మన తెలుగు సాహిత్యం మరో కోహినూర్‌! | thousands of Telugu liturature books in the British Library | Sakshi
Sakshi News home page

మన తెలుగు సాహిత్యం మరో కోహినూర్‌!

Published Sun, Dec 24 2017 1:05 AM | Last Updated on Sun, Dec 24 2017 3:18 AM

thousands of Telugu liturature books in the British Library - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కోహినూర్‌ వజ్రం.. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రాల్లో ఒకటి. తెలుగు నేలపై దొరికిన ఆ వజ్రం ఎక్కడుంది? బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ కిరీటంలో.. ఆంగ్లేయులు దానిని దేశం నుంచి తరలించుకుపోయారు. ‘ప్రపంచం మొత్తం చేసే ఒక రోజు ఖర్చులో సగం విలువ.. కోహినూర్‌ సొంతం’అని మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ తన బాబర్‌నామాలో ప్రస్తావించాడట. అంతటి విలువైన ‘తెలుగు’కోహినూర్‌ను సొంతం చేసుకున్న బ్రిటన్‌.. అంతకుమించిన అద్భుత తెలుగు సాహిత్య సంపదనూ సొంతం చేసుకుంది. ఒకటి రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో తెలుగు గ్రంథాలు బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని బ్రిటిష్‌ లైబ్రరీలో ఉన్నాయి.

ఆ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు 8,639!
ప్రపంచ సాహిత్యంలో వినూత్న ప్రక్రియలకు నెలవు తెలుగు సాహిత్యం. ఈ ఔన్నత్యాన్ని ఇటీవలే ప్రపంచ తెలుగు మహాసభలు మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కరించాయి. అంతటి సమున్నత తెలుగు సాహిత్యంలో ఎంతోమంది ఉద్ధండులు ఎన్నో గ్రంథాలు రాశారు. కానీ వాటిలో చాలా వరకు మనకు అందుబాటులో లేవు. ఇలా అలభ్యంగా ఉన్న గ్రంథాలెన్నో బ్రిటిష్‌ లైబ్రరీలో ఉన్నట్లు గుర్తించారు. అవీ ఒకటి రెండు కాదు ఏకంగా 8,639 పుస్తకాలు కావడం గమనార్హం. ఇందులో రెండు మూడు వేల గ్రంథాలు, పుస్తకాలు మన వద్ద అందుబాటులో లేనివేనని అంచనా. 1700 సంవత్సరం నుంచి 1970 వరకు వివిధ సమయాల్లో వెలువడిన తెలుగు గ్రంథాలు, పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఆంగ్లేయులు స్వాతంత్య్రం వరకు వివిధ సందర్భాల్లో భారత్‌ నుంచి పలు భాషల గ్రంథాలను లండన్‌కు తరలించారు. తర్వాత కూడా ఇది కొనసాగింది. అయితే అంతకుముందు జరిగింది కొల్లగొట్టడంకాగా.. తర్వాత కొనసాగింది ‘సేకరణ’. ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రంథాలయం లండన్‌ గడ్డపై ఉండాలన్న సంకల్పంతో ఈ పుస్తకాలను తరలించారు.

ఎలా తెలిసింది..?
ప్రపంచ సాహిత్యానికి తెలుగు నేల అందించిన సారస్వతం ఎనలేనిది. కానీ భావితరాల కోసం భద్రపరిచే విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. దాంతో ఇప్పటివరకు తెలుగు భాషలో ఎన్ని గ్రంథాలు వెలువడ్డాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయనే లెక్కలేవీ లేవు. అయితే తాజాగా లండన్‌ బ్రిటిష్‌ లైబ్రరీలో భారీ సంఖ్యలో తెలుగు గ్రంథాలున్న విషయాన్ని పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ రాజారెడ్డి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన ఇటీవల బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్న శాతవాహనుల నాణేలపై పరిశోధన కోసం లండన్‌ వెళ్లారు. ఆ సమయంలో బ్రిటిష్‌ లైబ్రరీని కూడా సందర్శించారు. అక్కడి కేటలాగ్‌ (పుస్తకాల జాబితా)లను పరిశీలిస్తుండగా.. తెలుగు పుస్తకాల కేటలాగ్‌ కనిపించింది. దాన్ని పరిశీలించగా ఆ లైబ్రరీలో 8,639 తెలుగు పుస్తకాలున్నట్టు తేలింది. వెంటనే విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాలు కావాలని సిబ్బందిని కోరగా.. కొద్దిసేపట్లోనే 21 పుస్తకాలను తెచ్చి ఇచ్చారు. తెలుగు నిఘంటువుకు రూపమిచ్చిన బ్రౌన్‌ పుస్తకాలు కావాలని అడిగితే.. 27 పుస్తకాలు తెచ్చిపెట్టారు. ఇలా వేలకొద్దీ తెలుగు పుస్తకాలు అక్కడ కనిపించేసరికి రాజారెడ్డి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఈ విషయాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

తెలుగు మహాసభల నేపథ్యంలో..
బ్రిటిష్‌ లైబ్రరీ పుస్తకాల విషయంగా ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు కసరత్తు మొదలైంది. నందిని సిధారెడ్డి నెల రోజుల కింద లండన్‌లోని ప్రవాస తెలుగువారు సృజన్‌రెడ్డి, కరుణనాయుడు, ఆదిత్య తదితరులకు ఆ పుస్తకాల వివరాలు సేకరించే బాధ్యత అప్పగించారు. వారు కొద్దిరోజులు కసరత్తు చేసి 1,200 పుస్తకాల పేర్లతో కేటలాగ్‌ తయారు చేశారు. ఆ జాబితాను ఇక్కడికి పంపారు. దీంతో కవి, పరిశోధకుడు జగన్‌రెడ్డి చేయూతతో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాల పట్టికతో కూడిన పుస్తకాన్ని ముద్రించింది. త్వరలో మిగతా పుస్తకాల వివరాల సేకరణకు చర్యలు చేపట్టింది. మొత్తం వివరాలన్నీ క్రోడీకరించి.. ఆ జాబితాలో మనవద్ద అందుబాటులో లేని పుస్తకాలను గుర్తించనున్నారు. వాటిని బ్రిటిష్‌ లైబ్రరీ సాయంతో స్కాన్‌ చేయించి, తిరిగి ఇక్కడ ముద్రింపజేసే ప్రయత్నం జరుగుతోంది.

ప్యారిస్‌ లైబ్రరీలో కూడా..
ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లోని గ్రంథాలయంలోనూ పెద్ద సంఖ్యలో తెలుగు పుస్తకాలున్నట్టు బ్రిటిష్‌ లైబ్రరీలో సమాచారం ఉంది. ప్యారిస్‌ లైబ్రరీలోని పుస్తకాల వివరాలతో కూడిన కేటలాగ్‌ బ్రిటిష్‌ లైబ్రరీలో ఉంది. అందులో తెలుగు పుస్తకాల వివరాలూ ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు పుస్తకాలు ఉన్నాయనే వివరాలు సేకరించాల్సి ఉంది.

వందల ఏళ్లనాటి గ్రంథాలెన్నో..
తెలుగు నేలపై పుస్తకాల ప్రచురణ 1750 సమయంలో మొదలైందని అంచనా. 1850లో వచ్చిన ఓ పుస్తకం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ‘వందేళ్లలో తెలుగు పుస్తకాలు’పేరుతో మంగమ్మ అనే పరిశోధకురాలు 1850లో ఓ పుస్తకాన్ని వెలువరించారు. అది ఇక్కడ లభించకున్నా బ్రిటిష్‌ లైబ్రరీలో భద్రంగా ఉంది. లైబ్రరీలో గణితం, పురాణం, ఇతిహాసం, చరిత్ర.. ఇలా 13 అంశాల్లో తెలుగు పుస్తకాల జాబితాలు పొందుపరిచారు. 17వ శతాబ్దంలో ధూర్జటి రచించిన కాళహస్తి మహత్మ్యము మొదలు భాస్కర శతకం, దాశరథి శతకం, రకరకాల పెద్ద బాలశిక్షలు, లావణ్య శతకం, కాళహస్తి లింగాష్టకం, కవిజన రాజసం, హంస వింశతి కథలు, వివేక సంగ్రహం, మదాలసోపాఖ్యానం, గ్రంథ తంత్రం.. ఇలా (తాజా సేకరణలోనివి మాత్రమే) ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి.

అద్భుతంగా పరిరక్షణ...
ఇక్కడి పుస్తకాలు అటు తరలాయే అన్న బాధ ఉన్నా.. బ్రిటిష్‌ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాలు నిక్షేపంగా ఉన్నాయి. మన వద్ద లైబ్రరీలలో చెద పురుగులకు ఆహారంగా మారే దుస్థితి ఉండగా.. బ్రిటిష్‌ లైబ్రరీలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా సురక్షితంగా ఉండడం గమనార్హం.

తిరిగి ముద్రించుకోవాలి
‘‘బ్రిటిష్‌ లైబ్రరీలో గొప్ప తెలుగు సాహితీ సంపద పదిలంగా ఉంది. అక్కడున్న వాటిలో మన వద్ద లేని పుస్తకాలను భాషా పండితులు గుర్తించాలి. వాటిని స్కాన్‌ చేసుకువచ్చి, తిరిగి ముద్రించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల తెలుగు పుస్తకాలున్నట్టు అంచనా. తంజావూరు గ్రంథాలయంలో కృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యద తాళపత్ర గ్రంథం ఉంది. 780 తెలుగు గ్రంథాలూ ఉన్నాయి. మైసూరు గ్రంథాలయంలోనూ తెలుగు పుస్తకాలు ఉన్నాయి..’   – రాజారెడ్డి, చరిత్రకారుడు

అన్ని పుస్తకాలు సేకరిస్తాం
‘‘రాజారెడ్డి గొప్ప మేలు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్‌ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు సేకరిస్తున్నాం. వాటిలో మన వద్ద అలభ్యంగా ఉన్న పుస్తకాలను తెలుగు నేలపైకి తెస్తాం..’’ – నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement