ఈవెంట్
త్రిపుర కథల వెబినార్: త్రిపుర పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం ఛాయ వెబినార్ ద్వారా త్రిపుర కథలు గుర్తుచేస్తున్నారు ఏకే ప్రభాకర్, ఎన్.వేణుగోపాల్, ల.లి.త, నరేష్ కుమార్ సూఫీ, దేశరాజు. ఫేస్‌బుక్, యూట్యూబులో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. -త్రిపుర
19వ శతాబ్దిలో పరిఢవిల్లిన ఆంగ్ల కాల్పనిక కోయిల జాన్ కీట్స్ 1819లో రచించిన కవిత ‘ఓడ్ ఆన్ ఎ గ్రీషియన్ అర్న్’. గ్రీకుల విగ్రహారాధన, అనేక ప్రాపంచిక విషయాలలో వారి సత్యశోధన అంశాల పట్ల కీట్స్ ఆకర్షితుడయ్యాడు. ఈ ప్రభావాలే తన కవితకు ప్రేరణగా నిలిచాయి. ఒక అందమైన కలశం మీద చిత్రితమైన చిత్రాలకు ఇంద్రధనుస్సు రంగులను అద్దాడు కవి. ఆ కలశం మీద అడవి వైపు వెళ్తున్న ప్రేమజంట, ఒక ఊరేగింపులాంటి కోలాహలం, ఖాళీ అయిన ఒక గ్రామం చిత్రితమైనాయి. ‘ఏ నదీ సముద్రతీరాల పక్కనో, పర్వత సానువుల చెంతనో నిర్మితమైన ప్రశాంతమైన దుర్గం. ఈ ప్రభాతాన జనమంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఓ చిన్ని గ్రామమా! నీ వీధుల్లో ఇక నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. నిన్నెందుకిలా వదిలిపోయారో– చెప్పటానికి ఒక్కరూ లేరు, మరి తిరిగిరారు కూడా.’
ఆ వెళ్లిపోయిన ప్రేమజంట ఎవరు? ఊరెందుకు ఖాళీ అయింది? కీట్స్ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు సమాధానమా అన్నట్లుగా ఒక భారతీయ రచయిత తన నవల రూపకల్పన చేశాడని నాకు అనిపించింది. ఆ నవలే దాదీ బుఢా. రచయిత గోపీనాథ మహంతి. ఒరియా సాహిత్యంలో తొలి జ్ఞానపీuŠ‡ పురస్కారం(1973) పొందిన రచయిత మహంతి. దాదీ బుఢా 1944లో విడుదలైంది. థెంగా, సంతోష్‌కుమారి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఊరు వదిలి అరణ్యంవైపు వెళ్తున్న దృశ్యమూ, గ్రామస్తులంతా కోలాహలంగా తమ సామాన్లని సర్దుకుని లుల్లా గ్రామం వదిలిపోతున్న దృశ్యమూ– కీట్స్ కవితలో కలశంపై చిత్రితమైన కథకు వ్యాఖ్యానంగా నిలుస్తాయి.
కోరాపుట్ జిల్లా కొండలలో అనేక ఆదివాసీ గ్రామాలున్నాయి. మురాన్ నది గట్టు మీద ఉన్న గ్రామాలలో లుల్లా ఒకటి. కథాకాలం నాటికి క్రిస్టియన్ మతం అక్కడ వ్యాపిస్తోంది. ప్రధాన పాత్ర గ్రామ పెద్ద రామ్ నాయక్. ఒక రాత్రివేళ కొందరితో కలిసి కొండ దిగి గ్రామంలోకి రావటంతో కథ ప్రారంభమౌతుంది. ప్రతి గ్రామంలో మూలపురుషుడిని దాదీ బుఢా పేరుతో పూజించడం ఆచారం. గ్రామంలో దైవశక్తులున్నాయని ప్రజలు విశ్వసించే ఒక గురుమాయి, ఒక పూజారి కూడా ఉన్నారు. కొండ ప్రాంతాల భూములన్నీ వరి, రాగి, మొక్కజొన్న, గోధుమ పంటలతో కళకళలాడుతున్నాయి. పెళ్లికాని యువతీ యువకులు రాత్రిపూట నృత్యగానాలతో సందడిగా గడుపుతారు.
గ్రామపెద్ద కొడుకు థెంగా జానీ. ఊళ్లో అమ్మాయిలందరూ థెంగా తమ భర్త కావాలని కోరుకుంటారు. అతడు పరజా జాతివాడు. అయితే, క్రిస్టియన్‌పేటకు చెందిన డొంబుల అమ్మాయి సంతోష్ కుమారికి దగ్గరవుతాడు. పూర్వంనుంచీ పరజాలకూ డొంబులకూ పెళ్లిళ్లు జరిగేవి కావు. ఈ లోపల మరో పెద్దమనిషి కూతురు సారియతో థెంగాకు వివాహ ఏర్పాట్లు జరుగుతాయి. తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని తెలిసి, ఒక తెల్లవారుజామున ఆ ప్రేమికులు గమ్యం తెలీని యాత్రికుల్లా అడవి దాటి ముందుకుసాగారు.
మరి ఊరు ఎలా ఖాళీ అయింది? కొడుకు తమను విడిచివెళ్లడం రామ్ నాయక్ దంపతులను దుఃఖంలో ముంచేసింది. కష్టాలు తొలగాలని దాదీ బుఢాకు పూజలు జరిపిస్తారు. ఈ లోపల ఊరిని ఉపద్రవం చుట్టుముట్టింది. పశువులు, కోళ్లు వ్యాధులతో మరణిస్తాయి. పులులు గ్రామం మీద పడతాయి. గురుమాయిని దాదీ బుఢా ఆవహించి ఊరు వదిలెయ్యమని చెబుతాడు. అలా జనం కొత్త ఊరికి పయనమయ్యారు. క్రమంగా గ్రామంలో ఇండ్ల గోడలన్నీ కూలిపోయాయి. అక్కడంతా పిచ్చిమొక్కలు. కీట్స్ పేర్కొన్నట్లు, ‘నిన్నెందుకిలా వదిలిపోయారో చెప్పటానికి ఒక్కరూ లేరు, మరి తిరిగిరారు కూడా.’
1819లో కీట్స్ కవిత గ్రీషియన్ అర్న్‌లో కలశం మీద చిత్రాలకు సుమారు 125 ఏండ్ల తర్వాత గోపీనాథ మహంతి వ్యాఖ్యాన ప్రాయమైన నవల వెలువరించడం విశేషం. గ్రీకు భాషలో దీనికి మూలకథ ఉండివుండవచ్చు. అలాగే మహంతి ఆ కవిత చదివాక ఉత్తేజితుడై ఈ నవలా రచనకు ఉపక్రమించాడని చెప్పటం ఊహాత్మకమే అవుతుంది. ఖండాంతరాల ఆవల ఉన్న రచయితల ఊహలు ఒక్కోమారు యాదృచ్ఛికంగా సంవాదించడం సాహిత్యకారులందరికీ తెలిసిన విషయమే. అటువంటి కోవకు చెందిన రచనగానే దాదీ బుఢాని పరిగణించాలి.
(దాదీ బుఢా ఒరియా నవలకు వ్యాసకర్త చేసిన తెలుగు అనువాదం ‘ఈతచెట్టు దేవుడు’ పేరుతో సాహిత్య అకాడెమీ ద్వారా వెలువడనుంది.)
డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment