా మూడు మౌలిక విషయాలను శివశంకర్ సూచిస్తున్నారు. ( మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) 1. భావబలం, 2. భావనాబలం, 3. భాషాబలం. కవిత్వ విమర్శకుడిగా ఆయన చేసిన మరికొన్ని పరిశీలనలు చూస్తే. 1. కవిత్వం వైయుక్తికాన్ని సామాజిక దృక్పథం నుంచి విలువ కట్టే ఆలోచనా ధోరణి ప్రవేశించింది. 2. ఇవాళ కవిత్వంలో కనబడే ఒక ప్రధాన లక్షణం బహుముఖీనత. ఇక్కడ మహాకవి పదవులు, ఏక నాయకత్వాలు లేవు. ఏక సమయంలో ఎన్నో గొంతులు కలివిడిగా, విడివిడిగా వినిపిస్తున్నాయి. వస్తువు విస్తృతమైనది. కవిత్వాకాశ వైశాల్యం పెరిగింది. 3. దేశీయత లేదా స్థానీయత ఇప్పటి కవిత్వంలో ఒక ముఖ్యాంశం అయింది. ‘విశ్వం నుంచి నాదాకా’ అనే సూత్రం ముందుకొచ్చింది. 4. సొంత భాషని ఎంతగా లీనం చేసుకుంటే ఆ కవి కవిత్వం అంత నిసర్గంగా ఉంటుంది. 5. కవిత్వంమంటే భాష యొక్క ఉన్నత వ్యక్తీకరణ కాదు. అందమైన అభివ్యక్తీ కాదు. పదచిత్రాలు, భావ చిత్రాల పొహళింపు కాదు. జీవితాన్ని తార్కికంగా కాదు, తాత్వికంగా వివేచించాల్సి ఉంది. ఇకపోతే జిగ్మంట్ భౌమన్ చెప్పిన లిక్విడ్ మోడల్ని ‘ద్రవాధునికత’గా శివశంకర్ మనదైన జీవన విధానాలకు అనుగుణంగా అన్వయం చేశారు. శరవేగంగా మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ‘ద్రవాధునికత’ను ఒక పరికరంగా మన ముందుంచారు. వ్యక్తి, ప్రకృతి, సమాజం.. వీటిని వ్యాపారమయం చేసిన తీరు తెలిపారు. మనం ఒక ప్రవాహంలో పడిపోయాం. అది క్షణక్షణం మారిపోయే ప్రవాహం. రూపం మార్చుకున్న ప్రవాహం. ఎక్కడా విలువలు కనిపించవు. కొత్తదనంపై తీవ్రమైన మోజు, అర్ధరాహిత్య జీవనం, అమానవీయత, మానవ దూరం.. ఇవన్నీ ద్రవాధునికతలో భాగం. (Mannu Bhandari: రాలిన రజనీగంధ) ఆయన మాటల్లో ద్రవాధునికత లక్ష్యం ఇది – ‘‘ఇవాళ ముఖ్యంగా నాగరిక, విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్ వర్గ జీవన విధానంలో ద్రవాధునికత తెచ్చిన సరికొత్త మార్పు తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాదఘంటికలు వినగలం. రకరకాల (అడ్డ)దారుల ద్వారా ఉరువైన నూతన సంపన్నవర్గం ఏర్పడింది. దానికి కరెన్సీ స్విమ్మింగ్ పూల్‌లో ఈదడం మహానందం. స్వసుఖ జీవనంతో తప్ప దానికి ఏ సామాజిక, వైయక్తిక విలువలతో పని లేదు.’’ ‘ద్రవాధునికత’ స్థితిని దాటేందుకు కూడా ఆయన కొన్ని పరికరాల్ని చూపారు. ప్రకృతిలో మైత్రి, సామూహికం, పురానవం, నిరహంకారం, నిబ్బరం, సృజనాత్మకత లాంటి విలువైన మార్గాలు చూపారు. ఆయన ద్రవాధునికతను ఒక పనిముట్టుగా చేసుకున్నారు. దాని సాయంతో సమాజంలోని స్థితిగతులను వ్యాఖ్యానించి, మనం ఇంకా ఎంత మంచి మనుషులుగా మారాల్సి వుంటుందో గుర్తు చేశారు. మానవ జీవితం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి అనే వైరుధ్యాన్ని పరిష్కరించే దిశగా రచనలు సాగాలని ఈ విమర్శకుడి ఉద్దేశం. ప్రపంచీకరణ సారాంశాన్ని, పతనీకరణ సారాంశాన్ని గుర్తించి ఎరుకతో ఎలా జీవించాలో హెచ్చరిస్తున్నారు. సాహిత్యంలో జీవితం గురించే కాదు, జీవితంలో సాహిత్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన విమర్శకుడు పాపినేని. - డాక్టర్ సుంకర గోపాల్ వ్యాసకర్త తెలుగు సహాయాచార్యులు (కాకినాడలో పాపినేని శివశంకర్ ‘అద్దేపల్లి కవిత్వ విమర్శ పురస్కారం’ అందుకుంటున్న సందర్భంగా) -
ఆధునిక అభ్యుదయ కవి తిలక్
తణుకు టౌన్: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ, భావ కవిత్వం వైపు నడిపించిన గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సాహిత్య అకాడమీ, తిలక్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన దేవరకొండ బాల గంగాధర్ తిలక్ శత జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు సాహితీ అకాడమీ, తెలుగు అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిలక్ తన రచనల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, జాతి, మత తత్వాలకతీతంగా ఆయన రచనలున్నాయని కొనియాడారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ తిలక్ కవిత్వం 20వ శతాబ్దపు సాహిత్య ప్రపంచంలో ఎక్కువ జనాదరణ పొందిందన్నారు. తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ తర్వాత అంతటి ప్రభావం చూపిన రచనలు తిలక్‌వని కొనియాడారు. నా కవిత్వంలో నేను దొరుకుతాను అని ప్రకటించుకున్న కవి తిలక్ అని, ఆయన కవిత్వానికి మధ్యవర్తులు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో తిలక్ రచనలపై ముద్రించిన పుస్తకాలను చిన వీరభద్రుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తణుకు నన్నయ భట్టారక పీఠం అధ్యక్షుడు జేఎస్ సుబ్రహ్మణ్యం, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు. -
Kalipatnam Ramarao: దిగంతాలకు ‘కథా’నాయకుడు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి, నెట్వర్క్: కథ కన్నీరు పెడుతోంది. కథా నిలయం బోసిపోయింది. ఒక ‘యజ్ఞం’ పరిసమాప్తమైంది. కథలకు కోవెల కట్టి కథా నిలయాన్ని నిర్మించిన కథా నాయకుడు ఇక లేరు. ప్రముఖ కథా రచయిత, కథకుడు, విమర్శకుడు కాళీపట్నం రామారావు (97) శుక్రవారం ఉదయం 8:20 గంటలకు శ్రీకాకుళంలోని తన నివాసంలో కన్నుమూశారు. వయసు వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా ప్రస్తుతం పెద్దకుమారుడు కాళీపట్నం సుబ్బారావు, చిన్న కుమారుడు కెవీఎస్ ప్రసాద్, కుమార్తె లక్ష్మి మాత్రమే ఉన్నారు. శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్ సమీపంలోని శ్మశానవాటికలో ‘కారా మాస్టారు’ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కథానిలయం అధ్యక్షుడు బీవీఏ నారాయణ నాయుడు, కార్యదర్శి దాసరి రామచంద్రరావు, పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, తెలుగు పండితులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు మాస్టారి మృతి పట్ల సంతాపం తెలిపారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించిన కారా మాస్టారు యజ్ఞం, తొమ్మిది కథలకు 1996లో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. కారా మాస్టారు అచ్చయిన కథల కోసం కథా నిలయం పేరిట శ్రీకాకుళంలో ఆలయాన్ని నిర్మించారు. తెలుగు కథలకు గుడి కట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి మనసులను తట్టారు. ‘యజ్ఞం’ కథతో శ్రీకాకుళం మాండలీకానికి మకుటం పెట్టి సాహితీ లోకంలో గుర్తింపు, గౌరవాన్ని సమకూర్చారు. సరళమైన భాషలో సుప్రసిద్ధ రచనలు.. కాళీపట్నం రామారావు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సరళమైన భాషలో రచనలు చేస్తూ సామాన్య పాఠకులను సైతం ఆకట్టుకున్నారు. ‘నేనెందుకు వ్రాసాను వ్యాసం’, ‘తీర్పు’, ‘ఇల్లు’, ‘యజ్ఞం’, ‘మహదాశీర్వచనం’ కథలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. 1964లో యువ పత్రికలో తీర్పు కథతో మాస్టారు కథా రచన తిరిగి ప్రారంభమైంది. 1966లో యజ్ఞం కథతో తెలుగు కథల సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. 1967–70 కాలంలో వీరుడు–మహావీరుడు మొదలు భయం వరకు ఏడు కథలు ప్రచురించారు. విరసం సభ్యుడిగా ఉంటున్న సమయంలో 1970–72 మధ్య శాంతి, చావు, జీవధార, కుట్ర మొదలైన కథలతో వ్యవస్థలోని లోపాలను చక్కగా చూపించారు. శ్రీశ్రీతో ‘యజ్ఞం’ ఆవిష్కరణ 1971 జనవరి 31న విశాఖలో యజ్ఞం కథా సంపుటిని మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. కారా మాస్టారు కొంతమంది మిత్రులతో కలిసి కథా వేదికను ఏర్పాటు చేశారు. 1996 యజ్ఞంతో తొమ్మిది కథలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. సామాజిక స్పృహ... కారా మాస్టారు తెలుగు కథకు దిక్సూచి. వందేళ్ల కథా సాహిత్యంలో పేరెన్నికగన్న పది మంది రచయితల్లో నిలిచేలా, సాహిత్యమే ఊపిరిగా జీవించారు. 97 ఏళ్ల పరిపూర్ణ జీవనయానంలో ఆయన అధిరోహించిన శిఖరాలెన్నో. సాహిత్యం సమాజ పురోగమనానికి దోహదపడాలని రచనలు సాగించిన నిబద్ధత కలిగిన మహనీయుడు. తన రచనల వల్ల ఎంతో మంది జీవితాలు ప్రభావితం కావాలనే లక్ష్యంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. అభూత కల్పనలు, అల్లిబిల్లి కథలు కాకుండా తనను ప్రభావితం చేసిన అంశాలపై కలం పట్టారు. తొలిదశలో కుటుంబాలు, వ్యక్తిగత బాంధవ్యాల నేపథ్యంలో కథలు రాశారు. స్వాతంత్య్రం అనంతరం దేశ సంపాదన ధనవంతులు ఎలా కొల్లగొట్టారో కుండబద్ధలు కొట్టారు. 1963 తరువాత వచ్చిన వీరుడు–వరుడు, ఆదివారం, హింస, నో రూం, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, న్యాయం, సంజాయిషీ, కుట్ర లాంటివి ఒక ఎత్తు కాగా గ్రామీణ భూస్వామి వ్యవస్ధ, దళితులు, అణగారిన వర్గాల కష్టాలు–కన్నీళ్లకు కారణాలను మార్క్సిస్టు కోణంలో ఆవిష్కరించారు. 800తో మొదలై లక్షకు పైగా కథలతో.. కథా నిలయం.. తెలుగు కథల సేకరణకు అంకితమైన గ్రంథాలయం. తెలుగు సాహిత్యంలో ప్రచురితమైన కథలను భావితరాలకు అందించాలన్న ఆశయంతో ఏర్పాటైంది. ఎనిమిది వందల పుస్తకాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగిన కథానిలయం ప్రస్తుతం లక్షకుపైగా కథలకు వేదికగా నిలిచింది. కథానిలయం డాట్‌కామ్ పేరిట వెబ్సైట్ కూడా రూపొందించారు. ప్రస్తుతం 45 ఇతర భాషల్లో ముద్రితమైన తెలుగు అనువాదాలు, 67 ఆత్మకథలు, 95 జీవిత చరిత్రలు, 97 పరిశోధనా పత్రాలు, 100 సంచిత వ్యాసాలు, 105 సంకలన వ్యాసాలు, 414 సంకలనాలు, 450 రకాల శీర్షికలతో పత్రికలు, 2,213 సంపుటాలు, 11,576 పుస్తకాలు, 20,500 పత్రికల సంచికలు కథా నిలయంలో ఉన్నాయి. 15 వేల వరకు కథా రచయితల వివరాలు అందుబాటులో ఉన్నాయి. కారా మాస్టారు తనకు వచ్చిన పురస్కారాలన్నీ వెచ్చించి శ్రీకాకుళంలో 1997 ఫిబ్రవరి 22న ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. తర్వాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చారు. అవార్డులు, రివార్డులు తీసుకోవడం విరసం నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోలేదు. కథా నిలయంలో 1944 నుంచి భారతి పత్రిక ప్రతులున్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నిటికంటే పాతది. తానున్నా లేకపోయినా కథా నిలయాన్ని మూడు దశాబ్దాలు నిరవధికంగా నిర్వహిస్తామని ముగ్గురు వాగ్దానం చేశారని కారా మాస్టారు తరచూ చెప్పేవారు. కొన్నాళ్లుగా కథా రచనకు దూరంగా ఉంటూ కథా నిలయం కోసం ఎక్కువగా శ్రమించారు. తాను జన్మించిన మురపాక అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఏడాదిలో ఒక్కసారైనా వచ్చి వెళ్లేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఉప రాష్ట్రపతి, గవర్నర్ సంతాపం.. కారా మాష్టారు మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, గవర్నర్ హరిచందన్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ సమితి కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఏపీ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, రచయితలు పరచూరి అజయ్, కాటూరి రవీంద్ర, బాబ్జీ, సుధారాణి సంతాపం తెలిపారు. సీఎం జగన్ సంతాపం కారా మాస్టారు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. తనదైన శైలిలో కథలు రచించి తెలుగు సాహితీ లోకానికి విశేష సేవలు అందించారన్నారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సానుభూతి తెలిపారు. రచనలలో సామాజిక బాధ్యత... మాస్టారు బయటకు సౌమ్యుడిగా కనిపించినా ఆయన సామాజిక బాధ్యత తెలిసిన రచయిత. ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలకు కారణం శ్రమ జీవులే, వారి చేతుల్లోనే అధికారం ఉండాలని అంటారు. కన్నీళ్లు, రక్తపాతం లేనిదే అది సాధ్యం కాదనేది ఆయన భావన. రచయితకు ఆవేశం ఉండాలి.. ఆవేశం కదలిక ఇస్తుంది.. కదలిక సృజనకు వారధినిస్తుందనేది కారా అభిప్రాయం. లోక్ నాయక్ పురస్కారం ► 1943 సెప్టెంబర్ 1న తొలికథ చిత్రగుప్తలో రాశారు ► 2008లో లోక్‌నాయక్ పురస్కారం ► 1996లో కేంద్ర సాహిత్య అవార్డు ► 1997లో కథా నిలయం నిర్మాణం.. 1998లో ప్రారంభం ఎందరికో మార్గదర్శకులు.. 1979లో ‘పువ్వుల కొరడా’ కథ రచించిన నాటి నుంచి మాస్టారితో పరిచయం ఉంది. ఏ కథ రాసినా కారా మాస్టారు చూడకుంటే నాకు నిద్రపట్టేది కాదు. నాతోపాటు ఎందరికో మార్గ నిర్దేశకులు. కథానిలయంలో నేనూ భాగస్వామిని కావడం గర్వకారణం. 2020 నవంబర్ 9న 97వ జన్మదినోత్సవం రోజు ‘బహుళ’ అనే నవలను మాస్టారుతో ఆవిష్కరించాం. ఆయన మరణం చాలా బాధాకరం. – అట్టాడ అప్పలనాయుడు, కథా నవలా రచయిత -
కారా మాస్టారు కన్నుమూత
-
కారా మాస్టారు కన్నుమూత: సీఎం జగన్ సంతాపం
సాక్షి, శ్రీకాకుళం: కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కథానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహితీలోకం తీవ్ర దిగ్ర్భాంతిలో మునిగిపోయింది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు. 1924లో శ్రీకాకుళం జిల్లా మురపాకలో జన్మించారు కాళీపట్నం రామారావు. తన దైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన వేలాది మంది శిష్యులు, అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 1964లో రాసిన యజ్ఞం కథ ఆయన విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. కథా రచయితగా తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయనది. ఫ్యూడల్ వ్యవస్థలోని దోపిడికి ‘యజ్ఞం’ అద్దంపడుతుంది. అందుకే ఈ రచన రష్యాలో అనువదింపబడి ప్రపంచ గుర్తింపు పొందింది. భావితరాలను దృష్టిపెట్టుకుని ఫిబ్రవరి 22, 1997లో శ్రీకాకుళంలో కథానిలయం స్థాపించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆరంభమైన ఈ కథా నిలయం లక్ష పుస్తకాలతో అలరారుతుండటం విశేషం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సరళమైన రచన శైలితో వేలాది అభిమానులను ఆకట్టుకున్నారు. కుట్ర, రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన రచనలూ ఆదరణ పొందాయి. సీఎం జగన్ సంతాపం సాహిత్య అకాడమీ గ్రహీత, కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. -
తెలుగు విభాగంలో.. మొదటి ముస్లిం యువతి
తెలంగాణ నవలా రచయిత్రుల రచనలను ఇతివృత్తంగా తీసుకొని సమగ్ర పరిశోధన జరిపిన సయ్యద్ ఆఫ్రీన్ బేగంకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దాంతో తెలంగాణ విశ్వ విద్యాలయం నుంచి తెలుగు విభాగంలో పిహెచ్డి పట్టా పొందిన మొట్టమొదటి ముస్లిం యువతిగా ఆఫ్రీన్ బేగంకు అరుదైన ఘనత దక్కింది. తండ్రి ప్రోత్సాహంతో... కామారెడ్డి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీ లో నివసించే అబ్దుల్ లతీఫ్ కూతురు ఆఫ్రీన్ బేగంకు చిన్నప్పటి నుంచే తెలుగుపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆఫ్రీన్ బేగంను డాక్టర్ చేయాలని తండ్రి లతీఫ్‌కి ఉండేది. అయితే కుమార్తెకు తెలుగుపై ఉన్న మక్కువను గుర్తించి ఆమె తెలుగులో ప్రావీణ్యం సాధించే విధంగా వేలాది రూపాయల విలువ చేసే తెలుగు సాహిత్య పుస్తకాలను కొనుగోలు చేసి బహుమతులుగా అందించారు. ఆఫ్రీన్ బేగం 2013–14లో తెలంగాణ యూనివర్సిటీలో ప్రవేశానికి పీజీ సెట్ రాయగా, అందులోనూ మొదటి ర్యాంకు సాధించి ఎం.ఎ. తెలుగులో ప్రవేశం పొందారు. తెలుగు పై ఆమెకు ఉన్న శ్రద్ధను గ్రహించిన తెలంగాణ వర్సిటి తెలుగు విభాగం ప్రొఫెసర్లు లావణ్య, బాల శ్రీనివాస్‌మూర్తి, త్రివేణి, లక్ష్మణ చక్రవర్తి, ప్రిన్సిపాల్ కనకయ్యలు ఆమెను ఎంతో ప్రోత్సహించడంతో ఆఫ్రీన్ ప్రతిభ కనబర్చి యూనివర్సిటీలోనే టాపర్‌గా నిలిచారు. తెలుగుపై పరిశోధనాత్మక వ్యాసాలు ఆఫ్రీన్ బేగం రాసిన వ్యాసాల్లో తెలుగు సాహిత్యం పై పరిశోధనలే అధికంగా ఉన్నాయి. ఆమె ప్రాచీన కాలం నాటి పుస్తకాలు చదివి తెలుగు చరిత్రపై అనేక వ్యాసాలు రాసారు. ముఖ్యంగా ముస్లిం కథలు– జీవన వాస్తవికత, సామెతల్లో జీవన చిత్రణ, రచయిత్రుల కథల్లో తెలంగాణ జీవన చిత్రణ, తెలంగాణలో నవలా మణులు తదితర వ్యాసాలు ఉన్నాయి. తెలంగాణలో నవలా మణులు అనే పరిశోధనాత్మక కథనంలో గత 400 ఏళ్ళుగా తెలుగు సాహిత్యానికి జరుగుతున్నసేవ, రచయితలు, కనుమరుగైన పేర్లను ఆమె తన వ్యాసంలో రాసి అందరి ప్రశంసలను అందుకున్నారు. గురజాడ పురస్కారం ఆఫ్రీన్ తెలుగు సాహిత్యంపై రాసిన వ్యాసాలను పరిశీలించిన మానవ సాహిత్య సాంçస్కృతిక అకాడమి, విజయవాడ వారు ‘గురజాడ అవార్డు’ను అందజేశారు. అలాగే 2014 మార్చి నెలలో విశాఖపట్టణంలో ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ వారు నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర స్థాయి ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డుల్లో ఆఫ్రీన్ బేగంకు ప్రథమ స్థానం లభించింది. ఈ సందర్భంగా అవార్డుతో సత్కరించారు. – ఎస్. మొహియొద్దీన్, సాక్షి, బాన్సువాడ నాన్న ఇచ్చిన ప్రోత్సాహం పిహెచ్డి చేయాలని నాలో బీజం నాటి, ఆ దిశగా నన్ను విజయవంతంగా ముందుకు నడపడంలో, నాలో ఆత్మధైర్యం పెంపొందించడంలో మా నాన్నతో పాటు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. పిహెచ్డి సాధించాలనే నా కల నెరవేరింది. తెలుగు సాహిత్యంపై మరిన్ని పరిశోధనలు చేయాలనుకుంటున్నాను. – ఆఫ్రీన్ బేగం -
గుండెలో విజ్ఞానం–మనసులో సాహిత్యం
‘‘సాహిత్యమునకు, శాస్త్రమునకు గల అగాథాఖాతమును పూడ్వవలెను. సాహిత్య, శాస్త్రములను ద్వీపములకు వారధి కట్టవలెను. కవులకు, శాస్త్ర విధులకు మధ్యగల నిరవగాహన భిత్తిని పడగొట్టవలెను..’’ అని సర్దేశాయి తిరుమలరావు తన అమూల్య గ్రంథం ‘సాహిత్య తత్వము–శివభారతదర్శనము’లో ఢంకా భజాయించి చెబుతారు. 1928 నవంబర్ 28న కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా జోరాపురంలో జన్మించిన సర్దేశాయి తిరుమలరావు అనంతపురంలో బి.ఎస్సి. చదివి తెలుగు మీద అభిమానంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ (ఆనర్సు) చేయాలని–రెండో ఏడు ప్రవేశం కోరారు. అది సాధ్యపడలేదు, దాంతో రాజస్తాన్‌లోని పిలానీలో బిట్స్–పిలాని ద్వారా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు. 1954లో అనంతపురంలోని ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో రీసెర్చి కెమిస్టుగా చేరి 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. తిరుమల రావు వల్ల ఒకవైపు తెలుగు సాహిత్యం, మరోవైపు ఆయిల్ టెక్నాలజి గణనీయంగా లాభపడ్డాయి. సైన్సూ, సాహిత్యమే జీవితపు తోడుగా సాగిన ఆజన్మ బ్రహ్మచారి ఆయన. సంగీతం వినడం హాబీ. సరస చమత్కారం అలవాటు. లౌక్యం, మొహమాటం ఎరుగని జీవనతత్వం. 1994 మే 10న కనుమూసే దాకా అనంతపురం కమలానగర్లో చిన్న పెంకుటింటిలో అన్నతో కలసి ఉండేవారు. అన్నగారూ బ్రహ్మచారే! ఇంటినిండా పుస్తకాలు మాత్రమే! ఎలాంటి ఫర్నిచర్, టెలిఫోన్ లేకుండా నేల మీదనే అధ్యయనం సాగేది. ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా నేల మీదనే, చాపమీదనే కూర్చోవాలి. నూనెగింజలు విరివిగా రాయలసీమ ప్రాంతంలో పండుతుండటంతో 1949లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థ దేశంలోనే తొలిసారి అనంతపురంలో ఏర్పడింది. ఆ సంస్థ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి సర్దేశాయి తిరుమలరావు. పూర్వీకులు మరాఠీవారు. ఆయనకు మాతృభాష కన్నడం. తెలుగు, ఇంగ్లి్లష్, కన్నడం, సంస్కృతం బాగా వచ్చు. అటు ఆయిల్ టెక్నాలజీలో సుమారు 500 పరిశోధనా పత్రాలు వెలువరించడమే కాక ‘కన్యాశుల్కము–నాటక కళ’, ‘శివభారతదర్శనము–సాహిత్య తత్వము’ వంటి అత్యంత విలువైన గ్రంథాలు సృజియించారు. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టుపురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరపగింజలు, సీతాఫలం గింజలు, అరటి తొక్క, టమోటా విత్తనాలు, దవనం, మరువం, పుదీనా, నువ్వులు, కుసుమలు – ఇలా స్థానికంగా విరివిగా లభించే వాటిపై పరిశోధనలు చేసి, చేయించి పేటెంట్లు పొంది దేశానికి విదేశీ మారకం సాధించారు. ఆంధ్రపత్రిక, భారతి, ది హిందూ, బ్లిట్జ్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ, సైన్స్ టు డే వంటి పత్రికలలో ఆయన వర్తమాన విషయాలు–గతుకుల రోడ్లు, అణుశక్తి, బిచ్చగాళ్ళు, అంతర్జాతీయ రాజకీయాలు, సాహిత్య విషయాలు, మేధో వివాదాలు – ఇలా ఎన్నో ఉత్తరాలలో చర్చించేవారు. ‘దేవాలయంపై బూతు బొమ్మలాంటివాడు గిరీశం’ అని తిరుమలరావు వ్యాఖ్యానించారు. 1952 సమయంలో తిరుమలరావు పిలానిలో చదువుకుంటుండగా ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్షకు దిగిన పొట్టి శ్రీరాములును ఆ పనికి తగడని కొందరు విమర్శించేవారు. గాంధీ నిరాహారదీక్షకు సరిపోయినపుడు పొట్టి శ్రీరాములు ఎందుకు సరిపోడంటూ విద్యార్థిగా ‘హిందూస్తాన్ టైమ్స్’ పత్రికకు ఉత్తరం రాశారు తిరుమలరావు. గాంధీజీ నాలుగో కుమారుడు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ఎడిటర్‌గా ఆ ఉత్తరం ప్రచురించడం విశేషం. మతానికి మంగళం పాడిన పిదపనే సైన్స్ మొదలవుతుందని నమ్మినవాడు సర్దేశాయి తిరుమలరావు. ‘‘బ్రహ్మసూత్రాలను చెప్పిన బాదరాయణునే కాదు అతని శిష్యులను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. కానీ బాదరాయణునితో సాటి అయిన కణాదుని గురించి చాలామందికి తెలియదు. న్యూటన్ రూథర్ ఫర్డ్ పరిశోధనలు వచ్చేదాకా కణాదుని భావనలు చెల్లుబడి అయ్యాయి’’ అనేవారు తిరుమలరావు. (నేడు సర్దేశాయి తిరుమలరావు జయంతి) వ్యాసకర్త: డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 -
బాల్యపు స్మృతుల ప్రతిరూపం-రెక్కలపిల్ల
1980, 90, ఈ శతాబ్ది ఆరంభ దశకాల్లోని పిల్లలు ఎంతైనా అదృష్టవంతులని చెప్పాలి. వారి జీవితాల్లో ఆటలున్నాయి. పాటలున్నాయి. అందమైన స్నేహాలున్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. బాల్యపు మధురిమలను అందంగా అమాయకంగా తమలోకి ఒంపుకున్న రోజులున్నాయి. బడిలోని విద్యతోపాటు సమాజంలో తోటి పిల్లలతో ఆడిపాడి- కులమత వివక్షలకు అతీతంగా పెనవేసుపోయి.. మనిషిలో సంకుచిత్వాన్ని నాటి బాల్యం ఎద్దేవా చేసింది. అమాయకంగా అందరినీ కలుపుకొనిపోయింది. మనుషులకు గీతల్లేవన్నది. మతాల్లేవన్నది. ధనిక-బీద భేదాల్లేవన్నది. దోస్తులతో గుంపులుకట్టి.. అప్పటి బచ్‌పనా తనవారి కోసం ఒక చిన్నసైజు గ్యాంగ్‌వారే చేసింది. మరీ అప్పటి పిల్లలు ఇప్పటి జనరేషన్‌లా ట్రెండీ కాదు. వారికి సెల్‌ఫోన్ తెలియదు. టీవీతో పరిచయం అంతంతమాత్రమే. స్కూలు అయిపోగానే ఇంటికి పరిమితమైపోయి.. ఐదంగుళాల తెరలోకి తల దూర్చి అదే లోకమనుకునే చెడ్డలవాటు అప్పటి పిల్లలకు తెలియదు. అందుకే స్కూలు అయిపోగానే అప్పటి పిల్లలు బ్యాగులు ఇంటిలో పడేసి.. స్వేచ్ఛాగా రెక్కలు విడిచిన పక్షుల్లా వీధుల్లోకి పరిగెత్తుకువచ్చేవారు. తోటి పక్షులతో కలిసి కిచకిచమంటూ అలా స్వేచ్ఛగా విహారానికి వెళ్లేవారు. ఆడేవారు. పాడేవారు. కథలు చెప్పుకునేవారు. అందులో దెయ్యాల కథలు, రాకుమారుల కథలు ఉండేవి. అమ్మలు-నాన్నలు, అమ్మలక్కలు చెప్పుకునే విషయాలుండేవి. ఆటలుండేవి. ఆటల్లో దెబ్బలుండేవి. ఆ ఆటల్లో తాకిన దెబ్బలు దాచుకొని.. దాచుకొని అమ్మకు తెలియకుండా ఇంట్లో నక్కి పండుకునే రోజులుండేవి. ఎంత విచిత్రమైనది బాల్యం. అదొక మాయాలమరాఠీ. ఎన్నో విచిత్రాలు చూపించి.. అమాంతం కరిగిపోయింది. మంత్రదండంలా, ఇంద్రజాలికుడిలా ఎన్నో అద్భుతాలను చూపించి మాయమైంది. స్వచ్ఛమైన అమాయకత్వం బాల్యం. లోకం తెలుసుకోవాలన్న తపన బాల్యం. నిరంతరం ఏదో కొత్త విషయం కోసం ఆరాటపడి ఏది తెల్సినా అదో వింతలా అబ్బురపడే సంచార సహజనైజం బాల్యం. అదొక వజ్రాలగని. తవ్వి చూడండి ఎన్నో అద్భుతమైన మణులు దొరుకుతాయి. జీవితంలోకి మరెంతో వెలుగు వస్తోంది ఆ రంగురంగుల మణుల నుంచి.. అలా బాల్యాన్ని తవ్వితీసి.. అందులోని రంగురంగు మణులను, అద్భుతాలను, చెణుకులను, అల్లరిని, ఆటపాటలను, అమ్మనాన్న, స్నేహితులు, చుట్టు ఉన్న సమాజాన్ని అప్పటి కళ్లతో అంతేగా అమాయకంగా, అంతే స్వచ్ఛంగా అందిస్తే అది రెక్కలపిల్ల పుస్తకమవుతుంది. 56 కథలు, 260 పేజీలు.. ఓ అమాయకపు బాల్యం. ఏ కల్మషమెరుగని పసితనం స్వచ్ఛమైన రెక్కలు తొడిగే ఆకాశమంతా విహరిస్తే.. ఈ రెక్కలపిల్ల అవుతుందేమో. బాల్యం రెక్కలు తొడుగుతూ తొలి అడుగులు వేస్తున్న దశలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి మధ్య ఓ చిన్నారి తన దోస్తులతో ఒక గ్యాంగ్‌లా ఏర్పడి చేసిన విన్యాసాలు, మనషుల పట్ల ప్రేమతో కూడిన బాల్యపు స్మృతులు, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకుంటూ.. దానిపట్ల స్పందించే తీరు.. దాని ప్రశ్నలు.. అన్నింటికీ మించి స్వచ్చమైన అమాయకత్వం.. ఇది రెక్కలపిల్లలోని కథల వరుస. ఈ పుస్తకంలోని అన్ని కథల్లోనూ బాల్యపు ఫ్లేవర్ ఉంటుంది. అన్ని చదివింపజేస్తాయి. చాలావరకు కథలు కథనాత్మకంగా ఉండి చివరివరకూ ఏం జరుగుతుందా? అన్నంత ఆసక్తి రేపుతాయి. గడుసుతనం, పెంకితనం, అనుకుంటే ఏదైనా చేసే బాల్యపు మొండితనం ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో చాలాచోట్ల ప్రశ్నలు చిత్రంగా ఉంటాయి. బాల్యపు ప్రశ్నలు. అమాయకపు ప్రశ్నలు. వాటికి లభించే సమాధానాలు కూడా చిత్రమైనవే అనిపిస్తాయి. పున్నాగ పూలు, వీరబాబు, పడవ ప్రయాణం, వాన కోసం తపస్సు, యాది-జారుడుబండ, ఓ స్త్రీ రేపు రా, జ్వాలాతోరణం కథలు నాకు బాగా నచ్చాయి. యాదగిరి-చిల్లర, రంగ-కలువపూలు, ఓకులు-బెచ్చాలు, అవ్వా-దీపావళి కూడా మంచి కథలు. పిల్లలు అన్ని మతాలను, దేవుళ్లను సమానంగా చూస్తారనడానికి ఇందులో హిందు, ముస్లిం, క్రైస్తవ నేపథ్యాలతో ఉన్న కథలు చాటుతాయి. ఓ స్త్రీ రేపు రా కథలో తన ఇంటి మీద రాయకుండా, తన ఫ్రెండ్ పద్మ ఇంటి మీద రాసి ఉన్న `ఓ స్త్రీ రేపు రా` అన్నది చెరిపేయడం.. దానివెనుక ఉన్న కారణం, జ్వాలాతోరణం కథలో గుడ్డివాడిగా చెప్పి అడుక్కుంటున్న తాతతో జ్వాలాతోరణం కింద నడిపించడం వంటి ట్విస్టులు, లారీ- ఇల్లు కథలో తండ్రికి ఇంటికి రాకపోతే.. రాత్రిపూట ఒంటరిగా బజారు వరకు ధైర్యంగా వెళ్లిరావడం వంటివి కొసమెరుపులు ఆహ్లాదపరుస్తాయి. మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపడానికి, ఆనాటి మధురాతిమధురమైన స్నేహపు స్మృతులను నెమరువేసుకోవడానికి ఈ పుస్తకాన్ని ఓసారి చదివితీరాల్సిందే. - శ్రీకాంత్ కాంటేకర్ ‘రెక్కలపిల్ల’ కథల పుస్తకం. కవయిత్రి, రచయిత్రి శ్రీసుధ మోదుగు రెండో పుస్తకమిది. ఆమె ఇంతకుముందు రాసిన ‘అమోహం’ కవితాసంపుటి పాఠకుల మన్ననను పొందింది. రచయిత్రి ప్రస్తుతం జమైకాలో నివాసముంటున్నారు. వైద్యరంగంలో స్థిరపడ్డారు. -
సాహిత్య పీఠానికి చంద్రగ్రహణం
సాక్షి, రాజమహేంద్రవరం : ‘తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధానకేంద్రంచేస్తాం.’ అంటూ గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దాంతో ఎందరో భాషాభిమానులు బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠానికి మంచి రోజులు వస్తాయని ఆశించారు. అయితే వారి ఆశ అడియాసే అయింది. అన్ని హామీల్లాగే దీన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. దాంతో నానాటికీ సాహిత్యపీఠం కునారిల్లిపోతోంది. ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగువారికి గుర్తింపు తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు తెలుగు భాషా సాహిత్యాల పట్ల అభిమానం ఉండేది. 1985 డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్ కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్‌లో జానపదపీఠం, కూచిపూడిలో కూచిపూడి నాట్యవిభాగం, శ్రీశైలంలో పురావస్తు పరిశోధన విభాగం, ఆదికవి నన్నయ నడయాడిన, ఆంధ్రమహాభారతం అవతరించిన గడ్డ రాజమహేంద్రవరం శివారునగల బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఈ సాహిత్య పీఠం ఎంఏ తెలుగు చదువుకునే వారికి, తెలు గు భాషాసాహిత్యాలపై పరిశోధనలు చేసేవారికి కల్పవృక్షంగా భాసించింది. రాష్ట్ర విభజనానంతరం చంద్రగ్రహణంతో పురాతన వైభవం కోల్పోయింది. శిథిలమవుతున్న వసతి గృహాలు అంతా భ్రాంతియేనా? తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రం చేస్తానని పుష్కరాల సాక్షిగా వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఆతర్వాత ఆ ఊసు మళ్లీ ఎత్తలేదు. తెరమీదకు కొత్తవాదనలు వచ్చాయి. విభజన చట్టం, షెడ్యూల్ 10లో సాహిత్యపీఠం ఉండటం వలన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని మొసలి కన్నీరు మొదలయింది. రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసే సమయానికే సాహిత్యపీఠం ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉంది. ఇదేదో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఉత్పన్నమైన సమస్య కాదు. అన్నీ తెలిసే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం,హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్నవే. అవి మన రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నాయి. ఈ సంస్థలకు లేని అడ్డంకి సాహిత్యపీఠం విషయంలో ఎందుకు ఉత్పన్నమవుతోందని పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటివారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే దానికి నేతలనుంచి సమాధానం లేదు. కాంచవోయి నేటి దుస్థితి ఒకప్పుడు సుమారు 80మందికి పైగా ఎంఏ (తెలుగు) చదువుకునే విద్యార్థులతో, పరిశోధకులతో కళకళలాడిన సాహిత్యపీఠం నేడు బావురుమంటోంది. ఎంఏ మొదటి సంవత్సరంలో ఐదుగురు, రెండో సంవత్సరంలో ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పూర్తి స్థాయిబోధన సిబ్బంది లేరు. అడపాతడపా, కన్సాలిడేటెడ్ పారితోషికం మీద ఒక అధ్యాపకుడు వచ్చి, పాఠాలు చెబుతున్నారు. సాహిత్యపీఠంలో పూర్తిస్థాయి పర్యవేక్షకులు లేరు. గుంటూరులో ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఉన్నారు. తలలేని మొండెంలా సాహిత్యపీఠం మిగిలింది. సుమారు 50,000 అరుదైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నవారు దాదాపు లేరు. బోధనేతర సిబ్బందికి రెండునెలలకో, మూడు నెలలకో జీతాలు విదిలిస్తున్నారు. హాస్టల్ భవనం శి«థిలావస్థకు చేరుకుంది. ఎందుకీ దుస్థితి? రాష్ట్ర విభజన అనంతరం సాహిత్యపీఠం అస్తిత్వంపై, భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముతున్న తరుణంలో, ప్రభుత్వం ప్రేక్షకపాత్రను ధరించింది. సాహిత్యపీఠం క్షీణదశ ప్రారంభం కావడానికి ఇది ప్రధాన కారణం. విద్యార్థులకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. అదనపు భవనాల నిర్మాణం కాలేదు కనుక, సాహిత్యపీఠానికి ఇచ్చిన భూమిలో కొంతభాగాన్ని తిరిగి ఇవ్వాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టురని సాహిత్యపీఠం సిబ్బంది తెలిపారు. ప్రాంగణంలోని కొంత ప్రాంతానికి ప్రత్యేకంగా ఫెన్సింగ్ వేశారు. కొంత భాగం ఆక్రమణలకు గురి అయింది. ఏది ఏమైనా, జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించక తప్పడం లేదు. కనీసం భాషాసాహిత్యాలను, కళలను రాజకీయ పరిధి దాటి ఆదరిస్తే బాగుంటుందని సాంస్కృతిక రాజధాని ప్రజలు కోరుకుంటున్నారు. -
రారండోయ్
సమకాలీన ముస్లిం నేపథ్య కథల సంకలనం ‘కథా మినార్’ ఆవిష్కరణ ఆగస్టు 18 శనివారం సాయంత్రం 6.30 కు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. సంపాదకులు: మహమ్మద్ ఖదీర్‌బాబు, వేంపల్లె షరీఫ్. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ రాష్ట్రస్థాయి నవలల పోటీ నిర్వహిస్తోంది. ఇతివృత్తం, తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించాలి. నిడివి ప్రచురణలో 100–200 పేజీలుండాలి. ప్రథమ బహుమతి లక్ష రూపాయలు. ద్వితీయ: 75 వేలు. తృతీయ: 50 వేలు. అక్టోబర్ 10 చివరి తేది. పంపాల్సిన చిరునామా: కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, రవీంద్రభారతి, కళాభవన్, సైఫాబాద్, హైదరాబాద్–4. ‘జలియన్‌వాలాబాగ్ నూరేళ్ల సందర్భం: శతవత్సర జ్ఞాపక జ్వాల’ పేరుతో ఆగస్టు 13న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో కార్యక్రమం జరగనుంది. ప్రసంగం: రామతీర్థ. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఆగస్టు 11–15 వరకు వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాలలో పుస్తక మహోత్సవం జరగనుంది. ఆగస్టు 19న ఉ. 11 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయం రెండో గేటు ముందు గల అరసం, వరంగల్ కార్యాలయంలో ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో నా సాహితీ పాత్ర’ అంశంపై మెట్టు రవీందర్ ప్రసంగిస్తారు. ప్రతి నెలా మూడో ఆదివారం జరిగే ఈ కార్యక్రమ నిర్వహణ: వరంగల్ అరసం. మఖ్దూం మొహియుద్దీన్ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మూకదాడులు’ అంశంపై కవి సమ్మేళనం జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహితి. వివరాలకు: 8897765417. సత్యోదయ్ కవితా సంపుటి ‘వ్యతిరిక్త ప్రవాహమ్’ ఆగస్టు 18న ఉదయం 10.30 గం.కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నిర్వహణ: బేర్ ఫుట్ పేజెస్. -
సహృదయ సామ్రాజ్ఞి!
దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు తెలుగు పాఠక లోకాన్నేలిన హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూశారు. తన చుట్టూ ఉన్న... తనకు తెలిసిన మధ్య తరగతి కుటుంబాల్లోని జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఆ జీవితాల్లో మనుషుల మధ్య ఏర్పడే అనుబంధాలనూ... ఆ అనుబంధాల్లోని సున్నితత్వాన్ని, వారి ఆశలనూ, ఆకాంక్షలనూ, కలల్ని అద్భుతంగా చిత్రించిన ప్రతిభాశాలి ఆమె. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని వయసులో ఆమె రాసిన తొలి కథ ‘చిత్ర నళినీయం’ ‘ఆంధ్రపత్రిక’ వీక్లీలో అచ్చయినప్పుడు ఇంట్లో వాళ్లూ, ఊళ్లోవాళ్లూ సులోచనారాణిని చూసి గర్వపడ్డారట. ‘సెక్రటరీ’తో మొదలుపెట్టి సులోచనా రాణి రాసిన దాదాపు 70 నవలలు తెలుగు సమాజంలోని ఆడపిల్లలకు అలాంటి గర్వాన్నే కలిగించాయి. ఎందుకంటే ఆ నవలల్లోని ఆడపిల్లలు భయంగా, బేలగా ఉండరు. తమకేదో అన్యాయం జరిగిందని శోకిస్తూ కూర్చోరు. వారు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనేవారే కావొచ్చుగానీ... ఉన్నతమైన వ్యక్తిత్వంతో, నిండైన ఆత్మాభిమానంతో మెలగుతారు. ఆ ఆత్మాభిమానాన్ని లేదా ఆత్మ గౌరవాన్నీ దెబ్బతీయడానికి జరిగే చిన్న ప్రయత్నాన్నయినా నిలదీసే మనస్తత్వంవారిది. ఆ ఆడపిల్లలు మాటకారులు. స్వతంత్రంగా ఆలోచిస్తారు. సొంతంగా ఎదగాలని చూస్తారు. తెలివి తేటల్ని ప్రదర్శిస్తారు. ఎవరి దయాదాక్షిణ్యాలకూ ఎదురుచూడరు. అలాగని వారు చలం రచనల్లోని స్త్రీల మాదిరి సమాజం, కుటుంబం విధించిన కట్టుబాట్లను ప్రశ్నించే రకం కాదు. వాటిని ఛేదించేంత సాహసం చేయరు. బహుశా సులోచనా రాణి నవలల్లోని ఈ లక్షణాలే లక్షలాదిమంది మధ్య తరగతి మహిళలను, యువతులను ఆమె రచనలవైపు ఆకర్షించేలా చేశాయి. ఆమె నవలల్లోని కథా నాయకులూ అంతే. వారు పురుషాధిక్యతను ప్రదర్శించరు. ఆడవాళ్లను అణిచేయాలనే మనస్తత్వంతో ఉండరు. వారిని తక్కువ చేసి మాట్లాడరు. ఆడపిల్లల వ్యక్తిత్వాలను గౌరవించడం, వారితో ప్రేమగా మెలగడం... పొరబాటున మనసు కష్టపెట్టానని అనిపించినా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా క్షమించమని కోరడం ఆ కథానాయకుల వ్యక్తిత్వం. మనలాంటి అసమ సమాజంలో, కుటుంబాల్లో ఇలాంటి లక్షణాలున్నవారు దుర్భిణి వేసి గాలించినా కనబడరన్న విమర్శల్లో అవాస్తవమేమీ లేదు. కానీ స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి సంబంధాలుండాలని... అచ్చం ఇలాగే సమాజం ఉంటే ఎంతో బాగుంటుందని ప్రగాఢంగా కోరుకునే మధ్యతరగతి మహిళల, యువతుల ఆకాంక్షలకు సులోచనారాణి అద్దం పట్టారు. అందుకే వారికి ఆమె అంతగా చేరువయ్యారు. ఆమె నవలల్లోని పాత్రలు ఎదుటివారితో సంఘర్షించవు. అంతస్సంఘర్షణకు లోనవుతాయి. ఆ క్రమంలో తమను తాము తీర్చిదిద్దుకుంటాయి. ఎదుటివారిలో మార్పు తెస్తాయి. ఆమె నవలలు సీరియల్‌గా వస్తున్న కాలంలో మధ్యతరగతి కుటుంబాల మహిళలు, యువతులు మరుసటి వారం గురించి ఆత్రంగా ఎదురు చూసేవారట. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయంలో రకరకాలుగా చర్చించుకునేవారట. కుటుంబమే సర్వస్వంగా భావిస్తూ పొద్దు పొడిచింది మొదలు పొద్దు గడిచేవరకూ దానికోసమే అంకి తమవుతూ...తీరిక చిక్కితే పురాణగాథలు, పిచ్చాపాటీలతో కాలక్షేపం చేసే మహిళలంతా సులోచనారాణి రచనలతో ఇటు మళ్లారని చెబుతారు. దశాబ్దాలపాటు కొన్ని తరాలపై ఒక రచయిత ఇంతగా ప్రభావాన్ని చూపగలగటం ఎంతో అరుదైన విషయం. సులోచనారాణి ఆ ఘనత దక్కించుకున్నారు. ఆ కాలంలో యద్దనపూడితో పాటు అనేకమంది మహిళలు తెలుగు నవలను సుసంపన్నం చేశారు. ఇల్లిందల సరస్వతీ దేవి, డాక్టర్ పి. శ్రీదేవి, మాలతీ చందూర్, తెన్నేటి హేమలత, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, కోడూరి కౌసల్యాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, సి. ఆనం దారామం వంటి అనేకులు నవలా రంగంలో అప్పట్లో సుప్రసిద్ధులు. వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదంటే చాలామంది పురుష రచయితలు సైతం మహిళల పేరుతో రాయకతప్పని స్థితి ఏర్పడింది. మహిళా రచయితల్లో ఇతరుల కంటే ఎక్కువగా యద్దనపూడి రచనలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించాయి. అప్పటివరకూ కథల కోసం బెంగాలీ అనువాద సాహి త్యంవైపు, బెంగాలీ చిత్రాలవైపూ చూసే అలవాటున్న చిత్రపరిశ్రమను... కొత్త దృక్పథంతో, కొత్త ఆలోచనలతో మధ్య తరగతి జీవితాలను ప్రతిభావంతంగా, ఆకర్షణీయంగా చిత్రిస్తున్న యద్దనపూడి రచనలు సహజంగానే ఆకట్టుకున్నాయి. డాక్టర్ పి. శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ రూపుదిద్దుకుంటుండగా అనుకోకుండా ఆ రచయిత్రి కన్నుమూసినప్పుడు ఆ లోటును పూడ్చడం కోసం యాదృచ్ఛికంగా యద్దనపూడి సినీ రంగంవైపు వచ్చారు. ఆ తర్వాత ఆమె రచించిన ‘మీనా’, ‘సెక్రటరీ’, ‘జీవనతరంగాలు’, ‘చండీప్రియ’, ‘ఆత్మీయులు’ వంటి సుప్రసిద్ధ నవలలెన్నో చలనచిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే యద్దనపూడి పాఠకులు ఆ చలనచిత్రాలతో ఏనాడూ పూర్తిగా సంతృప్తిపడిన దాఖలాలు లేవు. వెండితెరపై సమ్మోహనపరిచే దృశ్య కావ్యాలకన్నా ఆమె రచనల్లోని నాటకీయత, సంభాషణలే వారిని బాగా ఆకట్టుకునేవి. నవలారంగం నుంచి సినీ మాధ్యమానికీ...అక్కడి నుంచి టెలివిజన్ రంగానికీ వచ్చి అన్నిచోట్లా సమానంగా మన్ననలు పొందిన ఏకైక రచయిత్రి బహుశా యద్దనపూడే కావొచ్చు. దాదాపు నూటయేభై ఏళ్లక్రితం పుట్టిన తెలుగు నవల ఎన్నో పోకడలకు పోయింది. ఈ క్రమంలో వచ్చిన పాపులర్ నవలా ప్రపంచంలో యద్దనపూడి సులోచనారాణి తనదైన ముద్ర వేసి అగ్రగామిగా నిలిచారు. స్త్రీ, పురుష సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుని...తన రచ నల ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించిన సులో చనారాణి రాగలకాలంలో సైతం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. -
ఒక రాణి
అనగనగా ఒక రాణిఅనగనగా ఒక నవలఅనగనగా ఒక రాజ్యం.సులోచన.. నవలా రాణి నవలా రాజ్యంలో రాణించిన రాణినవలా ప్రియుల హృదయాలను ఏలిన రాణిఒకే ఒక రాణి. యద్దనపూడి సులోచనా రాణి! కథ ఎలా చెప్పాలో తెలిసిన రచయిత్రి తెలుగు సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు పాపులర్ రచయితలంటే కించిత్ అసహనం, చాలా అవహేళన. కనక వారి రాతల్లో యద్దనపూడి సులోచనారాణికి స్థానం ఉండకపోవచ్చు. సదసద్వివేచన చేయగల కొందరు విమర్శకులు, సజీవమైన పాత్రలను సృష్టించినందుకు, తెలివైన, స్వయం నిర్ణాయక శక్తిగల స్త్రీపాత్రలను సృష్టించినందుకు, పురుషులలో పుణ్యపురుషులను చిత్రించినందుకూ, ఒక నవలలో కథ ఎలా చెప్పాలో చూపించినందుకు, తెలుగుభాషను ఎంత సొగసుగా వాడవచ్చో నేర్పినందుకు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. మహిళా పాఠకులను పెంచిన రచయిత్రిగా, ఎన్నిసార్లు ప్రచురింపబడ్డా క్షణాల్లో అమ్ముడుపోయే నవలల రచయిత్రిగా ప్రచురణకర్తలు ఆమెను గుర్తు పెట్టుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా తమకు తరాల తరబడి ఆనందాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగించడంతో పాటు, తమలాంటి వ్యక్తులు ఎలా ఉండవచ్చో చూపినందుకు పాఠకులు ఆమెను కలకాలం గుర్తుంచుకుంటారు. సులోచనారాణి నవలల్లో ఆమె చుట్టూ ఉన్న సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాలుంటాయి. వాటిలోంచి, మట్టిలో మాణిక్యాల్లా నాయికా నాయకులు స్వంత వ్యక్తిత్వంతో ప్రకాశిస్తూంటారు. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండేందుకు కొంత స్నేహం, కొంత అవగాహన, కొంత ప్రేమ, కొంత గౌరవం ఉంటే చాలని నిరూపించే పాత్రలివి. అది కూడా మన జీవితాల్లో లేనందువల్లనేమో అవి స్వాప్నిక పాత్రల్లా, ఆమె కథలు భావకవుల కోవలో ఆకాశంలో విహరించేవిగా చాలామందికి తోచాయి. ఆమె పూర్తిగా నేలవిడిచి సాము ఎప్పుడూ చెయ్యలేదు. ఆ మాటకొస్తే అడవి బాపిరాజు, కోడూరి కౌసల్యాదేవి వంటి వారి నవలలతో పోల్చినపుడు వాస్తవికతకు ఆమె పాత్రలు ఎంత సన్నిహితంగా ఉంటాయో అర్థమవుతుంది. రచనా విధానానికి వస్తే, అందులో ఆమెతో పోటీ పడగలవాళ్లు అతి తక్కువ. కథనంలోనూ, సంభాషణలోనూ, ఉత్కంఠ రేకెత్తించడంలోనూ, కథను ముగించడంలోనూ ఆమెది అసాధారణ ప్రతిభ. ఆమె నవలలు సీరియల్స్‌గా వస్తున్నప్పుడు ఎక్కడ పూర్తవుతాయో అని వ్యాపార దృష్టితో సంపాదకులు, రచనాసక్తి దృష్టితో పాఠకులు బెంగపెట్టుకునేవారు. అంత పఠనీయత ఉన్న రచన ఆమెది. ఇక వ్యక్తిగా సులోచనారాణికి నేనెరిగిన ఏ సాహితీవేత్తా సాటిరారు (నాకు చాలామంది సాహితీవేత్తలు వ్యక్తిగతంగా కూడా తెలుసు). తనొక గొప్ప రచయిత్రిననీ, ఆంధ్ర పాఠకుల హృదయరాణిననీ ఆమెకు స్పృహ ఉన్నట్టే అనిపించేది కాదు. తోటి రచయితల గురించి ఒక్క పరుష వాక్కూ ఆమె పెదవులపై ఏనాడూ కదలలేదు. తన అభిమానుల పట్ల చులకన గానీ, విసుగు గానీ ఏనాడూ కనిపించలేదు. రెండు గంటలు సంభాషణ జరిపినా తన రచనల గురించి, తనకున్న కీర్తి ప్రతిష్టల గురించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడకపోవడం నాకు అనుభవం. మనం ప్రస్తావిస్తే తప్ప తన గురించి తాను చెప్పుకునే అలవాటు లేదు. అప్పుడు కూడా చాలా తక్కువ విషయాలే చెప్పేవారు. ఈనాటి రచయితలు ఆమెను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మంచి రచయితకు ఆత్మస్తుతి, పరనింద అవసరం లేదనీ, ప్రతి వాక్యం ముందూ ఎవరేమనుకుంటారో భయపడాల్సిన దుస్థితి లేదనీ, రాసిన ప్రతి అక్షరానికీ తక్షణ స్పందనలూ, మెప్పుదలలూ, అవార్డులూ ఆశించనవసరం లేదనీ, తమకొక ముఠా ఏర్పరచుకుని వాళ్ల కోసమే రాయాల్సిన పని లేదనీ... ఇవన్నీ ఆమెను చూసి నేర్చుకోవచ్చు. తన అనంతరం కూడా మనం చదువుకుందుకు, దాచుకుందుకు, మళ్లీ మళ్లీ చదువుకుని ఆనందించేందుకు కావలసినన్ని నవలలు మనకు వదిలి, ఎప్పుడూ ప్రశాంతతను కోరుకునే ఆ మనసు ఈనాడు శాశ్వత ప్రశాంతిలోకి జారిపోయి విశ్రమిస్తున్నందుకు ఒక రకంగా ఆనందిస్తూ, మా ఇద్దరి మధ్యా ఎన్ని రకాల వ్యత్యాసాలున్నా, గత పదిహేనేళ్లుగా నాకు ఎంతో ఆప్తురాలిగా ఉంటూ వచ్చిన సులోచనారాణి గారిని వదలలేకపోతున్నందుకు దు:ఖిస్తూ... - మృణాళిని గంట చదువు రేపటికి ప్రేరణ సాహిత్యాన్ని పాఠకులకు అత్యంత చేరువగా తీసుకెళ్ళిన సాహితీ దిగ్గజం యద్దనపూడి సులోచనారాణి. ఆనాటికీ, ఈనాటికీ ఏనాటికీ యావత్ ఆంధ్రుల అభిమాన రచయిత్రి కేవలం ఆమే అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ప్రసార మాధ్యమాలేవీ లేని ఆ రోజుల్లో పుస్తకాలు మాత్రమే కాలక్షేపం అవటంతో... ఆనాటి మహిళలు ఎందరో తమ రోజువారీ ఇరవై నాలుగ్గంటల సమయంలో వారికి దొరికే ఒక్కగంట ఖాళీ సమయంలో యద్దనపూడి సీరియల్ చదువుకోవటానికి మిగతా ఇరవైమూడు గంటలూ ఎంత కష్టమైన ఇంటిపనినైనా ఎంతో ఇష్టంగా చేసుకునేవారంటే పాఠకుల హృదయాల్లోకి ఎంతగా వీరి రచనలు చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. నిజమే, ఒక రాజశేఖరంలో తన కలల రాకుమారుణ్ణి చూసుకునేది ఆనాటి మధ్యతరగతి స్త్రీ. ఒక జయంతిలో తనను చూసుకుని పెద్ద పడవ లాంటి కారులో రాజశేఖరం పక్కన కూర్చుని ఏ టీ ఎస్టేటుల్లోనో విహరించేది. చిన్నిచిన్ని కలహాలూ, కలతలూ తాత్కాలికమనీ, ఆలుమగల మధ్య అనురాగాన్ని నింపేవి, మరింతగా పెంచేవీ ఆ చిరుకలహాలేననీ మధ్యతరగతి ప్రజానీకం మనసుల్లో బలంగా నాటుకుపోయే రీతిలో తన రచనా వ్యాసంగం సాగించి కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఒక రచయిత్రిగా తన వంతు పాత్ర పోషించారు యద్దనపూడి. రచనల్లో వారి చిత్తశుద్ధి, నిజ జీవితంలో ఆవిడ నిరాడంబరత్వం ఎందరికో ఆదర్శం. సన్మానాలూ, సత్కారాలంటే ఇష్టపడని సులోచనారాణి ఇటీవలి కాలంలో ఇంటర్వ్యూలకు కూడా పెద్దగా సుముఖత చూపక పోవటానికి కారణం ‘చాలు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను. ఎన్నో అవార్డులు, అభినందనలు, సత్కారాలూ పొంది నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇక చాలు, ఆశకు అంతేముంది’ అన్నమాటలు ‘ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం కాదు. ఎక్కడ ఆపాలో తెలియటం ముఖ్యం’ అన్న పెద్దల మాటను నిజం చేస్తాయి. మధ్య తరగతి జీవితాల్లోని అనేక అంశాలను ఆమె తమ రచనల్లో ప్రస్తావించేవారు. తను చూసిన, స్వయంగా పరిశీలించిన అనేక జీవితాలు ఆమె కథావస్తువులు. మధ్యతరగతి ఆడవాళ్ల మనస్తత్వ చిత్రణ, వారి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, చిలిపితనం, కోపం, అభిజాత్యం... భార్యాభర్తల మధ్య ప్రేమలూ, అలకలూ, కుటుంబాల్లో వచ్చే ఇబ్బందులూ ఇవన్నీ వస్తువులే వారి సాహిత్యంలో.‘ఒక్క కథో కవితో రాసి ఏ అవార్డ్ వస్తుందా? అని వీధిలో నిలబడి ఎదురుచూడవద్దు. పుస్తకాలతో పాటు వ్యక్తుల్ని, వ్యక్తుల జీవితాలను చదువు. సమాజాన్ని నువ్వెప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావో అప్పుడే నీనుండి ఒక మంచి రచన జీవం పోసుకుంటుంది’ అని చెప్పేవారు. ఒక మామూలు పల్లెటూరిలో పుట్టిన నేను వారి రచనలకు ప్రభావితమై జీవితంలో ఒక్కసారన్నా సులోచనారాణిని దూరంనుండైనా చూడగలనా అనుకునేదాన్ని. కలవాలంటే ఏం చెయ్యాలో తెలియలేదు. నాకు నేనే ఆలోచించుకుని రచనలు చెయ్యటం ఒక్కటే మార్గం, అది కూడా కుటుంబ, సమాజ సంబంధ బాంధవ్యాలను పెంపొందించే రచనలు చెయ్యాలనే సంకల్పంతో కలంపట్టిన ఏకలవ్య శిష్యురాలను యద్దనపూడి గారికి నేను. అలా కొంతవరకూ రచనలు చేసి హైదరాబాద్ వచ్చాకా లేఖిని సాహితీ సంస్థలో చేరటం ద్వారా ఆ సంస్థకు గౌరవాధ్యక్షురాలైన ఆమెను అతి సమీపంగా చూసినప్పటి మధుర క్షణాలను మరువలేను. నా మొదటి కథల సంపుటి ‘జీవనశిల్పం’కు ముందుమాట రాయమని అభ్యర్థిస్తే ‘రాయకూడదనే అనుకున్నాను. కానీ నీ కథలంటే ఉన్న ఇష్టంకొద్దీ ముందుమాట రాస్తా’నన్నారు. ‘‘నీ ‘ప్రభవించిన చైతన్యం’ నాకు నచ్చింది. మా అమ్మపేరుతో ప్రతిఏటా నేను ఇచ్చే అవార్డును నీకు ప్రకటిస్తున్నాను’’ అన్నారు. పల్లెలో పుట్టి, వారిని చూడటమే ధ్యేయంగా ప్రణాళిక వేసుకుని రచనలు ప్రారంభించి ఆ సాహిత్య వంతెన ద్వారా ఆమెని చూడగలిగిన నాకు ఇంతకంటే పెద్ద అవార్డ్ ఏముంటుంది? అది నా అదృష్టంగా భావించాను. ప్రేమికులు తమ ఆలోచనలను పంచుకునే ఒక అద్భుత వేదికగా నౌబత్ పహాడ్‌ను, ట్యాంక్‌బండ్‌ను తన రచనల్లో చూపిస్తూ పాఠకులను ఆయా ప్రాంతాల్లో విహరింపచేశారు కళ్లకు కట్టినట్లుండే తమవర్ణనలతో. ఎన్నో సమావేశాలకు వారిని నా కారులో తీసుకెళ్లే సందర్భంగా ‘నీ డ్రైవింగ్ నాకిష్టం. మళ్ళీ చాలా రోజుల తర్వాత వెన్నెల రాత్రులందు హుస్సేన్ సాగర్ని చూడాలనీ, నౌబత్ పహాడ్ ఎక్కి కబుర్లు చెప్పుకోవాలనీ ఉంది. నన్ను తీసుకెళ్లవూ’ అన్న వారి కోరిక కార్యరూపం దాల్చకముందే వారు స్వర్గస్తులవటం దైవ నిర్ణయం. - కన్నెగంటి అనసూయ పాఠకాదరణ పొందిన యద్దనపూడి నవలలు ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, బహుమతి, బందీ, బంగారు కలలు, చీకట్లో చిరుదీపం, దాంపత్యవనం, హృదయగానం, జాహ్నవి, జలపాతం, జీవన సత్యాలు, జీవన సౌరభం, జీవన తరంగాలు, జీవనగీతం, జ్యోతి, కలల కౌగిలి, కీర్తి కిరీటాలు, కృష్ణలోహిత, మధురస్వప్నం, మనోభిరామం, మౌనభాష్యం, మౌన తరంగాలు, మీనా, మోహిత, మౌనపోరాటం, నీరాజనం, నిశాంత, ఒంటరి నక్షత్రం, పార్థు, ప్రేమదీపిక, ప్రేమలేఖలు, ప్రేమపీఠం, ప్రేమ సింహాసనం, ప్రియసఖి, రాధాకృష్ణ, రుతువులు నవ్వాయి, సహజీవనం, సంసార రథం, సౌగంధి, సెక్రటరీ, సీతాపతి, స్నేహమయి, సుకుమారి, శ్వేత గులాబీ. ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు ∙మీరెక్కువగా ఏం పుస్తకాలు చదివేవారు? యద్దనపూడి: చిన్నప్పుడు మా ఊర్లో మంచి గ్రంథాలయం ఉండేది. అందులో ఫేమస్ ఇంగ్లీష్ నవలల అనువాదాలు, శరత్, టాగూర్ పుస్తకాలు చదివాను. నా ఫస్ట్ కథ పబ్లిష్ అయింది 1956లో. నాకు ఇష్టమైన రచయితలు ఒక్కరంటూ లేరు. వాళ్లలో బెస్ట్ తీసుకుంటుంటాను. ఆస్కార్ వైల్డ్ ‘యాన్ ఐడియల్ హజ్బెండ్’లోని పంచ్ లైన్స్ ఇష్టం. బాపిరాజు ‘నారాయణరావు’, ‘గోన గన్నారెడ్డి’ ఇష్టం. శరత్ రచనల్లోని డెలికసీ ఇష్టం. కానీ ఆ మగాళ్లు అసలు నచ్చరు. దేవదాసు నవలను రాసిన విధానం ఇష్టం. కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, ప్రియురాలిని కాపాడలేని వాడివి తాగి చచ్చిపోతే ఎవడికి అట. ప్రేమికుడు ఎలా ఉండకూడదో చెప్పింది దేవదాసు. మీ రచనల ద్వారా మీ అభిమానులకు చాలా రకాల ఆలోచనలు, భావాలు పంచారు. మీ జీవిత తాత్వికత ఏంటి? లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నేనుగా బతికాను. నాకు మనుషులు కావాలి. కార్లు, బంగ్లాలు అవసరం లేదు. సింపుల్‌గా ఉండాలి. చెత్తబుట్ట, చనిపోయిన మనిషి ఒకటే. నువ్వూ ఏదో ఒకరోజు చెత్తబుట్ట అవుతావు. సుఖాలు అనుభవించు, తప్పులేదు. ఇతరులను ఇబ్బంది పెట్టకు. ఈ క్రమంలో జీవితాన్ని కోల్పోవద్దు. (యద్దనపూడి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లోంచి)యద్దనపూడి నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు రూపొందాయి. అందులో కొన్ని... జై జవాన్, మీనా (అఆ), జీవన తరంగాలు, సెక్రటరీ, విజేత, అగ్నిపూలు, గిరిజా కల్యాణం, రాధా కృష్ణ, ఆత్మగౌరవం, బంగారు కలలు, ప్రేమలేఖలు, చండీప్రియ. నా కలలను మేల్కొలిపారు నేను చదువుకునే రోజుల్లో ‘విజేత’ నవల నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఆమె పుస్తకాలే నాలో ఒక కారు, ఇల్లు కొనుక్కోవాలనే కలలను మేల్కొల్పాయి. ఇప్పుడే కాదు, నేను చాలా ఇంటర్వ్యూల్లో చెబుతున్నాను. హీరో అంటే ఇలా ఉండాలి, వ్యక్తిత్వం అంటే ఇదీ అనే విషయాలు ఆమె వల్లే తెలిశాయి. సాహిత్యంలో విశ్వనాథ అటువైపైతే, సులోచనారాణి ఇటువైపు. ఆయనది నారీకేళపాకం, ఈమెది ద్రాక్షపాకం. ఆయనది అర్థం చేసుకోవడం కష్టం. ఈమెది సులువుగా జీర్ణమౌతుంది. నాకు ఇద్దరూ ఇష్టమే. ఇంటికెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నా నేను ఆమె అభిమానిని. సెక్రటరీ నవల ఎన్నిసార్లు చదివానో చెప్పలేను. 1970ల్లో నవల కాపీ తీసుకుని ఎర్రమంజిల్ కాలనీలో వున్న ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ‘మల్లాది వెంకట కృష్ణమూర్తికి, అభినందనలతో’ అని రాసి సంతకం పెట్టారు. చందమామ, అపరాధ పరిశోధన లాంటి మేగజైన్స్‌కు నేను అప్పటికే రాస్తున్నప్పటికీ ఆమె నన్ను గుర్తుపట్టలేదు. ఆమె మనుషుల ఉద్వేగాలను తన నవలల్లో ఎక్కువగా వ్యక్తీకరించారు. కాలంతోపాటు ఉద్వేగాలు మారవు. వ్యక్తుల స్పందనలు మారవు. అందుకే ఆమె పుస్తకాలు ఇప్పటికీ సజీవంగా ఉంటాయి. సాధారణంగా తెలుగు పాఠకులు పిసినారులు. అరువు తెచ్చుకుని చదువుతారు తప్ప పుస్తకాలు కొనరు. అట్లాంటిది ఆ పిసినారితనాన్ని ఆమె జయించేలా చేసింది. పుస్తకాలు కొనేలా చేసింది. అట్టలు చిరిగిపోతేనో, చివరి పుటలు ఊడిపోతేనో కూడా మళ్లీ కొత్త కాపీ కొనేవాళ్లు. ఆమె వాక్యాలు సుతిమెత్తగా ఉంటాయి. ఆహ్లాదమైన చక్కటి శైలి. ఆవిడ కూడా అంతే మర్యాద, మన్ననతో ప్రవర్తించేవారు. వాళ్ల కూతురు శైలజ పెళ్లికి పిలిస్తే వెళ్లాను కూడా. ఆమెలో వ్యాపారదక్షత కూడా ఎక్కువే. పబ్లిషర్స్ దగ్గరగానీ, నిర్మాతల దగ్గరగానీ ఈమెదే పైచేయిగా ఉండేది. ఎంతిస్తే అంత తీసుకోవడం ఆమెకు తెలియదు. తన రెమ్యూనరేషన్ ఎంతో కచ్చితంగా చెప్పేవారు. 1980ల్లో ఆమె కొంతకాలం ‘కోకిల’ అని ఒక టేప్ మేగజైన్ నడిపారు. రచయితలు వాళ్ల రచనల్ని చదివితే, వాటిని రికార్డు చేసేవారు. క్యాసెట్ ఒక గంట నిడివి ఉండేది. దాన్ని చందాదారులకు పంపేవారు. ఆ రోజుల్లో అదొక విప్లవాత్మకమైన ఆలోచన. – మల్లాది వెంకట కృష్ణమూర్తి ఆమె యాక్చువల్ ఫెమినిస్ట్ సులోచనారాణి నవలలు చదవడం మొదలుపెట్టింది టెన్త్ తర్వాత! ఆవిడ బెస్ట్ అంతా 60–80ల మధ్యే వెలువడింది. 18–20 యేళ్లపాటు నవలా లోకాన్ని లిటరల్లీ ఏలారు. మనుషుల జీవితంలో పెద్ద తేడాలేముంటాయి? పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు ఇంటికి రావడం, మాట్లాడడం; మనకీ, మనకు కావలసిన వ్యక్తికీ గొడవ జరగడం... తర్వాత అది సాల్వ్ అయ్యే పరిస్థితి రావడం – పెంకుటింట్లో, పాకల్లో, బంగళాల్లో ఎక్కడైనా ఇదేగా డ్రామా! ఆ రోజువారీ హ్యాపెనింగ్స్ రాసేవారు. నేల విడిచి సాము చేయలేదు. ఫాల్స్ ప్రెస్టీజ్ లేదు. సూడో ఇంటలెక్చువల్ అంతకన్నా కాదు. లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ – ఆమె రచనల్లో అంతర్గతంగా ఉండే అంశం. కమ్యూనికేషన్ సాధనాలు ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా మనుషుల మధ్య ఇప్పటికీ అదే పెద్ద సమస్య. ఆవిడ గేమ్ అంతా దానిమీదే ఉండేది. ఆమె నవలల్లో బేసిక్‌గా 1960ల నాటి మధ్యతరగతి ఆడవాళ్ల తాలూకు అనుమానాలు, భయాలు, మగాళ్లను నమ్మాలా వద్దా అన్నదాని మధ్య ఊగిసలాట, అందులోంచి ఎలా బయటికి రావాలి అనేవి ఉంటాయి. ఆడవాళ్లు మగాడి దగ్గర్నుంచి ఒక అండర్స్టాండింగ్ కోరుకునేవారు. మగాడు ఎంత డబ్బున్నవాడైనా భార్యలు వంటింట్లోనే మగ్గిపోయేవారు. పదేళ్లక్రితమే పెళ్లయినా అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేకపోయేవారు. అప్పుడప్పుడే ఇలాంటి అన్యాయం పట్ల ఆడాళ్లు వాయిస్ రెయిజ్ చేయడం మొదలైంది. ఆ అంశాలు ఆవిడ నవలల్లో కనిపించేవి. ఆవిడ సూడో ఫెమినిస్ట్ కాదు – యాక్చువల్ ఫెమినిస్ట్. ఆవిడ నార్మల్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. పెద్దగా చదువుకోలేదు. చక్కగా ఇంట్లో కూర్చుని కథలు రాసి అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పటివాళ్లతో పోలిస్తే నాకు ఆవిడే ఎక్కువ సక్సెస్‌ఫుల్‌గా అనిపిస్తారు. (సాక్షి ‘ఫన్డే’ ఇంటర్వ్యూలోంచి) -
ఫిడేలు రాగాల డజన్
తెలుగు కవిత్వం ఫ్యూడల్ సంప్రదాయ శృంఖలాలు తెంచుకొని, వస్తువులో, వైచిత్రిలో, ఛందస్సులో, అనుభూతి వ్యక్తీకరణలో కొంగొత్త మార్పులను స్వాగతించింది. ఇరవయ్యవ శతాబ్ది ప్రథమార్థం ఇందుకు నాంది పలికింది. కవితాసరళిలో విప్లవాత్మకమైన సంస్కరణలు పెల్లుబికాయి. 1939లో పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) మీటిన ఫిడేలు రాగాల డజన్ పెనుతరంగ ధ్వనినే సృష్టించింది. ఏ రకమైన కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు ఖాతరు చేయకుండా కొత్త పంథాకు హారతి పట్టాడు పఠాభి. జన వ్యవహారానికి దూరంగా ఉన్న కృత్రిమ గ్రాంథికాన్నిS ఎగతాళి చేసేటట్టు భాషలో, భావనలో సరికొత్త ప్రయోగాలు చేశాడు. పండితులకే పరిమితమైన ఛందస్సుపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. ‘నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాల నడుముల్ విరగదంతాను చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని చాల దండిస్తాను అనుసరిస్తాను నవీన పంథా, కాని భావ కవిని మాత్రము కాను, నే నహంభావ కవిని’ అంటాడు పఠాభి. ‘ప్రాచ్య దిశ సూర్య చక్రం రక్తవర్ణంలో కన్బట్టింది, ప్రభాత రేజరు నిసి నల్లని చీకట్ల గడ్డంబును షేవ్ జేయన్ పడిన కత్తిగాటట్టుల’ అన్న కవితలో చీకట్లను గడ్డంతో పోలుస్తాడు. దాన్ని ప్రభాత రేజరుతో గీసుకుంటుంటే పడిన కత్తిగాటులా ఉన్నాడు సూర్యుడని వర్ణించిన తీరులో అత్యంత నవ్యత కనిపిస్తుంది. ఇలా ఈ పుస్తకంలోని ఖండికలన్నీ చమత్కారంతో నిండి ఉంటాయి. పాశ్చాత్య కవితా ధోరణులు, సర్రియిలిజం ప్రభావం పఠాభిపై విపరీతంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. పుస్తకానికి పెట్టిన పేరులో కూడా నవ్యత్వం ఉంది. ‘ఫిడేలు రాగాల డజన్’లో 12 ఖండికలున్నాయి. అంచేతనే ఈ పేరు! అభ్యుదయ కవిత్వ చైతన్యం విస్తరించిన తరువాత, ముందు యుగం దూతలైన పఠాభి తరహా కవులు భావ కవిత్వాన్ని దాదాపు పాతిపెట్టినంత పని చేశారు. పఠాభి ప్రభావంలోనే చాలామంది నవ యువ కవులు ఈ తరహా కవితా విన్యాసంలో రచనలు చేయడం కొసమెరుపు. వాండ్రంగి కొండలరావు -
ప్రముఖ రచయిత మునిపల్లె బక్కరాజు కన్నుమూత
-
రచయిత మునిపల్లె రాజు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలుగు కథను సుసంపన్నం చేసిన ప్రఖ్యాత కథకుడు, రచయిత మునిపల్లె రాజు ఇకలేరు. ఏఎస్రావు నగర్‌లోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె ఆయన స్వగ్రామం. తండ్రి హనుమంతరావు తల్లి శారదమ్మ. చిన్నప్పటినుంచి కథా సాహిత్యంపై మక్కువ పెంచుకున్న మునిపల్లె రాజు 1943 నుండి 1983 వరకు భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగ్ సర్వీసులో సర్వేయర్‌గా ఉద్యోగం చేశారు. అస్తిత్వనదం ఆవలి తీరాన, దివోస్వప్నాలతో ముఖాముఖి, పుష్పాలు - ప్రేమికులు - పశువులు, మునిపల్లె రాజు కథలు తదితర కథా సంకనాలు వెలువరించారు. అలసిపోయినవాడి అరణ్యకాలు, వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు కవితా సంపుటాలు ప్రచురించారు. ఆయనను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. తెలుగులో మేజిక్ రియలిజంలో మొదటగా రాసిన రచయిత కూడా మునిపల్లె రాజే. ఆయన గురించి ‘సాక్షి’ సాహిత్యం పేజీలో వచ్చిన ప్రత్యేక వ్యాసం ఇది మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు... -
మన తెలుగు సాహిత్యం మరో కోహినూర్!
సాక్షి, హైదరాబాద్ : కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రాల్లో ఒకటి. తెలుగు నేలపై దొరికిన ఆ వజ్రం ఎక్కడుంది? బ్రిటన్ రాణి ఎలిజబెత్ కిరీటంలో.. ఆంగ్లేయులు దానిని దేశం నుంచి తరలించుకుపోయారు. ‘ప్రపంచం మొత్తం చేసే ఒక రోజు ఖర్చులో సగం విలువ.. కోహినూర్ సొంతం’అని మొఘల్ చక్రవర్తి బాబర్ తన బాబర్నామాలో ప్రస్తావించాడట. అంతటి విలువైన ‘తెలుగు’కోహినూర్‌ను సొంతం చేసుకున్న బ్రిటన్.. అంతకుమించిన అద్భుత తెలుగు సాహిత్య సంపదనూ సొంతం చేసుకుంది. ఒకటి రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో తెలుగు గ్రంథాలు బ్రిటన్ రాజధాని లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి. ఆ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు 8,639! ప్రపంచ సాహిత్యంలో వినూత్న ప్రక్రియలకు నెలవు తెలుగు సాహిత్యం. ఈ ఔన్నత్యాన్ని ఇటీవలే ప్రపంచ తెలుగు మహాసభలు మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కరించాయి. అంతటి సమున్నత తెలుగు సాహిత్యంలో ఎంతోమంది ఉద్ధండులు ఎన్నో గ్రంథాలు రాశారు. కానీ వాటిలో చాలా వరకు మనకు అందుబాటులో లేవు. ఇలా అలభ్యంగా ఉన్న గ్రంథాలెన్నో బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నట్లు గుర్తించారు. అవీ ఒకటి రెండు కాదు ఏకంగా 8,639 పుస్తకాలు కావడం గమనార్హం. ఇందులో రెండు మూడు వేల గ్రంథాలు, పుస్తకాలు మన వద్ద అందుబాటులో లేనివేనని అంచనా. 1700 సంవత్సరం నుంచి 1970 వరకు వివిధ సమయాల్లో వెలువడిన తెలుగు గ్రంథాలు, పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఆంగ్లేయులు స్వాతంత్య్రం వరకు వివిధ సందర్భాల్లో భారత్ నుంచి పలు భాషల గ్రంథాలను లండన్‌కు తరలించారు. తర్వాత కూడా ఇది కొనసాగింది. అయితే అంతకుముందు జరిగింది కొల్లగొట్టడంకాగా.. తర్వాత కొనసాగింది ‘సేకరణ’. ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రంథాలయం లండన్ గడ్డపై ఉండాలన్న సంకల్పంతో ఈ పుస్తకాలను తరలించారు. ఎలా తెలిసింది..? ప్రపంచ సాహిత్యానికి తెలుగు నేల అందించిన సారస్వతం ఎనలేనిది. కానీ భావితరాల కోసం భద్రపరిచే విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. దాంతో ఇప్పటివరకు తెలుగు భాషలో ఎన్ని గ్రంథాలు వెలువడ్డాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయనే లెక్కలేవీ లేవు. అయితే తాజాగా లండన్ బ్రిటిష్ లైబ్రరీలో భారీ సంఖ్యలో తెలుగు గ్రంథాలున్న విషయాన్ని పురావస్తు పరిశోధకుడు డాక్టర్ రాజారెడ్డి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన ఇటీవల బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న శాతవాహనుల నాణేలపై పరిశోధన కోసం లండన్ వెళ్లారు. ఆ సమయంలో బ్రిటిష్ లైబ్రరీని కూడా సందర్శించారు. అక్కడి కేటలాగ్ (పుస్తకాల జాబితా)లను పరిశీలిస్తుండగా.. తెలుగు పుస్తకాల కేటలాగ్ కనిపించింది. దాన్ని పరిశీలించగా ఆ లైబ్రరీలో 8,639 తెలుగు పుస్తకాలున్నట్టు తేలింది. వెంటనే విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాలు కావాలని సిబ్బందిని కోరగా.. కొద్దిసేపట్లోనే 21 పుస్తకాలను తెచ్చి ఇచ్చారు. తెలుగు నిఘంటువుకు రూపమిచ్చిన బ్రౌన్ పుస్తకాలు కావాలని అడిగితే.. 27 పుస్తకాలు తెచ్చిపెట్టారు. ఇలా వేలకొద్దీ తెలుగు పుస్తకాలు అక్కడ కనిపించేసరికి రాజారెడ్డి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఈ విషయాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు మహాసభల నేపథ్యంలో.. బ్రిటిష్ లైబ్రరీ పుస్తకాల విషయంగా ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు కసరత్తు మొదలైంది. నందిని సిధారెడ్డి నెల రోజుల కింద లండన్‌లోని ప్రవాస తెలుగువారు సృజన్‌రెడ్డి, కరుణనాయుడు, ఆదిత్య తదితరులకు ఆ పుస్తకాల వివరాలు సేకరించే బాధ్యత అప్పగించారు. వారు కొద్దిరోజులు కసరత్తు చేసి 1,200 పుస్తకాల పేర్లతో కేటలాగ్ తయారు చేశారు. ఆ జాబితాను ఇక్కడికి పంపారు. దీంతో కవి, పరిశోధకుడు జగన్‌రెడ్డి చేయూతతో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాల పట్టికతో కూడిన పుస్తకాన్ని ముద్రించింది. త్వరలో మిగతా పుస్తకాల వివరాల సేకరణకు చర్యలు చేపట్టింది. మొత్తం వివరాలన్నీ క్రోడీకరించి.. ఆ జాబితాలో మనవద్ద అందుబాటులో లేని పుస్తకాలను గుర్తించనున్నారు. వాటిని బ్రిటిష్ లైబ్రరీ సాయంతో స్కాన్ చేయించి, తిరిగి ఇక్కడ ముద్రింపజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్యారిస్ లైబ్రరీలో కూడా.. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రంథాలయంలోనూ పెద్ద సంఖ్యలో తెలుగు పుస్తకాలున్నట్టు బ్రిటిష్ లైబ్రరీలో సమాచారం ఉంది. ప్యారిస్ లైబ్రరీలోని పుస్తకాల వివరాలతో కూడిన కేటలాగ్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. అందులో తెలుగు పుస్తకాల వివరాలూ ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు పుస్తకాలు ఉన్నాయనే వివరాలు సేకరించాల్సి ఉంది. వందల ఏళ్లనాటి గ్రంథాలెన్నో.. తెలుగు నేలపై పుస్తకాల ప్రచురణ 1750 సమయంలో మొదలైందని అంచనా. 1850లో వచ్చిన ఓ పుస్తకం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ‘వందేళ్లలో తెలుగు పుస్తకాలు’పేరుతో మంగమ్మ అనే పరిశోధకురాలు 1850లో ఓ పుస్తకాన్ని వెలువరించారు. అది ఇక్కడ లభించకున్నా బ్రిటిష్ లైబ్రరీలో భద్రంగా ఉంది. లైబ్రరీలో గణితం, పురాణం, ఇతిహాసం, చరిత్ర.. ఇలా 13 అంశాల్లో తెలుగు పుస్తకాల జాబితాలు పొందుపరిచారు. 17వ శతాబ్దంలో ధూర్జటి రచించిన కాళహస్తి మహత్మ్యము మొదలు భాస్కర శతకం, దాశరథి శతకం, రకరకాల పెద్ద బాలశిక్షలు, లావణ్య శతకం, కాళహస్తి లింగాష్టకం, కవిజన రాజసం, హంస వింశతి కథలు, వివేక సంగ్రహం, మదాలసోపాఖ్యానం, గ్రంథ తంత్రం.. ఇలా (తాజా సేకరణలోనివి మాత్రమే) ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. అద్భుతంగా పరిరక్షణ... ఇక్కడి పుస్తకాలు అటు తరలాయే అన్న బాధ ఉన్నా.. బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాలు నిక్షేపంగా ఉన్నాయి. మన వద్ద లైబ్రరీలలో చెద పురుగులకు ఆహారంగా మారే దుస్థితి ఉండగా.. బ్రిటిష్ లైబ్రరీలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా సురక్షితంగా ఉండడం గమనార్హం. తిరిగి ముద్రించుకోవాలి ‘‘బ్రిటిష్ లైబ్రరీలో గొప్ప తెలుగు సాహితీ సంపద పదిలంగా ఉంది. అక్కడున్న వాటిలో మన వద్ద లేని పుస్తకాలను భాషా పండితులు గుర్తించాలి. వాటిని స్కాన్ చేసుకువచ్చి, తిరిగి ముద్రించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల తెలుగు పుస్తకాలున్నట్టు అంచనా. తంజావూరు గ్రంథాలయంలో కృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యద తాళపత్ర గ్రంథం ఉంది. 780 తెలుగు గ్రంథాలూ ఉన్నాయి. మైసూరు గ్రంథాలయంలోనూ తెలుగు పుస్తకాలు ఉన్నాయి..’ – రాజారెడ్డి, చరిత్రకారుడు అన్ని పుస్తకాలు సేకరిస్తాం ‘‘రాజారెడ్డి గొప్ప మేలు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు సేకరిస్తున్నాం. వాటిలో మన వద్ద అలభ్యంగా ఉన్న పుస్తకాలను తెలుగు నేలపైకి తెస్తాం..’’ – నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
అక్షరయానం అనంతయానం
నాకు నచ్చిన 5 పుస్తకాలు నా డెబ్బై ఎనిమిదేళ్ళ జీవితకాలంలో నేను చదివిన పుస్తకాల చిట్టా చిన్నదేం కాదు. మావూరి గ్రంథాలయంలో లభించిన డిటెక్టివ్ పుస్తకాలతో మొదలైన నా పఠన ప్రయాణం నేటి ముఖపుస్తకం దాకా సాగుతూనే వస్తున్నది. మరపు మాటున మరుగు పడిన మన పఠనానుభవాన్ని తవ్వుకోవడం, అడుగు అడుగులో మొలకెత్తిన అనుభూతుల తొలి పచ్చికలను పొదవి పట్టుకోవడం అంత సులభసాధ్యం కాదు. కమ్మతెమ్మరలు మోసుకొచ్చే పుటల రెపరెపలు కర్ణ పుటాలను తాకుతుంటవి; కానీ కమ్మలు కనిపించవు. గ్రంథ సుమగంధాలు ఎడదను సోకుతుంటవి; కానీ పూల పుటాలు దోసిలికందవు. ఎద లోతుల మాగిన అక్షర సుగంధం అంగరాగమై పరిమళించడం మాత్రం తిరుగులేని వైయక్తిక వాస్తవం. నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన, పలు పుస్తకాల్లో నేను ఎంచుకునే 5 గ్రంథాలు: మాలపల్లి: జాతీయోద్యమ కాలం నాటి గ్రామీణ సమాజం నేపథ్యంగా తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉన్నవ లక్ష్మినారాయణ గొప్ప ప్రబోధాత్మక నవల. అస్పృశ్యుల అరణ్య రోదనం, గాంధేయవాద స్థైర్యం, బడుగు జీవుల అచంచల ఔన్నత్యం అద్భుతంగా చిత్రించబడింది. ఆదర్శ కథానాయకుడు రామదాసు అనుభవించక తప్పని ఆనాటి బ్రిటిష్ జైళ్ల అశౌచ్య నరకాల జుగుప్స పాఠకుణ్ణి వెంటాడుతుంది. పర్వ: కన్నడ సాహితీవేత్త భైరప్ప విశిష్ట ఉద్గ్రంథానికి ఆచార్య గంగిశెట్టి అద్భుత అనువాదం. ‘మహాభారతేతిహాసం’ ఆధునిక నవలగా రూపొందిన ‘మోడరన్ క్లాసిక్’. కృష్ణుడు, భీష్ముడు, పాండవులు, ద్రౌపది వంటి ఉదాత్త పాత్రలను సామాన్య స్థాయికి దించి, ఐతిహాసిక చీకటి కోణాలను, ప్రశ్నార్థకమైన ‘ఆర్యధర్మాన్ని’ కొత్త దృక్కోణంలో ఆవిష్కరించింది. స్వరలయలు: ‘సంగీత శిఖరాలు’, ‘మలయమారుతాలు’ అందించిన సామల సదాశివ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత వైభవం ఈ గ్రంథంలో మరింతగా విప్పారింది. ముచ్చట్ల మృదు భాషణంగా సాగిన లలిత శైలి. సంగీత ఘరానాల, గాయన రీతుల, గాత్ర సూక్ష్మాల విశేష విశ్లేషణ. సాంకేతిక జఠిలతలను సంగీతజ్ఞులకే వదిలేసి, శ్రావ్య సంగీత మాధుర్యాన్ని అలవోకగా అనుభవింపజేసే మెళకువ. పాఠకుణ్ణి శ్రోతగా మార్చి నేరుగా సంగీత వేదికల ముందుకు చేర్చే ఈ ‘స్వరలయలు’ స్వరసౌరభాల సంగతులను మోసుకొచ్చే లాలిత్య మారుతాలు. మ్రోయు తుమ్మెద: విశ్వనాథ సత్యనారాయణ వైదుష్య భావధార కథన ప్రవాహమై ప్రవహించిన నవల. సారభూత భారతీయ తాత్వికతతో ప్రారంభమౌతుంది కథ. కరీంనగర్ కు చెందిన శాస్త్రీయ సంగీతజ్ఞులు నారాయణరావు జీవితకథ ఆధారంగా నడచిన నవలగా ప్రసిద్ధి. మా స్వగ్రామం ఎలగందుల సాంస్కృతిక చరిత్ర కూడా కొంత ఇందులో ప్రతిఫలించబడడం నన్నెంతో మురిపించిన ముచ్చట. The Collected Poems of Octavio Paz: ఆక్టేవియో పాజ్ వైవిధ్య కవితల సంకలనం. ప్రసిద్ధ దీర్ఘకవిత Sunstoneను అందగించుకున్న గొప్ప అధివాస్తవిక కవనఝరి. స్పానిష్ మూల రచనకు Eliot Weinberger ఆంగ్లానువాదం. మెక్సికన్ మూలవాసులైన ఆజ్టేక్ల సనాతన సంస్కృతీ పునాదుల మీద లేచిన అధునాతన సృజన వైభవం. సృష్టిలోని ప్రతి ప్రారంభ పయనం అంతిమంగా ఆది బిందువుకే తిరిగి చేరుతుందన్న తాత్వికతను పునరుద్ఘాటించిన కవితారూప ప్రతిఫలనం. నాగరాజు రామస్వామి nagaraju. ramaswamy @yahoo.com -
తెలుగు సాహిత్యంలో రారాజు సినారె
వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ సి. నారాయణ రెడ్డి(సినారె) రారాజు అని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన సినారె 87వ జయంతి, చివరి కవితా సంపుటి ‘కలం అలిగింది’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సినారె అభినవ శ్రీనాథుడు, అభినవ సోమనాథుడు అని అభివర్ణించారు. ఎన్టీఆర్ సినిమాలు అంతటి ప్రాచుర్యం పొందటానికి కారణం సినారె అని అన్నారు. ప్రజాకవి అంటే సినారెలా ఉండాలని, ఆయన అచ్చమైన తెలంగాణ కవి అని పేర్కొన్నారు. సినారె ఏకకాలంలో అన్ని వర్గాల ప్రజలను రంజింపచేసేవారని అన్నారు. ఇద్దరు ముఖ్యమం త్రులు తెలుగు భాషను రక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్లో సాహిత్యా నికి మాజీ ప్రధాని వాజ్‌పేయి, సినారె ప్రాముఖ్యత తెచ్చారని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాలకు సినారె చేసినంత సేవ మరెవరూ చేయలేరని చెప్పారు. 1953 నుంచి చనిపోయే వరకూ సినారె కవితలు రాస్తూ ఉండటం వల్లే సాహిత్యంలో ఆయన మకుటంలేని మహారాజు అయ్యారని కొనియాడారు. సినారె చిత్రపటాన్ని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరిం చారు. సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తాను సినారెకి ఏకలవ్య శిష్యుడినని అన్నారు. సినారె మనుమరాలు వరేణ్యా కవిత్వంలో ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా కలం అలిగింది పుస్తకాన్ని, వంశీ విజ్ఞానపీఠం లోగోను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ప్రముఖ గాయకురాలు శారద ఆకునూరి బృందం నిర్వహించిన మధుర భావాల సుమమాల సినీ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి, అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కళాబ్రహ్మ, వంశీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
సాహితీ చిరంజీవి
మారుమూల పల్లె నుంచి కవితా ప్రపంచపు అంచులదాకా.. - ఏడు దశాబ్దాలపాటు కురిసిన సాహిత్య మేఘం సినారె - భావంలో తేనెలు.. భాషలో పరిమళాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నెన్ని ప్రస్థానాలు మనిషికి ఎన్నెన్ని పరిభ్రమణాలు మనిషికి అంతలోనే నురగల పరుగు అంతలోనే కదలని అడుగు ఎవరు తాను ఏ ధాతు గర్భం నుంచి ఎదిగిన మాను ఎలా కుదించుకున్నాయో ఇంత మొలకలో అంతటి శాఖలు ఎలా పొదుగుకున్నాయో ఇంత విత్తులో అంతటి జీవరేఖలు (..‘విశ్వంభర’ నుంచి) తెలంగాణలో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజీపేట గ్రామంలో సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించారు. అది శిష్ట భాష వాసన లేని ఊరు. నిజాం జమానా కాబట్టి ఉర్దూ మాధ్యమంలోనే చదవాల్సిన పరిస్థితి. ఈ రెండు పరిమితులను అధిగమించి ఆయన ఉర్దూ, తెలు గు రెండింటా అద్భుతమైన భాషాజ్ఞానం సంపాదించా రు. కౌమారంలోనే కవితా సాధన ప్రారంభించారు. రోచి స్, సింహేంద్ర పేరుతో కవితలు రాసేవారు. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు వంటి సాంఘిక నాటకాలు రచించారు. కోస్తా, రాయలసీమ కవులూ సినారె నోట్లో ఇంత తెలుగు ఉందా అని ఆశ్చర్యపోయేలా చేశారు. అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, భావ కవిత్వం, అమూర్త కవిత్వం... ఇలా ఆయన కవిత్వం విడి పాయలు గా ఉండదు. ఈ అన్ని అంశలూ ఆయనలో ఉంటాయి. స్థూలంగా ప్రగతిశీల మానవీయ కవి. ఆయన కవిత్వం లో కరుణవీరం ఉంటుంది. ఈ విషయంలో ఆయన జాషువా లాంటివాడు. మార్పు కోసం వీరం. మానవ త్వం కోసం కరుణ. మనిషి–చిలక, భూగోళమంత మనిషి, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు, కొనగోటి మీద జీవితం లాంటివి ఆయన వెలువరించిన కొన్ని రచనలు. విశ్వంభర కావ్యానికి గానూ 1988లో దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘జ్ఞానపీఠ’ గౌరవం పొందారు. విశ్వనాథ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో తెలుగు కవి అయ్యారు. సినీకవిగా చెరగని ముద్ర చిగురు చిగురున రాగశీకరములొలికించి ఆకునాకున మరకతాత్తరులు పలికించి పూవుపూవున మధువు పులికింతలొనరించి వచ్చె కుసుమాస్త్ర భాస్వంతము వసంతమ్ము (‘రుతుచక్రం’ నుంచి) సినిమాల్లోకి ‘సింహద్వారం’ గుండానే ప్రవేశిస్తానని చెప్పిన సినారె అన్నట్టుగానే 1962లో ‘గులేబకావళి కథ’ ద్వారా సింగిల్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ‘మనసు మల్లెపూవై తేలెను’ ఆయన రాసిన మొదటి పాట. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ అదే సినిమాకు రికార్డయిన మొదటి పాట. తర్వాత సుమారు 3000 వరకు పాటలు సరళ సుందరమైన శైలిలో రాశారు. పగలే వెన్నెల జగమే ఊయల (పూజాఫలం), చరణకింకిణులు ఘల్లుఘల్లుమన (చెల్లెలు కాపురం), వస్తాడు నా రాజు ఈ రోజు(అల్లూరి సీతారామరాజు), వటపత్రశాయికి వరహాల లాలి (స్వాతిముత్యం), ఓ ముత్యాలరెమ్మ.. ఓ మురిపాల కొమ్మ (ఒసేయ్ రాములమ్మ), గోరంత దీపం కొండంత వెలుగు (గోరంత దీపం), ఎంతటి రసికుడవో తెలిసెరా (వంశవృక్షం) లాంటి పాటల్ని తాను మాత్రమే రాయగలిగేంతటి శబ్ద సౌందర్యంతో తీర్చిదిద్దారు. ఉర్దూపై పట్టుతో గజళ్లనూ, ఖవ్వాలీలను అలవోకగా రాశారు. తెలంగాణ మాండలీకం, పలుకుబడులను కూడా ఆయన పాటల్లో ప్రయోగించారు. ‘ఏకవీర’ సినిమాకు మాటలు రాశారు సినారె. అలా మరో జ్ఞానపీఠ కవి విశ్వనాథ సత్యనారాయణ రచనకు ఈ జ్ఞానపీఠ కవి మాటలు రాసినట్టయింది! సినారె మాటలు రాసిన మరో చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’. పాట.. ఆయనంత హుందాగా.. ‘‘శబ్దాలంకారాల్లో అంత్యానుప్రాసను ఇష్టపడేవారు. అర్థాలంకారాల్లో ఉత్తరాలంకారాల్ని ఇష్టపడేవారు. ఈ అలంకారాల మీద మోజుకు కారణం ఆయన అధ్యాపక వృత్తి. భావంలో తేనెలు, భాషలో పరిమళాలు ఆయన ప్రత్యేకత. పాట హుందాతనాన్ని తగ్గించకుండా ఆయనంత హుందాగా నడిపించారు సినారె’’ అంటారు సినీగీతాల పరిశోధకుడు డాక్టర్ పైడిపాల. పాటల్లో సూక్తులు, హితోక్తులు చెప్పడం సినారె మరో ప్రత్యేకత. చదువురానివాడవని దిగులు చెందకు(ఆత్మబంధువు), పుట్టినరోజు పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి(జీవన తరంగాలు), కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా (ప్రేమించు)... ఇలా సందర్భోచితంగా జీవితాన్ని తరచిచూసిన తత్వం ఆయన పాటల్లో పలికేది. కంటేనే అమ్మ పాటకు ‘నంది’ అవార్డు అందుకున్నారు. ఆయనకు నంది తెచ్చిన మరో పాట.. ఇదిగో రాయలసీమ గడ్డ.. దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ(సీతయ్య). కర్ణ సినిమాకుగానూ ఆయన రాసిన డబ్బింగ్ గీతం ‘గాలికి కులమేది..’ ఒరిజినల్కన్నా బాగా వచ్చిందని ప్రశంసలందుకుంది. సానుకూలమే ప్రధానం ఎన్నిసార్లు నా గదిలో కొచ్చిందో సముద్రం వచ్చినప్పుడల్లా టేబుల్ మీది కాగితాలు నిక్కపొడుచుకుంటాయ్ తిరిగిపోతూ అది మిగిల్చిపోయిన నురగలు అచ్చుపడ్డ అక్షరాల్లా మెరుస్తుంటాయ్ (‘గదిలో సముద్రం’ నుంచి) ఒక సమయంలో భాగ్యనగరంలో సినారె హాజరు కాని సాహిత్య సభ దాదాపుగా జరగలేదంటే ఆశ్చర్యం లేదు. ఏ సమావేశానికైనా ఆయన ప్రత్యేక ఆకర్షణ. కొత్తగా రాస్తున్నవాళ్ల దగ్గర్నుంచి ఆయనంతటి వయసున్నవాళ్ల దాకా అందరికీ ఆయనే ప్రధాన వక్త. అందుకే సినారె ముందుమాటలు రాసిన కవిత్వ సంకలనాలు కోకొల్లలు! అలాగని అకవిత్వాన్ని కూడా మెచ్చుకునేవారా? ఉన్నదానిలో మార్పులు చేయడం కన్నా, వ్యవస్థలోని సానుకూల అంశాలను ప్రమోట్ చేయడానికి ప్రయత్నించడం ఎడ్మినిస్ట్రేటర్‌గా సినారె వ్యవహార శైలి. అదే శైలిని ఆయన కవిత్వ ప్రశంసలోనూ పాటించారు. ‘‘అది లౌక్యంగా కన్నా ఆయన వ్యక్తిత్వంలో భాగంగా చూస్తాను. ఆయనతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ ఏనాడూ ఎవరి గురించీ ఒక ప్రతికూల మాట మాట్లాడగా నేను వినలేదు. ఎంత కొత్తగా రాసేవాడైనా ఆ కవి చేసిన ఒక కొత్త ప్రయోగాన్ని మెచ్చుకునేవారు. శబ్దం పుట్టించే ఉద్దీపన గురించి మాట్లాడేవారు’’ అంటారు ప్రొఫెసర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ. ప్రయోగశీలి నింగిలోతును చూడగోరితే నీటిచుక్కను కలుసుకో రత్నతత్వం చూడగోరితే రాతిముక్కను కలుసుకో అణువునడిగితె తెలియదా బ్రహ్మాండమంటే ఏమిటో మౌనశిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో మనిషి మూలం చూడగోరితే మట్టిబెడ్డను కలుసుకో (‘ప్రపంచ పదులు’ నుంచి) సినారె మహా శిఖరం లాంటి కవి. ప్రయోగవాది. అన్ని ప్రక్రియలనూ ముట్టారు. పద్యాలు మాత్రమే ఆదరించే కాలంలో గేయాలు రాశారు. పద్య కావ్యాలు, గేయాలు, వచన కవితలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తకాలు, బుర్రకథలు, గజళ్లు రాశారు. ఏ కాలంలోనైనా తన కాలపు యువకులతో కలిసి నడిచారు. పద్యాల్లోంచి గేయాల్లోంచి వచ్చిన ఆయన.. మనవల వయసు వాళ్లతో పోటీపడ్డారు. వర్తమాన ప్రాసంగికత ఎప్పుడూ పోనీయలేదు. ‘తలుపులూ కిటికీలు ఎంతగా మూసుకొనివున్నా తరుముకొచ్చే కాలవాహిని తిరిగిపోతుందా ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా’ అని అధిక్షేప కవిత్వం రాశారు. దీన్ని మాత్రాఛందస్సును బట్టి పంచ పదులు అన్నారు. వస్తువును బట్టి ప్రపంచ పదులు అని పిలిచారు. ఆయన ఎంతటి ప్రయోగశీలో పరిశోధకుడిగానూ అంత దిగ్గజం. ఆయన పరిశోధన గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము– సంప్రదాయములు, ప్రయోగములు’ రిఫర్ చేయకుండా ఒక్క వ్యాసం కూడా రాయలేమని చెబుతారు విమర్శకులు. ఏడు దశాబ్దాలపాటు కురిసిన సాహిత్య మేఘం సినారె. 86 ఏళ్ల జీవితంలో 70 సంవత్సరాలు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిత రాయని రోజు నాకు ఊపిరాడదని అనేవారు. ‘పోతూ పోతూ రాస్తాను వపువు(శరీరం) వాడేవరకు’ అనేది ఆయన కవిత్వ వ్యక్తిత్వాన్ని పట్టించే నినాదం. ‘‘పాత కీర్తుల మీద బతికేవాళ్లు ఉంటారు. ఆయనకు ఇవ్వాళ్టి కీర్తి ముఖ్యం. ఆయన కవిత్వాన్ని నేను కోట్ చేస్తాను, నా కొడుకు కోట్ చేస్తాడు, నా మనవడూ చెప్తాడు. నైరంతర సాహిత్య చైతన్యానికి ప్రతీక. ఇట్లాంటివాడు తెలంగాణలో శతాబ్దానికి ఒక్కడు కూడా పుట్టడం కష్టం’’ అంటారు సినారెతో దీర్ఘ సాహచర్యం ఉన్న ప్రొఫెసర్ ఎన్.గోపి. ప్రతీ పుట్టిన రోజుకు ఒక కవితా సంకలనం తేవాలని నియమంగా పెట్టుకున్న సినారె 2016 జూలైలో కూడా ‘నా రణం మరణం పైనే’ సంకలనం తెచ్చారు. బహుశా ఇంకో నెల ఆగితే మరో సంకలనంతో ఆయన మనల్ని పలకరించేవారేమో! అయినా ఆయనే అన్నారు: ‘అందరిలాగే సామాన్యుణ్ణి. అయినా చిరంజీవుణ్ణి’. తెలుగు సాహిత్యంలో సినారె చిరంజీవి! రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు పోతూ పోతూ రాస్తాను వపువు వాడేవరకు (సినారె కవిత) సినారెకు ప్రముఖుల నివాళి సాహిత్య ప్రపంచానికి తీరని లోటు.. సినారె మరణం సాహితీ ప్రపంచానికి తీరనిలోటు. ఆయన తన రచనలతో అన్ని తరాల వారిని ఏకం చేశారు. ఈ విచారకర సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల గురించే. – ప్రధాని నరేంద్ర మోదీ సినారె కృషి ఎన్నటికీ మర్చిపోలేనిది సాహిత్య రంగంలో సినారె చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిది. తెలంగాణ బిడ్డ సినారె కలం నుంచి వచ్చిన అనేక పద్యాలు, గేయాలు, కవితలు, కథలు ఆయనను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయి. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. – సీఎం కేసీఆర్ ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి జ్ఞానపీఠ్ పురస్కారానికే వన్నె తెచ్చిన మహా రచయిత సినారె. మా నాయకుడు ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. రచయితగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహా ధ్రువతార నేల రాలింది..: వైఎస్ జగన్ ‘సినారె మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు సాహితీ రంగంలో ఓ మహా ధ్రువతార నేల రాలింది. మహా రచయితలు, మహాకవులు, మహామనుషుల కోవకు చెందిన సిరారె మరణం తెలుగు జాతికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం డాలర్ హిల్స్‌లోని సినారె ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. సినారె కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి, ఆయన పెద్దల్లుడు భాస్కర్ రెడ్డిలతో మాట్లాడి వారిని ఓదార్చారు. సాహిత్య రంగానికి రారాజు.. తెలుగు సాహిత్య లోకం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. సాహిత్య రంగానికి సినారె రారాజు. – కేంద్ర మంత్రులు వెంకయ్య, బండారు దత్తాత్రేయ ఆయన సేవలు చిరస్మరణీయం సినారె మృతి సాహితీ లోకానికి తీరని లోటు. సాహిత్య రంగానికి, తెలుగు చలన చిత్ర రంగానికి, విశ్వవిద్యాలయాల భాషా సంఘాలు, సాంస్కృతిక మండళ్ల అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. – డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తలసాని మార్గదర్శకుడిని కోల్పోయాం ‘సాహిత్య అకాడమీ ఒక మార్గదర్శకుడిని, ఒక శాశ్వత స్నేహితుడిని కోల్పోయింది. గాయపడిన హృదయాలకు ఆయన రచనలు ఓదార్పునిచ్చాయి. బతుకు మీద ఆశ కోల్పోయిన వారికి ఒక భరోసాను కలిగించాయి. సినారె మరణం సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన తన రచనల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు’ – కేంద్ర సాహిత్య అకాడమీ ఎంతో సాన్నిహిత్యం తెలుగు జాతి ఖ్యాతిని పెంచేందుకు అవిరామ కృషి చేసిన డాక్టర్ సి.నారాయణరెడ్డితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన మరణం తీరని లోటు. – మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణలో విరిసిన సాహితీ కుసుమం సినారె మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. తెలంగాణ మాగాణిలో విరిసిన విశిష్ట సాహితీ కుసుమం సినారె. ఆయన అస్తమయం తెలంగాణ తల్లికి తీరని గర్భశోకం – జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అక్షరం పొదిగిన శక్తి సినారె సినారె అక్షరం పొదిగిన శక్తి. మానవాళికి తెలియని ఎన్నో విషయాలను ఆయన అక్షరాలతో చెప్పారు. అక్షరం ఉన్నంత వరకు సినారె ఉంటారు. జానపదం, విప్లవపదం అనే తేడాలు లేకుండా ఆయన రచనలు చేశారు. – గద్దర్ పలువురు ప్రముఖుల నివాళి సినారె మృతి పట్ల బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, పి.మురళీధర్‌రావు, జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్, సినీ రచయిత సుద్దాల ఆశోక్ తేజ, కవి, రచయిత ఆచార్య ఎన్ గోపి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, లోక్‌సత్తా పార్టీ నేత రామ్ దేశ్‌పాండే సంతాపాన్ని తెలిపారు. కారులో గజల్స్ పాడేవారు – డ్రైవర్ రాములు సినారెతో తనది 28 ఏళ్ల అనుబంధమని ఆయన కారు డ్రైవర్ రాములు తెలిపారు. ‘‘నేను 1989లో డ్రైవర్‌గా చేరాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు నేనే డ్రైవ్ చేస్తున్నా. నన్ను సొంత బిడ్డలా చూసేవారు. కారులో గజల్స్ ఆలపించేవారు’’ అంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ‘‘ఓసారి రవీంద్రభారతిలో నాటి సీఎం వైఎస్, సినారె కలిశారు. సినారెను చూడగానే వైఎస్.. ‘అయ్యా మనమిద్దరం కారు దిగుతూనే ఒకటి సరిచేసుకోవాలి..’ అన్నారు. ఎంటదీ అని సినారె అనగానే.. ‘అదే కవివర్యా... పంచె సర్దుకోవాలిగా..’ అని నవ్వుతూ చెప్పారు. ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. నన్ను అన్నీ అడిగి తెలుసుకొని ఓ తండ్రిలా సలహాలు ఇచ్చేవారు’’ అని పేర్కొన్నారు ఆహారం... ఆహార్యం..! పాల నురగలాంటి తెల్లటి ధోవతి, సిల్కు లాల్చీ.. తెలుగు వైభవానికి నిలువెత్త సంతకంలా ఉండేది సినారె ఆహార్యం! జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పంచెకట్టులోనే ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. హైదరాబాద్‌లో చదివే రోజుల్లో నిజాం సంస్కృతి రాజ్యమేలుతోంది. నిజాం నవాబు కు గౌరవ సూచకంగా విద్యార్థులు రూమీ టోపీ ధరించేవారు. ఆ సంస్కృతిని వ్యతిరేకించిన విద్యార్థు లు గాంధీ టోపీ ధరించేవారు. సినారె కూడా గాంధీ టోపీ ధరించారు. ఇంటర్లో చేరింది మొదలు తెలు గు లెక్చరర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించే వరకు సినారె ప్యాంటూ, షర్టే వేసుకొన్నారు. సాహితీ సమావేశాలకు వెళ్లడంతో ఆయన పంచెకట్టు మొదలైంది. ‘పంచె కట్టుకోవడం ఓ కళ. నాకైతే కనీసం పది, పదిహేను నిమిషాల సమయం పడుతుంది. ఎర్ర అంచు పంచెలే ఎంపిక చేసుకుంటాను. ‘రెడ్’లో ‘రెడ్డి’ గోచరిస్తుంది కదా. అందుకని...’’ అంటూ తన పంచెకట్టుపై తానే ఛలోక్తులు కూడా వేసుకునేవారు సినారె. భోజన ప్రియుడు.. సినారెకు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేమీ లేవు. కాకపోతే 40 ఏళ్లుగా షుగర్ ఉన్నా.. ఎప్పుడూ అదుపులోనే ఉంచుకొనే వారు. మంచి భోజనప్రియుడు. ఎక్కడ ఉన్నా సమయానికి ఆహారం తీసుకునేవారు. చివరి రోజు ఉదయం ఆయన పెద్ద కుమార్తె గంగ చేతుల మీదుగా ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం రాత్రి పప్పు–వైట్‌రైస్‌తో భోజనం చేశారు. ఆదివారం చివరిరోజంతా ఇంట్లో ప్రశాంతంగా గడిపారు. సినారె నడకను బాగా ఇష్టపడేవారు. ‘నడక నా తల్లి..’ అనే కవిత కూడా రాశారు. నాలుగేళ్ల క్రితం సినారెకు కాలు విరిగింది. అప్పట్నుంచి నడక మానేశారు. పంచెకట్టు భళా.. పంచెకట్టుటలోన ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడపదాటని వాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడయ్యా తెలుగువాడు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆవకాయ వియోగ మసలే నైపనివాడు ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు పంచభక్ష్యాలు తన కంచాన మెసలినా గోంగూర పచ్చడికై గుటక వేసెడివాడు ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు – సినారె -
తెలుగు హైకు: ఒక అవలోకనం
అభిప్రాయం హైకు అనే కవితా ప్రక్రియ జపాన్ దేశంలో రూపొంది ఇంగ్లిష్తో పాటు పలు ఇతర భాషల్లోకీ, మన తెలుగులోకీ వచ్చింది. ఇంగ్లిష్తో సహా ఐరోపా భాషల కవితలు వ్యర్థ పదాలతోనూ, పెద్దవిగా సాగిపోయే తీరులోనూ ఉండటానికి భిన్నంగా క్లుప్తతను గుణంగా కలిగి రూపొందిన కవితా ప్రక్రియ హైకు. నొగుచి అనే జపాన్ కవి అంటారు: ‘‘గంపల కొద్దీ రాసి అచ్చెయ్యాలి అన్న ఒకే ఉత్సుకతతో ఎప్పుడూ తపించే వాడు కవి అవడు’’. ‘‘క్లుప్తంగా చెప్పి బోధ పరచడం హైకు వైశిష్ట్యం’’ అంటూ నొగుచి ఒక ఉదంతాన్ని ఉటంకిస్తారు. హŸకషి అనే కవి తన గురువుకు సొంత ఇల్లు కాలిపోయిన సంగతిని ఓ హైకుగా రాసి తెలియజేస్తారు ఇలా: ‘నిప్పు రాజుకుంది– రాలే పువ్వు ప్రశాంతత ఎంతో!’ ‘ఇల్లు తగలబడింది కానీ తన మనసు ప్రశాంతతను కోల్పోలేదు’ అని హŸకషి తన హైకుతో తెలియ జేశారు. ఇంకా నొగుచి ఇలా అంటారు: ‘‘ఆకాశ నక్షత్రం, ఏకాంతం, మౌనం, పువ్వుల భాష వీటితో కలిసిపోయి బ్రతికేవాడే కవి’’. నొగుచి మోడర్న్ రివ్యూ అనే కలకత్తా పత్రికలో రాసిన వ్యాసాన్ని తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1916లో తమిళంలోకి అనువదించారు. హైకు ప్రాముఖ్యతను గురించి రవీంద్రనాథ్ టాగూర్ ఓ మంచి వ్యాసం రాశారు. దాన్ని గాలి నాసరరెడ్డి తెలుగులో అనువదించి 8–12–2008న ‘సాక్షి’లో ప్రకటించారు. హైకు, విశ్వ కవితా రూపాలలో ఓ విప్లవం. జపాన్ భాషలో హైకుకు ఆదికవి బషో (1644–94). హైకు కవిగా ఆయన స్థానం అద్వితీయం. ‘పాత కొలను, కప్ప లోపలికి దూకింది – నీళ్ల చప్పుడు.’ ఇది బషో రాసిన ఓ హైకు. బషో తరువాత బుసోన్, చిఝె, హŸకషి, హిస, ఇస్స, కికకు, షికి ప్రభృతులు జపనీస్ హైకును పరిపుష్టం చేశారు. జపాన్ మతాలు బౌద్ధం, టాఔ ఇజం, ఎనిమిజం జపాన్ హైకులలో మిళితం అయినాయి. తంక అనే ఓ కవితా ప్రక్రియ నుండి విడివడి హŸకుగా కొంతకాలం ఉండి చివరికి హైకుగా స్థిరపడింది. తంకలోని మొదటి భాగం హైకు. జపనీస్‌లో అజ్జాత కవుల హైకులు కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి: ‘కొత్త తండ్రి, జోల పాడాడు– అపశ్రుతిలో’. హైకు అన్న పదంలో ‘హై’ అంటే వినోదకర అనీ, ‘కు’ అంటే కవిత అనీ అర్థాలు. ఇక్కడ కు– హ్రస్వమే. ఈ హై, ఈ కు– రెండూ చైనీస్ –బై–కియు– నుంచి వచ్చాయి. తెలుగులో మనం హైకులు అనొచ్చు. హైకు జపనీస్‌లో 5, 7, 5 జిఒన్(jion)లతో రాయబడుతుంది. హైకు 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఇంగ్లిష్‌లోకి వెళ్లింది. ఇమేజిజం అనే ఎజ్రాపౌండ్ ఉద్యమం ద్వారా హైకు ఇంగ్లిష్‌లోకి వ్యాపించింది. ఎజ్రాపౌండ్తో పాటు ఎమిలో వెన్, ఫ్లింట్, జాన్ ఫ్లెచర్ వంటి కవులు హైకును ఇంగ్లిష్ లోకి తెచ్చారు. రాబర్ట్ ఫ్రాస్ట్, డబ్ల్యూ బి. ఈట్స్, వాలెస్ స్టీవెన్స్ వంటి కవులపై హైకు ప్రభావం పడింది. హెరాల్డ్ జి.హెన్డర్సన్ హైకుపై ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. ప్రక్రియ పరంగా జపనీస్ జిఒన్లను ఇంగ్లిష్‌లో 5,7,5 సిలబల్స్గా తీసుకున్నారు. అది తప్పు. జపనీస్ హైకు ఒకే పాదంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో హైకును మూడు పాదాలుగా రాస్తారు. అదీ తప్పే. ఇంగ్లిష్‌లో హైకు అన్న పదం బహువచనాన్నీ సూచిస్తుంది. ఇంగ్లిష్ ద్వారా వ్యాపించడం వల్ల హైకు తన రూపాన్నీ, ఆత్మనూ కోల్పోయింది. ఈ నిజాన్ని ఇంగ్లిష్ పరిశీలకులే గ్రహించి ప్రకటించారు. తెలుగులో 1923లో దువ్వూరి రామిరెడ్డి మర్మ కవిత్వం అన్న తమ వ్యాసంలో బషో హైకులను హŸక్కులు అన్న శీర్షికతో తెలుగులోకి అనువదించి హైకులను తెలుగుకు పరిచయం చేశారు. ఆయన పద్యాలలో అనువదించారు. తరువాత కట్టమంచి రామలింగారెడ్డి 1931లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘గాథా సప్తశతి’ అనువాదానికి రాసిన పీఠికలో కొన్ని జపనీస్ హైకులను తేటగీతి ఛందస్సులో రెండు పాదాలుగా అనువదించారు. ఆ తరువాత 1950లో సంజీవదేవ్ కొన్ని హైకులను వచన కవితలుగా అనువదించారు. తొలి తెలుగు హైకు రాసినది గాలి నాసర రెడ్డి. 1990లో ఆంధ్రభూమి దినపత్రికలో ఆయన రాసిన 5 హైకులు అచ్చయినాయి. తొలి తెలుగు హైకు: నదిలో ఈత/ చంద్రుడి శకలాలు/ గుచ్చుకున్నాయి. మూడు పాదాల్లో 5, 7, 5 అక్షరాలతో ఆ 5 హైకులు ఉన్నాయి. 1991లో పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం పేరుతో తొలి తెలుగు హైకుల సంకలనాన్ని వెలువరించారు. ఇస్మాయిల్, బి.వి.వి.ప్రసాద్, లలితానంద ప్రసాద్, డా. శిరీష, మాకినీడి సూర్యభాస్కర్, అద్దేపల్లి రామమోహన రావు ప్రభృతులు తమ హైకులను, హైకులపై రచనలను వెలువరించారు. తొలి తెలుగు హైకు కవయిత్రి రత్నమాల. తెలుగులో హైకు పేరుతో ఎక్కువ రచనలు చేసినవారు పృథ్వీరాజ్. ఇంకా కొంతమంది కవులు, కవయిత్రులు హైకులు రాశారు. హైకు పత్రికలు కూడా వచ్చాయి. మొదట్లో తెలుగు హైకులు 5,7,5 అక్షరాలతో మూడు పాదాలలో రాయబడినా రానురాను ఆ నియమం సడలిపోయింది. 1950లోనే సంజీవ దేవ్ జపనీస్ జిఒన్లకు మన భాషలోని మాత్రలు ప్రత్యామ్నాయం అని సూచించారు. 2003లో ఉప్పలధడియం వెంకటేశ్వర తొలిసారి 5,7,5 మాత్రలతో మూడు పాదాలలో హైకు రాశారు. అది: ‘విత్తనం, నేల త్రోవను–చిరయాత్ర’. పెన్నా శివరామకృష్ణ ‘దేశదేశాల హైకు’ పేరుతో కొన్ని విదేశీ హైకులను తెలుగులోకి అనువదించారు. గాలి నాసరరెడ్డి కొన్ని విదేశీ హైకులని తెలుగులోకి అనువదించి ప్రకటించారు. ముండకోపనిషత్(3–1–1) లోనే హైకు శిల్పం ఉందని చెబుతూ నాసర రెడ్డి ఓ శ్లోకాన్ని సూచించారు. అది: ‘‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్యః పిప్ఫలం స్వాద్వత్త్వ నశ్నన్నన్న్యో అభిచాక శీతి’’ ఒక దానితో ఒకటి కలిసి ఉన్న రెండు పక్షులు చెట్టుపై– ఒకటి చెట్టు ఫలాలను ఆస్వాదిస్తూ తింటోంది; మరొకటి తినకుండా చూస్తోంది. హైకు అన్నది శిల్పాత్మకమైన ఓ ప్రక్రియ. హైకు శిల్పంలో ఋతువుల్ని సూచించే పదాలు, చిత్రణలు, ఘటనలు, రెండు చిత్రణల కలయిక, రెండు ఘటనల కలయిక, చిత్రణ, ఘటన కలయిక అన్నవి ముఖ్యం. హైకు అన్నది నిర్వచనంలా ఉండదు. వివరణలా ఉండదు. హైకులో ఉపమ, రూపకం లాంటి అలంకారాలు ఉండవు. హైకుపై సరైన అవగాహన కావాలంటే జపనీస్ హైకులనే చదవాలి. హైకు 5,7,5 మాత్రలతో ఒకే పాదంలో ఉండటం శాస్త్రీయమైన పద్ధతి. ఆ పద్ధతిలో సిసలైన హైకు శిల్పంతో హైకు, హైకుగా తెలుగులో పునర్భవం పొందాల్సిన అవసరం ఉంది. రోచిష్మాన్ 09444012279 -
తెలుగు సాహిత్యంలో బిరుదులు
పూర్వకాలంలో మహారాజులు కవులను, పండితులను గజారోహణాలతో, గండపెండేరాలతో, సింహతలాటాలతో, కనకాభిషేకాలతో, పుష్పాభిషేకాలతో, కిరీటదారణలతో, పల్లకీ ఊరేగింపులతో వివిధ రీతులలో సత్కరించేవారు. వీటితోపాటు వారికి బిరుదులను ప్రదానం చేసేవారు. బహుజనపల్లి సీతారామాచార్యుల శబ్దరత్నాకరం బిరుదు పదానికి సామర్థ్య చిహ్నము అని అర్థం చెబుతున్నది. బిరుదులు ఎవరు ఇస్తారు?: పైన పేర్కొన్నట్టు మహారాజులు బిరుదులు ప్రదానం చేసేవారు. రాచరికం అంతరించాక సంస్థానాధీశులు, జమీందారులు తమను ఆశ్రయించినవారికి బిరుదులతో సత్కరించేవారు. జమీందారీ వ్యవస్థ నాశనమయ్యాక బ్రిటీష్ ప్రభుత్వం వారు తమ పరిపాలనా సౌలభ్యం కోసం కొంతమందికి రావుసాహెబ్, రావు బహద్దూర్, దీవాన్ బహద్దూర్ వంటి బిరుదులను ఇచ్చేవారు. ఇలాంటి బిరుదులు పొందినవారిలో కొంతమంది సాహిత్యరంగానికి చెందిన వారు వున్నా ఈ బిరుదులు సారస్వత రంగానికి చెందిన బిరుదులుగా పరిగణించలేము. తరువాతి కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కొన్ని సాహిత్య సంస్థలు, కొందరు వ్యక్తులు బిరుదులను ఇస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మిక మఠాలు, పీఠాలకు చెందిన అధిపతులు, జగద్గురువులు కూడా తమ భక్తులైన కవులకు, రచయితలకు బిరుద ప్రదానం చేస్తున్నారు. బిరుదప్రదానం అనేది పేరు పెట్టడం లాంటిది. నిక్‌నేమ్ (పరిహాసనామం) తగిలించటం వంటిదన్నమాట. నిక్‌నేమ్ వ్యంగ్యంగా, హేళనగా ఉండటమో, న్యూనత లేదా హైన్యతను సూచించడమో జరిగితే బిరుదులు గౌరవ సూచకంగా ఉంటాయి. ఒకటీ అరా బిరుదులు వెక్కిరింపుగా కూడా లేకపోలేదు. రేచీకటి ఉన్న కవికి ఆంధ్రమిల్టన్, బ్రహ్మచారి అయిన రచయితకి సాహితీభీష్మ బిరుదును ప్రదానం చేయడం వెనుక వున్న వ్యంగ్యాన్ని గమనించవచ్చు. బిరుద ప్రదానంలో మనవారు ప్రదర్శించిన వైవిధ్యాన్ని, నైపుణ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. వాటిలో కొన్ని రకాల బిరుదులను ఇక్కడ పరిశీలిద్దాం. 1. పూర్వకవులతో/పురాణ పురుషులతో పోల్చి వారి పేర్లముందు ‘అభినవ’ అనో, ’నవీన’ అనో, ’నూతన’, ’నవ్య’, ’అపర’ అనో ఏదో ఒక విశేషణాన్ని తగిలించడం. అభినవ కాళిదాసు, అభినవ తిక్కన, అపర పింగళిసూరన, అభినవ వేమన, అభినవ మొల్ల, నూతన తిక్కన సోమయాజి మొదలైనవి. 2. సంస్కృత, ఆంగ్ల, విదేశీ కవులతో పోల్చి వారి పేర్లకు ముందు ‘ఆంధ్ర’ లేదా ‘తెలుగు’ అని తగిలించడం. ఆంధ్ర ఎడిసన్, ఆంధ్ర కల్హణ, ఆంధ్ర బిల్హణ, ఆంధ్ర జయదేవ, ఆంధ్ర బాస్వెల్, ఆంధ్ర బెర్నార్డ్ షా, ఆంధ్ర మొపాసా, ఆంధ్ర వ్యాస, ఆంధ్ర షెల్లీ, తెలుగు బాస్వెల్ వగైరా. 3. పక్షులను విశేషణాలుగా ఉంచడం. కవికోకిల, అవధానరాజహంస, కవిరాజహంస, కుండినకవిహంస, కవికాకి, కవిగండభేరుండ మొ. 4. జంతువుల పేర్లు కలిగిన బిరుదులు. సింహము: అవధాని పంచానన, ఆంధ్ర వైయ్యాకరణకేసరి, ఆశుకవి కేసరి, కళాసింహ, కవిసింహ, కవికంఠీరవ, కింకవీంద్ర ఘటాపంచానన ఏనుగు: కవికరి, కవిదిగ్గజ, విద్వత్కవికుంజర మిగిలిన జంతువులు: కవివృషభ, కవికిశోర 5. దేవతల పేర్లు కలిగిన బిరుదులు: బ్రహ్మ: కథాబ్రహ్మ, కవిబ్రహ్మ, చరిత్రచతురానన, జానపద కవిబ్రహ్మ, సహస్రావధానబ్రహ్మ, సాహిత్యబ్రహ్మ, హాస్యబ్రహ్మ, కథావిరించి మొదలగునవి. ఈశ్వరుడు: అలంకార నటరాజ, కవిరాజశేఖర, పరిశోధన పరమేశ్వర, పీఠికాప్రబంధ పరమేశ్వర, కవితా మహేశ్వర, ప్రబంధ పరమేశ్వర మొదలైనవి. సరస్వతి: అభినవ భారతి, అవధాన శారద, అవధాన సరస్వతి, కవితాభారతి, జ్ఞానభారతి, పుంభావ సరస్వతి, ప్రసన్న భారతి, బాలసరస్వతి, సాహిత్యసరస్వతి ఇత్యాదులు. బృహస్పతి: అక్షరవాచస్పతి, విద్యావాచస్పతి, శతావధాన గీష్పతి,ఆంధ్రభాషా వాచస్పతి సూర్యచంద్రులు: అవధాన కళానిధి, అవధాన శశాంక, అవధాని సుధాంశు, ఉభయభాషా భాస్కర, కథాసుధానిధి, కథాకళానిధి, కవిచంద్ర, కవితాసుధాకర, కవిసుధాకర, కావ్యకళానిధి, విద్యాభాస్కర, సాహితీశశాంక, సాహిత్య సుధాకర. కేవలం దేవతలే కాకుండా రాక్షసులు (ధారణాబ్రహ్మ రాక్షసుడు, కవిరాక్షసుడు), గంధర్వులు (సాహిత్య గాంధర్వ) కూడా మన సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. 6. చారిత్రక, పురాణపురుషుల పేర్లు కలిగిన బిరుదులు: అభినవాంధ్ర వాల్మీకి, అభినవ కృష్ణరాయ, ఆంధ్ర భోజ, అభినవ భోజ, అభినవ వ్యాస, అభినవ సహదేవ, అభినవ సూత, ఆంధ్రవ్యాస, కవికిరీటి, ప్రసన్న వాల్మీకి, సాహితీ వశిష్ఠ ఇత్యాదులు. 7. సముద్రము, నదులతో పోల్చిన బిరుదులు: కవితానంద మనోదధి, సాహిత్య రత్నాకర, కవితాగంగోత్రి, కవితాతరంగిణి, విద్యాదానవ్రతమహోదధి, విద్యాసాగర 8. వయసును సూచించే బిరుదులు: బాలకవి, యువకవి, తరుణకవి, ప్రౌఢకవి మొ. 9. ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే బిరుదులు: కోనసీమ కవికోకిల, అమెరికా అవధాన భారతి, రాయలసీమ కవికోకిల, వెల్లంకి వేమన, నల్లగొండ కాళోజీ మొ. 10. బంధుమిత్రులను సూచించే బిరుదులు: అభినవాంధ్ర కవితాపితామహుడు, అభ్యుదయ కవితాపితామహుడు, అవధాని పితామహ, ఆంధ్రకవితా పితామహుడు, ఆంధ్రచరిత్ర నాటక పితామహ, ఆంధ్ర నాటకపితామహ, ఆంధ్ర పద్య కవితా పితామహ, భావకవితాపితామహుడు, వచనకవితా పితామహుడు, శారదాతనయ, శారదాపుత్ర, సరస్వతీపుత్ర, సరస్వతీసత్పుత్ర, సాహితీబంధు, కవిమిత్ర, సాహితీమిత్ర మొ. 11. ఇంకా మనకవులలో రాజులు, చక్రవర్తులు, సమ్రాట్టులు, సార్వభౌములు, పాదుషాలు, వల్లభులు, త్రాతలు, పోషకులు, ఉద్ధారకులు ఉన్నట్లు వారివారి బిరుదుల వలన తెలుస్తున్నది. మణులు, రత్నాలు, కంఠాభరణాలు, భూషణాలు, అలంకారాలను కూడా మనవాళ్లు బిరుదులలో అందంగా పొదిగినారు. ధురీణులు, ప్రపూర్ణులు, చతురులు, తల్లజులు, ప్రవీణులు, మూర్ధన్యులు, తత్పరులు, పండితులు మొదలైన నిష్ణాతులు కూడా మన కవిపండిత సమూహంలో ఉన్నట్లు వారి వారి బిరుదుల వలన తెలుస్తున్నది. ఈ బిరుదులను అధ్యయనం చేస్తే ఆయా వ్యక్తుల పాండిత్యంపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు అభినవ వేమన అనే బిరుదాంకితుడు వేమన వలె ఆటవెలది పద్యాలలో విశేషమైన ప్రతిభ కనపరచి వుండవచ్చునన్న అంచనాకు రావచ్చును. అలాగే గద్యతిక్కన, భావకవి, శృంగారకవి, హాస్యబ్రహ్మ మొదలైన బిరుదుల ద్వారా ఆయా కవుల రచనల స్వభావాన్ని గుర్తించవచ్చు. బిరుదులలోని విశేషణాన్ని ఆయా కవులలో మనం అపేక్షిస్తాం. ఉదాహరణకు మధురకవి లేదా కవికోకిల అనే బిరుదున్న కవుల రచనల్లో మాధుర్యాన్ని, కవుల గొంతులో కోకిల స్వభావమైన మధురమైన కంఠస్వరాన్ని ఆశిస్తాం. అయితే అన్నిసందర్భాలలో అలా ఆశించడంలో ఔచిత్యముండకపోవచ్చును. ఉదాహరణకు రాజహంస అపార్టుమెంటు వెల్ఫేర్ కమిటీవారు వారి గృహసముదాయంలో నివసిస్తున్న ఒక కవిగారికి కవిరాజహంస అనే బిరుదుని ఇచ్చారనుకోండి. ఆ కవిగారిలో రాయంచ లక్షణాలను వెదుకుకోవడం, ఆ కవిగారికి నిజంగా ఆ లక్షణాలు ఉన్నాసరే, అహేతుకమవుతుంది. కొన్ని బిరుదులను ప్రత్యేకంగా ఎవరూ ప్రసాదించకపోయినా ప్రజల నోళ్ళల్లో నాని అవే బిరుదులుగా స్థిరపడిపోతాయి. ప్రజాకవి, మహాకవి, సహజకవి అందుకు ఉదాహరణలు. కొన్ని ఆయా కవుల పేర్లలో భాగమైపోయి అవే నిజమైన పేర్లుగా స్థిరపడిపోతాయి. ఉదాహరణకు ఎలకూచి బాలసరస్వతి, చిన్నయసూరి, విశ్వనాథకవిరాజు మున్నగునవి. చివరగా ఒకమాట. ఈ బిరుదులలో కొన్నిమాత్రమే అన్వర్థాలు. అటువంటి బిరుదులు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెచ్చిపెట్టుకున్న బిరుదులు, అడిగిపుచ్చుకున్న బిరుదులు, వ్యాపారధోరణిలో సంపాదించుకున్న బిరుదులకు విలువ ఉండదు. అలాంటివి పటాటోప ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడతాయి. కేవలము బిరుదాంచితులు మాత్రమే గొప్పవారు అని ఎవరైనా భావిస్తే అది పొరపాటు. ఏ బిరుదులూ లేని ప్రతిభాసంపన్నులైన కవిపండితులెంతమందో ఉన్నారు. చాలామందికి ఈ బిరుదులపట్ల అనాసక్తత లేదా విముఖత ఉంది. అలాంటివారు తమకు బిరుదులు ఉన్నా వాటిని ఎక్కడా పేర్కొనరు. ఏది ఏమైనా ఈ బిరుదులనేవి ఒక గుర్తింపు అని మాత్రం అంగీకరించాలి. - కోడీహళ్లి మురళీమోహన్, 9701371256 (వ్యాసకర్త ఇటీవల ‘ఆంధ్రసాహిత్యములో బిరుద నామములు’ పుస్తకం తెచ్చారు.) -
తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే
నాంపల్లి : తెలుగు సాహిత్యంలోని భిన్న ప్రక్రియల్లోని నాట్యం, నాటకం, అవధానం, పత్రికా రచన, మహిళాభ్యుదయం, గ్రంథాలయం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలిత సంగీతం, జ్యోతిష్యం, కార్టూన్, గజల్ తదితర రంగాల్లో విశేషమైన సేవలందించిన 39 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య యశస్వీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాలకు ఎంపికైన వారిలో దేవులపల్లి కృష్ణమోహన్ (సృజనాత్మక సాహిత్యం), సయ్యద్ నసీర్ అహ్మద్ (పరిశోధన), పులిగడ్డ విశ్వనాథరావు (హాస్య రచన), హైమావతి భీమన్న (జీవిత చరిత్ర), జ్వలిత (ఉత్తమ రచయిత్రి), హెచ్.కె.వందన (ఉత్తమ నటి), సత్కళా భారతి సత్యనారాయణ (ఉత్తమ నటుడు), అత్తలూరి విజయలక్ష్మి (ఉత్తమ నాటక రచయిత), భూపతి నారాయణమూర్తి (హేతువాద ప్రచారం), తంగెళ్ళ శ్రీదేవి (ఉత్తమ రచయిత్రి), దాసరాజు రామారావు(వచన కవిత/గేయ కవిత), నోముల సత్యనారాయణ (వివిధ ప్రక్రియలు) తెలకపల్లి రవి (పత్రికా రచన), చెంచు సుబ్బయ్య (అవధానం), సుమిత్ర అంకురం (మహిళాభ్యుదయం), ఆచార్య రామారెడ్డి (గ్రంథాలయ కర్త), ఆచార్య చంద్రÔó ఖర రావు( గ్రంథాలయ సమాచార విజ్ఞానం), విహారి (కథ), గంగోత్రి సాయి (నాటక రంగం), డాక్టర్ సజ్జాద్(సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), వి.రమణి( ఆంధ్రనాట్యం), జాతశ్రీ(నవల), ఆచార్య బి.రామకృష్ణారెడ్డి( భాషాచ్ఛంద స్సాహిత్య విమర్శ), శింగారపు ఓదెయ్య(జానపద కళలు), బూర్గుల శ్రీనాథ శర్మ (ఆధ్యాత్మిక సాహిత్యం), పల్లేరు వీరాస్వామి (సాహిత్య విమర్శ), వెలుదండ సత్యనారాయణ (పద్యం), పద్మ మోహన్ యాదగిరి (సాంస్కృతిక సంస్థా నిర్వహణ), పి.వి.అరుణాచలం(జనరంజక విజ్ఞానం), సి.నాగేశ్వర రావు(జానపద గాయకులు), వి.ఆర్.శర్మ (బాలసాహిత్యం), విశ్వనాథ్ జోషి (ఇంద్రజాలం), జి.యాదగిరి (పద్య రచన), పాప(కార్టూనిస్ట్), ఎ.శారదారెడ్డి (లలిత సంగీతం), రేవతి రత్నస్వామి( శాస్త్రీయ సంగీతం), ఆచార్య సివిబి.సుబ్రహ్మణ్యం (జ్యోతిషం), దాశరథుల బాలయ్య (తెలుగు గజల్), నిడమర్తి నిర్మలాదేవి (కాల్పనిక సాహిత్యం) ఎంపికయ్యారు. ఈ నెల 30, 31వ తేదీల్లో హైదరాబాదులోని పబ్లిక్‌గార్డెన్స్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య వి.సత్తిరెడ్డి తెలిపారు. -
మూర్తిదేవికి ‘గబ్బిలాల’ స్వాగతం
తెలుగు సాహిత్యం నిద్రాణం నుంచి జాషువా రాకతో మేలుకున్నది. దాని వేలుపట్టి వెలుగులో నడిపించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్. నేటికి తెలుగు సాహి త్యాన్ని మెరుగులు దిద్దుతూ మరమ్మతు చేస్తున్న వారిలో ప్రథముడాయన. 78 ఏళ్ల ఇనాక్ ఆరు పదుల వర్తమాన సాహిత్య జీవన కవనమై చరిస్తూ, సజీవంగా చలిస్తూ 87 గ్రంథాల సృష్టికర్తగా వర్ధిల్లుతున్నారు. పట్టుకున్న ప్రతీ సాహిత్య ప్రక్రియను పండించటంలో ఎదురులేని కృషీ వలుడు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో వచ్చిన బహుళ సాహిత్య ప్రక్రియల్లో రచనను కొనసాగించి తెలుగు సాహిత్యానికి పరిపుష్టిని చేకూర్చి పరిపూర్ణం చేశారు. తెలుగు సాహిత్య రంగానికి పెద్ద దిక్కుగా గమనం చూపిస్తూ నడుస్తున్న చరిత్రగా ప్రయాణం చేస్తున్నారు. గ్రంథాల సంఖ్యల్లోనే కాకుండా వాటిలోని విలువల్ని కూడా సాధించాడు. సుదీర్ఘమైన, సువిశాలమైన, వైవిధ్య కథాభరిత విశిష్ట వ్యక్తిత్వ చిత్రీకరణల సముదాయం కొలకలూరి ఇనాక్ సాహిత్యం. సరిహద్దులతో బంధించలేనంత అనుబంధాలు పెంపొందించుకున్న పెద్ద మనిషి ఇనాక్. సాహిత్య కూడలి మధ్యన కూర్చుని ఏ దారిన ప్రయాణించాలో చాలామంది సాహితీకారులకు తోచనట్టి సందర్భాలు ఉంటున్న నేపథ్యంలో తాను మాత్రం కూడలి మధ్యనే సాహిత్య తపస్సు చేస్తూ అన్ని దారులను, వాటి పిల్లదా రులను కూడా పలకరించి పరిపాలిస్తాడు. పొందికగా బోధివృక్షమై మార్గాన్ని చూపెడతాడు. పతనం అంచున కూడా శిఖరం అధిరోహించడం ఎలాగో తెలిసిన విలక్షణ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్. ఆకలి మంటల కార్ఖానా ఆయన జీవితం. లోకం పోకడలో పడి హృదయం లేని మనిషిగా బ్రతకటానికి ఏనాడూ ఇష్టపడని తత్వం ఆయనది. వాదాల గాథల్లో పడి కొట్టుకుపోలేదు. తన జీవితగాథను తన వాదంగా బయలు పరిచాడు. సాహిత్య ముడి సరుకు అయిన మాదిగ తత్వపు చెలిమే సమస్త మానవతత్వ వాదాలకు మూలమని నిత్య నూతనంగా ఊరింప జేస్తున్న జాంబ వంతుడు. తాను సృష్టించిన సాహిత్యంలో తమ తమ వాదాలను వెతుక్కునేలా, వెతుక్కోకుండా ఉండలేనంత స్ఫూర్తిని, స్పృహను తన సాహిత్యంలో పొందుపరచిన విలుకాడు భుజంగరాయుడు. విమర్శ రాయకుండా ఉండలేక, రాస్తున్నప్పుడు ఏ విమర్శకుడు కూడా నటిం పునకు లోనవకుండా విమర్శ రాసే సాహిత్యాన్ని సృష్టించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ కలం యొక్క కండరాల శక్తి భారతీయ సాహిత్యపు దిమ్మెలమీద జెండాను, ఎజెండాను ప్రకటింప జేసిన సాహిత్య ‘కల్న ల్’గా గౌరవం పొందారు. మునివర్గ, శిష్టవర్గ దృష్టికి ప్రత్యామ్నాయంగా జనుల విభిన్నత్వ దృష్టిలో నుండి సాహిత్యాన్ని రంగరిం చినా మునులు, శిష్టులు, జనులు జేజేలు పలుకుతున్న ఈ సాహిత్య తరువుని మూర్తిదేవి పురస్కారం వరించిన సందర్భంలో మాతాత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ.... (ఆచార్య కొలకలూరి ఇనాక్ని నేడు ‘మూర్తిదేవి’ అవార్డుతో సత్కరిస్తున్న సందర్భంగా) డప్పోల్ల రమేష్, వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజనం సాంస్కృతిక వేదిక -
తలుపు... తలుపు...
గురజాడ వెంకట అప్పారావు కథా సంకలనం ‘ఆణిముత్యాలు’లో తొలి కథ ‘దిద్దుబాటు’ ‘‘తలుపు.. తలుపు..’’ అనే పదాలతో మొదలవుతుంది. నిజానికి ఈ మహాకవి సరికొత్త తెలుగు సాహిత్య వాకిలిని అలా తట్టి తెరిపించారనిపిస్తుంది. తెలుగు సాహితీలోకాన్ని కొత్త గవాక్షాల నుంచి వీక్షించేటట్టు చేసినవారు గురజాడ అప్పారావు. ప్రబంధ యుగంతో హంపీ విజయనగరంలో తెలుగు సాహిత్య క్షీణదశ ఆరంభమైందంటారు. కానీ తెలుగునాట ఉన్న విజయనగరంలో అభ్యుదయం దిశకు తెలుగు సాహితిని మరలించినవారు అప్పారావు (సెప్టెంబర్ 21, 1862- నవంబర్ 30, 1915). నాటకం, కథ, గేయం, కవిత్వం, చరిత్ర, విద్య, శాసన పరిష్కరం- బహుముఖాలుగా ఆయన తెలుగు సాహిత్యానికీ, సంస్కృతికీ సేవలు చేశారు. ‘కన్యాశుల్కం’ గురజాడ వారి నాటకం. ఇందులో ఆయన విధవా సమస్య, బాల్య వివాహాలు, విధవా పునర్ వివాహాలు, వేశ్యా సమస్యల గురించి చర్చించారు. వీటిలో ఏ సమస్యా వర్తమాన సమాజంలో అదే రూపంలో లేదు. అంత తీవ్రతతోనూ లేదు. కానీ ఆ నాటకం అజరామరంగా నిలబడే ఉంది. నేటికీ వేగుచుక్క ఈ నాటకం! ఆధునిక సాహిత్యం మీద కూడా కన్యాశుల్కం నాటకం ప్రభావం తీవ్రంగానే ఉంది. సాహిత్యంలో రూపం, సారం; వాటి మధ్య తూకం అన్న చర్చ వస్తే ఈ అంశంతోనే జవాబు వెతకవచ్చు. రాబట్టుకోవచ్చు కూడా. అదే మహాకవి తెలుగు సాహిత్య విమర్శకు అందించిన వరం. అందుకే నేటికీ ఈ నాటకం వేగుచుక్కలాగే వెలుగుతోంది. అంతర్లీనంగా చాలా అంశాలు ఇంకా నడుస్తూ ఉంటాయి. ఆ నాటకంలో పాత్రలు చిరంజీవులుగా మిగిలాయి. గిరీశం, మధురవాణి, రామప్పపంతులు, అగ్నిహోత్రుడు, లుబ్ధుడు, కరటకశాస్త్రి, మీనాక్షి, బుచ్చమ్మ, వెంకమ్మ వంటి ప్రధాన పాత్రలు తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం పొందాయి. చిత్రంగా సౌజన్యారావు, పూజారి గవరయ్య, పొటిగరాపు పంతులు, బంట్రోతు, పూటకూళ్లమ్మ, మహేశం, వెంకటేశం వంటి చిన్న పాత్రలు సైతం అంతే ఆకర్షణను కలిగి ఉంటాయి. తెలుగు సమాజానికి ఆరంభమైన కుహనా మేధావుల బెడద గురించి కూడా రసరమ్యంగా చిత్రించారు అప్పారావు. గురజాడ వారి శిల్ప చాతుర్యం, సంభాషణ కూర్చే సామర్థ్యం, సహజత్వం అద్భుతమనిపిస్తాయి. గిరీశం... ది గ్రేట్ దాదాపు 120 ఏళ్ల క్రితం రాసిన నాటకం గురించి ఇదంతా. ఇందులో మధురవాణి గురించి: ఒక సందర్భంలో మధురవాణి అనే వేశ్య లేకపోతే ఈ కళింగానికి ఎంత లోటు వచ్చి ఉండేదో కదా! అంటాడు కరటకశాస్త్రి. ఆరుద్ర ఇంకో అడుగు ముందుకు వేసి, ‘అసలు మధురవాణి పాత్రని గురజాడ సృష్టించకుంటే తెలుగు సాహిత్యానికి ఎంత లోటు జరిగేదో’ అని. గిరీశం పాత్రకు గురజాడ బీజం వేశారు. కానీ అది మహాకవి అంచనాలకు అందని రీతిలో ఎదిగిపోయిందని విమర్శకుల అభిప్రాయం. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటేగానీ పొలిటీషియన్ కానేరడోయ్’ అనగలిగినవాడు గిరీశం ది గ్రేట్. ఇది ఇప్పుడు ఈ దేశంలో ఉన్న తొంభయ్శాతం రాజకీయవేత్తలకు వర్తిస్తుందంటే అతిశయోక్తి కాదుకదా! యాంటీ నాచ్... ప్రో నాచ్ నిజానికి సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయ్యే చాలామంది నిజ స్వరూపం ఎలాంటిదో కరటకుడి చేత మహాకవి చెప్పించిన నిర్వచనాలు ఇవాళ్టికి వర్తిస్తాయి. ఇది యాంటీనాచ్ (వేశ్యా సంపర్కాన్ని వ్యతిరేకించేవారు) ఉద్యమకారుల గురించి కరటకుడు వెల్లడించిన చీకటిసత్యాలు. కొందరు పగలు యాంటీనాచ్. కొందరు రాత్రి ప్రోనాచ్. కొందరు సొంతూళ్లో యాంటీనాచ్. కొందరు పొరుగూరు వెళితే ప్రోనాచ్....’ ఇలా సాగుతుంది. పురుషాధిక్య సమాజానికి వెండి తీగలు కాల్చి వాతలు పెట్టిన మహోన్నత పాత్ర మధురవాణి. ‘వేశ్యలంటే అంత చులకనా పంతులు గారూ!’ అంటుందామె. ‘నాటకమల్లా పగటివేషాల్లోకి దిగిందే’ వంటి లోతయిన సంభాషణలు కూడా మహాకవి ఆ పాత్ర చేతే పలికించారు. కొండుభట్టీయం, బిల్హణీయం (అసంపూర్ణం) గురజాడవారి రెండు నాటిక లు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యక వంటివి గేయ కావ్యాలు. వాటిని చూస్తే స్త్రీల దుస్థితి పట్ల ఆయన పడిన క్షోభ ఎంతటిదో అర్థమవుతుంది. డిసెంట్ పత్రం విద్యా వ్యవస్థ లోటుపాట్లను చెబుతుంది. పెళ్లికూతురు... పిల్ల దెయ్యాలు మూఢనమ్మకాల మీద గురజాడ వారు వేసిన చురకలు మరీ అద్భుతమైనవి. ముఖ్యంగా దెయ్యం పట్టడం అనే అంశం మీద ఆయన సృష్టించిన దృశ్యం ఇప్పటికీ స్మరణీయమే. కరటకుడి శిష్యుడు మహేశానికి ఆడవేషం కట్టి, లుబ్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అనుకున్నట్టు పెళ్లయ్యాక వణియం గిణియం విప్పేసి శిష్యుడు పారిపోతాడు. ఆ కొత్త పెళ్లికూతురిని లుబ్ధుడే చంపేశాడని రామప్పపంతులు నాటకం ఆడతాడు. ఆ లేని దెయ్యాన్ని సీసాలో బంధిస్తాడు పూజారి గవరయ్య. అంతేనా! అసలు ఆడదే కాని ఆ దొంగ పెళ్లికూతురికి చనిపోయిన ముందు మొగుణ్ణి కూడా సృష్టించి వాణ్ణి కూడా అదే సీసాలో బంధిస్తాడతడు. అప్పుడు మీనాక్షి (లుబ్ధుడి కూతురు)కి వచ్చిన సందేహం అద్భుతం. ‘ఆ రెండు దెయ్యాలని (లేనివి) ఒకే సీసాలో బంధిస్తే దెయ్యప్పిల్లలు పుడుతాయేమో!’ అంటుందామె. దెయ్యం అనే అభూత కల్పన మీద ఇంతటి వ్యంగ్యాస్త్రం ఇంతవరకు వచ్చి ఉండదు. మహాకవి మనకిచ్చిన సంపద ‘ఆణిముత్యాలు’ పేరుతో వచ్చిన గురజాడ కథలు... ‘దిద్దుబాటు’, ‘మీ పేరేమిటి?’, ‘మెటిల్డా’, ‘పెద్ద మసీదు’, ‘మతము - విమతము’, ‘సంస్కర్త హృదయం’. ఇవి ఆ మహాకవి మనకిచ్చి వెళ్లిన కథా సంపద. ప్రతి కథ ఆణిముత్యమే. సంస్కర్త హృదయంలో మహాకవి వాస్తవిక దృష్టి మరింత అద్భుతం. ‘రిఫార్మ్ అన్నమాట ఇంగ్లిషులో చెబితే నీకు ఎంత అర్థమైందో, తెలుగులో సంస్కరణ అని చెప్పినా అంతే అర్థమవుతుంది’ అంటూ శిష్యుడు వెంకటేశానికి గిరీశం ఒకసారి చెబుతాడు. నిజమే సంస్కర్తలు కూడా మనుషులే. దేవుళ్లు కారు. ఆ విషయాన్ని అత్యంత రమణీయంగా సంస్కర్త హృదయంలో చెప్పారు గురజాడ. ప్రొఫెసర్ అయ్యర్ (యాంటీనాచ్ ఉద్యమకారుడు), సరళ (వేశ్య) ప్రధాన పాత్రలుగా ఈ కథను గురజాడ అందించారు. ఇది ఇంగ్లిష్‌లో రాసిన కథ. ఇంతకీ ఈ కథకి ముగింపుగా రెండు వాక్యాలు గమనిస్తే ఏదీ పరిపూర్ణం కాదు. ఏ మనిషీ పరిపూర్ణుడు కాడు అని నిజాయితీగా అంగీకరించారని అనిపిస్తుంది. ‘సంస్కరణ అంటే బురదలో ఉన్నవారిని పైకి తీయబోయి, తాము కూడా బురదలో కూరుకుపోవడమే’ అంటారాయన. భ్రమలని కాకుండా, నినాదాలను కాకుండా వాస్తవాలను చిత్తశుద్ధితో చెప్పగలిగిన వాస్తవిక వాది మాత్రమే ఈ మాట అనగలడు. అందుకే గురజాడ మహాకవి. యుగపురుషుడు. ద్రష్ట. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
మిగ్గు ఆవిష్కరణ సభ
తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో- పొన్నాల బాలయ్య కవిత్వ సంపుటి ‘మిగ్గు’ ఆవిష్కరణ సభ జూన్ 26న సాయంత్రం 5:30కు రవీంద్రభారతి మినీహాల్లో జరగనుంది. ఆవిష్కర్త: వరవరరావు. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. దేశపతి శ్రీనివాస్, జూపాక సుభద్ర, గుండెడప్పు కనకయ్య, పసునూరి రవీందర్, తైదల అంజయ్య పాల్గొంటారు. సోమనాథ కళాపీఠం పురస్కారాలు సోమనాథ కళాపీఠం పురస్కారాలను జూన్ 26న పాలకుర్తిలో ప్రదానం చేస్తున్నట్టు సంస్థ గౌరవాధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ తెలియజేస్తున్నారు. పురస్కారాలు: సోమనాథ సాహిత్య పురస్కారం- గుత్తి చంద్రశేఖర్ రెడ్డి, సోమనాథ సామాజిక శోధన పురస్కారం - కాలువ మల్లయ్య, పందిళ్ల రాజయ్య శాస్త్రి శేఖర్‌బాబు స్మారక స్వచ్ఛంద భాషా సేవ పురస్కారం- గుడిమెట్ల చెన్నయ్య, వి.చలపతిరావు ప్రోత్సాహక సాహిత్య పురస్కారం- యల్లంభట్ల నాగయ్య, రాపోలు సోమయ్య స్మారక ప్రతిభా పురస్కారం- లొంక సంపత్, విశేష పురస్కారం- ద్యావనపల్లి సత్యనారాయణ. కవిత్వ నిర్మాణంపై వర్క్‌షాప్ ఫూలే - అంబేడ్కర్ అధ్యయన వేదిక, మహబూబ్‌నగర్ ఆధ్వర్యంలో- కవిత్వ నిర్మాణ పద్ధతులపై ఒక వర్క్‌షాప్ జూన్ 26న ఉదయం 10 నుంచీ లిటిల్ స్కాలర్స్ హైస్కూల్, మెట్టుగూడ, మహబూబ్‌నగర్‌లో జరగనుంది. వక్త: జి.లక్ష్మీనారాయణ. ఆసక్తిగలవారు సంప్రదించాల్సిన ఫోన్ నం: 9492765358 -
కొత్త పుస్తకాలు
అమృతం కురవని రాత్రి కథారచయిత: చింతపట్ల సుదర్శన్; పేజీలు: 102; వెల: 75; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్- 500068; ఫోన్: 040- 24224453 సెటైరిస్టుగానూ, అనువాదకుడిగానూ పేరొందిన చింతపట్ల సుదర్శన్ కథల సంపుటి ఇది. ఇందులో 14 కథలున్నాయి. ‘సుదర్శన్ రాసిన కథల్లో (ఒక కర్త ఖర్మ క్రియలో తప్ప) వ్యంగ్యం బాగా పండింది. వ్యంగ్యాత్మకంగా రచించబడిన ఈ కథల్లో ఈనాటి సమాజపు వికృతరూపం మనకు దిగ్భ్రమను కలిగిస్తుంది. ఈ కథల్లోని శైలి కవితాత్మకంగా సాగింది. చాలా క్లిష్టమైన మాంత్రిక వాస్తవికత అనే శిల్పాన్ని రచయిత చాలా చక్కగా, సులభంగా అర్థమయ్యేలా ప్రయోగించటం విశేషం’. దహనం నవలారచన: సాగర్ శ్రీరామకవచం; పేజీలు: 184; వెల: 80; ప్రతులకు: ఉషారాణి శ్రీరామ కవచం, 8-1-21, జమ్మిచెట్టు బజార్, లాయర్పేట్, ఒంగోలు. ఫోన్: 9885473934 ‘దహనం నవల వాస్తవిక చారిత్రక స్థితిని ఆవిష్కరించడానికి ప్రయత్నించింది. బ్రాహ్మణ సమాజం ఎలా పతనమవుతూ వచ్చింది చూపిస్తుంది. 80 సంవత్సరాల నాటి మానవ సమాజ పోకడలకి అద్దం పడుతుంది. చరిత్రని, కాల్పనికతని, వాస్తవికతని, ఆనాటి వ్యక్తుల డొల్లతనాన్ని, అమాయకత్వాన్ని, జాతీయ పోరాటాన్ని, అసాంఘికతను ఈ నవల చిత్రించింది’. పూలకుండీలు నవలారచన: శిరంశెట్టి కాంతారావు; పేజీలు: 136; వెల: 100; ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో. రచయిత ఫోన్: 08744- 256167 ‘ఈ నవలలోని వస్తువు అత్యాధునికమైనది. ఇంగ్లీషు భాషలో ‘సరోగసీ’ అనే పదానికి తెలుగులో ‘అద్దెగర్భం’ అని అనువాదం చేస్తూ అది కేంద్రంగా జరుగుతున్న వ్యాపారం మీద తెలుగులో కాసిని కథలు వచ్చాయి. బహుశా నవల మాత్రం ఇదే మొదటిది’. ‘విరివిగా కథలు రాస్తున్న కాంతారావు సమకాలీన సమాజంలో మండుతున్న ఇలాంటి వస్తువును తీసుకుని నవల రాయడం ఆయన పరిశీలనకు గుర్తు’. అగ్నిసుమం కవి: కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ; పేజీలు: 72; వెల: 60; ప్రచురణ: అభ్యుదయ రచయితల సంఘం (అరసం), గుంటూరు శాఖ. ప్రతులకు: అన్ని విశాలాంధ్ర, నవచేతన శాఖలు. ‘అభ్యుదయ రచయితగా నేడు పాలక పక్షాలు అనుసరిస్తున్న అసహన సంస్కృతిని తీవ్రంగా నిరసిస్తాడు శరత్. (ఇతని) కవిత్వంలో జాతీయత, అంతర్జాతీయత, విస్తృతంగా కనిపిస్తాయి. ఇంకా స్థానికత, హేతువాద భావనలు, తాత్విక చింతనలు వున్నాయి. ఇతని ఆలోచనలకు కేంద్రం మార్క్సిజమని స్పష్టమౌతుంది’. పేరులేని శ్రీమతులు రచన: రెవ॥సామ్యేల్‌బాబు బైరపోగు; పేజీలు: 160; వెల: 60; ప్రతులకు: రచయిత, ఎస్. యూనిక్ రెసిడెన్సీ, 202, సైదాబాద్, హైదరాబాద్-59; ఫోన్: 9347256600 బైబిల్లో కొందరు గొప్ప భార్యలున్నారు. కానీ వారికి పేర్లు లేవు. కయ్యీను భార్య, నోవహు భార్య, లోతు భార్య, యోబు భార్య, యోషయా భార్య అనే వారిని పిలుస్తారు. అలాంటి ఇల్లాళ్ల జీవిత విశేషాలను రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. పైగా ఇతర గ్రంథాల ఆధారంగా వారి అసలు పేర్లు కూడా పుస్తకం చివర చేర్చారు. మీ రచనలు పంపవలసిన చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34; ఫోన్: 040-23256000; మెయిల్: sakshisahityam@gmail.com -
పిట్టకు ఆహ్వానం
- పుస్తక పరిచయం సుజాత పట్వారి తన పుప్పొడి కవితా సంకలనం తర్వాత పిట్టకు ఆహ్వానం పలుకుతోంది. ఈ సంకలనంలోని కవితలు గతానికీ, వర్తమానానికీ వారధి కట్టే ప్రయత్నం చేస్తాయి. జ్ఞాపకానికి పెద్ద పీట వేస్తూ, కవయిత్రి మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. వర్తమానాన్ని ఎదుర్కోగలిగే బలాన్ని గతం నుండి, జ్ఞాపకాల నుండి, గతించిన వ్యక్తుల నుండి తెచ్చుకుంటుందా కవయిత్రి అనిపిస్తుంది. తాను పోగొట్టుకున్న తన కోసం నిరంతర అన్వేషణ! తాను ఆహ్వానం పలుకుతున్నది చెట్టు మీద ఉన్న పిట్టకు తన లోకం/లోగిలిలోకా లేక తనలో ఉన్న పిట్టకు బయటి ప్రపంచంలోకా అన్న ఆలోచన ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ వెంటాడుతుంది. బాల్యపు బెంగలే కాదు, భవిష్యత్తుపై ఉత్సుకతే కాదు, ‘ఓ తాత్విక గంభీరత’ను కూడా ఈ కవితలు వెల్లడిస్తాయి. బుద్ధుడికి దొరికిన ఏనుగుపిల్ల, రావి ఆకులు కూడా ఇందులో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముందే చెప్పినట్లు, తన కోసం తనలోకే ఓ అన్వేషణ, అది కూడా సాధ్యపడని ఓ నిరంతర యుద్ధం. ‘యుద్ధాల్ని చూస్తూ చూస్తూ/ యుద్ధంగా మారినదాన్ని/ తుపాను కన్ను కనిపించాలే కానీ/ ధనుర్విద్య ఎంతసేపు’ అంటూ యుద్ధం మీదే యుద్ధాన్ని ప్రకటిస్తుంది. చిత్రకారుడి ఏమరుపాటు రంగుల బీభత్సం కూడా ఓ అద్భుతమైన జ్ఞాపకంగానో, స్ఫూర్తినిచ్చే సంఘర్షణగానో మిగిలిపోతుంది. జిలేబి కట్టిన కాగితం, మిగిలిన ఆఖరు ముక్క, కాగితంలో దేవుడి బొమ్మ-- దాచుకోలేని, పారవేయనూలేని ద్వైదీభావం ముందు ముందు సుజాత రచనల్లో మరింత చర్చకు వస్తుందని ఆశిస్తున్నా. - సునీతారాణి పిట్టకు ఆహ్వానం; సుజాత పట్వారి; వెల: 50; ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో. కవయిత్రి ఫోన్: 9440927122 -
కొత్తగా ఖలీల్ జిబ్రాన్ రెండు పుస్తకాలు
- ముందుమాట నేను చెప్పిన వాటిల్లో సగం అర్థరహితమైనవే- కానీ అలా ఎందుకు చెప్తానో తెల్సా! మిగతా సగమైనా నిన్ను చేరతాయని. - ఖలీల్ జిబ్రాన్ (ఇసుక మరియు నురగ) ఖలీల్ జిబ్రాన్ ఊహాశక్తి గొప్పది. భావాల్లో స్పందన పార్శ్వం ఎక్కువ. అది అనుభూతి ప్రధానం. అందువల్ల అది ‘ఆలోచన’గా, గతంగా మారని వర్తమానం. అతని భావాలు, అనుభూతులు, ప్రతీకలు, వ్యక్తావ్యక్తాలు, చదివే పాఠకుల స్థలకాల, మానసిక స్థితిగతులను అనుసరించి అర్థమౌతుంటాయి. జిబ్రాన్ సగం చెప్పిన భావాల్లో మిగతా సగం పాఠకులనే ఊహించుకోమంటాడు. సగం చెప్పిన తీరులో అనేక అనుభూతులు. ప్రవచించేవాడు ప్రవక్త. అతడీ ప్రపంచాన్ని ప్రవచిస్తున్నాడు. అందులో ఒకడై సంచరించి ఆలపిస్తున్నాడు. పాఠకుడు తనకు తాను ఆ తత్వాల్లో లీనమైపోతాడు. బైరాగి తత్వాలకు వినేవారిని తనలో కలుపుకొనే శక్తి ఉంటుంది. అలా మనల్ని లాక్కుంటాడు జిబ్రాన్. మనలోకి విస్తరిస్తాడు. మనద్వారా విస్తరిస్తాడు. ‘ప్రవక్త’ అంటే అదే. మనలోకి విస్తరించడమే ‘ప్రవక్త’ లక్షణం. సూఫీ తత్వవేత్తల వైరాగ్యం చావును, జీవితాన్ని ఒక్కటిగా చూసే చూపును అందిస్తుంది. ఈ విశ్వానికి డిటాచ్‌మెంట్‌గా ఉండాలని బౌద్ధం నుండి కొనసాగుతూ వస్తున్న భావజాలం ఇది. కొన్ని అస్తిత్వవాదాలు కూడా దీన్నే చెప్పాయి. సుఖము, దుఃఖము, బాధ, సంతోషము ఒక్కటే అంటాడు జిబ్రాన్. ఒకటిగా స్వీకరించే తత్వానికి చేరినప్పుడే ఈ జీవితాన్ని ముందుకు సాగించడం సాధ్యమని చెప్పడం దీని ఉద్దేశంగా భావించాలి. జీవితం, మృత్యువు రెండూ ఒకే స్థాయిలో ఎందుకు సామాన్యీకరిస్తారో దాన్ని అర్థం చేసుకునే దశకు చేరుకునేదాకా తెలుసుకోవడం కష్టం. ఖలీల్ జిబ్రాన్ అర్థం కావడం కూడా అంతే. జిబ్రాన్ ఎన్నో పార్శ్వాలు కలిసిన ఒక రంగుల కలయిక. అందుకే అతడు నిరంతరం తన రచనల ద్వారా ఆకర్షిస్తూనే ఉంటాడు. ఆ ఆకర్షణని జతిన్ కుమార్ తన అనువాదంలో చక్కగా పట్టుకోగలిగాడు. చాలామంది రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని రాసింది కాకుండా, రాయనిదాని అంతరార్థాన్ని తెలుసుకోవాలనుకుంటారు. జిబ్రాన్ అలా కాకుండా రాసినదానికి ఆవలగల దాన్ని చూడాలంటాడు. అలా మరింత ఊహాశక్తిని, నూతన సత్యాలను మనకు మనం తెలుసుకోవడానికి ఒక దారాన్ని, ఆధారాన్ని అందిస్తూ హృదయాన్ని చకితం చేస్తుంది జిబ్రాన్ ‘ఇసుక మరియు నురగ’. పాత ఈస్తటిక్ ప్రక్రియ రూపాలను ఎందుకు తీసుకోవాలి? తనదైన అభివ్యక్తిలో ఎందుకు ముందుకు సాగకూడదు అనే నిశ్చయం జిబ్రాన్‌లో ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణకు రూపం ఇచ్చింది. (వాటిని) సులభంగా, సామాన్యులకు అర్థమయ్యేవిధంగా తెలుగులోకి అనువదించారు (మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మి). (దీనివల్ల) అతను ప్రత్యేకంగా చెప్పే నైపుణ్యాన్ని పూర్తిగా తెలుపకపోయినా సారం మాత్రం అందుతుంది. - బి.ఎస్.రాములు 8331966987 ‘ది ప్రాఫెట్’ను డాక్టర్ ఎస్.జతిన్‌కుమార్ ‘ప్రవక్త’గానూ, ‘శాండ్ అండ్ ఫోమ్’ను మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మి ‘ఇసుకను తోసుకొచ్చిన తీరం - నురగను మోసుకొచ్చిన కెరటం’గానూ తెలుగులోకి తెచ్చారు. వీటిని ఎస్.వి.ఎల్.నరసింహారావు రంగవల్లి పబ్లికేషన్స్ తరఫున ప్రచురించారు. వెల: ఒక్కోటీ 100. ప్రతులకు: ఫ్లాట్ నం.103, దుర్గా అపార్ట్మెంట్, దుర్గా నగర్, సోమాజిగూడ, హైదరాబాద్-82. ఫోన్: 9963374567. పై వ్యాసం, ఈ రెండు పుస్తకాలకూ బి.ఎస్.రాములు వేర్వేరుగా రాసిన ముందుమాటకు సంక్షిప్త రూపం. -
నీలవేణి
- పుస్తక సమీక్ష స్త్రీల సాహిత్యం, దళిత సాహిత్యం ఆధిపత్యపు సార్వత్రిక జ్ఞానాన్ని చెదరగొడతాయి. కొత్త సార్వత్రిక జ్ఞానాన్ని యిస్తాయి. అటువంటి జ్ఞానాన్ని సునీల్‌కుమార్ 15 కథల సంపుటి ‘నీలవేణి’ అందిస్తోంది. ఇందులో ఎక్కువ కథలు దళిత జీవిత నేపథ్యంలో రాసినవి. వ్యంగ్యం, హాస్యం, ఆగ్రహం, ఆర్తి యీ కథలని నెలబెడతాయి. ‘దభేల్ మని యెగిరిపడ్డాడు రంగ’ అని మొదలయ్యే ‘దెయ్యం’ కథ, దేవుళ్లూ దెయ్యాలూ యెవరి ప్రయోజనం కోసం ముందుకు వస్తాయో నెత్తిమీద దభేల్మని మొట్టి మరీ చెపుతుంది. నవ్వుతూ వుండగానే, యెప్పుడో యెక్కడో జరిగిపోయిన, అందరూ మర్చిపోయిన విషయం తెరమీదకు వస్తుంది. అధర్మం పట్ల అదుపులో పెట్టుకున్న రచయిత ఆగ్రహం కళ్లెం బిగించిన గుర్రాల్లాగా మాటల్ని కవాతు చేయిస్తుంది. ‘థూ’ అనిపిస్తుంది. చుండూరు దళితుల మారణకాండ దుఃఖాన్ని కలిగించిన సంఘటన. అన్యాయం జరిగినప్పుడు న్యాయమనేది వొకటుందని మనసును వోదార్చుకోవటానికి ప్రయత్నిస్తాం. న్యాయం అన్యాయంగా సాక్షాత్కరించినప్పుడు జోసెప్ప ధిక్కారం, క్రోధం మనలోపలివే అనిపించి నిరసనాగ్రహంతో గొంతు కలుపుతాం. చీకటి అని దిగులు పడుతుంటే ‘సముద్రం మీద నక్కిన చీకటి నది మీదగా, కాలవ మీదగా దారి చేసుకుని ఆమెని కమ్మేసింది’ అని ‘చీకటి’ని జీవితానికే ప్రతీకగా చూపిస్తుంది. ‘ఆర్థిక తెలివి వాకిట్లోకి రాగానే ప్రేమ కిటికీలోంచి దూకేస్తుంది’ అంటూ చంటి మన మందుకి వస్తాడు. చంటిలాంటి వ్యక్తులు యీ సమాజంలో ఎందరున్నారో అనిపిస్తుంది. దళిత జీవితపు పార్శ్వాలలో జరుగుతున్న కల్లోల పరిణామాల్నీ, అగ్రవర్ణ ఆధిపత్యం వివిధ రూపాల్లో యెలా కొనసాగుతుందో ఆయా మార్పులనీ ‘దేవదాసు 2015’, ‘పరిశుద్ధ వివాహము- మూడవ ప్రకటన’ కథల్లో రచయిత వొడిసి పట్టుకున్నారు. దేవదాసు, జరుగుతున్న విషయాలని తాగుడు యిచ్చే అప్పటిశక్తితో ‘మతంలోకి వచ్చినా మా పేర్లల్లో హిందూ వాసన పోదు. మీ పేరు చివర కులం పోదు. మా జనం పరిస్థితి ఏటల్లకాలం మీ ఎనకమాల తిరగటమేనా?’ అని దులపరిస్తాడు. ‘తండ్రి అనేవాడు పూర్తిగా ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం... ఉండి లేకపోతే నరకం’ అని ‘నీలవేణి’ సూక్ష్మమైన శరీర రాజకీయాలని చక్కగా చూపిస్తుంది. ‘నా జీవితం ఓ పరీక్షా నాళిక అయిపోయింది’ అని చెప్పిన నీలవేణి ‘మన జీవితం మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇలా ప్రతి కుక్కా మన జీవితంతో ప్రయోగం చేస్తుంది’ అని అంటూ వుంటే కథా వస్తువుకీ, కథా సమయానికీ జీవం పోయటానికి కావలసిన సామగ్రిని వోపికగా అమర్చుకోవటం యీ కథకునికే చెల్లింది అనిపిస్తుంది. ఇటువంటి అనుభవాలను వెలుగులోకి తీసుకురావటం వలన యీరోజు సార్వత్రిక జ్ఞానం అనుకుంటున్న ఆధిపత్య జ్ఞానం చెదిరిపోతుంది. అలా చెదరగొట్టటం సమాజానికి చాలా అవసరం. - కుప్పిలి పద్మ నీలవేణి (కథల సంపుటి); కథకుడు: పి.వి.సునీల్ కుమార్; పేజీలు: 188; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్-68; ఫోన్: 040-24224453 -
తొలి తెలుగు సినీ కవి
- నేడు కేశవదాసు 140వ జయంతి ‘కనకతార’ నాటకాన్ని అనేక సమాజాలు ప్రదర్శించడమేగాక, 1936లో సరస్వతీ టాకీస్ వారు వెండితెర కెక్కించడం ఆ నాటక ప్రాచుర్యాన్ని తెలియజేస్తుంది. జనన మరణాల దృష్ట్యా యిది కేశవదాసును గుర్తు చేసుకోవలసిన వారం. చందాల కేశవదాసు పేరు ఈ తరానికి తెలియదు. ఆయన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’(1932) చిత్రానికి పాటలు రాసిన కవి అని కానీ, ఈనాటికీ వినిపిస్తున్న ‘బలే మంచి చౌకబేరము...’ ప్రసిద్ధ చలనచిత్ర గీతం ఆయన రాసిందే అని కానీ, పద్య నాటకాలకు విశేషాదరణ వున్న కాలంలో విస్తృతంగా ప్రదర్శింపబడిన ‘కనకతార’ నాటకకర్త ఆయనే అని కానీ చాలామందికి తెలియదు. ఆ మాటకొస్తే ‘తెలుగు సినిమా పాట చరిత్ర’ పరిశోధన గ్రంథంలో ఈ వ్యాసకర్త ప్రకటించే వరకు చందాలకు మొట్ట మొదటి సినీ కవిగా ముద్ర పడలేదు. ఆ తర్వాత వచ్చిన కొన్ని వ్యాసాల్లో కూడా అశ్రద్ధ కారణంగా అవాస్తవాలూ, పొరపాట్లూ చోటు చేసుకొన్నాయి. ఆ నిజానిజాలను వివరిస్తూ ఈ నివాళి! ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన కేశవదాసు చదువు అంతంత మాత్రమే అయినా, వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. శతకాలు, దండకాలు, మేలుకొలుపులు, జోలపాటలు, దేశభక్తి గీతాలు మొదలైన ప్రక్రియల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకొని పద్యకవిగా, అష్టావధానిగా, నాటక రచయితగా, హరికథా భాగవతారుగా రాణించారు. హరికథలు చెప్పడమే గాక స్వయంగా ‘నాగదాసు చరిత్ర’, ‘విరాట పర్వము’ మొదలైన కథలను రచించారు. నాటకరంగం మీద మక్కువతో ‘కనకతార’, ‘బలిబంధనము’ నాటకాలను రచించి ప్రదర్శింపచేశారు. ‘కనకతార’ జానపద ధోరణిలో రాజ్యాధికారం కోసం సాగిన వీరరసప్రధానమైన నాటకం కాగా, ‘బలిబంధనము’ భాగవతంలోని వామన చరిత్ర ఆధారంగా రాసిన నాటకం. కనకతార ‘టైటిల్’ నాయికా నాయకులకు సంబంధించినది కాకుండా తార, కనకసేనుడు అనే అక్కాతమ్ముళ్లకు సంబంధించినది కావడం విశేషం. ‘కనకతార’ నాటకాన్ని అనేక సమాజాలు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించడమేగాక, 1936లో సరస్వతీ టాకీస్ వారు హెచ్.వి.బాబు దర్శకత్వంలో దానిని వెండితెర కెక్కించడం ఆ నాటక ప్రాచుర్యాన్ని తెలియజేస్తుంది. కనకతార సినిమాలో దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ ప్రధాన పాత్రధారులు. ‘కనకతార’ చిత్రం ద్వారా సీనియర్ సముద్రాల సినీ రచయితగా పరిచయమయ్యారు. 1955లో ‘కనకతార’ కొత్త తారాగణంతో మరోసారి సినిమాగా వచ్చింది. నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారు రాసిన ‘భక్త ప్రహ్లాద’ నాటకాన్నే శ్రీకృష్ణావారు హెచ్.యం.రెడ్డి దర్శకత్వంలో చలనచిత్రంగా రూపొందించారు. సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా చాలావరకు ఆ నాటకాన్ని ప్రదర్శించిన సురభి నాట్యమండలి సభ్యులే! రామకృష్ణమాచార్యులు ‘చిత్ర నళీయం’తో ప్రారంభించిన పద్ధతి ప్రకారం ముందుగా ప్రహ్లాద వచన నాటకాన్ని రచించి దానికి అనుబంధంగా 40 పాటలను సమకూర్చి పద్యాలను మాత్రం పోతన భాగవతం నుండి యథాతథంగా తీసుకొన్నారు. అయితే ధర్మవరం వారి తర్వాత ఆ నాటకం సురభి వారి చేతుల్లోకి వచ్చి ప్రదర్శనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులకు లోనైంది. ఆ దశలో సురభి వారి కోరిక మేరకు కేశవదాసు రచించిన 3 పాటలు ఆ నాటకంలో చేరాయి. ఇవే తర్వాత సినిమాలోకీ వెళ్లాయి. అవి- 1.లీలావతి పాత్రధారిణి సురభి కమలాబాయిపై చిత్రీకరించిన- పరితాప భారంబు భరియింపతరమా కటకటా విధినెట్లు గడువంగ జాలుదు... 2.నారాయణ నామస్మరణం చేస్తూ తండ్రికి కోపం తెప్పిస్తున్న తనయుని లీలావతి మందలించే సందర్భంలో- తనయా ఇటులన్ బలుక తగదు... 3.హిరణ్యకశిపుడు తన భార్యను ఇంద్రుడు చెరపట్టాడనే వార్త తెలిసి క్రోధంతో మండిపడే సన్నివేశంలో- భీకరంబగు నా ప్రతాపంబునకు భీతి లేక యిటు చేసెదవా... వీటిలో మొదటి పాటను కొందరు తొలితెలుగు సినిమా పాటగా పేర్కొనడం సరికాదు. తొలి తెలుగు చలనచిత్ర గీతం రామకృష్ణమాచార్య రాయగా సినిమాలో మొదటిపాటగా చిత్రీకరించిన- వింతాయెన్, వినన్ సంతస మాయెనుగా... అంటూ హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూనే మరణించాడని భ్రమించి ఆ ఆనందంలో దేవేంద్రుని ముందు రంభ పాడిన నృత్యగీతమే! ఎటొచ్చీ సినిమా తీసే సమయానికి ధర్మవరం వారు బ్రతికి లేరు గనుక, చందాల వారు సినిమా కోసం రాసినా, అంతకు ముందు సురభి వారికోసం రాసినా సజీవుడైన ఆయనను సంప్రదించి దర్శకుడు పై మూడు పాటలను వినియోగించుకోవడం వల్ల- చందాల కేశవదాసును తొలి సినీకవిగా నిర్ధారించడం జరిగింది! ఆ రోజుల్లో వృత్తి నాటక సమాజాల కోరికమీద ఇతర కవులు రాసిన ప్రసిద్ధ నాటకాలకు దైతా గోపాలం, పాపట్ల కాంతయ్య, చందాల కేశవదాసు మొదలైన వారు కొన్ని పాటలను రాసేవారు. ఆ క్రమంలో ప్రహ్లాద తర్వాత ముత్తరాజు సుబ్బారావు రచించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకానికి కూడా కేశవదాసు 3 పాటలను సమకూర్చారు. అవి- 1. బలేమంచి చౌకబేరము... 2.మునివరా, తుదకిట్లు ననున్మోసగింతువా? 3. కొట్టూ కొట్టండీ కొట్టండీ బుఱ్ఱపగల... అనేవి. ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రాన్ని నిర్మించిన మూడు సంస్థలూ (కాళీ ఫిలింస్-1935), రాజరాజేశ్వరీ ఫిలింస్-1955), సురేష్ మువీస్-1966) ఈ పాటల్ని విడిచిపెట్టలేకపోయాయి. వీటిలో ‘బలేమంచి చౌకబేరము’ అత్యంత ప్రజాదరణను పొందింది. కేశవదాసు పూర్తిగా రచన అందించిన మొదటి చిత్రం ఆరోరా ఫిల్మ్ కార్పొరేషన్ వారి ‘సతీ అనసూయ’ (1935). దాసరి కోటిరత్నం ప్రధాన పాత్ర ధరించిన ఈ చిత్రంలో దాసుగారు 24 పాటలనూ, 14 పద్యాలనూ రాశారు. కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించిన రాధా ఫిలిం కంబైన్స వారి ‘లంకా దహనం’ (1936) చిత్రానికి కూడా చందాల వారే మాటలూ పాటలూ రాశారట కాని ఆ ప్రింటు యిప్పుడు అలభ్యం! ‘కనకతార’ కథ దాసుగారిదే అయినా సినిమా రచయితగా సముద్రాల రాఘవాచార్యుల వారు నియోగింపబడగా నాటకంలోని మూడు పాటల్నీ, రెండు పద్యాలను మాత్రమే సినిమాలో వినియోగించారు. ‘ఏ పాప మెరుగని పాపలకీ చావు...’, ‘దప్పిచే నాలుక తడిపోడిలేక..’ అనే రెండు పద్యాలు ఆనాడు జనం నోళ్లలో నానినవి కాగా- మాండలిక పదజాలంతో రాసిన పాటలు జనాన్ని ఆకట్టుకొన్నాయి. చందాల కేశవదాసు బహుముఖ ప్రజ్ఞను తెలుసుకోవడానికి పై సమాచారం చాలు! ఆయన యెత్తు పెంచడానికి ఆయన రాయని పాటలనూ, చిత్రరచనలనూ ఆ అమరజీవికి ఆపాదించవలసిన అవసరం లేదు! - పైడిపాల 9989106162 -
తెలుగులోనే కథా రచయితలు అధికం
ఈ కథల్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి: కొలకలూరి ఇనాక్ ‘పాతికేళ్ల కథ’ సంకలనాన్ని ఆవిష్కరించిన కా.రా, జంపాల చౌదరి హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో ఉన్నంతమంది గొప్ప కథా రచయితలు ఏ భారతీయ భాషలో లేరని, ఆ అదృష్టం తెలుగు వారికే ఉందని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. మనసు ఫౌండేషన్, కథా సాహితి నిర్వహణలో వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లు సంపాదకులుగా 155 మంది రచయితల 336 కథల ‘‘పాతికేళ్ల కథ’’ (1990-2014) సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు హాజరై సంకలనాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని ముఖ్య అతిథిగా హాజరైన తానా అధ్యక్షులు జంపాల చౌదరి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇనాక్ మాట్లాడుతూ ఇంత పెద్ద గ్రంథం ముద్రించి, అందరిని చదవగలిగేటట్టు చేసిన వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్లను అభినందించారు. ఇన్ని మంచి కథల్లో కొన్నైనా లేకపోతే అన్నైనా అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలని, తప్పనిసరిగా ఆంగ్లంలోకి అనువాదం చేయించాలని జంపాల చౌదరిని కోరారు. ఇవన్నీ ఆంగ్లంలోకి వస్తే తెలుగులో ఎంతటి గొప్ప రచయితలు ఉన్నారో ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. ఉద్యమాలను గురించి తెలుసుకుని సాహిత్యాన్ని రాసేవారు కొందరైతే.. కొంత జీవితాన్ని, కొంత చదువును రెంటినీ సమన్వయం చేసుకుంటూ రాసేవారు మరికొందరు ఉంటారని అన్నారు. రకరకాల ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నవారు ఉన్నప్పటికీ.. ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులుంటాయి కానీ సమాజాన్ని చూసి సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులు ఉండవని అన్నారు. తానా అధ్యక్షులు జంపాల చౌదరి మాట్లాడుతూ కథల పుస్తకాల ప్రచురణకు పాతికేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నానని అన్నారు. భవిష్యత్తులోనూ కథల ప్రచురణకు సహాయాన్ని అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయితలు వివినమూర్తి, కేతు విశ్వనాథరెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, వీక్షణం సంపాదకులు ఎన్.వే ణుగోపాల్ హాజరై ప్రసంగించారు. మధ్యాహ్నం జరిగిన పాతికేళ్ల కథాసాహితి జ్ఞాపకాల కలబోత ‘అవలోకనం’ పేరుతో నిర్వహించిన సదస్సుకు వాసిరెడ్డి నవీన్ అధ్యక్షత వహించారు. రచయితల పక్షాన మధురాంతకం నరేంద్ర, పెద్దింటి అశోక్‌కుమార్, కుప్పిలి పద్మ, మహ్మద్ ఖదీర్ బాబు, సభా నిర్వాహకుల పక్షాన నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్, చిత్రకారుల పక్షాన శీలా వీర్రాజు, అనువాదకుల పక్షాన ఎం.శ్రీధర్, పాఠకుల పక్షాన కుర్ర జితేంద్రబాబు, అంబటి మురళీకృష్ణ, వర్మ, పుస్తక విక్రేతల పక్షాన నవోదయ సాంబశివరావు, పత్రికల పక్షాన ఆర్.ఎం.ఉమా మహేశ్వర రావు, ముద్రాపకుల పక్షాన పొన్నపల్లి సీత హాజరై తమ అభిప్రాయాలను, అనుభవాలను సదస్సు ద్వారా వ్యక్తీకరించారు. ఈ సదస్సుకు ఎ.కె.ప్రభాకర్ స్వాగతోపన్యాసం చేయగా మనసు ఫౌండేషన్ ప్రతినిధి ఎం.రాయుడు వందన సమర్పణ చేశారు. -
సెక్రటరీ.. ఆ పేరు వల్లే అంత హిట్ అయ్యింది
సెక్రటరీ నవలకు యాభై ఏళ్లు నిండిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆ నవలకు నీరాజనం కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా తరాల పాఠకుల రచయిత్రి యద్దనపూడి... తెలుగు సాహిత్యంలో ఒక గురజాడ గేయాన్నో, శ్రీశ్రీ కవితనో, జాషువా పద్యాన్నో కంఠతా చెప్పమంటే చెప్పేవాళ్లు చాలామందే చెబుతారు. కాని ఒక నవలను అభిమానులు కంఠతా జెప్పటం మీరెప్పుడయినా విన్నారా? ఉన్నారు. ఆ నవల సెక్రటరీ. ఆ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. సెక్రటరీ నవల ప్రచురితమై 50 ఏళ్లయింది. 90 పైగా ప్రచురణలు పూర్తి చేసుకుంది. ఇది అద్వితీయ రికార్డు. సెక్రటరీ గురించి, యద్ధన పూడి సులోచనారాణి ఆలోచనలు, ఆకాంక్షలు, జీవితతత్వం గురించి మనం తెలుసుకుందాం. మృణాళిని: నమస్కారం సులోచనారాణి గారూ యద్దనపూడి: నమస్కారమండీ మృణాళిని: సెక్రటరీ ఇప్పటి కీ సజీవంగా, తాజాగా ఉంటుంది. పాఠకుల నుంచి ఈ నవల ఇంత అభిమానం పొందడం పట్ల మీ అనుభూతి ఎలా ఉంది? యద్దనపూడి: నవలా రచయిత్రిగా నా నవలలకు అభిమానుల నుంచి నేనెన్నో ప్రశంసలు పొందాను. కాని సెక్రటరీ విషయం మాత్రం ప్రత్యేకం. 50 ఏళ్ల తర్వాత కూడా ఈ నవలను ఇంతగా గుర్తుపెట్టుకోవడం, నవలకు నీరాజనం పేరుతో పండుగ చేయడం వింటుంటూనే ఉద్విగ్నంగా అనిపిస్తోంది. ఆనందబాష్పాలతో సరస్వతీదేవి పాదాలు కడగాలనిపిస్తోంది. మృణాళిని: అప్పట్లో అంటే 1964-65 సంవత్సరంలో జ్యోతి పత్రికలో సీరియల్‌గా వచ్చినప్పుడు, 66లో పుస్తకంగా వచ్చినప్పుడు అప్పటి పాఠకులు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. కొత్త పాఠకులు వచ్చి ఉంటారు. అంటే వారి స్పందనలో మీకేమైనా తేడా కనిపించిందా? యద్దనపూడి: నిజం చెప్పాలంటే స్పందనలో తేడా లేదమ్మా. స్త్రీ మనస్సు అది. 60 ఏళ్ల క్రిందటి స్త్రీ మనస్సు ఏ తీరున ప్రేమను కోరుకుందో నేటి యువతి మనసు కూడా అదే కోరుకుంటోంది. అంటే స్త్రీ మనస్సును తాకేదీ, స్త్రీ మనస్సు ఆశించేదీ ఏదో అంశం అందులో ఉంది. కాబట్టి ఇన్నేళ్లుగా అది మనుషుల్ని అట్లా పట్టి ఉంచిందేమోనని అనుకుంటున్నాను. తరాలు వేరైనా కూడా పాఠకుల రెస్పాన్స్ ఒకటే ఉంది . నవల్లోని రాజశేఖరం పాత్రను ఐడియలైజ్ చేయడం అలా ఉంచితే నిజానికి ఇప్పుడు అమ్మాయిలంతా అప్పటి జయంతిగానే ఉన్నారు. ఆత్మగౌరవంతో పాటు సంపాదన కొరుకుంటున్నారు. అన్నీ ఉన్నా కూడా స్త్రీత్వం పోకుండా ఒక పురుషుడు తనకు తోడు కావాలనుకునే ఆకాంక్ష మాత్రం పోలేదు. అందుకే సెక్రటరీ నవల ఇప్పటికీ పాఠకులతో కొనసాగుతూందేమో అనిపిస్తుంటుంది. మృణాళిని: ఒక జయంతిని, ఒక రాజశేఖరాన్ని సృష్టించడానికి మీకేమైనా నమూనాలున్నాయాండీ? ఎవరి ప్రభావం అయినా ఉందా? యద్దనపూడి: ఒకసారి రమణ, బాపు, రాఘవులు గార్లు వచ్చి జ్యోతి పత్రిక ప్రారంభిస్తున్నాం నవల రాయమన్నారు. నేను నవల రాయనంటే రాయనన్నాను. ఎందుకంటే అప్పటి వరకు కథలే రాస్తున్నాను. ఐలవ్యూ, భానుమతి వంటి కథలు బాగా ఆదరణ పొందాయి. అందుకే బలవంతంగా రాయలేనన్నాను. బాపు, రమణగారు నా ఇబ్బందిని గమనించి పోనీలేండి మీరు పెద్ద కథ రాయండి అని అన్నారు. కథ అయితే రాస్తా అన్నా. కథ రాస్తావా అయితే పేరు చెప్పు అన్నారు. పేరు చెబితే మేము ఇప్పట్నుంచీ పబ్లిసిటీ ఇస్తాం అని చెప్పగా నేను లోపలికి వెళ్లి ఓ కాగితం తీసుకొని సరస్వతీ దేవికి దండం పెట్టుకొని సెక్రటరీ అని రాశా. కథ లేదు, ఏం లేదు. కానీ నాకు తెలిసిన ఒక ఆడపిల్ల టైపిస్టుగా పని చేస్తుండేది. తనతోపాటు జాబ్ చేసేవాడు ఎంత ఏడిపించేవాడో చెప్పి తిట్టిపోస్తుండేది. ఆడపిల్ల, మధ్య తరగతి అమ్మాయి పడే అలాంటి బాధలేవో చెప్పొచ్చు అనుకున్నాను. కాని సెక్రటరీ కాకుండా జయంతి అని పేరు పెడితే ఆ నవల అసలు ఇంత ప్రచారమయ్యేది కాదు అనుకుంటున్నా. ఆ నవల మొదలెట్టినప్పుడు నాకు హీరో పాత్ర గురించి ఏమీ తెలియదు. జయంతి, బామ్మ పాత్రలే ఉండేవి. ఆ తరువాత హీరో వచ్చాడు రాజశేఖర్. ఆ పేరు తట్టిన క్షణమేమిటో గానీ ఇప్పటికీ ఇప్పటికీ ఆడవాళ్ల హృదయాల్లో ఒక ఇమేజ్గానే మిగిలిపోయాడు. మృణాళిని (నవ్వుతూ): మాతరం వారమందరమూ ఆ పేరు గలవాళ్లనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అంత పిచ్చి ఉండేదన్నమాట. అదృష్టవశాత్తు మా అల్లుడి పేరు రాజశేఖరం. యద్దనపూడి: ఔనా! మృణాళిని: అది కూడా కాకతాళీయం యద్దనపూడి: మీకో విషయం చెబుతాను. రాజశేఖరం అనే పేరుకు ఎంత పాపులారిటీ అంటే ఓ సారి నేను అమెరికా వెళ్లినప్పుడు సన్మానం చేశారు. నేను అని తెలియగానే కొంత మంది - అందరూ తెలుగువాళ్లే- నా దగ్గరకు వచ్చారు. ఒకతను మేడం మీరు రావాలి అని బయటకు తీసుకెళ్లి ఇండియాలో ఉన్న వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు. అతని పేరు కూడా రాజశేఖరం అట. అమ్మా నాకు పేరు పెట్టావే రాజశేఖరం అని ఆ పాత్ర సృష్టించిన మీ అభిమాన రచయిత్రి ఇక్కడే ఉన్నారు మాట్లాడు అన్నాడు. సంతోషం కలిగింది. ఇంకో ఘటన... ఐదారేళ్ల క్రితం ఒక అమ్మాయిని శ్రావణమాసం నోముల సందర్భంగా కలిశాను. ఏం చేస్తుంటావమ్మా అని అడిగితే ఇంజినీర్ని, సెలవు పెట్టాను అని చెప్పింది. మరి నోములు అవి నీకు విసుగు పుట్టవా అని అంటే ఎందుకు పుడుతుంది. ఇవి చేస్తే భర్తకు బాగుంటుందటగా అంది. అయ్యబాబోయ్ ఇంత నమ్మకాలా ... మీ పేరేంటమ్మా అన్నాను. వెంటనే ముఖం కాస్త చికాకుగా పెట్టేసి సువర్ణలత (కీర్తికిరీటాలు హీరోయిన్) అని చెప్పింది. ఆ చికాకును కొనసాగిస్తూ మా అమ్మ నాకేమో సువర్ణలత, మా అన్నకేమో రాజశేఖర్ అని పేరు పెట్టింది అంది. ఎక్కడికెళ్లినా ఈ రాజశేఖరం అనే మాట అలా వస్తూనే ఉంటుంది. మృణాళిని: సెక్రటరీనే తరువాత సినిమాగా తీశారు. సినిమా తీసినప్పుడు మీతో సంప్రదించారా? అసలు మీరు ఇష్టపడ్డారా? నవలను సినిమాగా తీస్తే బాగా వస్తుందని మీరు ఊహించారా? యద్దనపూడి: సినిమా అనుభవం చాలా డిఫరెంట్. అప్పటికే జీవన తరంగాలు వచ్చింది. రామానాయుడుగారు తీశారు. అది బాగా ఆడింది. బాగా వచ్చింది కూడా. ఆ ఉత్సాహంతోనే సెక్రటరీని సినిమాగా తీస్తా అన్నారు. నేను కూడా ఉత్సాహంగానే ఇచ్చాను. ఆయన అనౌన్స్ చేశారు. సెక్రటరీ సినిమా తీస్తున్నాను నాగేశ్వరరావు హీరో అని. ఇంక లేడీస్ వచ్చారమ్మా మా ఇంటికి గుంపులుగుంపులన్నమాట. మీరు ఆ రైట్స్ ఎలా ఇచ్చారు. మీకు ఆ రైట్ లేదు. వెంటనే వాపస్ తీసుకోండి అని నన్ను డిమాండ్ చేశారు. మృణాళిని: ఎందుకు? యద్దనపూడి: సినిమా తీయడానికి వీలులేదు. ఎవరూ సూట్ కారు దానికి, మా ఇమేజ్నేషన్ అంతా చెడిపోతుంది అంటారు వాళ్లు. రామానాయుడుగారికి విషయం చెప్పా. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకుంటారులేండి అన్నారు. మృణాళిని: సెక్రటరీ తరువాత మీ నవలల మిగతా సినిమా రూపాలను కూడా మాట్లాడుకోవాలి. మీనా నవలకు సినిమా ఎక్కువ న్యాయం చేసిందని అంటున్నారు నాతో ఎక్కువగా. మీనా సినిమా చూస్తుంటే మేం మళ్లీ నవలను చూసినట్లే అనిపించింది. మీ ఇతర నవలలతో పోల్చి చూస్తే మీకు అది పూర్తి తృప్తినిచ్చిందా? యద్దనపూడి: చెప్పాలంటే మీకు లాగే నాకూ మీనా సినిమాయే నచ్చింది. మృణాళిని: మరో విషయం మీ అన్ని నవలల్లోనూ సెక్రటరీ, మీనా, జీవనతరంగాలు, విజేత అనే నాలుగు నవలలనే చెప్పుకుంటారు. కొంత మంది అయితే ఆరాధన నవల కూడా చెప్పుకుంటారు. మీరు 70కిపైగా నవలలు రాసినా, ఈ నాలుగైదు నవలలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సున్నితమైన ప్రేమభావాన్ని అత్యద్భుతమైన స్త్రీ పాత్రలను చిత్రించిన రచయిత్రిగా మీరు మా హృదయాల్లో మిగిలే ఉంటారు. కానీ మీరు ఈ ఒక్క ఇమేజ్‌కే పరిమితమయ్యారా? యద్దనపూడి: అలా లేదమ్మా. నా అన్ని రకాల నవలలను పాఠకులు ఇష్టంగా చదువుతున్నారు. పార్థును చదువుతున్నారు. ఇతర నవలలనూ చదువుతున్నారు. నవల రాయలేను అన్నదానిని తొలిసారి సెక్రటరీ నవలు రాశాను. అప్పటి నుంచి నవలలే రాస్తున్నాను. అప్పుడే ఎమెస్కో వారు వచ్చారు. పుస్తకాలు చదవడం మనం అలవాటు చేస్తే పుస్తకం కొని చదవడం వారు నేర్పారు. ఎం.ఎన్.రావుగారు వచ్చి చిన్న నవల రాయండమ్మా అని ప్రాధేయపడితే చివరకు ఒక నవల రాశాను. ఆరాధన అలా వచ్చిన చిన్న నవల. ఆయన ఎంత సంతోషంగా ఫీలయ్యారంటే మళ్లీ ఇంకో నవల రాయమన్నారు. బతిమిలాడి బతిమిలాడి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఒక నవల రాయమన్నారు. అదే నా పుట్టినరోజు కూడా. దాంతో చాలా నవలలు వచ్చేశాయి. మృణాళిని: 50 ఏళ్ల క్రితం వచ్చిన సెక్రటరీని ఇప్పుడు చదివితే, మళ్లీ అందరూ ఫ్రెష్ అవుతున్నారు. అంటే ఒక రచన విలువ ఏమిటన్నప్పుడు, జీవితం గురించి పెద్ద పెద్ద సందేశాలు ఇవ్వటమనే కాదు. మన మనస్సులో ఎప్పడూ తాజాగా ఉండటం అన్నదే ఒక రచనకు ఉన్న ప్రమాణం అయితే మీ రచనలు అన్నీ దాన్ని సాధించాయి అనిపిస్తుంది. ఈరోజు మీరు మీ మనసులోని భావాలను ఆత్మీయంగా మాతో పంచుకున్నారు. మీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరమరికలు లేకుండా మాతో పంచుకున్నందుకు చాలా సంతోషమండీ. ధన్యవాదాలు. యద్దనపూడి: మీకూ ధన్యవాదాలు. మృణాళిని: అంటే సీరియల్స్ కాకుండా ఇలా నవలలు రాసేవారన్నమాట. యద్దనపూడి: ఔను. తరువాత తరువాత సీరియల్స్ రాయను, నవలలే రాస్తానని షిప్ట్ అయిపోయాను. ప్రతి పదేళ్లకు నాలో ఏదో మార్పు. మొదట సీరియల్స్ రాయడం మానేశాను. స్వాతిలో 12 ఏళ్లు సీరియల్స్ రాశాను. కీర్తికిరీటాలు, సుకుమార్ వంటివి ఇలాగే వచ్చాయి. అందుకే సెక్రటరీ వంటి నవలలకే కాకుండా, పార్థు వంటి నవలలకు కూడా పాఠకులు ఏర్పడ్డారు. నేడు(శనివారం) మధ్యాహ్నం గం.12.30లకు సాక్షి టీవీలో ఈ ఇంటర్వ్యూ ప్రసారం. -
స్త్రీవాద ఉద్యమ పతాక ఓల్గా
ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెనాలి : ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. 1950 నవంబరు 27న గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో జన్మించారు. ఆంధ్రా యూని వర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. 1973 నుంచి 86 వరకు, ఆ తర్వాత కొంతకాలం తెనాలి లోని వీఎస్ఆర్ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. మార్క్సిస్టు భావజాలం, రష్యన్ సాహిత్యం, ఫెమినిస్టు రచయితలు కొడవటిగంటి కుటుంబరావు, చలం రచనలు అధ్యయనం చేశారు. వారి ప్రభావంతో ఫెమినిస్టు దృక్పథంతో స్త్రీవాదం, సాహిత్యం అంశాలపై ఓల్గా కలం పేరుతో పత్రికలకు వ్యాసాలు రాయటం ఆరంభించారు. చర్చా వేదికల్లో పాల్గొంటూ వచ్చారు. చలం రచనలు చదవటమే కాదు, చివరి రోజుల్లో అన్నామలైలో ఉంటున్న చలంను ఆమె స్వయంగా కలుసుకున్నారు. అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లి, ఉషాకిరణ్ మూవీస్‌లో స్క్రిప్టు విభాగంలో చేరారు. విమర్శల ప్రశంసలు, అవార్డులు పొందిన పలు సినిమాలకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. తర్వాత ‘తోడు’, ‘పాతనగరంలో పసివాడు’ సినిమాలకు సహాయ దర్శకత్వం వహించారు. కదంతొక్కిన కలం ... అనంతరం ఆమె పూర్తిస్థాయి రచయిత్రిగా, హక్కుల కార్యకర్తగా ఉద్యమస్థాయిలో పనిచేయడం ఆరంభించారు. ఈ క్రమంలో ప్రముఖ ఫెమినిస్టు వాలంటరీ ఆర్గనైజేషన్ ‘అస్మిత ’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. మరోవైపు ఆమె కలం కదం తొక్కింది. ‘స్వేచ్ఛ’, ‘సహజ’, ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘గులాబీలు’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన కథలతో ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ వచ్చాయి. స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయడాన్ని ఈ కథలు ఎండగట్టాయి. ‘ఎవరైనా పురుష రచయిత ఒక ప్రేమకథ రాస్తే, ఎవరూ రంధ్రాన్వేషణ చేయరు...అదే ఒక రచయిత్రి రాస్తే, అది ఆమె సొంత ప్రేమకథేనా...? అందులో హీరో, ఆమె చుట్టూవున్న వ్యక్తుల్లో ఎవరయి ఉంటారు...అనుకుంటూ రచయిత్రి సొంత వ్యక్తిత్వాన్ని కించపరచేలా వ్యవహరిస్తారు’ అని ఓల్గా కుండబద్దలు కొడతారు. స్త్రీవాదం అంటే పురుష వ్యతిరేకం కాదనీ, పురుషుల మైండ్‌సెట్ మారాలనేదిగా చెబుతారు. ఓల్గా రచించిన దాదాపు అన్ని రచనలు, అనువాదాలను ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సేకరించింది. ప్రస్తుతం ఆమె నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు సలహామండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు...చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు. ఆమె రచించిన కథల సంపుటి ‘విముక్త’కు గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. విద్యార్థి ఉద్యమాల నుంచి మార్క్సిస్టు భావజాలం, విప్లవ రచనా ఉద్యమం ప్రభావం ఉన్నా, ఆయా ఉద్యమాల్లోని లింగ వివక్ష ధోరణిపై మౌనంగా ఉండలేదు. సమాజంలోని ద్వంద్వ నీతి, ఫెమినిస్టు ఉద్యమంపై విదేశీ ప్రభావాన్ని చూసి, తానే స్వతంత్రంగా మహిళల హక్కుల కోసం పోరాడాలన్న భావనతో కృషిచేస్తున్నారు. ఫెమినిస్టు రచయిత్రిగా, మహిళా హక్కుల కార్యకర్తగా ఎదిగారు. -
సాహితీ దురంధరుడు రామచంద్ర
ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన స్వాతంత్య్ర సమర యోధుడాయన. 1947కి పూర్వం నలభైయేండ్ల తన స్వీయ అనుభవాలను తెలుపుతూ రాసిన ‘హంపీ నుండి హరప్పాదాకా’ అనే గ్రంథం పేరు వినగానే సాహితీ ప్రియులకు గుర్తుకు వచ్చే తెలుగు భాషా సేవకుడు డా. తిరుమల రామచంద్ర. 1913 జూన్ 13న అనంతపురం జిల్లాలో జాన కమ్మ, శేషాచార్యులకు జన్మించారు తిరుమల రామచంద్ర. గాంధీజీ పిలుపు మేరకు స్వాత్యంత్య్రోద్యమంలో పాల్గొని ఎన్నోసార్లు జైలు శిక్షను అనుభవించాడు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం అయిదో అంతస్తులో ఉన్న బొమ్మలకు త్రివర్ణ పతాకం కట్టి ఎగరవేసి జైలుపాలయ్యారు. తిరుపతిలో మొదటి సత్యాగ్రహిగా సంవత్సర కాలంపాటు జైలుకెళ్లి తిరిగి కమ్యూనిస్టుగా బయటకు వచ్చారు. తర్వాత ఆయన నడక తెలుగు సాహిత్యంవైపు మళ్లింది. తెలుగు భాషతోపాటు సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఆంగ్లభాషలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదిం చారు. తెలుగు ప్రాకృత భాషల మధ్య పదాలలో ఉండే సమన్వయాన్ని వివరిస్తూ గాధాసప్తశతిలో తెలుగుపదాలు, ప్రాకృత వాజ్మయంలో రామకథ వంటి రచనల ద్వారా తెలుగువారికి ప్రాకృత మాధుర్యాన్ని రుచి చూపారు. తెలుగులో ఎన్నో ఆత్మకథలు, స్వీయ చరిత్రలు వచ్చినప్పటికీ, తన స్వీయ అనుభవాలను తెలుపుతూ రాసిన ‘హంపీ నుండి హరప్పాదాకా’ అనే గ్రంథం ఎంతో విలక్షణమైంది. నవలకన్నా వేగంగా, ఆసక్తిభరితంగా సాగే స్వీయ చరిత్రాత్మక కథనం ఇది. మనిషి జీవితంలో లిపి పుట్టుక, దాని ప్రాధాన్యత, పరిణామాల ను గురించి తెలుపుతూ ‘మన లిపి పుట్టుపూర్వోత్తరాలు’ పేరుతో గ్రంథస్తం చేశారు. తెలుగు భాషా నుడికారాన్ని, పదబంధాలను గూర్చి వివరిస్తూ నుడి-నానుడి పేరుతో వ్యాస సంకలనం చేశారు. వివిధ పత్రికల్లో వచ్చిన స్వీయరచనల సంకలనం ‘బృహదారణ్యకం’, భారతి పత్రికలో రాసిన రచనలు కలిపి ‘సాహితీ సుగతుని స్వగతం’ వంటి వ్యాస సంకలా న్ని ప్రచురించారు. మహా మేధావుల జీవితాల్లోని వెలుగు- చీకట్లను తెలుపుతూ మరుపురాని మనిషి వంటి శీర్షికలతో ఆయన నిర్వహించిన ఇంటర్వ్యూలు నేటికీ తెలుగు సాహిత్యంలో ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉన్నాయి. కొన్ని వందలకు పైగా పుస్తకాలకు పీఠికలు, వేల పుస్తకాలకు సమీక్షలు రాశారు. స్వాతంత్య్రానికి, సాహి త్యానికి యావజ్జీవితాన్ని అర్పించిన, తిరుమల రామచంద్ర 1997 అక్టోబర్ 12న పరమపదించారు. - (నేడు తిరుమల రామచంద్ర 21వ వర్థంతి) సి. శివారెడ్డి, సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప -
తెలంగాణ సాహిత్యం ‘ప్రత్యేకం’
* ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర * పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల సరళిపై నిశిత పరిశీలన అవసరం * తెలుగు సాహిత్యంపై నందిని సిధారెడ్డి ఇంటర్వ్యూ * సాహిత్యంలో ప్రశ్నలు ఎలా అడిగారన్న అవగాహనతో జవాబులు రాయాలని సూచన తెలంగాణ ఉద్యమంలో సాహిత్యానికి ఉన్న పాత్ర ప్రత్యేకమైంది. సాహిత్యంతోపాటు సంస్కృతి, కళలు ప్రజలను ఏకం చేసి ఉద్యమం వైపు నడిపించాయి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేలా తోడ్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ఉద్యోగులుగా చేరబోయే వారికి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు, పాటల ప్రాధాన్యం తెలిసి ఉండాలి. అందుకే టీఎస్పీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో వీటిపై కచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. ఉద్యమ సమయంలో సాహిత్యంతో చైతన్యం తెచ్చిన వారిలో నందిని సిధారెడ్డి ఒకరు. ‘నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ..’ వంటి పాటలు, రచనలతో ఉద్యమానికి చేదోడుగా నిలిచిన ఆయన టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పోటీ పరీక్షలకు సిలబస్‌ను ప్రకటించిన నేపథ్యంలో సాహిత్యం విషయంలో అభ్యర్థులు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై నందిని సిధారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో ఉద్యోగంలోకి వచ్చే వారికి తెలంగాణ ఉద్యమ సమయం, అంతకుముందు తెలంగాణ సాహిత్య చరిత్ర తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. ప్రధానంగా గ్రూప్-1 జనరల్‌స్టడీస్‌లో 11వ అంశంగా, గ్రూప్-2 జనరల్ స్టడీస్‌లో 7వ అంశంగా ‘సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ’ గురించి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకోవాలి. అభ్యర్థులు దృష్టి సారించాల్సిన ప్రధాన అంశాలివి.. సంస్కృతి: ఒక జాతి జీవన విధానమే సంస్కృతి. ఆచార వ్యవహారాలు వేషభాషలు, అలవాట్లు, పండుగలు, వేడుకలు. సుఖదుఃఖాలు, భావోద్వేగాలు, కళలు, సాహిత్యం మతం, రాజకీయాలు అన్నింటి మౌలిక అంశాలు సంస్కృతిలో ఉంటాయి. తెలంగాణ సాహిత్యం, భాష: భాషకు సంబంధించిన చర్చను సంస్కృతిలో భాగంగా అధ్యయనం చేయా లి. తెలుగు మౌలిక స్వరూపం తెలంగాణ భాషలోనే ఉంది. అనేక శాసనాలు దీనిని చెబుతున్నాయి. తెలంగాణ అనే పదం ఆధారంగానే ఏర్పడింది తెలుగు. ఆదివాసులైన గోండుల మూల పురుషుడికి నలుగు రు కొడుకులు. వారు టేకం, మాసం, పూనం, తెలిం గం. నాలుగో కొడుకు తెలింగం. అతని సంతతిగా ఉన్నవారే తెలుంగులు లేదా తెలంగాణ వారు. తెలుంగు ఆధారంగానే ఇక్కడ ఏర్పడిన సంతతికి తెలుంగణం అనే పేరుంది. 15వ శతాబ్దానికి సంబంధించిన ఒక శాసనంలో తెలంగాణపురం అనే ప్రస్తావ న ఉంది. దాని ఆధారంగానే తెలంగాణ అనేది తెలు గు యొక్క ప్రాతినిధ్యాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి. కళలు: ఇప్పుడు కళలన్నీ (జానపద కళలు, సంప్రదాయ కళలు) బతికి ఉన్న ప్రాంతం ఏదంటే తెలంగాణ అనే చెప్పాలి. తెలంగాణలో జానపద కళకు ఎంత ప్రాధాన్యం ఉందో ఉద్యమ కాలంలో కళలకు అంతే ప్రాధాన్యం ఉంది. 18 ఏళ్ల ఉద్యమకాలంలో విసృ్తతంగా ప్రజల్లో నానింది గానకళ. పాట అనేది తెలంగాణ ప్రజల ప్రతి మూలమలుపులో, ప్రజల భావోద్వేగాల్లో ఉంది. ఉద్యమానికి పాట ప్రక్రియ వేదికగా నిలిచింది. దీనిని గమనంలోకి తీసుకోవాలి. తెలంగాణలో శిల్పకళ బాగా వర్ధిల్లింది. రామప్ప అనే శిల్పి పేరున దేవాలయమే ఉంది. ఆయన చెక్కిన నాగిని శిల్పం, ఒక స్త్రీ కాలికి ముల్లు గుచ్చితే తీస్తున్నట్లు చెక్కిన శిల్పం అరుదైనవి. అలాగే వేయి స్తంభాల గుడి, కాకతీయుల కాలపు కళాతోరణం ఇక్కడి శిల్పకళకు ప్రతీకగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఖ్యాతి చెందిన చిత్రకారులు ఇక్కడి వారే. కాపు రాజయ్య, లక్ష్మాగౌడ్, వైకుంఠం, పీటీ రెడ్డి వంటి వారు ఎంతో ఆదరాభిమానాలు పొందారు. ఇంకా వెలుగు చూడాల్సిన పెయింట్స్ అనేక గుహల్లో ఉన్నాయి. వాటిపై పరిశోధన, అన్వేషణ జరగాలి. సాహిత్యం: శాతవాహనుల కాలానికి సంబంధించి ప్రాకృత సాహిత్యం, అనంతర దశలో చాళుక్య యుగంలో సంస్కృత సాహిత్యం, కాకతీయులకు ముందు దశలో ఉన్న కుర్క్యాల సాహిత్యం ఉన్నాయి. 946 సంవత్సరానికి సంబంధించిన కుర్క్యాల శాసనంలో సాహిత్యం పరిఢవిల్లినట్లు ఉంది. అందులో మూడు కంద పద్యాలు ఉన్నాయి. నన్నయ కంటే ముందు యుగానిదీ శాసనం. నన్నయ మహాభారతం రచన కంటే ముందే ఇక్కడ పద్య రచన ఉన్నట్లు ఈ శాసనం చెబుతోంది. నన్నయ-సోమన మధ్య తేడా..: ఇక కాకతీయుల యుగం నాటిది శైవ సాహిత్యం. పాల్కురికి సోమన తెలంగాణకు సంబంధించిన ఆదికవి. స్థానికంగా జీవించిన శైవభక్తుల కథలను ఆయన సాహిత్యానికి వస్తువుగా స్వీకరించారు. నన్నయ్యది అనువాద సాహిత్యమైతే సోమనది స్వతంత్ర సాహిత్యం. ఇక్కడ జానపద సాహిత్యం ఎంత విస్తృతంగా ఉందో ఆయ న రచనల్లో పేర్కొన్నారు. ఆయన రాసిన వృశాధిప శతకం తెలుగులోనే మొదటి శతకం. అయితే అభ్యర్థు లు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేపుడు సాధారణంగా ఆదికవి ఎవరని అడిగితే నన్నయ అనే రాయాలి. తెలంగాణ ఆదికవి ఎవరు? లేదా మన ఆదికవి ఎవరని అడిగితే సోమనాథుడు అని రాయాలి. యుగ విభజన ఎలా చేయాలంటే..: తెలుగు సాహిత్యం అధ్యయనంలో సోమనాథుని కేంద్రంగా సాహిత్య యుగ విభజన చేయాలి. 1.సోమనకు పూర్వయుగ సాహిత్యం, పరిశీలన; 2.సోమన యుగ సాహిత్యం; 3.బమ్మెర పోతన యుగం సాహిత్యం; 4.కురవి గోపరాజు యుగ సాహిత్యంగా విభజన చేసుకొని చదువుకోవాలి. సోమన యుగ సాహిత్యం తె నుగు భాషలో, దేశీ చందస్సులో (ద్విపద సాహిత్యంలో) ఉండగా... పోతన సంస్కృతాన్ని తెలుగును కలిపి మధ్యేమార్గంలో కవిత్వాన్ని రాశారు. ఇక కురవి గోపరాజు యుగంలో చాలా సాహిత్యం వచ్చింది. ఇది కుతుబ్‌షాహీల పరిపాలనకు సంబంధించింది. ఈ కాలంలోనే తెలుగులో అచ్చతెనుగు కావ్యం వచ్చింది. అది పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర. గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యం రాశారు. అలాగే అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానం రాశారు. మల్లారెడ్డి రాజుగా ఉండి షట్చక్రవర్తి చరిత్ర రాశారు. ఆధునిక సాహిత్యం: ఆధునిక సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. 19వ శతాబ్ది అనంతరం కాలం అంతా ఆధునిక సాహిత్యం. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ చరిత్ర అనేక మలుపులు తిరిగిం ది. ఈ శతాబ్దంలోనే తెలంగాణలో కథ, నవల, వచన కవిత, పాట, పద్యం, నాటకం, వ్యాసం, విమర్శ, ఆత్మకథలు, గేయ కవిత వచ్చాయి. మిగతా ప్రాంతా ల్లో లేనట్లుగా ఇక్కడ సామాజిక ఉద్యమాలు విరివిగా జరగడం వల్ల సాహిత్యం దానిని ప్రతిఫలించింది. తొలి ఉద్యమంలో...: నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాయుధ ఉద్యమం చేశారు. అది సాహిత్యంలో ప్రతిబింబించింది. వీటిని చిత్రిస్తూ సురవరం ప్రతాపరెడ్డి పలు రచనలు రాశారు. అలాగే నిజాం ఆంధ్రలో తెలుగు కవులు పూజ్యం అని ముడుంబై రాఘవాచార్యులు అనే పండితుడు పేర్కొంటే సురవరం ప్రతాపరెడ్డి స్పందించి ఇక్కడి తెలుగు కవులు రాసిన 354 కవితలను సేకరించి గోలుకొండ కవుల పేరుతో సంచిక వేశారు. అయితే దీనిని తెలుగు సాహిత్య చరిత్రలో పేర్కొనలేదు. ఇది ఆంధ్రా కవుల వివక్షకు నిదర్శనం. ఇక వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, గంగు లాంటి నవలలు రాశారు. దాశరథి రంగాచార్యులు జానపదం, మోదుగుపూలు నవలలు రాశారు. నెల్లూరు కేశవస్వామి యుగాంతం వంటి కథ రాశారు. ఆవుల పిచ్చయ్య కథలు, దాశరథి కథలు రాశారు. కవితలు: దాశరథి రాసిన అగ్నిధార, కాళోజీ రాసిన నా గొడవ, సుద్దాల హన్మంతు పాటలు, బండి యాదగిరి (బండెనుక బండి కట్టి) వంటివన్నీ అప్పటి పోరాటాన్ని చిత్రించాయి. 1950లలో విశాలాంధ్ర సాహిత్యం: ఇక తరువాతి కాలంలో తెలుగు వాళ్లకు ఒక రాష్ట్రం ఉండాలనే ఉద్యమం నడిచింది. అందులో తెలంగాణ ప్రజలు రెండు భాగాలుగా ఆలోచించారు. విశాలాంధ్ర సాహిత్యం వచ్చింది. దాశరథి రాసిన మహాంధ్రోదయం, వనమామలై వరదాచర్యులు రాసిన కవిత్వాలు వచ్చాయి. దేవులపల్లి రామానుజరావు రాసిన వ్యాసాలు విశాలాంధ్ర వైపు నడిపించాయి. 1969లో రెండో ఉద్యమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడిన ఇబ్బందులు, వివక్ష, అణ చివేత, అన్యాయానికి వ్యతిరేకంగా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇందులో సాహిత్యం, పాటలు వచ్చాయి. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలిచి అన్ని భావోద్వేగాలను ప్రకటించిన కవి కాళోజీ నారాయణరావు. భాషా సాహిత్యాన్ని ప్రశ్నిస్తూ అనేక కవితలు రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించారు. విశాలాంధ్రవాదం నుంచి ప్రత్యేకవాదంపైకి వచ్చారు. విప్లవోద్యమం: ఆ తరువాత విప్లవోద్యమం. మూడు దశాబ్దాలపాటు విప్లవోద్యమం ప్రధానంగా సాగింది. ఇది మూడో పెద్ద సామాజిక ఉద్యమం. ఈ సమయంలో చాలా సాహిత్యం వచ్చింది. చెరబండరాజు, వరవరరావు వంటి వారు జైలు జీవితం అనుభవిస్తూ సాహిత్యం సృష్టించారు. గూడ అంజయ్య (ఊరు మనదిరా), గద్దర్ (సిరిమల్లే చెట్టుకింద లచ్చుమమ్మా) వంటి పాటలు విసృ్తతంగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. వరవరరావు రాసిన భవిష్యత్తు చిత్రపటం కవిత సంపుటిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది కూడా. సంస్కృతి: సంస్కృతులు, పండుగల్లో తెలంగాణ ముద్ర ఉన్న వాటిపై దృష్టిపెట్టాలి. బతుకమ్మ, బోనాలు, పీరీలు, దసరా వంటివి తెలుసుకోవాలి. పీరీల పండుగ ముస్లింలది అయినా హిందువులు ఆడుతారు. మత సామరస్యం, ఐక్యత. సహజీవనానికి ఇది ప్రతీక. ఇక్కడ ఎక్కువగా తిరుగుబాట్లు, ఉద్యమాలు ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతిలో భాగమే. ఎలా చదవాలంటే... సిలబస్‌పై అవగాహన తెచ్చుకోవాలి, తరువాత కావాల్సిన సమాచారం, గ్రంథాలను సేకరించుకోవాలి. వాటి ప్రత్యేకతలను గుర్తించి చదువుకోవాలి. సాహిత్యం, చరిత్ర, సంస్కృతి ఏ అంశమైనా వాటి ప్రత్యేకతలను గుర్తించాలి. ప్రత్యేకతలపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తొలి రచనను ప్రత్యేక అంశంగా భావించవచ్చు. కొన్నిసార్లు ఉద్యమ ప్రతిబింబంగా ఉన్న రచనలను ప్రత్యేకంగా భావించవచ్చు. కొన్నిసార్లు వస్తురూపాల మేళవింపు ప్రాచుర్యాన్ని ప్రత్యేకంగా భావించ వచ్చు. ఉదాహరణకు తడకమళ్ల కృష్ణారావు 1860లో రాసిన కంబుకందర చరిత్ర తెలంగాణ మొదటి నవల అంటాం. కాని దానికి నవల లక్షణాలు లేవన్న వాదన వచ్చింది. అయినా తెలంగాణ మొదటి నవలగా దానినే పేర్కొంటాం. అయితే నవలల్లో పరిణతి పొందిన నవల ఏదంటే వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ప్రజలమనిషి. నవలల్లో ప్రత్యేకమైన శిల్పాన్ని సాధించిన వ్యక్తిగా అంపశయ్య నవీన్ ‘అంపశయ్య’ను చెప్పవచ్చు. హాస్టల్ విద్యార్థి ఒకరోజు దినచర్యలను చైతన్య స్రవంతి శిల్పంలో నవీన్ రాసిన నవల అంపశయ్య. అలాంటి ప్రత్యేకతను గుర్తించాలి. మలిదశ ఉద్యమం అందరి కళ్ల ముందు జరిగిందీ, తెలంగాణ కలసాకారమైందీ మలి దశ ఉద్యమంతోనే. ఈ సమయంలో వచ్చిన అల్లం రాజయ్య కథలు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథ, బీఎస్ రాములు కథలు, సాహు కథలు ప్రత్యేకంగా చదువుకోవాలి. ఆ సమయంలోనే వచ్చిన కొమురం భీం నవలా ముఖ్యమైందే. ఈ మలిదశ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించింది. గోరటి వెంకన్న, గద్దర్, సిధారెడ్డి, గూడ అంజయ్య, అంద్శైమొదలైనవాళ్లు తెలంగాణ ఉద్యమాన్ని పదును పెట్టే పాటలు అందించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన మత్తడి, పొక్కిలి, వేముగంటి మురళీకృష్ణ మునుము రచనలు ఉద్యమాలకు ప్రతిబింబంగా నిలిచాయి. అందుబాటులో ఉన్న పుస్తకాలు.. సాహిత్యంలో: ముదిగంటి సుజాతారెడ్డి రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర. ఎస్సీ రామారావు రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర, తూర్పు మల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ సాహిత్యం జీవిత చిత్రణం. సంస్కృతికి సంబంధించి: ఇగురం-తెలంగాణ భాష సాంస్కృతిక వ్యాసాలు. వట్టికోట ఆళ్వారుస్వామి సంకలనం చేసిన తెలంగాణం - తెలంగాణ సంస్కృతి సాంస్కృతిక ప్రచురించిన ఆర్ట్ ఎట్ తెలంగాణ పుస్తకాలు చదవొచ్చు. -
తెలుగు సాహిత్యంలో మౌలికత లేదా?
సెప్టెంబర్ 19న ‘పద్మభూషణ్’ బోయి భీమన్న జయంతి మౌలిక సాహిత్యం ఏదీ ఎక్కడుంది? కన్యాశుల్కం లేదా అంటే అది ఒక కులానికి ఒక మాండలికానికి పరిమితమైన స్థానికం. బోయి భీమన్న 19 సెప్టెంబర్ 1911 16 డిసెంబర్ 2005 తెలుగు సాహిత్యంలో మౌలికత లేదా? నిజంగా లేదేమో! ఉంటే ఏదీ? ఎక్కడా కనిపించదేం? ఎక్కడ దాక్కుంది? నన్నయగారి ఐతిహాసిక యుగం నుంచి పెద్దనగారి ప్రబంధం వరకు అన్నీ తత్సమాలు. కృష్ణశాస్త్రిగారి భావకవితాయుగం నుంచి శ్రీశ్రీగారి అభ్యుదయ కవితాయుగం వరకు ఆంగ్ల తద్భవాలు, అన్యదేశ్యాలు. మరి మనదని మురిసిపోగల మౌలిక సాహిత్యం ఏదీ ఎక్కడుంది? కన్యాశుల్కం లేదా అంటే అది ఒక కులానికి ఒక మాండలికానికి పరిమితమైన స్థానికం. సాహిత్యానికి ప్రధాన గుణమైన సర్వజనీనత కన్యాశుల్కంలో లేదు. మరి బ్రహ్మంగారు, వేమన, కవిరాజు, జాషువా వంటి పేర్లు సాహితీరంగ రింగుమాస్టర్లకు పనికిరావు. ఆ పేర్లవాళ్ళు పంక్తిబాహ్యులైన శూద్రులూ వర్ణబాహ్యులైన హరిజనులూను! మరి చెప్పండి? ఎంకి పాటలున్నై అయితే అవి నాయుడుబావతో ముడిపడి వున్నై. నాయుడు పంక్తిబాహ్యుడు కాడా? ‘కందం వ్రాసినవాడే కవి, తినుచున్న అన్నమే తినుచుంటిమిన్నాళ్ళు, వయస్సుమళ్ళిన సోమరులారా చావండి, తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’ ఇటువంటి పాక్షిక ప్రగతినిరోధక, మత్తుమందు మాత్రలను ప్రజలకు తినిపించడం వల్లనే మౌలికసాహిత్యం ముందుకు రాలేకపోతున్నదన్న వాస్తవాన్ని ఎవరైనా గుర్తించారా. మౌలికసాహిత్యానికి వుండవలసిన ప్రధానగుణం సమకాలీనత. సమకాలీనత లేని రచన ఎంత గొప్పదైనా, అది సాహిత్యమనిపించుకోదు. వేద పురాణాలు, రామాయణ మహాభారతాలు ఆనాటి జీవిత సరళికి కళాత్మక చిత్రణలు. అందుకే వాటికి కాలదోషం లేదు. ఏ కాలంలో ఏ దేశంలో ఏ భాషలో వెలువడినప్పటికీ అవి అన్నికాలాలకు అన్నిదేశాలకు అన్నిభాషలకు చెందినవే అవుతాయి. అట్టి విశ్వసాహిత్యాన్ని ఎవరైనా ఎప్పుడైనా తమభాషలోకి అనువదించుకోవచ్చు. అనువదించుకోవాలికూడ. అయితే అట్టి అనువాదాలు మౌలికసాహిత్యం కాదు. పాలేరంటే ఎవరు? యజమాని కింద బానిసలా పనిచేసే ప్రతి అస్వతంత్రుడూ పాలేరే. అట్టి ప్రతివాడూ తన బానిసతనాన్ని తొలగించడానికి నిరంతరం కృషి చేయవలిసివుంది. వాల్మీకికి రాముడు సమకాలీకుడు, వ్యాసుడికి ధర్మరాజు సమకాలీకుడు, నాకు పాలేరువెంకన్న సమకాలీకుడు. పాలేరును నిష్పాక్షిక దృష్టితో చూసేవారికి అది ఎంతో రసవంతంగా, రమణీయంగా కనిపిస్తుంది. అలా కనిపించబట్టే లక్షలాదిజనం దాన్ని అభిమానించారు. వేలకొలది ప్రదర్శనలిచ్చారు. అయితే ఈ నాటకానికి పండితలోక సన్మానాలెందుకు జరగలేదంటే పండితులు దళితవర్గాలలోని ప్రతిభను గుర్తించరు కనుక. సత్యహరిశ్చంద్ర నాటకం చూచి ఎందరు సత్యవ్రతులయ్యారో తెలియదుకానీ పాలేరు నాటకం చూచి వేలమంది పాలేళ్ళు పాలేరుతనాలు వదిలేసి పాఠశాలలో చేరడం మాత్రం వాస్తవంగా జరిగింది. నాటకప్రయోజనం అది ఏ లక్ష్యాన్ని సాధించదలచిందో దాన్ని సాధించినప్పుడే సిద్ధించినట్లు. పాలేరు నాటకలక్ష్యం సాంఘిక విప్లవం. అది సాధించబడింది. (పాలేరు నాటకానికి భీమన్న రాసుకున్న పీఠిక నుండి సంక్షిప్తంగా...) (భీమన్న సాహితీ నిధి ట్రస్టు-కవి సంధ్య నిర్వహణలో భీమన్న జయంతి సభ సెప్టెంబర్ 19న సాయంత్రం 5:30కి బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ హాలులో జరగనుంది.) -
సింగిల్ లెగ్ సాకులు
సోల్ / సాకులు లోకులు పలు కాకులని పెద్దలు అన్నారు గానీ, లోకంలో పలు సాకులు ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. అయినా నష్టమేమీ లేదు. చాకులాంటి తెలివైన మహానుభావులు కొందరు ఈ రహస్య సత్యాన్ని గుర్తించారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి... ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతీ అనే నీతిశతకంలోని అంతరార్థం ఇదేనని వారు గ్రహించారు. ఆత్మరక్షణ కోసం కొన్ని, అవసరార్థం ఇంకొన్ని, అనవసరాల నుంచి తప్పించుకోవడం కోసం మరికొన్ని... టోకున సాకులు చెప్పే విద్యలో ఆరితేరిన వీరులుగా, అసహాయ శూరులుగా... మొత్తానికి ఈ పాడు లోకంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతూ వస్తున్నారు. ఇలాంటి పెద్దమనుషుల్లో కొందరు రాజకీయాల్లో సహజంగానే రాణిస్తున్నారు. లోకంలో ముక్కుసూటిగా పోయే అసమర్థులు, అప్రయోజకులు తప్ప వేరెవరూ సాకుల కోసం వెదుక్కోరనేది జగమెరిగిన లౌక్యసిద్ధాంతుల నిశ్చితాభిప్రాయం. అయితే, కొందరు అమాయకులు ఈ అభిప్రాయంతో విభేదిస్తారు. సాకులు చెప్పడాన్ని అవలక్షణంగా పరిగణిస్తారు. అయినదానికీ కానిదానికీ చెప్పే సాకులను ‘కుంటి’సాకులుగానూ అభివర్ణించి, తమ అక్కసును వెళ్లగక్కుతారు. సాకులు సాహిత్యావలోకనం తెలుగు సాహిత్యంలో సాకులు చెప్పే పాత్రలు చాలానే ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడి వంటి వికటకవి కూడా రాయలవారి సమక్షంలో అడపాదడపా సాకులు చెప్పి, వినోదాన్ని పంచిన దాఖలాలూ ఉన్నాయి. అయితే, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరితో పడితే వారితో ఎడాపెడా టోకున సాకులు చెప్పడంలో ‘కన్యాశుల్కం’లోని గిరీశాన్ని మించిన జాదూగాడు తెలుగు సాహిత్యంలోనే లేడు. పరీక్ష తప్పి ముఖం వేలాడేసుకు వచ్చిన తన ప్రియశిష్యుడు వెంకటేశం మీదే సాకులు సంధిస్తాడు. ‘మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టలు కాల్చడం ఒక్కటే. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ, ఒక మారయినా, ఒక ముక్క చెప్పిన పాపాన పోయినారూ?’ అని వెంకటేశం నిష్టూరమాడితే, గిరీశం తడుముకోకుండా సాకులు చెబుతాడు. ‘ఇలాటి మాటంటే నాకు కోపం వొస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్... ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాష్టరుకుందీ?... మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్! చుట్ట నేర్పినందుకు థాంకు చెయ్యక, తప్పుపట్టుతున్నావ్? చుట్టకాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలింత గొప్పవాళ్లయినారు. చుట్టకాల్చని యింగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదే స్టీముయంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు...’ అంటూ ఏకబిగిన చుట్ట మహిమ గురించి సాకులు చెప్పుకొస్తాడు. వెంకటేశం తండ్రి అగ్నిహోత్రావధాన్లు వంటి అపరదుర్వాసుడిని సైతం ఇలాంటి సాకులతోనే బుట్టలో పడేసుకుంటాడు. వినేవాళ్లకు చీకాకులు వినేవాళ్లను వెర్రిమాలోకాలుగా ఎంచే ధీమంతులే అలవోకగా సాకులు చెప్పగలరు. మొదట్లో హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లలు టీచర్లకు సాకులు చెప్పడం మొదలుపెడతారు. మొదట్లో వాళ్లు కాస్త భయంభయంగా సాకులు చెబుతారు. రాత్రి జ్వరం వచ్చిందనో, కడుపు నొప్పిగా ఉందనో పిల్లలు అమాయకపు మొహాలతో చెప్పే సాకులు వినే టీచర్లు కాస్త మానవత్వంతో ఆలోచించి, పోన్లే పాపం అని క్షమించేస్తారు. ఒకటికి రెండుసార్లు ఇలా జరగొచ్చు. పదే పదే పిల్లలు చెప్పే సాకులు వింటుంటే ఎంతటి సహనవంతులైన టీచర్లకైనా కోపం వేసవితాపంలా పెరుగుతుంది. అలాంటప్పుడు వారు దండోపాయాన్నే తరుణోపాయంగా ఎంచుకుంటారు. మొండిఘటాలైన పిల్లలు టీచర్ల దండనను కూడా తప్పించుకునే తరుణోపాయాలను తక్షణమే ఆలోచించగలరు. మొదట్లో తేలికపాటి సాకులు చెప్పేవారు కాస్తా దెబ్బలు తప్పవనే పరిస్థితి ఎదురైనప్పుడు మరింత పెద్దపెద్ద సాకులు చెప్పి, ఆ ఆపదనూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. స్కూళ్లలో సాకులు చెప్పే పిల్లలు కాలేజీకి చేరేలోగానే చాలా ఢక్కామొక్కీలు తిని ఉంటారు. సాకులు చెప్పే విద్యలోనూ కొంచెం రాటుదేలి ఉంటారు. కాలేజీ నుంచి బయటపడి ఉద్యోగపర్వంలో కాలుపెట్టే నాటికి పూర్తిగా ఆరితేరిన సాకువీరులుగా తయారవుతారు. పని ఎగ్గొట్టడానికి ఆఫీసుల్లో బాసులకు సాకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ పురోగతి అక్కడితోనే ఆగిపోదు. ఎదుటివాళ్ల బలహీనతలను పసిగట్టి, వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు చెప్పడంలో నిరంతర సాధన కొనసాగుతూనే ఉంటుంది. పెళ్లిళ్లయి కుటుంబరావులుగా మారిన తర్వాత కూడా బలాదూర్ మందుపార్టీల్లో మునిగితేలి, ఆలస్యంగా కొంపలకు చేరినప్పుడు ఇల్లాళ్లకూ రకరకాల సాకులు చెబుతారు. సాకువీరుల్లోనూ కొందరు మరీ ముదుర్లుంటారు. అదృష్టం బాగుంటే ఇలాంటి వాళ్లు రాజకీయ పార్టీల్లో సలహాదారులుగా సెటిలైపోతారు. ఎవరు చెబుతారంటే..? జీవితాన్ని కులాసాగా ధిలాసాగా చీకూచింతా లేకుండా నిష్పూచీగా గడిపేయాలనుకునే నిక్షేపరాయుళ్లే ఎక్కువగా సాకులు చెబుతారట! కించిత్ కష్టమైనా వీరి ఒంటికి పడదు. ఇష్టంలేని పనులను తప్పించుకోవాలనుకునే వాళ్లు కూడా సాకులు చెబుతారట! అయిష్టమైన పనులు అనివార్యమైతే ఎటూ తప్పదు. ఈలోగా వాటిని సాధ్యమైనంత నివారించుకునేందుకు శాయశక్తులా చేసే ప్రయత్నంలో భాగంగానే చాలామంది సాకులు చెబుతారట! కొద్ది మంది అమాయకులను మినహాయిస్తే మనుషులందరిలోనూ కొద్దో గొప్పో సుఖాలకు దగ్గరగా, కష్టాలకు దూరంగా ఉండాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏ మేరకు బలంగా ఉంటే, ఆ మేరకు సాకులు చెప్పడంలో ప్రావీణ్యం అబ్బుతుంది. ఇవన్నీ ఏ కాలజ్ఞానం చెప్పిన విశేషాలో కావు, ఆధునిక మానసిక శాస్త్రం చెబుతున్న కారణాలు. -
బహుజన చైతన్య విస్తృతి
ఆధునిక తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం ముఖ్యమైన పరిణామం. తెలుగు సాహిత్యాన్ని ఒక అడుగు ముందుకు ముస్లింవాదం నడిపింది. ఒక వాదంగా అది నిలదొక్కుకోవడానికి పెద్ద పోరాటమే చేసింది. ఆ క్రమంలో అనేక వ్యక్తిగత సంకలనాలు, ఉమ్మడి సంకలనాలు వెలువడ్డాయి. స్కైబాబ సంపాదకత్వంలో వెలువడ్డ కవిత్వం, కథ, ప్రత్యేక సంచికలు తెలుగు సాహిత్యానికి అదనపు చేర్పు అయ్యాయి. ఆయా గ్రంథాలకు ఆయన అందించిన సంపాదకీయాలు, వ్యాసాల సంకలనమే ‘జాగో’. ఈ రచనలోని భావనలు, ఆలోచనలు ముస్లిం సమాజానికి మాత్రమే పరిమితం కాదు. ముస్లింయేతర సమాజాన్ని జాగృతం చేయటమే ముఖ్యమైన లక్ష్యం. సాహిత్య వివేచనలో ఆధిపత్య సమాజం ప్రతిపాదించిన భావనలు, సిద్ధాంతాలకే ప్రాముఖ్యం లభించింది. కానీ సామాజిక, సాహిత్య తత్వ విచారణను విశాలం చేసిన మూలవాసుల చేర్పును, కృషిని ఉద్దేశిత విస్మరణకు గురిచేశారు. అందుకే, దళిత, ముస్లిం సాహిత్య ఉద్యమాల భావజాలం ఎవరూ విస్మరించలేని ప్రభావశీల శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా ముస్లింవాదం చేసిన ఒంటరిపోరాటం మెజార్టీ మతాలవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. క్రమంగా విస్తరిస్తున్న బ్రాహ్మణీకరణ (స్కైబాబ మాటల్లో హిందూయీకరణ), రాజ్యం ప్రమోటఖ చేసిన మతహింస, సమాజం అచేతనంగా అంగీకరిస్తున్న సామాజిక హింస, దోపిడీ, ముస్లిం సమాజంలో రావాల్సిన అంతర్గత పరివర్తన, ముస్లిం స్త్రీల దాస్యవిముక్తి వంటి బాహ్య, అంతర సమస్యల మీద నిర్విరామ పోరాటం ముస్లింవాదాన్ని ఎన్నదగిన ఉద్యమంగా చేశాయి. ముస్లింవాదం బాధితస్వరం మాత్రమే కాదు. అది ప్రజాస్వామిక చైతన్యానికి నిదర్శనం. ఈ ప్రజాస్వామిక వ్యవస్థను మతఛాందసుల నుంచి రక్షించుకోవడానికి ముస్లింవాదం వ్యవస్థీకృతం కావాలి. అలా సంఘాన్ని బహుజన సిద్ధాంత పునాదుల మీద నిర్మించాలని స్కైబాబ చింతన. ముస్లింవాదం అంటే బహుజన చైతన్య విస్తృతి. బాహ్య, అంతర పోరాటం అనే ద్విముఖ వ్యూహంతో ముస్లింవాదం కృషిచేస్తుంది. దేశ ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థను రక్షించుకోవడం కోసం బాహ్యపోరాటం. ముస్లిం సమాజంలోని అసమానతలు, లింగ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ మారుతున్న పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే శక్తిమంతమైన సమాజంగా తీర్చిదిద్దడం కోసం అంతర్గత పోరాటం. ముస్లింవాదంలోని మౌలిక అంశాలను ఈ వ్యాసాలు ఎరుకపరుస్తాయి. కాషాయదళం అధికారంలో వున్న ఈ సందర్భంలో బహుజన సమాజంలో తలెత్తాల్సిన చైతన్యాన్ని ఇవి సూచిస్తాయి. డాక్టర్ జిలుకర శ్రీనివాస్ -
‘సాహితీ పురస్కారాల’కు సూచనలివ్వండి
హైదరాబాద్: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తోంది. 2013, 2014 సంవత్సరాలకు ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు వివిధ వర్గాల నుంచి వర్సిటీ సూచనలు కోరుతోంది. 2013 పురస్కారాలకైతే 2010 జనవరి నుండి 2012 డిసెంబరు మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలను, 2014 పురస్కారాలకైతే 2011 జనవరి నుంచి 2013 డిసెంబరు మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలను పరిశీలనకు సూచించాలి. వచన కవిత, పద్య కవిత, బాల సాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం, నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం అనే 10 ప్రక్రియల్లో అన్ని ప్రక్రియలకు గాని, కొన్నింటికి గాని, తమకు నచ్చిన గ్రంథాలను పురస్కారాలకు సూచించవచ్చు. 2014 పురస్కారాల్లో గేయ కవితా పురస్కారం కూడా ఉంటుంది. ఈ పురస్కారానికి 2009 నుంచి 2013 మధ్యకాలంలో ప్రచురితమైన గేయ కవితా సంపుటాలను సూచించాలి. సూచనలో ప్రక్రియ పేరు, గ్రంథం పేరు, రచయిత పేరు, చిరునామా, పేజీల సంఖ్య, ప్రచురణ సంవత్సరం, ప్రచురణ కర్త పేరు పేర్కొనాలి. రచయితలు కూడా తమ గ్రంథాలను స్వయంగా సూచించవచ్చు. అనువాద సాహిత్య విభాగానికి తప్ప మిగతా విభాగానికి అవార్డుల కోసం అనువాదాలు, అనుసరణలు సూచించరాదు. వచన రచన అనే ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, తాత్త్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి కళలకు సంబంధించిన గ్రంథాలు సూచించవచ్చు. అన్ని ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గరాదు. బాల సాహిత్యం, నాటకం ప్రక్రియలలో పుటల పరిమితి లేదు. రచయిత మరణించినప్పటికీ 2010 జనవరి నుండి 2013 డిసెంబర్ మధ్య కాలంలో వారి రచన ప్రచురణ పొంది ఉంటే అవార్డుకు సూచించవచ్చు. తెల్ల కాగితంపై పాఠకులు తమ సూచనల్ని రాసి రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్-4 చిరునామాకు సెప్టెంబరు 5లోగా పంపాలని రిజిస్ట్రార్ కె.తోమాసయ్య తెలిపారు. -
ప్రజాసాహితిలో గురజాడ
‘తలుపు తలుపు’... ఈ రెండు మాటలతోనే గురజాడ ‘దిద్దుబాటు’కథను ప్రారంభించారు. ఆ మాటలు ఆధునిక తెలుగు సాహిత్య వాకిలిని తెరిపించడానికి మహాకవి అన్న మాటలేననిపిస్తాయి. ఆయన ఇచ్చిన ఆధునిక దృష్టి నుంచి తెలుగు సాహిత్యం సదా స్ఫూర్తిని పొందుతూనే ఉంది. అందుకు నిదర్శనమే కన్యాశుల్కం నాటక ప్రదర్శన నూరేళ్ల సందర్భం, గురజాడ నూరవ వర్ధంతి సందర్భాలకు లభించిన స్పందన. అందులో ఒక స్రవంతి ‘ప్రజాసాహితిలో (1977-2015) మహాకవి గురజాడ’ పుస్తకం. సాహిత్యాన్ని సమాజోద్ధరణకు వినియోగించుకున్నా, దానికి ఉండవలసిన సౌందర్య దృష్టిని విస్మరించని మహనీయుడు గురజాడ. వీటి వెనుక ఉన్న నేపథ్యాన్నే ఈ వ్యాసాలు చాలా వరకు వివరించాయి. కామ్రేడ్ గురజాడ, కన్యాశుల్కములో మధురవాణి (శ్రీశ్రీ), ‘వాడుక తెనుగు’ (గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ఈ పద్యాలు గురజాడ నిర్యాణం సందర్భంలో 4-12-1915న కృష్ణాపత్రికలో వెలువడినాయి.), మహాకవి (కవిత, దేవులపల్లి కృష్ణశాస్త్రి), గిరీశం-శకారుడూ (వ్యాసం, రాంభట్ల కృష్ణమూర్తి), డామిట్ గురజాడా! (దీర్ఘ కవిత, శివసాగర్), అప్పరాయ కవీ! (వ్యాసం, నార్ల వెంకటేశ్వరరావు), గురజాడ మనస్తత్వంలో విపరీత ధోరణులు (వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి), బంగోరె ‘మొట్టమొదటి కన్యాశుల్కంపై సమీక్షలలోని శకలాలు (మునిమాణిక్యం నరసింహారావు), గురజాడ నిపుణవాణి మధురవాణి (సంజీవ్‌దేవ్) వంటి సాహితీవేత్తల వ్యాసాలు ఇందులో చేర్చారు. సెట్టి ఈశ్వరరావు, కాత్యాయనీ విద్మహే, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య ఎస్.గంగప్ప, బి.సూర్యసాగర్, కొత్తపల్లి రవిబాబు, దివికుమార్, ఛాయారాజ్, కాకరాల, అంపశయ్య నవీన్ వంటి పరిశోధకులు, విమర్శకులు, సామాజిక విశ్లేషకుల వ్యాసాలు కూడా ఉన్నాయి. యుఎ నరసింహమూర్తి కన్యాశుల్కం నాటకాన్ని 19వ శతాబ్దంలో వచ్చిన భారతీయ నాటకాలతో పోలుస్తూ విలువైన వ్యాసం రాశారు (ఈ వ్యాసమే తరువాత ఉద్గ్రంథంగా విస్తరించారు). ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ అడుగుజాడను రుజువు చేసే వ్యాస సంకలనం ఇది. కల్హణ ప్రజాసాహితిలో (1977-2015) మహాకవి గురజాడ వెల: 400; ప్రతులకు: మైత్రీ బుక్‌హౌస్, జలీల్ వీధి, కారల్‌మార్క్స్ రోడ్, విజయవాడ-520 002. ఫోన్: 9848631604 -
యద్దనపూడి శైలి చాలా తీపి...
తీపి: తెలుగు సాహిత్యంలో నాకు సంబంధించి ఆ మాధుర్యాన్ని తలపించే రచన యద్దనపూడిగారి ‘సెక్రటరీ’. అది ప్రేమలోని మాధుర్యాన్ని సమతూకంలో ప్రదర్శించిన నవల. అలాగే మంచి హాస్యం ఉన్న పుస్తకాన్ని కూడా నేను తీపిగానే భావిస్తా. పులుపు: సామర్సెట్ మామ్ రాసిన ‘రేజర్స్ ఎడ్జ్’ పులుపు రుచికి చక్కని ఉదాహరణ. కారణం హిందూమతానికి సంబంధించిన వైరాగ్యాన్ని దీంట్లో బాగా రాశారు. వగరు: నేను రాసిన ‘అనగనగా అతిథి’. ఇది అతీంద్రయ శక్తులు, ఊజాబోర్డ్ (మరణించిన వారిని పిలిపించి సంభాషించే బోర్డ్) వంటి విషయాల మీద రాసిన నవల. చెడ్డ విషయాల మీద రాశానని చాలా ఆలస్యంగా గ్రహించాను. అందుకే ఈ నవల నాకు వగరును తలపిస్తుంది. ఉప్పు: ఆనె ఫ్రాంక్స్ డైరీ మంచి ఉదాహరణ. ఆహారంలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తినలేం. మనిషికి స్వేచ్ఛ అలాంటిదే. ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. అలా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో స్వేచ్ఛ విలువను చక్కగా చెప్పిన నవల ఇది. కరువైన స్వేచ్ఛకు సోవియెట్ యూనియన్ ఒక ఉదాహరణైతే, దుర్వినియోగమవుతున్న స్వేచ్ఛకు మనదేశం ఉదాహరణ. కారం: ఓ టిబెటియన్ మాంక్ రాసిన ‘ఆర్ట్ ఆఫ్ డైయింగ్’ పుస్తకం. మరణించబోయే ఆర్నెల్ల ముందు నుంచి మనిషి ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే రచన ఇది. షడ్రుచుల్లో కారం ఎంత అవసరమో జీవితంలో అలాంటి రుచిని పోలిన ఇలాంటి రచనలూ అంతే ముఖ్యం. అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. చేదు: నేను రాసిన తేనేటీగ. నాకు మంచి నవలగా అనిపించినా సమాజం నుంచి చాలా విమర్శలెదుర్కొన్న రచన ఇది. ముక్తాయింపు: ప్రతి యేడూ ఉగాది పండుగ కోసం ఎదురుచూస్తూ దాన్ని ఎంత ఆనందంగా స్వాగతిస్తామో సాహిత్యానికి సంబంధించి కొత్త రచనల కోసమూ అంతే ఉత్సాహంగా ఎదురుచూడాలి. కొత్త రచయితలనూ అంతే సాదరంగా ఆదరించాలి. - మల్లాది వెంకటకృష్ణమూర్తి -
వెంటాడే పాత్రలు...
మహిళా దినోత్సవం ప్రత్యేకం స్త్రీల గురించి స్త్రీలు రాసుకోవడానికి వీలు లేని రోజుల్లో కూడా స్త్రీలు తమ శక్తిమంతమైన సమక్షంతో కవుల కలాల్లో, రచయితల గళాల్లో దూరి తమకు రూపాలను ఇచ్చుకున్నారు. తాము లోకానికి వెల్లడి చేయాల్సిన సంగతులను వెల్లడి చేశారు. సౌందర్యం, ప్రేమ, త్యాగం, ధైర్యం, తెగువ, నిరసన... ఒక స్త్రీకి వేయి రూపాలు. ప్రతి సాహిత్యకారుడూ ఆ విరాట్ రూపానికి తనదైన వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉంటాడు. భారతీయ సాహిత్యంలో తెలుగు సారస్వతంలో కొన్ని పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని గుర్తు చేసుకోవడం... తద్వారా వాటిని లోతుగా తెలుసుకునే పనికి పురిగొల్పడం కోసమే ఈ పెద్దల అభిప్రాయాలు. వరూధిని: వరూధిని మనోహారిణియగు ముద్దరాలు. అమాయకురాలు. దైవభక్తి సంపన్న. స్నిగ్ధమోహావేశ పరవశ. యౌవన విలాసములు పొంగి పొరలు చుండెను. పెద్దన ప్రవరాఖ్యునిచే చెలియలికట్ట వేయించినాడు. పాపం. వరూధిని ప్రవరాఖ్యుణ్ణి ప్రేమించినటులనే ఒక గంధర్వుడు వరూధినిని ప్రేమించి యుండెను. సమయము చిక్కినది. వదలలేదు. ప్రవరాఖ్య రూపము ధరించి నాలుగు అంగలలో వచ్చి పడినాడు. అసలు ప్రవరాఖ్యునితో వరూధిని హృదయము నిండిపోవుచున్న సమయమున నకలు ప్రవరాఖ్యుడు హాజరు. వరూధిని అతడే ఇతడనుకుంది. ఇంకేమి కొరత. ప్రకృతి తత్త్వశాస్త్ర మర్మముల ఘోషించుటకు తగిన అదను. పెద్దన దీనిని జారవిడుచునా? గంధర్వుడు మన్వంతరపు ఢంకాను బజాయించినాడు (అతడి వల్ల వరూధిని మనువుకు జన్మనిచ్చినది). విశ్వామిత్రుడు భరతఖండపు బాకా ఊదలేదా (శకుంతలా దుష్యంతుల సంతానమే భరతుడు). ఈ పరమ రహస్యములను సునిశితముగ లోకమునకు చాటినవారు కాళిదాసు, పెద్దన. ఔరా.. తాళలేని అప్సరసల సంతతివారు భరత ఖండమును, మన్వంతరములను స్థాపించగలిగిరి. పరమాశ్చర్యము గదా? - పుట్టపర్తి నారాయణచార్యులు మధురవాణి: నేను చదివినంత మట్టుకు విశ్వసాహిత్యంలో మధురవాణితో సరిపోల్చదగిన పాత్ర మరొకటి లేదు. అనగా ఆ తెగలో ఆమె అద్వితీయంగా నిలుస్తుందని. ఆ తెగ అనగా ‘సామాన్య’ అనే నాయికా విశేషం అని నా ఉద్దేశం. ‘మృచ్ఛకటిక’లో వసంతసేన మానవవేశ్య అయినా మధురవాణి ప్రౌఢత్వం ముందు ఆమె వట్టి గోల. షేక్స్పియర్ క్లియోపాత్రగాని, సోఫోక్లిస్ నాయికలుగాని వేశ్యలు కాదు. ముద్దుపళని తన రాధికకు తంజాపూర్ నాగరికతనాటి వేశ్యల లక్షణాలను ప్రసాదించింది. చింతామణి కంటే దేవదేవి నాలుగాకులు ఎక్కువ చదువుకుంది. అంతే. వీరంతా శృంగారంలో కొన్ని సున్నితమైన ఒడుపులు చూపిస్తారు. కాని జీవితాన్ని వడబోసి చూపించరు. వసంతసేనను ‘వెసెల్ ఆఫ్ లవ్’ (ప్రేమపాత్రిక) అనీ, మధురవాణిని ‘వెసెల్ ఆఫ్ లైఫ్’ (జీవపాత్రిక) అనీ నేనంటాను. ఉజ్జయినీ నగరాన్నీ చారుదత్తుని ప్రేమనీ వదులుకోవలసి వస్తే వసంతసేన ఏమయిపోతుందో తలచుకోవడానికే భయమవుతుంది. మధురవాణి మాత్రం యే స్థలాన్నైనా యే స్థితినైనా లొంగదీసుకోగలదు. ఎంత గొప్ప పాత్రని సృష్టించాడు గురజాడ! - శ్రీశ్రీ చింతామణి: కాళ్లకూరి నారాయణరావుగారు ఈ నాటకాన్ని రాసిందే వేశ్యాలోలత్వం నుంచి మేలుకొలుపు కోసం. అందుకు తగ్గట్టుగా పదే పదే ఆ అంశం మీద వ్యాఖ్యానాలు చేయిస్తూ వచ్చారు కనుక చింతామణి రచన సక్కుబాయి నాటకంలాగానో, విప్రనారాయణ నాటకంలాగానో భక్తి ప్రధాన నాటకంగా భాసించకుండా సాంఘిక నాటకంగా స్వభావం మార్చుకుంది. చింతామణి వృత్తి చేత వేశ్యగా జీవిస్తున్నా ప్రవృత్తి రీత్యా దుర్మార్గురాలు కాదు. పైగా వేశ్యాలోలత్వంతో తన సంపదనంతా దోచి పెట్టిన భవానీశంకరుడన్నా, దోచి పెట్టడానికి సిద్ధంగా ఉన్న సుబ్బిశెట్టి అన్నా ఆమెకు వెగటు. తన వృత్తి మీద కూడా వెగటు. ఈ సందర్భంలోనే ఆమె మంచి అధ్యయనపరుడు, భక్తుడు అయిన బిల్వమంగళుడు గురించి విన్నది. అతడికి దగ్గర కావాలనుకుంది. కాని అతడు ఆమె మోహంలో పడి ఇంటినీ భార్యనీ ఆఖరుకు చావుబతుకుల మధ్య ఉన్న తండ్రినీ పట్టించుకోని స్థితికి వచ్చాడు. ఒక రాత్రి తండ్రి చనిపోతే శవజాగారాన్ని భార్యకు వదిలిపెట్టి భోరున వర్షం కురుస్తుండగా పిడుగుపాటుకు చింతామణి ఎక్కడ భయపడుతుందోనని ఉధృతంగా పారే ఏరులో కొట్టుకెళ్లే శవాన్ని ఆధారంగా చేసుకొని ఈది ఆమె వద్దకు చేరుతాడు బిల్వమంగళుడు. వేశ్యా లోలత్వానికి ఆ సంఘటన పరాకాష్ట. చింతామణి ఆశించింది వేరు. చూసింది వేరు. వెంటనే ఆమె మలినమైన నిజదేహ స్వరూపాన్ని అతనికి చూపించి ఈ బతుకు అశాశ్వతత్వాన్ని అతనికి బోధించింది. తనే పరమగురువుగా మారింది. బిల్వమంగళుడిని యోగిని చేసింది. మనిషి ఏకాగ్రత, సమ్మోహస్థితి కామం వైపు గాక దైవం వైపు (సత్కర్మల వైపు) మళ్లిస్తే అంతకు మించిన ముక్తిమార్గం లేదు అనే సందేశం ఇస్తుంది. దౌర్బల్యాలకు స్త్రీ, పురుషులు సమానం. కాని వాటి నుంచి మేల్కొనదలిస్తే స్త్రీయే ముందుగా మేల్కొనగలదనీ పురుషునికి మార్గం చూపగలదనీ ఒక ఉదాహరణగా నిలిచే శక్తిమంతమైన పాత్ర చింతామణి. - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సావిత్రి: గుడిపాటి వెంకట చలం రాసిన ‘సావిత్రి’ నాటకంలో సావిత్రిది ఏ తెరలూ కప్పి ఉంచని సత్యప్రేమ. దాంపత్యప్రేమ ఎంత నిష్కల్మషమైందో సంకోచ రహితమైందో చెప్పడానికి పూర్వీకులు తమ సారస్వతంలో సావిత్రి పాత్రను భద్రం చేసుకుంటే కాలక్రమంలో ఆ పాత్రలోని సత్యప్రేమ, దాంపత్య ప్రేమ వెనుక్కి పోయి పాతివ్రత్యం, పతిభక్తి ముందుకు వచ్చాయి. వీటిని భగ్నం చేసి నిష్కల్మషమైన దాంపత్యప్రేమను పునఃప్రతిష్ఠించడానికి చలం ఈ నాటకం రాశాడా అనిపిస్తుంది. సావిత్రి ప్రేమ అంత స్వచ్ఛమైనది కనుకనే ఈ నాటకంలో యుముడు ‘పవివ్రతా పరమధర్మము సహగమనము’ అని అంటే ‘అవును. సహ-గమనమే చేస్తాను. పదండి. ప్రేమ లోబడదు. జయిస్తుంది’ అంటుంది సావిత్రి. యముడు సావిత్రి ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సావిత్రి దేనికీ భయపడదు. సత్యవంతుని ప్రేమ అపవిత్రమైనదనే మాయను సృష్టించి అతడిని మరో స్త్రీతో చూపిస్తాడు. కాని సావిత్రి చలించలేదు. ఎందుకు చలించాలి? తన సత్యవంతుడెటువంటి వాడని? ‘ఏ మార్పూ రాని మార్పు రావడం అసంభవమైన’ అటువంటివాడు. చివరికి యముడు రాక్షసమైన ఇంకో పరీక్ష చేస్తాడు. భర్తను రక్షిస్తే పునర్జీవిని కానిస్తే ప్రత్యుపకారంగా సావిత్రి తన సౌందర్యాన్ని యముని భోగానికొకమారు స్వాధీనం చేయాలట. సావిత్రి ధైర్యాన్ని పగలకొట్టగలిగితే పగలకొట్టగలిగేది ఈ పరీక్షా ఘట్టమే. సావిత్రి హృదయం చెదరలేదు. కాని చాలా ఆవేదన పొందింది. బాధపడ్డది. అంతే. కాని కర్తవ్యం నుంచి రాలిపోలేదు. ముందు భర్త బతకడమేగా తనకి కావలిసింది. సత్యవంతుడు బతికిన తరువాతగా తాను ప్రత్యుపకారం చెయ్యడం. తరువాత లోకాలన్నింటికీ మృత్యుపీడ వదిలిపోయేట్టు యముణ్ణి నాశనం చెయ్యలేనా అనుకుంది. అందుకు ప్రయత్నించింది. అప్పుడు- యముడు- సావిత్రిలోని ప్రేమ గొప్పతనాన్ని తన మీద ఆమె విజయాన్ని అంగీకరించింది. దాంపత్యంలోని ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి. పైపై మెరుపుల కొరకు కాదు. సమాజం కొరకూ కాదు. మన కోసం మన లోపలి నుంచి ఉద్భవించాలి. అలాంటి స్త్రీత్వమూ సావిత్రీత్వమూ కావాలి అనిపించడమే ఈ నాటకానికి ఫలశ్రుతి. - పింగళి నాగేంద్రరావు కిన్నెరసాని: తెలుగుదేశం చేసుకున్న పుణ్యం కవి విశ్వనాథ ఒకనాడు భద్రాచలాన్ని, అక్కడి అటవీ ప్రాంతాన్ని సందర్శించడం. ఆ అడవిదారిలో వెన్నెల బయలు దాటి, రాళ్లవాగు దాటి ముందుకు వెళితే ఎదురుగా ఒక రమణీయదృశ్యం. స్థిరంగా నిలిచి ఉన్న కొండ... ఆ కొండను చుట్టుకు వలయాలుగా ప్రవహించే అందాలవాగు. అంతకు మించి మరీ అందంగా వినిపించిన దాని పేరు- ‘కిన్నెరసాని’. ఆ పేరు వినగానే విశ్వనాథకు భావావేశం రగిలి, గళంలో తారట్లాడి, భావరాగతాళయుక్తంగా జాలువారి- ఆ వచ్చింది కిన్నెరసాని పాట అయ్యింది. ఇక్కడ జరిగిన చమత్కారం ఏమిటంటే ఆ తేనెపాటల కిన్నెరవాగు అచ్చమైన తెలుగింటి పడుచుగా కవికి సాక్షాత్కరించటం, నదిగా ఆమె చుట్టుకొని తిరుగుతున్న ఆ కొండశిల విధి వైచిత్రి వల్ల శిలాకృతి పొందిన ఆమె పతి కావడం. ఆ ఇద్దరినీ చుట్టుకోని కవి ఊహలో ఒక సమ్మోహకమైన జీవత్కథ ఏర్పడిపోవడం. కిన్నెర కథాసౌరభం ఎటువంటిదంటే.... తెలుగింట పుట్టి పెరిగిన పిల్ల కిన్నెర. ఎన్నో కోరికలతో పెళ్లీ పేరంటమూ జరిగి అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. పెనిమిటి ప్రేమమూర్తే. అత్తతోనే వచ్చింది చిక్కు. ఎప్పుడూ కోడలిపైన ఏదో ఒక నింద వేయటమే పనిగా పెట్టుకున్నది. ఒకనాడు కిన్నెరను అనరాని మాటలే అన్నది ఆ అత్త. అటు అత్త ఆరడి, ఇటు భర్త మౌనం- ఆపుకోలేని దుఃఖంతో వేగిపోయింది కిన్నెర. కోపావేశంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ఇల్లు వదలి అడవుల వెంట పరుగు తీసింది. అది చూచి భయంతో ఆందోళనతో ఆమె వెంటే పరుగు తీశాడు ఆమె భర్త. ఎలాగో ఆమెను అందుకుని కౌగిలిలో హత్తుకొని తనను వీడి వెళ్లవద్దని వేడుకొన్నాడు. అప్పుడొక కరుణాద్భుతమైన చిత్రం జరిగింది. భర్త కౌగిలి నుంచి జారిపోతున్నది కిన్నెర- కరిగి కరిగి నీరై, యేరై పారుతున్నది కిన్నెర. అణువణువూ శోకమై కిన్నెరవాగులా మారి జలజలా పారుతున్నది కిన్నెర. భర్త ఆమె కోసం దుఃఖించి దుఃఖించి స్థాణువైనాడు. భర్త- శోకం కరడు కట్టిన శిలాకృతి. భార్య- శోకం నిలువునా నీరయిన రసాకృతి. ఇది కల్పనా? ఇది కల్పన అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది. కాని- ఇది స్త్రీ పురుష సంబంధాలలోని సంఘర్షణలకు అద్దం పట్టే నిష్ఠూరమైన జీవనసత్యం! - సి.వేదవతి -
ఒక విరాట్ అక్షరం
నివాళి తెలుగువారి విలక్షణ రచయిత, తన నవలలతో తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేసిన డా.కేశవరెడ్డి మరణవార్త విన్నాక సాటి రచయితలు, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రచనలు చేస్తున్న యువ రచయితలు, ఆయన ప్రోత్సాహం అందుకున్నవారు, అభిమానించే పాఠకులు ఎందరో స్పందించారు. వ్యక్తిగా, రచయితగా కూడా కేశవరెడ్డి ఎంతో నిరాడంబరులై ఉండటం ఇందుకు కారణం కావచ్చు. ‘అతడు అడవిని జయించాడు’, ‘మూగవాని పిల్లనగ్రోవి’, ‘చివరి గుడిసె’ వంటి నవలలతో లోతైన జీవితాలనూ భిన్నమైన శిల్పధోరణులనూ ప్రవేశపెట్టిన డా.కేశవరెడ్డి గురించి ‘సోషల్ మీడియా’లో వచ్చిన వ్యాఖ్యల నుంచి ఏరిన భాగాలు కొన్ని.... నిలబడే చదివేసేవాణ్ణి నాకు కేశవరెడ్డి రచనలతో మొదటి పరిచయం ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన ‘అతడు అడవిని జయించాడు’ ద్వారా ఏర్పడింది. మొదటి భాగం చదవగానే ఆ భాషను ఎలా చదవాలా అనిపించింది. కారణం, అప్పటి వరకూ కథలు, నవలలు అన్నీ కూడా కృష్ణాజిల్లా భాషలోనే ఉండేవి, ఆ భాషే సాహిత్య భాష అనుకుంటూ పెరిగాను. ఈ నవలలోని చిత్తూరు జిల్లా మాండలికం క్రమంగా అలవాటయ్యాక తెలుగులో రచనలకు ఒక ‘సిక్కా వేసిన’ శైలి ఉండవలసిన అవసరం లేదని, ప్రజలు మాట్లాడుకునే అనేక మాండలికాల్లో రాయవచ్చని తెలిసింది. ఆ తెలియడం కూడా మొదట కేశవరెడ్డి నవలతో తెలియడం నా అదృష్టం. ఆయన రచనలు సాహస గాథ అనిపించే ‘అతడు అడవిని జయించాడు’ దగ్గరి నుంచి డిటెక్టివ్ తరహాలో సాగే ‘మునెమ్మ’ వరకూ నాకు తెలుసు. ఆయన స్వీయ అనుభవం అనిపించే నవల ‘సిటీ బ్యూటిఫుల్’. ఈ ఒక్క నవలలో మాత్రం ఆయన హాస్య రసాన్ని కూడా పండించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ నవల ధారావాహికంగా వచ్చేటప్పుడు నన్ను ఎంతగా ఆకర్షించిందంటే పత్రిక కొనడం ఆలస్యం ఆ షాపు దగ్గరే నిలబడి చదివేసేవాణ్ణి. ఈ కథలో హీరో తన కథ తానే చెప్పుకుంటాడు. ఈ హీరోకు ఒక పడికట్టు మాట ఉంటుంది. తన దృష్టిలో సవ్యంగా ఆలోచించలేని వాళ్లను ‘ఇంబిసైల్ ముండా కొడుకులు’ అని కొట్టి పారేస్తూ ఉంటాడు. ఈ అలవాటును కాపీ కొడుతూ నేను కూడా ఈ మాటను వాడే బలహీనత అప్పుడప్పుడూ చూపిస్తూ ఉంటాను. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే రెడ్డిగారి కథలు అన్నీ కూడా ఒక రోజు నుంచి అతి కొద్దిరోజులు మాత్రమే జరుగుతాయి. ఎక్కువ కథలు ఒక్కరోజు సంఘటనల సమాహారమే. వృత్తిరీత్యా డాక్టరుగా రోగులకు చికిత్స చేశారు. కాని ఆ చికిత్స కంటే తన రచనల ద్వారా సమాజానికి ఎంతో అవసరమైన చికిత్స చేసేవారు. నటన, లౌక్యంలేని ఈ రచయితని మృత్యువు తనదైన పద్ధతిలో తీసుకుపోయింది. కాని తన రచనల ద్వారా ఆయన ఎప్పుడూ చిరంజీవే. - కప్పగంతు శివరామప్రసాద్ ‘సాహిత్య అభిమాని’ బ్లాగ్ నుంచి. మనదంతా నవలా కుటుంబం.... సరిగ్గా ఇలాగే అప్పుడప్పుడు వారి గొంతు వినిపించేది. పలకరిస్తూ పరామర్శిస్తూ... ముఖ్యంగా మనదంతా నవలా కుటుంబం అని నవ్వుతూ... మళ్లీ ఎప్పుడు మరొక నవల అని హెచ్చరిస్తూ... మంచిని క్షేమాన్ని కోరుతూ... అప్పుడప్పుడు నవలను అర్థం చేసుకోని, చేసుకోవడానికి ప్రయత్నించని వారి పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తూ.... నవల పీక నొక్కుకు పోతోందని నిరాశ పడుతూ... నవలా మాధ్యమం గురించి విచారిస్తూ.... ఒక చిన్న నవల మొదలుపెట్టమ్మా అని ప్రోద్బలిస్తూ... మన సమకాలీన నవలాకారుడు డా.కేశవరెడ్డి. - చంద్రలత, రచయిత్రి. ఫేస్బుక్ నుంచి అప్పట్లోనే ఆయనపై విమర్శలు.... 1993లో ఆంధ్రప్రభ వారపత్రికలో కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ సీరియల్‌గా వచ్చి 1995లో నవలగా వెలువడింది. అదొక గొప్ప నవలగా అన్ని వైపుల నుంచీ ప్రశంసలు వచ్చినా వామపక్ష వర్గం మాత్రం పళ్లు నూరింది. అందులో ‘అభ్యుదయ నిరోధక భావజాలం’ ఉందంటూ విమర్శకు దిగి దాడి చేసింది. ఆ నవలలోని సన్నకారు రైతు బక్కిరెడ్డి భూమినీ సేద్యాన్నీ కోల్పోతే ఏం చేయాలి? తిరగబడాలి. పీడిత తాడిత ప్రజల మూకుమ్మడి తిరుగుబాటు విప్లవజ్వాలై ఎగిసిపడాలి- అని వామపక్ష వర్గం కోరిక. కాని నవలలో బక్కిరెడ్డి మతి చెడి మరణిస్తాడు. బక్కిరెడ్డి పరితప్త హృదయాన్ని పంచభూతాలు ఆవాహన చేసుకుంటాయి. అతని చావుని గుర్తించి ఆ భూమిని అతను కాక వేరెవరూ దున్నకూడదన్న వరం ఇస్తాయి. ఆ ప్రాంతం బక్కిరెడ్డి పేరిట చిన్నతోపులా మిగిలిపోతుంది. ఇలా రాస్తే నవలను కాకమ్మ కథలాగా పుక్కిటి స్థలపురాణంలాగా దిగజారుస్తావా? అని కేశవరెడ్డి మీద వారి ఆగ్రహం. భారతీయ సాహిత్యంలో అంతర్లీనమైన జానపద సంప్రదాయ కథన పద్ధతిలో వీరగాథ (లెజెండ్)గా చెప్పబడిన అత్యుత్తమ నవలగా ‘మూగవాని పిల్లనగ్రోవి’ పేరొందడం వారి అసహనానికి కారణం. దాంతో ‘నువ్వు మార్క్సిస్టు రచయితవు కాదా’ అని ఆయన వెంటబడ్డారు. అంతేకాదు అంతకు చాలా ఏళ్ల క్రితం రాసిన ‘అతడు అడవిని జయించాడు’ను దీనికి కూడా జత చేసి ముద్దాయిగా నిలబెట్టారు. దాంతో కేశవరెడ్డి 1996 నాటి సుప్రభాతం పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ‘మూగవాని పిల్లనగ్రోవి, అతడు అడవిని జయించాడు నవలలు ఒక ఫిలాసఫీకి చెందినవి. అంతమాత్రాన నేను మార్క్సిస్టును కాకుండా పోతానా’ అని మొత్తుకున్నారు. అంతేకాదు ‘మూగవాని పిల్లనగ్రోవి’పై మార్క్సిస్టుల విమర్శను చూసి తానేమిటో గుర్తు చేయడానికి 1986లో రాసిన ‘రాముడుండాడు రాజ్జివుండాది’ నవలను హడావిడిగా 1997లో పునర్ముద్రించారు. ఇతర నవలలు ఉండగా ఈ ఒక్క నవలనే ఎందుకు పునర్ముద్రించారు? ఇందులో మార్క్సిస్టులు మెచ్చే భావజాలం దన్నుగా ఉండటమే కారణం. పైగా ముందుమాటలో ‘సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకి ఆర్థిక అసమానతలే మూలకారణమనీ దానికి అంతిమ పరిష్కారం వర్గపోరాటమేననీ నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని చెప్పుకున్నారు. అప్పటికే ఆయన ‘చివరి గుడిసె’ రాసేయడం వల్ల అది వెలువడిందిగానీ ‘మూగవాని పిల్లనగ్రోవి’ విషయంలో అలా కార్నర్ చేయబడ్డందుకేనేమో పదేళ్లుపైగా నిశ్శబ్దమైపోయారు. 2008లో ‘మునెమ్మ’ వరకూ ఆయన కలం మూగబోయింది. ఇక ‘మునెమ్మ’ విషయంలో జరిగిన చర్చ తెలుగు విమర్శ కురచదనాన్ని మరింత తేటతెల్లం చేసింది. నేటి పెరుమాళ్మురుగన్ పరిస్థితి కేశవరెడ్డి 15 ఏళ్ల క్రితమే ఎదుర్కొన్నారు. - నున్నా నరేశ్, విమర్శకులు, ఫేస్బుక్ నుంచి వెన్నెల లాంటి మనిషి పుస్తకాలు పరిచయమై కనిపించినవాటినల్లా చదివేసే అలవాటున్న రోజుల్లో ఒకరోజు నాకు మా యింటి లైబ్రరీలో ‘అతడు అడవిని జయించాడు’ కనిపించింది. పుస్తకం తిరగేస్తుంటే బొమ్మలు ఆకర్షించాయ్. ఆ బొమ్మలు కేతినీడి భాస్కర్ గారివి. ఇంత అందమైన బొమ్మలున్న ఈ కథ యేమిటో చూడాలన్న కుతూహలం కలిగింది. చదివాను. మళ్లీ చదివాను. అందులోని ఆ అడవి ఆ వెన్నెల మరి నన్ను వదలకుండా పట్టుకున్నాయి. చలంగారి మైదానం మొదటిసారి చదివినప్పుడు అందులోని చింతచెట్టు అల్లిక నుంచి జల్లులు జల్లులుగా కురిసే మధ్యాహ్నపు ఎండ మైమరపించినట్టుగా ఈ నవలలోని అడవీ అడవిలోని వెన్నెల నడకలు హత్తుకున్నాయి. ఆ తరువాత చాలా కాలానికి కేశవరెడ్డిగారు పరిచయం అవ్వగానే ‘ఆ వెన్నెల అడవి భలే రాశారు’ అని చెప్పాను. ఆయన నవ్వారు. మళ్లీ నవ్వారు. నవ్వటం ఆపి ‘యింత అందంగా కొత్తగా ఆ పుస్తకం గురించి నాకు యెవ్వరూ చెప్పలేదు. ఇప్పటి వరకూ అంతా చాలా గంభీరమైన ఫీడ్‌బ్యాకే చెప్పారు’ అన్నారు. తన రచనల గురించి కానీ తన ఫలానా నవల చదివారా అని కానీ ఆయన అడగటం నేనైతే వినలేదు. మనకి అనిపించినవి చెపితే శ్రద్ధగా వింటారు. అవసరమైతే తప్పా తన రచనల గురించి మాటాడరు. అసలు మనం వో విశిష్టమైన సుసంపన్నమైన రచయితతో మాట్లాడుతున్నామనే భావన కలగదు. ఆయనెప్పుడూ యెదుటివాళ్ల మీదకి తనలోని రచయితకి సంబంధించిన బలం, బరువు అనే వలలని విసిరేయడం నేను చూడలేదు. వినలేదు. కేశవరెడ్డిగారు మనుష్యుల పట్ల మృదువుగా, ప్రేమగా వుంటూ ఆత్మీయంగా పలకరిస్తూ యెందరో అభిమానుల హృదయాలని జయించారు వెన్నెలంత తేటగా. - కుప్పిలి పద్మ, రచయిత్రి, సారంగ వెబ్జీన్ నుంచి పున్నా కృష్ణమూర్తి -
తెలంగాణలో రాస్తున్నది శిష్ట వ్యవహారికమే...
సంభాషణ తెలుగు సాహిత్యపు వృత్తలేఖిని డా.కడియాల రామమోహన్‌రాయ్. కవిత్వం-కథ-నవల-వ్యాసం-నాటకం... ప్రక్రియ ఏదైనా రచన కేంద్రికపై దృష్టినిలిపి వ్యాఖ్య చేయడం ఆయన విమర్శనా స్వభావం. శ్రీశ్రీ, దాశరథి, శేషేంద్ర, కాళోజీ, కొ.కు వంటివారితోనే కాదు ఆర్.కె.నారాయణన్ వంటి అన్యభాషా రచయితలతో కూడా స్నేహం కలిగి, వర్తమాన రచయితల పట్ల వాత్సల్యత ప్రదర్శించే అరుదైన సాహితీశీలి. గుంటూరు జిల్లా సిరిపురంలో 1944లో జన్మించిన డా. కడియాల ఏ.సి.కళాశాలలో ఏ.సి.కళాశాల, జేకేసి కళాశాలల్లో ఆచార్యునిగా పనిచేశారు. ‘తెలుగు సాహిత్యంలో కృషీవల జీవితం’కు అత్యుత్తమ పరిశోధకునిగా తూమాటి దోణప్ప గోల్డ్‌మెడల్ పొందారు. ఉత్తరాంధ్ర నవలా వికాసం, శేషేంద్ర కవిత్వం, సాహిత్య సంపద తదితర రచనలను విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా గౌరవించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన భారతీయ సాహిత్యపు ఎన్సైక్లోపీడియాలోని ఐదు వాల్యూంలలో 28 వ్యాసాలు కడియాలవే. వందేళ్ల తెలుగు నవలలపై పరిశోధనను అప్పాజోశ్యుల ఫౌండేషన్ ప్రచురించింది. 50 ఏళ్లుగా ఇండియాలో గొప్పనాటకాలు ఏమి వచ్చాయి? తెలుగు నాటకరంగం ఎలా ఉంది? అనే అంశాన్ని యూజీసి ప్రాజెక్ట్ తరఫున విశ్లేషిస్తోన్న డా. కడియాలతో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ సారాంశం: కొత్తగా ఏం చెప్పారు? వాదాలు అనేకాలు. జాతీయవాదం, అంతర్జాతీయవాదం, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం ఇలా... వాదం ఏదైనా ఆయా వాదాలు ప్రాంతాలవారికి తమ జీవితాల్లోని అవిస్మరణీయతను పాఠకులకు తెలిపాయి. కాని తెలుగు ప్రజల్లో కొన్నేళ్లుగా బలంగా విన్పించి విజయవంతం అయిన ప్రత్యేక తెలంగాణవాదం సాహితీపరంగా విఫలమైంది. తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని, ఆర్తిని ఇతర ప్రాంతాలవారికి తెలియజేయడంలో విఫలమైంది. తెలంగాణ నుంచి వచ్చిన భారీ పుస్తకాలు కొత్తగా వెలుగులోకి తెచ్చినదేమిటి? సాహిత్యాన్ని పరిపుష్ఠం చేసిన దాఖలా ఏది? తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన రచనలు ఇతర ప్రాంతాలవారిని తిట్టడం లేదా ద్వేషించడమే పనిగా వచ్చాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అభ్యుదయ సాహితీకారులు అనబడే వారు కూడా ఈ తిట్ల దండకంలో చేరడం. తెలంగాణ ముఖ్యమంత్రి యజ్ఞయాగాలు, వాస్తు శాస్త్రం గురించి అధికారికంగా మాట్లాడుతున్నారు. హరగోపాల్, ఘంటాచక్రపాణి, గద్దర్, విమల, వరవరరావు ఎవ్వరూ, ఒక్కళ్లునూ ఈ ధోరణులపై నోరెత్తి మాట్లాడ్డం లేదు. ఎవ్వరూ ప్రొటెస్ట్ చేయరే. ఇదొక చిత్రమైన మహామౌనం. ఇదంతా వారికి తృప్తిగా ఉందని భావించాలి కాబోలు! ఏ మాండలికం రాస్తున్నాం? తెలంగాణ మాండలీకాన్ని రచనల్లో, పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలనే ఉత్సుకత ఇటీవల బాగా వ్యక్తమవుతోంది. మంచిదే! అయితే తెలంగాణ మాండలీకాన్ని రాస్తోన్న తెలంగాణ రచయితలెందరు? తెలంగాణవాళ్లంతా రాస్తోంది కృష్ణాజిల్లా భాషే. ఎన్.వేణుగోపాల్ తదితరులందరూ శిష్టవ్యావహారీకులే. వీరెవరికీ పి.యశోదారెడ్డిగారిలా మాండలీకం రాదు. అప్పటి వరకూ రాస్తోన్న వాక్యాల్లో నాలుగు పదాలు చేర్చినంత మాత్రాన మాండలీకం అవుతుందా? ఆపాదించుకునే మాండలీకం వేరు జీవితంలోంచి వచ్చిన మాండలీకం వేరు. ఇదంతా హడావుడిగా అయ్యేది కాదు. సమిష్టి కషితోనే సాధ్యం. రాష్ట్రం వచ్చింది కాబట్టి అంతా హడావుడిగా మార్చేయాలనే వైఖరి సబబు కాదు. దాశరధి, నారాయణరెడ్డి, కాళోజీలను ఆంధ్రప్రాంతం తలదాల్చలేదా? ‘ఆంధ్ర’ అంటే బూతేనా? ఇదేం సబబు! ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను తెలంగాణ సాంఘిక చరిత్ర అంటారా? ఉద్వేగాల స్థానంలో సంయమనం ప్రవేశించాల్సిన సమయం ఇది! గొలుసు నవలలు ఒక ప్రత్యామ్నాయం మాండలీకం ప్రస్తావనను కేవలం తెలంగాణ దృష్టితో చెప్పడం లేదు. అన్ని ప్రాంతాల సాహితీ వేత్తలూ ఈ క్రమంలో కృషి చేయాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సరైన ఆధునిక నవల లేదు. ఈ ఆవశ్యకతను మాండలిక కోణం నుంచి కూడా తెలుగు సాహితీవేత్తలు గుర్తించాలి. భిన్న ప్రాంతాలనుంచి ప్రముఖ రచయితలను ఎంపిక చేసి వారి వారి ప్రాంతాలలో నిర్ణీత కాలవ్యవధిలోని జీవితాన్ని ఆయా ప్రాంతాల మాండలీకంలో రాసేందుకు సంకల్పించాలి. మూడు ప్రాంతాల మాండలికాన్నీ పాఠకులు గొలుసుకట్టు ఇతివృత్తంతో అవగాహన చేసుకునేందుకు ఉపకరిస్తుంది. చప్పగా ఉంది! మొత్తంగా తెలుగు సాహిత్యం పలుచబడింది. బలహీనమైంది. మీ ప్రాంతం నుంచి మీరు ఇటీవల విన్న సంతృప్తికరమైన కవిత గురించి చెప్పండి అంటే సరైన సమాధానం రావడం లేదు. ఒకటి బాగా రాస్తే పది చప్పగా వస్తున్నాయి అంటున్నారు. ఆంధ్రప్రాంతానికి చెందిన శివారెడ్డి వంటి కవులు తమ రచనల ప్రతిధ్వనులనే విన్పిస్తున్నారు. మానవ సంబంధాలలో ఆర్ధ్రతనే రాస్తున్నారు. శిల్పంమీద దృష్టి పెడుతున్నారు. జీవితాన్ని పట్టుకునే శ్రమకు సాహసించడం లేదు. వేంపల్లి గంగాధర్, షరీఫ్‌లు ‘ఆమోద యోగ్యత’కోసం తపనపడుతున్నారు. గతంలో కథలు విరివిగా వైవిధ్యంతో వచ్చేవి. ఇటీవలి కాలంలో వార్షిక సంకలనానికి ఎంచుదామంటే కథలు పదీ పరకా మాత్రమే వస్తున్నాయని వింటున్నాను. ఈ వాతావరణంలో పెద్దింటి అశోక్ కుమార్ భిన్నంగా కన్పిస్తున్నారు. ఆయన రచనల్లో స్పార్క్ ఉంది. ‘మాయిముంత’ ఎంత గొప్ప కథ! జీవితంలోకి వెళ్లి వచ్చేవారే అలా రాయగలరు! - పున్నా కృష్ణమూర్తి -
సీమ బతుకు చిత్రాన్ని బలంగా ఆవిష్కరించాలి
కర్నూలు(కల్చరల్): లుగు దశాబ్దాలుగా సాహితీ పూదోటకు ఆయన విశిష్ట వనమాలి. తెలుగు సాహిత్యంలోని కవిత్వం కథా ఝరులు ప్రవహిస్తున్న తీరు తెన్నులను పరిశీలిస్తూ.. తన కలంతో ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ విమర్శకుడిగా, ఉత్తమ విశ్లేషకుడిగా రాణించారు. చిత్తూరు జిల్లాలో పుట్టి, అనంతపురం విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠాలు చెప్పి, కర్నూలు జిల్లాతో వియ్యమంది, ఆత్మీయానుబంధం ఏర్పరచుకొని ప్రస్తుతం కడప వేమన యూనివర్శిటీ తెలుగు విభాగంలో తన సేవలనందిస్తున్నారు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. రాయలసీమ ప్రజల, ఆంధ్ర తెలుగు జనుల ఆత్మబంధువైన ఆయన ఉత్తమ సాహితీ విమర్శకు చిరునామా. తాను రచించిన మన తెలుగు నవలలు కథానికలు అనే విమర్శనా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమికి ఎంపికైన తొలి తెలుగు సాహితీవేత్తగా సీమ సాహితీ చరిత్ర పుటల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సలహా మండలి సభ్యులుగా, అనుభవజ్ఞులైన సాహితీ విమర్శకులుగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎందరెందరో శిష్య గణానికి ఉత్తమ అధ్యాపకులుగా డాక్టర్ రాచపాళెం తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించారు. శనివారం కర్నూలులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సీమస్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సాహిత్య విశేషాలు మీకోసం... ప్రశ్న: తెలుగు సాహిత్యంలో విమర్శకున్న ప్రాధాన్యత ఏమిటి? రాచపాళెం: సాహిత్యానికి విమర్శ టార్చ్‌లైట్ లాంటిది. మంచి విమర్శ ఉంటే అదే స్థాయిలో సాహితీ సృ జన జరుగుతుంటుంది. మంచి సాహిత్యం వస్తుంటే.. అలాంటి సమాజమే ఏర్పడుతుంది. ఏ అరమరికలు, వ్యత్యాసాలు లేని సామ్యవాద సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్య సృ జన జరగాలి. విమర్శ ఉత్తమ సాహితీ సృ జనకు దోహదపడుతుంది. ప్రశ్న: సాహిత్యం ద్వారా సామాజిక పరివర్తన జరుగుతుందన్నది వాస్తవమా! ఒక ఉదాహరణ ఇవ్వగలరా? రాచపాళెం : మంచికథ, మంచి నవల, మంచి కవిత చదివాక మనిషిలో మార్పు తప్పకుండా వస్తుంది. సాహిత్యం ద్వారా సామాజిక పరివర్తన జరుగుతుందన్నది వాస్తవం. ఉదాహరణకు.. దళిత సాహిత్యం వచ్చాక దళితులను చులకనగా చూడటం, స్త్రీవాదం వచ్చాక స్త్రీలను చులకనగా చూడడం తగ్గింది. అభ్యుదయ సాహిత్యం వచ్చాక శ్రామికుల పట్ల చిన్న చూపు తగ్గింది. సాహిత్యం మనుషులను మారుస్తుంది. ప్రశ్న : అస్తిత్వ వాదాలు ఎలా పుట్టుకొచ్చాయి? వాటివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? రాచపాళెం : అస్తిత్వవాదాలు సాహిత్యంలో అనివార్యంగా పుట్టుకొచ్చాయి. నిష్కారణంగా రాలేదు. మార్క్సిజాన్ని భారతీయ సామాజిక శక్తులకు అనుకూలంగా మలచడంలో మార్క్సిస్టు దృ క్పథంలో ఏర్పడ్డ వెలితిని భర్తీ చేసేందుకు అస్తిత్వవాదాలు వచ్చాయి. మన దేశంలో కులం బలమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఇక్కడ అంబేద్కరిజం, మార్క్సిజం సమానంగా పయనించాలి. దోపిడీని ప్రశ్నించాలి. వివక్షనూ ప్రశ్నించాలి. అస్తిత్వవాదాలు కొంత మేరకు విజయాన్ని సాధించాయి. ప్రశ్న : విభజన అనంతరం రాయలసీమ రచయితల బాధ్యత ఏమిటి? రాచపాళెం : విభజనానంతరం రాయలసీమ రచయితలు రెండు పాత్రలు పోషించాలి. తమ ప్రాదేశిక సమస్యలను చిత్రిస్తూ, తమ ప్రాంత అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు చేయాలి. ప్రత్యేక రాయలసీమ ఆవశ్యకతను, స్థితిగతుల తీవ్రతను కూడా చిత్రించాలి. సీమలో సాగునీరు తాగునీరు, కరువు, శ్రమదోపిడీ తదితర అంశాలకు సంబంధించిన సీమ బతుకు చిత్రాన్ని రచయితలు మరింత బలంగా ఆవిష్కరించాలి. ప్రశ్న: తెలుగు సాహిత్యంలో పాతతరం రచయితల రచనలే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి ? రాచపాళెం : సమాజం గురించి యువతను ఆలోచింపజేయకుండా చాలా శక్తులు అడ్డుకుంటున్నాయి. సామాజిక సమస్యల నుంచి ప్రస్తుత బూర్జువా రాజకీయాలు, సినిమాలు, టీవీ యువత దృష్టిని మళ్లిస్తున్నాయి. చదువుకున్న వెంటనే సులభ సంపాదనవైపు ఆకర్షించే కెరీరిజం పెంచే స్వార్థ పూరిత వ్యవస్థ యువతను కలుషితం చేస్తోంది. ఈ కుట్రను యువత గుర్తించి సాహిత్యాన్ని చదవడం అలవర్చుకోవాలి. సామాజిక సమస్యలు వాటి పరిష్కారం గురించి ఆలోచిస్తే యువ రచయితలు పుట్టుకొస్తారు. -
ఇదిగో.. శ్రీశ్రీ సాహితీ నిధి
26 వ విజయవాడ పుస్తక మహోత్సవం సమకాలీన సమాజంలోని రుగ్మతలను పారదోలి.. తన కలంతో వ్యవస్థలో మార్పు తేవడానికి నేనుసైతం అంటూ ముందుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అంతటి మహోన్నత వ్యక్తి సాహిత్యాన్ని నలుగురిలోకి తీసుకెళ్లి నవ వికాసం అడుగు కదిపారు ఓ అభిమాని. ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ పేరుతో ఓ సాహిత్య బులెటిన్‌ను నడపడమే కాదు.. పుస్తక మహోత్సవంలో శ్రీశ్రీ స్పెషల్ స్టాల్ ఏర్పాటుచేసి తన సాహిత్యాభిలాష తీర్చుకుంటున్నారాయన. వన్‌టౌన్ : ఆధునిక తెలుగు సాహిత్యంలో చెదరని ముద్ర వేసిన సుప్రసిద్ధ సాహితీవేత్త మహాకవి శ్రీశ్రీ. తన సాహిత్యంతో సామాజిక చైతన్యానికి బాటలు వేసిన మహోన్నత చైతన్య దీప్తి. తెలుగు అభ్యుదయ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొన్న మహాకవి మన నుంచి దూరమై దశాబ్దాలు గడిచినా ఆయన సాహిత్యం నిత్యం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. నేటి సమకాలీన సమాజంలో పాతుకుపోయిన అనేక రుగ్మతలను తన కలంతో ఎత్తిచూపి వ్యవస్థలో మార్పు కోసం పాటుపడిన సంఘ సంస్కర్త ఆయన. అటువంటి మహాకవి శ్రీశ్రీ సాహిత్యాన్ని ఇంకా విస్తృతం చేయడానికి తద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ పాటు పడుతోంది. నగరానికి చెందిన యువ సాహితీవేత్త సింగంపల్లి అశోక్‌కుమార్ ఈ సంస్థను స్థాపించి సాహితీ వికాసానికి ముఖ్యంగా శ్రీశ్రీ సాహితీ వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే 26వ విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటుచేసి శ్రీశ్రీ సాహితీ గ్రంథాలను సాహితీ ప్రియులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక బులెటిన్ నగరంలోని శ్రీశ్రీ సాహిత్య నిధి సంస్థ ప్రతి మూడు మాసాలకు శ్రీశ్రీ రచనలతో ఒక సాహిత్య బులెటిన్‌ను ప్రచురిస్తోంది. దానిని శ్రీశ్రీ అభిమానులకు ఉచితంగా అందిస్తున్నారు. అయితే, పోస్టల్ ఖర్చుల నిమిత్తం వంద రూపాయలను సంస్థకు చెల్లించి బులెటిన్ పొందవచ్చు. ఈ బులెటిన్‌ను అందుకుంటున్న వారి సంఖ్య ఇటీవలే నాలుగు వేలకు చేరింది. ప్రతి మూడు మాసాలకోసారి శ్రీశ్రీ సాహిత్యంపై నాలుగు పుస్తకాలను సైతం ఈ సంస్థ ప్రచురిస్తోంది. ఒకసారి వెయ్యి రూపాయలు చెల్లిస్తే విడతలవారీగా 50 పుస్తకాల వరకు అందజేస్తారు. ఇప్పటివరకు ఈ సంస్థ 30 బులెటిన్స్‌ను, 60 పుస్తకాలను తీసుకొచ్చింది. పుస్తక మహోత్సవంలోని స్టాల్ నంబరు 197లో కొలువుదీరిన శ్రీశ్రీ సాహిత్య నిధి కొలువులో పలు శ్రీశ్రీ సాహితీ గ్రంథాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా అభ్యుదయ సాహిత్యంలో అద్భుతమైన ప్రశంసలు పొందిన శ్రీశ్రీ మహాప్రస్థానానికి అపూర్వమైన ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు ‘సాక్షి’కి తెలిపారు. సామాజిక చైతన్యం కోసం కృషి శ్రీశ్రీ సాహిత్యం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ సమకాలీన సామాజిక పరిస్థితులను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. శ్రీశ్రీ సాహిత్యం కేవలం ప్రచురణలకే పరిమితం కాకుండా సామాజిక చైతన్యానికి కూడా పాటు పడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అందుకే ఆయన సాహిత్యం నేటి వ్యవస్థకు మరింత అవసరమని భావిస్తున్నా. అనేక మంది మిత్రులు, సాహితీమూర్తుల సహకారంతో శ్రీశ్రీ సాహిత్య నిధిని ముందుకు తీసుకెళ్తున్నా. - సింగంపల్లి అశోక్‌కుమార్, శ్రీశ్రీ సాహిత్య నిధి వ్యవస్థాపకుడు -
సాహితీ మేరువు ‘జీవీ’
నేడు జీవీ కృష్ణరావు శతజయంత్యుత్సవం తెలుగు సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ తన విశి ష్టతను చాటిన సాహితీ మేరువు జీవీ కృష్ణరావు,. ఆయన సునిశిత పరిశీలన నుంచి తప్పించుకున్న సాహిత్య వస్తువేదీ లేకపోవటం విశేషం. డాక్టర్ జీవీ కృష్ణరావు పూర్తి పేరు గవిని వెంకట కృష్ణరావు. తెనాలి సమీపంలోని కూచిపూడి ఆయన స్వస్థలం. సాధారణ రైతు కుటుంబంలో 1914 నవంబర్ 15న జన్మించారు. గ్రామంలో ప్రాథమిక విద్య, దగ్గర్లోని తురుమెళ్లలోని జార్జి కారొనేషన్ హైస్కూలు విద్య చదివారు. అప్పటికే ఆయనకు కవిత్వం అలవడిం ది. గుంటూరు ఏసీ కాలేజీలో తెలుగు ప్రత్యేక పాఠ్యాంశంగా బీఏ చదివారు. ఆ రోజుల్లోనే ‘వరూ ధిని’ ఖండకావ్యం రాశారు. ఆంధ్ర సాహిత్యంతో పాటు సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లోని ఔచిత్యా లను గుర్తెరిగి ‘సునీధ’ వంటి నాటికలు రాశారు. కాశీలో ఎంఏ ఇంగ్లిష్ సాహిత్య అధ్యయనం ప్రారం భించారు. ప్లేటో, అరిస్టాటిల్, కాంటే, హ్యూమ్, హెగెల్ల దర్శనాలను, పాశ్చాత్య కావ్యాలు, కావ్యా నుశాసనాలు, ప్రాచీన భారత దర్శనాలను ఔపోసన పడుతూ వచ్చారు. బనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం ఫలంగా ‘కావ్యజగత్తు’ అవతరిం చింది. ఆర్థిక సమస్యతో ఇంటికి తిరి గొచ్చారు. గుంటూరులో ‘దేశాభిమాని’ పత్రికలో కొంత కాలం పనిచేసి బయట పడ్డారు. మిత్రులతో కలసి ప్రజాసా హిత్య పరిషత్తు పేరుతో ప్రచురణ సం స్థను, ‘సమీక్ష’ పేరుతో పత్రికను స్థాపిం చారు. అనంతరం ‘ఆంధ్రప్రభ’లో సబ్ ఎడిటర్‌గా చేరారు. నార్ల, శ్రీశ్రీతో పని చేశారు. ‘జఘనసుందరి’ నవల అప్పు డు వెలువడింది. తెనాలిలో చక్రపాణి, కొడవటిగంటి, త్రిపుర నేని గోపీచంద్ వంటి రచయితల సాంగత్యంతో కృష్ణరావుకు ఇంగ్లిష్ సాహిత్యాభిలాషే కాకుండా ఎంఎన్ రాయ్ రచనలపై ఆకర్షణ, మార్క్సిస్టు దృక్పథం అలవడ్డాయి. ‘లోకం కోసం ఏడిస్తే అది కవిత్వం, తన కోసం ఏడిస్తే స్వార్థం, తన కోసం, లోకం కోసం ఏడిస్తే అది ధర్మం, రెండింటి కోసం ఏడ్చినట్లు నటిస్తే అది రాజకీయం’ అంటూ కవిత్వ ప్రయోజనాన్ని విడమరిచి చెప్పిన కృష్ణ రావు, తన రచనల్లో సమాజాన్ని ప్రతి బింబిస్తూ వచ్చారు. కొద్దికాలం తర్వాత పత్రికా రంగానికి కూడా ఉద్వాసన పలి కారు. మళ్లీ చదువుబాట పట్టి, పీజీ చద వకుండానే పీహెచ్డీ డిగ్రీ కోసం మద్రాస్ (చెన్నై)లో పరిశోధన చేశారు. సింగళి సూరన ‘కళాపూర్ణోదయం’పై ఇంగ్లిష్‌లో బృహద్గ్రంథాన్ని వెలువరిం చారు. తెలుగు క్లాసిక్‌గా గుర్తింపు పొం దిన ‘కీలుబొమ్మలు’ నవలను పూర్తి చేశారు. ప్లేటో తాత్విక విచారాన్ని విపులీకరిస్తూ ‘జేగంటలు’ రాశారు. 1952లో తెనాలిలో వీఎస్ఆర్ కాలేజీలో అధ్యాపక వృత్తిలో చేరారు. పదేళ్ల తర్వాత ఆ ఉద్యో గానికి రాజీనామా చేశారు. 1963లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరి 1973లో ఉద్యోగ విర మణ చేసేవరకు పనిచేశారు. సాహిత్య వ్యాసంగాన్ని మాత్రం జీవితకాలం కొనసాగించారు. తెలుగు భాషా సంప్రదాయానికనుగుణంగా పుల్‌స్టాప్‌లు, కామాలు, కోలన్లు లేకుండా ‘యుగసంధ్య’ పద్యకావ్యం రాశారు. ప్రజలందరికీ అన్నం పెట్టలేని ఈ వ్యవస్థపై ‘భిక్షాపాత్ర’ నాటికతో తిరుగుబాటు చేశారు. ‘బొమ్మ ఏడ్చింది’ వంటి ఎన్నో రచనలు చేశారు. పాఠకుని పెదిమ విరియ టం, కన్ను కురియటం జరిగినప్పుడే రచన సార్థకం అవుతుందనీ, అదే ఉత్తమ కృతి అనీ, అలా కాన పుడు ఆ రచన బొందు వేసిన పైరు అవుతుందని చెప్పుకున్నారు. 1979 ఆగస్టు 23న ఆయన సన్ని హితుడు అనపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కృష్ణరావు రచ నలను ఏర్చికూర్చి ఏడు సంపుటాలుగా వెలువరిం చి పాఠకులకు అందుబాటులో ఉంచారు. డాక్టర్ జీవీ కృష్ణరావు సాహిత్య సమాలోచన, జీవీకే మర ణానంతరం 1980లో తీసుకొచ్చిన ‘సాహితీ చైత్ర రథం’ పుస్తకాన్ని ఆయన కుటుంబం 2013లో పున ర్ముద్రించింది. నవంబర్ 15న ఆయన జన్మస్థలమైన కూచిపూడిలో, 16న తెనాలిలో జీవీకే శతజయంతిని నిర్వహించనున్నారు. బి.ఎల్.నారాయణ సీనియర్ జర్నలిస్టు, తెనాలి -
ఆడడం ఆనందం...గెలవడం బోనస్!
ఒక తరానికి ఆయన ప్రయోగాత్మక నాటక రచయిత... మరో తరానికి పాపులర్ నవలా రచయిత... అటుపైన పేరుతెచ్చుకున్న సినీస్క్రిప్ట్ రైటర్... ఇవాళ్టి తరానికి ఒక వ్యక్తిత్వ వికాస బోధకుడు, జీవన విధానపు కౌన్సెలర్... కాలానికి తగ్గట్లుగా ఆలోచననూ, అక్షరాన్నీ మలుచుకొని, ప్రతి విషయంలో పదేళ్ళు ముందుండడం యండమూరి వీరేంద్రనాథ్ ప్రత్యేకత. 1980ల నుంచి తెలుగు సాహిత్యంలో లక్షల కొద్దీ కాపీలు... కోట్ల రూపాయల అమ్మకాలు జరిగిన ‘మోస్ట్ పాపులర్ రైటర్’గా అభిమానుల ప్రశంసలూ ఆయనకే! మూడు దశాబ్దాల క్రితం సీరియల్ పాఠకులను ఊపేసిన ‘తులసిదళం’, ‘తులసి’నే దృష్టిలో పెట్టుకొని ‘క్షుద్ర సాహిత్య రచయిత’గా గిట్టనివర్గాల ఈసడింపులూ ఆయనకే! విజేతగా కీర్తించినా, విమర్శించినా - విస్మరించలేని విశిష్ట పాళీ, అక్షరాల మోళీ యండమూరిది. స్వయంకృషితో నిజజీవితంలో ‘విజయానికి అయిదు మెట్లు’ వేసుకున్న ఎవర్గ్రీన్ యండమూరి 66వ పుట్టినరోజు సందర్భంగా విజయం వైపు పయనించిన ఆయన అంతరంగంలోకి ‘సాక్షి ఫ్యామిలీ’ ప్రయాణం... మీ కోసం... ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అరవై ఆరేళ్ళు నిండిన ఈ సమయంలో ఒక్కసారిగా వెనక్కి తిరిగిచూసుకుంటే కలుగుతున్న భావాలు? (నవ్వేస్తూ...) మనిషి గెలుపు నిరంతరం. అంతే తప్ప, ఒక మజిలీలో ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడమనేది నేను నమ్మను. చాలామంది 30 - 40 ఏళ్ళకే తృప్తిపడిపోతారు. జీవించడం మానేసి, బతకడం మొదలుపెడతారు. అది తప్పు. పని చేస్తున్నకొద్దీ రాటుదేలేది ఒక్క మెదడే. ‘ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎంత తొందరగా ప్రారంభించామన్నది ముఖ్యం’ అంటా. తొందరగా ప్రారంభించడమంటే...? దాని అంతరార్థం కొద్దిగా వివరిస్తారా? జీవితంలో డబ్బు, కీర్తి, జ్ఞానం - వీటి సముపార్జన తొందరగా ప్రారంభించాలి. నా దృష్టిలో మనిషికి కావాల్సినవి షడ్గుణ ఐశ్వర్యాలు. ఆ 6 ఏమిటంటే - ఆరోగ్యం, కీర్తి, డబ్బు, జ్ఞానం, ప్రేమ, ఉత్సాహం. ఈ ఆరూ ఉంటే, జీవితం సఫలమైనట్లే. వీటి కోసం ఎంత చిన్న వయసులో ప్రయత్నం ప్రారంభిస్తే, అంత తొందరగా జీవితంలో విజయం వైపు పయనిస్తాం. మీ జీవితం గమనిస్తే, చిన్నప్పుడే మీరు ఆ ప్రయత్నం ప్రారంభించినట్లున్నారు. అవును. జీవితంలో కృషి చేయడమంటే ఏమిటో మా నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఆయనకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడే మా తాత గారు చనిపోయారు. మా నాన్న గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. అమ్మానాన్న, నలుగురు పిల్లలం చిన్న ఇంట్లో సర్దుకొన్న రోజులు నాకింకా గుర్తే. అందుకే, చిన్నప్పటి నుంచి స్వయంకృషితో పైకి వచ్చేందుకు కృషి చేశా. మీరు చాలా కష్టపడి చదువుకున్నారట! (మధ్యలోనే అందుకుంటూ...) కష్టం అనకండి... కృషి అనండి! జీవితంలో ఏ పని చేసినా, ఆ పని ఆనందంగా చేయాలి. దాన్ని ఆస్వాదించాలి. అప్పుడు కష్టం, బాధ ఉండవు. అందుకే, ‘ఆడడం ఆనందం. గెలవడం బోనస్’ అని చెబుతుంటా! చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగా. బంధువుల దగ్గర వాళ్ళ ఇళ్ళలో ఉంటూ, వేర్వేరు ఊళ్ళలో చదువుకున్నా. ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి, స్కూల్లో చదువుకుంటున్నప్పుడే చిన్న తరగతులకు ట్యూషన్లు చెప్పి, సంపాదించా. నా తొలి సంపాదనతో మా అమ్మకు చిన్న ట్రాన్సిస్టర్ కొనివ్వడం, ఆమె ఆనందం - ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో మీ జీవితం ఎలా గడవాలనుకొనేవారు? కాకినాడ పి.ఆర్. కాలేజ్‌లో బి.కామ్ చదువుతున్న రోజుల్లో నెలకు వెయ్యి సంపాదిస్తే చాలనుకున్నా. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. రచయితనయ్యాక కూడా లక్షరూపాయలు సంపాదించి, బ్యాంకులో వేస్తే వచ్చే వెయ్యి రూపాయల వడ్డీతో దర్జాగా బతికేయాలని భావించా. మా పబ్లిషర్‌కు చెబితే, ఆయన నవ్వేసి, ‘మీరు ఒకటి కాదు మూడు బిల్డింగ్లు కడతారు... చూడండి’ అన్నారు. నిర్ణీత మొత్తం సంపాదించాలని ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు. కాకపోతే, సౌకర్యంగా బతకాలని అనుకున్నా. అంతే! అసలు, తొలి రోజుల్లో మీకు రచన వైపు ఆసక్తి ఎలా కలిగింది? మా నాన్న గారు యండమూరి చక్రపాణి మంచి కవి. మూడు, నాలుగు పుస్తకాలు కూడా రాశారు. మా తాతయ్య (అమ్మ గారి నాన్న గారు) రావిపాటి సత్యనారాయణ రచయిత. మా మేనమామ వేణుగోపాలరావు కూడా రాసేవారు. ఆ జీన్స్ నాకు వచ్చినట్లున్నాయి. మేనమామ ప్రోత్సాహంతో ‘చందమామ’లో కథలు రాయడంతో నా రచనా జీవితం మొదలైంది. నవలల కన్నా ముందు నాటకాల్లో కృషి చేసిన రోజులు గుర్తుచేసుకుంటారా? సి.ఏ. చదువుతున్నప్పుడు 1969లో రాసిన ‘గులకరాళ్ళు - గులాబీముళ్ళు’ నా తొలి నాటిక. నన్ను రచయితగా తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు, నేను, నటుడు సుబ్బరాయశర్మ కలసి ఒక బృందంగా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళం. నాటకం రాయడం, వేయడం ఒక ఉద్యమంలా సాగేది. ‘మరో మొహంజొదారో’ లాంటివి మినహా, తెలుగు రంగస్థలంపై ప్రయోగాలు తక్కువైన రోజుల్లోనే మీరు రాసిన ‘కుక్క’ గురించి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. (నవ్వుతూ...) ‘కుక్క’ నాటకం ఓ సంచలనం. అలాగే, ‘రుద్రవీణ’ ఆధునిక యక్షగానం. ‘మనుషులొస్తున్నారు జాగ్రత్త’, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’ లాంటివన్నీ పేరు తెచ్చినవే. ఎగ్జిబిషనిజమ్ మీద, బ్రెహ్ట్ చెప్పిన ఏలియన్ థీరీ మీద, అలాగే అబ్సర్డ్ నాటికలు - ఇలా రకరకాల ప్రయోగాలు చేశా. అప్పట్లో రంగస్థలంపై మెలోడ్రామాగా నాటకాలు నడిచేవి. వాటికే బహుమతులూ వచ్చేవి. ఇవన్నీ చూసి ‘చీమ కుట్టిన నాటకం’ పేరుతో మెలోడ్రామా మీద పూర్తి వ్యంగ్యంగా నాటకం రాశా. అదీ చర్చ రేపింది. ‘రఘుపతి రాఘవ రాజారామ్’ నాటకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డొచ్చింది. మరి, నాటకాల్లో అంత కృషి చేసి, నవలల వైపు ఎందుకు మళ్ళారు? ‘చీమ కుట్టిన నాటకం’ రాశాక, ఇక నాకు ఎప్పటిలా మామూలు నాటకాలు రాయాలనిపించ లేదు. పైగా నేను, రచయితలు జంధ్యాల, పరుచూరి బ్రదర్స్ పరిషత్తు నాటకాల్లో పోటీలు పడుతుండేవాళ్ళం. రాజమండ్రి ‘లలిత కళానికేతన్’లో మా మధ్య గట్టిపోటీ ఉండేది. వాళ్ళిద్దరూ సినిమా రంగానికి వెళ్ళిపోయాక నవలా రచన వైపు మొగ్గా. 500 మంది చూసే నాటకం కోసం ఇంత శ్రమ పడే కన్నా, అదే శ్రమతో అంతకన్నా ఎక్కువ మందికి నవల ద్వారా చేరవచ్చనిపించింది. ‘నాటకం కన్నా నవల రాయడం కష్టమ’ని ఎవరో చేసిన విమర్శతో 1977లో ‘ఋషి’తో నవలా రచన మొదలుపెట్టా. ప్రొఫెషనల్ రైటరై, ‘తులసిదళం’తో కీర్తీ, అపకీర్తీ కూడా మూటగట్టుకున్నారు! (కొద్దిగా హెచ్చు స్వరంలో...) నా పుస్తకాన్ని పది మంది కొంటే ప్రొఫెషనల్ రైటర్ అంటారు. ఎవరూ కొనకపోతే సీరియస్ రైటర్ అంటారు. నలుగురూ కొని, చదివే పుస్తకాలు రాస్తే, వెంటనే ‘కమర్షియల్ రైటర్’ అనే ముద్ర వేసేస్తారు. చాలామంది ఆర్ట్ సినిమాల్లో చేసే వారి కన్నా అమితాబ్ మంచి నటుడు. కానీ, ఏం లాభం? అతనికి కమర్షియల్ చిత్రాల నటుడనే ముద్ర వేసేస్తాం. నా మీదే అంతే! ‘అంతర్ముఖం’ నవల యండమూరి కాకుండా, మరొకరు రాసి ఉంటే నెత్తి మీద పెట్టుకొని ఊరేగేవాళ్ళు. నేను రాశా కాబట్టి, మాట్లాడరు. నా 50 నవలల్లో ఒక్కటైన ‘తులసిదళం’ గురించే ప్రస్తావిస్తారు. ‘ఎస్! యండమూరి ఎరైవ్డ్’ అని మీకెప్పుడనిపించింది? ‘తులసిదళం’తోనా? ఆ మాట అప్పుడు, ఇప్పుడు - ఎప్పుడూ అనుకోను. వారం వారం పాఠకులు ‘తులసిదళం’ సీరియల్ కోసం ఊగిపోతున్నారనీ, అది అంత సంచలనమనీ అప్పట్లో నాకు తెలీను కూడా తెలీదు. ‘తులసిదళం’కి నాకిచ్చిన పారితోషికం రూ. 3 వేలు. ‘తులసి’కి 5 వేలు. అంతే! సీరియల్ వల్ల పత్రిక సర్క్యులేషన్ పెరుగుతోందని తెలుసు కానీ, ఇంత సంచలనం సృష్టిస్తోందని తెలియదు. తెలిస్తే పారితోషికం భారీగా అడిగి ఉండేవాణ్ణి కదా! చేతబడుల గ్రామాలు నిజంగా చూసి, రిసెర్చ్ చేసి మరీ అవి రాసినట్లున్నారు? ‘తులసిదళం’ కన్నా ముందే ‘పర్ణశాల’లో రొయ్యల వ్యాపారం గురించి, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’లో సంగీతం గురించి తెలుసుకొని రాశా. క్యాన్సర్‌పై రాసిన ‘ప్రార్థన’కూ అంతే! ఆ మాటకొస్తే, ప్రతి రచనకూ రిసెర్చ్ చేస్తా. (వ్యంగ్యంగా...) అప్పుడు అడగలేదేం ఈ ప్రశ్న. ఒక్క ‘తులసిదళం’కే అడుగుతారేం? నా కన్నా ముందు విశ్వనాథ సత్యనారాయణ ‘బాణామతి’ రాశారు. అదింత ప్రాచుర్యం పొందలేదు. నాది పాపులరయ్యేసరికి గొడవ! అసలు ‘తులసిదళం’ నవలలకు ప్రేరణేంటి? బ్యాంక్ పని మీద ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రామంలో చూసిన సంఘటనలు, అక్కడ తెలుసుకున్న విషయాలు నాలో ఆలోచన రేపాయి. అప్పటికే వచ్చిన ‘ఎగ్జార్సిస్ట్’, ‘ఓమెన్’ లాంటి హారర్ చిత్రాల ప్రేరణతో అప్పుడీ నవలలు రాశా. అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళనూ చూశా. అదంతా వట్టి బూటకమని గ్రహించా. అదే రాశా. కాకపోతే, ఆ నవలల వల్ల కొందరిలో మూఢనమ్మకాలు పెరగడం, కొంత నష్టం జరగడం నిజమే. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ అలాంటి నవలలు రాయమంటే రాస్తారా? కోట్లిస్తానన్నా సరే, రాయను. అప్పట్లోనే ‘రెండు లక్షలిస్తా.. అలాంటి నవల రాయ’మని సంపాదకుడు కందనాతి చెన్నారెడ్డి అడిగినా, నిరాకరించా. వాటికి అప్పట్లో క్రేజ్ కానీ, నా బెస్ట్ సెల్లర్స్ ‘వెన్నెల్లో ఆడపిల్ల’ లాంటివే! కానీ, ‘తులసిదళం’ ప్రేరణతో చాలా వచ్చాయి. మీ ‘వేపమండలు’ కూడా! (నవ్వుతూ...) నిజమే. ‘తులసిదళం’కి పేరడీగానే ‘వెన్నెలకంటి వసంతసేన’ లాంటి పేరుతో ‘వేపమండలు’ రాశా. కామెడీ రాయలేనన్న వారికీ, ఆ గొడవకూ నా జవాబు ఆ రచన. ఒక్క ముక్కలో, ‘తులసిదళం’ చందమామ కథ. రాకుమార్తె, రాక్షసుడు బదులు పసిపాప, మాంత్రికుడు పాత్రలు పెట్టా. మీరేమన్నా, అప్పట్లో మీపై ‘క్షుద్ర సాహిత్యకారుడ’నే ముద్ర బలంగానే పడింది. చాలామంది రచయితలకున్న ‘కంఫర్ట్ జోన్’ను బద్దలు కొట్టడంతో, అసూయతో నా మీద వేసిన ముద్ర అది. ‘తులసిదళం’ బాగా సక్సెస్ కావడంతో అందరూ దుమ్మెత్తిపోశారు. దాంతో, రకరకాల నవలలు రాసి, విమర్శకుల నోళ్ళు మూయించా. ‘అంతర్ముఖం’ లాంటివి రాసింది అందుకే! ఆ పాపులర్ నవలా శకంలో ఆఖరు యోధుడు మీరే అనుకోవచ్చా? పాపులర్ నవలా రచనా శకం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరి నవలలూ మునుపటిలా అమ్ముడవడం లేదు. అయితే, నవలా శకం యోధుల్లో ఆఖరువాణ్ణి నేను కాదు కానీ, ఆఖరు వాళ్ళలో నేనూ ఒకణ్ణి! ఒకప్పుడు కొవ్వలి లాగా నా రచనలూ తెలుగునాట కొత్త పాఠకుల్ని సృష్టించాయి. పాపులర్ సాహిత్యంతో కాకపోతే, నవలల ద్వారా వచ్చిన పాపులారిటీ కన్నా ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘పవిత్ర’ లాంటి చిత్రాల్లో నటించడం ద్వారా వచ్చింది ఎక్కువ. జనం నన్ను చూడగానే గుర్తుపట్టడం పెరిగింది. మీ నవలలు చాలా సినిమాలుగా వచ్చాయి. మీరు స్క్రిప్టులూ రాసేవారు. ఇటీవల అవి రావడం, మీరు రాయడం కూడా తగ్గిందే? రచయితకు అభిప్రాయాలు, సిద్ధాంతాలు నిర్దిష్టమై, స్పష్టమవుతున్న కొద్దీ సామాన్య పాఠకుల్ని కోల్పోతాడు. ఒకప్పటిలా ప్రేయసీ ప్రియుల కబుర్ల లాంటి స్టుపిడ్ చెత్త రాయలేడు. అందుకే, నేను నవలల నుంచి వ్యక్తిత్వ వికాస రచనల వైపు మళ్ళాను. బి.వి. పట్టాభిరావ్ు ప్రోత్సాహంతో వ్యక్తిత్వ వికాస బోధకుణ్ణయ్యా. ఇక, మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’కు మాటల రచయితగా మొదలైన నా సినిమా ప్రస్థానం మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ అవుతుంది. నిర్మాత కె.ఎస్. రామారావు లేకపోతే, సినిమాల్లో యండమూరి లేడు. మారిన కాలంలో ఇప్పటి దర్శక, నిర్మాతలు పిలవడమూ లేదు. నేను రాయడమూ లేదు. ‘అనామిక’ లాంటి వాటికి అరుదుగా పనిచేస్తున్నా. టీవీ దర్శకుడిగా అవార్డులందుకున్న మీరు సినీ దర్శకుడిగా ఫెయిలయ్యారే? సినీ దర్శకత్వానికి చాలా ఓర్పు ఉండాలి. చాలా అంశాలు లెక్కలోకి తీసుకోవాలి. నాకు పోటీదారులు ఎవరూ లేరు! - యండమూరి కానీ, టీవీలో మనకు నచ్చినట్లు తీసుకోవచ్చు. ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘తులసిదళం’, ‘ప్రియురాలు పిలిచె’, ‘భార్యా గుణవతీ శత్రుః’ నవలలకు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం ఆనందాన్నిచ్చింది. మీ నవలలకూ, మీకూ కన్నడంలో బ్రహ్మరథం పడతారని విన్నాం? నిజమే. దక్షిణాది భాషలన్నిటిలోకీ నా రచనలు వెళ్ళినా, కన్నడంలో నాకు మరీ క్రేజ్. ఇంకా చెప్పాలంటే, తెలుగులో కన్నా ఎక్కువ. ‘లోయ నుంచి శిఖరానికి’ రచన పది రోజుల క్రితమే కన్నడంలో వచ్చింది. ఈ వారం టాప్10 కన్నడ బుక్స్‌లో మొదటి స్థానంలో ఉంది. మీ నవలల్లో సిడ్నీ షెల్డన్ లాంటి వారు అంతర్లీనంగా ఎంత ఉన్నారు? జేమ్స్ హ్యాడ్లీ ఛేజ్ నాకూ, నా శైలికీ ప్రేరణ. ఆంగ్ల నవలల ప్రేరణతో రచన చేసినప్పుడు ఆ సంగతి నా నవలల ముందు పేజీలోనే చెప్పేశా. మరి, మీ వ్యక్తిత్వ బుక్స్‌లో మీ పాలెంత? కార్నెగీ వగైరాల భాగమెంత? స్టీఫెన్ కోవే ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస రచన ‘7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ ప్రేరణతో ‘విజయానికి 5 మెట్లు’ అని పేరుపెట్టా. అంతే! విజయవాడలో మీ అభిమాని జ్యోతి అనుమానాస్పద మరణం... (మధ్యలోనే అందుకుంటూ) అది ముగిసిన కథ. ఆ సంగతి తెలిసిన వాళ్ళు ముసలివాళ్ళయిపోయారు. నా ప్రమేయం లేని మరణం గురించి కొందరు చేసిన రచ్చను ఇవాళ్టికీ ప్రస్తావించడం సెన్సేషన్ కోసమే! ఇంతకీ, మీ జీవన సిద్ధాంతం ఏమిటి? ఇంకొకరికి నష్టం లేకుండా నాకు నచ్చిన విధంగా నేను బతకడం! అదే నా ఫిలాసఫీ. మనం ఏం చేసినా అందరికీ నచ్చం. కాబట్టి, ఇతరులకు నచ్చేలా బతకాలనుకోవడం వృథా. మరి, మీ రచనా సిద్ధాంతం మాటేమిటి? మొదట కమ్యూనిస్టు భావాలతో ఉండేవాణ్ణి. పోనూపోనూ అది ఒక ఊహాస్వర్గం అనిపించింది. ఆ తరువాత క్రమంలో అతి బీదరికం స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరడమనే (ర్యాగ్స్ టు రిచెస్) భావన, ఆ ఉదాహరణలు ప్రేరణనిచ్చాయి. అప్పటి నుంచి నా రచనలు దాని మీదే నడుస్తున్నాయి. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కానీ, బీదవాడిగానే మరణించడం తప్పు’ అని నేను అనేది అందుకే! డబ్బు లేకపోవడం ఒక రకంగా వరం. జీవితంలో పైకి రావడానికి కసితో పనిచేస్తాం. ‘భగవద్గీత’ను ప్రస్తావిస్తున్నారు. కానీ, ఇది మెటీరియలిస్టిక్‌గా లేదూ! నన్నడిగితే, అసలు భగవద్గీత చెప్పిందే పెద్ద మెటీరియలిజమ్. ‘భవబంధాలు తెంచుకో! చంపాల్సి వస్తే చంపెయ్! కర్తవ్యం నిర్వర్తించడం ముఖ్యం’ అనేగా భగవద్గీత చెప్పింది. అందుకే, పిల్లలకు నేనెప్పుడూ చెప్పేది - ‘చదవడమనేది ఆనందం. దాన్ని ఆస్వాదించండి. పాసవడం, ర్యాంక్ రావడం బోనస్. దానంతట అది జరుగుతుంది.’ మీ ఇల్లు, సౌండ్ ప్రూఫ్ స్టడీరూమ్, బెడ్ రూమ్ కళాత్మకంగా ఉన్నాయే! 1982లో ఈ ఇల్లు కట్టుకున్నా. ఈ డిజైనింగ్, కలర్స అంతా నా ఆలోచనే! జీవితంలో చాలా చిన్న విషయాలకు కూడా ఆనందిస్తుంటా. (పక్కనే ఉన్న పార్కులో చెట్లు చూపిస్తూ...) చెట్లంటే నాకిష్టం. ఈ పార్కులోని చెట్లు, ఈ సందులోకి వస్తుంటే రోడ్డుపై కనిపించే చెట్లు నేను నాటినవే. ఇంట్లో పక్షులు, అక్వేరియమ్‌లో చేపలు పెంచుతా. స్మార్ట్ ఫోన్ల యుగంలోనూ బేసిక్ ఫోన్ దగ్గరే ఉన్నారేం? అవసరం తీరాలి. అదే సమయంలో సౌకర్యం ఉండాలి. అంతకు మించి ఎందుకు? పెద్ద కారు, సొంత ఇల్లు, ఏసీ, అవసరాలు తీర్చేంత ఆదాయం ఉన్నాయి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నాకు... ఫోన్ మాట్లాడుకోవడానికే! దానికి ఇది చాలు కదా! అవసరాలు తీరగా మిగిలిన డబ్బుతో 2006లో కాకినాడ దగ్గర ‘సరస్వతీ విద్యాపీఠం’ పెట్టింది అందుకే! పేద స్కూళ్ళలో చదివే విద్యార్థుల్ని రప్పించి, ఆత్మవిశ్వాసం పెంచి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆనందం ఉంది. మీ జీవితంలో మీరు మర్చిపోలేని వ్యక్తులు... నా మీద ప్రభావం చూపిన మా నాన్న గారు. నాలో ఒక రచయిత ఉన్నాడని గుర్తించి, తొలి రోజుల్లోనే నా నాటికలు, రచనలు వేసిన అప్పటి పత్రికా సంపాదకుడు, ప్రతిభ ఎక్కడున్నా పసిగట్టి ప్రోత్సహించే వ్యక్తి - పురాణం సుబ్రహ్మణ్యశర్మ. నాటకాలు ప్రదర్శించే రోజుల్లో వెన్నంటి ఉండి, నన్ను తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు. కానీ, స్టార్ రచయితగా మీకు, అలాగే మరికొందరు కాలమిస్ట్‌లకు పేరు రావడానికి ‘ఆంధ్రభూమి’ వీక్లీ సంపాదకుడు సి.క.రాజు కారణమేమో? నిజమే. సి. కనకాంబరరాజు ఆ పని చేశారు. అయితే, అది నా వల్ల పత్రికకూ, పత్రిక వల్ల నాకూ పరస్పర ప్రయోజనం ఉందని చేపట్టిన పని. ఇద్దరం లాభపడ్డాం. కానీ, పురాణం గారికి అది లేదు. మంచి రచయిత ఎక్కడున్నా, ప్రతిభను ప్రోత్సహించేవారు. నా తొలి నాటిక ‘గులకరాళ్ళు- గులాబీముళ్ళు’ను ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఆయనే వేశారు. మీ తోబుట్టువుల సంగతి ... మేము నలుగురు అన్నదమ్ములం. నేను అందరి కన్నా పెద్ద. సాహిత్యాభిమానం, బెంగాలీ సాహిత్య ప్రభావంతో మా నాన్న గారు మా అందరికీ ఆ తరహా పేర్లు పెట్టారు. పెద్ద తమ్ముడు - రాజేంద్రనాథ్. ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగంలో పనిచేసి, రిటైరయ్యాడు. రెండో తమ్ముడు మణేంద్రనాథ్. బల్బుల తయారీ చేస్తుంటాడు. ఆఖరు తమ్ముడు డాక్టర్ కమలేంద్రనాథ్. కాకినాడలో ఫిజీషియన్. వాడూ కథలు రాస్తుంటాడు. ఎమోషన్స్‌ను అక్షరాల్లో పండించే మీకు బయట ఎమోషన్స్ ఉండవట! నాన్న గారంటే అమిత గౌరవం. కానీ, బయటకు ప్రదర్శించలేకపోయా. ఆయన పోయాక, ఆ బాధతో ‘అంతర్ముఖం’ రాశా. ఆయన పోయిన మంచం మీదే ఇవాళ్టికీ పడుకుంటా. స్నేహితులన్నా, బంధువులన్నా మనసులో ప్రేమ లేదని కాదు. అవసరానికి ఆదుకుంటా కానీ, ప్రేమను బాహాటంగా ప్రదర్శించడం నాకు తెలియదు. ‘ఎటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్’ అనే భగవద్గీత సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటాను. భావోద్వేగాల మీద అదుపున్న మీరు బాధపడే సందర్భాలుంటాయా? ఎందుకుండవు? ఒక పచ్చని చెట్టును ఎవరైనా కొట్టేసినా, రోడ్డు మీద చిన్నపాపకు దెబ్బ తగిలినా బాధపడతా. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అతివేగంతో వాహనాలు నడిపి, నా మిత్రుల కొడుకులు అయిదారుగురు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. నాకు బాధ అనిపించింది. పెద్దల పెంపకం సరిగ్గా లేదేమని బాధపడ్డా. మీ మనసు బాగా లేనప్పుడు ఏం చేస్తుంటారు? నిజం చెప్పాలంటే... అంతకు ముందు మాటెలా ఉన్నా, గడచిన 20 ఏళ్ళుగా నాకు వ్యక్తిగతంగా మనసు బాగా లేకపోవడమనేది లేదు. మరి, మీ ఏకైక కుమారుడి పెంపకంలో మీ పాత్ర ఏమిటి? మా అబ్బాయి ప్రణీత్ పెంపకంలో, సక్సెస్‌లో మా ఆవిడ అనుగీత పాత్ర 95 శాతం. నా పాత్ర 5 శాతం. అయితే, చిన్నప్పటి నుంచి తెలివైన ప్రశ్నలు వేయించి, వాడి ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దడంలో నా పాత్ర ఉంది. ఇంటర్ పాసవగానే, వాడు ఉద్యోగంలో చేరాడు. సంపాదించుకుంటూనే, సి.ఏ చదివి, పెద్ద చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ఇవాళ సింగపూర్‌లో స్థిరపడ్డాడు. ఇప్పుడు వాడి జీతం ఏటా 2 కోట్ల 70 లక్షలు. మీ అబ్బాయి పెళ్ళి విషయంలో కూడా మీ పాత్ర చాలా ఉందట! అవును. పిల్లలు లవ్ మ్యారేజ్, కులాంతర వివాహం అనగానే చాలామంది పెద్దలు బిగుసుకుపోతారు. అది తప్పు. మా అబ్బాయి, కోడలిది కులాంతర, రాష్ట్రాంతర వివాహం. సంప్రదాయబద్ధమైన, సామాన్య తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి సి.ఎలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్. వాళ్ళు ప్రేమించుకున్నారు. అబ్బాయి కన్నా ఆమె కొన్ని నెలలు పెద్దది. అయినా సరే, కులాలు, ఆర్థిక అంతరాలన్నీ పక్కనపెట్టి, నేనే మద్రాసు వెళ్ళి, వాళ్ళ పెద్దలతో మాట్లాడి వచ్చా. వాళ్ళదీ, మాదీ ఒకటే గోత్రం. పెళ్ళి కోసం మా కులం, గోత్రం అబద్ధమాడి, వాళ్ళ పెళ్ళి జరిపించా. నాకు ఇద్దరు మనుమళ్ళు. చిన్నప్పటి నుంచి దేనికీ భయపడకుండా తీర్చిదిద్దుతున్నారు. జీన్స్ మాత్రమే కాక పెంపకం కూడా పిల్లల్ని ఎంతో మారుస్తుంది. తొలినాళ్ళ ‘కుక్క’ నాటి వీరేన్కూ, ఇవాళ పాపులర్ ‘లోయ నుంచి శిఖరానికి’ నాటి యండమూరికీ మీరు గమనించిన తేడా? అప్పట్లో ఉండే పొగరు ఇప్పుడు తగ్గిపోయింది. గడచిన 15 ఏళ్ళుగా కోపం బాగా తగ్గింది. కాకపోతే, ఎవరో ఫోన్ చేసి, ఏదో అర్థం పర్థం లేనివి అడిగినప్పుడు మాత్రం చిరాకు వస్తుంటుంది. ఏ రంగంలోనైనా సమకాలికులతో పోటీ, ఈర్ష్య ఉంటాయి కదా... అతి చిన్న వయసులోనే అత్యధిక జీతం తీసుకొనేవాణ్ణి. నా రచనల వల్ల పాఠకుల్లో పెద్ద క్రేజ్. ఉత్తరాలు, ఆటోగ్రాఫ్‌లు సరేసరి! అవన్నీ చూసి, ఆఫీసులో అసూయపడ్డవాళ్ళున్నారు. పట్టించుకోలేదు. ఇక, రచయితగా వస్తే, నేనేప్పుడూ ఎవరినీ నాకు పోటీ అనుకోను. నాకన్నా పై స్థాయి రచయితలు - విశ్వనాథ, జాషువా లాంటి వాళ్ళున్నారు. నా కన్నా కింది స్థాయి వాళ్ళున్నారు. నాతో సమాన స్థాయి వాళ్ళు, పోటీదారులు ఎవరూ లేరు. ఒక్కమాట... ‘నీ గురించి నీ శత్రువు ఎక్కువ ఆలోచిస్తున్నాడంటే... వాణ్ణి నువ్వెప్పుడో గెలిచావు’! నవలా సాహిత్యానికి మళ్ళీ మునుపటి వైభవం వస్తుందంటారా? పాఠకులలో వచ్చిన మార్పు వల్ల ఆ రకం పుస్తకాల అమ్మకాలు తగ్గాయి. అయితే, కథ ఉంటూనే వ్యక్తిత్వ వికాసాన్ని కూడా జొప్పించేలా చేసే రచనలకు ఆదరణ ఉంటుందని నా భావన. అందుకే, అలాంటి రచనలు చేస్తున్నా. ఏదైనా మనకు మనం మార్కెట్ సృష్టించుకోవాలి. దానికి కష్టపడాలి. అంత కృషి చేసేవారు ప్రస్తుతం తక్కువ. మీకు తగినంత గుర్తింపు, అవార్డులు రాలేదని భావిస్తున్నారా? యాదృచ్ఛికంగా రచయితనైన నాకు ఎక్కువ గుర్తింపే వచ్చింది. అవార్డులు రాలేదన్న బాధ నాకు లేదు. కొన్నేళ్ళుగా మీ మనసులో సుడులు తిరుగుతున్న మీ కలల ప్రాజెక్ట్? అలాంటిదేమీ లేదు. ఏకకాలంలో మూడు, నాలుగు ప్రాజెక్ట్‌లు మనసులో ఉంటాయి. ప్రస్తుతం కథనూ, వ్యక్తిత్వ వికాసాన్నీ జొప్పించే రీతిలోనే ‘దున్నపోతులు’ అనే రచన చేయాలనుకుంటున్నా. ‘పిల్లలకు పదివేల పేర్లు’ ప్రాజెక్ట్ చేస్తున్నా. త్వరలోనే అది బయటకు రానుంది. ఇంతకీ భవిష్యత్తు మిమ్మల్నెలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు? తరువాతి తరాలు గుర్తుపెట్టుకోవడానికీ, గుర్తుపెట్టుకోకపోవడానికీ చాలా కారణాలే ఉంటాయి. శ్రీశ్రీ గురించి ఇవాళ్టికీ గుర్తుపెట్టుకుంటున్నారు. అంతకన్నా గొప్ప రచయితలున్నా, ఆయన నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉండబట్టే, ఆయన జనంలో గుర్తున్నారు. రేపు నన్నెలా, ఎంతమంది గుర్తు చేసుకుంటారన్నది ఇప్పుడు చెప్పలేం. అయితే, జనం నన్ను పాపులర్ నవలా రచయితగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటా! ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
ఓరుగల్లు
చాళుక్యయుగంలో బాల్యం గడిచిన తెలుగు సాహిత్యం కాకతీయ యుగంలో నిండు యవ్వనాన్ని సంతరించుకొంది. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి మహాభారతాన్ని పూర్తి చేస్తే, ప్రతాపరుద్రుని సామంతుడైన గోనబుద్ధారెడ్డి రంగానాథరామాయణం ద్విపదలో రచించాడు. ఓరుగల్లులో బమ్మెర పోతనామాత్యుడు ఆంధ్రమహాభాగవతాన్ని మనకందించాడు. ఆనాటి తెలుగు సంస్కృతికి కేంద్రబిందువై విలసిల్లిన ఏకశిలానగరం గురించి చెప్పాలంటే ఒక కథలో సాధ్యం కాదు. ఓరుగల్లు తెలుగు ప్రజలనందరినీ ఏకఛత్రం కింద పరిపాలించిన కాకతీయుల రాజధాని నగరం. అసలుసిసలైన ఆంధ్రనగరి. ‘విగ్రహారాధకుల జన్నత్’ (హిందువుల పాలిట స్వర్గం) అని ప్రఖ్యాత పారశీక కవి అమీర్ ఖుస్రోచే కీర్తింపబడిన మహానగరం. ఏ దిక్కు చూసినా ఫౌంటెన్స్తో కూడిన తోటలు, వాటి లో అరటి, మామిడి, పనస చెట్లు. సంపెంగ, మల్లె, మొగలి పొదలు. నగరం చుట్టూ ఏడు కోటగోడలు. లోపలి రాతికోటలో రాజసౌధాలు. నగరం మధ్య స్వయంభూదేవుడి ఆలయం. దానికి నాలుగు దిక్కులా హంసశిఖరాలతో శిలాతోరణాల ద్వారా నాలుగు రాజవీధులు వెడలేవి. ఆ వీధులు బండ్లు, రథాలు, గుర్రాలు, కాలినడకన పోయేవారితో కిటకిటలాడేవట. మధ్యవీధిలో మాత్రం వేశ్యావాటికలు ఉండేవని క్రీడాభిరామం చెబుతుంది. అక్కలవాడ, భోగంవీధి, వెలిపాళ్లెం, మేదరవాడ, మొహరివాడ వంటి పేటలుగా నగరం విభజింపబడింది. కాకతమ్మ, మైలారదేవుడు, ఏకవీర ఆలయాలే కాక అనేక జైన, శివాలయాలు ఓరుగల్లులో ఉండేవి. నగరానికి పశ్చిమాన హనుమకొండ ప్రముఖ వాణిజ్యకేంద్రం. కాకతీయుల పూర్వరాజధాని. దొంగైనాసరే దొరైనాసరే కళాకారుడి ప్రతిభకి తగిన ప్రతిఫలం కావాలంటే ఓరుగల్లుకే పోవాలని ప్రతీతి. దొంగతనం కూడా ఒక కళే! మన పూర్వీకులు చతుశ్షష్ఠి కళలలో దొంగతనాన్ని కూడా చేర్చారు. ‘గాలిచీరయు, నొల్కిబూడిద, గ్రద్దగోరును, గొంకియున్ కోలయున్, వెలుగార్చు పుర్వులక్రొవి, ముండులబంతియున్ మైలమందులు, కొయ్యకత్తెర, మారుగన్నపు కత్తియున్ నీలిదిండులు, నల్లపూతయు, నేర్పుతోడుగ మ్రుచ్చులున్’ అంటూ కొరవి గోపరాజు దొంగల పనిముట్లు వర్ణించాడు. వీటిలో గాలిచీర కన్నం వేసాక గాలి జొరకుండా మూయడానికి, పురుగులగొట్టం దీపాలు ఆర్పే పురుగులని గదిలోకి ఊదటానికి, ఇక కొక్కి, చెక్కకోసే రంపం, మత్తుమందు, నీలిబట్టలు, నల్లరంగు ఇలా మన సాహిత్యంలో దొంగలు నేర్చుకునేందుకు చాలా టెక్నిక్‌లు ఉన్నాయి. ఓరుగల్లు గురించి చెప్పిన ప్రతి కవీ ఆ నగరంలోని అక్కలవీధిని ప్రస్తావించక వదలలేదు. శ్రీనాథ కవిసార్వభౌముడు భోజనప్రియుడు. ఒక రూకకి అంటే పదిపైసలకి పూటకూళ్ళ ఇంట్లో పెట్టే భోజనాన్ని ఇలా వర్ణించాడు: కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్ గుప్పెడు పంచదారయును, క్రొత్తగ కాచిన ఆలనేయ్, పెసర పప్పును, గుమ్మునల్లనటి పండ్లును, నాలుగునైదు నంజులున్ లప్పలతోడ క్రొంబెరుగు లక్ష్మణ వజ్జుల యింట రూకకున్ ఇక క్రీడాభిరామంలో అక్కలవీధి పూటకూళ్ళ ఇళ్ళ ప్రస్తావన ఇలా ఉంది: ‘సంధివిగ్రహయానాది సంఘటనల బంధకీ జారులకు రాయబారి యగుచు పట్టణంబున నిత్యంబు పగలురేలు పూటకూటింటు వర్తించు పుష్పశరుడు’ అంటే పూటకూళ్ళింట్లో దిగిన కస్టమర్లకి ఊళ్ళో వేశ్యలకి రాయబారం చేయటంలో మన్మధుడికి పగలూ రాత్రీ తీరిక ఉండేది కాదట. ఆనాటి నగరాల పోలీస్ వ్యవస్థకి కావల్సిన జీతభత్యాలకి ఒక్క వేశ్యాగృహాలపై పన్నులే సరిపోయేవి. ఇక కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక ఆనాటి మద్యపానప్రియుల పానగోష్ఠికాలని (మందుపార్టీలు) వర్ణిస్తుంది. కాదంబం, మాధవం, ఐక్షివం వంటి అనేక సారాయిలు పింగాణి, గాజు, ఇత్తడి, బంగారాలతో చేసిన పానీయ పాత్రలను వర్ణిస్తుంది. ఉదయం హాంగోవర్‌తో బాధపడకుండా సురబేధనం అనే మందుని వరంగల్లు సంతలో అమ్మేవారట! దేశం నలుమూలల నుండి వచ్చే దొరలకు, కోమట్లకు, పండితులకు సుష్టుగా భోజనం, శుభ్రమైన పడకా ఇచ్చి ఆదరించిన పూటకూళ్ళక్కల ఇళ్ళు నేటి హెల్త్ క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లతో కూడిన ఫైవ్‌స్టార్ హోటళ్లని మరిపించేవి. -
‘అట్లా’లజిస్ట్ డాక్టర్ రాంబాబు!
నవ్వింత: డాక్టర్ కావాలన్నది మా రాంబాబు గాడి కోరిక. అయితే, మినపట్లలాంటి హెవీ ఫుడ్డు తినేసి, బద్ధకంగా పడుకునేవాడు. అలా మెడిసిన్‌లో చేరలేకపోయాడు. అత్తెసరు మార్కులతో పీజీ గట్టెక్కించాక, డాక్టరేటైనా తెచ్చుకుందామనుకున్నాడు.‘తెలుగు సాహిత్యానికి అట్ల సేవ- తులనాత్మక పరిశీలన’ వాడి టాపిక్కు. ‘‘ఇదేం టాపిక్కురా?’’ అన్నందుకు లెక్చర్ మొదలెట్టాడు. ‘‘అట్టు గురించి వాళ్లూ వీళ్లూ చెప్పడం ఎందుకు? శ్రీశ్రీ, ఆరుద్ర, వరద రాజేశ్వరరావు అట్ల మీద టన్నులకొద్దీ అభిమానాన్ని వెల్లడించారు. ఆరుద్రగారి కుటుంబం ఉన్న వీధి నుంచి అబ్బూరి రామకృష్ణారావు మాష్టారు వాల్తేరుకు మకాం మార్చినా... వరద రాజేశ్వరరావు రోజూ పొద్దున్నే జట్కా బండి కట్టుకుని మరీ ఆరుద్రవాళ్ల వీధికి విచ్చేసి వాళ్ల బాబాయి (ఆరుద్ర తండ్రిగారి రెండో తమ్ముడు భాగవతుల నారాయణరావు)ని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయేవారట. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ వరద రాజేశ్వరరావును హైదరాబాద్‌లో ఆరుద్ర కలిసినప్పుడు తెలిసిందట... వాళ్లు విశాఖపట్నంలోని పప్పుల వీధి మెయిన్‌రోడ్డుకు వెళ్లి ఉల్లికారంతో పెసరట్లు తినేవారని. అక్కడ మూడు రకాల అట్లు వేసేవారట. పెసరట్టు పిండి కొంతా, పుల్లట్ల పిండి కొంతా కలిపి మరో ప్రత్యేకమైన అట్టు వేసేవారు. ఆ రుచిని మరవలేక వరదగారూ, అబ్బూరి ఛాయాదేవిగారూ బాగా ప్రాక్టీస్ చేసి ఉల్లికారాన్ని శ్రీశ్రీకీ, ఆరుద్రకూ పెడితే, వాళ్లు కడుపునిండా తినేసి, పద్యాలు రాసేవారట’’ అన్నాడు రాంబాబు. ‘‘నిజమా?’’ అని అడిగాన్నేను. ‘‘ఇంకా అయిపోలేదు ఆగు... శ్రీశ్రీగారైతే ‘ఈ విశాలవిశ్వంలో నే కోరేడిదేమున్నది ఒక ‘దోసె’డు తీరుబాటు, ఒక పిడికెడు సానుభూతిని’ అంటూ ‘కరుణకు మా బతుకు’ కవిత్వం రాశార్ట. ఇక ఆ రోజుల్లో ఛాయాదేవి గారి ‘కవిత’ పత్రికకు పద్యాలు రాయాడానికి ముందుగా విధిగా పెసరట్టూ, ఉల్లికారం తిన్నాననీ, ఆ తర్వాతే తాను రాసి తొలిసారి ‘కవిత’లో ప్రచురితమైన భాగాలనే... ‘సినీవాలి’లో చేర్చుకున్నాననీ అన్నారు ఆరుద్ర. అంతేనా... ‘హైదరాబాద్‌లోని వరద రాజేశ్వరరావు ఇల్లు ప్రతి రోజూ పొద్దుటే విశాఖపట్నంలోని పప్పుల వీధి పెసరట్ దుకాణం అవతారం దాల్చేది’ అంటూ విశాఖకూ, హైదరాబాద్‌కూ ఉన్న సంబంధం అట్ల సంబంధమేనని తేల్చేశారు ఆరుద్ర. ఈ మాటల్ని బట్టి నీకు తెలిసేదేమిటీ? పద్యాలు రాయడానికి ముందు పెసరట్లు తినాలని’’ అన్నాడు రాంబాబు. ‘‘ఏదో మహానుభావులు తమ టేస్టుల గురించి చెబితే వాళ్ల సాహిత్యానికి మూలం అట్లే అని తేల్చేస్తే ఎలారా?’’‘‘కాస్త చెప్పడమేంట్రా... ‘వరద జ్ఞాపకాల వరద’ వ్యాసంలో సాహిత్యచర్చ ఎంత ఉందో... అట్ల గురించిన చర్చా అంతే ఉంది.’’ ‘‘ఆ ముగ్గురూ ఇష్టపడ్డారని, సాహిత్యానికి అట్లు సేవ చేశాయంటే ఎలారా?’’ అన్నాన్నేను. ‘‘శ్రీశ్రీకి యోగ్యతాపత్రం ఇవ్వగలిగిన చలం సైతం నూరేళ్ల కిందటే ‘అట్లపిండి’ కథ రాశారు. ‘సదరు అట్లపిండి గిన్నెను ఇంట్లో ఉంచితే నూరు ఖూనీలు జరిగాయేమోనని పొరుగువాళ్లు అనుమానించారట. అట్ల గిన్నెను శ్మశానంలో నిలువులోతున గుంటతవ్వి పాతిపెడితే దెయ్యాలన్నీ ఊరిమీద పడ్డాయంటూ జిల్లా కలెక్టరుకూ, ఛైర్మన్‌కూ అర్జీలు వెళ్లాయట...’ ఆ కథ అందరినీ అట్లు తిన్నట్లుగా కడుపుబ్బా నవ్వించేసింది. అట్లపిండిని ఫ్రిజ్జులో దాచుకునే నాకు... ఎప్పుడు దాని తలుపు తెరిచినా చలంగారు అందులోనే కొలువున్నట్టు అనిపిస్తుంటారు’’ అన్నాడు. ‘‘నలుగురైదుగురు పెద్దవాళ్లు అట్లగురించి మాట్లాడితే సాహిత్యమంతా అట్లమయమేనని ఎలా అంటావురా?’’ ‘‘చిన్న పిల్లలు పాడుకునే ‘చెమ్మచెక్కా... చారడేసి మొగ్గా... అట్లు పోయంగా’లోనూ అట్ల ప్రస్తావన ఉంది. ఇక ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్... ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ మన సంస్కృతిలోనూ అట్ల పండగలు ఉన్నాయి. అట్లతద్ది చేసుకునే అమ్మాయిలకు ఆరు అట్లు చెందాలనీ, ముద్దపప్పుల్లాంటి మగవారికి మూడే అట్లనే విధంగా వ్యాఖ్యానించుకుంటే ఫెమినిస్టు భావాలూ మనకు గోచరిస్తాయి. ఆ మాటకొస్తే కాళ్లకూరి వారు సంస్కరణోద్యమంలో భాగంగా రాసిన చింతామణిలోనూ సుబ్బిశెట్టి చేత అట్లు పోయిస్తారు. ‘శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్లాంటిదో... తన చేతిలో అట్ల పళ్లెం అసుమంటిది’ అనిపించారంటే ఇకనైనా అట్ల గొప్పదనం గురించి నువ్వు ఒకప్పుకోక తప్పదురా’’ అన్నాడు. ‘‘సాహిత్యంలో అట్లు ఇంతగా ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాన్రా’’ అన్నాను. ‘‘అట్ల పట్ల అపార గౌరవంతోనే జంధ్యాలగారు పేరుకు అది ‘వివాహభోజనంబు’ అయినా ‘అట్టు... మినపట్టు, పెసరట్టు, మసాలా అట్టూ...’’ అంటూ అన్ని పేర్లనూ సుత్తి వీరభద్రరావుతో చెప్పించి అట్టును సముచితంగా సత్కరించారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో ఒకరోజున నా పరిశోధనకు గుర్తింపు లభించిన నాడు ఆ న్యూస్ అట్టుడికినట్టు వ్యాపిస్తుంది చూడూ’’ అంటూ పెనంపై అట్టు తిరగేసినట్టుగా గబుక్కున వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు రాంబాబు. - యాసీన్ -
కొత్త పుస్తకాలు: జయుడు
రచన: జూలూరు గౌరీశంకర్ పేజీలు: 372; వెల: 300 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36. తెలుగు సాహిత్య వేదిక (12 గంటల నిర్విరామ ప్రసంగ వ్యాసాల సంపుటి) రచన: డా. ద్వా.నా.శాస్త్రి పేజీలు: 134; వెల: 100 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతో పాటుగా, రచయిత, 1-1-428, గాంధీనగర్, హైదరాబాద్-80. ఫోన్: 9849293376 స్వామి రామదాస్ పద్యాలు (ఆధ్యాత్మికం) అనువాదం: డా.మౌని పేజీలు: 128; వెల: 50 ప్రతులకు: ఆనందాశ్రమ్, కేరళతోపాటుగా; అనువాదకుడు, 71, ‘శ్రీభాగ్యసుధ’, ఎల్.ఎస్.నగర్, తిరుపతి-517502. ఫోన్: 9397048771 లవంగి (శ్రీజగన్నాథ పండితరాయల చరిత్ర) రచన: కె.వి.ఎల్.ఎన్.శర్మ పేజీలు: 136; వెల: 100 ప్రతులకు: కంచెర్ల ప్రమీల, 20-8/2-14బి, ఐదో లైను, న్యూ అయోధ్య నగర్, జయవాడ-520003; ఫోన్: 9963668247 నాకొక శ్రీమతి కావాలి (హాస్యకథలు) రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు పేజీలు: 136; వెల: 120 ప్రతులకు: విశాలాంధ్రతో పాటుగా, రచయిత, దివ్య రూబీ అపార్ట్మెంట్స్, ప్లాట్ 316, ఫ్లాట్ 302, థర్డ్ ఫ్లోర్, సిక్స్త్ ఫేజ్, కేపీహెచ్బి, హైదరాబాద్ నవ్వు-నవ్వించు (కథాసుధ) రచన: షణ్ముఖశ్రీ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: ములుగు కుమారస్వామి, ప్లాట్ 39, ఇం.నం. 2-2-1131/1/2, న్యూనల్లకుంట, హైదరాబాద్-44. ఫోన్: 8897853339 ఒక విజయం తరువాత... విజయం ఆనందోద్వేగాలను మాత్రమే ఇవ్వదు. కొన్ని సవాళ్లను కూడా విధిగా ఇస్తుంది. వాటిని అధిగమించిన రోజే విజయానికి పరిపూర్ణత చేకూరుతుంది. ఇవ్వాళ తెలంగాణ పరిస్థితి అదే. ‘ఏం చేయాలి?’ ‘ఎట్లా చేయాలి?’ ‘ఏది చేయకూడదు?’ ఇలా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో రావాల్సిన మార్పులు, చేర్పుల గురించి ప్రస్తుతం విస్త్రృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘నడుస్తున్న తెలంగాణ’ ప్రత్యేక సంచికను వెలువరించింది. ‘నడుస్తున్న తెలంగాణ’ విషయానికివస్తే అది తెలంగాణ ఉద్యమంతో పాటు నడిచింది. ఉద్యమం గుండె చప్పుడును రికార్డు చేసింది. ఈ సంచికలో రకరకాల కోణాలలో వరవరరావు, వేణుగోపాల్, శ్రీధర్‌దేశ్‌పాండే, మల్లేపల్లి లక్ష్మయ్య, రత్నమాల, దేవిప్రసాద్, పగడాల నాగేందర్...మొదలైన లబ్దప్రతిష్ఠులు రాసిన విలువైన వ్యాసాలు ఉన్నాయి. ప్రస్తుత సందర్భంలో వాటి ప్రాధాన్యత చిన్నదేమీ కాదు. ఉద్యమం, సాహిత్యం, విద్య, సినిమా, నీటిపారుదల...ఇలా రకరకాల విషయాలపై రాసిన లోతైన వ్యాసాలను చదువుతున్నప్పుడు ‘భౌగోళిక తెలంగాణ’ ‘బంగారు తెలంగాణ’ కావడానికి ఇవి మార్గసూచిలా ఉపకరిస్తాయనిపిస్తుంది. ‘ఒక విజయం తరువాత... చిన్నా పెద్దా సమస్యలన్నీ వాటంతటవే రద్దయిపోతాయి’ అనే కమ్యూనిస్ట్ కాల్పనిక భ్రమకు ఇది కాలం కాదు. సంపాదకుడు కాశీం అన్నట్లు ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ప్రజాస్వామిక తెలంగాణ రూపొందించుకునే బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది’. - యాకూబ్ పాషా నడుస్తున్న తెలంగాణ (మాసపత్రిక) సంపాదకుడు: డా. సి.కాశీం పేజీలు: 130; వెల: 50 ప్రతులకు: స్నేహలత ఎం., క్వార్టర్ నెం: ఆర్-9, ఒ.యు. క్వార్టర్స్, ఉస్మానియా యూనివర్శిటీ. హైదరాబాద్-7; ఫోన్: 8008918475 -
జోర్జ్ లూయీ బోర్హెస్... మేజిక్ రియలిజంకు ఆద్యుడు
తెలుసుకోవాల్సిన రచయిత: జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) అర్జెంటీనాకు చెందిన కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు. మేజిక్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు. మేజిక్ రియలిజం ప్రక్రియ పట్ల గొప్ప క్రేజ్ కనపరచే తెలుగు సాహిత్యంలో కూడా బోర్హెస్ పేరు విన్నవారూ ఆయన రచనల్ని సాకల్యంగా చదివినవారు ఏమంత ఎక్కువ లేరు. మేజికల్ రియలిజం అంటే బోర్హెస్ చూపించిన ధోరణికి, తక్కిన రచయితలు చూపించిన ధోరణికి చాలా తేడా ఉంది. బోర్హెస్ సత్యమేమిటో తెలుసుకోవాలని తపించి దాన్ని అసత్యం ద్వారా నిరూపించాలని ప్రయత్నించిన కాఫ్కా తరహా కళాకారుడు. బోర్హెస్ రాసిన కథలు చదవడం గొప్ప అనుభవం. కథ అనే ప్రక్రియకి కాలక్రమంలో ఏర్పడ్డ పరిమితులన్నిటినీ అతడు తుంచేశాడు. వ్యాసాన్ని, పుస్తక సమీక్షని, లేని పుస్తకానికి లేని విమర్శకుడి పేరు మీద రాసిన సమీక్షని, రేఖామాత్రపు జీవిత చిత్రణని... ఇలా ఎన్నో రకాల ప్రక్రియల్ని ఆయన మనతో కథలుగా ఒప్పిస్తాడు. ఫిక్షన్కీ నాన్ ఫిక్షన్కీ మధ్య హద్దులు చెరిపేసిన బోర్హెస్ కథలు చదవడం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అతడి నాన్ ఫిక్షన్ చదవడం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యదార్థానికి రెండింటి మూలమూ ఒకటే. అది బోర్హెస్ పఠనానుభవం. బహుశా ప్రపంచ రచయితల్లోనే అంత విస్తృత పఠనానుభవం కలిగిన రచయిత మరొకరుండరేమో. బ్యునోస్ ఎయిర్స్లో అర్జెంటీనా జాతీయ గ్రంథాలయానికి డెరైక్టరుగా పని చేసిన బోర్హెస్ తన గ్రంథాలయంలో ఉన్న ప్రతి ఒక్క పుస్తకం చదివేశాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విజ్ఞాన సర్వస్వాలు. మనం మామూలుగా విజ్ఞాన సర్వస్వాల్ని రిఫరెన్సు కోసం వాడుకుంటాం. కాని ఆయన విజ్ఞాన సర్వస్వాల్లో అ నుంచి క్ష దాకా ప్రతి ఒక్క ఎంట్రీ కూడా చదివేశాడు. చరిత్ర, తత్త్వశాస్త్రం, గణితం, భూగోళశాస్త్రం, భౌతిక రసాయనిక శాస్త్రం, సాహిత్యం... ఇలా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఎంత చదవగలడో అంతా చదివేడు. ఎంత చదివేడంటే ఆ అక్షరాగ్నికి అతడి కళ్లు ఆహూతైపోయాయి. యాభై యేళ్లు వచ్చేటప్పటికి అంధుడైపోయాడు. జీవితంలో చివరి ముప్పై నలభయ్యేళ్లు అంధత్వాన్ని మోస్తూనే రచనలు చేశాడు. ప్రసంగాలు చేశాడు. ప్రపంచమంతా పర్యటించేడు. బోర్హెస్ రాసిన వ్యాసాలు చదువుతుంటే సంభ్రమం కలుగుతుంది. ఈర్ష్య జనిస్తుంది. కొంతసేపటికి అది ఆరాధనగా మారుతుంది. మనలో నిద్రాణంగా ఉన్న జిజ్ఞాసని మేల్కొల్పి మనం చూస్తుండగానే తృష్ణగా మార్చేస్తుంది. తన పాఠకుల్లో తాను ఇటువంటి జ్ఞానతృష్ణ మేల్కొల్పుతున్నానని బోర్హెస్‌కి తెలుసు. అందుకని అతడు తన చివరి రోజుల్లో ప్రపంచసాహిత్యంలో తాను చదివిన సర్వోత్కృష్ణ రచనల్ని అర్జెంటీనా పాఠకులకి పరిచయం చేయడానికి ప్రయత్నించాడు. అతడు పరిచయం చేసిన రచనల పేర్లు చూస్తేనే మనకు అతడి ప్రపంచం ఎంత విస్తృతమో తెలుస్తుంది. జాక్ లండన్, హెన్రీ జేమ్స్, వోల్టేర్, హథార్న్, చెస్టర్ టన్, రాబర్ట్ లూయీ స్టెవెన్సన్, డాస్టవస్కీ, పో, కాఫ్కా, మెల్విల్లీ, గిబ్బన్, మార్కోపోలో, ఫ్లాబే, భగవద్గీత, కిర్క్ గార్డ్, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్... బోర్హెస్ ఒకచోట ఇలా రాస్తాడు: అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదు నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ణి. సున్నిత పాఠకుణ్ణి. చదివిన పుస్తకాల పట్ల సదా కృతజ్ఞుణ్ణి’ బోర్హెస్ని చదివితే ఏమవుతుంది? ఈ ప్రశ్నకి రెండంచెల్లో జవాబివ్వచ్చు. బోర్హెస్ రాసిన ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంతమేరకు మాత్రమే పరిమితం కాదేమో అని అనుమానమొస్తుంది. అతడు రాసిన నాన్-ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంత మేరకే పరిమితం కాదని నిశ్చయంగా తేలిపోతుంది. - వాడ్రేవు చినవీరభద్రుడు -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్‌లో తెలుగు సాహిత్యం
సివిల్స్‌లో తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా తీసుకునే వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే ఏయే అంశాలను నేర్చుకోవాలి? రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? - పి.అరవింద్ కుమార్, ఉప్పల్ పోటీ పరీక్షల్లో కెమిస్ట్రీ ప్రాధాన్యం ఎంత మేరకు ఉంటుంది? ఏయే పాఠ్యాంశాలు ముఖ్యమైనవి? - కె.స్పందన, అంబర్‌పేట తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్న వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే వ్యాఖ్యానాలపై పట్టు పెంచుకోవాలి. ఎందుకంటే మొత్తం 250 మార్కుల్లో 100 మార్కులకు వ్యాఖ్యానాలు అడుగుతారు. ఈ మార్కులే అభ్యర్థి ర్యాంకును నిర్ణయిస్తాయి. కాబట్టి అభ్యర్థులు పేపర్-2లోని రసము, ధ్వని, వక్రోక్తి లాంటి సౌందర్య సంబంధ అంశాలను ఔపోసాన పట్టాలి. పాఠ్యగ్రంథాలను ప్రత్యక్షంగా చదివి ఉండడం అనివార్యం అని యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అభ్యర్థులు రాసిన వ్యాసరూప సమాధానాలు, వ్యాఖ్యానాల్లో పాఠ్య గ్రంథాలు చదివారనే విషయం ప్రతిబింబించాలి. పేపర్లో ప్రస్తుతం ఛాయిస్‌లు ఇవ్వడం లేదు. మారిన పేపర్ విధానంతో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. గత పరీక్షల్లో అడగని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు. అభ్యర్థులు ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని అధ్యయనం కొనసాగించాలి. ఉదాహరణకు సోమిదమ్మ పాత్ర చిత్రణ(గుణనిధి కథ) గురించి 2012 సివిల్స్‌లో అడిగారు. ఈ ప్రశ్నను అప్పటి వరకు నిర్వహించిన ఏ పరీక్షలోనూ అడగలేదు. సిలబస్‌లో ఉన్న ఎనిమిది కాన్సెప్ట్‌ల్లో నాలుగు ప్రాచీన, నాలుగు ఆధునిక సాహిత్యానికి సంబంధించినవి. ఇవే కాకుండా మరో 5 నుంచి 6 కళాసౌందర్య అంశాలపై పట్టు సాధించాలి. పాఠ్యగ్రంథాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. రిఫరెన్స్ పుస్తకాలు: 1. తెలుగు సాహిత్య సమీక్ష (రెండ సంపుటాలు) - జి.నాగయ్య 2. తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి 3. తెలుగు భాషా చరిత్ర - వెలమల సిమ్మన్న ఇన్పుట్స్: డాక్టర్ పాతూరి నాగరాజు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ తెలుగు సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 లాంటి పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ విభాగంలో రసాయన శాస్త్రం ఒక ముఖ్యమైన విభాగం. గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే రసాయనశాస్త్రం నుంచి ఆరు నుంచి పది ప్రశ్నలు వస్తుండడాన్ని గమనించవచ్చు. వివిధ పాలీమర్లు, ఔషధాలు, పర్యావరణ రసాయనశాస్త్రం, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, వివిధ మూలకాల ఉపయోగాలు, హానికర ప్రభావాలు, కేంద్రక రసాయన శాస్త్రం మొదలైన అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయనశాస్త్రం, వివిధ రసాయన పదార్థాల ఫార్మూలాలు వాటి ఉపయోగాలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటి అంశాలను రిపీటెడ్‌గా చదవాలి. ఈ పాఠ్యాంశాల్లోంచి ఇస్తున్న ప్రశ్నలను గమనిస్తే ఫండమెంటల్స్ పైనే ఎక్కువగా అడగడాన్ని మనం గమనించొచ్చు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది. ఇక మూడోది కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలతో ఇమిడి ఉన్న రసాయన శాస్త్రం. ఉదాహరణకు బాక్సైట్ మైనింగ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు ఆ ధాతువు నుంచి సంగ్రహించే లోహం ఏది? అని అడిగారు. కాబట్టి హైస్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలతో పాటు పత్రికల్లో వచ్చే విషయ సంబంధిత వ్యాసాలు, సమకాలీన అంశాలకు సంబంధించిన అంశాలు దృష్టిలో ఉంచుకుని చదివితే రసాయన శాస్త్రంలోని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇన్పుట్స్: డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, హన్మకొండ. -
సత్వం: రసమూర్తి
జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు. నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా వుండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంలో అట్లా సమాధాన పడేటందుకేమీ లేదు. ఒక రకం మానసిక సంసిద్ధత ఉన్న పాఠకుడికి... బుచ్చిబాబు కథల్ని విశ్లేషించడం తెలియకపోయినా, ‘ఇది నాకు నచ్చుతోంది,’ అని మాత్రం అనిపిస్తుంది. ‘నేను’ అంటూ ఆయన ఆత్మీయంగా భుజం మీద చేయి వేసి, పాఠకుల్ని అలా తనవెంట నడిపించుకుంటూ వెళ్తారు. అలాగని తన గోడు వెళ్లబోసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే మనిషి కాదు. ‘తన వ్యక్తిత్వాన్ని దిగమింగి, అహంని జయించటంలోనే కళాకారుడి పురోగమనం ఉందన్న సూత్రాన్ని నేను స్వీకరిస్తాను’ అంటారు. అలా నమ్మినా, బోధ చేయడంలోకి రచనల్ని దిగజార్చకుండా, తన వ్యక్తిగతమైన విముక్తి మాత్రమే ప్రేరణగా రచనలు చేశారు. సౌందర్యం, సత్యం, తత్వం ఆయన సహజగుణాల్లాగా, సాహిత్యం కేవలం ఆయన ధారను స్పష్టపరుచుకునే ప్రక్రియలాగా తోస్తుంది. అందుకే తన ఏకైక నవల ‘చివరకు మిగిలేది’ ముందుమాటలో ఈ మాట అనగలిగారు: ‘చాలాకాలం దగ్గర పరిచయం వల్ల, వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం సులభమన్నది నా అనుభవం కాదు’. ఆయన వాక్యాలు ఒక్కోసారి అర్థంకాని పెయింటింగ్‌లాగా ఉన్నా, అందులోని అందం కట్టిపడేస్తుంది. ‘ఇంటికప్పు మీద నుండి జారిన వెన్నెల వెలుగు ఆమె నుదుటి మీద గీతలా పడుతోంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని పవ్వళిస్తోంది.’ ‘ఆకుల మధ్య కిరణాలు వనదేవత కుట్టుపనిలో సూదులలా వెనక్కీ ముందుకీ కదుల్తున్నాయి.’ ‘సమాజంలో స్త్రీ, పురుషులు ఎలా బ్రతకాలి? ఏ మార్గం మానసిక చైతన్యాన్నిస్తుంది? సంసారంలో బందితుడైన వ్యక్తికి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, అందునుండి జనించిన వికాసం సాధ్యమా?’ లాంటి ప్రశ్నలకు జవాబులేవో ఆయన రచనల్లో అందుతాయి. స్త్రీ, పురుషులమధ్య ఉండీలేని సజీవ ఆకర్షణలు, ‘నిప్పులేని పొగ’లాంటి బంధాలు, మనుషులు పెంచుకోవాల్సిన మనోవైశాల్యం, జీవితంతో సమాధానపడవలసిన తీరు, వీటన్నింటితోపాటుగా, ‘ఆధునిక నాగరకతలో పూర్తిగా లౌకిక విలువలకి లొంగిపోతున్న మానవుడిలో ఎక్కడో అణిగిమణిగి ఉన్న కళాతృష్ణ, అలౌకిక విలువలు వొకానొక సన్నివేశంలో ఉప్పొంగి బయటపడటం ఆయన కథల్లో చూస్తాము’. ‘మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యంలా కొనసాగాలంటాను కథానిక,’ అంటారు బుచ్చిబాబు. దానికోసం ఆయన చేసే పరిశోధన, పరిశీలన అసామాన్యం. ‘ఈరకం వైజ్ఞానిక విషయాల సమీకరణ, పాండిత్యం నవలకి అవసరం కాని, కథానికకి అక్కర్లేదు. ‘ఈయన హడావుడి చేస్తున్నాడు’ అనుకోవచ్చు కొందరు. అక్కర్లేదు, నిజమే. నేను తెలుసుకున్న వాటిలో ఒకటి రెండు తప్ప ఈ కథలో వాడనేలేదు. ఏమీ తెలుసుకోకుండా వ్యాధితో బాధపడినవారిని చూస్తే సరిపోవచ్చు. కానీ నాకట్లాగనిపించదు. ఆ వ్యాధి భోగట్టా అంతా తెలుసుకున్నాక మనస్సులో వస్తువుకి అనువైన మానసిక స్థితి ఏర్పడుతుంది,’ అని చెబుతారు. తెలుగు సాహిత్యపు కిటికీలను ప్రపంచంవైపునకు తెరవడానికి ప్రయత్నించారు బుచ్చిబాబు. పాశ్చాత్య మనోవైజ్ఞానికతనీ, చైతన్య స్రవంతినీ తెలుగుకథకు అద్దారు. మనిషి అంతరంగ సంక్లిష్టతను విడమరిచే ప్రయత్నం చేశారు. అనుభూతి ప్రాధాన్యతను గుర్తించారు. కథనం దానికదే ప్రధానమైనదే అయినా, ఆయన చింతనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మనిషి. ‘మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను.’ ‘జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు. నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా వుండొచ్చు; కాని ప్రేమించలలేకపోవడంలో అట్లా సమాధాన పడేటందుకేమీ లేదు’. ‘ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాలముందు వాల్తుంది.’ ‘ఈ జీవితం రహస్యం- దాన్ని తెలుసుకోవడానికి మానవుడు చేసే యత్నం.’ ఆయన, ‘రచనల్లోనే కాదు- నిత్య జీవితంలోనూ- నిజమైన కళోపాసకుడుగా, సంపూర్ణ మానవుడుగా, స్నేహవత్సలుడుగా జీవించిన గొప్ప కళాతపస్వి’. ‘నన్ను గురించి కథ వ్రాయవూ’లో కథానాయిక కుముదంను ఇలా వర్ణిస్తారు: ‘ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికిగలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’. బుచ్చిబాబు అనే కలంపేరుగల శివరాజు వెంకటసుబ్బారావు గనక తెలుగు నేలమీద జన్మెత్తకపోయివుంటే, తెలుగు సాహిత్యంలో కచ్చితంగా కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడివుండేది. - జూన్ 14న రచయిత బుచ్చిబాబు జయంతి -
జాతి కోసం తపించిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
సందర్భ రచయిత: ‘ముందు గ్రంథాలు పట్టు, తపస్సు చెయ్యి, ఆ తరువాత కలం పట్టు’ అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సాహితీ రంగంలో కృషి చేసే యువకులకు చేసిన హెచ్చరిక ఇది గ్రంథాలు చదివితే పదసంపద పెరుగుతుంది. గ్రంథాలు బుద్ధికి మారాకు పట్టిస్తాయి. జ్ఞానాన్ని గురించి ఆవేదన కలిగిస్తాయి అన్నది శ్రీపాదవారి విశ్వాసం. లోకుల సంభాషణలు వింటూ ఉండడమూ, గ్రంథాలు చదువుతూ వుండడమూ, ఎడతెగకుండా రచనలు సాగిస్తూ వుండడమూ- ఈ విధంగా భాషాజ్ఞానం సంపాదించాలి కవి అంటారాయన. శ్రీపాద దృష్టిలో రచన అనేది ఒక తపస్సు. కవి సమాధిలో కూచున్నాడా సరియైన తాదాత్మ్యం సిద్ధించిందా ఇక అతనికి భోగాల మీదికి దృష్టి పోదు. కష్టాలు కనబడవు. రచనలో మునిగిన కవి మానసిక స్థితి అలా ఉంటుంది అంటారాయన. కవి హృదయం అతి సున్నితమట. సాధారణ ప్రజలు చూడలేని ఆనందం అతడు చూడగలడట. ఆ ఆనందం పరులు కూడా పొందాలని అతడు కావ్యం రచిస్తాడని శాస్త్రిగారు కావ్య సృష్టిలోని పరమార్థాన్ని చెప్పారు. కథా రచయితగా ప్రఖ్యాతి పొందిన సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల, నాటక, కథ, కవిత, చరిత్రలు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు- ఇలా అన్ని ప్రక్రియలూ చేపట్టి ఓహో అనిపించుకున్నారు. వ్యాఖ్యానాలు రాశారు. అవధానాలు చేశారు. ప్రబుద్ధాంధ్ర అనే పత్రిక స్థాపించి సంపాదకత్వం వహించారు. గంధర్వ ఫార్మసీ స్థాపించి ఆయుర్వేదం మందులు తయారు చేశారు. కళాభివృద్ధినీ పరిషత్ ఏర్పాటు చేసి సాహితీ సభలూ, సన్మానాలూ నిర్వహించారు. నాటకాలు ఆడారు. సంగీతంపై అభిమానంతో వయోలిన్ నేర్చుకున్నారు. నిజాయితీ, నియమబద్ధతా, నిష్కర్ష ఆయనకు సహజ గుణాలు. దేనిలోనూ రాజీ ఉండదు. ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’ పేరుతో రాసిన వారి ఆత్మకథ ఎన్నో ప్రశంసలు అందుకుంది. అన్నింటినీ మించి ఆయనకు తెలుగుజాతి అన్నా అభిమానం ఎక్కువ. ఏమాత్రం కల్తీలేని అసలు సిసలైన తెలుగు రచయిత ఆయన. సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని పొలమూరులో 1891 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. స్వగ్రామం మహేంద్రవాడ. వారిది వైదిక నిష్టాగరిష్టమైన కుటుంబం. ఎన్నో నియమాలు. సంస్కృతమే తప్ప తెలుగు గ్రంథాలు ముట్టడానికే వీలులేదు ఆ కుటుంబంలో. క్రాపింగుతో ఉండాలని సరదా ఆయనకి. పనికిరాదంటారు కుటుంబసభ్యులు. చొక్కా తొడుక్కోవాలని ఉబలాటం. పనికిరాదంటారు పెద్దలు. దీంతో కుటుంబ సంప్రదాయాలపై తిరుగుబాటు చేశారు శాస్త్రిగారు. ఈ లక్షణమే వారి రచనల్లో దర్శనమిస్తుంది. వరకట్నం, అస్పృస్యత వంటి దురాచారాలపై దాడి కనిపిస్తుంది. మహిళలపై సానుభూతి చోటుచేసుకుంటుంది. నా తెలుగుపై నాకు నిషేధం ఏమిటీ? అనుకుని ఓం ప్రథమంగా నన్నయ భారతాన్ని తెరిచారు. తెలుగు గడ్డపైనే తెలుక్కి అన్యాయం జరుగుతోందని చిన్నప్పుడే ఆయన తెలుసుకోగలిగారు. ఇదే తెలుగు సాహిత్యానికి ఆయన్ని అంకితం చేసింది. తెలుగుభాషకూ, తెలుగు జాతికీ జరుగుతున్న అపకారాన్ని శాస్త్రిగారు ఎదిరించారు. తమ ప్రబుద్ధాంధ్ర పత్రికద్వారా పోరాటాలే జరిపారు. గ్రాంథికం నుంచి వ్యావహారికభాషకు మళ్ళి దానికి అండగా నిలిచారు. వ్యావహారికభాష తియ్యదనాన్ని రుచి చూశారు. రచనల ద్వారా రుచి చూపించారు. తెలుగు భాష గొప్పదనాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి: ‘‘ నా తెనుగు భాష శాస్త్రీయం, తాటాబూటం కాదు. నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహినిగా వుండినదిగాని, యివాళ ఆ భాషలోంచి వొక మాటా యీ భాషలోంచి ఒక మాటా యెరువు తెచ్చుకుని భారతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగు సరప్వతికే తేనె చినుకు లందించిందిగాని నిరుచప్పనిది కాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలిగిందిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందికాదు. అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీకాదు’’. తెలుగు మాగాణి నాలుగు చెరగులా తిరిగి అక్కడక్కడి పలుకుబళ్లు ఒంట బట్టించుకున్నాక తనకు ఐదు ప్రాణాలూ సంక్రమించినట్టు అయిందంటారు శ్రీపాదవారు. తన ప్రాంతపు పలుకుబడిలో యెంత శక్తి వుందో అక్కడక్కడి పలుకుబళ్ళలోనూ అంతంత జీవశక్తీ వుంది అంటారు ఆయన. ఒక్కొ సీమలో ఒక్కొక్క జీవకణం ఉందట. అన్నీ ఒకచోటికి చేర్చగల, అన్నీ ఒక్క తెనుగు రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకురావాలి అని అసలు విషయం వెల్లడించారు. అవునుకదా, నిజానికి ఇప్పుడదే జరగాలి. మాతృభాషపట్ల చిన్నచూపు పనికిరాదంటూ తల్లిభాష విడిచి ఇతర భాష నేర్చుకునేవాడూ తల్లిభాషలో కాక ఇతర భాషల్లో మాట్లాడేవాడూ తల్లిభాషలోకాక ఇతరభాషలో ఆనందించేవాడూ- తల్లి లేని బిడ్డ అంటారు. శ్రీపాదవారి దృష్టిలో తెలుగుదేశమే దేశం. తెలుగుభాషే భాష. తెలుగు మనుషులే మనుషులు. తెలుగు వేషమే వేషం. ఇది కొంచెం తీవ్రంగా తోచినా కచ్చితంగా వాస్తవం. విదేశీయులు సైతం అంగీకరించిన పరమ సత్యం. ఇప్పటి మన దయనీయమైన పరిస్థితికి నేను ఆంధ్రుణ్ణి అనే భావన బొత్తిగా లేకపోవడమే కారణం. కాబట్టి అలా భావించడం చాలా అవసరం. ‘భారత దేశం అంతా వీరవిహారంగా చేసుకుని, మహాసామ్రాజ్యాలు నిర్మించి, అనేక ప్రాంతాలవారిని పరిపాలించి, - అయ్యో! నేడు భృత్యునిగా, అనుచరునిగా, మట్టి తలకాయవానిగా యాసడింపబడుతున్నానే’ అనే అవేశం కలిగించాలి. అంతేకాదు ‘నే నాంధ్రుణ్ణి. నా పూర్వుల రక్తమే నన్ను నడిపిస్తోంది. భరతవర్షానికి నేను ప్రవర్తకుణ్ణి. ప్రపంచానికి నేను ఆదర్శ పురుషుణ్ణి అని చెప్పుకోగలగడమే పరమావధి’ అని కూడా శ్రీ పాదవారు ఉద్భోదించారు. ఈ పరిస్ధితుల్లో చేయవలసిందాన్ని శాస్త్రిగారు సూచించారు. ‘తెలుగులో విజ్ఞానం కలిగించే వాఞ్మయం నిర్మించాలి . నోరు విప్పితే ఉద్రేకం పుట్టించే ఉపన్యాసం చెయ్యాలి. నడుంకట్టితే ఫలితం యిచ్చే కార్యక్రమం నెరవేర్చాలి. ఇది ప్రయోజనకరమైన సందేశం? ఏ జాతి ఎదటా ఏ సందార్భంలోనూ ఎందుకున్నూ నా తెలుగుజాతి తీసిపోదు. అంచేత ప్రపంచానికిది ఉద్ఘాటించడానికి నా సేవలు జాతికే మీదు కట్టుకోవాలి నేను అని శ్రీపాదవారు ప్రతిజ్ఞలాంటిదే చేశారు. దానికి కట్టుబడి కృషి చేశారు కూడాను. అయితే, చేయవలసింది ఇంకా ఉండగానే తెలుగుజాతి దురదృష్టంవల్ల శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1961 ఫిబ్రవరి 25 మరణించారు. ఆంధ్రజాతి అభ్యుదయం కోసం తపించే ఒక పెద్ద అండ కరువైంది. వారికి నిజమైన నివాళులు అర్పించుకోగలగడం మన విధి. - పున్నమరాజు నాగేశ్వరరావు -
పద్యానవనం: పాలకులు పలికి బొంకకూడదు...
‘‘ఒక్కొక పద్దియంబునకు నొక్కొక నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించితి, వృధాశ్రమయయ్యె గులీనుడైన రా జిక్కరణిన్ మృషల్వలుకునే? కవితా ఋణమీయకుండునే నిక్కమెరుంగనైతి గజనీ సులతాను మహమ్మదగ్రణీ!’’ సమాజాన్ని లోతుగా పరిశీలించి, స్వీయానుభవంతో..... అందులో మంచి చెడుల్నే కావ్య వస్తువుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు గుర్రం జాషువా. పారశీక కవి ‘పిరదౌసి’... రాజును నమ్మి, ఎంతో శ్రమించి మోసపోయిన తీరును అత్యద్భుత కావ్యంగా మలిచారు. ప్రతి పద్యం ఆణిముత్యమే! పిరదౌసి కూడా అదే చెబుతున్నాడు. గజనీ సుల్తాను ప్రభువు, తన వంశ చరిత్రను కావ్యంగా రాయమని కోరినపుడు తనకు ఏం మాట ఇచ్చాడు? రేయింబవళ్లు తాను ఎంతో శ్రమకోర్చి కావ్యాన్ని పూర్తి చేశాక రాజు ఎలా మాట తప్పాడు? ఇదే పిరదౌసి కావ్యం. ఒక్కో పద్యానికి ఒక్కో రక్తపు బొట్టు ఖర్చయ్యేలా కష్టించి కావ్య రచన చేశానంటాడు కవి. తన శ్రమంతా వృథా అయింది. రాజు మాట తప్పాడు. ఒక్కో పద్యానికి ఒక్కో బంగారు నాణెమిస్తానని సభాముఖంగా ప్రకటించి, కావ్య రచన పూర్తయ్యాక మాట తప్పి వెండి నాణేలు పంపాడు. రాజులు, అంటే పాలకులే అలా మాట తప్పొచ్చా? పాలకులే మాట తప్పితే ఇక ప్రజల గతి ఏంటి? జాషువా.... కాదు కాదు పిరదౌసి పేర్కొన్నట్టు ‘‘నిక్కమెరుంగనైతి....’’ అని పిదప బాధపడాల్సి వస్తుంది. నిజమే! ఇప్పుడు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లోనూ పాలకులు ఆడినమాట తప్పినపుడు సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతున్నారు? ఎన్ని ఎన్నికల ప్రణాళికలు గాలి మాటలై, నీటి మూటలై ప్రజానీకాన్ని వెక్కిరించడం లేదు! ‘అయ్యో ఇంతటి పచ్చి అబద్ధాలకోరు అని ఊహించకపోతిమే! తెలియక ఈయన్ని ఎన్నుకుంటిమి, నిజం గ్రహించమైతిమి, ఇప్పుడేం చేయాలి?’ అని వగచడం తప్ప మళ్లీ అయిదేళ్ల దాకా సగటు పౌరులు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. తప్పు చేసిన, మాట తప్పిన ప్రజాప్రతినిధుల్ని వెనక్కి పిలిచే వ్యవస్థా లేదిప్పుడు. ఒక్కసారి చెయిజారిన ఓటు, అయిదేళ్లదాకా వెనక్కి రాని, అంటే, తిరిగి వాడలేని అర్జున నాగాస్త్రమే! స్వల్ప కాలిక జ్ఞాపకం, మరుపు అనే మానవ లక్షణాల్నే తమకు శ్రీరామరక్షగా మలచుకొని రాజకీయ పక్షాలు రాజ్యాలేలుతాయి. అవసరానికి మాయ మాటలు చెప్పి, అటుపై నిస్సిగ్గుగా మాట తప్పి తలలెగరేసుకొని మరీ రాజకీయాలు నెరపుతున్నాయి. ఎన్నికల ముందు మానిఫెస్టోల మయసభా మేడలు కట్టి, జనాల్ని ఆశల పల్లకీలెక్కించి, ఆనక అన్నీ మరచి వంచించడం మామూలయిపోయింది. అయిదేళ్లకు తిరిగి ఎన్నికలు రాగానే, పద పదం, వాక్యాలకు వాక్యాలు, పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు.... యధాతథంగానో, కాస్త అటుఇటుగా మార్పులు చేసో మళ్లీ కొత్త మానిఫెస్టోలు జారీచేయడం రివాజయింది. ఇదంతా మాట తప్పడం కాదా? ఆత్మ వంచన-పర వంచన కాదా? ఆయా నేతలు, రాజకీయ పక్షాల చరిత్రను సరిగా పరిశీలించి, జనం జాగ్రత్తగా కీలెరిగి వాత పెడితే గాని, ఈ మాయా రోగం కుదురుకోదు. సగటు జీవి జీవితం కుదుటపడదు. మాటమీద నిలబడే వారి విశ్వసనీయతే ప్రామాణికంగా ప్రజలు తీర్పిచ్చినపుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం. అసలు విలువ తెలిసి ఓటును ఒక అస్త్రంగా వాడితే తప్ప, మనుషుల్ని మనుషులుగా కాకుండా, ఓటర్లుగా మాత్రమే చూసే ఆధునిక అరాచకీయాలకు అంతముండదు. కావ్యం రాయమని ఆనతిచ్చిన రాజు తన కవితా ఋణమీయకుండునే? అని కవి వగచాడు. ‘వచ్చే అయిదేళ్లు నీవు మా పాలకుడివిగా ఉండు’ అని, మహత్తరమైన ‘ఓటు’తో ప్రజాకోర్టులో తీర్పిచ్చిన ఓటరు రుణమీయకుండా ఉండే ఆ రాజు/పాలకుడు ఏమవుతాడు? నామ రూపాల్లేకుండా నాశనమవుతాడు కవి చెప్పినట్టుగా! అప్పటిదాకా ఒక గొప్ప తారగా వెలిగిన రాజు కూడా, మాటపై నిలబడకుండా ప్రజాకంటకుడైతే ఏమవుతాడో కవి చక్కగా చెప్పాడు. ‘.....కవియు చనిపోయె యొక చుక్క గగనమెక్కె, రాజు మరణించె నొక తార రాలిపోయె!’ అదీ తేడా! - దిలీప్‌రెడ్డి -
నవ్వింత: కాకి గోల
ఓ వేకువజామున కాకి నా కలలోకి ప్రవేశించి ఇలా అంది: ‘‘నాయనా, తెలుగుసాహిత్యానికి నాకంటే తక్కువ సేవ చేసిన వాళ్లు కూడా ఆత్మకథలు రాసుకుంటున్నప్పుడు నేను రాసుకోకపోతే ఎలా? అందుకే నిన్ను అడుగుతున్నాను. ఈ వాయసకారుడికి నువ్వో వ్రాయసకాడుగా మారాలి’’. ‘‘తెలుగు సాహిత్యానికి నువ్వు సేవ చేశావా?’’ ఆశ్చర్యపోయాను. ‘‘అంతా ఇంతా కాదు నాయనా. ఓ కాకి తన తెలివితేటలతో కుండ అడుగున ఉన్న నీళ్లను రాళ్లు వేసి ఎలా పైకి తెచ్చిందనేదే ప్రపంచంలోని ఏ పిల్లాడైనా తొలిగా తెలుసుకునే కథ. ఆదికావ్యం విషయంలో నన్నయ్య ఎలాగో తొలికథ మాటకొస్తే ఈ ‘కాకమ్మ’ అంతే బాబూ. పిట్టకథలు బ్రహ్మాండమైన శాస్త్రం అయితే... అందులో ప్రత్యేకమైన అధ్యాయం నా కాకమ్మకథలు నాయనా. తెలివైన హీరో నేననే ప్రస్తావన లేకుండా తెలుగు సాహిత్యమే లేదు బాబూ’’ ‘‘నెంబర్వన్లంటూ ఎవరికివారు చెప్పుకునే టాప్ టాలివుడ్ సినిమా హీరోలు కూడా ఇంతగా మిడిసిపడటం లేదు..’’ మధ్యలోనే ఆగిపోయా. ‘‘సినిమాల సంగతికి తర్వాత వస్తా. పంచతంత్ర కథల్లోని చాలావాటిల్లో నేనే హిట్ హీరో. నా గుడ్లను రక్షించుకునేందుకు రాణిగారి హారాన్ని తెచ్చి నా గూడు కింద ఉన్న పుట్టలో వేసి పామును చంపించి, నా పిల్లలను రక్షించుకునే నా తెలివితేటలతోనే మీ జాతి జాతంతా యుక్తిని నేర్చుకుంటుంది బాబూ’’ ‘‘ఏదో నాలుగు కాకమ్మ కథల్లో నువ్వు హీరో కదా అని మొత్తం సాహిత్యమంతా నువ్వేనని దబాయించకు’’ ‘‘తప్పు నాయనా! ఆదికావ్యం రామాయణం నుంచి అంతా నేనే నాయనా. సీతమ్మను కాస్త అలా పొడిచి రాముడికి కోపం వచ్చేలా చేసి... శాపవిమోచనం కోసం నాపై బ్రహ్మాస్త్రం విడుచుకునేలా చేసుకుంది నా అంతట నేనే నాయనా. బ్రహ్మాస్త్రానికి గురై బయటపడ్డవాళ్లలో తొలి, మలి జీవినీ, ఏకైక పక్షినీ నేనే. బ్రహ్మాస్త్రానికి కాస్త గౌరవం ఇవ్వాలి కదాని కన్ను మాత్రం పోగొట్టుకుని ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు’ సామెతను మీకు ప్రెజెంట్ చేసింది కూడా నేనే. లబ్ధప్రతిష్ఠులమంటూ మీరు చెప్పుకునే ప్రతి కవీ నన్ను వాడుకున్నవాడే నాయనా. ప్రజాకవి అని పిలుచుకునే వేమన ‘పెంట తినెడి కాకి పితరుడెట్లాయెరా’ అంటూ తన హేతుజ్ఞానాన్ని నా సాయంతోనే చాటి చెప్పుకున్నాడు. సుమతీ శతకకారుడు సైతం ‘తెల్లని కాకులూ... అల్లుని మంచిదనమూ లేవం’టూ ఈ లోకంలో లేనివాటిని చూపడం కోసం నన్నే ఉదాహరణగా వాడుకున్నాడు. వరవిక్రయం రాసిన కాళ్లకూరి వారికీ నేనే కావాల్సి వచ్చాను. సింగరాజు లింగరాజు లోభితనం చూపించడానికి అతడు నా గూటిపుల్లలనే వంట చేసుకున్నాడని రాశాడు. మీరు మహాకవి అనే శ్రీశ్రీ సైతం ‘కాకికేం తెలుసు సైకో అనాలసిస్సు’ అంటూ నాపైనే పడ్డాడు. ఎవరి బలహీనత ఏమిటో తెలుసుకుని వాళ్లను కాకాపట్టి పనులు సాధించుకునే వాళ్లను మీరే ‘కాకా’సురులు అంటారు...’’ ‘‘పోచికోలు కబుర్లు చెప్పుకోడానికి నిన్ను వాడుకున్నంత మాత్రాన సాహిత్యమంతా నువ్వేనంటే ఎలా?’’ ‘‘పోచికోలు కబుర్లు వేరు నాయనా. నా గురించి చెప్పుకున్న కబుర్లను ‘కాకమ్మ’కబుర్లు అంటారు. అంతెందుకు తమ ఎదుటివారి పట్ల తమ గౌరవం చూపించుకోవాలంటే ఆ కబురును కాకి చేత పంపిస్తే చాలంటూ మళ్లీ నన్నే ఆశ్రయిస్తారు. మీకు సాహిత్యం ఎలాగూ ఆనదు. కాబట్టి సినిమాలనే ఉదాహరణలుగా చూపిస్తా. డీవీ నరసరాజు ఎదురింట్లో ఉండే ఆ ఇద్దరూ బద్ద శత్రువలని చెప్పడం కోసం ‘కాకి... కాల్చేశా. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలకూడదు కదా’ అనే డైలాగు రాశాడు. కావాలంటే చూ. యమగోల. జంధ్యాల ‘కాకీక కాకికి కోక కాక కాకికా కేకికా’ అంటూ నన్ను ఆశ్రయించి హాస్యం పడించుకున్నాడు. చూ. ఆనందభైరవి. పుచ్చాపూర్ణానందంగారని ఒక మహాత్ముడుండేవారు. ఆయనొక్కడే నాయనా నన్ను బాగా గౌరవించింది. నేను ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండటం చేత నా గొప్ప ఈ లోకానికి కనిపించడం లేదనీ, నేనే లేకపోతే లోకంలో ఎన్నో పలుకుబడులు, సామెతలూ ఉండేవికావని రాశాడు. కాళిదాసు సైతం నా గురించి కవనం చెప్పాడు. కాకపోతే స్నేహమంటే కోకిల పలుకుల్లా ఉండాలంటూ నన్ను నానా మాటలన్నాడు. ఆ కోకిల బిడ్డలకు ఈ కాకమ్మే తొలి ఆయమ్మనీ, బువ్వపెట్టే మారుటమ్మ లాంటి యశోదమ్మనీ తెలియక అపార్థం చేసుకున్నాడనుకో. తెలిసుంటే కాళిదాసు తన పేరును కాకిదాసు అని మార్చుకునేవాడేమో! ఇక నా గౌరవార్థమే తెలుగువాళ్లు ‘కాకి’నాడ అనీ, శ్రీ‘కాకుళం’ అని పేరు పెట్టుకున్నారు. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా! తెలుగువాళ్ల తొలి రాజధాని హైదరాబాదో, కర్నూలో, చెన్నపట్నమో, అలనాటి ప్రతిష్ఠానపురమో కాదు... నిశుంభుడిని సంహరించాక ఆంధ్రవిష్ణువు కట్టించుకున్న శ్రీ‘కాకుళ’మే తెలుగువాళ్ల తొలి రాజధాని...’’ ఈ కాకోపదేశం సాగుతుండగానే తెల్లారింది. ఈ వేళలో వచ్చిన కలలు నిజమంటారు. కాకిదేవత కలలోకి వచ్చి నన్ను కరుణించి ఇలా ప్రసంగించిందా? హే కాకిచంద్రప్రభో. ఇప్పటివరకూ నువ్వు ఓ మామూలు కాకి అనుకున్నాను. సాహిత్యంలో పాపినేని ‘చివరి పిచ్చుక’ కథ రాశారట. నేను ‘మొదటి కాకి’ అనే కావ్యం రాసి తొలికాకి కావ్య రచయితగా ప్రఖ్యాతి పొందుతాను. హే కాకిచంద్రప్రభో! ఏదో గ్లామరుండబట్టి నెమలి జాతీయ పక్షి అయ్యిందిగానీ... అసలు మీ కాకులు కదా ఆ జాతీయ పక్షి హోదాకు అర్హులు. రోగం కలిగినవాడు రోగిష్టి, కోపం ఉన్నవాడు కోపిష్టి, పాపిని ఇష్టపడేవాడు పాపిష్టివాడైనట్లుగా... ఇకపై నేను మీ కాకిజాతిని ఇష్టపడుతూ ‘కాకిష్టి’వాడిగా ప్రఖ్యాతి పొందుతాను. కాకీశ్వరోపాసన చేసి, కాకలు దీరిన ఈ కాకమ్మ కథకు ఇప్పుడే శ్రీకారం చుడతానంటూ కన్నీళ్లు కార్చుతూ కాకిప్రబంధ కావ్యరచనకు ఉపక్రమించాను. - యాసీన్ -
అంతరాల సంఘర్షణే నాటకం
ఇంటర్వ్యూ: - డి.విజయభాస్కర్ కావ్యేషు నాటకం రమ్యమ్ అన్నారు మహాకవి కాళిదాసు. సామాజిక సామరస్యతకు ‘నాటకమ్ గమ్యమ్’ అంటున్నారు డా.దీర్ఘాశి విజయభాస్కర్. శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో బలహీనవర్గానికి చెందిన ‘దమ్మలి’ కులంలో పుట్టారు. ఎత్తై మరగల్లుపై గ్రామాన్ని వీక్షించి శంఖాధ్వానంతో గ్రామదేవతను అర్చించడం వృత్తిగా ఉన్న తన కులస్తుల్లో చదువుకుని ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేస్తోన్న ఒకే ఒక్కడు విజయభాస్కర్. అంతేనా? తెలుగు నాటకాన్ని భారతీయభాషల్లో రెపరెపలాడిస్తోన్న వాడు కూడా! ‘బ్రెహ్ట్’పై డాక్టరేట్ చేసిన విజయభాస్కర్ ‘తూర్పు తెల్లవారింది’తో మొదలై ఇటీవలి ‘రాజిగాడు రాజయ్యాడు’ వరకూ 14 నాటకాలు రాశారు. కేంద్ర సంగీత-నాటక అకాడెమీ అవార్డు, ఆరుసార్లు నంది అవార్డులు, ఇతరేతరాలు తనను వరించాయి. సాంఘిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని నాటకాన్ని కథలా ప్రారంభించి, కావ్యంలా ముగిస్తూ, ఒక తాత్త్విక భావజాలాన్ని అంతర్లీనంగా ప్రవహింపజేసే విజయభాస్కర్‌తో ఇంటర్వ్యూ సారాంశం : మీ నేపథ్యం చెప్పండి. నాన్న సూర్యనారాయణ పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించేవాడు. రామదాసు నాటకంలో కబీర్ పాత్ర పోషించేవాడు. ఆ ప్రభావం నా మీద ఉంది. శ్రీకాకుళం కాలేజీలో చదువుకునేటప్పుడే కొన్ని నాటకాల్లో నటించాను. రవీంద్రభారతి గురించి మా నాన్న ద్వారానే తొలిసారి విన్నాను. ‘హిందువులకు కాశి, ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలెం వలె కళాకారులకు పుణ్యస్థలి రవీంద్రభారతి’గా చెప్పుకునేవాళ్లం. ఏనాటికైనా నా నాటకాలు అక్కడ ఆడాలి అనుకున్నాను. అలాగే జరిగింది. నాటకాలు రాయడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? బాల్యంలోనే నాటకం పట్ల ఏర్పడిన అభిరుచి నాటకాన్ని సాహితీ ప్రక్రియగా ఎంపిక చేసుకునేందుకు దోహదపడింది. కులాలు, రాజకీయాలు, ప్రాంతాలు, మతాలు, అభిమతాల పేరిట సమాజంలో అసంఖ్యాక సంఘర్షణలున్నాయి. కేవలం నాటకం మాత్రమే సంఘర్షణను ప్రతిభావంతంగా ప్రజల దగ్గరకు చేరుస్తుందని నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే ఎం.ఎ చదువుతోండగా ‘తూర్పు తెల్లారింది’ రాశాను. అది రేడియోనాటకంగా ప్రసారమైంది. నాటక రచయిత ఎస్.కె.మిశ్రో నా గురుసమానులు. ఇప్పటికి 24 నాటకాలు రాశాను. గాంధీ జయంతి- రుత్విక్- కాలకూటం-మినిస్టర్- కుర్చీ- పులిస్వారీ తదితర నాటకాలు అనేక భారతీయ భాషలలోకి అనువాదమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ‘విజయభాస్కర్ నాటకోత్సవాలు’ విజయవంతంగా ప్రదర్శితమైనాయి. మీ నాటకాలు ఎందుకు నచ్చుతున్నాయి? నా నాటకాలు ఇంగ్లిష్ ఇతర భారతీయ భాషల్లోకి విరివిగా అనువాదమై ప్రజలకు నచ్చడానికి కారణం వర్తమాన సంఘర్షణను చెప్పేందుకు పౌరాణిక ప్రతీకలను ఎంచుకోవడమేనని భావిస్తాను. ‘పురాణా’నికి పునర్నవం అనే అర్థం ఉంది. పురాణాల కనెక్టివిటీకి ఒక ఉదాహరణ : ఏడు ఈశాన్య రాష్ట్రాలలో సామాజిక ఉద్యమాల గురించి ‘హై వే - జర్నీస్ త్రూ ఎ ఫ్రాక్చర్డ్ లాండ్’ అనే పుస్తకాన్ని రాసిన అంతర్జాతీయ జర్నలిస్ట్ సుదీప్ చక్రవర్తి మణిపురిభాషలోకి ‘లైబికా-వాగా’ పేరుతో అనువాదితమైన నా నాటిక ‘బ్రహ్మరాత’ను వీక్షించి, ఈ నాటిక ఈశాన్యరాష్ట్రాల వర్తమాన రాజకీయపరిస్థితులకు అద్దం పడుతుంది అని వివరించారు. నా తెలుగు నాటకంలో మణిపురి సమస్యలేం లేవు. అయినా సరే, నా నాటిక ‘స్థలాన్ని’ (స్పేస్)ఎలా దాటింది? పౌరాణిక ప్రతీకలను వాడడం ద్వారానే! ఇతర భాషల్లోకి అనువాదం అవుతోన్న నా తాజా నాటకం ‘రాజిగాడు రాజయ్యాడు’లోనూ కులపురాణాల ప్రస్తావన ఉంది. సేవకవృత్తిలో మగ్గిపోతోన్న కులాలు అగ్రవర్ణాలలోని ‘పాజిటివ్’ వ్యక్తుల నుంచి చైతన్యవంతమై అధికారంలోకి వస్తాయనే ఇతివృత్తంలో ‘లౌక్యం’ ఏమీ లేదు. పాలిత కులాలపట్ల చూపించే సానుభూతి, పాలక కులాలపట్ల ద్వేషం కలిగించరాదనే స్పష్టతనిచ్చాను. ఇతర భాషలతో పోలిస్తే మన నాటకం ఎలా ఉంది? ఇతర భారతీయభాషలతో పోలిస్తే తెలుగు రచయితలు, దర్శకులు, నటులు ఎవరికీ తీసిపోరు. మైసూర్‌లోని రంగాయణలో మన పడమటిగాలి, కుర్చీ నాటకాలను చూసిన నాటకా భిమానులు ‘ప్రయోగాల అతితో విసిగిపోయిన మాకు ఈ నాటకాలు గొప్ప రిలీఫ్ ఇచ్చాయి’ అనడం గమనార్హం! అయితే తెలుగు నాటకరంగం స్టేజ్క్రాఫ్ట్లో చాలా వెనుకబడి ఉంది. కవిత్వం రాస్తున్నారు కదా. నేను అవలోకించిన సామాజిక సంఘర్షణలు నాటకాలుగా రూపొందితే ఆంతరంగిక సంఘర్షణ ఇటీవలి కవితాసంపుటి ‘మహాశూన్యం’గా రూపొందింది. మహాశూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు. ‘అంతా ఉన్నది. అంతటా ఉన్నది. అంతటా నిండి ఉన్నదీ అయిన చైతన్యం’. వ్యక్తి తనలోకి చూసుకుని తన అనంతవ్యాప్తిని అనుభవించడం ‘అనుభావ’కావ్యం! నన్ను నేను పరికిస్తే- ‘నీవు ధరించాల్సిన దుస్తులు/ ఏ దిగంతాలకు అవతలనో నేస్తున్నారు/ నగ్న అంతస్సులో నడచి వెళ్లు’ అన్పిస్తోంది. విజయభాస్కర్ రచనలు 1. కాలకూటం 2. రుత్విక్ 3. కుర్చి 4. పొలి స్వరి 5. కించిత్ భోగమ్ 6. జీవన్నాటకం (నాటకరంగ ప్రముఖుల గురించి టెలీ సీరియల్) 7. హిరణ్యగర్భ 8. మినిస్టర్ 9. బ్రహ్మరాత 10 మబ్బులో బొమ్మ 11. గాంధీజయంతి 12. దేవుడు కావాలి 13. బాపు చెప్పిన మాట 14. చిత్రం 15. రాజిగాడు రాజయ్యాడు 16. మౌనంతో మాటలు (కవిత్వం) - పున్నా కృష్ణమూర్తి -
తెలుగు నవలల్లో అనాబ్‌షాహీ సెక్రటరీ...
కొన్ని కథల్ని మనుషులు మొదలు పెడతారు. కొన్ని కథల్ని మెషీన్లు మొదలుపెడతాయి. కొన్ని కథల్ని మెషీన్లను ఉపయోగించే మనుషులు మొదలుపెడతారు. చాలాకాలం క్రితం సెక్రటరీ అనేది మగవాళ్ల పని. 1880లో టైప్మెషీన్ కనిపెట్టాక అది ఆడవాళ్ల పని అయ్యింది. టైప్ తెలిసిన ఆడవాళ్లు, ఆఫీసు వ్యవహారాలను ‘సీక్రెట్’గా ఉంచుతూ నమ్మకంగా పని చేసే ఆడవాళ్లు - ‘సెక్రటరీలు’. ఇరవయ్యవ శతాబ్దపు మొదలులో మొదలయ్యి 1950లకు ఉద్ధృతమైన ఈ పని చేసిన మేలూ మగవారి జీవితంలో తెచ్చిన మార్పూ అంతా ఇంతా కాదు. పుట్టించిన కథలూ అన్నీ ఇన్నీ కావు. సెక్రటరీలు చాలా మంది జీవితాలను వెలిగించారు. చాలామంది జీవితాలను ఆర్పేశారు. సుభాస్ చంద్రబోస్ తన సెక్రటరీనే పెళ్లి చేసుకున్నాడు. దోస్తవ్ స్కీ అదే పని చేశాడు. మన శ్రీశ్రీ కూడా డబ్బింగ్ సినిమాల పనికి తనకు సహాయకురాలిగా చేరిన సరోజను వివాహం చేసుకున్నారు. కొంతమంది దీనికి రివర్స్‌గా వెళ్లి ఇరకాటంలో పడ్డారు. భార్యలతో దెబ్బలు తిన్నారు. క్లింటన్లాంటివాడు లెవన్స్కీతో చాలాదూరం వెళ్లి చాలా లోతులో పడ్డాడు. ‘సెక్రటరీ’ నవలలోని రాజశేఖరం కూడా జయంతిని సెక్రటరీగా పెట్టుకున్నాక అంత సుఖంగా ఏమీ లేడు. రాజశేఖరంకు ఒక సమస్య ఉంది. అతడి తల్లిదండ్రులు పారిపోయి హైదరాబాద్ వచ్చినవారు. అందువల్ల బంధువులంటూ ఎవరూ లేరు. ఒక్క కొడుకు- రాజశేఖరం పుడితే అతణ్ణే సర్వస్వం అనుకొని ఎవర్నీ కలవనిచ్చేది కాదు తల్లి. కలివిడిగా ఉండటం, మనసులో ఉన్నది చెప్పడం రాజశేఖరంకు చేతగాదు. ‘నన్ను నన్నుగా ప్రేమించుటకు’ అన్నట్టుగా తన అందం, ఆస్తి, వైభవం చూసి కాకుండా తన హృదయాన్ని చూసి ప్రేమించే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే జయంతికి కూడా ఒక సమస్య ఉంది. ఆమెను ఆమె బామ్మ పెంచింది. బామ్మల పెంపకంలో ఆడపిల్లలు ఎలా పెరుగుతారో అలానే పెరిగింది. తెలిసీ తెలియనితనం, చాదస్తం, అనుమానం.... మగవాళ్లంటే లోపల ‘జడత్వం’ ఉండి పైకి నిక్కచ్చిగా ఉన్నట్టుగా కనపడుతూ వారిని దూరం పెడుతూ విలువల వంకతో అసహ్యించుకుంటూ ఉండే స్వభావమా జయంతిది అన్నట్టుగా ఉంటుంది. ‘నాకు ఉద్యోగం వచ్చింది వనితా విహార్‌లో. అక్కడంతా ఆడవాళ్లే ఉంటారు తెలుసా?’ అని ఎంతో సంతోషంగా చెప్తుంది బామ్మతో. అదే జయంతి ‘మీరంటే నాకు అసహ్యం’ అని అనేక సార్లు చెప్తుంది రాజశేఖరంతో. ఎందుకు అసహ్యం? ఏమో. తెలియదు. వీరిద్దరూ కలవాలి. అందుకొక సుదీర్ఘ ప్రయాణం అవసరం. ఆ ప్రయాణమే పాఠకులను ఉత్కంఠకు గురిచేసి లక్షలాది మందిని గోళ్లు కొరుక్కునేలా చేసి ఈ నవలను ఇప్పటికి 86 సార్లు రీ ప్రింట్కు తెచ్చింది. ఊహించండి. ఒక అమ్మాయి. నెలకు నూట యాభై రూపాయల జీతం వస్తే చాలు అనే మధ్యతరగతి పిల్ల. అతడు? ఈ మధ్యనే ఆరు లక్షల ఆదాయాన్ని చూసిన వ్యాపారవేత్త. పైగా ఎప్పుడూ చుట్టూ ఆడవాళ్లు. రేఖారాణి అనీ, మిసెస్ వర్మ అనీ, మిసెస్ కరుణాకరం... ప్రమీల.... ఏదో ఒక గాసిప్. ఇలాంటి వ్యక్తి దగ్గర పని అంటే సింహం బోనులో ఉన్నట్టే. ఆ సింహం తన రాజసంతో, దర్పంతో, ఠీవితో ఆకర్షిస్తూనే ఉంటుంది. కాని ఏ క్షణం నోట కరుచుకుంటుందోనని భయం. జయంతి ఈ రెండు భావాల మధ్యా నలిగిపోతూ తప్పుల మీద తప్పులు చేస్తుంటుంది. రాజశేఖరంను ఒక్కసారి కూడా అర్థం చేసుకోదు. అభిమానంతో చీర కొనిస్తే దానిని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. ఒక మంచి పార్టీలో అందరి సమక్షాన ఆమెను తన కాబోయే భార్యగా ప్రకటిద్దామనుకుని- కాసింత మంచి చీర కట్టుకోరాదూ అని రాజశేఖరం సూచిస్తే అది తన పేదరికం మీద, ఆత్మాభిమానం మీద కొట్టిన దెబ్బగా భావించి గింజుకుంటుంది. ఏదో కారణాన ఎవరో ఒక స్త్రీ అతని భుజం మీద తల వాల్చి ఓదార్పు చెందుతుంటే అది చూసి ఇతడు దుర్మార్గుడే అనే శాశ్వత నిర్ణయానికి వచ్చేస్తుంది. నిజానికి జయంతి నెలకు నూటయాభై రూపాయల స్థితి ఉన్న మనుషులతోనే కొంచెం సౌకర్యంగా ఉండగలదు. శివరామ్లాంటి మామూలు ఉద్యోగి సమక్షంలో ఆమెకు కొంచెం ఊపిరి ఆడుతుంటుంది. కాని ఆ సంగతి అతడికి చెప్పదు. పైగా రాజశేఖరం ఈర్ష్య పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా గ్రహించకుండా తన స్థాయి మగవాళ్లతో చనువుగా మాట్లాడుతుంటుంది. వద్దని వారిస్తే, అది ప్రేమ అని గ్రహించక- ఏమిటి ఇతని అధికారం అని మరింత అసహ్యించుకుంటూ ఉంటుంది. ఈ అసహ్యం, ఇబ్బంది పెరిగి పెరిగి బెంగళూరు పారిపోతుంది. అక్కడ ఎవరెవరి దగ్గరో ఉంటూ దారీ తెన్నూ సొంత అభిప్రాయాలూ లేకుండా బతుకుతూ చివరకు తాను ఇన్నాళ్లూ కోల్పోయిన పెన్నిధి ఏమిటో గ్రహించి రాజశేఖరం దగ్గరకు తిరిగి వస్తుంది. నవల ముగింపువాక్యం - ఆమె అతణ్ణి గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుంది- కాదు. అతడి శిరస్సును తన హృదయానికి హత్తుకుంది - కాదు. భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకుంది. అంతే. ఇలా భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకునే జయంతితో భవిష్యత్తులో రాజశేఖరం ఎలా జీవించినా ఆమె అంత వరకూ వచ్చినందుకు పాఠకులకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఎక్కడలేని ఉత్కంఠ తీరి సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఇవ్వడంలోనే ఈ నవల విజయం అంతా ఉంది. 1960లలో- అంటే ఈ నవలా కాలానికి దేశంలో రెండు ఉన్నాయి. ఒకటి- స్వాతంత్య్రం వచ్చి ఆడపిల్లలు కొద్దోగొప్పో బయటకు వచ్చి, చదువుకొని, ఉద్యోగాలకు ప్రయత్నించడం. రెండు- ఆర్థికంగా ఇంకా కుదురుకోనందు వల్ల సమస్యలు పెరిగి పెళ్లిళ్లు, కార్యాలు వంటివి అసంభవంగా మారడం. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఎంచుకునేవాడు, లేదా తాము ఎంచుకునేవాడు ఒక రాజశేఖరంలా ఉండాలని ఏ ఆడపిల్లయినా కోరుకోవడంలో వింత లేదు. వాస్తవలోకంలో ఆ పని జరిగినా జరగకపోయినా కనీసం ఊహాలోకంలో అయినా ఆ పని జరిగేలా చేసి- లక్షలాదిమందికి తెలియని ఆనందం ఇచ్చిన నవల- సెక్రటరీ. అంతే కాదు, ఒక తరాన్ని తీవ్ర ప్రభావంలో ముంచెత్తి తమకు కాబోయే భర్తలను రాజశేఖరంతో పోల్చి చూసి నిరాశ చెందేంత వరకూ వెర్రెత్తించిన నవల ఇది. సెక్రటరీలో సాహిత్యం లేకపోవచ్చు. ఇది సాహిత్య నవలల సరసన చేరకపోవచ్చు. కాని తన సులభమైన శైలి వల్ల, సరళమైన కథనం వల్ల, రాజు - పేద అనే రెండు బలమైన వర్గాల ప్రాతినిధ్య పాత్రల వల్ల ఆకర్షించి, వానాకాలం చదువులు చదివిన ఆడవాళ్లను కూడా పఠితులను చేసి, వారి చేత చదివించేలా చేసి, తెలుగునాట కొత్త పాఠకులను తయారు చేసిన నవల ఇది. ఆ పాఠకుల్లో కొందరైనా మంచి సాహిత్యం వైపు ప్రయాణించకుండా ఉంటారా? అదీ- సెక్రటరీ కాంట్రిబ్యూషన్. యద్దనపూడి సులోచనారాణి ఏ ముహూర్తాన సెక్రటరీ ఫార్ములాను కనిపెట్టారోగాని ఇది సీరియల్‌గా వస్తుండగా పే చేసింది. నవలగా పే చేసింది. సినిమాగా పే చేసింది. నిన్న మొన్న దీని ఆధారంగా ‘రాధ- మధు’ సీరియల్ తీస్తే ఘన విజయం సాధించి మరీ పే చేసింది. అంటే ఇందులో మనుషులకు ఇష్టమైనదేదో ఉంది. ఉంటుంది. ఇవాళ సెక్రటరీలు లేరు. పోయారు. ఆ స్థానంలో పీఏలు వచ్చారు. సెక్రటరీ అనేది పైస్థాయి మాటై కూచుంది. అలాగే ఈ నవలలో కనిపించే అనాబ్‌షాహీ ద్రాక్ష తోటలు కూడా హైదరాబాద్‌లో లేవు. పోయాయి. వాటి స్థానంలో గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. ఆ మాటకొస్తే తెలుగులో నవలలైనా ఏం మిగిలాయని? అవీ పోతున్నట్టే. పోనివ్వండి. ఏవి ఎటు గతించినా సెక్రటరీకి మాత్రం గతింపు లేదు. ఎందుకంటే అందులోని అనాయాస రుచి అలాంటిది. అది జో కొట్టే కలల ప్రపంచమూ అలాంటిదే. నవల: సెక్రటరీ రచయిత: యద్దనపూడి సులోచనారాణి తొలి ముద్రణ: 1965 (1964లో జ్యోతి మాసపత్రికలో ధారావాహికం) ఒక కాలపు మధ్యతరగతి ఆడపిల్లల ఆలోచనలని, ఆశలని, ఆత్మాభిమానాలని, అయోమయాలని అందిపుచ్చుకొని ఊహాలోకాల్లో విహరింపజేసి విస్తృత పాఠకాదరణ పొందిన నవల. తెలుగు పాప్యులర్ ఫిక్షన్లో మైలురాయి. తెల్లగా, పొడుగ్గా, హుందాగా ఉండే ‘రాజశేఖరం’ అనే పాత్రను నవలా నాయకులకు మోడల్‌గా చేసిన నవల ఇది. లెక్కలేనన్ని పునర్ము ద్రణలు పొందింది.మార్కెట్లో లభ్యం. వెల: రూ.100 -
సాహితీ పురస్కారాలకు సూచనల ఆహ్వానం
నాంపల్లి, న్యూస్‌లైన్: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహిత్య పురస్కారాలను ప్రదానం చేస్తున్నది. 2012 సంవత్సరానికి ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు వివిధ వర్గాల నుంచి విశ్వవిద్యాలయం సూచనలు కోరుతోంది. వివిధ ప్రక్రియల్లో 2009 జనవరి నుంచి 2011 డిసెంబరు మధ్య కాలంలో తొలిసారిగా ప్రచురణ పొందిన గ్రంథాల్లో పాఠకులు ఉత్తమంగా భావించిన గ్రంథాలను అవార్డులకు సూచించ వచ్చు. వచన, కవిత, పద్య కవిత, బాల సాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం/నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం అనే 10 ప్రక్రియల్లో అన్నింటికి గానీ, కొన్నింటికి గానీ, తమకు నచ్చిన గ్రంథాలను సూచించవచ్చు. అనువాద సాహిత్య, విభాగానికి తప్ప మిగతా విభాగానికి అవార్డుల కోసం అనువాదాలు, అనుసరణలు సూచించరాదు. వచన రచన అనే ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, తాత్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి, కళలకు సంబంధించిన గ్రంథాలుండవచ్చు. అన్ని ప్రక్రియల్లోనూ ప్రామాణికమైన మౌలిక గ్రంథాలే ఉండాలి. కవితా సంపుటిలైతే కనీసం 60 పేజీలు, మిగతా ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గకూడదు. బాల సాహిత్యం, నాటకం ప్రక్రియల్లో పుటల పరిమితి లేదు. తెల్లకాగితంపై పాఠకులు తమ సూచనల్ని రాసి రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు-4 చిరునామాకు నవంబరు 20 లోగా పంపించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో కోరారు.