ఎంసెట్‌ ఇక కనుమరుగేనా?  | EAMCET Exam Will Be Closed In Telangana ? | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ ఇక కనుమరుగేనా? 

Published Fri, Jul 13 2018 1:03 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

EAMCET Exam Will Be Closed In Telangana ? - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 1983లో మొదలైన ఎంసెట్‌ ప్రస్థానానికి ఇక తెరపడనుందా? దీనికి విద్యా శాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ ప్రవేశాలను జాతీయ స్థాయి నీట్‌ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం.. ఇకపై జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ ప్రవేశాలను జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (మెయిన్‌) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అది ఆచరణలోకి వస్తే రాష్ట్రంలో 35 ఏళ్ల పాటు నిర్వహించిన ఎంసెట్‌ అంతర్థానం కానుంది. ఇటీవల జాతీయ స్థాయిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని (ఎన్‌టీఏ) ఏర్పాటు చేసి నీట్, జేఈఈని ఏటా రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఇంజనీరింగ్‌ కోర్సు ల్లో ప్రవేశాలను కూడా జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన ప్రతిపాదనలకు ఇదివరకే ఆమోదం తెలిపింది. త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. వీలైతే 2019–20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చే అవకాశముంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, హరియాణా, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లోని మరో 9 వర్సిటీలు జేఈఈ మెయి న్‌ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. 

పరీక్ష మెరిట్‌ ప్రధానం 
జేఈఈ మెయిన్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు ఇస్తూ వస్తున్న 40 శాతం వెయిటేజీని 2016లోనే కేంద్రం రద్దు చేసింది. ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలు చేపడుతోంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ అంతే. కానీ ఎంసెట్‌లో మాత్రం ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఎంసెట్‌లో ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థుల ఇంటర్మీడియట్‌ చదువులు సాగుతుండటంతో 2007–08 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రొఫెసర్‌ నీరదారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఎంసెట్‌ ర్యాంకుల ప్రాధాన్యాన్ని తగ్గించి, ఇంటర్‌ ప్రాధాన్యం పెంచేందుకు ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని, దాన్ని క్రమంగా పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసు మేరకే 2009 నుంచి ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. అయితే ఎంసెట్‌ను తొలగిస్తే వెయిటేజీకి అవకాశమే ఉండదు.  

నీట్, జేఈఈవైపే రాష్ట్ర విద్యార్థులు 
ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర విద్యార్థులంతా జేఈఈ, నీట్‌వైపే వెళ్లాల్సి వస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియో, యునానీ, ఆయుర్వేద, యోగా, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు 2017–18 నుంచి నీట్‌ ద్వారానే జరగనుండగా, బీఈ/బీటెక్‌ వంటి ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు 2019–20 నుంచి జేఈఈ మెయిన్‌ ద్వారానే జరిగే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలకు హాజరయ్యే 2.5 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి మెడికల్‌ కోర్సులకు లక్ష మంది వరకు, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు 1.5 లక్షల మంది సిద్ధమవుతున్నారు. ఎంటెక్‌ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కూడా జేఈఈ ద్వారానే చేపట్టే అవకాశముంది. 

అగ్రికల్చర్‌ కోర్సులకు ప్రత్యేక పరీక్ష! 
ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సులు మినహా మిగతా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించే అవకాశముంది. ఇన్నాళ్లూ ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సులతో పాటు బీఫార్మసీ, బీటెక్‌ బయో టెక్నాలజీ (బైపీసీ), ఫార్మా–డి (బైపీసీ), బీఎస్సీ (అగ్రికల్చర్‌), బీఎస్సీ (హార్టికల్చర్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, యానిమల్‌ హస్బెండరీ, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ నిర్వహించారు. ఇంజనీరింగ్‌ ప్రవేశాలను జేఈఈ మెయిన్‌ ద్వారా చేపట్టే అవకాశం ఉండటంతో మిగతా కోర్సుల్లో ప్రవేశాలను ప్రత్యేక పరీక్ష పరీక్ష ద్వారానే చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు తామే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవాలని గతంలో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు యోచించారు. ఎంసెట్‌ రద్దయితే మాత్రం వారు ప్రత్యేక పరీక్షవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement