శ్రీరామదాసు అమరనాథ్
ఓ పదహారేళ్ల అమ్మాయి తన మరణశయ్యపై మనోదుఃఖ గీతాలు రచించి వాటిని ఎవరికీ వినిపించకుండానే తిరిగి రాని లోకానికి మహాప్రస్థానం చేసింది. ఆమె పేరు గీతాంజలి ఘెయ్. ఆమె కవిత్వానికి రవీంద్రుని గీతాంజలి ప్రేరణ అని, ఆమె ఊపిరికి రవీంద్రుని కవిత్వమే ప్రాణవాయువని ఆమె కవితలే చెపుతాయి.
I am named
GITANJALI
After the famous book of Tagore
I wish and pray
Oh! help me God
I so live that
I live up to the name
గీతాంజలి 1961 జూన్ 12న మీరట్‌లో జన్మించింది. చిన్న వయసులోనే కేన్సర్ వ్యాధికి గురైంది. గీతాంజలికి ఆంగ్లంలో పద్యాలు రాయటమన్నా, ప్రకృతి దృశ్యాలను పెయింట్ చేయటమన్నా ఎంతో ఇష్టం. కానీ తాను మృత్యువు ఒడిలో ఉన్నానని తొందరగానే తెలుసుకుంది. అయినా తల్లి ఖుషీ భద్రుద్దీన్ కూడా తన దుఃఖంలో పాలు పంచుకోవటం ఆమెకు ఇష్టం లేదు. తన గదిలో, హాస్పిటల్‌లో కూడా ఏకాంతంగానే గడిపింది. బొంబాయిలో వాళ్లున్న ఇల్లు సముద్ర తీరానికి దగ్గర్లో ఉండేది. సముద్ర కెరటాలను పరికించటం ఆమె దినచర్యలో భాగమైంది. జీవితానికి సముద్రం సాదృశమని కాబోలు.
1977 ఆగస్టు 11న గీతాంజలి మరణించింది. గది మూలల్లో, సోఫా కవర్లలో, చదువుకునే పుస్తకాల వెనుక అట్టల మీద, బెడ్ కింద చిన్న కాగితాలపై రాసివున్న కవితలను గీతాంజలి తల్లి ఆ తర్వాత గమనించింది. తన చిన్నారి కుమార్తె రాసిన కవితలని ఆమెకు అర్థమైంది. గీతాంజలి కవితలు ప్రఖ్యాత ఆంగ్ల జర్నలిస్ట్ ప్రీతిష్ నంది హృదయాన్ని కదిలించాయి. తన సంపాదకత్వంలో వెలువడుతున్న ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో మొదటిసారిగా ఆయన వాటిని ప్రచురించారు. వాటికి ఊహించని పాఠక స్పందన లభించింది. గీతాంజలి కవితల్లో మార్మికత ఎక్కువ. ‘యాన్ ఎప్పీల్’ అనే కవితలో
‘మరణమా!
ఎన్నోసార్లు నీవొస్తావని అనుకున్నా.
ఆశించినప్పుడల్లా నీవు రాలేదు.
తప్పకుండా నన్ను తీసుకెళ్లాలనుకుంటే
దయ చూపించు
ఎక్కడా బాధపడని
ఎవరూ బాధించని
బాల్యంలో హాయిగా నిద్రించినట్లు
నేను నిద్రపోయే
ఆ చోటికి నన్ను తీసుకెళ్లు’ అంటుంది.
అందమైన జీవితం. అయినా నీడలా వెంటాడిన మృత్యువు. దానితో పోరాటం సాగించిన గీతాంజలి ఆత్మసై్థర్యం ఈ కవితల్లో వస్తువులు. 1983లో ‘పొయెమ్స్ ఆఫ్ గీతాంజలి’ పుస్తకంగా వచ్చింది. చిన్నారి గీతాంజలి గీతాలు చీకటిలో చిరుదివ్వెల్లా, బాధాతప్త హృదయాలను వెలుగుమయం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment