నవల: అమెరికన్ డర్ట్, రచయిత్రి: జెనీన్ కామిన్స్
అనధికార సాంస్కృతిక స్వీకరణ (కల్చరల్ అప్రాప్రియేషన్) –సాహిత్యాన్ని అంటిపెట్టుకుని ఉండే ప్రశ్న! కథలు ఎవరు చెప్పాలి? ఎవరి కథలు వారే చెప్పుకోవాలా? తనది కాని జీవితావరణంలోని అనుభవాల, అనుభూతుల ఆవిష్కరణకి రచయిత పూనుకోవచ్చా, కూడదా? ఈ విషయమై మూడేళ్ల క్రితం రచయిత్రి లైనల్ ష్రైవర్ ప్రసంగానంతరం రేగిన వివాదాలు మర్చిపోకముందే, మళ్లీ ఊహించని రీతిలో సంచలనాత్మక చర్చలకు తెరతీసింది ఈ సంవత్సరం జనవరి నెలలో వచ్చిన– జెనీన్ కామిన్స్ నవల అమెరికన్ డర్ట్.
ఎన్నో ప్రచురణ సంస్థలు పోటీపడిన తరువాత – అత్యధిక పారితోషికమిచ్చిన ఫ్లాట్ ఐరన్ సంస్థ నవల ప్రచురణ హక్కుల్ని సంపాదించుకుంది. హాలీవుడ్ అప్పుడే నవలని సినిమాగా మార్చే ప్రయత్నంలో ఉంది. వెల్లువెత్తుతున్న ప్రశంసలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కార్చిచ్చులా రగులుతున్న విమర్శలు చర్చలు రేపుతున్నాయి. ప్రధానంగా తనదికాని అనుభవాన్నీ, వలసదారుల కథనీ రచయిత్రి చెప్పటం సరికాదనే తీవ్రవిమర్శని ఎదుర్కొంటోందీ నవల. మా కథ మేము చెప్తే పట్టించుకోని ప్రచురణ సంస్థలు మా గురించి ఇంకొకరు రాస్తే ప్రచురించటం ఏమిటనీ, సాహిత్యపు గమనాన్ని నిర్దేశించగలిగిన ఈ సంస్థలు అన్ని వర్గాలవారి సామర్థ్యాన్ని గుర్తించాలనీ అనేవారి సంఖ్య భారీగానే ఉంది. కథ ఎవరు చెప్పినా ఫరవాలేదు, వస్తువుకి న్యాయం చెయ్యాలనే వారు కొందరు. ఇందులో మెక్సికో ప్రజలకీ, వలసదారులకీ న్యాయం జరగలేదని లోపాలను ఎత్తిచూపేవారు మరికొందరు. విమర్శలూ ప్రతివిమర్శలతో కలకలం సృష్టిస్తోందీ నవల. ఇన్ని సంచలనాలు సృష్టించిన ఈ నవల థ్రిల్లర్‌లా మొదలవుతుంది.
మెక్సికోలో ఉన్న మధ్యతరగతి కుటుంబమైన లిడియావాళ్ల ఇంట్లో పుట్టినరోజు వేడుక జరుగుతూంటుంది. ఉన్నట్టుండి పెరట్లో కాల్పులు. కుటుంబంలో పదహారుమంది చనిపోయిన ఆ మారణహోమాన్నుంచి లిడియా తన కొడుకు లూకాతో సహా తప్పించుకుంటుంది. ఒక మాఫియా అధినేత గురించి తన భర్త, పత్రికలో రాసిన వ్యాసమే ఈ ప్రతీకార చర్యకి కారణమని లిడియాకి అర్థమవుతుంది. మాఫియా అరాచకాలకు ఎవరూ అతీతులు కారనీ, పిల్లలు కూడా వీధుల్లో హత్యల్నీ, శవాలు పడివుండటాన్ని చూసినవారేననీ అంటారు రచయిత్రి. వీధుల్లో తెగిపడిన తలలూ, యువతీయువకులూ, పిల్లలూ కనిపించకుండా పోవడాలూ, కత్తిపోట్లూ, తుపాకీల మోతలూ – అన్నీ సాధారణమే. ఇదేమిటని మాఫియాని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రభుత్వ యంత్రాంగమూ, పోలీసులూ వారి గుప్పిట్లో ఉన్నవారే! బతుకు భరోసా కరువైన అలాంటి పరిస్థితుల్లో మాఫియాకి దూరంగా – అక్రమంగానైనా సరే – అమెరికాకి వెళ్లిపోవాలని లిడియా చేసే ప్రయత్నమే ఈ నవల.
ప్రాణభయం, కొడుకుని కాపాడుకోవాలన్న తాపత్రయం, తెలివితేటలూ, తెగింపూ ఉన్న వ్యక్తి లిడియా. కొడుకు కోసం కదిలే రైలు పైకి దూకగలిగిన మొండి ధైర్యం ఆమెది. పసితనంలోనే విషాద జీవితానుభవాలు పొందిన ఎనిమిదేళ్ల లూకా తల్లికి ధైర్యాన్ని ఇవ్వవలసిన బాధ్యతని తనమీద వేసుకొని, వయసుకి మించిన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. వీరి ప్రయాణంలో మెక్సికో నుంచి పారిపోయే వారేకాదు, అమెరికానుంచి వెనక్కి పంపబడి మళ్లీ వెళ్లటానికి ప్రయత్నించేవారూ కలుస్తారు. గూడ్స్ రైళ్ల నిచ్చెనలూ, పైకప్పుల మీద వీరందరి అనధికార ప్రయాణం. సహాయం చేసేవారితో పాటు, దౌర్జన్యంగా డబ్బుని లాక్కునేవాళ్లూ, అమ్మాయిలను రాక్షసంగా అనుభవించి అమ్మేసే వాళ్లూ, పిల్లలను మాఫియాకి సరఫరాచేసే వాళ్లూ – అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు. ‘‘ప్రతిక్షణం పరిస్థితులకి అనుగుణంగా మారటం వలసదారులకి అవసరం. వారు మొండిగా ఉండవలసిన విషయం ఒక్కటే– అది ప్రాణాలతో ఉండటం’’అంటుంది లిడియా. వలసదారుల అస్తిత్వపోరాటం, అస్థిరత్వం, భయం, సంఘర్షణ, స్త్రీ అంతఃశక్తి– వీటిలో ఈ నవల స్పృశించనిదేదీ లేదు, మనల్ని తాకనిదీ ఏదీ లేదు.
-పద్మప్రియ
- రీవిజిట్
ఒక తాత్విక చమత్కారం
సామాజిక ప్రయోజనం నెరవేర్చని కవి తనంతట తానే మరణిస్తాడంటాడు ప్రసేన్. అలాగని, హృదయంలోని సుతిమెత్తని తంత్రులను మీటడం సామాజిక ప్రయోజనం కాకుండా పోదని కూడా అంటాడు. ఇలా మాట్లాడటం వల్లే ఒక్కోసారి ఎవరికైనా తాను అర్థం కాకుండా పోయానేమో అన్న అనుమానం ఆయనకు ఉన్నప్పటికీ, చెప్పాలనుకున్నదాన్ని చెప్పాల్సిన విధంగానే చెప్పానన్న స్పష్టత కూడా ఆయనకు ఉంది. 1985లో రక్తస్పర్శ కవుల్లో ఒకడిగా మొదలైన ప్రసేన్ సొంతంగా ‘ఇంకా వుంది’, ‘ఏదీ కాదు’ కవితా సంపుటాలు వెలువరించాడు. ‘కవిత్వం’, ‘క్రితం తర్వాత’ సంకలనాల్లో భాగమయ్యాడు. ఈ మళ్లీ వచ్చిన ‘ప్రసేన్ సర్వస్వం’లో ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు, ముందుమాటలు విమర్శలు, ప్రశంసలతో పాటుగా, ఆయన కవితల్లోంచి ఎంపిక చేసిన కవితలు కూడా ఉన్నాయి. అందులోంచి ఒకటి:
నెత్తురోడుతున్నావు గదా
నువు గాయానివా
అడిగింది ఆయుధం
కాదు నేను ఓడిపోయిన
అభిప్రాయాన్ని
చెప్పింది విజయం
ఉప్పురుచి తెలియదు
ఐనా నేను సముద్రాన్నేనా
అడిగింది కన్నీటి చుక్క
పరిమళం మరణించినా
పూవుసారం మారదు
చెప్పింది విషాదం
విజయానికి విషాదానికి
ఏ దూరపు చుట్టరికం
అడిగింది రేపటి కల
నేను కీ నేను కీ మధ్య
తేడా ఉండదు కదా!
చెప్పింది తుళ్లిపడ్డ నిద్ర!
ప్రసేన్ సర్వస్వం
పేజీలు: 326;
వెల: 300;
ప్రచురణ: అడుగు
జాడలు పబ్లికేషన్స్;
కవి ఫోన్:
9963155524
-ప్రసేన్
Comments
Please login to add a commentAdd a comment