translation
-
Translation Day: ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తూ..
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పరస్పరం కమ్యూనికేట్ చేసుకునేందుకు అనువాదం అనేది ఒక ముఖ్యమైన సాధనం. అనువాదకుల కీలక పాత్రను గుర్తిస్తూ, సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున అనువాదకుల, భాషావేత్తల కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ, పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.బైబిల్‌ను లాటిన్లోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ప్రతీ ఏటా సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. సెయింట్ జెరోమ్‌ను అనువాదకుల పోషకునిగా పరిగణిస్తారు. ఈయన బైబిల్‌ను లాటిన్లోకి అనువదించగా, దానిని వల్గేట్ అని పిలుస్తారు. ఈ అనువాద రచన ఆయన పాండిత్యానికి, భాషా జ్ఞానానికి నిదర్శనమని చెబుతారు. సెయింట్ జెరోమ్‌ను గుర్తుచేసుకుంటూ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఎప్ఐటీ) ప్రారంభించింది.ఈ సంస్థ 1953లో స్థాపితమయ్యింది. 1991 నుంచి వారు ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. దీనిని 2017లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది. అనువాదకులు ప్రపంచ శాంతి, సహకారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆలోచనలు, భావజాలాలు, సంస్కృతుల మార్పిడికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. సాహిత్యం, సైన్స్, వ్యాపారం, రాజకీయ రంగాలలో అనువాదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచ వాణిజ్యం, దౌత్యం, శాస్త్రీయ పరిశోధనలు సజావుగా సాగాలంటే అనువాదకులు సహాయం అవసరమవుతుంది. వివిధ భాషలలో రాసిన సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు, కమ్యూనికేట్ చేయడానికి అనువాదకులు ఉపయోగపడతారు. అనువాదం అనేది లేకుంటే ప్రముఖ రచయితలు షేక్స్పియర్, టాల్‌స్టాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్‌చంద్ తదితరుల రచనలు ప్రపంచానికి తెలిసేవి కావనడంతో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
గూగుల్ అనువాదం ఎఫెక్ట్.. పట్టాలెక్కిన ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’
కొచ్చి: గూగుల్ అనువాదంతో బుక్కైన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కేరళలోని ఓ రైలు పేరు హటియా-ఎర్నాకులం అని హిందీ ఇంఘ్లీష్లో ఉండగా హటియాను అనువదించి మళయాలంలో హత్య(మర్డర్) అని అర్థం వచ్చేలా ‘కొలపతకం’ అని బోర్డుపై రాశారు. దీంతో రైలు పేరు కాస్తా మర్డర్ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. ఈ వ్యవహారంలో రైల్వే అధారులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైలు నేమ్ ప్లేట్‌ను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ ‘ష్..వారికి ఎవరూ చెప్పొద్దు’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. గూగుల్ అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డ ఫలితం అని మరో నెటజన్ చురకంటించారు. రైలు పేరు విషయంలో అనువాదం బెడిసికొట్టిన వ్యవహారంపై రాంచీ డివిజన్ సీనియర్ రైల్వే అధికారి స్పందించారు. ఇది తప్పుడు అనువాదం వల్ల వచ్చిన సమస్యని, తమ దృష్టికి రాగానే నేమ్‌ప్లేట్ సరి చేశామని తెలిపారు. రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 😭😭😭 https://t.co/u2CXud1sok — Cow Momma (@Cow__Momma) April 12, 2024 ఇదీ చదవండి.. బోర్న్వీటాపై కేంద్రం కీలక ఆదేశాలు -
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక!
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక. నవంబర్ 26, 2023న ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని ఎస్బీఐ ట్వీట్ చేసింది. pic.twitter.com/I0Mv1WlJ79 — State Bank of India (@TheOfficialSBI) November 25, 2023 ఎస్బీఐ యూపీఐలో సర్వర్ల పనితీరు, అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలు లేదని తెలిపింది. అయితే అదే సమయంలో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యోనో లైట్, ఏటీఎం సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ అధికారులు తెలిపారు. ఎస్బీఐ ట్వీట్ మేరకు.. ‘మేం నవంబర్ 26, 2023న 00:30 గంటల నుంచి 03:00 గంటల (అర్ధరాత్రి) మధ్య యూపీఐలో టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయనున్నాం.ఈ సమయంలో ఎస్బీఐ యూపీఐ తప్ప ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యోనో లైట్, ఏటీఎంతో సహా మా ఇతర డిజిటల్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి.’ అని పేర్కొంది. -
ముచ్చటైన పెన్ను.. మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే!
ఇది మూడు భాషల ముచ్చటైన పెన్ను. ఇది చేతిలో ఉంటే, మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే! దీంతో రాయడానికి సాధ్యంకాదు గాని, దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. చైనీస్ కంపెనీ ‘స్మార్ట్ యుడావో’ ఇటీవలే ఈ పెన్నును మార్కెట్లోకి తెచ్చింది. చైనీస్, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోని పదాలను, వాక్యాలను ఈ పెన్ను ఒక భాష నుంచి మరో భాషలోకి ఇట్టే అనువదిస్తుంది. మామూలు పుస్తకం లేదా ఈ–బుక్‌లోని వ్యాక్యాలను ఈ పెన్నుతో స్కాన్ చేస్తూ ఉంటే, కోరుకున్న భాషలోకి అనువదిస్తుంది. అంతేకాదు, తెలియని పదాలకు గల అర్థాలను, పర్యాయపదాలను చెబుతుంది. విద్యార్థులకు, భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పెన్ను ధర 199.99 డాలర్లు (రూ.16,474) మాత్రమే! -
అనువాదాలు అవసరమైన సామాజిక సందర్భాలు
సృజన సాహిత్యానికి ఉన్నట్లు అనువాదానికి ఒక సామాజిక సాంస్కృతిక సందర్భం ఉంటుందా? ఉంటుంది అనే చరిత్ర చెబుతున్నది. బౌద్ధ జైన మత సంస్కృతులను అభావం చేస్తూ ‘వర్ణాశ్రమ ధర్మ పరి రక్షణ’, ‘మను మార్గ వర్తన’ ప్రధానంగా గల వైదిక మత స్థాపన నాటి మత సాంస్కృతిక అవసరంగా ముందుకు వచ్చినపుడు తెలుగు సమాజానికి సంస్కృతం నుండి మహాభారత అనుసృజన అవసరమైంది. జాతీయోద్యమ నిర్మాణానికి భారతదేశపు భిన్న ప్రాంతాల, భాషల ప్రజా సమూహాల మధ్య ఐక్యతా భావాన్ని అభివృద్ధి చెయ్య వలసిన సందర్భం నుండి అనువాదం ప్రాధాన్యం లోకి వచ్చింది. దేశాల సరిహద్దులతో నిమిత్తం లేకుండా మానవ సమూహమంతా ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని రెండు వర్గాలుగా విడిపోయివుందనీ, బ్రిటన్‌లోని పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో పెట్టు బడిదారీ సమాజం అభివృద్ధి చెందిన విధానాన్ని గుర్తించి, కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యతను సంభావించిన మార్క్స్, ఎంగెల్స్ విశ్వమానవుల మధ్య సంభాషణకు తలుపులు తెరిస్తే సాహిత్య రంగంలో అది అనువాదాలకు దారితీసింది. 1917 రష్యా విప్లవ విజయం తరువాత భారత దేశంలోని కార్మిక కర్షక పోరాటాలకు స్ఫూర్తి ఇవ్వటానికి ‘అమ్మ’ (మాక్సిమ్ గోర్కీ) వంటి నవలలు తెలుగులోకి అనువాదం కావడం గమ నించవచ్చు. 1930వ దశకంలో ప్రారంభమై 1950ల వరకు సాగిన అభ్యుదయ సాహిత్యోద్యమం... ప్రపంచంలో భూస్వామ్య పెట్టుబడిదారీ ఆధిపత్యాల మీద జరిగిన తిరుగుబాట్ల చరిత్రను భిన్న దేశాల సాహిత్యం నుంచి అనువాదం చేసుకొన్నది. మరొక వైపు దేశంలోనే భిన్న ప్రాంతాలలో భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు వస్తువుగా వచ్చిన సాహిత్యాన్ని అనువాదం చేసుకొన్నది. మొత్తంగా ఇవన్నీ దేశం మీద జరుగుతున్న పీడితుల పోరాట చరిత్రకు నైతిక మద్దతు కూడగట్టడంలో కీలకపాత్ర పోషించాయి. అలాగే విప్లవోద్యమ అవసరాల నుండి చైనా విప్లవోద్యమం, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలు, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంబం ధించిన కథనాలు అనేకం తెలుగులోకి అనువాదం అయ్యాయి. ఈ రకమైన అనువాద చరిత్రను స్త్రీల కోణం నుండి అధ్యయనం చేయటం స్త్రీల సాహిత్య, సాంస్కృతిక చరిత్ర నిర్మాణం దృష్ట్యా అవసరం. ఇది రెండు రకాలుగా జరగాలి. ఒకటి: స్త్రీల జీవన సమస్యలను, సంఘర్షణలను చిత్రించిన సైద్ధాంతిక సృజన విమర్శన సాహిత్యాన్ని ఎంతగా తెలుగులోకి తెచ్చుకున్నాం? అందువల్ల తెలుగు సమాజ తాత్విక భావధార ఎంత పదునెక్కింది? అన్న ప్రశ్నలతో తరచి చూడటం. రెండు: అనువాదకులుగా తెలుగు స్త్రీల అభిరుచులు, ఆసక్తులు, చైతన్యం ఎటువంటివి? వారు చేసిన అనువాదాల సందర్భశుద్ధి ఎటువంటిది? వంటి ప్రశ్నలతో మదింపు చేయటం. ఇతర భాషలలోని స్త్రీల రచనలు, తెలుగులో స్త్రీలు చేసిన అనువాదాలు తెలుగు సమాజంలో మహిళా సమస్యల గురించిన అవగాహనను పదునెక్కించటంలో నిర్వహించిన పాత్రను ప్రత్యేకంగానూ, సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సందర్భాలకు అనువాదాల ద్వారా స్త్రీలు సమకూర్చిన శక్తిని మొత్తంగానూ అర్థం చేసుకొనటాన్ని ఉద్దేశించి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘అనువాద సాహిత్యం – స్త్రీ సందర్భం’ అనే అంశంపై ఆరవ మహాసభను జూలై 9, 10 తేదీలలో గుంటూరులో నిర్వహించ తలపెట్టింది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వాని స్తున్నది. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) - కాత్యాయనీ విద్మహే జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
ఇస్రో, హెచ్ఎస్ఎఫ్సీ, బెంగళూరులో జేటీఓ పోస్టులు
బెంగళూరులోని ఇస్రో–హ్యూమన్ స్పేస్ రీసెర్చ్ ప్లయిట్ సెంటర్(హెచ్ఎస్ఎఫ్సీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (జేటీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 06 ► అర్హత: హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీకి ట్రాన్స్‌లేట్ చే యడం వచ్చి ఉండాలి. ► వయసు: 20.11.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్–ఏ ఆబ్జెక్టివ్, పార్ట్–బి డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. రాతపరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల్ని స్కిల్ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దర ఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021 ► వెబ్సైట్: www.isro.gov.in -
కీట్స్ కవితకు వ్యాఖ్యానంలాంటి నవల
ఈవెంట్ త్రిపుర కథల వెబినార్: త్రిపుర పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం ఛాయ వెబినార్ ద్వారా త్రిపుర కథలు గుర్తుచేస్తున్నారు ఏకే ప్రభాకర్, ఎన్.వేణుగోపాల్, ల.లి.త, నరేష్ కుమార్ సూఫీ, దేశరాజు. ఫేస్బుక్, యూట్యూబులో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. -త్రిపుర 19వ శతాబ్దిలో పరిఢవిల్లిన ఆంగ్ల కాల్పనిక కోయిల జాన్ కీట్స్ 1819లో రచించిన కవిత ‘ఓడ్ ఆన్ ఎ గ్రీషియన్ అర్న్’. గ్రీకుల విగ్రహారాధన, అనేక ప్రాపంచిక విషయాలలో వారి సత్యశోధన అంశాల పట్ల కీట్స్ ఆకర్షితుడయ్యాడు. ఈ ప్రభావాలే తన కవితకు ప్రేరణగా నిలిచాయి. ఒక అందమైన కలశం మీద చిత్రితమైన చిత్రాలకు ఇంద్రధనుస్సు రంగులను అద్దాడు కవి. ఆ కలశం మీద అడవి వైపు వెళ్తున్న ప్రేమజంట, ఒక ఊరేగింపులాంటి కోలాహలం, ఖాళీ అయిన ఒక గ్రామం చిత్రితమైనాయి. ‘ఏ నదీ సముద్రతీరాల పక్కనో, పర్వత సానువుల చెంతనో నిర్మితమైన ప్రశాంతమైన దుర్గం. ఈ ప్రభాతాన జనమంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఓ చిన్ని గ్రామమా! నీ వీధుల్లో ఇక నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. నిన్నెందుకిలా వదిలిపోయారో– చెప్పటానికి ఒక్కరూ లేరు, మరి తిరిగిరారు కూడా.’ ఆ వెళ్లిపోయిన ప్రేమజంట ఎవరు? ఊరెందుకు ఖాళీ అయింది? కీట్స్ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు సమాధానమా అన్నట్లుగా ఒక భారతీయ రచయిత తన నవల రూపకల్పన చేశాడని నాకు అనిపించింది. ఆ నవలే దాదీ బుఢా. రచయిత గోపీనాథ మహంతి. ఒరియా సాహిత్యంలో తొలి జ్ఞానపీuŠ‡ పురస్కారం(1973) పొందిన రచయిత మహంతి. దాదీ బుఢా 1944లో విడుదలైంది. థెంగా, సంతోష్‌కుమారి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఊరు వదిలి అరణ్యంవైపు వెళ్తున్న దృశ్యమూ, గ్రామస్తులంతా కోలాహలంగా తమ సామాన్లని సర్దుకుని లుల్లా గ్రామం వదిలిపోతున్న దృశ్యమూ– కీట్స్ కవితలో కలశంపై చిత్రితమైన కథకు వ్యాఖ్యానంగా నిలుస్తాయి. కోరాపుట్ జిల్లా కొండలలో అనేక ఆదివాసీ గ్రామాలున్నాయి. మురాన్ నది గట్టు మీద ఉన్న గ్రామాలలో లుల్లా ఒకటి. కథాకాలం నాటికి క్రిస్టియన్ మతం అక్కడ వ్యాపిస్తోంది. ప్రధాన పాత్ర గ్రామ పెద్ద రామ్ నాయక్. ఒక రాత్రివేళ కొందరితో కలిసి కొండ దిగి గ్రామంలోకి రావటంతో కథ ప్రారంభమౌతుంది. ప్రతి గ్రామంలో మూలపురుషుడిని దాదీ బుఢా పేరుతో పూజించడం ఆచారం. గ్రామంలో దైవశక్తులున్నాయని ప్రజలు విశ్వసించే ఒక గురుమాయి, ఒక పూజారి కూడా ఉన్నారు. కొండ ప్రాంతాల భూములన్నీ వరి, రాగి, మొక్కజొన్న, గోధుమ పంటలతో కళకళలాడుతున్నాయి. పెళ్లికాని యువతీ యువకులు రాత్రిపూట నృత్యగానాలతో సందడిగా గడుపుతారు. గ్రామపెద్ద కొడుకు థెంగా జానీ. ఊళ్లో అమ్మాయిలందరూ థెంగా తమ భర్త కావాలని కోరుకుంటారు. అతడు పరజా జాతివాడు. అయితే, క్రిస్టియన్‌పేటకు చెందిన డొంబుల అమ్మాయి సంతోష్ కుమారికి దగ్గరవుతాడు. పూర్వంనుంచీ పరజాలకూ డొంబులకూ పెళ్లిళ్లు జరిగేవి కావు. ఈ లోపల మరో పెద్దమనిషి కూతురు సారియతో థెంగాకు వివాహ ఏర్పాట్లు జరుగుతాయి. తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని తెలిసి, ఒక తెల్లవారుజామున ఆ ప్రేమికులు గమ్యం తెలీని యాత్రికుల్లా అడవి దాటి ముందుకుసాగారు. మరి ఊరు ఎలా ఖాళీ అయింది? కొడుకు తమను విడిచివెళ్లడం రామ్ నాయక్ దంపతులను దుఃఖంలో ముంచేసింది. కష్టాలు తొలగాలని దాదీ బుఢాకు పూజలు జరిపిస్తారు. ఈ లోపల ఊరిని ఉపద్రవం చుట్టుముట్టింది. పశువులు, కోళ్లు వ్యాధులతో మరణిస్తాయి. పులులు గ్రామం మీద పడతాయి. గురుమాయిని దాదీ బుఢా ఆవహించి ఊరు వదిలెయ్యమని చెబుతాడు. అలా జనం కొత్త ఊరికి పయనమయ్యారు. క్రమంగా గ్రామంలో ఇండ్ల గోడలన్నీ కూలిపోయాయి. అక్కడంతా పిచ్చిమొక్కలు. కీట్స్ పేర్కొన్నట్లు, ‘నిన్నెందుకిలా వదిలిపోయారో చెప్పటానికి ఒక్కరూ లేరు, మరి తిరిగిరారు కూడా.’ 1819లో కీట్స్ కవిత గ్రీషియన్ అర్న్లో కలశం మీద చిత్రాలకు సుమారు 125 ఏండ్ల తర్వాత గోపీనాథ మహంతి వ్యాఖ్యాన ప్రాయమైన నవల వెలువరించడం విశేషం. గ్రీకు భాషలో దీనికి మూలకథ ఉండివుండవచ్చు. అలాగే మహంతి ఆ కవిత చదివాక ఉత్తేజితుడై ఈ నవలా రచనకు ఉపక్రమించాడని చెప్పటం ఊహాత్మకమే అవుతుంది. ఖండాంతరాల ఆవల ఉన్న రచయితల ఊహలు ఒక్కోమారు యాదృచ్ఛికంగా సంవాదించడం సాహిత్యకారులందరికీ తెలిసిన విషయమే. అటువంటి కోవకు చెందిన రచనగానే దాదీ బుఢాని పరిగణించాలి. (దాదీ బుఢా ఒరియా నవలకు వ్యాసకర్త చేసిన తెలుగు అనువాదం ‘ఈతచెట్టు దేవుడు’ పేరుతో సాహిత్య అకాడెమీ ద్వారా వెలువడనుంది.) డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి -
ఈ అనువాదం అదిరింది!
న్యూఢిల్లీ : ఇంగ్లీషులో మనకు ఏదైనా అర్థంకాని పదాలు కానీ, వాక్యాలు కానీ ఉంటే వెంటనే గూగుల్ ట్రాన్స్లేషన్ సహాయం తీసుకుంటాం. కొన్ని కొన్ని పదాలకు సరైన సమాధానాలు చెప్పినా.. మరి కొన్నింటికి మాత్రం తనకు తెలిసిన సమాధానాలు మాత్రమే చెబుతుంది. దాన్నే పదపదాను వాదం అని అంటారు. అలాంటప్పుడు కొన్నిసార్లు విచిత్రమైన అర్థాలు వచ్చే పదాలు, వాక్యాలు తయారవుతుంటాయి. ఇలాంటి ట్రాన్స్లేషన్ ఫేయిల్కు సంబంధించిన ఓ వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎంఎస్ అనే కంపెనీ తాజా ఇడ్లీ/ దోస పిండిని అమ్ముతుంది. ఇందుకు సంబంధించిన ప్యాకేజింగ్ కవర్‌పై ఇడ్లీ/ దోస పిండి అని తెలిసే విధంగా మూడు భాషల్లో అక్షరాలను ముద్రించింది. ( మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే..) ఇంగ్లీష్, తమిళ్‌లోని పదాలు కరెక్ట్‌గానే ఉన్నా హిందీలోకి వచ్చేసరికి పిండిలో కాలేసింది కంపెనీ. ఇడ్లీ/ దోస బల్లేబాజ్ అని ముద్రించింది. ఇక్కడ బ్యాటర్‌కు సరిగ్గా సరిపోయే పదంగా బల్లేబాజ్ను వాడింది. బ్యాటర్ అంటే మామూలుగా బ్యాట్స్‌మ్యాన్ అని అర్థం వస్తుంది. అదేవిధంగా బల్లేబాజ్ అన్నా కూడా బ్యాట్స్‌మ్యాన్ అనే అర్థం వస్తుంది. అందుకే బ్యాటర్‌ను బల్లేబాజ్గా మార్చేసింది. దీంతో ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (వైరల్ : ఇప్పుడంతా మాదే రాజ్యం) -
మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష
మ్యాడిసన్ సర్కిల్లో ఒక బెంచీ మీద కూర్చున్న సోపి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. చలి కాలం దగ్గరపడుతోంది. అయితే ఈ ఎముకలు కొరికే చలి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. మూడునెలలు ద్వీపాంతరవాస జైల్లో ఉండే అవకాశం దొరకాలని అతను ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఏళ్ళుగా చలికాలంలో ఆ ద్వీపమే అతనికి ఆశ్రయమిచ్చింది. చలికాలం వచ్చిందంటే న్యూయార్క్‌లోని ధనవంతులు పామ్ బీచ్‌కో, రివేరాకో టికెట్ కొనుక్కుంటారు. అదే విధంగా సోపి చలికాలం రాగానే ఆ ద్వీపానికి వెళ్ళడానికి తనదైన ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చింది. గతరాత్రి ఆ పురాతన సర్కిల్లోని ఫౌంటెన్ పక్కన తన మామూలు బెంచీ మీద అతను పడుకున్నాడు. కింద రెండు వార్తపత్రికలు పరుచుకున్నాడు. పైన రెండు పత్రికలు కప్పుకున్నాడు. అయినా చలికి తట్టుకోలేకపోయాడు. ఆ కారణంగా ఇప్పుడు సోపి మనస్సంతా ఆ ద్వీపమే బృహదాకారంలో ఆక్రమించుకుంది. నగరంలో ఆశ్రయం పొందేవారి కోసం మతధర్మాల పేరిట చేసే ఏర్పాట్ల పట్ల అతనికి వ్యతిరేకత ఉంది. సోపి అభిప్రాయం ప్రకారం ఈ లోకోపకార కార్యాలకన్నా చట్టమే అధిక కరుణామయి. ఆ ఊళ్ళో ఉన్న కార్పొరేషన్ వాళ్ళు, ధర్మసంస్థల వాళ్ళు నిర్మించిన ధర్మసత్రాలు ఉన్నాయి. అక్కడికి అతను వెళితే చాలు. ఉండటానికి చోటు దొరుకుతుంది. తినటానికి భోజనం దొరుకుతుంది. అక్కడ అతను జీవితాన్ని సాఫీగా గడపవచ్చు. అయితే ఇలా దానం కోసం చేయి చాపటానికి సోపి మనస్సు అంగీకరించేది కాదు. నిజానికి దాతలు సమకూర్చే సౌలభ్యాలకు అతను రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. అయినా దాన్ని స్వీకరించే సమయంలో మనస్సులో ఏర్పడే దైన్యం? ఆ విషయాన్ని అతను ఊహించలేకపోయేవాడు. ఊహించి భరించలేకపోయాడు. దానికన్నా చట్టానికి అతిథి కావటమే ఉత్తమమని సోపి అనుకున్నాడు. అక్కడ అన్నీ వ్యవహారాలు నియమాలకు అనుగుణంగా నడుస్తున్నప్పటికీ, గత జీవితంలో అకారణంగా ఎవరూ తలదూర్చరు. ద్వీపానికి వెళ్ళాలని సోపి నిర్ణయం తీసుకుంటుండగానే దాన్ని సాధించటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో అత్యంత సంతోషాన్ని కలిగించే మార్గం ఖరీదైన హోటలుకు వెళ్ళి పొట్టపగుల తినటం, తరువాత చేతులు పైకెత్తి డబ్బులు లేవని ఒప్పుకోవటం. వెంటనే వాళ్ళు ఎలాంటి గొడవ చేయకుండా పోలీసులకు అప్పగిస్తారు. తన పని అనుకూలం చేయడానికి సిద్ధంగా ఉండే న్యాయాధికారి తను ఆశించిన పనిని పూర్తి చేస్తారు. సోపి తన బెంచీ మీది నుంచి పైకి లేచి సర్కిల్ దాటి ముందుకు సాగాడు. బ్రాడ్ వే, అయిదవ రోడ్డు కలిసే స్థలంలో కిక్కిరిసిన వాహనాల సందడి. అతను బ్రాడ్ వే వైపు తిరిగి ధగధగమని మెరుస్తున్న ఓ హోటల్ ముందు నుంచున్నాడు. సోపి చక్కటి వేస్ట్ కోట్ వేసుకున్నాడు. దాని కింది బొత్తం నుంచి పైవరకూ ఉన్న దుస్తుల పట్ల ఆత్మవిశ్వాసం ఉంది. గడ్డం నున్నగా గీసుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగకుండా హోటల్లోకి ప్రవేశించి ఒక టేబుల్ పట్టుకుంటే చాలు. అతను గెలిచినట్టే. టేబుల్ పై భాగంలో కనిపించే అతన్ని చూస్తే వెయిటరుకు అనుమానం కలగటానికి అవకాశమే లేదు. బాగా కాల్చిన మల్లార్డ్ బాతును, ఒక బాటిల్ చబ్లీసును ఆర్డర్ చేయాలి. అటు తరువాత కేంబర్టుకు చెప్పి ఒక సిగార్ ఆర్డర్ చేయాలి. సిగార్ ఒక డాలర్ ఖరీదు చేయవచ్చు. మొత్తం బిల్లు దుబారా కాకపోవటం వల్ల హోటల్ వాళ్ళు ప్రతీకార మనోభావాన్ని ప్రదర్శించరు. ఎలాగూ బాతు మాంసం తిని కడుపు నిండిపోతుంది. సంతోషంతో చలికాలపు ఆశ్రయం కోసం ప్రయాణం సాగించవచ్చు. అయితే సోపి హోటల్ గుమ్మంలో కాలుపెడుతుండగా సూపర్వైజర్ కళ్ళు అతడి వదులు ట్రౌజర్, అధ్వాన్న స్థితిలో ఉన్న బూట్లమీద పడ్టాయి. వెంటనే బలిష్ఠమైన చేతులు అతడిని సద్దులేకుండా అవలీలగా వీధిలోకి విసిరేశాయి. ఇలా మల్లార్డ్ బాతు మాంసం తినే అవకాశం తప్పిపోయింది. సోపి బ్రాడ్ వే వదిలి ముందుకు పోయాడు. అతనికి ద్వీపానికి వెళ్ళే మార్గం అంత సులభంగా కనిపించలేదు. దాన్ని ప్రవేశించడానికి మరో ఉపాయం వెతకాలని అనుకున్నాడు. ఆరవ రోడ్డు మలుపులో ఒక దుకాణం కనిపించింది. విద్యుద్దీపాల అలంకరణతో ధగధగ మెరిసిపోతోంది. కిటికీ అద్దాల వెనుక నానా రకా సామాన్లు చక్కగా, అత్యంత ఆకర్షణీయంగా అమర్చి పెట్టారు. సోపి బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే ఒక రాయి తీసుకుని ఆ కిటికీ వైపు విసిరాడు. మరుక్షణం భళ్ళుమంటూ కిటికీ అద్దం పగిలింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల జనం వచ్చి గుమిగూడారు. జనంతో పాటు ఒక పోలీస్ కూడా వచ్చాడు. సోపి తన జేబులో చేయి పెట్టుకుని చిన్నగా నవ్వుతూ మౌనంగా నుంచున్నాడు. ‘‘రాయి విసిరినవాడు ఎటువైపు వెళ్ళాడు?’’ అని పోలీస్ అడిగాడు. ‘‘ఎందుకు, నేనే అలా చేసివుండొచ్చని మీకు అనిపింలేదా?’’ అన్నాడు సోపి. అతని స్వరంలో వ్యంగ్యం లేదు. కేవలం అదృష్టదేవతను ఆహ్వానించే స్నేహపూర్వకమైన ధ్వని ఉంది. ఆ సంఘటన గురించి ఏదైనా క్లూ ఇవ్వగలిగే వ్యక్తి సోపి అని అంగీకరించడానికి కూడా పోలీస్ సిద్ధంగా లేడు. కిటికీని బ్రద్దలు కొట్టినవాడు పోలీసులతో హాస్యంగా మాట్లాడటానికి ప్రయత్నించడు. వేగంగా అక్కడి నుంచి పారిపోతాడు. అదే సమయంలో కొద్ది దూరంలో వెళుతున్న బస్సు ఎక్కబోతున్న ఓ వ్యక్తి పోలీస్ కంటపడ్డాడు. అతనే కిటికీ అద్దం పగులగొట్టినవాడు కావచ్చని వెంటనే లాఠీని ముందు చాపి పోలీస్ అటువైపు పరుగెత్తాడు. రెండవసారి తన ప్రయత్నంలో విఫలమైన సోపి హృదయం జుగుప్సతో నిండిపోయింది. అక్కడ ఉండలేక అడుగు ముందుకు వేశాడు. రోడ్డుకు అటుపక్కన ఒక సాధారణ హోటల్ కంటపడింది. ఆకలిగొన్న సాధారణ వ్యక్తులకు అక్కడ తక్కువ ఖరీదులో ఆహారం దొరికేది. అక్కడి పింగాణి పాత్రలు, బల్ల మీద పరిచిన తెల్లటి క్లాత్ సోపిని పిలిచినట్టు ఆనిపించింది. సోపి లోపలికి దూరాడు. అతని చిరిగిన బూట్లు, లూజు ట్రౌజర్ ఎవరి దృష్టికి రాలేదు. ఒక బల్ల దగ్గర కూర్చున్న సోపి బీఫ్ స్టీక్స్, ఫ్లాప్ జాక్స్, డోనట్ తిని పై తాగాడు. వెయిటర్ బిల్లు ఇచ్చాడు. తన దగ్గర చిల్లిగవ్వ లేదని చేతులు పైకెత్తాడు. ‘‘తొందరగా పోలీసును పిలువు. నాలాంటి సభ్యుడైన నాగరికుడిని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు’’ అన్నాడు సోపి. ‘‘నీలాంటివాడికి పోలీసు ఎందుకు?’’ అంటూ ఇద్దరు వెయిటర్లు అతడ్ని ఎడాపెడా వాయించి, ఒళ్ళు హూనం చేసి వీధిలోకి తోశారు. నేల మీద పడిన సోపి, వదులైన కీళ్ళను సరిచేసుకుంటూ మెల్లగా లేచి, బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుకున్నాడు. తాను కోరుకుంటున్నట్టు అరెస్ట్ కావటం కేవలం పగటికల అనిపించింది. ద్వీపానికి వెళ్ళే ప్లాన్ చాలా దూరంలో ఉన్నట్టు అనిపించింది. రెండు అంగళ్ళ తరువాత ఒక మెడికల్ షాపు ముందు నిబడ్డ పోలీస్ ఎందుకో అతడిని చూసి నవ్వి ముందుకు పోయాడు. సోపి కుంటుతూ కొద్దిదూరం నడిచాడు. అరెస్ట్ కావడానికి మళ్ళీ ధైర్యం రాసాగింది. ఈసారి తనంతట తానే ఒక అవకాశం ఒదిగి వచ్చింది. ఒక గొప్పింటి స్త్రీలా కనిపిస్తున్న అందగత్తె ఒక షాపులో ప్రదర్శన కోసం పెట్టిన వస్తువులను చూస్తూ నుంచుని ఉంది. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఒక పోలీస్ గోడకు ఒరిగి నుంచుని ఉన్నాడు. ఆమెతో రోడ్ సైడ్ రోమియోలా ప్రవర్తించాలని ఆలోచించాడు సోపి. సభ్యతగా కనిపిస్తున్న ఆ యువతిని, నిజాయితీపరుడిలా కనిపిస్తున్న ఆ పోలీసును చూసినపుడు, తొందరగానే తాను సంకెళ్ళలో చిక్కుకుంటాడని భావించిన సోపి, అప్పుడే తనకు చలికాలపు ఆశ్రయం దొరికిపోయినట్టు సంతోషపడ్డాడు. సోపి తన టై సరిచేసుకొని, మడతలుపడ్డ తన కోటుచేతులను లాక్కుంటూ, హ్యాటును కాస్త ఓరగా చేసుకుని ఆ యువతివైపు నెమ్మదిగా అడుగు వేశాడు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, చిన్నగా దగ్గి, చిరునవ్వు నవ్వాడు. తరువాత ఆమె వైపు చూస్తూ రోడ్ సైడ్ రోమియోలా అల్లరిగా సైగలు చేశాడు. తరువాత ఓరకంట పోలీసు వైపు చూశాడు. పోలీస్ తననే చురచుర చూస్తున్నాడని నిర్ధారించుకున్నాడు. ఆమె రెండు అడుగులు ముందుకు వేసి, మళ్ళీ ప్రదర్శనకు పెట్టిన వస్తువులను కిటికీలోంచి తదేకచిత్తంతో చూడసాగింది. సోపి ఆమె దగ్గరికి పోయి ధైర్యంగా పక్కన నుంచుని, తన హ్యాటును పైకెత్తి– ‘‘హలో బేబీ, నాతోపాటు డ్యాన్స్ చేయడానికి వస్తావా?’’ అన్నాడు. పోలీసు ఇంకా చూస్తూనే ఉన్నాడు. తన సైగకు నొచ్చుకున్న యువతి వచ్చి వేలుచూపించి ఒక్క మాట చెబితే చాలు. సోపి స్వర్గానికి సమానమైన ఆ ద్వీపానికి దారి పట్టేవాడు. అప్పటికే అతనికి పోలీస్ స్టేషన్ వెచ్చటి వాతావరణాన్ని అనుభవిస్తున్నట్టు అనిపించింది. ఆ యువతి అతని వైపు తిరిగి చేయిచాపి కోటు చేతిని పట్టుకుంది. తరువాత సంతోషంగా– ‘‘ఓహ్! కచ్చితంగా. నేను అప్పుడే పలకరిద్దామనుకున్నాను. అయితే ఆ పోలీసు మనల్నే చూస్తున్నాడు’’ అంది. ఆమె మామిడి చెట్టుకు అల్లుకున్న తీగలా అతన్ని కరుచుకుంది. సోపి పిచ్చివాడిలా ఆమెతోపాటు అడుగు వేస్తూ పోలీసును దాటి ముందుకు నడిచాడు. బహుశా జైల్లో వెచ్చగా కాకుండా స్వేచ్ఛగా బయటి ప్రపంచంలో ఉండటమే తన నుదుటి రాతలో ఉందని అనుకున్నాడు. ముందరి మలుపులో తన వెంట వచ్చిన ఆ యువతి చేతిని విదిల్చుకుని సోపి అక్కడి నుంచి పరుగుతీశాడు. కొద్దిసేపటి తరువాత అతను విలాసవంతమైన ఒక కాలనీలో నిలబడ్డాడు. అక్కడ ఫర్కోట్ ధరించిన ఆడవాళ్ళు, నిలువు కోటు ధరించి పురుషులు చలికాలపు చల్లటి గాలిలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఏదో భయంకరమైన మాంత్రిక శక్తి వల్ల అరెస్ట్ కావడం లేదని సోపికి హఠాత్తుగా దిగులువేసింది. ఈ ఆలోచనతో అతను భయపడ్డాడు. అదే సమయంలో సినిమాహాలు దగ్గర తిరుగుతున్న ఓ పోలీస్ కనిపించగానే మునుగుతున్నవాడికి గడ్డిపరక దొరికినట్టయ్యింది. వెంటనే అసభ్యంగా ప్రవర్తించి అతని దృష్టిని ఆకర్షించాలని అనుకున్నాడు. రోడ్డుపక్కనున్న కాలుదారిలో సోపి తాగినవాడిలా తూలుతూ మొరటు కంఠంతో అసందర్భంగా బిగ్గరగా అరవసాగాడు. అతను గంతువేస్తూ, ఎగిరి దూకుతూ ఊళ పెట్టాడు. పిచ్చిపిచ్చిగా ఏడ్చాడు. చుట్టుపక్కంతా గొడవ చేశాడు. పోలీస్ తన లాఠీని తిప్పుతూ సోపి వైపు చూడకుండా అటు తిరిగి దగ్గర్లో ఉన్న ఒక పౌరుడితో అన్నాడు– ‘‘ఎవడో పనికిమాలిన వెధవ. వొట్టి వాగుడుకాయ. అయితే ఏమీ ఇబ్బంది పెట్టడు. ఇలాంటివాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకూడదని మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది’’. ఖిన్నుడైన సోపి తన కోతిచేష్టలను ఆపాడు. ఏ పోలీసు తనను అరెస్ట్ చేయడం లేదుకదా? ద్వీపానికి వెళ్ళటం సాధ్యం కాని లక్ష్యంలా అతనికి కనిపించింది. కొరికే చలిలో రక్షణ పొందడానికి అతను తన పల్చని కోటు బొత్తాలను పెట్టుకున్నాడు. అక్కడొక సిగార్ అంగడి కనిపించింది. మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వెలుగుతున్న దీపంతో సిగార్ వెలిగించుకుంటున్నాడు. తన సిల్క్ గొడుగును అంగడి తలుపు పక్కన ఆనించి పెట్టాడు. సోపి పోయి గొడుగును తీసుకుని నిమ్మళంగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. సిగార్ వెలిగించుకుంటున్న మనిషి హడావుడిగా సోపి వెనుకే వచ్చి– ‘‘ఏయ్, అది నా గొడుగు’’ అని గడుసుగా అన్నాడు. ‘‘ఓహో, అవునా?’’ అంటూ సోపి కోపంతో బుసకొట్టాడు. దొంగతనంతో పాటు అవహేళనను చేరుస్తూ ‘‘అలాగైతే ఎందుకు పోలీసును పిలవడం? నేను దాన్ని తీసుకున్నాను. నీ గొడుగు కదా? పోలీసును ఎందుకు పిలవటం లేదు? అదిగో అక్కడ మూలలో ఒక పోలీస్ నిలబడ్డాడు చూడు’’ గొడుగు యజమాని తన నడక వేగాన్ని తగ్గించాడు. అదృష్టం ఎక్కడ ముఖం చాటేస్తుందోననే ఆలోచనతో సోపి కూడా అలాగే చేశాడు. పోలీసు ఇద్దరివైపు కుతూహంగా చూశాడు. ‘‘ఓహ్! అదీ...మీకు తెలుసుకదా, ఇలాంటి తప్పులు ఎలా జరుగుతాయో...అది మీ గొడుగైవుంటే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు ఉదయం నేను ఆ గొడుగును ఒక హోటల్లో కనిపిస్తే తీసుకొచ్చాను. అది మీదని మీరు గుర్తుపడితే...బహుశా మీరు...’’ అన్నాడు ఆ మనిషి. ‘‘అవును, ఇది నాదే’’ అన్నాడు సోపి దుష్టతనంతో. ఆ మనిషి వెనక్కు జరిగాడు. పోలీస్ ఓ పొడువైన అందగత్తెకు సహాయపడటానికి రోడ్డుదాటి అటువైపు వెళ్ళాడు. సోపి రోడ్డు మీద తూర్పుకు అభిముఖంగా నడవసాగాడు. తన ప్రయత్నాలు విఫలమైనందుకు అతనికి బాధగా ఉంది. రోడ్డు పక్కనున్న ఒక గుంతలో గొడుగును కోపంతో విసిరాడు. శిరస్త్రాణం ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడిచే జనం పట్ల కోపంతో గొణుక్కున్నాడు. వారి చేతికి తాను చిక్కుకోవాలని ప్రయత్నిస్తే, తాను ఏ తప్పు చేయని గొప్ప వ్యక్తి అన్నట్టు వాళ్ళు గౌరవంతో చూస్తున్నట్టు అనిపించింది. చివరికి సోపి తూర్పువైపున ఉన్న రోడ్డు మీదికి వచ్చాడు. ధగధగమని వెలిగే దీపాలుకానీ, కోలాహలం కానీ లేదు. అక్కడినుంచి మ్యాడిసన్ సర్కిల్ వైపు నడవసాగాడు. తోటలోని బెంచే తన ఇల్లయినప్పటికీ, ఇంటికి వెనుతిరిగి వెళ్ళాలనే భావన అతనిలో జాగృతమైంది. అయితే మరీ ప్రశాంతంగా ఉన్న ఒక మలుపులో సోపి గబుక్కున నిలబడ్డాడు. అక్కడొక పురాతన చర్చి ఉంది. అక్కడ ఒక వ్యక్తి నైపుణ్యంతో ప్రార్థన గీతాన్ని తన వాయిద్యంలో వాయిస్తున్నాడు. ఆ మధురమైన సంగీతం తోసుకుని వచ్చి సోపి చెవుల్లో దూరి అతన్ని అక్కడే పట్టి నిలిపివేసింది. చర్చి చుట్టూ వేసిన కంచె దగ్గర అతను నుంచున్నాడు. పైన చంద్రుడు ప్రకాశంగా, ప్రశాంతంగా వెలుగులు చిందిస్తున్నాడు. జనసంచారం తగ్గింది. వాహనాల సంచారం అంతగా లేదు. గువ్వపిట్టలు నిద్రకళ్ళతో కువకువలాడుతున్నాయి. కొద్దిసేపు ఆ దృశ్యం పల్లెటూరి చర్చీ ప్రాంగణంలా అనిపించింది. ఆ వ్యక్తి వాయిస్తున్న ప్రార్థనాగీతం సోపి మనస్సును ఆవరించింది. ఆ గీతం అతడిని ఇనుప కంచెను ఆనుకుని నిలుచునేలా చేసింది. తల్లి, గులాబీ, ఆకాంక్షలు, స్నేహితులు, ప్రామాణికమైన భావనలు...మొదలైనవన్నీ అతని జీవితాన్ని నింపుకున్నటువంటి కాలంలో అతనికి ఆ ప్రార్థనా గీతం బాగా తెలుసు. సోపి స్వీకార మనోధర్మం, పురాతన చర్చీ కలిగించిన ప్రభావం కలగలిసి ఉన్నట్టుండి అతని ఆత్మలో ఒక అద్భుతమైన పరివర్తన కలిగింది. తాను ఎలాంటి అధఃపాతాళంలో పడిపోయాడుకదా అని అతను దిగులు చెందాడు. తనను తాను పరిశీలించుకున్నాడు. అధఃపతనంలో గడిపిన ఆ రోజులు, యోగ్యం కానటువంటి ఆకాంక్షలూ, విఫలమైన కోరికలు, వ్యర్థమైన సామర్థ్యాలు, హీనమైన అభిప్రాయాలు ఇవే అతని అస్తిత్వంలో నిండివుండేవి. ఈ కొత్త మార్పుకు అతని హృదయం చప్పున సంతోషంతో ప్రతిస్పందించింది. ఆ క్షణంలో ఒక ప్రబలమైన వేగం, తన నిరాశాపూరితమైన అదృష్టంతో పోరాడటానికి అతన్ని ముందుకు తోసింది. ఆ ఊబి నుంచి అతను లేచి పైకి రావాల్సిందే. మరొకసారి అతను మనిషి కావాలి. అతడిని వశపరుచుకున్న సైతాన్ను గెలవాలి. ఇంకా కాలం మించిపోలేదు. ఇంకా అతను వయస్సులో చిన్నవాడు. అతనిలోని పాత ఆశలు, కోరికలను పునర్జీవింపజేయాలి. ఆ పవిత్రమైన, మధురమైన వాదనపు నాదం అతనిలో ఒక క్రాంతినే తెచ్చింది. రేపు రభసగా వ్యాపారం సాగే ముందరి పట్టణానికి వెళ్ళి ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. గొర్రె, మేక జుత్తును దిగుమతి చేసుకునే ఒక వ్యాపారి గతంలో ఒకసారి అతడికి వ్యాన్ డ్రైవర్ పని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. రేపు ఆ వ్యాపారిని కలుసుకుని ఉద్యోగం అడగాలి. ప్రపంచంలో తాను ఒక గొప్ప వ్యక్తి కావాలి. తాను ఒక... సోపి భుజం మీద బరువైన చేయొకటి పడింది. అతను చప్పున వెనుతిరిగి చూశాడు. పోలీసు వెడల్పు ముఖం అతని కంటపడింది. ‘‘ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ అడిగాడు పోలీస్. ‘‘ఏమీ లేదు’’ అన్నాడు సోపి. ‘‘అయితే నా వెంట రా’’ అన్నాడు పోలీస్. మరుసటి రోజు ఉదయంచీ– కోర్టులో జడ్జి, ‘‘నీకు మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష విధిస్తున్నాను’’ అన్నాడు. -ఆంగ్ల మూలం: ఓ.హెన్రీ అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
వేగోద్దీపన ఔషధం
చిన్న గుండుసూది కోసం వెతుకుతుంటే ఒక బంగారునాణెం దొరికినట్లు– నాకు మిత్రుడైపోయాడు ప్రొఫెసర్ గిబ్బర్న్. ఫోక్‌స్టోన్ పట్నంలో నా పొరుగున నివాసం ఉన్నాడతను. గిబ్బర్న్కు– మనిషి నాడీవ్యవస్థ మీద పరిశోధనలు చేసి మంచి ఫలితాలు రాబట్టిన శాస్త్రజ్ఞుడిగా– మంచి గుర్తింపు ఉంది. మత్తు కలిగించే స్పర్శ నాశకాలకు సంబంధించిన ఔషధాలు తయారుచేసే విషయంలో అతనికతనే సాటి. అతనొక సమర్థుడైన రసాయన శాస్త్రవేత్త. నరాల కణాలు ఒకచోట చేరటం వల్ల ఏర్పడే వాపు సమస్యలు– తదితర ప్రయోగాల గురించి అతను వివరణ ఇచ్చేదాకా ఎవరికీ అర్థమయ్యేవి కావు. ప్రస్తుతం అతను నూతనంగా ఆవిష్కరించనున్న ‘సహస్రగుణీకృత వేగోద్దీపన రసాయనం’ తయారు చేసేముందు కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు చేసి విజయం సాధించి ఉన్నాడు. అనేక వందలరెట్లు మానసిక శక్తినిచ్చే మందులు సృష్టించిన గిబ్బర్న్కు శాస్త్ర విజ్ఞానలోకం, మెడికల్ ప్రాక్టీషనర్ల సమూహం సదా కృతజ్ఞతగా ఉంటుంది. వివిధ కారణాలవల్ల విపరీతంగా అలసిపోయిన జనానికి అతడు కనిపెట్టిన గిబ్బర్న్స్ బీ సిరప్– సముద్రతీరాలలో, సిధ్ధంగా వుంచబడిన లైఫ్బోట్స్లా ఎంతోమంది ప్రాణాల్ని కాపాడింది. ‘కానీ అటువంటి చిన్న చిన్న ఆవిష్కరణలు నా మనసును తృప్తి పరచలేదు.’ అది– సంవత్సరం క్రితం అతని మనసులోంచి వెలువడిన అసంతృప్త భావనా వీచిక. అతను మళ్ళీ చెప్పసాగాడు. ‘అవి నరాల వ్యవస్థను ప్రభావితం చేయకుండా, శరీరంలోని కేంద్రక శక్తిని ఉద్దీపించలేకపోయాయి. లేదా నాడీవ్యవస్థ మీద పడే ఒత్తిడిని తగ్గిస్తూ, లభ్యనీయ కేంద్రకశక్తిని ప్రజ్వలింప చేయలేకపోయాయి. అవి ఒక నిర్దిష్టమైన అంతర్గత అవయవం మీద మాత్రమే ఉపయోగించవలసి వచ్చేది. ఉదాహరణకు ఒకడి గుండెతో పాటు శరీరంలోపలి ఇతర అవయవాలను కూడా చైతన్య పరచగలిగితే, అతని మెదడు ఉద్దీపనమౌతుంది. అతని శరీరం మొత్తం– ఇతరులకంటే కూడా అనేక రెట్లు ఉత్తేజపరచే విధంగా ఒక ద్రావణాన్ని అభివృధ్ధి చేశాను.’ ‘అది వ్యక్తిని నీరసపరుస్తుందేమో?’ అన్నాన్నేను. ‘అలాంటి అనుమానాలొద్దు. నేను చెప్పిన దాంట్లోని మర్మాన్ని అర్థం చేసుకో.’ అంటూ ఒక ఆకు పచ్చని గాజు సీసాని పైకెత్తిపట్టుకొని చూపెడుతూ ఒక నిర్ణీత కాలపరిమితి కన్నా రెండింతల వేగంతో ఆలోచించే మెదడు సామర్థ్యం, ద్విగుణీకృత వేగంతో చలించే శక్తి, రెట్టింపు వేగంతో పనిచేసే ప్రజ్ఞాపాటవాలను చేకూర్చి పెట్టే అద్భుత లక్షణముంది ఈ సీసాలోని ద్రావణానికి.’ ‘కానీ అది సాధ్యమేనా?’ ‘అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలా జరగకపోతే ఒక సంవత్సరం పాటు నేను చేసిన కఠోర శ్రమంతా వృథా అయినట్లే కదా? నేను సాధించిన ఫలితాలు– నా పరిశోధనలు అబద్ధం కాదని రుజువు చేస్తున్నాయి. అయితే, రెట్టింపు ప్రభావం చూపకపోయినా, కనీసం ఒకటిన్నర రెట్లు వేగాన్ని చూపుతాయని కచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకు, నీవొక రాజకీయనాయకుడివని ఊహించుకో. అనివార్యంగా ఒక ముఖ్యమైన పని ముగించవలసిన విషమ పరిస్థితి నీ ముందుంది. కానీ సమయం చాలా పరిమితంగా వుంది. చాలా అర్జంటుగా పనిముగించాలి. అప్పుడు నువ్వేంచేస్తావ్?’ ‘నా పర్సనల్ సెక్రెటరీకి ఆ పని అప్పగిస్తాను.’ ‘పోనీ, ఒక రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడ్డానికి సమయం చాలని ఒక డాక్టరుకు రెట్టింపు వ్యవధి దొరికిందనుకో.. లేకపోతే, ఊపిరి సలపని పనిఒత్తిడితో సతమతమవుతున్న అడ్వొకేట్ కు గానీ, పరీక్షలకు ముందుగా తయారవ్వక దిక్కులు చూస్తున్న ఒక విధ్యార్థికి గానీ రెట్టింపు సమయం దొరికితే?... అప్పుడు ఈ సీసాలోని ఒకే ఒక్క చుక్క ద్రావణం, ఒక బంగారు నాణెంతో సమానమైన విలువ చేస్తుంది. కొన్ని చుక్కల ద్రావణాన్ని పుచ్చుకొంటే మెదడు రెండింతలు చురుగ్గా పనిచేసి ఉద్దీపనమౌతుంది. ద్వంద్వ యుద్ధంలో పిస్టల్ ట్రిగ్గర్ నొక్కే వేగం మీద విజయం ఆధార పడి ఉంటుంది.’ చెప్పుకొచ్చాడు గిబ్బర్న్. ‘సాముగరిడి విషయంలో?...’ అడిగాను. ‘అన్ని విషయాలలో కూడా. అది ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాకపోతే... బహుశా అది నిన్ను వృద్ధాప్యానికి దగ్గరగా చేరుస్తుందేమో?... అంటే ఇతరులు ఒక సంవత్సరం జీవిస్తే నువ్వు రెండు సంవత్సరాలు జీవించిన అనుభూతి పొందినట్లుంటుంది.’ ‘అది నిజంగా సాధ్యపడుతుందా?’ ‘సాధ్యమే మైడియర్ ఫ్రెండ్!... నా పరిశోధన గురించి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే– నేను కనుగొన్న సిరప్ – రెండురెట్లు కాదు. అంత కన్నా అధిక వేగంతో పని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. తరువాత చాలాసార్లు ఆ రసాయనం గురించే చర్చించుకున్నాం. ఫలితంగా అతను రసాయనాన్ని– ఇంతకు ముందు పేర్కొన్న లోపాల్ని సంస్కరించి– అభివృధ్ధి చేయగలిగాడు. ‘‘అమృతతుల్యమైన ఒక అపూర్వ దివ్యౌషధాన్ని ఈ లోకానికి సమర్పిస్తున్నానని నా విశ్వాసం. నా ఆశయాలకూ, అంచనాలకు అనుగుణంగా ప్రజలు దీటుగా స్పందించి, న్యాయబధ్ధమైన ధరలకే అందుబాటులో వుండబోతున్న మందును కొనుగోలు చేస్తారని నమ్ముతున్నాను.’’... ‘‘విజ్ఞాన శాస్త్రమెప్పుడూ గౌరవింపబడుతూనే వుంటుంది. ఏదేమైనా నా మందుమీద కనీసం పదేళ్ళపాటు నేనే గుత్తాధిపత్యం కలిగి వుండాలని అభిలషిస్తున్నాను. ఎందుకంటే– చూస్తూ చూస్తూ– బొత్తిగా అనుభవం, ప్రావీణ్యం లేని, అత్యాశాపరులైన వ్యాపారస్తుల చేతుల్లో వుంచడానికి నా మనస్సంగీకరించడం లేదు.’’ అలా చెప్పుకుపోయాడు గిబ్బర్న్. కాలప్రవాహంలో– గిబ్బర్న్ తయారుచేయబోయే ఔషధం గురించిన ఆసక్తి నా మనసులో నుంచి కొట్టుకుపోలేదు. అతను కొత్తగా ఈ లోకానికి అందించబోవు ఔషధం– కచ్చితంగా మానవజీవితాన్ని– అవసరానికి తగ్గట్టు వేగవంతం చేస్తుందనే నేను నమ్ముతున్నాను. కానీ– సదరు ఔషధరాజాన్ని పదేపదే సేవించిన ఆ మానవుడు, నిత్య జీవచైతన్యంతో కళకళలాడినా– పదకొండేళ్ళకే వయోజనుడైపోతాడు. ఇరవైఐదేళ్ళకే మధ్యవయస్కుడై, ముప్పై ఏళ్ళకు వృధ్ధాప్యంలోనికి అడుగుపెట్టి, అంతరించిపోతాడు. యూదులు, తూర్పు ఆసియా సంతతి వారు–సహజంగా యవ్వనంలో వయోజనులై, యాభైయ్యవపడిలో వృధ్ధులుగా మారి, ఆలోచనలలో మనకంటే అమిత వేగాన్ని ప్రదర్శించేవారు. ఈ కాలపుమనిషి, ఈ ఉద్దీపనాకారక ఔషధాన్ని సేవిస్తే, వారి మాదిరిగానే తయారవుతారు. మనసుమీద ఆ ఔషధ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అది మనిషిని పిచ్చివాణ్ణిగా చేయగలదు. అత్యంత బలశాలిగా మార్చగలదు. చేతనాచేతనావస్థలలోకి కొనిపోగలదు. గిబ్బర్న్ నూతనావిష్కరణ వైద్యుల ఆయుధాగారంలో మరొక అద్భుతమైన ఆయుధంగా చేరి, అలరించగలదని నా కనిపించింది. కొన్ని రోజుల తర్వాత ప్రొఫెసర్ నన్ను కలిశాడు. అతని ముఖం ఆనందాతిరేకంతో ఉప్పొంగిపోతూ వుంది. ‘‘నేను సాధించాను. నా కల ఫలించింది. నా మనసులోని ఆలోచనలు ఒక నిర్దిష్టరూపాన్ని సంతరించుకొని నా ఎదుట నిలిచాయి. ఈ ప్రపంచం కోసం– ఎటువంటి దుష్పరిణామాలకు ఆస్కారం లేని– అత్యంత శక్తిమంతమైన ఒక కొంగ్రొత్త ఉద్దీపన రసాయనం తయారు చేయగలిగాను.’’ అతను గట్టిగా కేకలు వేసినంత పనిచేశాడు. నా చెయ్యిపట్టుకొని విపరీతంగా ఊపేశాడు. ‘నిజంగానా?’ నేనడిగాను. ‘‘నిజంగానే! నాకే నమ్మ శక్యంగా లేదా? మా ఇంటికిరా పోదాం. నువ్వే చూద్దువు గానీ.‘ అన్నాడు ఉద్వేగంతో ఊగిపోతూ. ‘‘రెండింతల శక్తిమంతంగా పనిచేస్తుందా?’’ ‘‘రెండింతలు కాదు. వెయ్యింతలు! అంతకంటే ఎక్కువ!’’ తన ఆనందాతిరేకాన్ని దాచుకోలేకపోతున్నాడు. భావోద్వేగాన్ని అణచుకోలేకపోతున్నాడు. ‘‘అది మనిషి నాడీవ్యవస్థ మీద విపరీతమైన బలంతో పనిచేస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఆ ఔషధ ప్రభావాన్ని పరీక్షించడం..’’‘ ‘‘పరీక్షించడమా ?’’ అడిగాను– అతని ఉద్దేశాన్ని పసిగట్టి. ‘‘ఔను! ఆ ఆకుపచ్చని గాజుసీసాలో ఉంది చూడు దివ్యౌషధం. నువ్వు భయపడకూడదు.’’ నేను స్వతహాగా జాగ్రత్తపరుణ్ణి. సాహసకృత్యాలు చేయాలనే ఉత్సాహం నాలో పరవళ్లు తొక్కుతోంది. మనసులో అనుకోవడమే గానీ, ఏనాడూ అవకాశం రాలేదు. అదిప్పుడొచ్చింది. మొదటిసారి కాబట్టి, లోలోన ఒక పక్క నేను భయపడుతున్నా, మరోపక్క గర్వించాను– ఒక లోకోపకార ఔషధ తయారీలో నేనూ భాగస్వామినవుతున్నందుకు. ‘సరే‘ అన్నాను సంశయిస్తూనే. ‘‘ప్రొఫెసర్! నువ్వు ఈ మందును తాగి ముందస్తు పరీక్ష చేశావా?’’ అని అడిగాను. ‘‘ఔను! నాకేమీ ప్రమాదకరంగా అనిపించలేదు.’’ ‘‘సరే! ఆ కషాయం నా నోట్లో పొయ్యి. అన్నట్టు ఎలా తీసుకోవాలి?’’ అని అడిగాను. ‘‘నీళ్లలో కలుపుకొని.’’ అతడు డెస్క్ వెనుక నుంచి పైకి లేచి, నన్ను ఈజీ చెయిర్లో కూర్చోబెట్టాడు. ‘‘ఇది రమ్ములాగా వుంటుంది. ఈ కషాయం నీ గొంతులోకి దిగిన వెంటనే కళ్లు మూసుకోవాలి. ఒక నిమిషం తరువాత నెమ్మదిగా తెరవాలి. చూపులో స్వల్ప ప్రకంపనాలుండొచ్చు. కానీ ఆ స్థితి ఎక్కువసేపు ఉండకపోవచ్చు. వెంటనే కళ్లు తెరిస్తే, కనుపాప దెబ్బ తినొచ్చు. అందుకే కళ్లు తెరవకుండా గట్టిగా మూసుకోవాలి’’ జాగ్రత్తలు చెప్పాడు. అతను చెప్పినట్టుగానే కళ్లు మూసుకున్నాను. ఇంకో విషయం. నువ్వు కదలకుండా కూర్చోవాలి. అలా కదిలితే నీకే ప్రమాదం. జ్ఞాపకముంచుకో. నువ్వు ఇదివరకటి కంటే వెయ్యిరెట్లు వేగంగా కదులుతావు. నీ గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, మెదడు– అన్నీ అదే వేగంతో పనిచేస్తాయి. ఆ విషయం నీవు తెలుసుకోలేవు. కానీ దానికి విరుధ్ధంగా, ప్రపంచం మొత్తం, ఇదివరకటి కంటే వెయ్యింతలు నెమ్మదిగా కదులుతుంది.. అంటే కళ్ల ముందు కదులుతూ కనిపించేవన్నీ దాదాపు చలనం లేకుండా ఉండిపోతాయి.’’అంటూ, కషాయం నింపి ఉన్న సీసా తెరిచాడు. అందులోని కషాయాన్ని గ్లాసుల్లోకి వొంపాడు– బార్లో వెయిటరు విస్కీని కొలతవేసి వొంపినట్లుగా. ‘‘రెండు నిముషాలపాటు కళ్లు గట్టిగా మూసుకొని కదలకుండా కూర్చో. తరువాత నా మాటలు నీకు వినిపిస్తాయి’’ అన్నాడు. ప్రొఫెసర్ రెండు గ్లాసుల్లోకి కొన్ని నీళ్లు కలిపాడు. ‘‘నీ గ్లాసును కిందపెట్టొద్దు. చేత్తోఅలాగే పట్టుకొని, చేతిని నీ మోకాలు మీదుంచు. అవును అలానే’’ అంటూ అతని చేతిలోని గ్లాసును పైకెత్తి పట్టుకొన్నాడు. అందులోని ద్రవాన్ని తాగాం ఇద్దరమూ. అదే క్షణంలోనే నేను కళ్లు మూసుకున్నాను. నేనేదో శూన్యంలోకి పడిపోయినట్లయింది. కొద్దిసేపటికి గిబ్బర్న్ నన్ను ‘ఇక లే’ అన్నట్టనిపించి కళ్లు తెరిచాను. నా ఎదురుగా గిబ్బర్న్ చేతిలో గ్లాసుతో నిలబడివున్నాడు. ఆ గ్లాసు ఖాళీగా వుంది. ‘ఇప్పుడెలా వుంది? ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా?’ అడిగాడు. ‘లేదు. మనసు ఉల్లాసంగా గాలిలో తేలిపోయినట్లయింది...’ . ‘ఏవైనా శబ్దాలు వినిపించాయా?’ ‘ఆహా! అద్భుతంగా! కర్ణపేయంగా వినిపించాయి. మెల్లగా చప్పుడు చేస్తూ, వేటి వేటి మీదనో చిరుజల్లు పడుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి.! ఏమిటవి?’ ‘అవి విశ్లేషణ ధ్వనులు..’ అని చెప్పాడో? మరేం చెప్పాడో? నేను సరిగ్గా వినలేదు. అతను కిటికీ వైపు చూపులు సారిస్తూ, ‘ఆ కిటికీతెర ఆ విధంగా కిటికీకి అతుక్కుపోయినట్టున్న దృశ్యం నువ్వెప్పుడైనా చూశావా?’ ‘లేదు. చూడలేదు. ఆ దృశ్యం చాలా వింతగా, కొత్తగా వుంది.’ అన్నాను. ‘అలానా? అయితే ఇటుచూడు మరి.’ అటు చూశాను. గిబ్బర్న్ చేత్తో పట్టుకొన్న గ్లాసును వదిలేశాడు. అలా వదలగానే అది కిందపడి భళ్లున పగిలి ముక్కలు కావాల్సిన ఆ గ్లాసు గాలిలో తేలియాడుతూ నిశ్చలంగా నిలిచివుంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రొఫెసర్ చెప్పుకుపోయాడు. ‘సాధారణంగా ఈ ఎత్తులో నుంచి, ఏ వస్తువైనా సరే, ఒక క్షణానికి పదహారు అడుగుల వేగంతో కింద పడిపోతుంది. చూడు ఈ గ్లాసు క్షణంలో నూరోవంతు వేగంతో కూడా కిందకు పడిపోకుండా గాల్లో తేలియాడుతూ వుంది. దీనివల్ల నీకు నేను కనిపెట్టిన మందు ప్రభావం గురించి కొంచెం కొంచెం అర్థమైవుంటుంది. తరువాత అతను ఆ గ్లాసు చుట్టూ, పైనా, కిందా తన చేతిని వలయాకారంగా తిప్పాడు. అది అతి నెమ్మదిగా అధోముఖంగా దిగసాగింది. దాని అడుగుభాగాన్ని అరచేత్తో జాగ్రత్తగా పట్టుకొని టేబుల్ మీదుంచి, నాకేసి చూసి నవ్వాడు. నేను జాగ్రత్తగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. నా మనసు గాల్లో తేలిపోతున్నట్లుంది. నాలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతూ వుంది. అమోఘమైన ఆత్మవిశ్వాసం నిండివుంది. నా మనసు చాలా వేగంగా ఆలోచిస్తూ వుంది. ఉదాహరణకు– నా గుండె ఒక్క క్షణంలో వెయ్యిసార్లు కొట్టుకొంది. కానీ నా కేమీ ఇబ్బందిగా అనిపించలేదు. కిటికీలోంచి బయటికి చూశాను. నిశ్చల చిత్రంలా– ఒక సైక్లిస్టు కనబడ్డాడు. అతను తల ముందుకు వంచి సైకిల్ తొక్కే భంగిమలో నిలబడి వున్నాడు. వెనుకచక్రం వెదజల్లే దుమ్ము బంకమట్టితెరలా స్తంభించి వుంది. వేగంగా వెళుతున్న ఒక మోటారు కారు ఎక్కడున్నది అక్కడేఆగి వుంది. నిజంగా నమ్మలేని ఆ దృశ్యాన్ని నేను నోరెళ్లబెట్టి చూశాను. ‘ప్రొఫెసర్ గిబ్బర్న్! దీని ప్రభావం ఎంతసేపుంటుంది?’ గొంతు పెంచి, అసహనంగా అరిచాను. దానికతడు ‘ఏమో! ఆ దేవుడికే తెలియాలి.’ అని చాలా తాపీగా బదులిచ్చాడు. ‘‘నిన్న రాత్రి ఈ మందు తాగాను. పరుపుమీద అసహనంగా దొర్లాను.కింద పడ్డాను. నాకు భయమేసింది. ఆ స్థితి కొన్ని నిముషాలపాటే వున్నా, కొన్ని గంటలు గడిచినట్టుగా అనిపించింది. అయితే, అకస్మాత్తుగా తగ్గిపోయినట్లయిందని అనుకుంటున్నా’’నంటూ బదులిచ్చాడు. నేను భయపడనందుకు నా ఛాతీ ఒకింత పొంగింది. ‘అలా బయటికెళ్దామా?’ అడిగాను. ‘తప్పకుండా’... ఆ స్వల్ప వ్యవధిలోనే గిబ్బర్న్ చేత సృష్టించబడిన ఔషధప్రభావం కారణంగా నేను పొందిన దివ్య చిత్రవిచిత్రానుభూతి, నా జీవితంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనటువంటిది, మరచిపోలేనిది, అనూహ్యమైనదని కచ్చితంగా చెప్పగలను. గేటు గుండా బయటికొచ్చాము. రోడ్ మీద ట్రాఫిక్ ను ఒక నిముషం పాటు గమనించాము. గిర్రున తిరుగుతున్న గుర్రబ్బండి చక్రాల ఉపరిభాగం, గుర్రాల కాళ్లు వేగంగా కదలుతున్నాయి. చోదకుడు బధ్ధకంగా ఆవులిస్తూ, దవడ ఎముకను కదిలిస్తూ కొరడా ఝళిపిస్తున్నాడు. అక్కడ చుట్టుపట్ల వున్న మిగతా వాహనాలు మాత్రం నెమ్మదిగా కదలుతున్నాయి. ఎవరో మనిషి ఆర్తనాదంలాంటి చిన్న కేకతప్ప ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా వుంది. పదుకొండుమంది ఆసీనులైవున్న వాహనంలో– గుర్రబ్బగ్గీ చోదకుడు, బగ్గీ నిర్వాహకుడుతో సహా అందరూ నిశ్చలంగా ప్రతిమల్లాగా ఉండిపోయారు. వాళ్లు మాలాంటివాళ్లే కానీ, మాలాగా వాళ్లు లేరు. బిగుసుకొని పోయి గాల్లో వేల్లాడుతున్నారు. ఒక ఆడదీ, ఒక మగవాడూ ఒకరివంక ఒకరు చూసుకొంటూ నవ్వుకొంటున్నవారు నవ్వుకొంటూనే రాతిబొమ్మల్లా అచలంగా వుండిపోయారు. మీసాలను సవరించుకొంటున్న మగవాడు, జారిపోతున్న టోపీని– పూర్తి శక్తి ఉడిగిన వాడిలా– చేత్తో పట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలుడవుతున్నాడు. ఉన్నట్టుండి గిబ్బర్న్ గట్టిగా అరిచాడు. ఒక దృశ్యాన్ని చూపించాడు. నత్తనడిచే వేగం కన్న తక్కువ వేగంతో గాలిలో బలహీనంగా కిందకు దిగుతూ వుంది– ఒక తేనెటీగ. ఆ గడ్డిపెరిగిన నేలను వదలి బయటికొచ్చాము. ఇంతకు ముందుకన్నా ఎక్కువ పిచ్చెక్కించే సన్నివేశాలు కనబడ్డాయి. ఒక బ్యాండ్ సెట్ వాళ్లు ఎత్తయిన ప్రదేశంలో ఆసీనులై, సంగీతస్వరాలు వినిపిస్తున్నారు. ఆ స్వరాలు అత్యంత తగ్గుస్థాయిలో గుర్ గుర్‌మని పిల్లికూతల్లా వినబడుతున్నాయి. మనుషులు బొమ్మల్లా భయంకరమైన మౌనంతో గడ్డినేల మీద అతి నెమ్మదిగా అడుగులు కదిలిస్తున్నారు. పూడుల్ జాతికుక్క పైకెగిరి గాలిలోనే వేలాడుతూ, నెమ్మదిగా భూమి మీదకు దిగుతోంది. ఖరీదైన దుస్తులూ,తెల్లని షూస్, పనామా టోపీ ధరించి, గొప్పగా కనిపించే ఒకతను, వెనక్కి తిరిగి దారివెంబడి వెళ్లే ఆడవాళ్ల వంక అతివేగంగా అదేపనిగా కన్నుకొట్ట సాగాడు. ‘ఈ వేడి వాతావరణం– నరకాన్ని తలపిస్తోంది. నెమ్మదిగా నడుద్దాం’ అన్నాన్నేను. అక్కడ్నుంచి ముందుకు కదిలాం. దారి వెంబడి కొందరు దివ్యాంగులు చక్రాల కుర్చీలలో కూర్చొని వున్నారు. వారు కూర్చొన్న భంగిమలు సహజంగానే కనబడుతున్నాయి. ఆ బ్యాండ్ మేళం వాళ్ల ముఖాలు మాత్రం అశాంతితో నిండివున్నాయి. ఒక పొట్టి పెద్దమనిషి– విసురుగా వీస్తున్న గాలి ధాటికి రెపరెపలాడుతున్న వార్తాపత్రికను మడతపెట్టలేక విపరీతమైన హైరానా పడుతున్నాడు. అక్కడున్న వారందరూ చాలా మందకొడిగా మసలుతూ ఏదో పెనుగాలికి ఊగులాడుతున్నట్టు అగుపిస్తున్నారు. కానీ మాకేమో ఏ గాలీ వీస్తున్న అనుభూతే లేదు. ఆ గుంపు నుండి దూరంగా వచ్చేశాము. ఉద్దీపన ఔషధం నా నరాలలోనికి చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిన సంఘటనలు కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయాయి. ఇంతలో గిబ్బర్న్ నా ఆలోచనలకు అంతరాయం కలిగించాడు. ‘ఆ దరిద్రపు ముసల్ది వుందే...’ అన్నాడు. ‘ఏ ముసల్ది?’ ‘అదే. నా ఇంటి పక్కనుంది చూడు.దాని దగ్గరున్న ఒక పెంపుడు కుక్క బలే మొరుగుతుందనుకో..’ ఒక్కొక్కసారి, గిబ్బర్న్ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తుంటాడు. నేను వారించే లోపల, పాపం! ఆ అమాయక ప్రాణిని మెడ ఒడిసిపట్టుకొని కొండ చరియదాకా పరుగులు తీశాడు. అది కనీసం మొరగలేదు.మెలికలు తిరగలేదు. నిద్రావస్థలో వున్నట్టుండి పోయింది. అలా వెళుతున్న గిబ్బర్న్నుద్దేశించి గట్టిగా అరిచాను. ‘గిబ్బర్న్! దాన్ని కిందపడేయ్! కిందపడేయ్! నువ్వలా పరుగెత్తావంటే నీ బట్టలు వేడికి అంటుకొని కాలిపోతాయ్’ అని అరుస్తూ, నేను కూడా కొండ కేసి పరుగెత్తాను. గిబ్బర్న్ తొడకొట్టుతూ కొండ రాయిమీద నిల్చున్నాడు. నేను ఆందోళనతో మరొక్కసారి బిగ్గరగా అరిచాను. ‘గిబ్బర్న్! దాన్ని కిందకు పడేయ్! ఈ వేడి చాలా తీవ్రంగా వుంది. మనం ఒక్క క్షణానికి రెండుమూడు మైళ్లు పరుగెత్తుతున్నాము. గాలిలో ఘర్షణ విపరీతంగా వుంది...’ ‘ఏమిటీ?’ అని కుక్కపిల్లకేసి చూస్తూ అడిగాడు. ‘గాలిలో ఘర్షణ... ఉల్కాపాతంలాంటి చండప్రచండ వేగంతో వాయుఘర్షణ వల్ల మంటలు చెలరేగుతున్నట్లున్నాయి. ఉష్ణకిరణాలు నా శరీరానికి బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. జనంలో కూడా కొద్దిగా చలనం వచ్చింది. మందు ప్రభావం పూర్తిగా క్షీణించినట్లుంది. వెంటనే ఆ కుక్కపిల్లను కిందకు వదిలేయ్!’ ‘ఆ!? ’ అన్నాడు. ‘మందు పనిచేయడం మానేసింది. చాలా వేడిగా వుంది. నా ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.’ వెంటనే గిబ్బర్న్ చేయి విదిలించి కుక్కపిల్లను దూరంగా విసిరేశాడు. అది గిరగిరా తిరుగుతూ పైకెళ్ళి కదలకుండా గాల్లో నిలిచిపోయింది. అక్కడ గుమిగూడిన జనం, నీడ కోసం గొడుగులు ఏర్పరచుకొని, వాటి కింద పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ గొడుగులకు కొంచెం ఎత్తులో– మేకుకు తగిలించినట్టు వేలాడుతూ ఉండి పోయింది కుక్కపిల్ల. అప్పుడు గిబ్బర్న్ మాట్లాడాడు. ‘‘ఔనౌను. విపరీతమైన వేడిగా వుంది.ఇక్కడి నుంచి మనం తక్షణం బయటపడాలి.’’ కానీ అనుకున్నంత వేగంగా మేము పరుగెత్తలేకపోయామనుకుంటాను. అదే మాకు కలిసొచ్చిన అదృష్టమేమో! ఒకవేళ మేము అలా పరుగెత్తివుంటే, మంటల్లో మాడి మసైపోయేవాళ్లమేమో ఈపాటికి! అవును! నిజంగానే మంటల్లో భస్మీపటలమై వుండేవాళ్లం.మేము పరుగెత్తాలని నిర్ణయించుకోవడానికి– క్షణంలో వెయ్యోవంతు ముందుగా ఆ మందు ప్రభావం అంతరించడం కాకతాళీయంగా జరిగిపోయింది. చేత్తో మంత్రదండం తిప్పినట్లు దాని ప్రభావం పూర్తిగా ఆగిపోయింది. అంతలో గిబ్బర్న్ ‘కింద కూర్చో! కింద కూర్చో!’ అని హెచ్చరించాడు. నేను పచ్చగడ్డితో కూడిన మట్టిపెల్ల అంచు మీద కూర్చున్నాను. నేను ఏ పచ్చగడ్డి గడ్డ మీద కూర్చున్నానో, దానికి ఒకవైపు నుంచి మంటలు రాజుకుంటూ వస్తున్నాయి. చిత్తరువులా నిశ్చలస్థితిలో వున్న జగత్సర్వస్వం జాగృతమైంది. నిర్జీవములైన దృశ్యాలు ప్రాణం పోసుకున్నాయి. మూగవోయిన బ్యాండ్ వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగసాగాయి. పాదచారులు తమ అడుగులు భూమ్మీద మోపి వడివడిగా నడవసాగారు. కాగితాలూ, జెండాలు రెపెరెపలాడసాగాయి. చిరునవ్వులు మాటలుగా మారాయి. కన్నుకొట్టే శ్రీమంతుడు అది మానేసి తనదారిన తాను వెళ్ళిపోయాడు, సంతృప్తిగా. మౌనంగా కూర్చున్న వారందరిలోనూ చలనమొచ్చి, గలగలా మాట్లాడుకోసాగారు. మేము ఏ వేగంతో నడుస్తున్నామో, ప్రపంచం కూడా అదే వేగంతో నడుస్తూవుంది– ఎంతో వేగంతో పరుగులెత్తే రైలుబండి, స్టేషన్లోకి రాగానే స్పీడు తగ్గించుకొని నెమ్మదిగావచ్చినట్లు. గిబ్బర్న్ చేతిపట్టు విడిపోగానే, కుక్కపిల్ల ఒకే ఒక్క క్షణంపాటు గాలిలో వేలాడి, తరువాత అమిత వేగాన, కిందకు జారుతూ, గొడుగు నీడలో సేదతీరుతున్న ఒక మహిళ గొడుగుమీద ‘దబ్’ అని పడిపోయింది. ఆ ధాటికి గొడుగు గుడ్డను చీల్చుకొని– ఆ కుక్కపిల్ల ఆ మహిళ మీద పడింది. కొత్త మందుతో నేను పొందిన మొట్టమొదటి అనుభవమది. బ్యాండ్ సెట్ సంగీతాన్ని అర్ధగంటసేపు విన్నాను. కొత్తమందు ప్రభావాన్ని పరీక్షించాలనుకున్న మాకు, ప్రపంచమే సహకరిస్తున్నట్లు స్తంభించి వుంది. అతి తొందరపాటుతో బహిరంగ ప్రదేశంలో మేము నెరిపిన ప్రయోగం– అనుకున్నంత సంతృప్తికరంగా మాత్రంలేదు. అయినా గిబ్బర్న్ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా వుంది. ఈ మందుప్రభావం నియంత్రణకు తెచ్చే ప్రక్రియలో– అణుమాత్రం దుష్పరిణామం సంభవించని రీతిగా– నేను చాలామార్లు అతని పర్యవేక్షణ కింద, తగిన మోతాదుల్లో మందు సేవించాను. ఈ మందు పుచ్చుకొన్న స్థితిలో, నేను ఈ ఉదంతాన్ని కేవలం ఒకే ఒక దఫా కూర్చొని ఎలాంటి అంతరాయం లేకుండా రాశాను.(మధ్యమధ్య చాక్లెట్ కొరుక్కు తినడం తప్ప). నేను ఈ వృత్తాంతాన్ని రాయడం 6.25 నిముషాలకు మొదలుపెట్టి, 6.56 నిముషాలకు ముగించాను. ఈ రచనను పూర్తిచేయడానికి సాధారణ పరిస్థితుల్లోనైతే కనీసం మూడుగంటలపైనే పట్టేది. కానీ ఇప్పుడు కేవలం ముప్పైఆరు నిముషాలలో రాసి పూర్తిచేశానన్నమాట! రోజువారీ కార్యక్రమాల ఒత్తిడి అధికమైనప్పుడు, చేయాల్సిన పెద్ద పెద్ద పనులు, నిరంతరాయంగా, అతి కొద్ది వ్యవధిలో పూర్తి కావలసినప్పుడు ఈ మందు ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు గిబ్బర్న్ వివిధ మోతాదుల్లో, విభిన్న దేహదారుఢ్యాలు గల వ్యక్తుల మీద ప్రభావం చూపే మందును భారీస్థాయిలో తయారుచేసే పనిలో నిమగ్నమై వున్నాడు. ఈ అనుభవం తరువాత, మందు మోతాదు ఎక్కువైనప్పుడు, జరగబోయే చెడు ప్రభావాన్ని నివారించే నిమిత్తం గిబ్బర్న్, ‘మందగామిని’ కనిపెట్టాలనుకున్నాడు ఇది ‘వేగోద్దీపన’కు పూర్తిగా విరుధ్ధమైనది. ఈ మందు ఒక డోసు తాగిన రోగికి, కొన్నిగంటలపాటు, మనసుకు పూర్తి విశ్రాంతి, నిశ్చింతభావం చేకూరుతుంది. చికాకుపరచే చుట్టుపక్కల నెలకొన్న రణగొణధ్వనుల మధ్యకూడా– నాలుగైదు గంటల పాటు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత నవనాగరిక సమాజంలో ప్రశాంత జీవనం గడపడానికి, ఈ మందగామిని ఉపకరిస్తుంది. భరింపరాని వేదన– మనసును కలచివేస్తున్నప్పుడు, జీవితంలో విరక్తిభావం శ్రుతిమించినప్పుడు అంతులేని ప్రశాంతతను అందిస్తుంది. అయితే– వేగోద్దీపనం– అవసరమైన ఏ సందర్భంలోనైనా– అనంతశక్తినీ, ఉత్తేజాన్నీప్రసాదిస్తుందని గట్టిగా చెప్పగలను. ప్రస్తుతం ‘మందగామిని’ తయారీ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. కాబట్టి అదెంతవరకు సత్ఫలితాలనిస్తుందో చెప్పలేను. అయితే వేగోద్దీపనం విషయంలో మాత్రం ఏవిధమైన సందేహం పెట్టుకోనవసరం లేదు. ప్రజలకు సౌకర్యవంతంగా, దుష్పరిణామాలు సంభవించని రీతిలో, సంక్లిష్టరహితంగా, ప్రజావిపణిలోనికి కొద్దినెలల్లోపల రానున్నది ఈ రసాయనం. అంత శక్తిమంతమైన ఔషధం చిన్నచిన్న సీసాలలో, సహేతుకమైన ధరల్లో, 200, 900, 2000 పొటెన్సీలలో ప్రతి మందుల షాపులలోనూ, లభ్యం కాగలదు. దీని ఉపయోగం ఎన్నో అసాధారణ లక్ష్యాల సాధనకు బాటలు పరుస్తుందనటంలో ఈషణ్మాత్రం సందేహం లేదు. బహుశా ఇది– నేరపరిశోధనల్లో కూడా– అతి స్వల్ప వ్యవధిలో, నేరమూలాల్లోకి ఆలోచనలు చొచ్చుకొనిపోయి, నిజమైన నేరస్తుల శిక్షణకు, నిరపరాధులరక్షణకు దోహదపడుతుందని నా నమ్మకం. కాకపోతే ఇలాంటి ఇతర అపార గుణసంపత్తి గల ఔషధాల్లాగే, ఇది కూడా విమర్శలకతీతం కాదు. ఈ విషయం పూర్తిగా వైద్యన్యాయ శాస్త్రపరిధిలోకి వచ్చే అంశం. ఈ మందును ఉత్పత్తిచేసి, అమ్మిన తరువాత చూద్దాం– దీని పర్యవసనాలెలా వుంటాయో! ఇంగ్లిష్ మూలం : హెచ్.జి.వెల్స్ అనువాదం: శొంఠి జయప్రకాష్ -
చుక్కలు చూపించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష
కడప కల్చరల్/ సాక్షి, అమరావతి: ‘సౌత్‌పోల్ అంటే యూత్ పోల్. మీడియేషన్ అంటే మెడిటేషన్. బై క్యామెరల్ అంటే రెండు కెమెరాల విధానం. క్రూడ్ బర్త్ రేట్ అంటే మూడిద పుట్టుక, మూడిద మరణం’ అంతా పిచ్చిపిచ్చిగా అనిపిస్తోంది కదూ. మనకే ఇలా ఉంటే.. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొని ఆదివారం గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే అవకాశం ఉండడంతో కొంతమంది అభ్యర్థులు తెలుగులోనే పరీక్షలు రాశారు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంగ్లిష్ ప్రశ్నలకు ఇచ్చిన తెలుగు అనువాదాన్ని చూసి తెలుగు మీడియం అభ్యర్థులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఇంగ్లిష్ ప్రశ్నలకు అత్యంత సులువుగా తెలుగులో అనువాదం ఇచ్చే అవకాశం ఉన్నా తెలుగు పండితులు సైతం అర్థం చేసుకోలేని విధంగా ఘోరమైన అనువాదంతో ప్రశ్నలు ఇచ్చారు. ఇదంతా ప్రశ్నపత్రంలోని ‘డి’ సిరీస్‌లో జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలుగు అనువాదం అధ్వానంగా ఉండటంతో పలుమార్లు ఇంగ్లిష్ ప్రశ్నలతో పోల్చి చూసుకుంటే గానీ తెలుగు ప్రశ్న అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏపీపీఎస్సీ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇచ్చిన సమయంలో తెలుగు ప్రశ్నలను అర్థం చేసుకునేందుకు సమయం చాల్లేదని, దీంతో తాము దాదాపు పది మార్కుల వరకు కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ‘భారత రాజ్యాంగ ఫెడరల్ లక్షణాలు కానివి ఏవి’ అంటూ ఇచ్చిన ప్రశ్నకు బై క్యామెరల్ లెజిస్లేచర్ అన్న అర్థం రావాల్సి ఉండగా.. ‘రెండు కెమెరాల చట్టం’ అంటూ తెలుగులో సమాధానం ఇవ్వడం గమనిస్తే ప్రశ్నపత్రం రూపకల్పన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తికమక ప్రశ్నలు ‘డి’ సిరీస్ ప్రశ్నపత్రంలో పది వరకు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్–2 పరీక్షల్లో కూడా ఏపీపీఎస్సీ స్వామి భక్తిని ప్రకటించుకునేలా చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై ప్రశ్నలు ఇవ్వడం పలు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనైనా గ్రూప్–1 ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా రూపొందించి ఉండాల్సిందని అభ్యర్థులు అంటున్నారు. గ్రూప్–1 ప్రశ్నపత్రంలో తికమకగా ఉన్న తెలుగు అనువాదం (టిక్కులు వేసినవి) నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను ఇబ్బందిపెట్టిన పేపర్–2 ఈసారి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలోని ప్రశ్నలను సివిల్ సర్వీస్‌కు సమాన స్థాయిలో ఇచ్చారని అభ్యర్థులు వాపోయారు. పేపర్–1, పేపర్–2ల్లోని ప్రశ్నలన్నీ చాలా కఠినంగా ఉన్నాయని, సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు మాత్రమే రాయగలిగే స్థాయిలో ప్రశ్నలు రూపొందించారని తెలిపారు. పేపర్–2 మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు మాత్రమే అనుకూలంగా ఉందన్నారు. గ్రూప్–1 కేడర్ పోస్టులు కాబట్టి ఆ స్థాయిలో ప్రశ్నలు అడగడంతో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అర్హులయ్యే వారి సంఖ్య చాలా కుదించుకుపోనుంది. గతంలో గ్రూప్–1 స్క్రీనింగ్ టెస్ట్‌లో 150 మార్కులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడిగేవారు. ఈసారి స్క్రీనింగ్ టెస్టును పేపర్–1, పేపర్–2గా విభజించి 120 మార్కుల చొప్పున 240 మార్కులకు పెంచారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో మ్యాథమెటిక్స్, రీజనింగ్‌కు సంబంధించి 60 ప్రశ్నలుండడంతో మ్యాథ్స్ చదవని జనరల్ డిగ్రీ అభ్యర్థులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. చాలా వరకు తాము ఆ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రుణాత్మక (నెగెటివ్) మార్కులుండడంతో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించకుండా వదిలేశామని వివరించారు. మ్యాథమెటిక్స్ చదవని జనరల్ డిగ్రీ అభ్యర్థులు ఈసారి చాలా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొత్తగా పరీక్ష విధానాన్ని మార్చిన ఏపీపీఎస్సీ డిగ్రీ (మ్యాథ్స్) లేదా ఇంజనీరింగ్ చేస్తున్నవారికి మేలు కలిగేలా పేపర్–2ను పెట్టిందని వాపోతున్నారు. పైగా ఆంగ్లం, తెలుగులో ఇచ్చిన ఈ ప్రశ్నలు చదువుకొని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని, కొన్ని సందర్భాల్లో తెలుగు ప్రశ్నలు అర్థం కాక ఆంగ్ల ప్రశ్నలు చూసుకోవలసి వచ్చిందన్నారు. కొన్ని ప్రశ్నలకు ఆంగ్ల ప్రశ్నలు, సమాధానాల్లో ఒకటి సరైనదిగా ఉంటే తెలుగులోకి వచ్చే సరికి వేరే సమాధానం సరైనదన్న సందిగ్థం ఏర్పడిందని వివరించారు. పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు గ్రూప్–1 ప్రిలిమినరీకి తక్కువ మందే హాజరవుతున్నా పరీక్ష కేంద్రాలను మాత్రం సుదూరంలో కేటాయించడంతో అభ్యర్థులు నానా అవస్థలు పడ్డారు. నగరాల్లో అనేక పరీక్ష కేంద్రాలున్నా వాటిని కాదని ఎక్కడో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులకు చుక్కలు కనిపించాయి. కొన్ని కేంద్రాలకు బస్సులు, ఆటోలు కూడా నడవని పరిస్థితి. పైగా ఆదివారం కావడంతో ఆటోలు కూడా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రత్యేకంగా అద్దె కార్లు, ఆటోలు మాట్లాడుకుని చేరాల్సి వచ్చింది. కళాశాలలకు సరైన రోడ్లు కూడా లేని ప్రాంతాల్లో వాహనాలు పోయేందుకు అవకాశం లేక కిలోమీటర్ల మేర మండుటెండల్లో నడవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు నానా ఇక్కట్లకు గురయ్యారు. 73.76 శాతం మంది హాజరు రాష్ట్రంలో 169 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు 73.76 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం పేపర్–1 జనరల్ స్టడీస్, మధ్యాహ్నం పేపర్–2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షలు నిర్వహించారు. పేపర్–1కు 59,697 మంది, పేపర్–2కు 59,200 మంది హాజరయ్యారు. 254 పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 80,250 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. -
మరింత కచ్చితంగా ఫేస్బుక్ అనువాదం
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచంలోని అన్ని భాషల యూజర్లకు ఫేస్‌బుక్‌ను మరింత దగ్గర చేసేందుకుగాను సంస్థ తన భాషా అనువాద (లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్) విభాగాన్ని పటిష్ట పరిచింది. కృత్రిమ మేథస్సు సాంకేతికతను ఉపయోగించి ఇతర భాషల్లో పెట్టే ఫేస్‌బుక్‌లోని పోస్టులు, కామెంట్లను కచ్చితంగా, తక్కువ సమయంలో వారివారి మాతృభాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయగలిగే నూతన అప్డేట్ను సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఫేస్బుక్లో అందుబాటులో ఉన్న అనువాద వ్యవస్థ కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే యూజర్లకు సులువుగా అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేట్ చేయగలవు. అయితే ఉర్దూ, బర్మీస్ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి వాటిని అధిగమించేందుకు గాను మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్‌లోకి వికిపీడియా లాంటి వెబ్‌సైట్‌ల్లోని వేర్వేరు భాషల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాఖ్యాలను అప్లోడ్ చేసింది. దీంతో ఇతర భాషల్లోని పోస్టులు, కామెంట్లను యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో చూసుకునేలా నూతన వ్యవస్థ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. -
సీతను అపహరించింది రాముడేనట..!!
గాంధీనగర్ : పన్నెండో తరగతి ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల కోసం గుజరాత్ బోర్డు ముద్రించిన సంస్కృత పాఠ్య పుస్తకం తప్పుల తడకగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సంస్కృత సాహిత్య పరిచయం’ పేరిట అచ్చైన పుస్తకంలో..‘రాముని వ్యక్తిత్వం, గొప్పతనం, ఆయన ఆలోచనల గురించి రచయిత ఎంతో గొప్పగా వర్ణించారు. రాముడు సీతను అపహరించిన సమయంలో లక్ష్మణుడు.. సీత అపహరణ గురించి రామునికి సమాచారం చేరవేసే పద్య వర్ణన ఎంతో హృద్యంగా ఉంటుంది’ అంటూ పరిచయ వాక్యాలు రాశారు. అంతేకాకుండా పుస్తకంలో ఎన్నో అక్షర దోషాలు కూడా ఉన్నట్లుగా ఫిర్యాదులున్నాయి. అనువాద దోషం వల్లే అలా.. పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లిన విషయంపై గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్ట్స్ బుక్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్ పేతాని స్పందించారు. గుజరాతి పుస్తకంలో సరిగ్గానే ఉందని, అనువాద సమయంలో జరిగిన పొరపాటు కారణంగానే ఈ తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చారు. -
గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కోపమొచ్చింది
సాక్షి, ముంబయి : మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కోపం వచ్చింది. తన ప్రసంగానికి మరాఠీ అనువాదం మిస్సయిందని ఆయన అటు శాసన మండలి చైర్మన్‌పై, శాసనసభ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చేష్టలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ఆ ప్రసంగానికి సంబంధించి మరాఠీ అనువాదం చేసేందుకు ఎవరు ప్రయత్నించనట్లు తాను గుర్తించానంటూ ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ ఆయన మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రామ్‌రాజేనాయక్ నిమ్‌బకార్‌కు, అసెంబ్లీ స్పీకర్ హరిభౌ బగదేకు లేఖ రాశారు. 'ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తున్న సమయంలో నా ప్రసంగాన్ని మరాఠీలోకి అనువాదం చేయలేదు. ఇలాంటిది సీరియస్‌గా తీసుకోవాలనది నా ఉద్దేశం. దీనికి కారణమైనవారిపై కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియజేయాలి' అని విద్యాసాగర్ రావు లేఖలో పేర్కొన్నారు. -
ఎలాంటివి రాస్తానో, అలాంటివే అనువదిస్తా!
ఐదు ప్రశ్నలు కొల్లూరి సోమ శంకర్ అనువాద కథల సంకలనం ‘నాన్నా!! తొందరగా వచ్చేయ్’ ఇటీవలే విడుదలైంది. ఆ సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలు... అనువాదాలు ఎందుకు చేస్తున్నారు? నేను రచయిత, అనువాదకుడికన్నా ముందు పాఠకుడిని. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు కథలు చదవడం అలవాటు. అందులో కొన్ని ఆర్ద్రంగా హృదయాన్ని తాకితే, మరికొన్ని గాఢంగా ఆలోచింపచేశాయి. అలాంటి కథలని తెలుగు పాఠకులతో పంచుకోవాలనే తపనతో అనువాదాలు మొదలుపెట్టాను. 2002 నుంచీ ప్రారంభించి, ఇప్పటివరకూ 112 కథలను అనువదించాను. ఎలాంటి కథలు అనువదిస్తారు? సార్వజనీనత కలిగి ఉండి, కథావస్తువు తెలుగు నేపథ్యానికి నప్పేలా జాగ్రత్త వహిస్తాను. ఈ కథలన్నీ నా ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్నవే. నేను ఎలాంటి కథ రాస్తానో, అలాంటి కథలనే అనువాదాలకూ ఎంచుకుంటాను. అనువాదం కోసం ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? భాషను యథాతథంగా మరోభాషలోకి తేవడం అనువాదం కాదనీ, భావానువాదం ముఖ్యమనీ నా అభిప్రాయం. మూలకథని ఆకళింపు చేసుకుని – తెలుగు కథే చదువుతున్నామా అనిపించేలా జాగ్రత్తపడతాను. మూల కథలో ఏ సెన్స్‌తో ఉపయోగించారో అటువంటి అర్థమిచ్చే తెలుగు పలుకుబడులు ఉంటే అవే ఉపయోగిస్తాను. లేదా ఆ సందర్భానికి తగినట్లుగా ఆ వాక్యాలను సమ్మరైజ్ చేయడమో లేదా ఆ అర్థం స్ఫురించేటట్లు తెలుగులో రాయడమో చేస్తాను. మూలరచయితలతో ఎలాంటి పరిచయం ఉంటుంది? నా అదృష్టం ఏంటంటే నేను అనువదించిన ఇతర భారతీయ భాషల కథలను చాలావరకూ మూల రచయితలే ఆంగ్లంలోకి అనువదించడం! తద్వారా "Losses in Translation'' బాగా తగ్గాయి. నేను అనువదించినవి ఇంటర్నెట్ నుంచి సేకరించినవే. తద్వారా నాకు లభించిన సౌలభ్యం మూల రచయితలతో ఈ–మెయిల్ పరిచయం! అనువాద క్రమంలో అవరోధాలు ఎదురైతే, మూల రచయితలను సంప్రదిస్తాను. వారి వివరణలతో నా సమస్య తీరిపోతుంది. అనువాదాలు చేస్తుంటే మీ సొంత సృజన తగ్గిపోతుందా? కథని క్రిస్ప్‌గా చెప్పగలగడం; సంభాషణలను ఎఫెక్టివ్‌గా రాయగలగడం వంటివి నాకు అనువాదాలు చేయడం వల్ల అలవడ్డాయి. అనువాదాలలో ఇతివృత్తం, సన్నివేశాల కల్పన, సంభాషణలు అన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. కథలోని మూడ్‌ని గ్రహించి, కథకుడి టోన్‌ని పట్టుకుంటే చాలు, తెలుగులో చక్కని కథ సిద్ధమవుతుంది. సొంత కథల విషయంలో అన్నీ మనమే సమకూర్చుకోవాలి. అందువల్ల సొంత కథలు రాయడం ఆలస్యం అవుతుంది. (కొల్లూరి సోమ శంకర్ ఫోన్: 9848464365) -
పోయేది తక్కువ పొందేది ఎక్కువ
అనువాదంలో పోగొట్టుకున్నది ఏకొంతో తప్పకుండా ఉంటుంది. దానితోబాటు పొందేదీ ఉంటుంది. నష్టం గురించి చింతిస్తూ, పొందే లాభం లాభమే కాదన్నట్టు మడికట్టుకు కూర్చుంటే, మనల్ని మనమే ఇతర భాషా సాహిత్యాలనుండి వెలివేసుకున్నట్టు. ఎవరో నాటిన చెట్టుకొమ్మలు, అన్నింటినీ వివరిస్తూ, అన్ని వైపులా విస్తరిస్తాయి. ఆ చెట్టుచుట్టూ లేచిన, దాని పిల్లచెట్లూ అనువాదమే. అయినా మనకు తెలిసిన ప్రపంచంలోనే - బాధలు శబ్దాలు రంగులు రుచులు వాసనలు దృశ్యాలు అనువాదం చేయలేనివి ఎన్నెన్నో. ఆకాశాన్ని అనుభవంలోకి నింపుకుంటున్న మేఘాల్ని పూర్తిగా జీర్ణించుకుని, అనువాదం చేస్తున్న వర్షాన్ని అర్థం చేసుకోగలమా? అంతెందుకు, పదిమంది చూసిన ఒకే దృశ్యాన్ని, ఆ పదిమందీ పది విధాలుగా చెబుతారు. అందులో సారాంశం ఒకటే అయినపుడు వాటిల్లో భిన్నత్వం అంతగా పట్టించుకోం. వివిధ అనువాదాలూ అంతే, మూలం చెడనంతవరకూ. అనువాదమంటే మరో భాషనుండి మన భాషలోకి కేవలం పదాల మార్పు మాత్రమే కాదు. సరైన సమానమైన పదాలు ఎన్నుకోవడం కష్టమైన పని. మాతృకలోని శబ్ద సౌందర్యం, శబ్ద మాధుర్యం, అందులోని అద్భుతమైన సంగీతం అనువాదంలోకి అంతగా ఎలాగూ ఒదగదు. అంచాత ఎన్నుకున్న పదాలు అవి చూడాల్సిన ప్రపంచాన్ని ఎలా చూస్తాయన్నది ముఖ్యం. నిజానికి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం లాంటిది అనువాదం. తెలియని ప్రదేశంలో, తెలిసిన వివరాలతో, సరైన వీధినో ఇంటినో కనుగొనడం లాంటిది. ప్రతీ భాష తనదైన పదజాలంతో దృష్టికోణంతో ప్రపంచాన్ని మరోలా చూస్తుంది. ప్రతీ భాషకు దాని పదాల్లో విభిన్నమైన చూపుంటుంది. ప్రతి భాషకీ దానిదైన ఒక ప్రపంచం, పరిశీలన, పాదుకొన్న విలువలు ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని దానిదైన నుడికారం, అభివ్యక్తి ద్వారానే గ్రహించగలం. వాటిని అనువాదం చేయడం ఏ అనువాదకుడికైనా ఒక సవాలు. మరొక భాషలో అది అంతే అందంగా పొదగడం అంతగా సాధ్యపడదు. ఒకవేళ చేయగలిగినా అర్థరహితంగానూ అస్పష్టంగానూ తయారుకావచ్చు. ఎన్ని పరిమితులున్నా వాటిని సాధ్యమైనంతవరకు సజావుగా దాటుకుంటూ రాగలుగుతేనే అనువాదం సాధ్యమయేది. ఏదో ఒక ఆకారాన్ని అదే ఆకారంగా ఎలాగూ మార్చలేం. ఆ అందాన్ని అలాగే ఉంచి, దానిని గుర్తుచేసే మరో అందాన్ని బహుశా తయారుచేయడం అనువాదం. అనువాదంలో పోగొట్టుకున్నది ఏకొంతో తప్పకుండా ఉంటుంది. దానితోబాటు పొందేదీ కొంత ఉంటుంది. ఈ లాభనష్టాల బేరీజుల్లో నష్టం గురించి చింతిస్తూ, పొందే లాభం లాభమే కాదన్నట్టు మడికట్టుకు కూర్చుంటే, మనల్ని మనమే ఇతర భాషా సాహిత్యాలనుండి వెలివేసుకున్నట్టు. అనువాదకుడు కేవలం వంతెనలాంటి వాడు. వంతెన ఎలా ఉన్నా, అటు కూడా వెళ్లి రాగలిగే వెసులుబాటు కల్పించేవాడు మాత్రమే. అటు వెళ్లొచ్చాక అది ఎంత సంతృప్తి మిగిల్చింది అన్న మంచో చెడో ఆ అనువాదకుడికే చెందుతుంది. మూల రచన అనువాదకుడికి ఎంత నచ్చింది అతనిలో ఎంత ఇంకింది, ఎంత ప్రేమతో అది బయటకొచ్చిందన్నది - ఆ అనువాద రచనే తెలియజేస్తుంది. కవిత్వ అనువాదంలో స్థిరార్థమైన సమతుల్యం కంటే, మాతృకలోని ఆ కవిత అనుభవం కోసం ఎక్కువగా మనం ఎదురుచూస్తాం. ఆ కవిత మొదటి శ్రోత, లేదా మొదటి పాఠకుడు పొందిన అనుభూతి అనువాదంలోనూ పొందగలుగుతే ఎంత అదృష్టం! ఎక్కువ భాగం అనువాదాలన్నీ ఆంగ్లంలో ప్రయాణిస్తూ సాంస్కృతిక సరిహద్దుల్ని దాటుకుంటూ, ఆ ప్రయాణంలో పొందే జ్ఞానంతో తిరిగొచ్చి, ఆ కవితను దేశీయ నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలే. ఆ కవిత ముందూ వెనకలు అనేక విషయాలమీద ఒకేమారు ఆధారపడి ఉంటాయి. ముందుగా - ఆ కవిత్వ చారిత్రక సంప్రదాయం, దాని ఛందశ్శాస్త్ర సంప్రదాయం, దానికి కట్టుబడి ఉండే ఇతివృత్తాలు, దాని భాషా పరిధి, అది ఏ ఉద్దేశంతో రాసిన కవిత్వమో మొదలైనవి. రెండవది - కవిత్వ సంప్రదాయ విషయంలో ఆ కవికున్న తనదైన ప్రత్యేకత, కవిత - సంప్రదాయాల మధ్య సాగే మాండలిక స్నేహం; చివరగా ఒక భాషనుండి మరోభాషకు చేసే అజ్ఞాత ప్రయాణం. ఆ కవి ఆలోచనలతో, భావనలతో, కవిత్వ ఊహలతో పక్క పక్కనే నడుస్తూ ఆ కవితను భావగర్భితంగా ఒడిసిపట్టుకోవడం అనువాదం. ఒక కవి, అనువాదకుడుగా బహుశా అన్యోన్య వైరుధ్యంలో జీవిస్తుంటాడు. అతని పని అనువాదంలా అనిపించకూడదు. అలా అని స్వతంత్ర ఊహల అభ్యాసంగా కూడా కాదు. అనువాదకునిలో ఒక స్వరం - మూలాన్ని గౌరవించమని హెచ్చరిస్తుంటుంది. మరో స్వరం - దానికి నూతన రూపమివ్వమని ప్రాధేయ పడుతుంది. అనువాదకుని పరిస్థితి సరిగ్గా కాఫ్కా సూక్తిలోని, రెండు గొలుసులతో, ఒకటి భూమితో ఇంకొకటి ఆకాశంతో సంకెళ్లు వేయబడ్డ పౌరుడిలా ఉంటుంది. భూమి వైపు వెళ్తే, ఆకాశం గొలుసు వెళ్లనివ్వదు, ఆకాశం వైపు వెళ్తే భూమి గొలుసు వెనక్కి లాగుతుంది. అయినా కాఫ్కా చెప్పినట్టు అన్ని సాధ్యాసాధ్యాలూ అతనివే, అతను అనుభవించేవే. తప్పిదం మూలంగా మౌలిక నిర్భంధంలోని ఎటూ కదలలేని స్థితిని అతను ఒప్పుకోడు. తనకు సంతృప్తినిచ్చే దారేదో అతనే వెతుక్కుంటాడు. ఇతిహాసాలు మహాకావ్యాలు సైతం అనేక సంవత్సరాలు మౌఖికంగా ఉండి ప్రజల నాలుకలమీద నాని, లిపిలో వాటిని చేర్చేవరకు నిలువగలిగాయి. బహుశా శతాబ్దాల మానవానుభవాల నిధులు భాషలు. భాష ఏ నాగరికతకైనా ఒక సంకేతలిపి. వాటి రహస్యాల్ని సంకేతాల్ని అక్కడి యాస భద్రంగా ఉంచగలుగుతుందేమో! ఈ పుస్తకంలో రెండు వేలకు పైగా కవులున్నారు. వందకుపైగా దేశాలున్నాయి. చేర్చని దేశాల్లో, లేదా వారి కవిత్వ పరిచయం చేయని దేశాల్లో, కవిత్వం లేదని ప్రామాణికంగా చెప్పలేం. ఆంగ్లంలో అవి బయటకు రాకపోవడం ఒక కారణమయితే, ఉన్నా అవి లభ్యం కాకపోవడం మరో కారణం. కవిత్వ పర్వతాన్ని అధిరోహిస్తూ చుట్టూ చూడాలన్న అణుచుకోలేని కోరికతో, ఇష్టంతో ఆ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నంలో, అంతవరకూ తెలియని అద్భుతమైన అనేక కవిత్వ ప్రపంచాల్ని చూడాలని, నేను చూసుకుంటూ పోయిన ప్రపంచాన్ని అందరికీ చూపించి ఆనందపడాలన్న ప్రయత్నమే ఈ పుస్తకం. (వ్యాసకర్త ‘అదే గాలి: ప్రపంచ దేశాల కవిత్వం -నేపథ్యం’ పేరుతో పుస్తకం వెలువరిస్తున్నారు. ప్రచురణ: ఎమెస్కో. రచయిత మెయిల్: mukundaramarao@hotmail.com) ముకుంద రామారావు -
టాగూర్‌కు తగని అనువాదం
‘వెయ్యేళ్లలో స్ట్రేబర్డ్స్తో సరిపోల్చదగ్గ కవిత్వం రాలేదు. మళ్లీ చదివి స్పందించినందుకు అనువాదకుడికి కృతజ్ఞతలు మాత్రం చెప్పక తప్పదు’. విశ్వకవి రవీంద్రుడి నిరాడంబరతను, హృదయసౌందర్యాన్ని ప్రతిఫలించే ‘స్ట్రేబర్డ్స్’ కవితా సంకలనాన్ని గతంలో చాలా మంది చైనా భాషలోకి అనువదించారు. అయితే, ఫెంగ్‌టాంగ్ తాజాగా చేసిన అనువాదం వివాదాస్పదమైంది. అది అసభ్యకరంగా ఉందనీ, మూలరచనకు దూరంగా జరిగిందనీ అక్కడి సాహితీలోకం, పత్రికాప్రపంచం విరుచుకుపడింది. ఫెంగ్‌టాంగ్ అనువాదాన్ని తూర్పారబడుతూ ‘చైనా డెయిలీ’లో రేమండ్ జో అనే రచయిత పెద్ద వ్యాసమే రాయగా, ‘పీపుల్స్ డెయిలీ’ ఏకంగా సంపాదకీయమే రాసింది. మన దేశంలో కూడా ఫెంగ్‌టాంగ్ అనువాదంపైన నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఖంగుతిన్న జిజియాంగ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ పబ్లిషింగ్ హౌస్ ఆ అనువాద ప్రతులను వెనక్కి తీసుకుంది. ఫెంగ్‌టాంగ్ కలం పేరుతో రాసే జాంగ్హైపెంగ్(44) చైనాలో ప్రసిద్ధ నవలా రచయిత. వైద్య శాస్త్రం చదివిన ఈయన ఎంసీకిన్సే కన్సల్టెంట్గానూ, ప్రభుత్వ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌గానూ పనిచేసి, ఏడాది క్రితం రాజీనామా చేసి, వ్యాపారంలో స్థిరపడ్డాడు. స్ట్రేబర్డ్స్ లాంటి క్లాసిక్స్‌ను ప్రజల భాషలో సరళంగా రాస్తే బాగుంటుందని బూతులు రాశాడు. ‘ద వరల్డ్ టేక్స్ ఆఫ్ ఇట్స్ మాస్క్ ఆఫ్ వాస్ట్నెస్ ఫర్ ఇట్స్ లవర్’ అన్న రవీంద్రుడి మాటకు,‘ద వరల్డ్ అన్జిప్ప్డ్ హిజ్ ప్యాంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ లవర్’ అని అనువాదం చేశాడు. ఇలాంటి తప్పుడు అనువాదాల్ని పత్రికల్లో చాలా ఉదహరించారు. ఒక భాషా పదానికి సరైన సమీప పదం మరో భాషలో అరుదుగా మాత్రమే లభిస్తుంది. మంచి అనువాదకులు మూలానికి ఏ పదం తగిందో ఎంపిక చేసుకుంటారు. అది వారి వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ‘తన సొంత రచనను తన సొంత బాణీలో రాసుకునే స్వేచ్ఛ ఫెంగ్టాంగ్కు ఉంది. అలాంటి రచనను ఇష్టపడే పాఠకులు కూడా ఉంటారు. అందులో తప్పు లేదు. ఇలాంటి వక్రీకరణలను మాత్రం అనువాదాలనలేం’ అని పీపుల్స్ డెయిలీ తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. ఇక, ఫెంగ్‌టాంగ్ అనువాదంపై రేమండ్ జో వ్యంగ్య బాణాలు సంధించాడు. ‘వైద్యశాస్త్రం చదివిన ఇతను దారి తప్పి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందాడు. తన మనసులో దాగి ఉన్న వాంఛ మేరకు సాహిత్యంలో నిష్ణాతుడు కావాలనుకున్నాడు. వీటన్నిటికీ తోడు అతనికి టెస్టోస్టిరోన్ ఎక్కువగా పనిచేయడం వల్లనే అసభ్యత ప్రదర్శించాడు’ అని జో రాశాడు. ‘ఫెంగ్ రాసినవి ఒక్కొక్కసారి లయాత్మకంగా ఉంటాయి. కానీ అవి అంతర్గత లయను పట్టివ్వలేవు. వెయ్యేళ్లలో స్ట్రేబర్డ్స్తో సరిపోల్చదగ్గ కవిత్వం రాలేదు. మళ్లీ చదివి స్పందించినందుకు అనువాదకుడికి కృతజ్ఞతలు మాత్రం చెప్పక తప్పదు’ అన్నాడు. అయితే, ఫెంగ్‌టాంగ్ మాత్రం వీటికి చలించలేదు. ‘చైనా భాషను నేను చాలా బాగా వాడగలను. నాకా గట్టి నమ్మకముంది. నా అనువాదం సరైనదే. ఆ అనువాదం తనని తాను చెప్పనివ్వండి. దాని మంచి చెడులను కాలమే నిర్ణయిస్తుంది,’ అన్న ఆయన సమాధానం ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న కృష్ణశాస్త్రి మాటలను గుర్తుచేయట్లేదూ! రాఘవ శర్మ 9493226180 -
ఆకాశంలో ఎగురుతూ 425 ఏనుగులు..
(ఇలా అన్నారు) అది(ఏ భౌతిక విషయాన్నయినా సరే- అతి చిన్న వివరాలతో సహా చెప్పడం) జర్నలిజంలో ఒక కిటుకు. దాన్ని సాహిత్యానికి కూడా అన్వయించవచ్చు. ఉదాహరణకు మీరు ఆకాశంలో ఏనుగులు ఎగురుతున్నాయంటే మీ మాటల్ని ఎవరూ నమ్మరు. కానీ నాలుగువందల యిరవై అయిదు ఏనుగులు ఆకాశంలో ఎగురుతున్నాయంటే నమ్ముతారు. ఒన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నిండా యిలాంటి కల్పనలే వుంటాయి. ఆ ప్రక్రియ సరిగా మా అమ్మమ్మ వాడినదే. ప్రత్యేకించి ఒక పాత్ర. పసుపుపచ్చటి సీతాకోకచిలుకలు చుట్టుముట్టివుండే పాత్ర. నాకెప్పుడూ గుర్తుంటుంది. నేను బాగా చిన్నవాడిగా వున్నప్పుడు ఒక కరెంట్ పనివాడు మా యింటికి వస్తుండేవాడు. అతను ఒక బెల్టు సాయంతో కరెంట్ స్థంభానికి వేలబడి పనులు చేసేవాడు. అతను వచ్చిన ప్రతిసారీ మా అమ్మమ్మ అనేది యితను వచ్చి మన యింటిని సీతాకోకచిలుకలతో నింపి వెళతాడు అని. కానీ దీన్నే నేను రాసేటప్పుడు ఆ సీతాకోకచిలుకలు పసుపు రంగువి అని చెప్పకపోతే నేను చెప్పేదాన్ని ఎవరూ నమ్మివుండేవాళ్లు కాదు. గాబ్రియెల్ గార్సియా మార్క్యూజ్, అనువాదం, దక్షిణ తూర్పు పవనాలు (‘దక్షిణ తూర్పు పవనాలతో ముఖాముఖం’లోంచి; అనువాదం: అనామధేయుడు) -
పదాలు తెలియడం అనువాదం కాదు....
పండగ పలకరింపు ఆర్.శాంతసుందరి ప్రతిఫలం ఆశించని సాహిత్య సేవ చాలాకాలం నుంచి చేస్తున్నారు. తెలుగు సాహిత్యాన్ని తెలుగు నుంచి హిందీలోకి ప్రమాణాలు పాటిస్తూ అనువాదం చేస్తున్న అతి కొద్ది మంది అనువాదకుల్లో ఆమె ఒకరు. తెలుగులో ఒక మంచి కథ వచ్చినా కవిత వచ్చినా జీవిత చరిత్ర వచ్చినా అడిగి మరీ అనువాదం చేసి పెద్ద సంఖ్యలో ఉన్న హిందీ పాఠకులకు చేరవేస్తారు. అందుకు బదులుగా ఆమె పొందింది డబ్బు కాదు- అమూల్యమైన సంతృప్తి. హిందీ నుంచి తెలుగుకూ, తెలుగు నుంచి హిందీకి దాదాపు 60 పుస్తకాలు అనువాదం చేసిన శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం లభించడం కూడా ఆమె ఆశించని ప్రతిఫలమే. ప్రేమ్‌చంద్ జీవిత చరిత్ర ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’ను తెలుగులో అనువదించిన సందర్భంగా ఆమెతో సంభాషణ. సాహిత్య అకాడెమీ అవార్డు రావడం ఎలా అనిపిస్తోంది? బాగనిపిస్తోంది. నిజానికి నేను తెలుగు నుంచి హిందీకి ఎక్కువ అనువాదాలు చేశాను. కాని తెలుగు అనువాదానికి అవార్డు వచ్చింది. అయినా సంతోషమే. ప్రేమ్‌చంద్ నా అభిమాన రచయిత. ఇంతకు మునుపు ఎన్బిటి కోసం ప్రేమ్‌చంద్ బాలసాహిత్యం 13 కథలు అనువదించాను. దానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం లభించింది. ఇప్పుడు ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’ పుస్తకానికి. అది మంచి పాఠకాదరణ పొందిన పుస్తకం. సృజనాత్మక రచనలు చేసేవారికి వచ్చే గుర్తింపు కంటే అనువాద రచయితలకు వచ్చే గుర్తింపు తక్కువ. అయినా మీరు అనువాదాన్ని ఎందుకు ఎంచుకున్నారు? సృజనాత్మక రచనలు చెయ్యాలన్న ఆలోచన ముందు నుంచీ లేదు. మా ఇంట్లోనే ఒక గొప్ప రచయిత (కొడవటిగంటి కుటుంబరావు) ఉన్నాడు. అంతేగాక చిన్నప్పట్నుంచీ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో గొప్ప గొప్ప రచనలు చదివాక మనం రాసేదేమిటిలే అనిపించేది. అనువాదాలు చేసే ఆలోచన కూడా హరివంశ్రాయ్ బచ్చన్ సూచించే దాకా నాకు రాలేదు. ఇవాళ ఇంత అనువాద సాహిత్యం సృష్టించానంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తే కారణం. అలాగే నా భర్త (గణేశ్వరరావు) అందించిన తోడ్పాటు కూడా చాలా ఉంది. హిందీ నుంచి తెలుగులోకి మీరు అనువా దం చేసిన మొట్టమొదటి రచన? హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన మొదటి పుస్తకం హిందీ ఏకాంకికలు. 1980లో దాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారికోసం చేశాను. తెలుగు నుంచి హిందీలోకి అచ్చయిన నా మొదటి అనువాదం సి.ఎస్.రావుగారి కథ ‘ఉభయభ్రష్టుడు’. పుస్తకరూపంలో వచ్చిన మొదటి రచన వాసిరెడ్డి సీతాదేవి నవల ‘వైతరణి’. అనువాదం చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? అనువాదం పదకోశం కాదు. పదాల అర్థం తెలిస్తే సరిపోదు. వాటిని సందర్భోచితంగా వాడడం తెలియాలి. ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం కొంచెం కష్టమే. పేర్ల ఉచ్ఛారణ దగ్గర్నుంచి సరి చూసుకోవాలి. తెలుగు నుంచి హిందీ అనువాదాలు కొంచెం సులభం. సంస్కృతి పరంగా పెద్ద తేడా ఉండదు కనుక. ఏ భాష నుంచి అనువాదం చేసినా- చేసేటప్పుడు తెలుగులో ఆలోచించి చేస్తాను. హిందీతో పోల్చి చూసినప్పుడు తెలుగు సాహిత్యం ఏ స్థాయిలో ఉంది? చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా కవిత్వం, కథ చాలా దూరం అంటే దాదాపు 20 ఏళ్లు ముందున్నాయి. కాని దురదృష్టవశాత్తు మన సాహిత్యానికి ఎక్స్పోజర్ తక్కువ. మనల్ని మనం ప్రచారం చేసుకోము. కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రసిద్ధ రచయిత కుమార్తె మీరు. నాన్నగారన మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించేవారు? నిజం చెప్పాలంటే మా నాన్న ఇంట్లో తన గురించి గాని, తన రచనల గురించి గాని మాట్లాడినట్టు నాకు గుర్తు లేదు. ఎప్పుడూ ఇంకొకరి గొప్పదనాన్నే చెపుతూ ఉండేవారు. వాళ్లు రచయితలూ కావచ్చు. సంగీత విద్వాంసులు కావచ్చు లేదా తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అద్భుతాలు కావచ్చు. అసలు నా పెళ్లి అయ్యేదాకా ఆయన రాసిన చందమామ కథలు తప్ప ఇతర రచనలేవీ అంత సీరియస్‌గా చదవలేదు. నా భర్త ఆ మాట విని ఆశ్చర్యపోయి, తను సేకరించిన నాన్న కథలు చదవమని ఇచ్చారు. నేను అనువాదాలే తప్ప సొంత రచనలేవీ చేయకపోయినా మా నాన్న ప్రోత్సాహం పరోక్షంగా ఉండేది. హిందీ/ఉర్దూ కవుల్లో నాకు ఇష్టమైన వారి గురించి అడిగి తెలుసుకునేవారు. సాహిర్ లూధియాన్వీ అంటే నాకు విపరీతమైన ఇష్టమని చెప్పినప్పుడు వెంటనే సాహిర్ పాటలు రాసిన ‘తాజ్ మహల్’ సినిమా రికార్డు కొని తెచ్చి ఇచ్చారు. ఆ సంగతి నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. ఏ విషయాన్నీ పెద్దగా వివరించి చెప్పడం, ఇలా చెయ్యి అని ఆదేశించడం ఆయన స్వభావంలో లేవు. మౌనంగా ఉంటూనే ప్రోత్సహించడం తెలిసిన మనిషి ఆయన. పిల్లలకి 15 ఏళ్లు దాటాక వాళ్లకి మార్గదర్శనం చేయాలి తప్ప ఆజ్ఞాపించి బలవంతంగా ఏ పనీ చేయించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానే తప్ప ఆయన ప్రతిభ నీడలో నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. మీ నాన్నగారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, మీకు కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డు.. తండ్రీకూతుళ్లకి సాహిత్య అకాడెమీ అవార్డులు రావడం అరుదేనేమో! నాన్న ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోలేదు. నేనూ ఇలాంటివాటికి గర్వపడను. అనుకున్నది సాధించినా అనుకోకుండా ఇలాంటి పురస్కారాలు వచ్చినా సంతోషం, సంతృప్తి మాత్రమే ఉంటాయి. - డా.పురాణపండ వైజయంతి -
ఫ్రెంచిలోకి ‘అమరావతి కథలు’
యానాం : తెలుగు సాహిత్యంలో విశిష్టస్థానం పొందిన సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’లో ఎనిమిదింటిని ఫ్రెంచిలోకి అనువదిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రొఫెసర్ డానియల్ నెజర్స్ తెలిపారు. తెలుగు భాషపై మక్కువను పెంచుకొని 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న నెజర్స్ బుధవారం యానాం వచ్చారు. ప్రముఖకవి, కథకుడు దాట్ల దేవదానంరాజు ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగులో అధ్యయనం, పరిశోధన నిమిత్తం గతంలో 1984 నుంచి 89 వరకు పెద్దాపురంలో నివసించినట్టు తెలిపారు. ఆ సమయంలో సామాజిక, సాంస్కృతిక అంశాలను గమనించానని, పురాతన జానపద కళారూపమైన బుర్రకథలపై పరిశోధన చేసి ఫ్రాన్స్‌లో ఎంఫిల్ పొందానని చెప్పారు. అమరావతి కథలతో పాటు దేవదానంరాజు ‘యానాం కథలు’ సంపుటిలోని ‘దేశద్రోహి, అవును నిజం, పతాకసందేశం, మరో రెండు కథలను కూడా తెలుగులోకి తర్జుమా చేస్తున్నట్టు చెప్పారు. తెలుగులో అధ్యయనం, పరిశోధన చేయవలసి ఉందని, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవాల్సి ఉందన్నారు. తెలుగుకు సంబంధించి మరెంతో చేయాలన్న తపన ఉందన్నారు. ఆధునిక సాహిత్యంపై పరిశోధన చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటివరకు జానపద సాహిత్యం, వీరబర్బరీకుడు, అనుమాధవ విజయం, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితం, అల్లూరి సీతారామరాజు, కాలజ్ఞానం, జానపద బుర్రకథలు, హరికథలపై అధ్యయనం చేసిన నెజర్స్, వేమన పద్యాలు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు దేశభక్తి గీతాలు, ‘చింతామణి’ నాటకం వంటివి తెలుగు నుంచి ఫ్రెంచిలోకి అనువదించారు. ఆయన రూపొందించిన తెలుగు-ఫ్రెంచి నిఘంటువును తెలుగు అకాడమీ 2003-2004లో ప్రచురించింది. కాగా నెజర్స యానాంలోని ఫ్రెంచి వారి సమాధులను సందర్శించారు.