పాట్నా బ్లూస్ నవలా రచయిత అబ్దుల్లాహ్ ఖాన్
పాట్నా బ్లూస్ నవలని అబ్దుల్లాహ్ ఖాన్ మొదట ఇంగ్లిష్‌లో, హిందీలో రాశారు. బిహార్‌లో ఒక మధ్యతరగతి ముస్లిం యువకుడి జీవితం ఇందులో కనపడుతుంది. ఇప్పటికి ఆ నవల పదమూడు భాషల్లో అనువాదమైంది. అరిపిరాల సత్యప్రసాద్ తెలుగు అనువాదం పాట్నా ఒక ప్రేమకథ అన్వీక్షికీ ద్వారా విడుదలైంది.
ఈ సందర్భంగా రచయితతో అనువాదకుడి సంభాషణ:
పాట్నా బ్లూస్ కథాంశం పల్ప్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంటుంది. కొంత మంది విమర్శకులు ఆ మాట అన్నారు కూడా. అలాగే చాలా మంది ఆ పుస్తకానికి ఒక ప్రత్యేకమైన సాహితీ విలువ ఆపాదించారు. మీరు ఆ పుస్తకాన్ని ఎలా చూస్తారు? పల్ప్ ఫిక్షనా, సాహిత్యమా?
ఈ రెండే రకాలుగా పుస్తకాలు వుండాలి అని మనకి మనమే పరిధులు గీసుకుంటున్నామేమో. నా నవలని నేను పాపులర్ సాహిత్యం అంటాను. ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఆ కథని ఆసక్తికరంగా, చదివించే విధంగా రాయడంలో తప్పేముంది? మనం చెప్పే కథ సాహితీ విలువ కలిగి వుంటే దాన్ని ఆకర్షణీయంగా ఆసక్తికరంగా చెప్పడం వల్ల అది ఎక్కువమందికి చేరుతుంది కదా? పల్ప్ ఫిక్షన్‌లో వుండే ఆకర్షణనీ, సాహిత్యంలో వుండే విలువలనీ జోడించి రాయటం నా వుద్దేశ్యంలో చాలా మంచిది, అవసరం కూడా. అయినా చాలా తక్కువ విమర్శకులు ఈ పుస్తకాన్ని పల్ప్ ఫిక్షన్ అన్నారు. కొంచెం మెలోడ్రామా ఎక్కువైందని మాత్రం విమర్శలు వచ్చాయి.
ఆరిఫ్ అనే మధ్యతరగతి బిహారీ ముస్లిం జీవితంలో దాదాపు రెండు దశాబ్దాల కథ ఇందులో కనిపిస్తుంది. దానితోపాటు మండల్ నుంచి మోదీ దాకా భారతదేశ రాజకీయ చరిత్ర అంతర్లీనంగా పరుచుకుని వుంటుంది. వీటిని కథలో ఎందుకు చొప్పించారు?
కథలు ఏ ఆధారం లేకుండా గాలిలో వుండవు. ఒక కాలాన్ని మనం తీసుకుని ఆ కాలంలో మనుషుల గురించి చెప్తున్నప్పుడు ఆ కాలంలో వున్న సామాజిక, రాజకీయ పరిస్థితులు, సంఘటనల గురించి చెప్పకపోతే ఎలా? ముఖ్యంగా ఆ పరిస్థితులు, సంఘటనలు ఆ పాత్రల జీవితాలపై ప్రభావం చూపిస్తున్నప్పుడు? ఆరిఫ్ తొంభైలలో వున్న పాత్ర కాబట్టి ఆ కాలం నాటి ప్రభావం అతని జీవితం మీద వుంటుంది. ఆ సంఘటనల గురించి ఆరిఫ్‌కి కూడా ఒక అభిప్రాయం వుంటుంది. ఇలాంటి వివరాలన్నీ జోడిస్తేనే పాత్రలు రక్తమాంసాలతో సహజంగా, సజీవంగా వుంటాయి.
కథలో ముస్లిం పాత్రలూ వున్నాయి, హిందూ పాత్రలూ వున్నాయి. ఆ పాత్రల మధ్య విభేదాలు, గొడవలు, అల్లర్లు కూడా వున్నాయి. కానీ మీరు కథ చెప్పిన విధానం గమనిస్తే ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్తున్న గొంతు వినపడుతుంది. ఇలాంటి గొంతును ఎందుకు ఎంచుకున్నారు?
మీరు చెప్పింది నిజమే. నేను కావాలనుకుంటే గట్టిగా అరిచి చెప్పి వుండొచ్చు. నిరసన ప్రకటించి వుండొచ్చు. విభేదాల గురించి ఒకవైపు ఒరిగి మాట్లాడవచ్చు. కానీ అవేమీ చెయ్యలేదు. ఈ కథానాయకుడు హిందూ ముస్లింలు కలిసిమెలిసి వుండే ప్రాంతంలో వుంటాడు. అతని కుటుంబానికి హిందూ కుటుంబాలతో సత్సంబంధాలు వుంటాయి. ఆరిఫ్ తండ్రికి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి బ్రాహ్మిన్. ఆరిఫ్ ఆప్తమిత్రుడు మృత్యుంజయ్ హిందూ. అందువల్ల ఆ పాత్రలు సౌభ్రాతృత్వాన్నే కోరుకుంటాయి. రెండో కారణం ఈ కథని తృతీయ పురుష కథనంలో చెప్పడం. ఉత్తమ పురుష కథనం అయితే అభిప్రాయాలు ప్రకటించేందుకు కొంత వెసులుబాటు ఉండేది. తృతీయ పురుష కథనంలో ఆ అవకాశం తక్కువ. బహుశా నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన హిందూ ముస్లిం సంబంధాల ప్రభావం కూడా వుండి వుండొచ్చు.
పాఠకుడికి ఆసక్తి కలిగించడానికి కొన్ని చిక్కు ముడులు వేసి చివర్లో ఆ ముడులు విప్పడం సాధారణంగా రచయితలందరూ చేస్తారు. నవలలో మీరు ఎన్నో చిక్కు ముడులను విప్పకుండా వదిలేశారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే నవల ముగించారు. ఎందుకు?
సమాధానం కన్నా ప్రశ్న బలమైనది. నేను సమాధానం చెప్పేసే బదులు తొలిచే ప్రశ్నలతో పాఠకులని వదిలేస్తే, వాళ్లే సమాధానాల కోసం వెతుక్కుంటారు. మొదటిసారి రాసినప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాశాను. కానీ అవి చదివినప్పుడు చాలా కృతకంగా అనిపించాయి. అందుకే వాటిని తరువాత డ్రాఫ్ట్ నుంచి తొలగించాను. చిత్రం ఏమిటంటే ఇలా జవాబు తెలియని ప్రశ్నలతో పుస్తకాన్ని ముగించడం చాలామంది పాఠకులకి నచ్చింది.
ఆరిఫ్ జీవితం మొత్తం వైఫల్యాలతో నిండి వుంటుంది (చివరి సంఘటన తప్ప). ఇలాంటి వైఫల్యాలతో నిండిన వ్యక్తిని కథానాయకుణ్ణి చేసి కథ చెప్పడానికి ఎలా సాహసించారు?
నిజజీవితంలో మాత్రం మనం కోరుకున్నవన్నీ దక్కుతాయా? వైఫల్యాలు సహజం. కథానాయకుడు ప్రతిసారీ గెలవడం నాకు ముఖ్యం కాదు. అతనికి వున్న పరిమితుల్లో ప్రయత్న లోపం లేకుండా వున్నాడా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఆరిఫ్ పూర్తిగా విఫలమయ్యాడు అంటే నేను ఒప్పుకోను. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినా పోరాడి నిలబడ్డాడు. సమస్యల నుంచి పారిపోలేదు. కెరియర్ దెబ్బతిన్నా, అతనికి వున్న ఆత్మీయ బంధం తెగిపోయినా అతను ఆత్మహత్య చేసుకోలేదు. అది ఆ పాత్ర మానసిక బలాన్నే చూపిస్తుంది. కాబట్టి ఆరిఫ్ వైఫల్యాలను చూడటం కన్నా, ఆ వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తిత్వాన్ని చూడాలి. అతనిలో వున్న మానవత్వం, కుటుంబం పట్ల బాధ్యత ఇవన్నీ కూడా గుర్తిస్తే అతను నిజమైన హీరోలా కనిపిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment