ప్రభుత్వంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలోని హరారేలో ఆందోళనలో పాల్గొని, కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తున్నారనే నేరారోపణలతో అరెస్ట్ కాబడి, అటుతర్వాత బెయిల్ మీద విడుదలవడం, క్షేత్రస్థాయిలోని కార్యకర్తగా త్సిత్సీ డాంగరెంబా సామాజిక నిబద్ధతకు నిదర్శనం కాగా, ఆమె రాసిన నవల ‘దిస్ మౌర్నబుల్ బాడీ’ బుకర్ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్ అయిన ఆరింటిలో ఒకటవటం నవలకూ, ఆమెకూ దక్కిన సాహితీ గౌరవం. జింబాబ్వే చరిత్ర నేపథ్యంగా రాసిన నవలల ట్రిలజీలో ఆఖరిదైన ఈ నవల విడిగా కూడా చదువుకోగలిగినది. మొదటి నవలలో వివక్షతోబాటు అనేక ఇబ్బందులని ఎదుర్కొంటూనే పట్టుదలతో చదువు పూర్తిచేసిన చిన్నపిల్లగా పరిచయమయిన కథానాయిక తాంబూ, రెండోనవలలో యుక్తవయస్కురాలిగా యుద్ధవాతావరణంతో అల్లకల్లోలమవుతున్న జింబాబ్వే (పాత రొడీషియా) సమాజంలో భాగంగా కనబడుతుంది.
‘దిస్ మౌర్నబుల్ బాడీ’లో కథానాయిక తాంబూ, హరారేలో కాపీరైటర్ ఉద్యోగం చేస్తున్న నడివయసు స్త్రీ. యుద్ధానంతర జింబాబ్వేలోని పెట్టుబడిదారీ విధానాలు, దేశాన్ని ఇంకా వీడని బ్రిటిష్ పోకడలు, ఆధిపత్యధోరణులు, లింగవివక్ష, లైంగిక హింసాత్మక దాడులు, పేదరికం నవలలో పరిచయమవుతాయి. ఊరినీ, తమ తల్లిదండ్రుల జీవితాలనీ ఆవరించిన పేదరికం, నిరాశానిస్పృహలు, యుద్ధంలో గాయపడి తిరిగివచ్చిన సోదరి – వీటన్నిటినుంచీ దూరంగా పారిపోయి స్వతంత్రంగా బ్రతుకుతూ ఎదగాలన్న తాంబూ కోరికే చోదకశక్తిలా మారి ఆమెను హరారేకి చేర్చింది. ఉద్యోగరీత్యా తాను చేసిన పనులను తాము చేసినట్టుగా చెలామణి చేసుకుంటున్న తెల్లవాళ్ల కుట్రలను సహించలేని తాంబూ కాపీరైటర్ ఉద్యోగానికి రాజీనామా చేయటంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. చదువుకుని, స్వతంత్రంగా బతుకుతున్న తన ఇప్పటి ఆర్థికపరిస్థితులు తల్లితో పోలిస్తే ఏమాత్రం భిన్నంగా లేవన్న వాస్తవం తాంబూకి రుచించదు. ఆత్మనిష్ఠూరం, అవమానం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదగలేకపోతున్నానన్న అసహనం, అసంతృప్తులకు తోడుగా ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేనితనం ఆమెను కుంగదీస్తాయి.
స్కూల్‌టీచరుగా ఉద్యోగం సంపాదించుకున్న తాంబూ ఒకానొక ఉన్మాదస్థితిలో ఒక విద్యార్థినిని తీవ్రంగా గాయపరుస్తుంది. అనంతరం మానసిక సమతుల్యతని కోల్పోయి ఆస్పత్రిపాలైన తాంబూని చిన్నప్పటి స్నేహితురాలు, బంధువు అయిన న్యాషా, ఇతర కుటుంబీకులూ ఆదుకుంటారు. ‘నాకు బాగుపడాలని ఉంది, కానీ అలా మారేందుకు కావలసిన సాధనాలే నాదగ్గర లేవు’ అని డాక్టర్‌తో అనడం తాంబూ అంతస్సంఘర్షణని తెలియచేస్తుంది. విదేశాలలో చదువుకున్న న్యాషా సైతం ఇప్పటికీ పేదరికంలోనే ఉండటం తాంబూ అహానికి కొంత ఊరటనిస్తుంది. న్యాషాలోని సేవాభావం, కరుణ, స్త్రీల సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి వెనక విలువలని గుర్తించని తాంబూ తన స్వార్థం మాత్రం చూసుకుని న్యాషా పరిస్థితులను పట్టించుకోకుండా ఇకోటూరిజంలో మరో కొత్తఉద్యోగం వెతుక్కుని అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఆర్థికోన్నతి తాలూకు డాబుసరితనాన్ని ప్రదర్శిస్తూ, పెట్టుబడిదారుల చేతిలో పావుగా ఊరినీ ప్రజలనూ కూడా తన ఎదుగుదల కోసం ఉపయోగించదలుచుకున్న తాంబూని ఆమె తల్లి నిలువరించిన విధానం, తాంబూ మానసిక వికాస పరిణామక్రమం నవలలోని తుదిభాగపు అంశాలు.
మూడువందల పేజీల పాటు పోషించటం కష్టమైన మధ్యమపురుష కథనం మొదట్లో కొంత బెసికినట్టనిపించినా తరువాత వేగాన్ని పుంజుకుని ఆ కథనానికున్న ఇబ్బందిని దాటుకుని పాఠకుడి ఉత్సుకతను నిలబెట్టగలుగుతుంది. మొదటి రెండునవలల్లోని ఉత్తమపురుష కథనానికి భిన్నంగా ఈ నవలలో తననుంచి తాను విడివడి, వర్తమానకాలపు కథనం చేస్తుంది తాంబూ. పురాజ్ఞాపకాలు, ఊహాసౌధాల భవిష్యత్తు మధ్య ఊగిసలాడుతున్న తాంబూ అంతర్–బహిర్ముఖత్వాల మధ్యనున్న పల్చటిపొర తొలగిపోయి, ఆమె క్రూరమైన ఆలోచనలు బహిర్గతమవుతుంటాయి. తాంబూ వ్యక్తిత్వం సమర్థనీయంగా అనిపించకపోయినా, వివక్షలాంటి కారణాల వల్ల ఆమె పొందిన మానసిక గాయాల లోతుల్ని వదిలేసి ఆమెని బేరీజు వేయడం కూడా సబబు కాదు. పంటికింద రాయిలా అక్కడక్కడా దొర్లే షోనా భాషాపదాలను మినహాయిస్తే బలమైన పాత్రలు, సరళమైన భాష నవలలోని పరిగణనీయాంశాలు. ‘‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్దె; లోపమెరిగినవాడె పూర్ణుడగు నరుడు,’’ అని గాలిబ్ చెప్పినట్టు, అలాంటి స్పృహ మాత్రమే పరివర్తనానికి ఏకైక కారణం కాగలదు.
-పద్మప్రియ
నవల: దిస్ మౌర్నబుల్ బాడీ
రచయిత్రి: త్సిత్సీ డాంగరెంబా
ప్రచురణ: ఫేబర్ అండ్ ఫేబర్; 2020
Comments
Please login to add a commentAdd a comment