ఒక అసాంఘికుడి ఆత్మకథ | Ajay Prasad Mruthanagaramlo Telugu Novel | Sakshi
Sakshi News home page

ఒక అసాంఘికుడి ఆత్మకథ

Published Mon, Oct 12 2020 12:16 AM | Last Updated on Mon, Oct 12 2020 12:16 AM

Ajay Prasad Mruthanagaramlo Telugu Novel - Sakshi

దాదాపు రెండు సంవత్సరాల క్రితం కవి చిత్రకొండ గంగాధర్‌ చనిపోయాడని ఈ లోకానికి తెలిసింది. అలా మనకు తెలియడానికి చాలాకాలం క్రితమే తన ఊరిలో తనకు తానుగా చెరువులోకి నడుచుకుంటూ వెళ్లి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అలా నిజంగా ఆత్మహత్య చేసుకోడానికి ముందే అనేక సంవత్సరాల క్రితమే మరణించాడు. అంతకుముందెప్పుడో ఆదిమకాలంలోనే ఈ లోకం మరణించింది. తన పుట్టుకతోనే మరణాన్ని కలగన్నరోజే మనిషి జీవించడానికి కావాల్సిందేదో ఈ భూమ్మీద నశించింది. సుకుమారుడూ, సున్నిత మనస్కుడూ, మాటలురాని మౌని అయిన చిత్రకొండ గంగాధర్‌ లోకంలో అన్నీ చూసి, జీవితంలో దేనినీ చేతులతో తాకకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. నడిచినంతమేరా ఉలిదెబ్బలు తిని రాటుదేలిన ఈ మనిషి అశేషమైన మానవుల జీవన కార్యకలాపాల్లోనే ఏదో పాపం ఉందని, అందులో పాలుపంచుకోవడమే మహాపాపమని భావించి జీవిత రంగం నుంచి ఉత్తిచేతులతో విరమించుకున్నాడని ఒక్కోసారి నాకనిపిస్తూ ఉంటుంది. 

ఈ లోకం చేత తిరస్కరించబడినవారు కొందరుంటారు. కూలీలు, హమాలీలు, డబ్బు సంపాదించలేనివారు, తెలివితక్కువవారు, మందబుద్ధులు, ముష్టివాళ్లు, కుష్టువాళ్ళు, వేశ్యలు, అనాథలు, అందవికారులు, మందభాగ్యులు. వీరంతా తిరస్కృతులు. బహిష్కృతులు. వీళ్లంతా బాధలు పడేవాళ్ళు, వీళ్లంతా భయంతో బతికేవాళ్లు. దీనులు, హీనులు. వీళ్ళలోనే వీళ్ళలాకాక ఈ లోకాన్నీ, జీవితాన్నీ తిరస్కరించినవారు కొందరుంటారు. కొందరు లోపలికి ముడుచుకునేవాళ్ళు, కొందరు అన్నిటినీ విడిచిపెట్టేవాళ్ళు, అసహ్యించుకునేవాళ్ళు , లోకవృత్తం అర్థమయ్యి నవ్వుకునేవాళ్ళు, నిరంతరం దేనికోసమో వెతుక్కుంటూపోయే సంచారులు, ఏదీ వెతకక, దేనితోనూ పనిలేక అలా కూర్చుండిపోయే విరాగులు, బైరాగులు. వీళ్లంతా లోకం పోకడకు పారిపోయే పిరికివాళ్ళు కారు. చిత్రకొండ గంగాధర్‌ ఈ కోవకి చెందినవాడు. ఇల్లూ వాకిలి, ఊరూవాడా విడిచిపెట్టి తనకి మాత్రమే గోచరించే వెలుగునేదో వెతుక్కుంటూ, అనుదినం వెంటాడే వెలితి బరువుని భుజానేసుకుని అతడు ఈ లోకయాత్రకి బయలుదేరాడు.

ఇలా ఉండబోతుంది అనుకున్న సుఖమయ జీవితాన్ని అతడు ముందే ఊహించి దాన్ని సంపూర్ణంగా తిరస్కరించాడు. అతడు ఆశావాది కాదు, నిరాశావాది అసలే కాడు. అతడిలో దిగులూ, దైన్యమూ ఏ కోశానా లేవు. పైకి బిడియస్తుడిలా కనిపించే గంగాధర్‌ లోకమూ జీవితమూ నలిపి పడేసిన అలాగాజనం తరపున వకాల్తా పుచ్చుకున్న మనిషిలా కనిపిస్తాడు.  ఈ నవల చదువుతున్నంతసేపూ గంగాధర్‌ నాతో మాట్లాడుతున్నట్లే ఉంది. అతడు 12000 సంవత్సరానికి పూర్వం రాసుకున్న ఈ నవల ఒకరకంగా అతడి ఆత్మకథలా నాకనిపించింది. నవల ప్రారంభంలో నీలంరంగు మంచినీటి సరస్సులో స్నానం చేసి బయలుదేరిన ఇకారస్, తమ ఊరి చెరువులో జీవితాన్ని ముగించిన గంగాధర్‌ ఒకరే అని నాకనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచమంతా గంగాధర్‌కి కొత్త. ప్రపంచానికి గంగాధర్‌ ఒక వింత. ఈ మనుషులు, ఇళ్ళు, స్త్రీలు... అలా ఈ ప్రపంచ ప్రవాహమంతా గంగాధర్‌కి ఒక విడదీయలేని చిక్కుముడి, ఒక లేబరింత్‌ లాగా అనిపించింది.

ఈ లేబరింత్‌ కొందరికి పవిత్రమైన, దైవికమైన విశ్వరహస్యంలా, మరికొందరికి అంతుపట్టని అమోఘమైన సౌందర్యంలా అనిపిస్తే గంగాధర్‌ లాంటి కొందరికి అంతంలేని దుఃఖంలా అనిపిస్తుంది. గ్రీకు మైథాలజీలో ఇకారస్‌ తొడుక్కున్న లక్కతో చేసిన రెక్కలు సూర్యుడి వేడిమికి కరిగిపోయి సముద్రంలో పడిపోతాడు. చిత్రంగా చెరువులోకి నడుచుకుంటూ వెళ్లిపోయిన గంగాధర్‌లానే ఇకారస్‌కి తన తండ్రి డేడలస్‌తో అనుబంధం ఎక్కువ.  మరి గంగాధర్‌ ధరించిన రెక్కలు ఎవరివి? అవి ఎక్కడ తెగిపోయాయి? నవల ముగింపులో ఇకారస్‌ మరణించాక మళ్ళీ వస్తాడని గంగాధర్‌ చెబుతాడు. వచ్చి మళ్ళీ ముప్పై ఐదేళ్లు బతుకుతాడని, మళ్ళీ ముప్పై వింత పట్టణాలు తిరుగుతాడని ఉంటుంది. మరి ఇకారస్‌ లాగానే చిత్రకొండ గంగాధర్‌ మళ్ళీ తిరిగి వస్తాడా? 
(చిత్రకొండ గంగాధర్‌ మరణానంతరం అతడి ఈ ఏకైక నవల మిత్రుల చొరవతో ప్రచురితమైంది.)
- అజయ్‌ ప్రసాద్‌

మృతనగరంలో (నవల)
రచన: చిత్రకొండ గంగాధర్‌; పేజీలు: 108; వెల: 110; 
ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ. 
ఫోన్‌: 9866115655 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement