Telugu Books
-
డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు
‘డిజిటల్ హ్యుమానిటీస్’ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. ఆ దిశగా చాలా పరిశోధనలూ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ భాషలు వీటిని అందుకోవడంలో కాస్త వెనుకబడే ఉన్నాయి. డిజిటల్ రంగంపై కరోనా విశేష ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో తెలుగు భాగస్వామ్యాన్ని అంతర్జాలంలో మరింత పెంచాల్సివుంది. కరోనా కల్పించిన అనివార్యత వల్ల సమాచారం కోసం, మొదట్లో మృదు ప్రతుల్ని కంప్యూ టర్, ఫోన్ స్క్రీన్ల మీద చదవడం కొంత ఇబ్బంది కలిగిం చినా, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ‘ఫలానా బుక్ సాఫ్ట్ కాపీ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది’ అనే అలవాటు లోకి వచ్చేశాం. అందుకే డిజిటల్ వేదికపై సాహిత్యం, కళలువంటి మానవీయశాస్త్రాలతోపాటు వాణిజ్య, వైద్య, సైన్స్, రాజకీయ మొదలైన సకల శాస్త్రాల సమాచారాన్ని పరిశోధకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ అందుబాటులో ఉంచాలి. భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతోన్న సమాజాల్లో సమాచార లభ్యత ప్రధాన సమస్య. దీన్ని అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల తక్షణావసరం. సమాచారంపై కొందరి గుత్తాధిపత్యాన్ని తొలగించేలా రచయితలు, ప్రభుత్వాలు, ముద్రణాసంస్థలు పరస్పరావగాహనతో ముందు కెళ్ళాలి. తెలుగు ప్రభుత్వాలు దీన్ని లాభసాటి కార్యక్రమంగానో, సమాజోద్ధరణగానో చూడకుండా ఇవాళ్టి పోటీ ప్రపంచంలో అనివార్యంగా దాటవలసిన మైలురాయిగా పరిగణించాలి. ప్రభుత్వరంగ సంస్థలే పూనుకొని ఆయా రచయితలతో, ముద్రణాసంస్థలతో చర్చలు జరిపి, వారికి కావలసిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక వెసులుబాట్లకు సంబంధించిన ‘ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలి. దీనికోసం అవసరమయ్యే కొత్త చట్టాలను తేవాల్సిన, సర్దుబాటు చర్యలను చేపట్టాల్సిన పెద్దన్న పాత్రను ప్రభుత్వాలు పోషించక తప్పదు. (చదవండి: బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’) ప్రజలకు తక్షణం వినియోగపడటానికి కావలసిన సమాచారం మొదట కనీసం పీడీఎఫ్ రూపంలోనైనా ఉంచాలి. యూనికోడ్లో ఉంచగలిగితే మరింత ప్రయోజనకరం. ఈ రూపంలో ఉంచడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజ్యమేలుతున్న పేజ్మేకర్ సాఫ్ట్వేర్ స్థానంలో యునికోడ్ ఫాంట్స్ వాడేలా రచయితలను, ముద్రణారంగాన్ని ప్రోత్సహించాలి. పేజ్మేకర్లో ఉండే అనేకరకాల వెసులుబాట్లను యునికోడ్‌లో కూడా జోడించడానికి ఐఐటీ, ఐఐఐటీ, వికీపీడియా, తెలుగు ఫాంట్స్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పని చేయాల్సి ఉంటుంది. దాంతోబాటు ఇంగ్లిష్‌కు ఉన్నట్టు తెలుగుకు కూడా ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెస్తే మరో అద్భుతం చేసినవాళ్ళవు తారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు పీడీఎఫ్ రూపంలో కోట్లాది పుటల్లో ఉన్న సమాచారాన్ని ఒక్క మీట నొక్కుతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకునే వెసులు బాటు ఉంటుంది. తమ సంస్థల్లో ముద్రితమవుతోన్న ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాల్ని విధిగా ఆ సంస్థలచేత ఆధునిక పద్ధతుల్లో ‘సమాచార నిధి’(డేటా బేస్) తయారు చేయించాలి. తెలుగు పుస్తకాల సమాచారం ఒక దగ్గరకు తీసుకురావాలి. ఆ పుస్తక సంబంధిత పీడీఎఫ్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కాపీని అంతర్జాలంలో పెట్టడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అంతర్జాలంలో పుస్తకాల్ని చదవడం ద్వారా వచ్చే ఆదాయం రచయితకు అందేలా చూడాలి. ప్రతి ముద్రిత ప్రతికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్థలకు పంపేలా చూడాలి. (చదవండి: రైతు ఆదాయంపై అర్ధసత్యాలు) ఇప్పటికే యంత్రానువాదం (మిషన్ ట్రాన్స్లేషన్) అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగ్గా అందించాలి. ముఖ్యంగా యూజర్ ఫ్రీ అప్లికేషన్స్ రావడం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. జ్ఞానాన్ని డిజిటల్ మాధ్యమంలో ఉంచే ప్రక్రియ నిరంతరం చేయగలిగితే ప్రజల్లో విషయ సంబంధిత అవగాహన పెరుగుతుంది. తెలుగులో రాస్తోన్న సకల శాస్త్రాల సమా చారం అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలు వేగ వంతమవుతాయి. తెలుగు పరిశోధనల్లో ముఖ్యంగా భాషా పరిశోధనల్లో కొత్తశకం ప్రారంభమౌతుంది. తెలుగు భాషలో ఏ అక్షరం ఎవరు రాశారు? ఏ అక్షరాలను ఎవరు, ఎక్కడి నుంచి, ఎంతశాతంలో వాడుకొన్నారు మొదలైన విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. తద్వారా పరిశోధనల్లో కచ్చితత్వం, నిర్దిష్టత, నిర్దుష్టత సాధ్యమై సారవంతమైన ఫలితాలు వస్తాయి. – డా. ఎస్. చంద్రయ్య, టి. సతీశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం -
అక్షరాలతో ఆలయాల అద్భుత యాత్ర
‘‘గుడి అంటే కేవలం ఒక రాతిబొమ్మ మాత్రమే కాదు. గుడి ఒక భావన . ఎప్పుడో ఏ పురాణ కాలంలోనో జరిగిన ఏ ఘట్టంతోనో గుడి ముడి పడి ఉంటుంది. శతాబ్దాల క్రితం చెక్కిన శిల్పం, వందల ఏళ్లుగా మొక్కుతున్న దైవం, ధ్వజస్తంభం పాదాల వద్ద శతాబ్దాల దీపమాలికల నూనె చారికలు, మోగి మోగి ముసలివైనా కంఠం మూగవోని గంటలు కూడా కథలెన్నో చెబుతాయి’’ అని కస్తూరి రాకా సుధాకర్ రావు తన ‘అడుగడుగునా గుడి ఉంది’ అనే పుస్తకంలో తన మాటలుగా చెప్పుకున్నారు. 25 ఆలయాల చరిత్ర ఉన్న ఈ పుస్తకంలో ఆయా ఆలయాలకు సంబంధించిన విశేషాలన్నీ ఇప్పటికే కొన్ని వందలు, వేల వాట్సాప్ గ్రూపులలో రచయిత పేరు లేని షేర్లుగా చాలా మంది చదివినవే కావచ్చు. అయితే ఇంకా ‘స్మార్ట్’ కాని వారు, సామాజిక మాధ్యమాలకు కాస్త దూరాన్ని పాటించేవారు ఇందులోని విషయాలను హాయిగా చదివి మనో నేత్రాలతోనే ఆయా ఆలయాలను దర్శించి ఆత్మానందాన్ని పొందుతారు. ‘గూగుల్ తల్లికి తెలియని గుడి’ అంటూ గోల్కొండ నుంచి భువనగిరి వెళ్లే మార్గంలో అప్పటికే కొన్ని వందల ఏళ్ల నుంచి విలసిల్లుతూ, శిథిలావస్థకు చేరి, అక్కన్న మాదన్నలు పునరుద్ధరించిన వేణుగోపాలుడి ఆలయం గురించిన విశేషాలు అబ్బుర పరుస్తాయి. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో తలపై నిప్పుల కుంపటి పెట్టుకుని పదిహేను వందల ఎకరాలలో నడయాడి మరీ జాగీర్దార్ను మెప్పించి పెరుమాళ్లు పంతులు కట్టించిన వరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి చదువుతుంటే తెలియని తన్మయత్వం కలుగుతుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ముదిగోళం గ్రామంలోని ఎలుక జోస్యం చెప్పే ఆలయం, (చిలక జోస్యం కాదు) కోరిన కోరికలు తీర్చే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి గుడి... ఇంకా ఎన్నో విశేషాలతో కూడిన రాకా రాతలకు తోడు ఆయా ఆలయాల అసలు శిల్పాలతో పోటీపడే వేణు మాధవ్ గీతలు... చదువరులకు విందు భోజనమే. రచయిత సీనియర్ పాత్రికేయులు కావడంతో వ్యర్థ పదాలు, అనవసర వాక్యాలు లేకుండా పుస్తకంలోని అన్ని శీర్షికలూ ఆసక్తిగా చదివిస్తాయి. అడుగడుగున గుడి ఉంది రచన: కస్తూరి రాకా సుధాకర్ రావు పుటలు: 146; వెల రూ. 100 ప్రతులకు: ప్లాట్ నం. 79, వీ ఆర్ ఆర్ ఎన్క్లేవ్ దమ్మాయిగూడ, హైదరాబాద్– 500 083 ఫోన్: 9000875952 జ్ఞాపకాల గుబాళింపు సాధారణంగా డాక్టర్ అనగానే వంటికి తెల్లకోటు, మెడలో స్టెత్, డెటాల్, స్పిరిట్.. ఇప్పుడైతే శానిటైజర్ వాసనా గుప్పుమంటాయి. అయితే ఈవిడేమిటీ, ముఖ పుస్తకం నుంచి ముద్రణాలయాల వరకూ... మామూలు పుస్తకాల నుంచి మహనీయుల మాటల దాకా దేనినీ వదలకుండా పూల గుత్తిలా గుచ్చి దానిని సింపుల్‌గా ‘ఒక భార్గవి’ అని చెప్పేశారు... ఈవిడ మెడికల్ డాక్టరే కాదు.. లిటరరీ డాక్టర్ కూడానేమో అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. జ్ఞాపకాల పొదరిల్లు అంటూ తను కన్ను తెరిచాక చూసిన ఇంటి జ్ఞాపకాలతో మొదలు పెట్టిన భార్గవి ‘మోహనం... సమ్మోహనం’ లో మోహన రాగాన్ని వినిపించారు. దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారి స్వీయచరిత్ర గురించి చెప్పుకొచ్చారు. అమ్మ కన్నా పెద్ద అమ్మతో తన ఆత్మీయతానుబంధాన్ని వర్ణించారు ‘మమతల పాలవెల్లి మా అమ్మ’లో. ఆ తర్వాత మంగళంపల్లి వారి సురాగాల జల్లులోనూ, పెదనాన్న జ్ఞాపకాలతోనూ గుండె తడి చేస్తారు. తర్వాత ఆపాత మధురం అనే మ్యూజికాలజిస్ట్ హాసం రాజాగారి పుస్తకాన్ని సమీక్షిస్తారు. ఇంకా బోలెడన్ని పండుగలు, పర్వదినాల జ్ఞాపకాలతో గుమ్మెత్తిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వృత్తి వైద్యమే అయినా, ప్రవృత్తి అయిన సంగీత, సాహిత్యాల లోతులు తరచే ప్రయత్నంలో సినిమాలూ, పుస్తకాలూ, ప్రముఖ వ్యక్తుల గురించి రాసిన ఈ వ్యాసాల సంకలనంలో తడమని అంశమంటూ లేనే లేదు. ఒక పక్క పాఠక దేవుళ్లకి సాహితీ నైవేద్యం పెడుతూనే, మరో చెంప అవసరమైన చోట తన వృత్తిగతమైన వైద్య విషయాలను కూడా అలవోగ్గా అందించేయడం ఈ డాక్టరమ్మ కలంకారీతనానికి అద్దం పడుతుంది. అందమైన అక్షరాలు, వాటికి తగ్గట్టు గిరిధర్ గౌడ్ గీచిన చక్కటి వర్ణచిత్రాలు ఈ పుస్తకానికి సిరాక్షరాలు. ఒక భార్గవి పుటలు: 268, వెల రూ. 320 ప్రతులకు: డా. భార్గవి, ఫోన్ : 08674 253210, 253366; మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు – డి.వి.ఆర్. -
మరో గీతాంజలి
ఓ పదహారేళ్ల అమ్మాయి తన మరణశయ్యపై మనోదుఃఖ గీతాలు రచించి వాటిని ఎవరికీ వినిపించకుండానే తిరిగి రాని లోకానికి మహాప్రస్థానం చేసింది. ఆమె పేరు గీతాంజలి ఘెయ్. ఆమె కవిత్వానికి రవీంద్రుని గీతాంజలి ప్రేరణ అని, ఆమె ఊపిరికి రవీంద్రుని కవిత్వమే ప్రాణవాయువని ఆమె కవితలే చెపుతాయి. I am named GITANJALI After the famous book of Tagore I wish and pray Oh! help me God I so live that I live up to the name గీతాంజలి 1961 జూన్ 12న మీరట్‌లో జన్మించింది. చిన్న వయసులోనే కేన్సర్ వ్యాధికి గురైంది. గీతాంజలికి ఆంగ్లంలో పద్యాలు రాయటమన్నా, ప్రకృతి దృశ్యాలను పెయింట్ చేయటమన్నా ఎంతో ఇష్టం. కానీ తాను మృత్యువు ఒడిలో ఉన్నానని తొందరగానే తెలుసుకుంది. అయినా తల్లి ఖుషీ భద్రుద్దీన్ కూడా తన దుఃఖంలో పాలు పంచుకోవటం ఆమెకు ఇష్టం లేదు. తన గదిలో, హాస్పిటల్లో కూడా ఏకాంతంగానే గడిపింది. బొంబాయిలో వాళ్లున్న ఇల్లు సముద్ర తీరానికి దగ్గర్లో ఉండేది. సముద్ర కెరటాలను పరికించటం ఆమె దినచర్యలో భాగమైంది. జీవితానికి సముద్రం సాదృశమని కాబోలు. 1977 ఆగస్టు 11న గీతాంజలి మరణించింది. గది మూలల్లో, సోఫా కవర్లలో, చదువుకునే పుస్తకాల వెనుక అట్టల మీద, బెడ్ కింద చిన్న కాగితాలపై రాసివున్న కవితలను గీతాంజలి తల్లి ఆ తర్వాత గమనించింది. తన చిన్నారి కుమార్తె రాసిన కవితలని ఆమెకు అర్థమైంది. గీతాంజలి కవితలు ప్రఖ్యాత ఆంగ్ల జర్నలిస్ట్ ప్రీతిష్ నంది హృదయాన్ని కదిలించాయి. తన సంపాదకత్వంలో వెలువడుతున్న ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో మొదటిసారిగా ఆయన వాటిని ప్రచురించారు. వాటికి ఊహించని పాఠక స్పందన లభించింది. గీతాంజలి కవితల్లో మార్మికత ఎక్కువ. ‘యాన్ ఎప్పీల్’ అనే కవితలో ‘మరణమా! ఎన్నోసార్లు నీవొస్తావని అనుకున్నా. ఆశించినప్పుడల్లా నీవు రాలేదు. తప్పకుండా నన్ను తీసుకెళ్లాలనుకుంటే దయ చూపించు ఎక్కడా బాధపడని ఎవరూ బాధించని బాల్యంలో హాయిగా నిద్రించినట్లు నేను నిద్రపోయే ఆ చోటికి నన్ను తీసుకెళ్లు’ అంటుంది. అందమైన జీవితం. అయినా నీడలా వెంటాడిన మృత్యువు. దానితో పోరాటం సాగించిన గీతాంజలి ఆత్మసై్థర్యం ఈ కవితల్లో వస్తువులు. 1983లో ‘పొయెమ్స్ ఆఫ్ గీతాంజలి’ పుస్తకంగా వచ్చింది. చిన్నారి గీతాంజలి గీతాలు చీకటిలో చిరుదివ్వెల్లా, బాధాతప్త హృదయాలను వెలుగుమయం చేస్తాయి. -
నిన్ను ఎవరు సరిగ్గా గుర్తిస్తారు?
ఇండియన్– అమెరికన్ కమ్యూనిటీ నేపథ్యంతో ఉండే రాకేష్ సత్యాల్ రాసిన రెండవ నవల, ‘నో వన్ కాన్ ప్రొనౌన్స్ మై నేమ్’ ఒమాహా రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. డిపార్టుమెంట్ స్టోర్‌లో పురుషుల సెక్షన్లో ఉద్యోగం చేసే హరిత్, నలబైల్లో ఉన్న బ్రహ్మచారి. వలస వచ్చిన రెండవ తరపు భారతీయుడు. అక్క స్వాతి, దుర్ఘటనలో చనిపోవడంతో అతని తల్లి మతి చెడుతుంది. కంటిపొర వల్ల చూపు సరిగ్గా ఆనని ఆమెని ఊరడించడానికి, ప్రతి రాత్రీ స్వాతి బట్టలు తొడుక్కుని తానే అక్కయినట్టు నటిస్తుంటాడు. ‘ఈ బట్టలు మార్చుకోవడం అన్న ఆట ఎప్పుడు ప్రారంభం అయిందో అతనికే తెలియదు... ఒకరోజు స్వాతి లిప్‌స్టిక్ తన పెదవుల మీద ఆన్చుకున్నప్పుడు, అది దినచర్య అవుతుందని అతనికి తెలుసు.’ ఆ ఆట అతనికి ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగానికి తప్ప ఇంటి బయటకి కదలని హరిత్ను అతని స్టోర్‌లోనే పని చేసే సమలైంగికుడైన టెడ్డీ, శుక్రవారాలు పబ్‌కు తీసుకెళ్ళడం మొదలెడతాడు. ఒహాయోలోనే ఉండే మధ్యవయస్కురాలైన రంజన కొడుకు ప్రశాంత్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళిపోతాడు. ఆమెకు డాక్టరైన భర్త మోహన్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానం. ‘తనూ మోహన్ శృంగారంలో పాల్గొన్న ఆఖరిసారి గుర్తే లేదు... అతని శరీరాకృతి అచ్చం భారతీయ పురుషుల వంటిదే. అయిదవ నెల గర్భిణీ లాంటి పొట్ట’ అనుకుంటుంది. రహస్యంగా ప్రేమకథలు రాస్తూ, రచయితల గుంపు చర్చల్లో భాగం పంచుకుంటుంటుంది. ఇతర భారతీయ స్త్రీలతో స్నేహం ఆమెకి నిరాశ కలిగిస్తుంది. ఖాళీగా ఇంట్లో కూర్చోలేక ఒక ఇండియన్ డాక్టర్ ఆఫీసులో, రిసెప్షనిస్టుగా పని చేయడం మొదలెడుతుంది. తండ్రికి నచ్చదని తెలిసీ ప్రశాంత్ తన సబ్జెక్టు మార్చుకుంటాడు. తల్లిదండ్రులు తనని సెమిస్టర్లోç రెండుసార్లు మాత్రమే కలుసుకోవాలన్న షరతు విధిస్తాడు. రంజన, హరిత్– ఇద్దరూ ఇతరులతో ఏదో విధమైన లోతైన సంబంధం కోసం వెతుకుతుంటారు. కానీ అదెలా సాధ్యమవగలదో ఇద్దరికీ తెలియదు. కొన్ని క్రమవారీ సంఘటనల వల్ల ఇద్దరూ కలుసుకున్నప్పుడు వారిమధ్య స్నేహం పెంపొందుతుంది. హరిత్ను కలుసుకున్న తరువాత తనకీ ఒక ఉనికంటూ ఉందనీ, తనూ మెచ్చుకోతగ్గ స్త్రీయే అనీ రంజన గుర్తిస్తుంది. ఎంతోకాలంగా తనలోనే దాచుకుని, నిర్వచించకుండా వదిలేసిన అనుభూతులని హరిత్ తెలుసుకుని, అది తమిద్దరి స్నేహం వల్లే సంభవించిందనుకుంటాడు. ఇద్దరూ తమ తమ మనఃస్థితులని అర్థం చేసుకుని, తమ భయాలని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. నవల ఆఖరున రంజన ఉత్తమ రచయిత్రిగా, కిక్కిరిసి ఉన్న ఆడిటోరియమ్‌లో ప్రసంగిస్తూ కనబడుతుంది. తన ఆందోళన వదిలించుకున్న హరిత్ స్వేచ్ఛగా, స్వలింగ సంపర్కుడిగా జీవితం కొనసాగిస్తాడు. ఈ ముగ్గురితోపాటు, రచయిత మరెన్నో చిన్న పాత్రలనీ పరిచయం చేస్తారు. పాత్రలనీ, వొంటరితనాన్నీ రచయిత హాస్యంగా, ఎంతో సానుభూతితో, సుకుమారంగా వర్ణిస్తారు. నవ్వు, ఉత్సాహం పుట్టించే ఈ నవల– లైంగిక గుర్తింపు, అమెరికాలో మొదటి తరపు భారతీయుల గురించినది. అమెరికన్లు భారతీయ పేర్లను సరిగ్గా ఉచ్ఛరించలేకపోవడమే నవల శీర్షికకి ఆధారం. భయం జీవితాల్లో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో, జీవితాలని ఎలా అడ్డగించి, నిర్వచించి, మలుపులు తిప్పగలదో అని చెప్పే ఈ నవలని ‘పికడోర్ యుఎస్ఎ’ 2017లో పబ్లిష్ చేసింది. ‘కిల్లర్ ఫిల్మ్స్’ నవలని సినిమాగా తీస్తోంది. రచయిత మొదటి నవల ‘బ్లూ బోయ్’ 2009లో అచ్చయింది. కృష్ణ వేణి -
స్టెఫాన్ త్సై్వక్
ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని యూదు కుటుంబంలో జన్మించాడు స్టెఫాన్ త్సై్వక్ (1881–1942). జ్వైగ్ అని కూడా రాస్తారు. జర్మన్ ఉచ్చారణ మాత్రం త్సై్వక్. యూదు ఆచారాల గురించి విస్తృతంగా రాసినప్పటికీ తనను యూదుగా భావించుకోలేదు. మా అమ్మా నాన్న యాదృచ్ఛికంగా యూదులు అన్నాడు. 1920, 30ల్లో అత్యంత పాఠకాదరణ ఉన్న రచయిత. ‘ద రాయల్ గేమ్’, ‘అమోక్’, ‘లెటర్ ఫ్రమ్ యాన్ అన్నోన్ ఉమన్’ నవలికలు బాగా పేరు తెచ్చాయి. ‘జర్నీ ఇంటూ ద పాస్ట్’, ‘బివేర్ ఆఫ్ పిటీ’, ‘ఎ ఫేర్వెల్ టు యూరప్’ లాంటి రచనల ఆధారంగా సినిమాలు వచ్చాయి. స్వీయ వర్ణనలో సిద్ధహస్తులు: కాసనోవా, స్టెండాల్, టాల్‌స్టాయ్; ముగ్గురు మాస్టర్లు: బాల్జాక్, డికెన్స్, దోస్తోవ్స్కీ లాంటి స్టడీలు రాశాడు. జీవిత చరిత్రలు వెలువరించాడు. భారతీయ సత్యాన్వేషణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ త్సై్వక్ రాసిన కథ ‘విరాట్’ను పొనుగోటి కృష్ణారెడ్డి తెలుగులోకి అనువదించారు. హిట్లర్ అధికారంలోకి వచ్చాక 1934లో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. తర్వాత కొన్ని నెలలు అమెరికాలో ఉన్నాడు. అటుపై బ్రెజిల్ చేరుకున్నాడు. కానీ ఎక్కడా ఆయనకు శాంతి లభించలేదు. తన లోపలి మనిషికీ బాహ్యంగా ఉంటున్న మనిషికీ మధ్య సమన్వయం కుదరక అరవయ్యో ఏట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకాల పుస్తకం ‘ద వల్డ్ ఆఫ్ ఎస్టర్డే’ చనిపోవడానికి ఒక రోజు ముందు పూర్తయ్యింది. 1881–1942 మధ్యకాలంలో ఒక మనిషి బతకడమంటే ఏమిటో ఈ పుస్తకం పట్టిస్తుందంటారు. -
గతంతో వర్తమానం సంభాషణ
మృదులా కోషీ రాసిన తొలి నవల, ‘నాట్ ఓన్లీ ద థింగ్స్ దట్ హావ్ హాపెన్డ్’– కేరళ కుగ్రామంలో అన్నాకుట్టీ వర్గీస్, మరణశయ్య మీదనుండగా ప్రారంభం అవుతుంది. దుబాయ్‌లో ఉండే సవతి చెల్లి కూతురు– నీనా, పెత్తల్లితోపాటు ఉంటుంది. కొడుకు జ్ఞాపకాలు అన్నాని విడిచిపెట్టక, మరణించడానికి ఇష్టపడదు. ఆమె నీనాతో చెప్పిన మాటలే శీర్షికకి ఆధారం: ‘జ్ఞాపకాలే నిజమైతే, జరిగిన సంగతులే కాక, జరగబోయేవి కూడా గుర్తుంటాయి’. ఆమెని తండ్రీ సవతి తల్లీ కలిసి, మద్రాసు కాన్వెంట్లో ఉంచినప్పుడు 16 ఏళ్ళ వయస్సులో, పెళ్ళి కాకుండానే గర్భవతి అవుతుంది. కుటుంబ వొత్తిడివల్లా, ఆర్థిక స్థితి సరిగ్గా ఉండకపోవడంతోనూ అక్కడి నన్స్, అన్నా నాలుగేళ్ళ కొడుకైన మధుని, ఊర్లోకొచ్చిన ఒక జర్మన్ జంటకప్పగిస్తారు. ఆ తరువాత కుంటివాడైన తంబీని పెళ్ళి చేసుకున్నప్పటికీ, శేషజీవితమంతా కొడుకు కోసం ఎదురు చూడ్డంలోనే గడుపుతుంది అన్నా. జర్మన్ జంటలో, భర్త ట్రైన్ ప్రయాణంలో కుర్రాడిని వదిలేస్తాడు. మధు మూడేళ్ళు ఢిల్లో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ మీద ముష్టెత్తుకునే గుంపుతో గడుపుతాడు. ఏడేళ్ళ వయస్సులో ఒక ఏజెన్సీ ద్వారా, ఒక అమెరికన్ కుటుంబం మధుని దత్తత తీసుకుని, ‘ఆసా గార్డనర్’గా మారుస్తుంది. నవల్లో మనకి పరిచయం అయ్యేది పెద్దవాడయి, తన గతకాలపు జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉండి, కాలిఫోర్నియాలో తన్ని పెంచుకున్న దంపతులతోనూ, తన మాజీ భార్యా కూతురితోనూ కూడా సంబంధాలు నిలుపుకోలేకపోయిన ఆసా. రచయిత అనేకమైన పాత్రల దృష్టికోణాలతో కథ చెప్తారు: అన్నా సవతి తల్లి సారమ్మ, సవతి చెల్లెలు టెస్సీ, ఆమె కూతురు నీనా. రెండు భాగాల్లో ఉన్న పుస్తకం– వర్తమానానికీ గతానికీ సులభంగా మారుతూ, అన్నా మరణం తరువాత కేవలం 36 గంటల్లోనే చోటు చేసుకున్నదైనప్పటికీ, ఆ పరిధిలోనే మూడు దశాబ్దాల సంఘటనలని జ్ఞాపకాల ద్వారా కలిపి కుడుతుంది. మొదటి భాగంలో పాఠకులని కేరళ, మద్రాస్, పాండిచ్చేరి తిప్పి, రెండవ భాగంలో అమెరికాని చూపిస్తుంది. మొదటిది అన్నా గురించి మాట్లాడుతుంది. రెండవది కొడుకు చుట్టూ తిరుగుతుంది. తల్లీ కొడుకూ కూడా, ఊహించుకున్న ఆశాజనకమైన సంఘటనల చుట్టూ తమ జీవితాలని మలచుకుంటారు. ఉదా: అన్నకుట్టీ చివరకు తన కొడుకుని కలుసుకుంటుంది. ఆసా కూడా తనెవరో తెలుసుకుని, తల్లిని చేరుకుంటాడు.కేరళ గ్రామ ప్రజల మీద ఉండే క్రిస్టియానిటీ ప్రభావం గురించీ, దత్తత ప్రక్రియలో జరిగే మోసం, దుర్వినియోగించబడే డబ్బు గురించీ కోషీ మాట్లాడతారు. అన్నా జ్ఞాపకాలనీ, కేరళ గ్రామీణ జీవితాలనీ అద్భుతంగా వర్ణిస్తూ, పాత్రలని ఎంతో నిపుణతతో చెక్కుతారు.యువతుల ఊసులాటలప్పుడు, వారి నోట్లోంచి వెలివడే ‘అయ్యై, య్యో’లని హాస్యంగా చిత్రీకరిస్తారు. మతం పట్ల గ్రామీణుల దృక్పథం అన్నా మృతదేహం చుట్టూ మూగినప్పుడు కనిపిస్తుంది. అది వాళ్ళకి ఆమె పట్ల ఉన్న ప్రేమవల్ల కాక, ప్రార్థన తరువాత తినబోయే ఫలహారాల కోసం ఎదురుచూపు. పుస్తకం చదవడానికి తేలికైనదే కానీ సంతోషకరమైనదని అనలేం. వచనం విషాదాన్నీ కలిగించదు. ఉత్కంఠ పెంచుతుంది. దత్తత ప్రభావం, అణచివేత గురించిన ఆలోచనలనీ రేకెత్తిస్తుంది కనుక చదవాల్సినది. అయితే, ఎన్నో సందేహాలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. నవల కవర్ పేజీ వెనక, రచయిత జీత్ థాయిల్ రాసిన ఎండార్సుమెంటు ఉంది. 2013లో ‘క్రాస్‌వర్డ్ బుక్ అవార్డ్’ కోసం షార్ట్ లిస్ట్ అయిన ఈ నవలని హార్పర్ కాలిన్స్ ప్రచురించింది. కృష్ణ వేణి -
మన తెలుగు సాహిత్యం మరో కోహినూర్!
సాక్షి, హైదరాబాద్ : కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రాల్లో ఒకటి. తెలుగు నేలపై దొరికిన ఆ వజ్రం ఎక్కడుంది? బ్రిటన్ రాణి ఎలిజబెత్ కిరీటంలో.. ఆంగ్లేయులు దానిని దేశం నుంచి తరలించుకుపోయారు. ‘ప్రపంచం మొత్తం చేసే ఒక రోజు ఖర్చులో సగం విలువ.. కోహినూర్ సొంతం’అని మొఘల్ చక్రవర్తి బాబర్ తన బాబర్నామాలో ప్రస్తావించాడట. అంతటి విలువైన ‘తెలుగు’కోహినూర్‌ను సొంతం చేసుకున్న బ్రిటన్.. అంతకుమించిన అద్భుత తెలుగు సాహిత్య సంపదనూ సొంతం చేసుకుంది. ఒకటి రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో తెలుగు గ్రంథాలు బ్రిటన్ రాజధాని లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి. ఆ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు 8,639! ప్రపంచ సాహిత్యంలో వినూత్న ప్రక్రియలకు నెలవు తెలుగు సాహిత్యం. ఈ ఔన్నత్యాన్ని ఇటీవలే ప్రపంచ తెలుగు మహాసభలు మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కరించాయి. అంతటి సమున్నత తెలుగు సాహిత్యంలో ఎంతోమంది ఉద్ధండులు ఎన్నో గ్రంథాలు రాశారు. కానీ వాటిలో చాలా వరకు మనకు అందుబాటులో లేవు. ఇలా అలభ్యంగా ఉన్న గ్రంథాలెన్నో బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నట్లు గుర్తించారు. అవీ ఒకటి రెండు కాదు ఏకంగా 8,639 పుస్తకాలు కావడం గమనార్హం. ఇందులో రెండు మూడు వేల గ్రంథాలు, పుస్తకాలు మన వద్ద అందుబాటులో లేనివేనని అంచనా. 1700 సంవత్సరం నుంచి 1970 వరకు వివిధ సమయాల్లో వెలువడిన తెలుగు గ్రంథాలు, పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఆంగ్లేయులు స్వాతంత్య్రం వరకు వివిధ సందర్భాల్లో భారత్ నుంచి పలు భాషల గ్రంథాలను లండన్‌కు తరలించారు. తర్వాత కూడా ఇది కొనసాగింది. అయితే అంతకుముందు జరిగింది కొల్లగొట్టడంకాగా.. తర్వాత కొనసాగింది ‘సేకరణ’. ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రంథాలయం లండన్ గడ్డపై ఉండాలన్న సంకల్పంతో ఈ పుస్తకాలను తరలించారు. ఎలా తెలిసింది..? ప్రపంచ సాహిత్యానికి తెలుగు నేల అందించిన సారస్వతం ఎనలేనిది. కానీ భావితరాల కోసం భద్రపరిచే విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. దాంతో ఇప్పటివరకు తెలుగు భాషలో ఎన్ని గ్రంథాలు వెలువడ్డాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయనే లెక్కలేవీ లేవు. అయితే తాజాగా లండన్ బ్రిటిష్ లైబ్రరీలో భారీ సంఖ్యలో తెలుగు గ్రంథాలున్న విషయాన్ని పురావస్తు పరిశోధకుడు డాక్టర్ రాజారెడ్డి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన ఇటీవల బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న శాతవాహనుల నాణేలపై పరిశోధన కోసం లండన్ వెళ్లారు. ఆ సమయంలో బ్రిటిష్ లైబ్రరీని కూడా సందర్శించారు. అక్కడి కేటలాగ్ (పుస్తకాల జాబితా)లను పరిశీలిస్తుండగా.. తెలుగు పుస్తకాల కేటలాగ్ కనిపించింది. దాన్ని పరిశీలించగా ఆ లైబ్రరీలో 8,639 తెలుగు పుస్తకాలున్నట్టు తేలింది. వెంటనే విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాలు కావాలని సిబ్బందిని కోరగా.. కొద్దిసేపట్లోనే 21 పుస్తకాలను తెచ్చి ఇచ్చారు. తెలుగు నిఘంటువుకు రూపమిచ్చిన బ్రౌన్ పుస్తకాలు కావాలని అడిగితే.. 27 పుస్తకాలు తెచ్చిపెట్టారు. ఇలా వేలకొద్దీ తెలుగు పుస్తకాలు అక్కడ కనిపించేసరికి రాజారెడ్డి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఈ విషయాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు మహాసభల నేపథ్యంలో.. బ్రిటిష్ లైబ్రరీ పుస్తకాల విషయంగా ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు కసరత్తు మొదలైంది. నందిని సిధారెడ్డి నెల రోజుల కింద లండన్‌లోని ప్రవాస తెలుగువారు సృజన్‌రెడ్డి, కరుణనాయుడు, ఆదిత్య తదితరులకు ఆ పుస్తకాల వివరాలు సేకరించే బాధ్యత అప్పగించారు. వారు కొద్దిరోజులు కసరత్తు చేసి 1,200 పుస్తకాల పేర్లతో కేటలాగ్ తయారు చేశారు. ఆ జాబితాను ఇక్కడికి పంపారు. దీంతో కవి, పరిశోధకుడు జగన్‌రెడ్డి చేయూతతో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాల పట్టికతో కూడిన పుస్తకాన్ని ముద్రించింది. త్వరలో మిగతా పుస్తకాల వివరాల సేకరణకు చర్యలు చేపట్టింది. మొత్తం వివరాలన్నీ క్రోడీకరించి.. ఆ జాబితాలో మనవద్ద అందుబాటులో లేని పుస్తకాలను గుర్తించనున్నారు. వాటిని బ్రిటిష్ లైబ్రరీ సాయంతో స్కాన్ చేయించి, తిరిగి ఇక్కడ ముద్రింపజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్యారిస్ లైబ్రరీలో కూడా.. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రంథాలయంలోనూ పెద్ద సంఖ్యలో తెలుగు పుస్తకాలున్నట్టు బ్రిటిష్ లైబ్రరీలో సమాచారం ఉంది. ప్యారిస్ లైబ్రరీలోని పుస్తకాల వివరాలతో కూడిన కేటలాగ్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. అందులో తెలుగు పుస్తకాల వివరాలూ ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు పుస్తకాలు ఉన్నాయనే వివరాలు సేకరించాల్సి ఉంది. వందల ఏళ్లనాటి గ్రంథాలెన్నో.. తెలుగు నేలపై పుస్తకాల ప్రచురణ 1750 సమయంలో మొదలైందని అంచనా. 1850లో వచ్చిన ఓ పుస్తకం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ‘వందేళ్లలో తెలుగు పుస్తకాలు’పేరుతో మంగమ్మ అనే పరిశోధకురాలు 1850లో ఓ పుస్తకాన్ని వెలువరించారు. అది ఇక్కడ లభించకున్నా బ్రిటిష్ లైబ్రరీలో భద్రంగా ఉంది. లైబ్రరీలో గణితం, పురాణం, ఇతిహాసం, చరిత్ర.. ఇలా 13 అంశాల్లో తెలుగు పుస్తకాల జాబితాలు పొందుపరిచారు. 17వ శతాబ్దంలో ధూర్జటి రచించిన కాళహస్తి మహత్మ్యము మొదలు భాస్కర శతకం, దాశరథి శతకం, రకరకాల పెద్ద బాలశిక్షలు, లావణ్య శతకం, కాళహస్తి లింగాష్టకం, కవిజన రాజసం, హంస వింశతి కథలు, వివేక సంగ్రహం, మదాలసోపాఖ్యానం, గ్రంథ తంత్రం.. ఇలా (తాజా సేకరణలోనివి మాత్రమే) ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. అద్భుతంగా పరిరక్షణ... ఇక్కడి పుస్తకాలు అటు తరలాయే అన్న బాధ ఉన్నా.. బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాలు నిక్షేపంగా ఉన్నాయి. మన వద్ద లైబ్రరీలలో చెద పురుగులకు ఆహారంగా మారే దుస్థితి ఉండగా.. బ్రిటిష్ లైబ్రరీలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా సురక్షితంగా ఉండడం గమనార్హం. తిరిగి ముద్రించుకోవాలి ‘‘బ్రిటిష్ లైబ్రరీలో గొప్ప తెలుగు సాహితీ సంపద పదిలంగా ఉంది. అక్కడున్న వాటిలో మన వద్ద లేని పుస్తకాలను భాషా పండితులు గుర్తించాలి. వాటిని స్కాన్ చేసుకువచ్చి, తిరిగి ముద్రించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల తెలుగు పుస్తకాలున్నట్టు అంచనా. తంజావూరు గ్రంథాలయంలో కృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యద తాళపత్ర గ్రంథం ఉంది. 780 తెలుగు గ్రంథాలూ ఉన్నాయి. మైసూరు గ్రంథాలయంలోనూ తెలుగు పుస్తకాలు ఉన్నాయి..’ – రాజారెడ్డి, చరిత్రకారుడు అన్ని పుస్తకాలు సేకరిస్తాం ‘‘రాజారెడ్డి గొప్ప మేలు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు సేకరిస్తున్నాం. వాటిలో మన వద్ద అలభ్యంగా ఉన్న పుస్తకాలను తెలుగు నేలపైకి తెస్తాం..’’ – నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
పాఠ్యాంశాల్లో మార్పులు
ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠ్యపుస్తకాల్లో వాటిని పొందుపర్చాలని నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలు ప్రతిబింబించేలా పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు సబ్జెక్టుల వారీగా పుస్తక సమీక్ష కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం జీఓ 51 జారీ చేశారు. మాజీ వైస్ చాన్స్లర్లు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రముఖులు, అధికారులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిపై పాఠశాల విద్యాకమిషనర్ తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలుగు పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీ సభ్యులు... జాతీయ స్థాయి: రమాకాంత్ అగ్నిహోత్రి (రిటైర్డ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ) రాష్ట్ర స్థాయి: రవ్వా శ్రీహరి (మాజీ వీసీ, ద్రవిడ విశ్వవిద్యాలయం), కోవెల సుప్రసన్నాచార్య(రిటైర్డ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ), ప్రొఫెసర్ బన్న ఐలయ్య (కాకతీయ యూనివర్సిటీ), ఎస్.రఘు (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ), డాక్టర్ గుమ్మన్నగారి బాలా శ్రీనివాస్‌మూర్తి (అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ యూనివర్సిటీ). ఎక్స్పర్ట్స్..: చుక్కా రామయ్య(విద్యావేత్త), నందిని సిధారెడ్డి (రిటైర్డ్ లెక్చరర్), దేశపతి శ్రీనివాస్ (తెలుగు పండిట్), డి.చంద్రశేఖర్‌రెడ్డి (రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఓరియంటల్ కాలేజీ) డి.సాంబమూర్తి(రిటైర్డ్ ప్రిన్సిపాల్, కాలేజీ టీచర్ ఎడ్యుకేషన్), వేణు సంకోజు (రిటైర్డ్ లెక్చరర్, తెలంగాణ రచయితల వేదిక), నలిమెల భాస్కర్(రిటైర్డ్ లెక్చరర్). రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి: సువర్ణ వినాయక్ (కరిక్యులమ్ అండ్ టెక్ట్స్‌బుక్స్, తెలంగాణ ఎస్సీఈఆర్టీ, వి.శరత్‌బాబు, (తెలుగు పండిట్), పల్లెర్ల రామ్మోహన్రావు, వి. చెన్నయ్య (స్కూల్ అసిస్టెంట్స్). సాంఘిక శాస్త్రాల పుస్తక సమీక్ష కమిటీ సభ్యులు.. జాతీయ స్థాయి: సీఎన్ సుబ్రహ్మణ్యం (ఏకలవ్య వర్సిటీ, భోపాల్), ఎంవీ శ్రీనివాసన్ (అసోసియేట్ ప్రొఫెసర్, డీఈఎస్‌హెచ్, ఎన్సీఈఆర్టీ). రాష్ట్ర స్థాయి: డాక్టర్ కె.విజయబాబు (హిస్టరీ ప్రొఫెసర్ కాకతీయవర్సిటీ) కె.కైలాష్ (పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ కోదండరాం (పొలిటికల్ సైన్స్ విభాగం, సికింద్రాబాద్ పీజీ కాలేజీ) డాక్టర్ ఈఎస్ నాగిరెడ్డి (పురావస్తు శాఖ). క్షేత్రస్థాయి: ఎ.లక్ష్మణరావు (ఎస్ఏ, కరీంనగర్) డాక్టర్ ఆర్.గణపతి (ఎస్ఏ వరంగల్), పి.జగన్మోహన్రెడ్డి, పి.శ్రీనివాసులు, (ఎస్ఏ, మెదక్) పి.రత్తంగపాణిరెడ్డి(ఎస్ఏ, మహబూబ్‌నగర్), ఎం.పాపయ్య (లెక్చరర్, ఎస్సీఈఆర్టీ). అన్ని స్థాయిల సమన్వయం-మార్గదర్శనం.. దీపిక, కృష్ణమోహన్, డాక్టర్ ఎన్.ఉపేందర్‌రెడ్డి(కరిక్యులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ విభాగం) ఎస్.జగన్నాథరెడ్డి (డెరైక్టర్, తెలంగాణ ఎస్సీఈఆర్టీ). -
ఎంసెట్‌కు తెలుగు పుస్తకాలేవి?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు ముగి శాయి. సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల విద్యార్థులంతా ఎంసెట్ ప్రిపరేషన్‌కు రెడీ అయ్యారు. కాని మార్కెట్లో స్టడీ మెటీరియల్ (బిట్స్ బ్యాంకు వంటివి) అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ముఖ్యంగా 2 లక్షల మందికి పైగా తెలుగు మీడియం విద్యార్థులకు మరీ కష్టం వచ్చి పడింది. బిట్స్ బ్యాంకు పుస్తకాలు అందుబాటులో లేక.. పాఠ్య పుస్తకాల్లోని అంశాలతో ఎంసెట్‌కు సిద్ధం కావడం కష్టంగా మారింది. ఏప్రిల్ 20 వరకు కేవలం ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను మాత్రమే మార్కెట్లో అందుబాటులోకి తెస్తామని, తెలుగు మీడియం పుస్తకాలు మరింత జాప్యం అవుతాయని తెలుగు అకాడమీ వర్గాలు పేర్కొంటుండటం విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మే 22న ఎంసెట్ రాత పరీక్ష ఉంది. మరి బిట్స్ బ్యాంకు పుస్తకాలు ఏప్రిల్ 20 తరువాత కూడా అందుబాటులోకి రాకపోతే ఎంసెట్‌కు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎంసెట్‌కు 4.20 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని ఎంసెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే తెలుగు మీడియం విద్యార్థులే ఉంటారు. అంటే 2 లక్షల మంది వరకు విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఇబ్బందే అయినా కనీసం వారికి అవసరమైన స్టడీ మెటీరియల్‌ను ఏప్రిల్ 20 వరకు అందుబాటులోకి తెస్తామని తెలుగు అకాడమీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు కూడా కొద్ది సమయమే ఉంటుంది. అప్పటి వరకు కూడా తెలుగు మీడియం వారికి పుస్తకాలను అందుబాటులోకి తేకపోతే ఆ విద్యార్థులు మరింత నష్టపోక తప్పదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముద్రించిన పుస్తకాలు కూడా గోదాములకే పరిమితం కావాల్సి వస్తుంది. ముద్రణ దశలోనే పైరసీ! బిట్స్ బ్యాంకు రూపకల్పనను ప్రైవేటు పబ్లిషర్లకు ఇవ్వలేదు. కానీ పైరసీ పుస్తకాలు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. పబ్లిషర్, ముద్రణ సంస్థ పేరు లేకుండానే ఈ పుస్తకాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీటిలో బోటనీ స్టడీ మెరిటీరియల్ పుస్తకం కాపీ బయటకు వచ్చింది. అయితే తెలుగు అకాడమీలోని వ్యక్తుల సహకారంతోనే పైరసీ పుస్తకాలు రెడీ అవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అకాడమీ పుస్తకాల కంటే ముందే పైరసీ పుస్తకాలను మార్కెట్లోకి వచ్చేలా చర్యలు చేపట్టడం ద్వారా భారీగా ముడుపులు చేతులు మారాయని చెప్తున్నారు. ప్రస్తుతం నీట్ లేకపోయినా ఈ పైరసీ పుస్తకాలను నీట్/ఎంసెట్ స్టడీ మెరిటీరియల్ పేరుతో మార్కెట్లోకి తెస్తున్నట్లు సమాచారం. -
ఒక సంవత్సరంలో ఎంత చదవ్వొచ్చు?...
ఒక మనిషి ఒక సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు చదవ్వొచ్చు? టైమ్ లేదు, దొరకలేదు, కుదరలేదు వంటి సాకులు వెతుక్కోవడం మానేస్తే పుస్తకం వెంట నిజంగా పడదలిస్తే ఇదిగో నిజంగానే జంపాల చౌదరి చదివినన్ని పుస్తకాలు చదవ్వొచ్చు. ‘ఈ సంవత్సరం నా పుస్తకాల చదువు కొంచెం ఒడిదుడుకులతోనే సాగింది’ అని బాధపడ్తూ తాను 2013లో చదివిన పుస్తకాలను ఆయన పుస్తకండాట్నెట్లో పెట్టారు. బాప్ రే. ఎంత అదృష్టం ఇది. ఇన్ని పుస్తకాలు చదవడం. సైకియాట్రిస్ట్‌గా పెద్ద బాధ్యతలు ఒకవైపు, తానాలో కీలక బాధ్యతలు మరోవైపు ఉన్నా, తెలుగు పుస్తకాలన్నీ కోరిన వెంటనే బజారుకు వెళ్లి కొనుక్కునే వీలు లేని అమెరికాలో ఉంటున్నా ఆయన ఈ పుస్తకాలన్నీ చదివారు. చాలా ఏళ్ల తర్వాత శతాబ్ది సూరీడు నవల చదవడం సంతోషాన్ని ఇచ్చిందని కూడా చెప్పుకున్నారు. ఏడాదిలో ఒకరు చదవదగ్గ పుస్తకాల సంఖ్య కోసమే కాదు... మంచి పుస్తకాల పట్టిక తెలియడానికి కూడా ఆయన చదివిన పుస్తకాలను దాదాపుగా ఇక్కడ ఇస్తున్నాం. కథా సంకలనాలు: కథ 2012, కథావార్షిక 2012, పాత్రినిధ్య 2012, నవ కథామాల, కొత్తగూడెం పోరగాడికో లవ్ లెటర్ (సామాన్య), ఇంతిహాసం (మృణాళిని), యానాం కథలు (దాట్ల దేవదానం రాజు), లోలోపల (వి. రాజారామమోహనరావు) కాటుక కళ్లు (శ్రీపతి), తెల్లకొక్కెర్ల తెప్పం (డా.ఎన్.వసంత్), ఎర్నూగుపూలు (కృష్ణ రసం), పి.చంద్రశేఖర్ ఆజాద్ కథలు, తోలేటి కథలు, పి.సత్యవతి కథలు, విముక్త (ఓల్గా), ఊరు వీడ్కోలు చెప్పింది (శీలా వీర్రాజు), కొండఫలం (వాడ్రేవు వీరలక్ష్మీదేవి), అంబల్ల జనార్దన్ కథలు, విదేశీ కోడలు (కోసూరి ఉమా భారతి), మనసుకో దాహం (కుప్పిలి పద్మ), సంయుక్త రచనలు (చింతం రాణీ సంయుక్త), వానజల్లు (ఇచ్చాపురపు జగన్నాధరావు) నవలలు: నికషం (కాశీభట్ల), జిగిరి (పెద్దింటి అశోక్‌కుమార్). ఈ దేశంలో ఒక భాగమిది (కొమ్మూరి వేణు గోపాలరావు), పెంకుటిల్లు (కొమ్మూరి వేణుగోపాలరావు), ఖాకీవనం (పతంజలి), శతాబ్ది సూరీడు (మాలతీ చందూర్), ఆకుపచ్చని దేశం (డా.వి.చంద్రశేఖరరావు), నల్లమిరియం చెట్టు (డా.వి.చంద్రశేఖరరావు), విడీవిడని చిక్కులు (వీరాజీ), అధోజగత్ సహోదరి (అక్కినేని కుటుంబరావు), రామ్ఎట్శృతిడాట్కామ్ (అద్దంకి అనంత రామయ్య), స్మశానం దున్నేరు (కేశవరెడ్డి) అనువాదాలు: జమీల్యా (చంగిజ్ ఐతమతోవ్: అను: ఉప్పల లక్ష్మణ రావు), ఓ మనిషి కథ - శివశంకరి (అను:మాలతీ చందూర్), ఆణిముత్యాలు (తమిళ కథలు) (అను: గౌరీ కృపానందన్), ఆరడుగుల నేల - చలసాని ప్రసాదరావు, మాస్తి చిన్న కథలు, మంటో కథలు ఆత్మకథలు- జీవిత చిత్రణలు: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు (మురారి), కాశీయాత్ర (చెల్లపిళ్ల వెంకటశాస్త్రి), చాప్లిన్ ఆత్మకథ (అను: వల్లభనేని అశ్వినీ కుమార్), హాస్యనట చక్రవర్తి (టి.ఎస్.జగన్మోహన్), 1948 హైదరాబాద్ పతనం (మహమ్మద్ హైదర్), కెవి.రెడ్డి శతజయంతి సంచిక (హెచ్.రమేశ్‌బాబు), జైలు లోపల (వట్టికోట ఆళ్వారుస్వామి), రంగనాయకమ్మ- ఆత్మకథాంశాల ఉత్తరాలు, శోభన్‌బాబు ఆత్మకథ (ఆకెళ్ల రాఘవేంద్ర), విప్లవజ్యోతి అల్లూరి (ఎం.వి.ఆర్.శాస్త్రి), తిరుమల లీలామృతం- పి.వి.ఆర్.కె. ప్రసాద్ సాహితీ వ్యాసాలు: కథలెలా రాస్తారు? (శార్వరి), సంభాషణ (సింగమనేని నారాయణ), రాగం భూపాలం (పి.సత్యవతి), సోమయ్యకు నచ్చిన వ్యాసాలు (వాడ్రేవు చినవీరభద్రుడు), మన తెలుగు నవలలు (డియాల రామ్మోహన్ రాయ్), సమకాలీనం (ఏ.కె.ప్రభాకర్), కథాశిల్పం (వల్లంపాటి వెంకటసుబ్బయ్య) కవిత్వం: దేశభక్తి గేయాలు (సంకలనం: మువ్వల సుబ్బ రామయ్య), ఆటవెలదిలో ఆణిముత్యాలు (డా.కొలగోట్ల సూర్య ప్రకాశరావు), పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (దేవీప్రియ). ఇంగ్లిష్: The Little Bookstore of Big Stone Gap - Wendy Welch When I stop talking you know I am dead - Jerry Weintraub Where The Peacocks Sing - Alison Singh Gee No Easy Day: The autobiography of a Navy Seal- Mark Owen; When the Mob Ran Vegas - Steve Fischer Undergrounds: The Story of Coffee; where it began, how it spread - Marc Pendergrast. I Too Had a Dream - PJ Kurien. Pataudi - Suresh Menon (ed) I Bury My Dead - James Hadley Chase It Does Not End - Maitreyi Devi Samskara - U.R. Anantha Murthy (Tr: A. K. Ramanujan) The Jungle Book - Rudyard Kipling; an old classic. Understanding Creativity - Jane Piirto The Cinema of George Lucas - Marcus Hearn. Picasso and Chicago - Stephanie Alessandro.