
సాక్షి, ముంబయి : మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కోపం వచ్చింది. తన ప్రసంగానికి మరాఠీ అనువాదం మిస్సయిందని ఆయన అటు శాసన మండలి చైర్మన్‌పై, శాసనసభ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చేష్టలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
అయితే, ఆ ప్రసంగానికి సంబంధించి మరాఠీ అనువాదం చేసేందుకు ఎవరు ప్రయత్నించనట్లు తాను గుర్తించానంటూ ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ ఆయన మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రామ్‌రాజేనాయక్ నిమ్‌బకార్‌కు, అసెంబ్లీ స్పీకర్ హరిభౌ బగదేకు లేఖ రాశారు. 'ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తున్న సమయంలో నా ప్రసంగాన్ని మరాఠీలోకి అనువాదం చేయలేదు. ఇలాంటిది సీరియస్‌గా తీసుకోవాలనది నా ఉద్దేశం. దీనికి కారణమైనవారిపై కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియజేయాలి' అని విద్యాసాగర్ రావు లేఖలో పేర్కొన్నారు.