ఆకాశంలో ఎగురుతూ 425 ఏనుగులు..
(ఇలా అన్నారు)
అది(ఏ భౌతిక విషయాన్నయినా సరే- అతి చిన్న వివరాలతో సహా చెప్పడం) జర్నలిజంలో ఒక కిటుకు. దాన్ని సాహిత్యానికి కూడా అన్వయించవచ్చు. ఉదాహరణకు మీరు ఆకాశంలో ఏనుగులు ఎగురుతున్నాయంటే మీ మాటల్ని ఎవరూ నమ్మరు. కానీ నాలుగువందల యిరవై అయిదు ఏనుగులు ఆకాశంలో ఎగురుతున్నాయంటే నమ్ముతారు. ఒన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నిండా యిలాంటి కల్పనలే వుంటాయి. ఆ ప్రక్రియ సరిగా మా అమ్మమ్మ వాడినదే.
ప్రత్యేకించి ఒక పాత్ర. పసుపుపచ్చటి సీతాకోకచిలుకలు చుట్టుముట్టివుండే పాత్ర. నాకెప్పుడూ గుర్తుంటుంది. నేను బాగా చిన్నవాడిగా వున్నప్పుడు ఒక కరెంట్ పనివాడు మా యింటికి వస్తుండేవాడు. అతను ఒక బెల్టు సాయంతో కరెంట్ స్థంభానికి వేలబడి పనులు చేసేవాడు. అతను వచ్చిన ప్రతిసారీ మా అమ్మమ్మ అనేది యితను వచ్చి మన యింటిని సీతాకోకచిలుకలతో నింపి వెళతాడు అని. కానీ దీన్నే నేను రాసేటప్పుడు ఆ సీతాకోకచిలుకలు పసుపు రంగువి అని చెప్పకపోతే నేను చెప్పేదాన్ని ఎవరూ నమ్మివుండేవాళ్లు కాదు.
గాబ్రియెల్ గార్సియా మార్క్యూజ్, అనువాదం, దక్షిణ తూర్పు పవనాలు
(‘దక్షిణ తూర్పు పవనాలతో ముఖాముఖం’లోంచి; అనువాదం: అనామధేయుడు)