సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు ముగి శాయి. సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల విద్యార్థులంతా ఎంసెట్ ప్రిపరేషన్‌కు రెడీ అయ్యారు. కాని మార్కెట్‌లో స్టడీ మెటీరియల్ (బిట్స్ బ్యాంకు వంటివి) అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ముఖ్యంగా 2 లక్షల మందికి పైగా తెలుగు మీడియం విద్యార్థులకు మరీ కష్టం వచ్చి పడింది. బిట్స్ బ్యాంకు పుస్తకాలు అందుబాటులో లేక.. పాఠ్య పుస్తకాల్లోని అంశాలతో ఎంసెట్‌కు సిద్ధం కావడం కష్టంగా మారింది. ఏప్రిల్ 20 వరకు కేవలం ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను మాత్రమే మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తామని, తెలుగు మీడియం పుస్తకాలు మరింత జాప్యం అవుతాయని తెలుగు అకాడమీ వర్గాలు పేర్కొంటుండటం విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మే 22న ఎంసెట్ రాత పరీక్ష ఉంది. మరి బిట్స్ బ్యాంకు పుస్తకాలు ఏప్రిల్ 20 తరువాత కూడా అందుబాటులోకి రాకపోతే ఎంసెట్‌కు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈసారి ఎంసెట్‌కు 4.20 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని ఎంసెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే తెలుగు మీడియం విద్యార్థులే ఉంటారు. అంటే 2 లక్షల మంది వరకు విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఇబ్బందే అయినా కనీసం వారికి అవసరమైన స్టడీ మెటీరియల్‌ను ఏప్రిల్ 20 వరకు అందుబాటులోకి తెస్తామని తెలుగు అకాడమీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు కూడా కొద్ది సమయమే ఉంటుంది. అప్పటి వరకు కూడా తెలుగు మీడియం వారికి పుస్తకాలను అందుబాటులోకి తేకపోతే ఆ విద్యార్థులు మరింత నష్టపోక తప్పదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముద్రించిన పుస్తకాలు కూడా గోదాములకే పరిమితం కావాల్సి వస్తుంది.
ముద్రణ దశలోనే పైరసీ!
బిట్స్ బ్యాంకు రూపకల్పనను ప్రైవేటు పబ్లిషర్లకు ఇవ్వలేదు. కానీ పైరసీ పుస్తకాలు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. పబ్లిషర్, ముద్రణ సంస్థ పేరు లేకుండానే ఈ పుస్తకాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీటిలో బోటనీ స్టడీ మెరిటీరియల్ పుస్తకం కాపీ బయటకు వచ్చింది. అయితే తెలుగు అకాడమీలోని వ్యక్తుల సహకారంతోనే పైరసీ పుస్తకాలు రెడీ అవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అకాడమీ పుస్తకాల కంటే ముందే పైరసీ పుస్తకాలను మార్కెట్‌లోకి వచ్చేలా చర్యలు చేపట్టడం ద్వారా భారీగా ముడుపులు చేతులు మారాయని చెప్తున్నారు. ప్రస్తుతం నీట్ లేకపోయినా ఈ పైరసీ పుస్తకాలను నీట్/ఎంసెట్ స్టడీ మెరిటీరియల్ పేరుతో మార్కెట్‌లోకి తెస్తున్నట్లు సమాచారం.